May 17, 2024

పద్యమాలిక – జులై 1

padyamalika uly 1

నాగజ్యోతీరమణ సుసర్ల
1.
కం :
పతి మారెను విష్ణువుగా
సతి తన పాదములు పిసుక – సౌకర్యముగా
నతిగా చాచిన చేయే
సుతిమెత్తని ఫణి పడగగ- చోద్యము చూపెన్ ….

గుండా వేంకట సుబ్బ సహదేవుడు 1.
పిక్కల నొప్పులనగనే
నిక్కడ సేవించు చుండ నిదియేమండీ!
బొక్కసము నిండు కొన నెక
సెక్కెములకు కొదువలేదు సిగ్గది లేదా?
2.
సిరి శ్రీనాధులు పేర్లని
నిరతము పవలింపు సేవ నెరవేర్చగ మీ
శిరమున నుంచిన కరమే
సరీసృపమ్మై నిలిచెగ చలనము మరువన్!
3.
వాలకమది చూడ ముదిరె!
శ్రీలక్ష్మిగ సేవఁ జేయ! శ్రీహరి యయ్యెన్!
వ్యాలమ్మై చేయి యమరె!
పాలన్ గొన చిల్లరేది ఫణిశయనాంగా?
4.
సంగతదేమిటి మగడా?
మింగేందుకు మెతుకులేదు మీసాలకు సం
పెంగల చమురుల్ తగునా?
రంగడి వలె ఫోజు మాని లక్ష్యముఁ గనవోయ్!

Srinivasa Bharadwaj Kishore
శేషశయన-1-కిభశ్రీ: కందం

ఆ మూలను లేచునెటుల
ఈ మూలను నొక్కినంత ఇదివింతగదే
పామేమైనా దూరిన
దేమో యీతనువునందిదే తోకేమో

శేషశయన – 2 – కిభశ్రీ: కందం

యేనాడూ చేయని పని
యీనా డిల్లాలు చేసె యేదో మాయన్
తానే లక్ష్మియ ననుకునె
నేనే శేషుడననంచు నేచెయిలేచెన్

శేషశయన – 3 – కిభశ్రీ: ఆటవెలది

వత్త నెంచగానె వనిత నా కాళ్ళనే
పైకి లేచె చెయ్యి పడగవోలె
విస్తు బోయి వనిత బిక్కమొగమువేసె
తెలియకుండగామెదేమొ తప్పు

శేషశయన – 4 – కిభశ్రీ: ఆటవెలది

వనితలెవ్వరైన వత్తేరె కాళ్ళుత్త
గానె లేకపోతె కారణమ్ము
అంతరంగమందు ఆలోచనేమిటో
లేమ నడుగగాను లేచె చేయి

శేషశయన-5 – కిభశ్రీ: ఆటవెలది

మనిషి చూడు అసలు మసలకుండేనేల
మొద్దు నిదుర లోన మునిగియుండె
కాలు నొక్కగానె కైయేల లేచేను
వూదినపుడు పెరుగు బుడగవోలె

Annapareddy Satyanarayana Reddy -1

తేః శ్రీమతి ధృతితో పదసేవ చేయుచుండ
పవ్వళించెను శయ్యపై వల్లభుండు
సర్పరాజు పడగను తా చాపినట్లు
కరతలమ్మువిప్పెవిభుడు శిరముపైకి
కలిమిచెలి పతిన్ మదిలోన తలచుకొనుచు

Sreedhara Rao Machavolu -1
ఆ.వె. పాల సంద్రమందు పవళించు ఆ హరి
వోలె తనను తాను పోల్చుకొనుచు
కలల తేలు పతిని గని బెదరిన సతి,
బేల ముఖము వైచి బిగుసు కొనియె!

Annapareddy Satyanarayana Reddy 2.
పతియె దైవమని తలంచి భక్తితోడ
పాదముల నొత్తుచున్నది పడతి యొకతి
శేషతల్పముఁ బవళించు శ్రీపతి వలె
పోజు లిచ్చుచు నుండె నా బోటి మగడు

3.
ఆదిలక్ష్మివంటిగృహిణి వంచుఁబొగడ
పాద మర్ధనమును చేయు పడతిఁగనుడు
మగువ మనసెరింగి మసలు మగని కెపుడు
రాజభోగము కలుగును రమణి చెంత

4.
ఆఫీసునుండి వచ్చితి
నే పనిలోనలసితినని నీలుగు చుండన్
సాపాటునిచ్చి శ్రీమతి
తాపతి పాదముల సేవ తనియుచు సలిపెన్

5.
పెళ్ళి గాని ప్రసాదు తా వెలది గూర్చి(నుల్లమందు)
కలలఁగనుచుండె నిదురలో కరము తృప్తి
నాది శేషుని పైనున్న యచ్యుతు వలె
తనను మానస కుహరముఁ దలచుకొనుచు

6.
అలసి వచ్చిన భర్తకు పొలతి యొకతి
చేయుచున్నది సేవలు చేరిదరికి
మనసు వైకుంఠమునకేగ ఘనపు శయ్యఁ
బవ్వళించెను హాయిగా వల్లభుండు

Raveendra Babu Choppa
తేటగీతి :
పాద మర్ధన మొనరించు పడతి రమగ
పట్టె మంచము తనకయ్యె పాల కడలి
ఆది శేషుని పడగై స్వహస్త మొకటి
సగటు సంసారి విష్ణుగ స్వప్నమందు

Raveendra Babu Choppa
తేటగీతి :
పవరు కట్టును కలిసొచ్చె పడతి కిచట
సతికి తప్పదు సేవయు సాధ్వి గనుక
పిసికి తెప్పించు పవరును పిసరొ కంత
పతికి రావలె తప్పక మతికి పవరు

Dhanikonda Ravi Prasad
వైకుంఠమ్మున మరి భూ
లోకమ్మున నైన మేమె లోకువ గాదే
వైకుంఠపు లక్ష్మియు నీ
లోకపు గృహలక్ష్మి సేవ లో సమమేగా

(పురాణాలలో లక్ష్మీ దేవి అయినా కాళ్లు పిసుకుతూ ఉంటుంది. అంతమంది భక్తులు ఉన్నా . ఈ లోకం లో మేమూ అంతే అని ఆమె బాధ.)

3
అరచేతి నడ్డు పెట్టిన
సురసుర మను సూర్యకాంతి చొరబడకున్నే !
అరచేతి దెబ్బలనగా
చురుకగు దోమల బలగము సుంత వెరచునే !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *