May 19, 2024

పచ్చనాకు కళ

రచన, ఆర్టిస్ట్: ముక్తవరం వసంతకుమారి, పత్రచిత్రకారిణి

 

image_7 image12

   “పండుటాకులమై మిగిలి వగచేకన్నా, ఎండుటాకులో నిండు జీవితాలను పచ్చగా సృజించి శిశిర వసంతంగా శోభిద్దాం”

కొత్తగా ఆలోచించడమే సృజన.  మనం రోజూ చూసే ఆకులకూ, రాలిన ఆకులకూ, ఎవరూ పట్టించుకోని ఆకులకూ వసంతం ఉంటుందని ఊహించాను. చూసే దృష్టి ఉంటే ఒక చిన్న ఆకులో కూడా సృజనాత్మకతను దర్శించగలడు ఆర్టిస్ట్.

image_8

ఒక క్రమబధ్ధంగా  ఆకులను అమర్చడంలో కూడా ఒక ప్రత్యేకత ఉండాలనుకుని, వాటిని యధాతధంగా తీసుకుని, ఊహించుకున్న రూపాలను రూపొందిస్తాను. 2004 సంక్రాంతి పండగతో నా కళారూపాల ప్రజాదరణ “ఆంధ్ర ప్రభ వారపత్రిక” ముఖచిత్రంతో ప్రారంభమైంది. వరసగా విపుల, చతుర, ప్రస్థానం, భూమిక పత్రికా ముఖచిత్రాలు వచ్చాయి. 2006 భూమిక పత్రికాఫీసు, 2007 ఆగస్టు లో స్టేట్ ఆర్ట్ గేలరీలలో సోలో ప్రదర్శన జరిగింది. అన్ని టీ.వీ చానల్స్, పత్రికలలో నా ఆర్ట్ గురించి వచ్చింది. 2009 జూన్ లో తానా లో ఎస్. వి. రామారావు గారు నా ప్రదర్శన పెట్టారు. అమెరికాలో 2008, 2009, 2011, 2013 సంవత్సరాలలో అనేకచోట్ల ప్రదర్శన ఇచ్చాను. 2013 లో బీజింగ్ లో, కెనడాలో నా కళారూపాలను ప్రదర్శించారు. 2013 సంవత్సరం మార్చిలో, దక్షిణ కొరియాలో ప్రపంచదేశాలవారితో పాటు పోటీలో పాల్గొని నాలుగవ స్థానాన్ని పొందాను. అక్కడి మేయరూ, గవర్నర్ రెండు అవార్డ్స్ ఇచ్చారు. ప్రపంచంలోని రష్యా, కొరియా, ఉక్రేయిన్, చైనా, ఇంగ్లండు వంటి దేశాల వారు ప్రశంసిస్తూ ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుతూ ఉంటారు. ప్రతి సంవత్సరం పోటీలకు ఆహ్వానిస్తుంటారు.  వారు నిర్వహించే సమావేశాలకు ఆహ్వానాలు పంపిస్తుంటారు.

image_6

ఆకులోని ఈనె,

ఈనెలో నేను,

ఆకులోని పచ్చదనాన్ని.

సృష్టిలోని వైచిత్రి ఏమంటే పువ్వులూ, సుకుమారమూ, సున్నితత్వమూ మహిళలకూ అవినాభావ సంబంధం ఉంది… ఎందుకో మరి! కవులు వర్ణించడమే కాదు, ఆకులను, పువ్వులకు, మహిళలకు ఉండే సంబంధం సృష్టిలోనే ఉందేమోననిపిస్తుంది.

ఈ పచ్చనాకు చిత్రకారులలో ప్రపంచమంతా నాకు తెలిసిన మితృలంతా మహిళలే అని నేను గమనించిన విషయం. చైనా దేశస్థురాలైన కేచు, అమెరికా దేశస్థురాలైన బెరెకా, బెట్టీ గ్రీన్, రష్యా మితృలు, ఒషిబానా ఆర్ట్ మితృలు, కొరియా, జపాన్ మితృలున్నారు. కెనడా, హాంకాంగ్ ఇలా మా ప్రపంచ ప్రెస్డ్ ఫ్లవర్ గిల్డ్ వారంతా మహిళలే. వీళ్లందరినీ చూస్తుంటే  ప్రకృతికీ, మహిళలకీ చాలా దగ్గర సంబంధం ఉందనిపిస్తుంది. తన పిల్లలను ఎంతో ఓపికగా, సున్నితంగా చూసుకునే స్వభావం కలవారు  తమ ఈ చిత్రకళను ఎంతో ఓపికతో, సున్నితంగా  చిత్రీకరించగలుగుతారు.

image_9

ప్రకృతిని తన దగ్గరకు తెచ్చుకుంటాడు చిత్రకారుడు తన రంగులతో.  కానీ పచ్చనాకు చిత్రకారులు ప్రకృతితోనే తన కాన్వాస్ తయారుచేసుకుంటారు. కళాకారుడికి చిత్రాలు చిత్రీకరించుటలో ఒదగవు. ఆకులను, పువ్వులను తన సృష్టిలోనే ఒదిగించుకుంటాడు. తను ఊహించిన రూపాలను తన సృజనాత్మకమైన కళాదృష్టితో దర్శించి, ఈ ప్రకృతిలోని అందమైన సహజ వర్ణాలతో, వైవిధ్య రూపాలను వెతుక్కోగలరు. సృష్టికర్త ప్రసాదించిన, సృష్టించిన ప్రకృతిలోని ఆకును గమనించండి, పరిశీలించండి, చూడండి. ఋషి కాలేని వాడు కావ్యం రాయలేడంటారు. అలాగే కళకు భాష లేదు, ప్రాంతం లేదు, కులం లేదు. ప్రపంచం ఒక కుగ్రామం అనిపిస్తుంటుంది. కళకు పరిధులు, ఎల్లలులేవని, అవధులు లేవని, సంస్కృతులు అడ్డు రావని అనిపిస్తుంటుంది. 2009, 2001, 2013 ల లో స్టేట్ ఆర్ట్ గేలరీలో అనేక ప్రదర్శనలిచ్చాను. International art studio, Lamarkaan లో గ్రూప్ పదర్శనలిచ్చాను. మొదట రచ్చ గెలిచి ఆ తర్వాత ఇంట గెలిచాననిపిస్తుంది. ప్రసిద్ధ చిత్రకారుడు ఎస్. వీ రామారావు గారు చూసి ప్రశంసలు కురిపించారు. చిత్ర దర్శకులు, చిత్రకారులైన బాపు గారు నా బొమ్మలను ఒక పుస్తక రూపంలో చూసి ఉత్తరం రాసారు, తర్వాత ఫోన్లో కూడా మాట్లాడి చాలా మెచ్చుకున్నారు. చాలా మంది కళాకారులనుండి నాకు ప్రశంసలు వచ్చాయి.

image_10

ప్రకృతిలో మమేకమై, ప్రకృతినే ఒడిసిపట్టుకుని, నా పత్ర చిత్రాలకు ముడి సరుకు చేసుకున్నాను. అవే నా పచ్చనాకు చిత్రకళ ప్రత్యేకత అనుకుంటాను. మళ్ళీ శతపర్ణి, సహస్రపర్ణి సేకరించాలి. మనవరాళ్ళతో కధలు చెప్తూ ఉంటే, కధలకు సన్నివేశాలు, “ఆకులతో చిత్రాలు” అన్న ఆలోచన వచ్చి “ఈసపు కధలు” 9 విశ్వజనీనమైన కధలు తీసుకుని, వాటికి చిత్రాలు వేసి పుస్తకరూపంలోకి ప్రచురించాను. పిల్లలు కధలు చదివి, ఆ చిత్రాల స్పూర్థితో ఆకులను, పువ్వులను సేకరించి పర్యావరణం పట్ల ఆసక్తి పెంచుకోవడం నేను కళ్ళారా చూసాను. ఇదీ నా కళా ప్రస్థానం.

 

2 thoughts on “పచ్చనాకు కళ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *