July 7, 2024

శ్రీ సూర్యనారాయణ ఆలయం – అరసవల్లి

రచన: సుధా రాజు

ఆరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం, శ్రీకాకుళం పట్టణం దగ్గర ఉన్న అరసవల్లి గ్రామంలో ఉన్నది. ఏడవ శతాబ్దంలో కళింగ రాజు దేవేంద్రవర్మ చేత నిర్మింపబడ్డ ఈ ఆలయం, మన దేశంలో ఉన్న అతి పురాతనమైన సూర్య భగవానుని ఆలయాలలో ఒకటి. అరసవల్లి శ్రీ సూర్య భగవానుడిని పూజించిన వారికి సుఖ సంతోషాలు కలుగుతాయి అని అందరికి నమ్మకం. అందుకే ఇదివరకు ఈ స్థలాన్ని హర్షవల్లి అనేవారు. కాలక్రమెణా అరసవల్లిగా మారిపొయింది.
స్థలపురాణం – పూర్వము ఒకానొకప్పుడు ఇంద్రుడు శ్రీ రుద్ర కోటీశ్వర స్వామి (శివుడు) ని కలవడానికి ప్రయత్నించగా నందీశ్వరుడు అతనిని ఆపాడు. స్వామి అమ్మతో ఉన్నారు, వీలుపడదు అని చెప్పగా అతని మాట లెక్క చేయకుండా ఇంద్రుడు లోపలికి వెళ్ళబోతే, నందీశ్వరుడు ఇంద్రుని అడ్డగించి కొడతాడు. స్పృహ తప్పిన ఇంద్రునికి కలలో, అతను స్పృహ తప్పి పడిన చోటున శ్రీ సూర్య భగవానునికి ఆలయం కట్టమని, అనంతరం అతని బాధలు తీరతాయి అని సందేశం వస్తుంది. స్పృహలోకి వచ్చి తన వజ్రాయుధంతో తవ్వగా, ఉష, ఛాయ, పద్మినీ సమేత శ్రీ సూర్య భగవానుని మూర్తి దొరుకుతుంది. అక్కడ సూర్యునికి ఆలయం నిర్మించబడింది. విగ్రహంలో సూర్యుడు ఏడు అశ్వాలు లాగుతున్న రథంపై ఉంటారు. రథసారధి అనురను కూడా మనం చూడవచ్చు. ఈ మూర్తి నల్లటి గ్రనైట్ రాయితో చేయబడినది.
ఈ ఆలయంలో పూజలు చేయించుకుంటే చర్మవ్యాదులు, చూపు సమస్యలు, పిల్లలు లేనివారు, వారి సమస్యల నుండి ఉపశమనం పొందుతారు అని నమ్మకం.
ఈ ఆలయం యొక్క విశిష్టత ఏమిటంటే, సంవత్సరానికి రెండు సార్లు ఉత్తరాయణం మరియు దక్షిణాయనం
సమయంలో ఆలయ ఐదు ద్వారాలు మూసి ఉన్నా, సూర్య భగవానుని పాదాలపై సూర్య కిరణాలు పడతాయి. అలాగే
రథసప్తమి నాడు కూడా సూర్య కిరణాలు స్వామి మూర్తి పై పడతాయి. రథసప్థమి నాడు ఈ దివ్య దృశ్యం చూడడానికి భక్తులు ఎదురుచూస్తూ ఉంటారు. ఆ రోజున ఆలయ ప్రాంగణంలో ఉన్నవారికి ఆ దివ్య మహిమ చూడడమే కాదు, ఆ దివ్య కిరణాల వల్ల శక్తి వస్తుంది అని నమ్ముతారు.
విశాఖపట్టణం నుండి 106 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే అరసవల్లి చేరుకోవచ్చు. మన దేశంలోని ఉన్న కొద్ది పురాతన సూర్య దేవాలయాలలో, ఇప్పటికీ నిత్య పూజ జరుగుతున్నది అరసవల్లిలోనే. అందుకు అటువైపు వెళ్తే తప్పకుండా దర్శించుకోవలసిన ఆలయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *