May 19, 2024

ఆరాధ్య 7

రచన: అంగులూరి అంజనీదేవి

 

”నీ బాధ నాకు తెలుసు హేమంత్‌! కానీ బాధపడకు. ఎందుకంటే ఆయన మొదటి నుండి అదో టైప్‌ మనిషి! ఏది అనుకుంటే అదే చెయ్యాలనుకుంటాడు. అది అయ్యేంత వరకు వేరే పని ముట్టుకోడు. ఇప్పుడు ఆయన కాన్‌సన్‌ట్రేషన్‌ అంతా కోర్టు ఇచ్చే తీర్పు మీదనే వుంది. అందుకే నేను కూడా ఆయన్ని డిస్టర్బ్‌ చేయదలచుకోలేదు. నేనేం చెప్పినా ఆయన వినే పొజిషన్‌లో లేరు”

”నాన్నను నువ్వు మార్చుకోవచ్చు కదమ్మా!”

”ఆయన్ని మార్చుకోలేక నేనే ఆయనకు అనుకూలంగా మారాను”

”అయినా సొంత చెల్లెళ్లమీద కోర్టుకెళ్లటమేంటి! మరీ ఘోరంగా! వినటానికే బాగలేదు. ఏదైనా వుంటే మాట్లాడుకోవాలి కాని ఈ కోర్టులేంటి! కేసులేంటి! చూసేవాళ్లు, అత్తయ్యలు ఏమనుకుంటారు?”

”వాళ్లు చాలా మంచివాళ్లు హేమంత్‌! మీ తాతయ్యను కూడా మొదటినుండి వాళ్లే ఎక్కువగా చూసుకున్నారు. మీ నాన్న మీ తాతయ్యను మన ఇంటికి రానిచ్చేవాడు కాదు. నువ్వు చిన్నగా వున్నప్పుడు ఆయన నీ దగ్గర గడపాలని ఉత్సాహపడేవాడు. అది చూసి మీ నాన్న ఆయన్ని చాలా చులకన చేసి మాట్లాడేవాడు. ‘వాడినెందుకు కాకా పడతావ్‌! ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా? అది ఉద్యోగం చేస్తుందా? నీకు వండిపెడుతుందా?’ అంటూ ఆయన్ని వాళ్ల చెల్లెళ్ల దగ్గరే వుండమని పంపేవాడు. ‘అల్లుళ్లు ఏమనుకుంటారోరా!’ అని ఆయన వెళ్లకుంటే తీసికెళ్లి వదిలేసి వచ్చేవాడు. ఆయన ఆఖరిథలో వున్నప్పుడు మీ అత్తయ్యలు ఆయన్ని మన ఇంటికి తీసుకొచ్చి ‘నాన్న మాకు బరువు కాదన్నయ్యా! మా పిల్లలతోపాటు ఆయనను కూడా మాకో బిడ్డలాగే అనుకున్నాం. కానీ ఆయన నిన్నూ, వదినను కలవరిస్తున్నాడు. మీ దగ్గరే వుంటానంటున్నాడు. వుంచుకో’ అంటూ వుంచేసి వెళ్లారు.

కానీ మీ నాన్న మీ తాతయ్యను సరిగా తిండి తిననిచ్చేవాడు కాదు. ‘ఆయన్నలా తిండి తినకుండా చంపేకన్నా నెలకింతని ఆయన దగ్గర డబ్బులు తీసుకునైనా తిండి పెట్టండి! పెద్ద ప్రాణం తిండిలేకుంటే తట్టుకోలేదు’ అంటూ మీ నాన్నకు తెలియకుండా అన్నం తీసికెళ్లి మీ తాతయ్యకి పెట్టేదాన్ని… అది చూసి మీ నాన్న నన్ను కొట్టేవాడు. నన్ను కొట్టేది మీ తాతయ్య చూస్తే అన్నం ముట్టేవాడు కాదు. ‘కోడల్ని కొడితే పుట్టగతులుండవురా! అదేదో గొప్పతనం అనుకుంటున్నావ్‌!’ అంటూ అసహ్యించుకునేవాడు. అదిచూసి మీ నాన్న ఇంకా రెచ్చిపోయేవాడు. ‘ఇదంతా నీవల్లనే! నువ్వు పెట్టే దొంగతిండి తిని ఆ ముసలాడు ఇంకా ఎన్నేళ్లు బ్రతుకుతాడో ఏమో! నీకెన్నిసార్లు వద్దని చెప్పినా తలకెక్కదు. నేనాయన కొడుకుని… ఆయన డబ్బులయినా నావే! నా డబ్బులైనా నావే! ఆయన చేత అతిగా తినిపించి ఆయన జీవితకాలాన్ని పెంచకు. నువ్వలా చేస్తే నాకే బొక్క… నీకిది తెలిసి చేస్తున్నావో! తెలియక చేస్తున్నావో!’ అంటూ బయటకెళ్లి ఒకటి రెండు రోజులు ఇంటికొచ్చేవాడు కాదు. అది చూడలేక మీ తాతయ్య వాళ్ల కూతుళ్లను పిలిపించుకొని వాళ్ల దగ్గరకి వెళ్లిపోయాడు. వాళ్ల దగ్గరే చనిపోయాడు. మీ అత్తయ్యలు ఇద్దరు కూడా పెద్ద సంపన్నులు కాదు. ఒకామెకు భర్త చనిపోయాడు. రెండో ఆమె భర్త చిన్నచిన్న దొంగతనాలు చేస్తూ గొడవలు తెస్తుంటాడు. సగం మీ తాతయ్య వాళ్లుపడే బాధలు చూడలేకనే త్వరగా పోయాడు. కొంతయినా ఆసరాగా వుంటుందని ఆయన తన తండ్రి తనకు ఇచ్చిన ఆస్తిని వాళ్లకి రాసిచ్చాడు. అది మీ నాన్న ఓర్చుకోలేకపోతున్నాడు” అంది.

తన తండ్రి మరీ ఇంత దుర్మార్గుడనుకోలేదు హేమంత్‌. అందుకే నిశ్చేష్టుడై వింటున్నాడు.

అది గమనించిన శార్వాణి వెంటనే ఆ మూడ్‌లోంచి బయటకొచ్చింది.

”హేమంత్‌! నువ్వు రెడీ అవ్వు. వెళ్లి ఆరాధ్యను కలుద్దాం! వాత్సల్యకి ఫోన్‌ చెయ్యి. తను ఇంట్లో ఎప్పుడుంటుందో తెలుసుకో!” అంది.

”తొందరేముందమ్మా! వెళ్దాములే! నేను ఆఫీసుకెళ్లి వచ్చాక వెళ్దాం!” అన్నాడేకాని వాత్సల్యకి కాల్‌ చెయ్యలేదు.

”వద్దు ఇప్పుడే వెళ్దాం! నువ్వు ఆఫీసుకి సెలవుపెట్టు” అంటూ లక్ష్మీశార్వాణి వాత్సల్యకి కాల్‌ చేసింది.

వాత్సల్య ఆమె కాల్‌ని వెంటనే లిఫ్ట్‌ చేసి ”హలో! ఆంటీ! బావున్నారా?” అంటూ ఆపినా ఆగకుండా ఆరాధ్య గురించి మాట్లాడింది. ఆమె మాట్లాడేది ముందు నిజమా అన్నట్లు విన్నది లక్ష్మీశార్వాణి. ఆ తర్వాత కొద్దిక్షణాలు ఆశ్చర్యపోతూ అవాక్కయింది. వెంటనే హేమంత్‌కి చెప్పాలని అటుఇటు చూసింది.

హేమంత్‌ అక్కడ లేడు. శార్వాణి వాత్సల్యకి కాల్‌ చేస్తున్నప్పుడే వెళ్లిపోయాడు. అతని ఆలోచనలు వేరేగా వున్నాయి. మనసును చిల్లులు పొడుస్తున్నాయి. ఆరాధ్య హైదరాబాద్‌లో వుండి కూడా తనకి తెలియకుండా ఫ్రెండ్స్‌ దగ్గర వుండటమేంటి? ఆమె తల్లిదండ్రులు చేసిన పనులు నచ్చక తను కోప్పడిన మాట వాస్తవమే! కానీ వాళ్లు చేసిందేమిటి? పెళ్లిలో తనకి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఎంతో ఇచ్చామని తప్పుడు ప్రచారం చేశారు. అల్లుడి మర్యాదలు చెయ్యకుండానే ‘అతనొచ్చినప్పుడు నాన్‌స్టాప్‌గా చేసి పెట్టి పంపాము’ అని అన్నారట. ఇవన్నీ తెలిసి కూడా తను నోరెత్తలేదు. ఎప్పటి కప్పుడు తనలో కలిగే ఎమోషన్స్‌ని స్ప్రింగ్‌ని తొక్కిపట్టినట్లు పట్టేసుకుంటున్నాడు. తను ఏది చేసినా ఆరాధ్య కోసమే అనుకుంటున్నాడు కానీ ఆరాధ్య చేసిందేమిటి? తనకు తెలియకుండా అతి రహస్యంగా తనకి దూరంగా వుంది. ఆమెకే అంత పౌరుషం వున్నప్పుడు తనకెంత వుండాలి? తను లేకుండా ఆమె వుండగలిగినప్పుడు ఆమెను చూడకుండా, ఆమె లేకుండా తను వుండలేడా?

ఒకప్పుడు తను ఒంటరి. ఇప్పుడు తనకి తల్లీ, దండ్రీ బంధువులు వున్నారు. ఒక్క ఆరాధ్య లేకపోతేనేం? ఆమె ఒక్కదానికోసం ఇంత మానసిక సంఘర్షణ అవసరమా?

ఆమె ఇలా చేసిందని తెలిస్తే ఫ్రెండ్స్‌ వూరుకుంటారా? వినేలా కొన్ని, వినకుండా కొన్ని ఎన్నెన్ని కామెంట్స్‌ చేస్తారో! కాశిరెడ్డి ఒక్కరు తప్ప మిగతా అందరు పిజ్జాలతో పార్టీలు చేసుకుంటారు.

ముఖ్యంగా రాకేష్‌కి తెలిస్తే ఫేస్‌బుక్‌లో పెట్టేస్తాడు.

ప్రతి క్షణం ఎంతో ప్లానింగ్‌తో వుండే తన లైఫేంటి ఇంత దారుణంగా మారిపోయింది.

”నాన్నా! హేమంత్‌!” అని ప్రేమగా పిలిచింది లక్ష్మీశార్వాణి.

”అమ్మా! వస్తున్నా!” అని వెంటనే తల్లి దగ్గరకి వెళ్లాడు హేమంత్‌.

”మనం అర్జంట్‌గా ఆరాధ్యను చూడాలి” ఆత్రంగా అంది.

పేలవంగా నవ్వి ”తనలో ఏముందనమ్మా అంత ఆతృత పడుతున్నావ్‌.” అన్నాడు.

”ముందు నువ్వు బయలుదేరరా! క్వొశ్చన్స్‌ తర్వాత వేద్దువుగాని…” అంటూ ఆమె రెడీ అయింది.

”ఏముందమ్మా! బయలుదేరటానికి?” అని అయిష్టంగా అన్నాడు.

”ఉండాల్సిందే వుందిరా! ముందు నువ్వు కదులు” తొందర చేసింది.

”ఉండాల్సింది వాళ్లు వుంచుకోరమ్మా! వాళ్లు చెప్పిందే మనం వినాలి. అన్నీ అబద్దాలే చెబుతారు. మనం చెప్పింది వాళ్లు వినరు. మనమేం మాట్లాడినా అబద్దాలంటారు. ఆరాధ్య కూడా వాళ్ల మమ్మీతో ఫోన్లో మాట్లాడనంత వరకే బాగుంటుంది. మాట్లాడిందంటే మారిపోతుంది. పెద్దపెద్ద కళ్లేసుకొని మౌనంగా చూస్తూ మాటలతో నన్ను రెచ్చగొడుతుంది. నేను పిచ్చివాడిలా కేకలేస్తుంటే పక్కకి తిరిగి నవ్వుకుంటుంది. నన్ను కన్‌ఫ్యూజన్‌లో పడేసి వాళ్ల పనులు వాళ్లు నీట్‌గా చేసుకుంటుంటారు. వాళ్లవల్ల నేను బాగా డిస్టర్బ్‌ అయ్యాను. నష్టపోయాను. ఇది ఎంత చెప్పినా ఆరాధ్యకు అర్థం కాదు. నాకు రోజురోజుకి దేన్ని సీరియస్‌గా తీసుకోవాలో దేన్ని తీసుకోకూడదో తెలియటం లేదు” అన్నాడు.

”చిన్నవాడివిరా! అన్నీ ఇప్పుడే నీకు ఎలా తెలుస్తాయి? జీవితం లోలోతుల్లోకి ఇప్పుడేగా వెళ్తున్నావ్‌!”

”ఇలాంటి లోతులు నాకొద్దు అమ్మా! గోతులు తీసే మనస్తత్వాల మధ్యన వుంటూ వీళ్లు నావాళ్లు అన్న భ్రమలో నేను బ్రతకలేను. ఇన్నిరోజులు నా ఫ్రెండ్స్‌ంతా నన్ను చాలా నైస్‌ పర్సన్‌ అనుకునేవాళ్లు. స్ట్రెయిట్‌గా మాట్లాడతాననుకునేవాళ్లు. అదంతా పోయింది.  ఇప్పుడు నేను కూడా మా అత్తగారి ఫ్యామిలీలాగే డొంకతిరుగుళ్లు మాటలు నేర్చుకోవలసి వస్తోంది” అన్నాడు.

ఆమె నవ్వుతూ హ్యాండ్‌బ్యాగ్‌ తగిలించుకొని ”జీవితం అద్దాల మేడ హేమంత్‌! చిన్నచిన్న స్పర్ధలు, అసంతృప్తులు రాళ్లలా మారితే వాటి ధాటికి ఎంత గట్టి అద్దాల మేడ అయినా పగిలిపోతుంది. ఏ రోజుకారోజు జీవితాన్ని కొత్తగా ప్రారంభిస్తున్నట్లు అనుకోవాలి. కొత్త సంగతులు తెలుసుకుంటుండాలి. మనసుకి నొప్పి కలిగించే వాటిని మరచిపోవాలి. రారా! వెళ్దాం!” అంటూ మరో మాటకి అవకాశం ఇవ్వకుండా ఇంట్లోంచి బయటకి నడిచింది.

ఇక తప్పదన్నట్లు తల్లితో కదిలాడు హేమంత్‌.

**********

శార్వాణి, హేమంత్‌ వస్తున్నారని తెలిసి, ఆఫీసుకి కాల్‌ చేసి ఒన్నవర్‌ లేటుగా వస్తానని పర్మిషన్‌ తీసుకుంది వాత్సల్య. ఆమెకు హేమంత్‌ శార్వాణి ఆంటీ కొడుకని తెలిసినప్పటి నుండి మరింత అభిమానం పెరిగింది.

వాత్సల్యను చూడగానే చేతులు చాపి దగ్గరకి తీసుకుంది శార్వాణి ”ఏదీ నా కోడలు? పిలువు” అంది.

వాత్సల్య శార్వాణి చేతుల్లోంచి విడివడి ”మీరు కూర్చోండి! ఆంటీ! హేం! కూర్చో!” అంది.

వాళ్లు కూర్చున్నారు. శార్వాణి కళ్లతోనే చుట్టూ వెతికింది కోడలి కోసం… హేమంత్‌ మామూలుగానే కూర్చున్నాడు. ఫార్మల్‌ డ్రస్‌లో అతను చాలా హుందాగా, గంభీరంగా కన్పిస్తున్నాడు.

”ఆరాధ్య ఇంకా ఇంటికి రాలేదాంటీ! మీరు కాల్‌ చేసినప్పుడే తను నాకు కాల్‌ చేసి ఇప్పుడే హాస్పిటల్‌ లోంచి బయటకొస్తున్నామని చెప్పింది. సరయు కూడా ఆరాధ్య వెంట వెళ్లింది. నో ప్రాబ్లమ్‌!” అంది.

శార్వాణి ఆరాధ్య గురించి ఆసక్తిగా అడుగుతుంటే వాత్సల్య చాలా కుతూహలంగా సమాధానాలు చెబుతోంది.

హేమంత్‌కి అక్కడ కూర్చోవాలనిపించటం లేదు. మూడీగా వున్నాడు. అది అతని ముఖంలో స్పష్టంగా కనబడుతోంది. అతనెందుకలా వున్నాడో వాత్సల్యకు తెలుసు. అందుకే అతన్ని కదిలియ్యాలంటేనే భయపడింది. అప్పటికి రాత్రి కాల్‌ చేసి చెప్పింది ”సారీ హేం! నేను నీకు ఆరాధ్య గురించి ఇన్ఫర్మేషన్‌ ఇవ్వకపోవడం తప్పే! ఆరాధ్యకి హెల్ప్‌ చేస్తున్నానుకున్నానే కానీ నిన్ను బాధ పెడతాననుకోలేదు” అని… అతనేం మాట్లాడలేదు. మౌనంగా వున్నాడు. అతను మౌనంగా వుండటమే వాత్సల్యను ఎక్కువగా బాధపెట్టింది. ఆరాధ్యకన్నా ముందే హేమంత్‌ తనకి ఫ్రెండ్‌! కానీ తనేం చేసింది? ఆరాధ్య తన దగ్గర వున్న విషయం దాచింది. అందుకే అతనివైపు ఫ్రీగా చూడలేకపోతోంది.

హేమంత్‌ లేచి నిలబడి ”అమ్మా! నువ్వు కూర్చో! నేను ఆఫీసుకెళ్తాను. బయలుదేరే ముందు కాల్‌ చెయ్యి. నేను వచ్చి తీసికెళ్తాను” అన్నాడు.

ఆమె ఒప్పుకోలేదు. ”నువ్వు కూర్చో హేమంత్‌! ఆరాధ్యను రానీ!” అంది. ఆమె గొంతులో మమకారంతో కూడిన అధికారం.

హేమంత్‌ తల్లిని నొప్పించలేకపోతున్నాడు. అలా అని అక్కడ కూర్చోలేకపోతున్నాడు.

అప్పుడే లోపలికి వచ్చారు ఆరాధ్య, సరయు.

ఆరాధ్య కన్పించగానే ఓ అద్భుతాన్ని చూసినట్లు కళ్లు పెద్దవి చేసి చూసింది శార్వాణి. ఆమె ముఖం సంతోషంతో వెలిగింది.

వెంటనే లేచి అందరు చూస్తూండగానే ఆరాధ్యకు దగ్గరగా వెళ్లింది శార్వాణి. ప్రేమగా ఆమె పొట్టమీద చేయిపెట్టి తడిమింది. ”బాగున్నావా ఆరాధ్యా!” అంటూ అభిమానంగా అడిగింది. ఆమెకు ఆరాధ్య కొత్త కాకపోయినా తమ వంశవృక్షం ఆరాధ్య కడుపులో పెరుగుతున్నందుకు కొత్తగా వుంది.

శార్వాణి తనకి స్వయానా అత్తగారని ఒక గంట క్రితమే వాత్యల్య ద్వారా తెలిసింది ఆరాధ్యకి… అప్పుడేమీ అన్పించలేదు. కారణం హేమంత్‌తోనే తనకి అటాచ్‌మెంట్‌ లేనప్పుడు ఆవిడతో తనకేం పని అనుకుంది. కానీ తన జీవితంంలో శార్వాణి అంత ప్రేమగా తనని ఎవరూ తడమలేదు. ఆమె చూపులోనే ప్రేమ వుంది. చేష్టలో ప్రేమ వుంది. స్పర్శలో ప్రేమ వుంది. ఎందుకిదంతా? అత్తగారు కావడం వల్లనేనా? అత్తగారిలో కూడా ఇంత ప్రేమ వుంటుందా?

హేమంత్‌ అక్కడే వున్నా ప్రత్యేకించి హేమంత్‌ వైపు చూడలేదు ఆరాధ్య. అది చాలా అవమాన మనిపించింది హేమంత్‌కి…

ఆరాధ్యను తనవైపుకు తిప్పుకుంటూ ”ఏంటమ్మా! ఆరాధ్యా! ఆలోచిస్తున్నావ్‌?” అని అడిగింది శార్వాణి.

”ఏం లేదాంటీ! అంకుల్‌ బాగున్నారా?”

”బాగున్నారు. డాక్టర్‌ నీకు మందులేమైనా రాసిచ్చారా?”

ఆరాధ్య దానికి సమాధానంగా ”ఇంకా డాక్టర్‌ దగ్గరకి వెళ్లలేదాంటీ! రిపోర్ట్స్‌లో పాజిటివ్‌ అనే వచ్చింది” అంది.

అటు ఆరాధ్యను, ఇటు తల్లిని విస్తుపోయి చూస్తున్నాడు హేమంత్‌. ఆరాధ్యకి ఏమైందో! డాక్టర్‌ దగ్గరకి వెళ్లాల్సినంత హెల్త్‌ ప్రాబ్లమ్‌ ఏమొచ్చిందో అతనికి అర్థం కాలేదు. వెంటనే అడగాలంటే ఈగో అడ్డొస్తోంది.

సరయు అక్కడే నిలబడి చూసీ చూడనట్లే ఆరాధ్యను, హేమంత్‌ని గమనిస్తోంది. ఆరాధ్యపట్ల శార్వాణి చూపిస్తున్న ప్రేమను చూస్తుంటే అసూయగా వుంది సరయుకి… ఇలాంటి ప్రేమ కావాలి తనకి… అది ఎక్కడ దొరుకుతుంది? ఎవరి దగ్గర దొరుకుతుంది? తనకి దొరికినవాళ్లు ఇలా ఎందుకు లేరు? తనకి లేనిది ఇంకొకరికి వుండటం చూస్తుంటే ఎంతో బాధగా వుంది సరయుకి…

శార్వాణి ఆరాధ్యను తన పక్కన కూర్చోబెట్టుకుంది. ”ఆరాధ్యా! ఇప్పుడు నువ్వు నా కోడలివి. అందుకే క్షమించమని అడగలేకపోతున్నాను”

”ఎందుకాంటీ క్షమించడం?” అంటూ అర్థం కానట్లు చూసింది ఆరాధ్య.

”ఆరోజు నిన్ను ఇంట్లోంచి బయటికి పంపటం నేను నిన్ను మిస్‌ అండర్‌స్టాండ్‌ చేసుకోవడం వల్లనే అని హేమంత్‌ని చూశాక తెలిసింది”

”అవన్నీ ఇప్పుడు అవసరమా ఆంటీ?”

”కొన్ని సంఘటనలు ఎలాంటి వారినైనా అయోమయంలో పడేస్తాయి. అర్థం చేసుకోలేని స్థితిలోకి నెట్టేస్తాయి”

”మీరు ఫీలవ్వకండి ఆంటీ! ఇంతటితో ఆ విషయాన్ని మరచిపోండి! మీ స్థానంలో నేనున్నా అలాగే చేసేదాన్ని” అంది ఆరాధ్య.

శార్వాణి మనసు అప్పుడుకాస్త కుదుటపడింది.

తేలిగ్గా వూపిరి పీల్చుకుంది.

వాత్సల్య సరయును వంటగదిలోకి లాకెళ్లి ”వాళ్లను మాట్లాడుకోనీయ్‌! మనమెందుకక్కడ?” అంది.

సరయుకి శార్వాణి ఆరాధ్యను క్షమించమని ఎందుకు అడిగిందో అర్థంకాక వాత్సల్యను అడిగి తెలుసుకుంది. ”రోజూ నేను ఆరాధ్య పక్కనే కదా పడుకునేది. ఇలాంటివి చెప్పకుండా దాచటం దేనికి… చెప్పొచ్చు కదా! ఎంతయినా ఆరాధ్య సీక్రెట్‌ మెయింటెయిన్‌ చేస్తుంది తెలుసా?” అంది సరయు.

”దాని బొందలే! అదిక్కడ సీక్రెట్‌గా వుండి నన్ను హేమంత్‌ దగ్గర బాడ్‌ చేసిపెట్టింది”

ఆ మాటలు సరయుకి నచ్చక ”ఇప్పుడు నువ్వు కలిపిన ఈ కాఫీని నువ్వు పట్టుకెళ్లి ఇస్తావా? నేను ఇవ్వనా?”

”నువ్వే ఇవ్వు”

”మరి నువ్వు నావెంటే వచ్చి నన్ను వాళ్లకు పరిచయం చెయ్యి. కానీ సరయు ఇలా సరయు అలా అని నా బయోడేటా మాత్రం చెప్పకు”

”ఓ.కె.” అంటూ ఇద్దరు కలిసి కాఫీ కప్పులతో హాల్లోకి వెళ్లారు.

హేమంత్‌కి ‘హాయ్‌’ చెబుతూ శార్వాణికి ‘నమస్తే!’ చెబుతూ కాఫీ ఇచ్చింది సరయు. వాత్సల్య సరయును వాళ్లకు పరిచయం చేసింది.

ఒక పని అయిపోయినట్లు వాళ్లిద్దరు లోపలకెళ్లి లాప్‌టాప్‌లు ముందు పెట్టుకొని ఆఫీసు వర్క్‌ చేసుకుంటూ కూర్చున్నారు. హేమంత్‌ కాఫీ తాగుతున్నాడన్నమాటే కానీ అబ్జర్‌వేషన్‌లో వుంచిన హేమంత్‌ని డాక్టర్‌ చూసినట్లు ఆరాధ్యనే చూస్తున్నాడు. ఆమె అతనివైపు చూడకపోవడం అతనిని నిర్లక్ష్యం చేస్తున్నట్లుగా వుంది.

ఆరాధ్య కాఫీ తాగకుండా ఎటో చూస్తూ ఆలోచిస్తోంది.

శార్వాణి కాఫీ తాగడం పూర్తయ్యాక ఖాళీ కప్పును టీపాయ్‌ మీద పెట్టి ఆరాధ్యవైపు చూస్తూ ”మీ ఇద్దరు ప్రేమించుకున్నారు. ఆ టైంలో మీకెలాంటి మాట తేడాలు రాలేదు. ఇప్పుడొచ్చాయి. ఎందుకొచ్చాయో ఆలోచించారా? సరే! వచ్చాయి. అవన్నీ పెళ్లి వల్లనే కదా వచ్చింది? వేరే వాళ్ల ఇన్‌వాల్వుమెంట్‌ వల్లనే కదా వచ్చింది! అలా వచ్చిన వాటిని వెంటనే వదిలెయ్యాలికాని మీరు ఒకరిని ఒకరు వదిలేసుకోవడమేంటి? ఇలా వదిలి వుండటానికైతే అంతంత ఖర్చుపెట్టుకొని పెళ్లి కాని, రిసెప్షన్‌ కాని చేసుకొని వుండాల్సింది కాదు” అంది.

”ముందుగా ఏదీ తెలియదు కదాంటీ!” అంది ఆరాధ్య.

”చూడమ్మా! ఏది తెలిసినా ఏది తెలియకపోయినా హేమంత్‌ నీ భర్త. పెళ్లికి ముందు వున్నట్లు ఇప్పుడు కూడా ఎక్కడ షెల్టర్‌ దొరికితే అక్కడ వుండకూడదు. పెళ్లయ్యాక ఏ అమ్మాయి అయినా భర్త దగ్గర వుండటమే మంచి పద్ధతి. రోజులు మారినా పద్ధతులు మారకూడదు. పద్ధతులు మారితే మనిషి ఆలోచనలు గాడితప్పి పోతుంటాయి. గాడితప్పిన ఆలోచనలతో గడిపే జీవితం అదుపులో వుండదు. అదుపులో లేకపోతే ఏదీ మనది కాకుండా పోతుంది. మనది కాని జీవితాన్ని ఎన్ని రోజులు జీవిస్తాం? సమస్యలంటావా? ఎవరి జీవితంలోనైనా వుండేవే! వాటిని ముళ్లున్న సదవకాశాలుగా అనుకోవాలి. నాకు తెలిసి నువ్వు హేమంత్‌ దగ్గర వుంటేనే నీకు కంఫర్ట్‌గా వుంటుంది” అంది.

దానికి సమాధానంగా ఆరాధ్య ఏం మాట్లాడుతుందోనని హేమంత్‌… హేమంత్‌ ఏం మాట్లాడతాడోనని ఆరాధ్య సూటిగా ఒకరిని ఒకరు చూసుకున్నారు. చూపులే కాని మాటలు లేవు.

”మీ ఇద్దరు మాట్లాడుకోవాలి. కోపతాపాలు, లాభనష్టాల గురించి కాదు. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి…” అంది శార్వాణి.

అప్పుడు షాక్‌ తిన్నాడు హేమంత్‌. బిడ్డేంటి? ఆరాధ్య ఇప్పుడు గర్భవతా? మరి తనకి ఎవరూ చెప్పరేం? తనకి ముందుగా చెప్పుకొని సంతోషించాలని ఆరాధ్యకి లేదా? ఇది మరీ దారుణంగా అన్పించింది హేమంత్‌కి. తనేం చేశాడని తనని ఇంతగా నిర్లక్ష్యం చేస్తోంది. ముఖం చూడు ఎలా తిప్పుకొని కూర్చుందో! తల్లి మీద గౌరవంతో ఆగుతున్నాడు కాని తనకొచ్చే కోపానికి కొడితే ఆ ముఖం పగిలిపోయేది. ఉక్రోషంగా చూస్తున్నాడు హేమంత్‌.

”నాకు టైమివ్వండి ఆంటీ! నేను ఆలోచించుకోవాలి.” అంది ఆరాధ్య.

ఏమాత్రం ఆలోచించకుండా లేచి నిలబడ్డాడు హేమంత్‌.

”అమ్మా! నేను అర్జంట్‌గా ఫ్రెండ్‌ను కలవాలి. రా! వెళ్దాం!” అన్నాడు.

కొడుకును ఎగాదిగా చూసి ఆమె కూడా లేచి నిలబడి ”తర్వాత కలుద్దాం ఆరాధ్యా! నువ్వు ఆలోచించుకో!” అంటూ శార్వాణి కొడుకుతో బయటికి నడిచింది.

”నువ్వు ఆరాధ్యతో మాట్లాడవలసిందిరా!” ఇంటికి రాగానే అంది శార్వాణి.

”దానికంత అర్హత లేదమ్మా! ఇదే సిటీలో వుంటూ జాబ్‌కెళ్తూ నాకు కనబడకుండా తిరుగుతున్నప్పుడే పోగొట్టుకుంది. ఆ హెయిర్‌ స్టైల్‌చూడు ఎంత మారిపోయిందో! పెళ్లయింది కదా! నుదుటన కొంచెమైనా కుంకుమ పెట్టుకోకుండా ఓ స్టిక్కర్‌ అంటించుకొని ఎలా వుందో చూశావుగా! అంత అవసరమా? అసలా తాపత్రయం ఏంటి? ఎందుకు? ఎవరు వెంటబడాలని…?”

”అలా అనకు హేమంత్‌! నువ్వు మాట్లాడితే మారేదేమో!”

”మారేది అయితే తను ప్రెగ్నెంట్‌నన్న విషయం అందరికన్నా ముందు నాకే చెప్పేది. గంటలు, గంటలు ఫోన్లు చేసి వాళ్ల మమ్మీతో మాట్లాడుతుంది కదా! నాకొక్క కాల్‌ చెయ్యలేదా? నేనంత పరాయివాడినయ్యానా?” అన్నాడు.

కొడుకు పడుతున్న మానసిక సంఘర్షణలో న్యాయం వుందనిపించింది.

ఎక్కడైనా కన్నతల్లి తన కూతురు కట్టుకున్న మొగుడుతో సుఖంగా కాపురం చెయ్యాలని కోరుకుంటుంది కాని అంతంత సేపు ఫోన్లో మాట్లాడుతుందా? అదికూడా ‘బాగున్నారా? తిన్నారా? అల్లుడు బాగున్నాడా?’ అని అడగకుండా వేరే మాటలతో పనేమిటి? నాకు ఆరాధ్యను మార్చుకోటానికి రెండు రోజులు పడితే వాళ్ల మమ్మీకి గంట చాలు ఆరాధ్యను నాకు వ్యతిరేకంగా మార్చటానికి… అదేం ఆనందమో నాకర్థం కాదు. ఆవిడకి కూతురు క్షేమం కన్నా స్వార్థంగా ఆలోచించటమే కావాలి. దీనికేమో మూర్ఖంగా ప్రవర్తించటం మాత్రమే వచ్చు. వాళ్ల మమ్మీ నోరువిప్పి నీ మొగుడ్ని చంపెయ్యమన్నా చంపేస్తుంది. అదో పెద్ద శాడిస్ట్‌! ఇదో పెద్ద రోబోట్‌!” అన్నాడు.

ఆఖర్లో హేమంత్‌ అన్న మాట విని ”ఛ…ఛ… అవేం మాటలు హేమంత్‌!” వణికింది శార్వాణి.

”నేనొక సాఫ్ట్‌వేర్‌ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం కరక్ట్‌ అవునో కాదో నాకు తెలియదు కానీ నేను వెళ్లిన దారి మాత్రం మంచిది కాదమ్మా! ప్రేమించానన్న ఒకే ఒక్క ఫీల్‌తో రాంగ్‌రూట్‌లోకి వెళ్లాల్సి వచ్చింది” అన్నాడు.

ఆమె ప్రసన్నంగా చూస్తూ ”నువ్వలా నిరాశపడకు హేమంత్‌! నీకోసం కాకపోయినా నీ బిడ్డకోసమైనా ఆరాధ్య మారుతుంది. కాలంతో పాటు అన్నీ సర్దుకుంటాయి. నీకంతా మంచే జరుగుతుంది. నేనున్నాను కదా!” అంది.

”నువ్వున్నావని ఆ రమాదేవికి ఇంకా తెలియదు. తెలిస్తే కదా అసలు  కథ మొదలయ్యేది!” అని పైకి అనకుండా లాప్‌టాప్‌ని బ్యాక్‌ ప్యాక్‌లో పెట్టుకొని ఆఫీసుకెళ్లిపోయాడు.

…కొడుకుతో పాటు గుమ్మం వరకు వెళ్లి తిరిగి లోపలకి వచ్చింది శార్వాణి.

లోపలికి రాగానే మొబైల్‌ అందుకొని కళ్యాణమ్మకి కాల్‌ చేసింది శార్వాణి. ఆరాధ్య గర్భవతి అని తెలియగానే కళ్యాణమ్మ చాలా సంతోషపడింది.

”ఆరాధ్యను అక్కడ వుంచొద్దు శార్వాణి గారు! మీరూ హేమంత్‌ వెళ్లి వీలైనంత త్వరగా ఇంటికి తీసుకురండి! వాళ్లేమైనా చిన్నపిల్లలా! వాళ్లకి తెలియదా? అని మనం అనుకోకూడదు. మనం వున్నన్ని రోజులు వాళ్లు చిన్నపిల్లలే! వాళ్లకి పంతాలు, మాట పట్టింపులు, ఈగోలు తప్ప గర్భవతిగా వున్నప్పుడు ఎలా వుండాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది తెలియదు. హేమంత్‌ వినకపోయినా నచ్చచెప్పండి! నేనుకూడా కాల్‌ చేసి హేమంత్‌తో మాట్లాడతాను” అంది.

”సరే!” అంది శార్వాణి. కళ్యాణమ్మ చెప్పక ముందుకూడా శార్వాణి అభిప్రాయం అదే! కానీ హేమంత్‌ని ఆరాధ్యను చూస్తుంటే అది అనుకున్నంత తేలిక కాదనిపిస్తోంది.

కళ్యాణమ్మ మాట్లాడుతుండగానే శార్వాణి మొబైల్‌కి ఆమె భర్త కాల్‌ చేస్తున్నట్లు నెంబర్‌ పడింది. ‘నేను మీకు తర్వాత కాల్‌ చేస్తాను కళ్యాణి గారు!’ అంటూ శార్వాణి కళ్యాణమ్మతో మాట్లాడటం ఆపేసి భర్త కాల్‌ని లిఫ్ట్‌ చేసింది.

ఉపేంద్ర వెంటనే శార్వాణిని అనంతపూర్‌ రమ్మని ఫోన్లో చెప్పాడు. ఆమె ముందు రానన్నది. ఆయన ఒప్పుకోలేదు. ఇద్దరి మధ్యన ఘర్షణ… కాల్‌ కట్‌ అయింది.

భర్త కాల్‌ కట్‌ కాగానే హేమంత్‌ మొబైల్‌కి కాల్‌ చేసింది శార్వాణి.

హేమంత్‌ వర్క్‌ బిజీలో వుండి ”అమ్మా! నేను తర్వాత కాల్‌ చేసి మాట్లాడతాను” అన్నాడు.

హేమంత్‌ కాల్‌ కోసం ఓ పది నిముషాలు వెయిట్‌ చేసింది శార్వాణి.

ఆమెకు టెన్షన్‌గా వుంది.

వెంటనే వెళ్లకపోతే భర్త వూరుకోడు. కొడుకును వదిలి వెళ్లాలని లేదు. ఏం చేయాలో తోచటం లేదు.

హేమంత్‌ కాల్‌ చేశాడు. శార్వాణి కొడుకు కాల్‌ని ఆత్రంగా లిఫ్ట్‌చేసి ”నాన్నా! హేమంత్‌! మీ నాన్న అనంతపూర్‌ అర్జంట్‌గా రమ్మంటున్నాడు రా! నేను వెళ్తున్నాను” అంది.

”అదేంటమ్మా! వుంటానన్నావుగా! అంతలోపలే నాన్నకేమవసరం వచ్చింది. ఆయన ఇపుడు రావటం లేదా!”

”ఆయన అలా వచ్చేరకం కాదురా! నేను వెళ్లాల్సిందే!” అంది.

”వెళ్లకపోతే ఏం?”

”గొడవ చేస్తారు”

”చేస్తే ఏం?”

”నీకు తెలియదు హేమంత్‌! మా ఇద్దరి మధ్యన గొడవ ఏ స్థాయికి వెళ్తుందో! తెలిస్తే నువ్వు బాధపడతావు. నీకు మా మీద వుండే గౌరవం పోతుంది. అది నాకు ఇష్టం లేదు అందుకే నేను మీ నాన్న చెప్పినట్లు విని అనంతపూర్‌ వెళ్తాను” అంది.

”ఏంటమ్మా! ఇది? అంతా అయోమయంగా వుంది” అన్నాడు హేమంత్‌.

”నువ్వేం ఆలోచించకు హేమంత్‌! వెళ్లి ఆరాధ్యను తీసుకొచ్చుకో! నచ్చలేదనో, కష్టమనో, నీతో మాట్లాడలేదనో ఈ కోపాన్ని ఇలాగే కొనసాగించితే నువ్వు చాలా కోల్పోతావు. నీకు నువ్వు సమాధానం చెప్పుకోలేని సందర్భాలను కొని తెచ్చుకుంటావు. అది చాలా దురదృష్టం నాకు తెలిసి చాలామంది దంపతులు తాము కలిసి వుండాలనే కోరిక లేకపోయినా కలిసి వుంటున్నారు. వాళ్లది కేవలం సామాజిక సంప్రదాయం. కానీ నీది అలా కాదు. ఆరాధ్య పట్ల నీకు ప్రేమ వుంది. ఆ ప్రేమను మరచిపోయి చిన్నచిన్న విషయాలకు ఆవేశపడుతున్నావు. ఇలా అయితే పడిపోతావు హేమంత్‌! ప్రశాంతంగా ఆలోచించు. నిలబడాల్సిన టైంలో గట్టిగా నిలబడు. లేకుంటే ప్రతిదానికి పడిపోతూనే వుంటావు!” అంది బాధగా.

”అమ్మా! నువ్వు బాధపడి నన్ను భయపెట్టకు. ఆడపిల్ల ఆరాధ్యకే అంతవుంటే నాకెంత వుండాలి? అది అర్థం చేసుకోవేం?”

”ఏదీ అర్థం చేసుకోకుండానే నేను ఇంత జీవితాన్ని దాటుకుంటూ వచ్చానా హేమంత్‌! పెద్దదాన్ని, నీ తల్లిని, నీకు ఏది చెప్పినా అనుభవంతోనే చెబుతాను. నువ్వు తండ్రి కావడంలో వుండే ఆనందాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి. దాని ముందు ప్రపంచంలో వుండే ఏ ఆనందం పనికొస్తుంది. ఆరాధ్య నీ ఇంట్లో లేకుండా నీ పాటికి నువ్వు తన పాటికి తనూ వుంటే ఆ ఆనందం నీకు దొరుకుతుందా? ఆఫ్‌ట్రాల్‌ ఆరాధ్య అని నువ్వు అనుకుంటే నీ జీవితంలో అత్యంత ముఖ్యమైన వాటికి నువ్వు దూరం కావడం తప్ప ఇంకేం వుండదు. ఇంకేం మిగలదు” అంది శార్వాణి.

”శపిస్తున్నట్లు ఏంటమ్మా ఆ మాటలు? ఆరాధ్యే జీవితమా! తను లేకుంటే నాకు జీవితమే లేదా?”

”ఎలా వుంటుందిరా! ఏ మగావాడికైనా ఆలంబన స్త్రీనే! స్త్రీది భూతత్వం. అంటే ఆమె భూమి. మగవాడిని వేళ్లూనుకునేలా చేస్తుంది. ఆమె తోడు లేకుంటే మగవాడికి కాళ్లకింద భూమి వుండదు. వేళ్లూ వుండవు. వూరికే అలా గాళ్లో వేలాడుతుండాల్సిందే! అలాగే వుంటారా? నీకేకాదు. ఎంత గొప్ప మగవాడికైనా స్త్రీతోడు అవసరం. ఆ తోడు లేకుంటే దేశదిమ్మరైపోతాడు” అంది.

”అమ్మా!” అంటూ తనలో తను గొణుకున్నాడు ఏం మాట్లాడాలో అర్థంకాక.

”నువ్విలా వుంటే ఎప్పటికైనా ప్రవాహంలో తేలుతూ, మునుగుతూ కొట్టుకుపోయే గడ్డిపోచలా అయిపోతావు. కానీ నువ్విలా వుండొద్దు. ఈ జీవితం నీకొద్దు. ఈ క్షణం నుండి నీ లైఫ్‌ కలర్‌ఫుల్‌గా వుండాలి. అదే నా కోరిక”

”అమ్మా! నువ్వు వెళ్లటం నాకు ఇష్టం లేదు. అయినా వెళ్తానంటున్నావ్‌! మళ్లీ ఎప్పుడొస్తావ్‌?”

”వస్తానురా! నాన్న వున్నాడుగా! ఆయన ఎలా చెబితే అలా నడుచుకోవడంలోనే నాకు సౌకర్యం వుంది. పదిరోజులు లీవ్‌ తీసుకునే వెళ్తాను” అంది.

”సరే! అమ్మా! నేనొచ్చి ట్రైనెక్కిస్తాను”

”అలాగే హేమంత్‌!” అంది శార్వాణి. ఆమె కళ్లలో కన్నీళ్లు చిప్పిళ్లుతుంటే వాటిని ఆపుకోలేకపోయింది. కాల్‌ కట్‌చేసింది.

***********

 

ఆ రాత్రికి ఆరాధ్య వంట చేస్తే వాత్సల్య, సరయు, ఆరాధ్య కలిసి తిన్నారు.

సరయు క్లయింటు మీటింగ్‌ వుందని లేట్‌గా రావడం వల్ల తినగానే పడుకొని నిద్రపోయింది. ఆరాధ్యకు నిద్ర రావడం లేదు. సరయు చేయి ఆరాధ్యను చుట్టుకొని వుండడం వల్ల కదిలితే సరయు నిద్ర లేస్తుందని అలాగే కదలకుండా పడుకుంది ఆరాధ్య.

ఆరాధ్యకు ఊరినుండి వచ్చేముందు రోజు తల్లి మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి.

”మమ్మీ! ఈ గోల్డ్‌ మీ దగ్గరే వుంచుకొని నాకు డబ్బులివ్వండి! తీసికెళ్లి హేమంత్‌కి ఇస్తాను. లేకుంటే అతను ఊరుకోడు” అంది.

”ఊరుకోక ఏం చేస్తాడు? ఎందుకంత భయపడతావ్‌?”

”నువ్వలాగే అంటావ్‌! అక్కడికెళ్లాక నేను కదా బాధపడేది. అతను నన్నెంత చీప్‌గా చూస్తాడో నీకేం తెలుసు. అతని దగ్గర అంత చులకనై బ్రతికేకన్నా చావడం మేలు. ఈ బ్రతుకు నాకొద్దు” అంది ఆరాధ్య సీరియస్‌గా.

”నువ్వు చస్తే వాడు మళ్లీ పెళ్లి చేసుకొని హాయిగా వుంటాడు. నువ్వెందుకు చావడం? అంత మంచి ఉద్యోగాన్ని, అంత పెద్ద జీతాన్ని వదులుకొని చస్తావా? నువ్వు మరీ పిచ్చిదానిలా వున్నావే!”

”మరి నేను ఎక్కడుండి బ్రతకాలి?”

”ఎక్కడుండైనా బ్రతకొచ్చు. నీకేం తక్కువ? సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేస్తున్నావ్‌! పెద్ద జీతం వస్తుంది. బ్రతుకు గురించి ఆలోచించాల్సిన కర్మేంటి?”

తల్లి అలా అనడం వల్లనే చావుని వాయిదా వేసుకొని ధైర్యంగా హైదరాబాదు వచ్చింది. వాత్సల్య దగ్గర వుంటానని చెప్పినప్పుడు ‘అలాగే వుండు’ అని సపోర్టు చేసింది కూడా తల్లినే! కానీ వాత్సల్య కన్నా సరయునే తనకి బాగా దగ్గరైంది. నిద్రలో కలవరిస్తున్నప్పుడు తనను దగ్గరకు తీసుకొని పడుకునేది కూడా సరయునే! అందుకే సరయు అంటే తనకి తెలియకుండానే ఇష్టం ఏర్పడింది.

కానీ ఈరోజు శార్వాణి ఆంటీ తనను దగ్గరకు తీసుకొని ప్రేమగా మాట్లాడినందువల్లనో ఏమో ఆరాధ్యకు హేమంత్‌ దగ్గరకి వెళ్లాలనిపిస్తోంది. వెళ్తే డబ్బుతోనే వెళ్లాలి. లేకుంటే అతన్ని చూస్తున్నంతసేపు ఆత్మాభిమానం చంపుకుంటూ వుండాల్సి వస్తుంది.

అందుకే నెమ్మదిగా సరయు చేతిని తొలగించి పక్కనే వున్న మొబైల్‌ అందుకొని తల్లికి కాల్‌ చేసింది.

రమాదేవి ఆరాధ్య కాల్‌ని లిఫ్ట్‌చేసింది.

”హలో… మమ్మీ! బాగున్నావా?” అడిగింది ఆరాధ్య.

”ఈ టైంలో ఎందుకు చేశావే? నిద్రపట్టటం లేదా?”

”లేదమ్మా! నాకో హెల్ప్‌ చేస్తావా?”

”ఏంటే! ఏం కావాలి నీకు?”

”నెలనెలా నేను పంపే డబ్బులతో చిట్టీ వేస్తున్నావు కదా! అది పాడి వెంటనే నాకు డబ్బులు పంపు”

రమాదేవి గుండె దడదడలాడింది. ”ఇప్పుడెందుకే ఆ డబ్బులు? అంత అవసరం ఏమొచ్చింది?” అంటూ పడుకున్నదల్లా లేచి కూర్చుని అడిగింది.

”నాక్కావాలని చెబుతున్నాను కదా!” ఆరాధ్య చాలా ప్రశాంతంగా అంది.

”ఎందుకే అంత విసుక్కుంటావ్‌?” కసురుకుంది రమాదేవి.

”నేను విసుక్కుంటున్నానా? లేదు మమ్మీ! చాలా కూల్‌గా వున్నాను”

”వాడేమైనా కన్పించాడా?”

”ఇవాళ నా దగ్గరకి వచ్చి, నన్ను రమ్మని పిలిచారు”

”అనుకున్నా! వెళ్తున్నావా?”

”వెళ్లాలనే వుంది. డబ్బులు కావాలిగా!”

”వాడికెందుకే డబ్బులిచ్చేది? వాడిదగ్గర లేకుండా వున్నాయా? సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌!”

”ఎంత సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అయినా మూడు లక్షలంటే ఒక్క నెలలో రావుగా మమ్మీ! ఆ నెలలో ఎన్ని ఖర్చులుంటాయి. నా వల్ల అతని డబ్బులన్నీ బ్లాకయిపోయాయి. అందుకే పెళ్లయ్యాక నేను ఏమడిగినా కొనివ్వలేకపోయారు. దానివల్లనే మా ఇద్దరి మధ్యన గొడవలొచ్చాయి. ఇదంతా విని ఆయన ఏది చేసినా నామీద ప్రేమతోనే చేశాడని వాత్సల్యకూడా అంది”

”అదెవరే అనడానికి… దానికేం తెలుసని… ఇవాళ వచ్చి వాడేదో నూరిపోసి నిన్ను మార్చేసినట్టున్నాడు. నీ జీతం, వాడి జీతం వాడొక్కడే తీసుకోవాలని ఆశపడుతున్నాడు. వాడి ఆశలేం తీరవని చెప్పు! ఆ చిట్టీ ఇప్పుడే పాడను. మధ్యలో పాడితే మనకే లాస్‌! ఆ డబ్బుల్ని అలా వుండనీ! ఫ్యూచర్లో సునీల్‌కి ఉపయోగపడతాయి”

”ఇప్పుడు నాకొద్దా?”

”నీకెందుకే! హాయిగా ఉద్యోగం చేసుకుంటూ, రుచిగా అంత వండుకొని తినక. నువ్వు నా మాట విని ఈసారి వాడు నీ దగ్గరకి వచ్చినప్పుడు ఏదో ఒకటి అను. హర్టయి ఇప్పుడప్పుడే నీ దగ్గరకి రాడు. డబ్బులు అడగడు. ఇలాగే ఎవరిపాటికి వాళ్లుండొచ్చు. పోయేదేం లేదు. డబ్బులంటావా! ఎప్పుడో ఇద్దాంలే! తొందరేముంది?”

”తొందరంటే నాకీ మంత్‌ డేట్‌ రాలేదు మమ్మీ!”

అదిరిపడింది రమాదేవి ”ఇదెక్కడి గోలే! ఇదేం పీడే!” అంది.

ఆరాధ్య మాట్లాడలేదు.

గొంతు తగ్గించి ”అయినా ఇప్పటివాళ్లు పిల్లలు వద్దనుకొని కొంతకాలం ఆగుతారట కదా! మీరలాంటి ఆలోచనలేం చెయ్యలేదా?” అడిగింది రమాదేవి.

”ఆయనకు పిల్లలంటే ఇష్టంలాగుంది. అలాంటి ఆలోచనలేం చెయ్యలేదు” టకీమని చెప్పింది ఆరాధ్య. ఇన్నిరోజులు ఏమీ అన్పించలేదు కాని ఇప్పుడెందుకో తల్లి తన భర్తను ‘వాడు’ అంటుంటే వినలేకపోతోంది.

”మరి నీ ఉద్యోగం మాటేమిటి? ఎలా వెళ్తావ్‌? అసలే నీ చుట్టూ వుండేవాళ్లు ఫ్యాషన్‌, ఫ్యాషన్‌గా వుంటారేమో! అంత పెద్ద కడుపేసుకొని ఎలా తిరుగుతావే?”

”అది ఆయన ఆలోచిస్తారులే మమ్మీ! అలాంటివి నాకన్నా ఆయనే ఎక్కువగా ఆలోచించి ఏదో ఒక ప్లాన్‌ చేస్తాడు” అంది ఆరాధ్య.

”వాడేం చేస్తాడే! నువ్వు సంపాయించి తెచ్చిస్తే అకౌంట్‌లో వేసుకొని అంకెలు పెంచుకుంటాడు”

”నువ్వలా అనకు మమ్మీ! ముందు నేను ఆయన దగ్గరకి వెళ్లాలి. నాకు వెళ్లాలనిపిస్తోంది”

”ఎందుకూ! హాయిగా వున్న ప్రాణానికి వాతపెట్టుకోటానికా?”

”నువ్వలాగే అంటావ్‌! నన్ను అర్థం చేసుకోవు”

”పెద్దదాన్ని. నేనేందే నిన్ను అర్థం చేసుకునేది? నువ్వే నన్ను అర్థం చేసుకోవాలి”

”ఎందుకు మమ్మీ వాదిస్తావ్‌?”

”వాడేదో నిన్ను మాయ చేశాడే! లేకుంటే నీకీ పాడుబుద్ది పుట్టేది కాదు. చక్కగా వున్నదానివి వుండకుండా మళ్లీ వెళ్లి తిట్టించుకుని వస్తావా?”

”వూరికే ఎందుకు తిడతాడు? గోల్డ్‌ దగ్గర గోల్‌మాల్‌ జరిగిందనేగా!”

”ఏంటే మెత్తబడుతున్నావ్‌?”

”అదేం లేదు మమ్మీ!”

”ఏదో వుంది. దాస్తున్నావ్‌! లేకుంటే ఈ మాటలేంటి! వినాలంటేనే భయంగా వుంది. వాడు రాక్షసుడే! నిన్ను నరికేసినా నరికేస్తాడు”

”ఇప్పుడు ఆయన ఒక్కరే లేరు. వాళ్ల మమ్మీకూడా వుంది”

”మమ్మీనా? అతనికెవరూ లేరన్నావ్‌?”

”అందరూ వున్నారు. నేను ఆయన దగ్గరకి వెళ్తే వాళ్లంతా నా వాళ్లవుతారు… నాక్కూడా ఫ్యామిలీ లైఫ్‌ వుంటుంది”

”ఫ్యామిలీ లైఫ్‌ గురించి ఆలోచిస్తే నువ్వు ప్రశాంతంగా వుండలేవు. ఇప్పుడు ఎవరికున్నాయి ఫ్యామిలీ లైఫ్‌లు. వాత్సల్యకుందా? సరయుకుందా? ఇంకెందరున్నారో బయట మనకు తెలియకుండా!”

”నాకలా వుండాలని లేదు. హేమంత్‌ వాళ్ల మమ్మీ చాలా మంచావిడ. ఆవిడ ఎవరో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు”

”ఎవరే?”

”అప్పుడు నీకు చెప్పానే శార్వాణి ఆంటీ అని… ఆవిడే!”

అవతల వైపు నుండి సడెన్‌గా కాల్‌ కట్‌ అయింది.

ఆరాధ్య మళ్లీ కాల్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌ అని వస్తోంది.

అసహనంగా కదిలింది ఆరాధ్య.

సరయు కళ్లు విప్పకుండానే ఆరాధ్యను గమనిస్తోంది. నెమ్మదిగా తన చేయి తీసి ఆరాధ్యమీద వేసి దగ్గరకి లాక్కుంది. దగ్గరగా వుండటం వల్లనో ఏమో ఆరాధ్య మాటలే కాకుండా అవతల వైపు నుండి బిగ్గరగా మాట్లాడుతున్న రమాదేవి మాటలు కూడా విన్పించాయి.

తల్లి మొబైల్‌ స్విచ్ఛాఫ్‌ కావడంతో ఆరాధ్యకు అనీజీగా వుంది. పడుకోలేక లేచి బాల్కనీలోకి వెళ్లింది.

ఆరాధ్య వెళ్లిన వెంటనే సరయు కూడా లేచి మెల్లగా నడుచుకుంటూ బాల్కనీలోకి వెళ్లింది.

”ఏంటే! ఇలా వచ్చావ్‌! నిద్ర రావడం లేదా?” ఏమీ తెలియనట్లే అడిగింది సరయు.

”ప్చ్‌!” అంది విచారంగా ఎటో చూస్తూ.

”నీ శాడ్‌ లుక్స్‌, నిన్నూ చూస్తుంటే సాఫ్ట్‌వేర్‌ అమ్మాయిలా లేవు. నార్మల్‌ లేడీలా వున్నావ్‌!” అంది సరయు ఆరాధ్యను గుచ్చిగుచ్చి చూస్తూ.

”నేను నార్మల్‌ లేడీనే!”

”అలా అనుకుంటే అంతే వుంటాం! ఎంజాయ్‌ చెయ్యలేం!”

”అది కాదు సరయూ!”

”నువ్వింకేం మాట్లాడకు. ఒక్కసారి మనల్ని మనం అద్దంలో చూసుకుంటే ఎంత డిఫరెంట్‌గా కన్పిస్తామో మన ఆలోచనలు కూడా అంతే డిఫరెంట్‌గా వుండాలి. ఎంత డిఫరెంట్‌గా అంటే ఇదిగో ఇప్పుడు మనం వేసుకున్న ఈ కాస్ట్లీ నైట్‌ సూట్‌లా, పాష్‌గా వున్న మన హెయిర్‌ స్టైల్లా!”

”సరయూ! నువ్వు నన్ను అర్థం చేసుకోవడం లేదు. ప్లీజ్‌!”

”అంత ఓపిక నాకు లేదు ఆరాధ్యా! నిన్ను చూసినప్పుడు నీ గురించి విన్నప్పుడు నువ్వు కూడా నాలాంటి అమ్మాయివే అనుకున్నాను. నీకు నేను, నాకు నువ్వు తోడుగా వుండొచ్చు అనుకున్నాను. అంతే తెలుసు నాకు. అలా కాకుండా మరీ అంత డెప్త్‌కెళ్లి ఆలోచించటం నాకు చేతకాదు. అలాంటి పని నేనెప్పుడూ చెయ్యను” అంది.

”అది కాదు సరయు! మా మమ్మీ ఇలా మాట్లాడుతుందని నేను ఎక్స్‌పెక్ట్‌ చెయ్యలేదు. కనీసం నా చిట్టీ పాడి, నా డబ్బులు నాకు ఇచ్చినా నేను హేమంత్‌ దగ్గరకి వెళ్లేదాన్ని. కేవలం ఆ డబ్బుల వల్లనే నేను నా భర్తకి దూరంగా వుండాల్సి వస్తోంది. అతనికి నచ్చచెప్పుకోవాలంటేనే ప్రాణం చచ్చిపోతోంది”

”అలాంటి భర్తకి దూరంగా వుండటమే బెటర్‌! నాకు తెలిసి మీవాళ్లు చాలా మంచివాళ్లు. నీ గురించి బాగా ఆలోచించే పెళ్లిలో ఇస్తామన్న డబ్బుల్ని బంగారాన్ని, ప్లాట్స్‌ని ఇవ్వకుండా ఆపేశారు. ఇస్తే హేమంత్‌ ఈపాటికి అవన్నీ ఖర్చుచేసి నీకంటూ ఏం లేకుండా చేసేవాడు. మీ పెద్దవాళ్లు ఇలాంటి హేమంతుల్ని ఎందర్నో చూసివుంటారు. ఆ అనుభవంతోనే అతన్ని నమ్మడం లేదు. డబ్బులుంటే ఎక్కడికీ పోవు. వాటిని మీవాళ్ల దగ్గరే వుండనీయ్‌!” అంది.

”ఆ డబ్బుల్నే సరయు హేమంత్‌ అడిగేది”

”ఏ డబ్బుల్ని అడిగినా హేమంత్‌ని నేను అప్రిషియేట్‌ చెయ్యను ఆరాధ్యా! ఎందుకంటే అతను నిన్ను తిట్టాడని తెలిసినప్పుడే నాకు ఇంప్రెషన్‌ పోయింది. ఇకపోతే మీ అత్తగారి తెలివి చూశావుగా! నేనూ, వాత్సల్య చూస్తున్నామని తెలిసే నీ ఒళ్లంతా తడుముతూ పెద్ద షో చేసింది. అదంతా ప్రేమనుకుంటున్నావా! కాదు. డ్రామా! వాళ్ల మూడు లక్షలు నీ దగ్గర వున్నాయిగా! అవి తీసుకోవాలనే అదంతా! తీసుకున్నాక నిన్ను ఇంట్లోంచి నెట్టేస్తుంది. అలా నెట్టెయ్యడం ఆవిడకి అలవాటేగా” అంది సరయు.

ఆరాధ్యకు సరయు మాటలు కరక్టే అన్పిస్తున్నాయి.

సరయుకి ఆరాధ్య ముఖంలో తను ఆశించిన మార్పులు కన్పిస్తున్నాయి.

వెంటనే ఆరాధ్య చేతిని తన చేతిలోకి తీసుకొని పిట్టగోడ అంచున కూర్చోబెట్టి తనూ కూర్చుంది సరయు.

ఆరాధ్య హేమంత్‌ దగ్గరకి వెళ్లకుండా ఇక్కడే వుంటే సరయుకి కొన్ని లాభాలు ఉన్నాయి. అవేంటంటే సరయు విడాకులు తీసుకుంటున్న టైంలో లాయర్లకి ఇచ్చిన ఫీజంతా బయట వడ్డీలకి తెచ్చి ఇచ్చినదే! దాని వల్ల అప్పుడప్పుడు డబ్బులు అవసరమై ఆరాధ్యను అడిగితే లేవనకుండా ‘పర్స్‌లో వున్నాయి. తీసుకో’ అంటుంది. ఆఫీసు నుండి ఇంటికొచ్చేటప్పుడు ‘ఇంటికెళ్లి ఏం వండుతాంలే దారిలో ఏదైనా ఫుడ్‌కోర్టులో తినేసి వెళ్దాం!’ అంటే ‘సరే!’ అంటుంది. బిల్‌ కూడా తనే పే చేస్తుంది. అలాంటి ఆరాధ్యను ఎలా వదులుకోవాలి? ఎలాగైనా మౌల్డ్‌ చెయ్యాలి అనుకుంది సరయు. మనిషిని మంచివైపు మౌల్డ్‌ చెయ్యటం కష్టం కాని దానికి వ్యతిరేకంగా చెయ్యటం సరయు లాంటివాళ్లకు చాలా తేలిక.

”సరయూ! ఒక్కటి చెప్పు! నా కాపురం కన్నా సునీల్‌ భవిష్యత్తు ముఖ్యమా! మా మమ్మీ ఎందుకలా ఆలోచిస్తోంది?”

”పెద్దవాళ్లకి ముందుచూపు ఎక్కువ ఆరాధ్యా! ఆ చూపుతోనే నీకు పెళ్లి చేశారు. సునీల్‌ భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తున్నారు. ఏదైనా మనకన్నా వాళ్లకే ఎక్కువగా తెలుస్తుంది. నువ్వెప్పుడూ వాళ్లను చెడ్డవాళ్లు అనుకోకు…” అంది సరయు.

ఇదికూడా నిజమే అన్పించింది ఆరాధ్యకి.

”కానీ నాకు డేట్‌ రాలేదని చెబితే మా మమ్మీ ఏమన్నదో తెలుసా సరయూ?”

”ఏమన్నది?”

”ఇదేం పీడే! ఇదేం గోలే’ అంది. మా డాడీ కూడా రెండుసార్లు ‘ఊ’ కొట్టి ఫోన్‌పెట్టేశాడు. వినగానే సంతోషిస్తారనుకున్నాను. అలాంటిదేం లేదు. అది కూడా ముందు చూసే అంటారా? లేక వాళ్లకి నేనంటేనే ఇష్టం లేదనుకోవాలా?”

ఒక్కక్షణం ఎటూ చెప్పలేక ఆలోచించింది సరయు.

”ఇష్టం లేకపోవటం కాదు. విపరీతమైన ఇష్టం”

”ఇష్టమా!!”

”ఎందుకంత ఆశ్చర్యపోతావ్‌? అది ఇష్టమే!”

”అదేం ఇష్టమో! క్లారిటీ లేని ఇష్టం…”

”నీకు క్లారిటీ కావాలా?”

‘కావాలి’ అన్నట్లు చూసింది ఆరాధ్య.

”నాకు తెలిసి నీమీద ఇష్టం లేకపోతే మీ మమ్మీ అలా అనేది కాదు. ఎందుకంటే పిల్లల్ని కనటం అనేది వెరీ కామన్‌! అది అందరూ చేసే పనే! మీ ఇంటి చుట్టుపక్కల అమ్మాయిలు, మీ బంధువుల్లో అమ్మాయిలు, చివరకి మీ ఇంట్లో పనిచేసేవాళ్ల అమ్మాయిలు కూడా కంటారు.

కన్నాక రాత్రుళ్లు నిద్ర మానుకొని పాలుతాపుకోవడం, డైపర్లు మార్చుకోవడం, ఏడుస్తుంటే ఎత్తుకొని ఆడించటం, జ్వరాలు, మోషన్స్‌ వస్తే చిన్నపిల్లల హాస్పిటల్స్‌ చుట్టూ తిరగడం… ఈ పనిలో పడి స్నానం చెయ్యలేకపోవడం, తిండి తినలేకపోవడం, చెమట్లు కారుకుంటూ టెన్షన్‌, టెన్షన్‌గా తిరగడం కూడా కామనే!

నువ్వలా అందరిలా కామన్‌గా వుండటం మీ మమ్మీకి కాని, మీ డాడీకి కాని ఇష్టం లేనట్లుంది. వుంటే నిన్నంత ఇష్టపడి బి.టెక్‌ చదివించేవాళ్లు కాదు. సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేయించేవాళ్లు కాదు” చాలా కూల్‌గా మాట్లాడింది సరయు.

”ఆగాగు! సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేసే అమ్మాయిలు పిల్లల్ని కనరా?”

”ఎవరి సంగతో నేనెలా చెప్పగలను. నాకు మళ్లీ పెళ్లయి ప్రెగ్నెన్సీ వస్తే మాత్రం రిమూవ్‌ చేయించుకుంటాను. ఆ బాధలు నేను పడలేను. సిజేరియన్‌ జరిగిందంటే పొట్టంతా కుట్లేస్తారు. అవి లైఫంతా అలాగే వుంటాయి. అందం పోతుంది. హజ్బెండ్‌ నచ్చక వదిలేద్దామన్నా వీలుకాదు. ఫ్యాషన్‌ డ్రసెస్‌ వేసుకోలేము. అప్పుడు మనకు నచ్చినవాళ్లెవరూ మనతో మాట్లాడరు. మనతో మాట్లాడేవాళ్లు మనకు నచ్చరు. ప్రతిదీ అడ్జస్ట్‌ కావాలి. అడ్జస్ట్‌ కావడమంటే తెలుసుగా! జీవశ్చవంలా బ్రతకటమే!”

”గొడ్రాలిగా బ్రతికితే అడ్జస్ట్‌ కానవసరం లేదా? అప్పుడు అందంగా వుంటారా? ఫ్యాషన్‌ డ్రస్‌లు వేసుకోవచ్చా? నాకు తెలియక అడుగుతున్నా! నువ్వు చెప్పేది అలాగే వుంది! అందరూ ఇలాగే ఆలోచిస్తే ఈ సృష్టి ఆగిపోతుందేమో కదా!”

”అందరి గురించి ఇప్పుడు అవసరమా ఆరాధ్యా! ఎందుకంత డెప్త్‌కెళ్లి ఆలోచిస్తావ్‌? వుండేదే చిన్న జీవితం… అవకాశం వున్నప్పుడే హాయిగా ఎంజాయ్‌ చెయ్యాలని ఎందుకనుకోవు?”

”నాకు నిద్రొస్తుంది. వెళ్లి పడుకుందాం సరయూ!” అంటూ లోపలికి నడిచింది ఆరాధ్య.

ఆరాధ్య చేయి లోపలకెళ్తున్నప్పుడు కూడా సరయు చేతిలోనే వుంది.

***********

ఆరాధ్యకు డేట్‌ రాలేదన్న విషయం తెలిసినప్పటి నుండి రమాదేవికి నిద్ర రావడం లేదు. నిన్నగాక మొన్ననే పెళ్లి చేసి ఇల్లు గుల్లయింది. మళ్లీ ఇంతలోపలే ఇదో ఖర్చా అన్నదే ఆమె బాధ. తొలి కాన్పు తల్లిగారే చెయ్యాలి. డెలివరీ టైంలో హాస్పిటల్‌ ఖర్చులు ఈరోజుల్లో ఊహించని విధంగా పెరిగిపోతున్నాయి. వాటిని తట్టుకోవడం తనవల్ల అయ్యేపని కాదు. ఒకరకంగా ఆలోచిస్తే అబార్షన్‌ ఖర్చు కన్నా వెలివరీకి అయ్యే ఖర్చే ఎక్కువ! అందుకే బాగా ఆలోచించి ఆరాధ్యకు ఫోన్‌ చేసింది రమాదేవి.

”ఆరాధ్యా! నువ్వు ఇక్కడికి వస్తావా? నేను హైదరాబాదు రావాలా?” అడిగింది రమాదేవి.

”ఇప్పుడంత అర్జంట్‌ పని ఏముంది మమ్మీ రావటానికి…?” వెంటనే ప్రశ్నించింది ఆరాధ్య.

”నీకు అబార్షన్‌ చేయించాలనుకుంటున్నాను”

”నేను పెళ్లయినదాన్ని. నాకెందుకు అబార్షన్‌? నాకూ, ఆయనకు మధ్యన కోపతాపాలు ఇలాగే వుంటాయా? సర్దుకోవా?”

”అంత సర్దుకొని వుండాల్సిన అవసరం నీకు లేదు”

”మమ్మీ! నువ్వు డాడీకివ్వు ఫోన్‌!”

”డాడీ లేడు. బయటకెళ్లారు”

”నువ్వేంటి మమ్మీ! మరీ ఇలా మాట్లాడుతున్నావ్‌?”

”వున్నమాటే అంటున్నాను ఆరాధ్యా! నువ్వక్కడ ఎలా వున్నావో ఏమో అని మీ డాడీకి, నాకూ ఒకటే ఆలోచన అయింది. ఆ భయానికి నాకు జ్వరం కూడా వస్తోంది. ప్రెగ్నెన్సీ అంటే మాటలు కాదు. తిండి తినాలనిపించదు. వాంతులవుతాయి. ఎప్పుడు చూసినా పడుకోవాలనిపిస్తుంది. ఇలా వుంటే నువ్వు ఆఫీసుకెలా వెళ్లగలవు? ఆఫీసుకెళ్తేనే కదా డబ్బులొస్తాయి. ఒక్కరోజా రెండు రోజులా ఎన్నిరోజులని లీవ్‌ పెట్టగలవు. నీకెవరు చేసి పెడతారు. వారం రోజులు మీ ఫ్రెండ్స్‌ వండినా, తర్వాత వారం నువ్వు వండాల్సిందేగా! ఒట్టిమనిషివైతే ఏ పనీ కష్టం కాదు. కానీ నీకు తిండి తినటమే కష్టంగా వున్నప్పుడు అవన్నీ నీవల్ల అవుతాయా? కేర్‌గా వుండాలి. హాస్పిటల్‌కి వెళ్తుండాలి. స్కానింగ్‌లని, టెస్ట్‌లని క్రమం తప్పకుండా డాక్టర్ని కలుస్తుండాలి. నెలలు నిండాక నీకు తిరగడం కూడా ఇబ్బందిగానే వుంటుంది. నిన్ను కనిపెట్టుకొని ఎవరుండాలి?” అంది.

”నువ్వు వుండవా మమ్మీ!” ఎంతో ఆశగా అడిగింది ఆరాధ్య.

”డెలివరీ అయ్యాక కూడా నువ్వు అన్ని పనులు చెయ్యటానికి లేదు. మీ డాడీని వదిలి నీ దగ్గర ఎన్నిరోజులని వుండగలను? ఆయనకి ఇక్కడ తిండికి ఇబ్బంది కాదా? నువ్వు ఆఫీసుకెళ్తే ఆ పసిబిడ్డను ఎవరు చూస్తారు? ఈ ప్రాబ్లమ్స్‌ను నువ్వు ప్రొలాంగ్‌ చేసుకోకుండా నేను చెప్పినట్లు విను. నీకు జాబ్‌ ముఖ్యం కాని బిడ్డ ముఖ్యం కాదు”

దెబ్బతిన్నట్లై ”మమ్మీ! నువ్వేనా ఈ మాట అనేది?”

”నేనే ఆరాధ్యా! ఎందుకంటే నువ్వు ముఖ్యం నాకు. నీ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇంతకన్నా ఏం మాట్లాడగలను” అంది.

”జాబ్‌ అయినా వదిలేస్తాను కాని, నాకు బిడ్డ కావాలి. ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం. ఆయన ఫేస్‌బుక్‌లో కాని, సెల్‌ఫోన్‌లో కాని చిన్నపిల్లల ఫోటోలే ఎక్కువగా వుంటాయి. వాళ్ల ఫ్రెండ్స్‌కి పిల్లలు పుట్టారని తెలియగానే హాస్పిటల్‌కెళ్లి ఆ పిల్లల్ని చూస్తూ చాలాసేపు గడిపి వస్తాడు. అలాంటిది నేను అబార్షన్‌ చేయించుకుంటే ఒప్పుకుంటాడా?” అంది ఆరాధ్య.

”దానంతట అదే పోయిందని చెబుదాం! నువ్వయితే ఇంటికిరా! జాబ్‌ పోతే మళ్లీ రాదు. అది రావటానికి ఎంతో కష్టపడ్డావ్‌! వాడికేం! పిల్లలు కావాలంటే అప్పుడప్పుడు ఏ హాస్పిటల్‌కెళ్లయినా చూసుకొని వస్తుంటాడు. వాడ్ని అలాగే వదిలెయ్‌!” అంది రమాదేవి.

”ఇప్పటికే గోల్డ్‌ ప్రాబ్లమ్‌ అలాగే వుంది. ఇప్పుడిలా చేస్తే ఒక ప్రాబ్లమ్‌కి ఇంకో ప్రాబ్లమ్‌ తోడవుతుంది. నేను రాను”

”అయినా ఇంత చిన్న వయసులో నీకప్పుడే పిల్లలెందుకు ఆరాధ్యా! పిల్లలుంటే ఎంత కష్టమో నీకు తెలియక మొండికేస్తున్నావ్‌! నీకన్నా పెద్దవాళ్లు మీ బాబాయి కూతుళ్లు. వాళ్లకి ఇంకా పెళ్లిళ్లే కాలేదు. నీకిప్పుడే పిల్లలెందుకు?”

”వాళ్లకి పెళ్లిళ్లు అయ్యాకనే నాకు చెయ్యాల్సింది” అంటూ కాల్‌ కట్‌ చేసింది ఆరాధ్య. ఫోన్లో తన తల్లి ఏం మాట్లాడిందో వెంటనే సరయుతో చెప్పింది.

”ఈ విషయంలో నువ్వు మరీ ఇంత స్ట్రాంగా ఎందుకున్నావ్‌! మీ మమ్మీ చెప్పినట్లు వింటే ఏ ప్రాబ్లమ్‌ వుండదుగా!” అంది సరయు.

”ఈ ఒక్క విషయంలో నేను మా మమ్మీ చెప్పినట్లు వినను. ఇన్నిరోజులు ఏమో అనుకున్నాను కాని ఇప్పుడు నేనుకూడా నా గురించి ఆలోచించుకోవాలి. నేను జాబ్‌లో చేరి ఆరునెలలు దాటింది కాబట్టి నాకు మెటర్నిటీ లీవ్స్‌ వుంటాయి. మన కంపెనీ వాళ్లు ప్రతి ఎంప్లాయికి ఇన్సూరెన్స్‌ చేస్తారు కాబట్టి వాళ్లతో కమ్యూనికేట్‌ చేసి ఇన్సూరెన్స్‌ అమౌంట్‌ని డెలివరీ ఖర్చులకోసం క్లయిమ్‌ చేసుకుంటాను. కానీ వాటిలో ఒక్క రూపాయి కూడా హాస్పిటల్లో వాడను. హేమంత్‌కి ఇస్తాను”

”హేమంత్‌కి ఇస్తావా?”

”అవును. హేమంత్‌కి ఇస్తాను. అతను నన్ను గోల్డ్‌ కొనుక్కోమని ఇచ్చిన మనీలో కొంత మనీని మావాళ్లు రహస్యంగా వాడుకొని మిగిలిన డబ్బులతో 17 క్యారెట్ల గోల్డ్‌ కొని ఇచ్చారు. దానివల్లనే నాకు హేమంత్‌కి గొడవలు వచ్చాయి. అందుకే మొన్న హేమంత్‌ ఇక్కడికి వచ్చినా అతని ముఖంలోకి చూడలేకపోయాను. మాట్లాడలేకపోయాను. ఈ సమస్యను ఏ విధంగా సాల్వ్‌ చేద్దామని చూసినా మా వాళ్లు చాన్స్‌ ఇవ్వటం లేదు. అందుకే ఈ డెలివరీ అయ్యేంత వరకు ఎన్ని ఇబ్బందులైనా పడి ఆ డబ్బుల్ని రికవర్‌ చేస్తాను. లేకుంటే నాకు మనశ్శాంతి వుండదు. ఈ గిల్టీ ఫీలింగ్‌ పోదు” అంది.

”మరి హాస్పిటల్‌ల్లో బిల్లెవరు పే చేస్తారు?”

”మా పేరెంట్స్‌ చేస్తారు. తొలి కాన్పు చెయ్యాల్సింది వాళ్లేగా!”

”మరి నువ్వు ఇన్సూరెన్స్‌ అమౌంట్‌ను క్లయిమ్‌ చేస్తున్నట్లు మీవాళ్లతో చెప్పవా?”

”చెప్పను. చెబితే పైసా ఇవ్వరు”

”అంటే! నువ్విప్పుడు బిడ్డను కనాలనుకునేది నీకోసం కాదా? డబ్బు కోసమా?”

”నువ్వెంత డెప్త్‌కెళ్లి కొశ్చన్‌ చేసినా నేనేం ఫీలవ్వను. నా పరిస్థితులు నాలో వున్న సున్నితత్వాన్ని ఎప్పుడో పోగొట్టాయి”

”పోగొట్టాయని నీ పేరెంట్స్‌కి నువ్వు అబద్దాలు చెబుతావా?”

”అలా చెప్పాల్సిన అవసరాన్ని వాళ్లే కల్పించారు”

”ఎంత కల్పించినా నువ్వు అబద్దాలు చెప్పకు. తెలిస్తే తర్వాత వాళ్లు బాధపడతారు. ఇప్పటికే వాళ్లు నీ విషయంలో బాధ పడుతున్నారు. పేరెంట్స్‌ను బాధపెట్టకూడదు”

”నన్ను బాధ పెట్టొచ్చా?”

”నువ్వలా ఫీలయితే ఎవరేం చెప్పగలరు? పేరెంట్స్‌ ఎప్పుడూ పిల్లల్ని కష్టపెట్టరు. అలా పెట్టేవాళ్లయితే నిన్ను చదివిస్తారా? పెళ్లి చేస్తారా? చదువుకున్న దానివి ఆమాత్రం తెలుసుకోలేవా? ఉద్యోగం కూడా చేస్తున్నావ్‌! పేరెంట్స్‌తో ఇలాగేనా వుండేది? నీకంతగా డబ్బులు కావాలంటే ఫ్రెండ్స్‌ని అడిగినా ఇస్తారు. బలవంతంగా పిల్లల్నే కనాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో ఎవరు కంటున్నారు చెప్పు పిల్లల్ని…? ఎవరో తప్ప నాలాంటి వాళ్లంతా అదో పెద్ద తలనొప్పి అనే అంటున్నారు…” అంది సరయు.

”కానీ ఫ్రెండ్స్‌ను కూడా అడిగాను సరయు! లేవన్నారు. అప్పటి కప్పుడే ఏవేవో రీజన్స్‌ చెప్పి తప్పించు కుంటున్నారు”

”నేనొకతన్ని పరిచయం చేస్తాను. ఎంత కావాలన్నా ఇస్తాడు”

సశేషం….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *