July 7, 2024

సుందరము సుమధురము ఈ గీతము

రచన: నండూరి సుందరీ నాగమణి

‘సంసారం – ఒక చదరంగం’ ఈ చిత్రంలోని శీర్షికాగీతాన్ని గురించి చర్చించుకోబోతున్నాము.

1987 లో తెలుగులో విడుదలైన ఈ చిత్రానికి మాతృక, 1986లో వచ్చిన తమిళంలో విసు దర్శకత్వం వహించిన, ‘సంసారం – అదు మిన్సారం’ అనే చిత్రం. తమిళంలో అఖండ విజయం సాధించటంతో, తెలుగులో కూడా ఈ చిత్రాన్ని నిర్మించాలని ఎవియం వారు అనుకుని, విసు పాత్రలో శ్రీ గొల్లపూడి మారుతీరావుగారిని పెట్టి, ‘సంసారం – ఒక చదరంగం’ పేరుతో విడుదల చేసారు.
కథ ప్రకారం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో పనిచేసి రిటైర్ అయిన అప్పలనరసయ్య అనే ఆయనకు (గొల్లపూడి మారుతీరావు) భార్య గోదావరి (అన్నపూర్ణ), నలుగురు పిల్లలు ఉంటారు. పెద్ద కొడుకు ప్రకాష్ (శరత్ బాబు) డబ్బు మనిషి. అతని వలన అతని లెక్కల వలన భార్య ఉమ (సుహాసిని) మాత్రమే కాకుండా ఇతర కుటుంబసభ్యులు కూడా బాధ పడుతూ ఉంటారు. కూతురు సరోజిని (కల్పన) తండ్రి తీసుకువచ్చిన సంబంధాన్ని కాదని, తాను ప్రేమించిన ఒక క్రిష్టియన్ అబ్బాయి పీటర్ (దిలీప్) ని వివాహం చేసుకుంటుంది. రెండవ కొడుకు గాంధీ (రాజేంద్రప్రసాద్) ఒక ఫ్యాక్టరీలో కార్మికుడుగా పనిచేస్తూ, వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా ఉంటాడు. అతనికి వసంతతో (ముచ్చర్ల అరుణ) వివాహం జరుగుతుంది. ఆఖరి కొడుకు కాళీ (మాస్టర్ హాజా షరీఫ్) టెంత్ క్లాస్ చదువుతూ ఉంటాడు. రెండు మూడు సార్లు ఫెయిల్ అయి, ఇంకా చదువుతూనే ఉంటాడు.
ఉమ పురిటికి వెళ్ళిన సమయంలో, ప్రకాష్ డబ్బు విషయంలో తండ్రితో గొడవపడి, ఇంటిని రెండు భాగాలుగా చేసేసి, ఒక భాగంలో తనుంటానని, ఇంటి ఖర్చుల్లో తనకి ఇక సంబంధం లేదని గట్టిగా చెప్పేస్తాడు. అతని తండ్రి అప్పలనరసయ్య కూడా తన ఇంటి సభ్యులను గీత దాటి పెద్దకొడుకు వాటావైపు వెళ్ళటానికి వీలు లేదని ఇంటివారిని ఆదేశిస్తాడు. పురిటినుంచి బాబును ఎత్తుకుని వచ్చిన ఉమ ఇల్లు అలా రెండు భాగాలుగా అయిపోవటం చూసి, ఆశ్చర్య పోతుంది. చాలా ఆవేదన చెందుతుంది. అత్తగారితో, తోడికోడలితో, మరుదులతో మాట్లాడాలని ప్రయత్నిస్తుంది. కానీ ప్రకాష్ ఆమెను గట్టిగా కేకలు వేసి, వాళ్ళతో మాట్లాడవద్దని అంటాడు.
ఒకరోజు బాబుకు పాలివ్వటానికి వీలుకాక, చాలా ఇబ్బంది పడుతున్న కోడలి అవస్థను గమనించిన గోదావరి తెగించి, గీత దాటి, కొడుకు ఇంటికి వెళ్ళి, కోడలి అవస్థను రూపుమాపుతుంది.
ఇక వసంతకు ఉమ్మడికుటుంబంలో భర్తతో తన సరదాలు ఏవీ తీరటంలేదు అన్న కినుక ఉంటుంది. అందుకని, భర్తతో తనను హనీమూన్ కి తీసుకువెళ్ళమని పోరు పెడుతుంది. గాంధీ తగినంత డబ్బు సమకూర్చుకుని ఆమెను హనీమూన్ కి తీసుకుని వెళ్ళి, హోటల్ లో రూమ్ తీసుకుంటాడు. అయితే, ఆ రాత్రే వసంతకు అమ్మవారు పోస్తుంది. దానితో నేలమీద తెల్లని దుప్పటి వేసి, వేప మండలు చుట్టూ పరచి, భార్యను పడుకోబెట్టి, ఆమెకు తగ్గేదాకా సేవలు చేస్తాడు అతను. చివరికి అమ్మవారు తగ్గాక, అతనే ఆమెకు స్నానం కూడా చేయిస్తాడు. సంసారం అంటే సరదాలు మాత్రమే కాదని, బాధ్యత కూడానని తెలుసుకున్న వసంత ఎంతో పశ్చాత్తాప పడుతుంది. ఇద్దరూ ఇంటికి తిరిగి వస్తారు.
అందరికన్నా చిన్నవాడు కాళీకి మీనా అనే హిందీ అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. తాను టెన్త్ పాసయ్యానని ఆమెతో చెప్పాలని వెళ్ళిన కాళీని ఆమె ఘోరంగా అవమానించి, తన తండ్రికి ఆ ఊరినుంచి ట్రాన్స్ఫర్ అయిందని, తిరిగి బొంబాయి వెళ్ళిపోతున్నామని చెబుతుంది. ఆమెతో స్నేహం పెంచుకోవాలనుకున్న కాళీ హతాశుడౌతాడు.
ఇప్పుడు చెప్పిన అన్ని సందర్భాలలోనూ ఈ టైటిల్ సాంగ్ మనకు తెరపై వస్తుంది. ఆయా సందర్భాలకు తగినట్లుగా శ్రీ వేటూరి సుందర రామమూర్తిగారు ఈ పాటను ఎంతో చక్కగా వ్రాసారు. అందమైన ఈ పాటకు స్వరచక్రవర్తి తన అందమైన బాణీని అందజేసారు.

ఇప్పుడు పాటలోని సాహిత్యం గురించి వివరించుకుందాము.

సంసారం ఒక చదరంగం
అనుబంధం ఒక రణరంగం
స్వార్థాల మత్తులో సాగేటి ఆటలో
ఆవేశాలు ఋణపాశాలు తెంచే వేళలో
సంసారం ఒక చదరంగం
అనుబంధం ఒక రణరంగం

చరణం:1
గుండెలే బండగా మారిపోయేటి స్వార్థం
తల్లిని తాళిని డబ్బుతో తూచు బేరం
రక్తమే నీరుగా తెల్లబోయేటి పంతం
కంటికి మంటికి ఏకధారైన శోకం
తలపై విధి గీత ఇల పైనే వెలసిందా
రాజులే బంటుగా మారు ఈ క్రీడలో
జీవులే పావులైపోవు ఈ కేళిలో
ధనమే తల్లి ధనమే తండ్రి
ధనమే దైవమా… ||సంసారం||

(పై పల్లవి, చరణం ప్రకాష్ గొడవ పెట్టుకుని, ఇంటిని రెండు భాగాలుగా చేసినప్పుడు నేపథ్యగానంగా వస్తుంది. ఈ సంసారం ఒక చదరంగం వంటిది, అనుబంధం ఒక రణరంగం అయింది. స్వార్థం అనే మత్తు తలకెక్కి ఆడే ఈ ఆటలో, ఆవేశాలు ఋణపాశాలను తెంచేసే వేళలో సంసారం ఒక చదరంగమే.

స్వార్థం ఎలాంటిది అయింది అంటే, గుండెలు బండగా మారిపోయాయి. తల్లిని, తాళిని (ఆలిని) డబ్బుతో తూచే సంకుచితత్వం ప్రకాష్ ది. ఒంట్లో ప్రవహించే రక్తం కాస్తా అతని కఠినమైన మాటలకు నీరుగా మారిపోయింది. తల్లి కంటికి, నేలతల్లికి శోకం ఏకధారయై కలుపుతోంది. తలమీద ఆ విధి వ్రాసిన గీతయే ఇంటిని రెండుగా చీల్చే గీతగా మారిపోయింది. ఈ చదరంగం ఆటలో రాజులు బంటులుగా, జీవులే పావులుగా మారతారు కదా… అందుకేనా, తల్లిదండ్రులను ధనంతో మాత్రమే విలువకట్టాడు ఆ కొడుకు!

చరణం: 2
కాలిలో ముల్లుకి కంట నీరెట్టు కన్ను
కంటిలో నలుసుని కంట కనిపెట్టు చెల్లి
రేఖలు గీతలు చూడదీ రక్తబంధం
ఏ పగా చాలదు ఆపగా ప్రేమపాశం
గడిలో ఇమిడేనా మది లోపలి మమకారం
పుణ్యమే పాపమై సాగు ఈ పోరులో
పాపకే పాలు కరువైన పట్టింపులో
ఏ దైవాలు కాదంటాయి ఎదలో ప్రేమని

సంసారం ఒక చదరంగం
అనుబంధం ఒక రణరంగం
ప్రాణాలు తీసినా పాశాలు తీరునా
అదుపు లేదు ఆజ్ఞ లేదు మమకారాలలో

(రెండవ చరణం, పల్లవి ఉమ బాబుకు పాలివ్వలేక బాధ పడిన సందర్భంలోనిది. కాలిలో ముల్లు గుచ్చుకుంటే కన్నెందుకు కన్నీరు పెడుతుంది? అలాగే, కంటిలో నలుసు పడితే, దాన్ని కన్నే కనిపెడుతుంది. ఈ రక్త సంబంధం ఉన్నదే, అది రేఖలను, గీతలను ఖాతరు చేయదు. ఎలాంటి పగయైనా ప్రేమపాశాన్ని ఆపలేదు. చదరంగపు గడిలో మదిలోపలి మమకారం ఇముడుతుందా? పాపాయికి పాలు కరువైనప్పుడు, కోడలు ఎంతో బాధ పడుతున్నప్పుడు ఆ అత్తగారు గీత దాటి, కొడుకు వాటాలోకి వెళ్ళి, సమస్య తీరుస్తుంది. మరి ఎదలోని ప్రేమని ఏ దైవాలు కాదంటాయి?
సంసారం ఒక చదరంగం, అనుబంధం ఒక రణరంగం. ప్రాణాలు తీస్తే మాత్రం పాశాలు తెగిపోతాయా? మమకారాలకు ఎవరి అదుపు ఆజ్ఞలూ ఉండవు.)

చరణం: 3

కౌగిలే కాపురం కాదులే పిచ్చి తల్లి
మల్లెల మంచమే మందిరం కాదు చెల్లి
తేనెతో దాహము తీర్చదేనాడు పెళ్లి
త్యాగమే ఊపిరై ఆడదయ్యేను తల్లి
కామానికి దాసోహం కారాదే సంసారం
కాచుకో భర్తనే కంటి పాపాయిగా
నేర్చుకో ప్రేమనే చంటి పాపాయిగా
మన్నించేది మనసిచ్చేది మగడే సోదరి

సంసారం ఒక చదరంగం
అనుబంధం ఒక గుణపాఠం
ప్రేమే సంసారము ప్రేమే వేదాంతము
వయసు కాదు వాంఛా కాదు మనసే జీవితం

(మూడవ చరణం గాంధీ, అతని భార్య హనీమూన్ కి వెళ్ళిన సందర్భం లోనిది. ఆమెకు అమ్మవారు పోయగా అతను సేవ చేస్తాడు.
‘కాపురం అంటే, కోరికలు, వాంఛలు కాదమ్మా పిచ్చితల్లీ, పెళ్ళి అనేది తేనెతో మాత్రమే దాహం తీర్చదు, నీ భర్తను కంటిపాపగా, చంటిపాపగా చూసుకోమ్మా, నీకు మనసిచ్చినా, తప్పు చేస్తే మన్నించినా మగడు మాత్రమే సుమా!
సంసారం ఒక చదరంగం, అనుబంధం, ఒక గుణపాఠం, ప్రేమే సంసారం, ప్రేమే వేదాంతం, వయసు, వాంఛ కాదమ్మా, మనసే జీవితం’ అని కవి గారు వసంత పాత్రకు చెబుతున్నారు.)

చరణం: 3
చుక్కలు జాబిలి చూసి నవ్వేది కావ్యం
నింగికే నిచ్చెన వేసుకుంటుంది బాల్యం
తారపై కోరిక తప్పురా చిట్టి నేస్తం
రెక్కలే రానిదే ఎగరనేలేదు భ్రమరం
వినరా ఓ సుమతి పోరాదు ఉన్న మతి
పాత పాఠాలనే దిద్దుకో ముందుగా
నేర్చుకో కొత్త పాఠాలనే ముద్దుగా
నిను పెంచేది గెలిపించేది చదువే నాయనా

సంసారం ఒక చదరంగం
చెరిగిందా నీ చిరు స్వప్నం
ఈ గాలి వానలో ఈ మేఘ మాలలో
ఉరిమే మబ్బు మెరిసే బొమ్మ చెరిపే వేళలో
సంసారం ఒక చదరంగం
చెరిగిందా నీ చిరుస్వప్నం

( కాళీ, మీనాల మధ్య సంభాషణ జరిగిన తరువాత ఈ చరణం వస్తుంది.
‘చుక్కలు, జాబిలీ చూసి నవ్వే కావ్యం, నింగికి సైతం నిచ్చెన వేస్తుంది, ఏమీ తెలియని బాల్యం. నీకు అందని తారతో స్నేహం చేయాలనుకోవటం తప్పురా చిట్టి నేస్తం, భ్రమరానికి రెక్కలు రానిదే ఎలా ఎగురగలదు? ముందుగా కళ్ళు తెరచుకుని, ఈ మంచి మాటలను విను. చక్కగా చదువుకో. నిన్ను ఎదిగేలా చేసేది, గెలిపించేది చదువే నాయనా… సంసారం, ఒక చదరంగం, నీ చిరుస్వప్నం చెదిరిందా? ఏం ఫరవాలేదు, భవిష్యత్తు మీద దృష్టి పెట్టు’ అంటున్నారు కవిగారు కాళీతో.)

సంసారం ఒక చదరంగం
చీకటిలో అది రవి కిరణం
ప్రళయాలు రేగినా తిమిరాలు మూగినా
మమతా జ్యోతి వెలిగించేది ఈ సంసారమే
సంసారం ఒక చదరంగం
చీకటిలో అది రవికిరణం
(ఈ పల్లవి చిత్ర పతాక సన్నివేశంలో వస్తుందని గుర్తు.)

మరి చక్కని ఈ గీతాన్ని ఈ క్రింది యూట్యూబ్ లింక్ లలో విని ఆనందించగలరు.

***

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *