July 5, 2024

రైలు ప్రయాణం

రచన: ప్రమీల సూర్యదేవర

“చేత వెన్నముద్ద, చెంగల్వపూదండ, బంగారు మొలత్రాడు, పట్టుదట్టి, సందెతాఎత్తులు, సరిమువ్వ గజ్జెలు చిన్ని కృష్ణా నిన్ను చేరికొలుతూ!” ప్రదీప్ ని తాతయ్య ఒళ్ళో కూర్చోబెట్టుకుని నాకు నేర్పిన మొట్టమొదటి పద్యం వాడికి చెప్తున్నారు. వాడికి అసలే నోరు తిరగదు. అందులో అలవాటులేని తెలుగు, అతికష్టంగా తన యాసలో తను పలుకుతున్న ప్రదీప్ కి, స్కూల్ టీచర్ గా పనిచేసి రిటైర్ అయిన తాతయ్య, వాడి యాస భరించ లేనట్లు ఎలాగైనా వాడితో యాసలేకుండా పలికించాలని పడుతున్న ప్రయాస చూసి నవ్వుకుంటూ, అమ్మమ్మ నరసమ్మతో పంపించిన కాఫీ త్రాగుతూ కూర్చున్నాను.
ఇంకొక రెండు రోజుల్లో వీళ్ళిద్దరినీ వదిలి వెళ్ళిపోవలనుకుంటే బాధ వేస్తుంది. ఎంతో ఆప్యాయతా, అనురాగం చూపించే అమ్మమ్మను, తాతయ్యను చూడకుండా ఇన్ని సంవత్సరాలు ఎలా ఉండగలిగానో! ఈ పద మూడు సంవత్సరాలలో వీరిలో ఎంత మార్పు వచ్చిందో! రైలుదిగి నాలుగు మైళ్ళు సునాయాసంగా నడిచి రాగలిగిన తాతయ్య, ఇంటి ఆవరణలో నడవటానికి కూడా ఆయాసపడుతున్నారు. పాతిక మందికి ఒక్కచేతి మీదుగా వంట చేయగలిగిన మా అమ్మమ్మ పార్వతమ్మ సాయం లేనిదే ఏమీ చేయలేక పోతున్నారు.
“నేను వెళ్ళి ఎప్పుడు తిరిగి వస్తానో! నేను మళ్ళీ వీరిద్దరినీ చూడగలనా?” అనే ఆలోచనతో నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. నేను అమెరికా తిరిగి వెళ్ళే వరకు వీరితో గడపాలనుకున్న నా పధకాన్ని, “నీకూ, సుధకూ, చాటల నోము తీర్చాలి. అమ్మమ్మను, తాతయ్యను తీసుకుని వచ్చేయ్” అని అమ్మ కబురు పంపించింది. ఉసూరుమంటూ సరేననక తప్పలేదు. చకచకా మారిపోతున్న కాలంతో తమకు సంబంధం లేనట్లు నిరాడంబరంగా, నిర్మలంగా, ఈ పల్లెటూళ్ళో కాలం గడిపేస్తున్నఈ ముసలి దంపతులు నాకు తెలిసిన పార్వతీ పరమేశ్వరులు.
“ఇదిగో అత్తా! నీకు, ప్రదీప్ కి టికెట్ రిజర్వ్ చేయించాను.” అన్నకొడుకు, గౌతమ్ టికెట్ నా చేతి కిచ్చాడు. నేను మొదటిసారి అమెరికా వెళ్ళేటప్పటికి వీడికి నాలుగేళ్ళు. “నేనూ వస్తా నీతో తీసుకెళ్ళ” మని గొడవ చేశాడు. నూనూగు మీసాలతో, మారుతున్న కంఠంతో, నేను విమానం దిగి బయటకు రాగానే, నాకోసం ఎదురు చూస్తున్న గౌతమ్ ని గుర్తుపట్టలేకపోయాను. ఒక్క గౌతమ్ నే ఏమిటి అప్పట్లో తప్పటడుగులు వేస్తున్న పిల్లలు; ఇప్పుడు ఆడపిల్లలు లంగా ఓణీలూ, మగపిల్లలు ప్యాంట్ షర్ట్ లూ వేసుకుని ఎదురువచ్చి తామెవరో చెప్పేవరకూ ఎవరినీ గుర్తుపట్టలేకపోయాను.
అలాగే ప్రతి ఊరిలోనూ వీధులన్నీ గుర్తుపట్టలేనంతగా మారి పోయాయి. ఎన్నో దుకాణాలు, సినిమా హాల్స్, ఆకాశాన్ని అంటే సౌధాలు విపరీతంగా పెరిగిపోయి మన దేశ ప్రగతి మనం ఎదురు చూసిన దానికంటే ఎక్కువగా ముందుకు సాగిపోతుందని అనిపించింది.
పల్లెటూళ్ళలో రైతులు, చాలావరకు వ్యవసాయం కౌలుకిచ్చేసికానీ, లేక వున్న నాలుగెకరాల పొలం
అమ్ముకుని కానీ పిల్లల చదువుల కోసమని పట్టణాలకు వలస వెళ్ళిపోయారు. చాలా వరకు ఆ ఇళ్ళన్నీ పాడుబడి
పోయాయి.
“మన ఊరినుంచి కూడా అమెరికా వెళ్ళిన వారు కనీసం ఇంటికొక్కరైనా ఉన్నారమ్మా” తాతయ్య, కొంత గర్వంగా, కొంత బాధగా అన్నారు.
నేను బయలుదేరే రోజు, అమ్మమ్మ నాకు బొట్టుపెట్టి, “చీరె కొనుక్కో తల్లీ,” అని నేను వద్దని వారిస్తున్నా నా చేతిలో పైకం పెట్టారు. ప్రదీప్ సంతోషంగా తాతయ్య ఇచ్చిన రూపాయలు లెక్క పెట్టుకుని వీటి విలువ డాలర్లలో ఎంత వుంటుందోనని చూసుకుంటున్నాడు.
“మీరు వెళ్ళేది ఎక్స్ ప్రెస్ రైలు, మన ఊళ్ళో రెండు నిముషాలకన్నా ఆగదు. మీరు త్వరగా ఎక్కేయాలి. ఈ రోజు నాకు సైన్స్ పరీక్ష ఉన్నది లేకపోతే నేనే వచ్చేవాడిని స్టేషన్ కి”నొచ్చుకుంటూ అన్నాడు గౌతమ్. ‘మన ఊళ్ళో ఎక్స్ ప్రెస్ రైలు కూడా ఆగుతుందా?” ఆశ్చర్యంగా అడిగాను. నేను అమెరికా వెళ్ళేముందు ఊళ్ళో రైలు స్టేషను కూడా లేదు.
“ఈ రైలు ఒక్కటే ఆగుతుంది. ఎక్కి కాసేపు కునుకు తీసేలోగా హైదరాబాద్ వెళ్ళిపోతావు. ఐదు గంట లంటే ఎంతసేపు ఇట్టే వెళ్ళిపోతావు,” గర్వంగా చెప్పాడు గౌతమ్.
“చాటల నోముకి మీ అమ్మ పదిమందినీ పిలవాలి కదా తల్లీ. అమ్మ ఒక్కతే చేసుకోలేదు.” అని నాలుగు రకాల పిండివంటలు చేయించి, అవి తాటాకు బుట్టల్లో పెట్టించి, ఆ నాలుగు బుట్టలూ ఒక అట్టపెట్టెలో పెట్టి, ఆ పెట్టెకు తాళ్ళు కట్టించి పకడ్బందీగా ప్యాక్ చేయించిన అట్టపెట్టె వైపు అనుమానంగా చూశాను. అది చూసి, “ మన దుర్గారావు వస్తాడమ్మా స్టేషన్ కి. నిన్ను సునాయాసంగా రైలు ఎక్కించగలడు, వాడికి ఇది అలవాటే !” తాతయ్య భరోసా ఇచ్చారు. దుర్గారావు తాతయ్యకు కుడిభుజంవంటివాడు.
అమ్మమ్మ, తాతయ్యల పాదాలకు నమస్కరించి, “మీరు కూడా నాతో రాకూడదా! అమ్మ సంతోషిస్తుంది” అన్నాను.
“తాతయ్య రాలేరు తల్లీ. ఆయన్ని వదిలి నేనెలా రాగలను?” అన్నది అమ్మమ్మ
ఆఘమేఘాలమీద ఉత్సాహంగా పరుగులు పెడ్తున్న జట్కా బండిలో కూర్చుని ప్రదీప్ రాకెట్ లో కూర్చు న్నంత సంతోషపడిపోతున్నాడు.
నేను చేసిన హడావుడివల్ల స్టేషన్ కి అరగంట ముందుగా వచ్చేశాము. స్టేషన్ లో జనం ఎక్కువగా లేరు. ఎవరో ఇద్దరు ముగ్గురు మాలాగే సామాన్లు దించుకుని వాటి ప్రక్కనే నిల్చుని ఉన్నారు. వీరు కాక దూర దూరంగా వున్న రెండు సిమెంట్ బెంచీల మీద నలుగురైదుగురు కూర్చుని ఉన్నారు. మేము వెళ్ళిన పదినిముషాల లోపే ఏదో ఒక ప్యాసింజర్ రైలు వచ్చింది. దానితో స్టేషన్ ఖాళీ అయిపోయింది. ‘పోనీలే! మా రైలు ఎక్కవలసినవారు ఎవరూ లేరు కాబట్టి మేము తేలిగ్గానే ఎక్కవచ్చు’ అనుకున్నాను.
“సిగ్నల్ ఇచ్చారమ్మా. బండి వచ్చేస్తుంది” స్టేషన్ లో పచార్లు కొడుతున్న దుర్గారావు వచ్చేశాడు. అమెరికాలో రైలు ఎక్కే అవకాసం రాని ప్రదీప్, రైలు ప్రయాణం అనుకున్నప్పట్నుండి ఉత్సాహంతో ఎదురు చూస్తున్నాడు.
స్టేషన్ లో ఎక్కువమంది ప్రయాణీకులు లేరు, “మనం ఎక్కటానికి అంతగా హడావుడి పడనక్కరలేదులే” అన్నాను.
“ఈ బండి టేషన్ లో అట్టా ఆగుద్ది, ఆట్టా బయలెల్లిపోతది” తలపాగా చుట్టుకుంటూ సూట్కేస్ నా చేతికిచ్చి, “మీరు ఇది పట్టుకోండమ్మ, నేను ఈ అట్టపెట్టె తలమీద పెట్టుకుంటా” నని స్టేషన్ లో తిరుగుతున్న మనిషి సాయం అడిగి అట్టపెట్టె తలపైకి ఎత్తుకున్నాడు.
దూరంనుండి రైలు పెద్దగా కూతవేస్తూ రావటం చూసి, ప్రదీప్ చెవులు గట్టిగా మూసుకుని, హుషారుగా గంతులేశాడు. నేను వాడి చేయి ఒకచేత్తో, సూట్ కేస్ మరోచేత్తో పట్టుకుని దుర్గారావు వెనుక నిల్చున్నాను. రైలు రావటం చూసి ఎక్కడ్నుంచి వచ్చారో భూమాత కన్నదేమో అన్నట్లు బిలబిల్లాడుతూ తట్టలు బుట్టలు తలలపై పెట్టుకుని జనం నెట్టుకుంటూ వచ్చేసారు. వాళ్ళందర్నీచూస్తూనే వీళ్ళందర్నీ నెట్టుకుని ఎక్కగలనా! అని నాకు ఆందోళన పెరిగి పోయింది.
“ఈ కూరగాయల వాళ్ళంతా ఖమ్మంలో దిగిపోతారమ్మా” అన్నాడు దుర్గారావు నాకు అభయమిస్తూ. నాకు రిజర్వేషన్ వున్నది కదా అని నేను కొంచెం నెమ్మదించాను.
రైలు ఆగగానే వాకిట్లో గుమిగూడి నెట్టుకుంటున్న జనాన్ని చూసి నా చేతిలో సూట్ కేస్ కూడా తీసుకుని నన్ను, ప్రదీప్ ని అతి ప్రయాసపడి రైలెక్కించాడు.
ఆ ఒత్తిడిలో నెట్టుకుని వస్తున్న జనం నుండి మా ఇద్దరినీ తప్పించుకుపోవటం తప్ప, దుర్గారావుని గురించి గానీ, అతని దగ్గరున్న సామాను గురించిగానీ, ఆలోచించలేదు. ప్రదీప్ చేయి పట్టుకుని నడుస్తున్న నేను, రైలు బయలుదేరిన తరువాతగాని మేము ఎక్కిన బోగీ కిచెన్ బోగీ అని గ్రహించలేకపోయాను. అంతవరకు నాకు మన రైళ్ళలో కిచెన్ బోగీ వుంటుందనే ఆలోచనే లేదు. ఘుమఘుమలాడుతున్న వాసనలనుండీ, ఆ బోగీలో పనులు చేస్తున్నవారు మా వైపు వింతగా చూస్తున్న చూపులనుండీ తప్పించుకుని, ప్రదీప్ చేయి పట్టుకుని క్రిక్కిరిసివున్న ప్రక్క బోగీలోకి వచ్చిపడ్డాము. కాని అది రిజర్వేషన్ బోగీకాదు. జనరల్ బోగీ. మొదటి బోగీలాగానే క్రిక్కిరిసి వున్న మరో రెండు బోగీలు దాటినా మా రిజర్వేషన్ బోగీని చేరుకోలేక పోయాము. ఉస్సురంటూ ఎక్కడైనా జాగా ఉన్నదేమోనని చూసుకుని, ముగ్గురు కూర్చోవలసిన ఒక సీట్లో కొంచెం బొద్దుగా వున్న ఒకావిడా, ఆవిడ భర్త అనుకుంటా, ఆయన కాళ్లు ముడుచుకుని పడుకుని ఉన్నాడు. ఎవరకూ మేము స్థలం ఇవ్వం అన్నట్లు ఆవిడ విశాలంగా కూర్చుని ఉండటం చూసి, నెమ్మదిగా వారి ప్రక్కన చేరాను. నేను తమవైపు రావటం చూసినావిడ ముందు చూపుగా కాళ్ళు రెండూ కొంచెం ఎడంగా పెట్టి సీట్లో ఎక్కువ భాగాన్ని ఆక్రమించేసుకున్నది. ప్రదీప్ ని కూర్చోబెట్టి, సీటు చివర్లో పడి పోకుండా ఉండటానికి కాళ్ళు గట్టిగా తన్నిపట్టి, ప్రదీప్ నడుం చుట్టూ చేయివేసి, వాడిని పట్టుకుని కూర్చున్నాను.
మాకు ఎదురుగా ఉన్న సీట్లలో కిటికీ ప్రక్కగా ఒక ముసలావిడా, ఆవిడ ప్రక్కన ఒక యువజంటా కూర్చు న్నారు. ఆ అబ్బాయి, ఆ అమ్మాయి ఒళ్ళో పడుకుని అప్పుడప్పుడు ఆ అమ్మాయి ముంగురులు సవరిస్తూ, తన చూపుడు వ్రేలితో ఆమె పెదవులపైనా, బుగ్గలపైనా వ్రాస్తూ, ఆపకుండా ఏవో కబుర్లు చెప్తున్నాడు. ఆ అమ్మాయి, ఆ అబ్బాయి జుట్టు సవరిస్తూ, అతను చెప్పే మాటలు శ్రద్దగా వింటూ, చిరునవ్వు నవ్వుతుంది. సింగిల్ సీట్లలో ఇద్దరు యువకులు వేరుశనగకాయలు తింటూ ప్రస్తుతం ఉన్న మన సినీహీరోల్లో మహేష్ గొప్ప నటుడా ?లేక వెంకటేష్ గొప్పనటుడా? అని వాదించుకుంటున్నారు.
“Mom! they are throwing the trash on the floor” వేరుశనగకాయల పొట్టు క్రింద పడేస్తున్న వాళ్ళను చూసి ప్రదీప్ నా చెవిలో చెప్పాడు.
“హుష్!” అన్నట్లు నా చూపుడువ్రేలు వాడి పెదవులపై పెట్టి చిరునవ్వునవ్వాను.
దుర్గారావు ఏమైపోయాడో! సామాన్లతో రైలు ఎక్కగలిగాడా? లేక స్టేషన్ లోనే దిగబడి పోయాడా? ఒకవేళ ఎక్కినట్లయితే అతనికి టికెట్ లేదు. అతను ఎక్కాడో లేదో కనుక్కోవటం ఎలా? నాకేం చేయాలో పాలుపోలేదు.
అతను ఇంటికి తిరిగి రాలేదు. ఏమైందోనని అమ్మమ్మ, తాతయ్యలు గాభరాపడి పోతారు.
నా ఆలోచనల్లో నేను మునిగి ఉండగా, “కళ్ళులేని కబోదిని బాబయ్యా,” అంటూ ఒక నడివయసు వ్యక్తి, పది పన్నెండు సంవత్సరాల పిల్ల భుజంపై చేయివేసి, భిక్షాటనం సాగిస్తూ వచ్చాడు. స్పంజ్ బాబ్ స్క్వేర్ ప్యాంట్స్ టీ షర్ట్ వేసుకున్న యువకుడు, ఒక స్టెయిన్ లెస్ స్టీల్ బకెట్, పేపర్ కప్స్ పట్టుకుని, “బట్రా మిల్క్, బట్రా మిల్క్” అని కేకలు వేస్తూ వచ్చాడు. మా సీట్లో కూర్చున్నాయన లేచి, మజ్జిగ కొనుక్కుని, తన చోటు ఎక్కడ పోతుందో నన్నట్లు గబగబా త్రాగి, మళ్ళీ పడుకున్నాడు.
ఆ తరువాత ఇద్దరు హిజ్రాలు బోగీలోకి ప్రవేసించారు. చౌకబారు నైలాన్ చీరెలూ, ఒంటికి అతుక్కుపోయేలా బిగుతుగా కుట్టించుకున్న జాకెట్లూ, మెడలో రోల్జ్ గోల్డ్ గొలుసులూ, మోటుగావున్న చేతులకు ప్లాస్తిక్ గాజులూ వేసుకుని, ముఖానికి తెల్లగా చౌకబారు పౌడర్ వేసుకుని, బొట్టుపెట్టుకుని, మగవారిని “బావ, బావ” అని సంభోదిస్తూ, డబ్బులివ్వమని ఒత్తిడి చేసి, ఇవ్వనివారి జేబుల్లో చేతులు పెట్టి చేతికందినవి తీసేసు కుంటున్నారు. సింగిల్ సీట్లలో కూర్చున్న ఒకతని జేబులో చేయిపెట్టగానే అతను సిగ్గుపడి జేబులో నుండి చేతికొచ్చిన రూపాయలు వారికిచ్చేశాడు కాని రెండవ అతను మాత్రం ఇవ్వనని భీష్మించుకోవటంతో ఇజ్రాలకు అతని దగ్గర బలవంతంగా లాక్కోక తప్పలేదు. మా ప్రక్కన కూర్చున్నావిడ, భర్తను రక్షించే ఉద్దేశ్యంతో, “ఆయనకు ఒంట్లో కులాసాగా లేదు,” అని కబుర్లు చెప్తుంది. కాని వాళ్ళు మాత్రం ఆయన ముందుకొచ్చి చేతులు చాపారు. “ఇవ్వకపోతే మీదపడి లాక్కుంటారే!” అని వాళ్ళావిడ చూస్తున్న చురచుర చూపులు పట్టించుకోకుండా ఆయన వాళ్ళ చేతిలో పైకం పెట్టాడు. బోగీలో వారంతా వికారంగా ముఖాలు పెట్టి వాళ్ళని చీడపురుగుల్లా చూడసాగారు. ఆ చూపులు తమకి అలవాటేనన్నట్లు వీరి చూపులను వాళ్ళు లెక్కచేయకుండా తమ పని తాము చేసుకుని వెళ్ళిపోతున్నారు.
వాళ్ళు కనుమరుగవ్వగానే బోగీలో వున్నవారి సంభాషణ హిజ్రాలవైపు మళ్ళింది. ప్రజలను పీడించే వీళ్ళను చూస్తూ వూరుకోకూడదనీ, ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకుని వీళ్ళను దేశం నుండి వెలివేయాలనీ ఇంకా ఏవేవో సలహాలు ప్రభుత్వానికి ఇస్తూ తమ అసమ్మతిని, అయిష్టను వ్యక్తం చేయ సాగారు.
ఇళ్ళలో ఏమైనా శుభకార్యాలు జరిగినప్పుడు, అకస్మాత్తుగావచ్చి, డబాయించి డబ్బులు లాక్కుపోవటం చిన్నతనంలో చూసి, ఇంతలోనే వీళ్ళు ఎక్కడ నుండి వచ్చారా అని ఆశ్చర్యంగా ఉండేది. వీళ్ళని ఎవరూ తమ దరిదాపుల్లోకి రానివ్వరు, పనుల్లోకి పిలవటం తమ పరువుకు నష్టమని భావిస్తారు. వీళ్ళకు కూడా మన అందరిలాగా ఆకలి ఉంటుంది. మనకు లాగా వీళ్శకు ఎన్నో అవసరాలు ఉంటాయి. వీళ్ళుకూడా మానవులే అనే గుర్తింపు ఇంత వరకూ ఎవరకూ కలగ లేదు. వాళ్ళ జీవనోపాధి ఏమిటని ఎవరూ ఆలోచించరు. వారి పరిస్తితి తలుచుకుంటే జాలి కలుగుతుంది.
టికెట్ కలెక్టర్ వచ్చాడు. అప్పటి వరకూ తన మేనమామ ఏదో రాజకీయ నాయకుడనీ, తన దగ్గరి బంధువులు ఎవరో పెద్ద వ్యాపారస్తులనీ, తనకు చదువు పూర్తవుతూనే ఉద్యోగం వెతుక్కునే పనిలేకుండా దొరికి పోతుందని ఆ యువకుడూ, తన తలిదండ్రులెంత ధనవంతులో, తామందరూ కలిసి ఏ ఏ ప్రదేశాలు చూశమోనని ఆ అమ్మాయీ, ఇలా ఏవేవో బడాయి కబుర్లు చెబుతున్న ఆ జంట ముఖాలు మాడిపోయాయి. టికెట్ కలెక్టర్ తమ దగ్గరకు రాగానే టికెట్ ఎక్కడోపెట్టి మరిచిపోయామన్నట్లు వెతుక్కుని, చివరకు తన జేబులో నుండి బయటకు తీశాడు. పాసింజర్ కి టికెట్ కొనుక్కుని ఎక్స్ ప్రెస్ రైల్లో ఎక్కి ప్రయాణం చేయటానికి వీల్లేదని వారిని వచ్చే స్టేషన్లో దిగిపోవలసిందని టికెట్ కలెక్టర్ గట్టిగా హెచ్చరించాడు.
ఫోన్ లో నా టికెట్ చూపించాను.
“ఇదేమిటమ్మా మొదటి తరగతి టికెట్ కొనుక్కుని ఇక్కడ కూర్చున్నారు?” ఆశ్చర్యంగా అడిగాడు. నా కథ నేను వినిపించి, “ఈ మధ్య రైళ్ళలో ప్రయాణం చేసి చాలా రోజులు కావటం వల్ల ఇటీవల జరిగిన మార్పులు తెలియవు,” అని, నా తెలివితక్కువతనానికి సిగ్గు పడుతూ చెప్పాను.
నేనామాట చెప్పగానే నా ప్రక్కన కూర్చున్నావిడ గబగబా తన సీట్లో ఒదిగి కూర్చుని, “ఇటు జరగండమ్మా బాబుని వెనక్కు అనించి కూర్చోబెట్టండి” అని మర్యాద చేసింది. అప్పటి వరకూ నన్ను పట్టించుకోని బోగీలో వారందరి చూపులు నా మీద గౌరవంతో నిలిచాయి.
స్టేషన్ లో బోగీల నంబర్ల డిస్ప్లే వుంటుందండి.” సింగిల్ సీట్లో కూర్చున్న వారిలో ఒకతను అన్నాడు.
నేను టికెట్ కలెక్టర్ తో దుర్గారావు సంగతి చెప్పి, అతనికి టికెట్ తీసుకున్నాను.
“ఖమ్మంలో రైలు ఐదు నిముషాలు ఆగుతుంది. మీరు మీ బోగీలోకి వెళ్ళాలనుకుంటే సాయంచేస్తాను” అన్నాడు టికెట్ కలెక్టర్, దుర్గారావు టికెట్ నా చేతికిస్తూ.
వచ్చేపోయే ప్రయాణీకులతోనూ, కాఫీలు, టీలు, వార్తా పత్రికలు, బఠానీలు, వేరుశనక్కాయలు మొదలైనవి అమ్ముకునేవారితోనూ ఈ బోగీలో ఉన్నంత సందడి, కాలక్షేపం మొదటి తరగతి బోగీలో వుండదనిపించి, “ప్రస్తుతం సౌకర్యంగానే కూర్చున్నాం కదా ఇక్కడే వుంటాలెండి” అని ఆయనకు కృతజ్ఞతలు చెప్పాను.
అమ్మమ్మ తాతయ్యలను వదిలి వస్తున్నాననే దిగులుని మరిపించింది జనరల్ బోగీలోని నా ప్రయాణం. కాని ఎన్నియుగాలైనా మారని హిజ్రాల పరిస్థినీ, వారు కూడా మానవులేనని ఆలోచించలేని మన సంకుచిత మనస్తత్వాన్ని తలుచుకుని బాధ కలిగింది.
ఇంతలో బోగీ చివర్నుండి ఒక ఆర్తనాదం వినిపించింది.
ఇంకేముందీ! ఆ హిజ్రాల గుంపు ఎవరినో ఏదో చేసేసి ఉంటారని అందరూ ఆతృతతో, ఉద్వేగంతో అటు కేసి చూసారు. ఒకావిడ కళ్ళు తేలవేసి తన చేతుల్లో వ్రేళ్ళాడిపోతున్న పిల్లవాడిని ఎత్తుకుని ఏడుస్తూ, తలుపు దగ్గర కొచ్చింది. హిజ్రాలలోని ఒక మనిషి గబగబా ఆ తల్లి చేతిలోనుండి పిల్లవాడిని ఎత్తుకుని, పైకి ఎగురవేస్తూ, బోగీలో ఆ చివరనుండి ఈ చివరకు తిరగసాగింది. ఆ వెనుకే ఆ పిల్లవాడి తల్లి కూడా ఏడుస్తూ తిరుగుతుంది. మరో రెండు, మూడు నిముషాలకు ఆ పిల్లవాడు భళ్ళున వాంతి చేసుకుని ఏడవసాగాడు. బోగీలో అందరూ వింత చూస్తుండగా హిజ్రాలలోని ఒక మనిషి చకచకా ఆ పిల్లవాడు వాంతి చేసుకున్న చోట తుడిచి శుబ్రం చేయసాగింది.
“ఏమైంది బాబుకు?” ఎవరో అడుగుతున్నారు.
“వాడికి చిన్నబిడ్డ నొప్పి వచ్చింది. పిల్లవాడి చుట్టూ మూగకండి, గాలాడనివ్వండి, అందరూ దూరంగా ఉండండి” అని అరుస్తున్నదామనిషి. పిల్లవాడి తల్లి, రెండు చేతులెత్తి ఆ యువతికి నమస్కరించి, ఏడుస్తున్న బాబుని తీసుకున్నది.
సెల్ ఫోన్ లోనుండి, “మారాలి మారాలి మనుషులు మారాలీ అందరి మనసులు మారాలీ” టి. ఎం. సౌందర్ రాజన్ గారి కంఠం ఖంగుమంటూ వినిపించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *