May 19, 2024

ప్రమదాక్షరి – కధామాలిక -2 || తరాలు-అంతరాలు ||

సమీక్ష:-ఇందిర గుమ్ములూరి, పి.హెచ్.డి. (తెలుగు లిట్.)

Tharalu-antharalu

ఈ పుస్తకాన్ని చూడగానే మాలతీచందూర్ గారి ‘ప్రమదావనం’ గుర్తుకొచ్చింది. ఆడవాళ్ళకోసం ఆడవాళ్ళు రచించిన కధల సంపుటి ఇది. ఇందులో 17 కధలున్నాయి. ఇందులో రచయిత్రులందరూ ఆడవాళ్ళ సమస్యలను, వారి అంతరంగాల్లోని వివిధ భావాలని, వాళ్ళ మానసిక వేదనలని, కాలంతో వచ్చే మార్పులని, సంఘం కట్టుబాట్లని, వాటికి తలొగ్గి గెలుపోటములని సమన్వయ పరచుకొన్న విధానాన్ని, వారి మానసిక పరిస్థితులని చాలా చక్కగా వివరించారు. కధాంశాలన్నీ స్త్రీల చుట్టూ, వారి అంతరంగాల చుట్టూ, వారి సమస్యల చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. ఈ కధల విషయంలో ఇంకో విశిష్టత ఏమిటంటే ఈ కధలన్నీ యధార్ధ సంఘటనలని ఆధారంగా చేసుకొని రచించినవి. నిజానికి ప్రపంచంలో ఏ కధని తీసుకొన్నా ఆ కధలో సంఘటన ఎక్కడో ఎప్పుడో అప్పుడు జరుగక మానదు.

వీటిలో మొట్టమొదటి కధ “పెళ్ళిమర్యాదలు”. దీనిని “ఆచంట హైమవతి” రచించారు. ఈ కధలో కధానాయిక పెళ్ళికూతురు బామ్మగారు, కారణం ఇందులో సమన్వయకర్త బామ్మగారు కనుక. ఇంచుమించు 70, 80 దశకాల దాకా మన తెలుగు కుటుంబాల్లో జరిగే పెళ్ళిళ్ళకి ఈ కధ ఒక చక్కని ప్రతిబింబం. మగపెళ్ళివారి ఆధిపత్యం సాగుతున్న రోజుల్లో కధ ఇది. మగపెళ్ళివారు చీటికీ మాటికీ అలగటం, ఆడపళ్ళివారు అగ్గగ్గలాడుతూ వారి కోరికలని తీర్చటం ఇవన్నీ ఒకనాటి పెళ్ళిళ్ళలో సర్వసాధారణం. ఈ కధలో పెళ్ళిలో అలుకలు, వాటిని తీర్చిన విధానం చాలా సహజసిద్ధంగా వర్ణితమయ్యాయి. నిజానికి ఎప్పుడైనా మగపెళ్ళివారికంటే వారి వైపు పెళ్ళి పెద్దలు, చుట్టాలుపక్కాలు చేసే హడావిడే ఎక్కువ ఉంటుంది. “ఈ రెండు రోజులే కదా! వాళ్ళు తప్పు పట్టినా -మనం తలవంచుకొని సంజాయిషీ చెప్పినామా! … వాళ్ళ సరదాలు పెళ్ళీ లోనే తీ ర్చుకొంటారు. కొన్ని అగ్గగ్గలాడుతూ తీర్చాలి. కొన్ని వినీ విననట్లు ఊరుకోవాలి, కొన్నింటిని క్షమించాలి” అన్న బామ్మగారు మాటలు అక్షర సత్యాలు. ఈ సమన్వయం ఒక్క పెళ్ళికే కాదు జీవితానికి కూడా అన్న విషయం తెలిసికోగలగాలి. ఆడపెళ్ళివారు పాలకవర్గం, మగపెళ్ళివారు ప్రతిపక్షం అన్న పద్ధతిలో కాక మనం మనం ఒకటే అన్న భావనతో మెలిగితే ఆ జీవితం స్వర్గమే కదా? జీవితంలో ఒడిదుడుకులని అధిగమించేందుకు, మనసు రాటుదేలటానికి ఈ అనుభవాలు కూడా ఒక్కొక్కప్పుడు అవసరమే.

‘మాంగల్యం తంతునానేనా’ ఆదూరి హైమవతి గారి కధ. పెళ్ళి రెండు హృదయాల కలయికే కాదు రెండు కుటుంబాలు ఒకటవటం. పెళ్ళికి ఎందరో ఆహ్వానితులు వస్తారు. ఒకేచోట పదిమంది కలిసి కూర్చున్నప్పుడు ఎన్నో రకాల సంభాషణలు, సమస్యలు, గిల్లికజ్జాలు, అవతలివాళ్ళ మీద బురద చల్లటం, తమకు సంభందించిని విషయాలమీద చర్చలు ఇటువంటి చోట్లే ఎక్కువగా జరుగుతాయి.అంతేకాదు ఇటువంటి స్ఠలాల్లో ఏదైనా సమస్య వస్తుందా చూసి ఆనందిద్ధామా అనే వారే ఎక్కువగా ఉంటారు. పెళ్ళిమంటపంలోకి పెళ్ళికూతురు ఆలస్యంగా రావటం అనే విషయం మీద పెళ్ళికూతురి చుట్టాలుపక్కాల మధ్య జరుగుతున్న చర్చాచర్చలు ఈ కథంతా పరచుకొన్నాయి. ఇంట్లో చెప్పకుండా పెళ్ళి చేసుకొని వేరుగా బ్రతుకుతున్న తన తల్లిదండ్రులని ఒకటిగా చేసి పెళ్ళికూతురు వారిని పెళ్ళికి తీసుకొని రావటంతో కధ సుఖాంతమవుతుంది. చిన్న పిల్లైనా జీవితాన్ని సమన్వయపరచుకొన్న విధానం చాలా చక్కగా వర్ణితమయింది.

తల్లిప్రేమ గురించిన కధే శశితన్నీర్ గారు రచించిన ‘స్పేస్ షిప్’. ఏ తల్లీ తన కూతురు కష్టపడటం సహించలేదు. చివరకు ఆ కూతురి భర్తకు కష్టం వచ్చినా సరే కూతురు సుఖాన్ని గురించే ఆలోచించే తల్లులు, ఆ అల్లుడూ తనవాడే, తన కూతురుకు భర్త అనే ఆలోచనకు తావివ్వని తల్లులని ఎందరిని చూడటం లేదు చెప్పండి? !!! భర్త కష్టాలను తీర్చటం కోసం ఒక భార్య పడే తపన, అటు అత్తగారిని, ఇటు అమ్మనీ మెప్పించి భర్తని జీవితంలో గెలిపించి, జీవితంలో తాను గెలిచి చూపించిన ఒక వివాహిత కధను చాలా చక్కగా కళ్ళకు కట్టినట్లు వివరించారు రచయిత్రి. చిన్నపిల్ల అందునా క్రొత్తగా పెళ్ళైన ఒక ఆడపిల్ల మానసిక పరిపక్వతతో కుటుంబాన్నంతటినీ మెప్పించిన విధానం జీవితంలో సమస్యలతో సతమతమయ్యేవారికి ఒక చక్కని కనువిప్పు ‘గొడవలు పడినా సర్దుకొని స్నేహంగా ఉంటేనే సంసారం’ అని ఈ నవలకిచ్చిన కొసమెరుపు ఎందరి జీవితాలకో పరిష్కారం కావాలని ఆశిద్దాం.

మాలాకుమార్ గారి ‘మనసు తెలిసిన చందురూడా!’ ఒక చక్కటి శృంగారభరిత ప్రేమ కధ. అయితే తరం మారినా అర్ధం చేసుకొనే అత్తగారున్నప్పుడే ఆ జీవితం పరిపూర్ణం అవుతుందని నవలను ముగించటం చాలా చక్కగా ఉంది. అత్తగారిని పరమ కర్కోటకురాలిగా చూపిస్తున్న తెలుగు, హిందీ సీరియళ్ళను చూసి చూసి విసుగెత్తిన వాళ్ళకి, ఈ కధ ఒక చక్కటి చిరుజల్లే.

ఈ రోజుల్లో చాలా సాధారణంగా ఎక్కువగా వినిపిస్తున్న మాట ‘సహజీవనం’ (live in relationship). కొంతకాలం కలిసి జీవించి, ఒకరికొకరు అర్ధం చేసుకొని తరువాత పెళ్ళి చేసుకోవటం! అనేది ఈ కాలంలో పిల్లలనూ, పెద్దలనూ కూడా వేధిస్తున్న సమస్య …. ఇది ఎంతవరకూ సబబు? అనే ప్రశ్నకు పూర్వతరం వాళ్ళు వివాహమనే ఒక బంధం ఉన్నప్పుడు ఆ కుటుంబానికి సమాజరక్షణ ఉంటుంది కదా అని అంటూ ఉంటే, నచ్చారో లేదో, కలిసి బ్రతుకగలమో లేదో తెలుసుకోకుండా ఎలా ఈ బంధం ఏర్పరచుకోవటం అనేది నేటి కుర్రకారు ప్రశ్న. ఈ అంశం మీద సాగిన కధ లక్ష్మీ రాఘవగారి ‘సంప్రదాయ తెరలో ఆధునికం’. ఇదే అంశం అధారంగా వచ్చిన మరొక కధ ‘కాలమే పరిష్కరించుకోవాలీ. ఈ కధ చదవగానే తెలుగువాళ్ళమయిన మనకి గుర్తుకు వచ్చే సినిమా కొన్నేళ్ళ క్రితం వచ్చిన ‘ఇంగ్లీషు పెళ్ళాం ఈస్ట్ గోదావరి మొగుడూ’ అనే సినిమా. కధలో కధానాయిక సహజీవనానికి మొగ్గు చూపించి, ఆ జీవితాన్ని రుచి చూచి కూడా చివరకు సంప్రదాయం వైపే మొగ్గు చూపిస్తుంది. ఇటువంటి కధలను చదివినపుడే మనిషి సంప్రదాయాలకున్న బలం, దానికున్న ప్రాధాన్యత బాగా అర్ధమయేది.

జి.యస్. లక్ష్మిగారు రచించిన కధ “ఎంజాయి మెరైటల్ బ్లిస్ “. ఒకానొక రోజుల్లో బాగా అనుభవజ్ఞులైన బామ్మలు, తాతలే కౌన్సిలర్లు. ఊళ్ళో ఏ కష్టమొచ్చిన్నా, ఏ సమస్య వచ్చినా పెళ్ళిళ్ళలో, సంసారాలలో ఏవైనా పొరపొచ్చాలొచ్చినా ఊరి పెద్దలో, ఇంటి పద్దలో, బామ్మలో, తాతలో తీర్చేవారు వాటికి పరిష్కారాలు చూపేవారు. లాయర్లూ, కోర్టులూ ఆ కాలంలో లేవు. అయితే కాలం మారింది. పెళ్ళిళ్ళకే కాదు జీవితంలో ఏ సమస్యకైనా కౌన్సిలర్స్ వచ్చారు. పెద్ద పెద్ద చదువులు చదివి, ఆ చదివిన చదువు అనుభవంతో పరిష్కారాలు చూపే రోజులు వచ్చాయి. పెళ్ళి చేసుకొనే ముందే ఈ పరిష్కర్తలు ఆ వధూవరుల మనస్తత్వాలను, వారి చిన్ననాటి అనుభవాలను, చిన్నప్పుడు మానసికంగా తగిలిన దెబ్బలను బట్టీ వాళ్ళ మనసుల్లో ఉండే కొన్ని అభద్రతాభావాలకి పరిష్కార మార్గాలు చూపిస్తారు. పెళ్ళి కుదిరిన ఒక అమ్మాయి ఇటువంటి ఒక ప్రకటన చూసి ఆ కౌన్సిలర్ దగ్గరకు వెళ్ళటం, ఆవిడ కొన్ని యధార్ధ సంఘటనలు చూపించి ఆ అమ్మాయి మనసుకి స్వాంతన కలిగించటంతో కధ ముగుస్తోంది. అయితే కధలో అసలైన మలుపు ఏమిటంటే ఆ కౌన్సిలర్ కూడా జీవితంలో దగాపడ్డ వ్యక్తే కావటం !!!

మంధా భానుమతిగారి ‘అత్తారిల్లు’ – చరిత్ర పునరావృతమవుతూనేవుంటుంది అని సోదాహరణంగా చెబుతున్న కధ. కూతురు ప్రేమ వివాహం చేసుకుంటానన్నప్పుడు తల్లి అభ్యంతరం పెట్టగా అత్తగారు తల్లీకూతుళ్ళ మధ్య సయోధ్య కుదిర్చి, పెళ్ళికి ఒప్పించటం ఒక ఎప్పుడూ ఉన్న కధే. అయితే ఆ తల్లి కూడా ఒకనాడు ఇలాగే ప్రేమ వివాహం చేసుకొంటానని తల్లిదండ్రులని ఎదిరించి పెళ్ళి చేసుకోనటం అప్పుడు కూడా ఆ అత్తగారే వీరిని చేరదీసిన వాళ్ళ జీవితాన్ని చక్కదిద్దటం ఇందులో కధాంశం. పాతతరానికి చెందినవారైనా అత్తగారు మనుమరాలి సమస్యలని అర్ధం చేసుకొని పరిష్కరించటం ఒకేఎ కధకు చక్కటి మలుపు.

“ఇదో పెళ్ళి కధ” డా. గురజాడ శోభాపేరిందేవి గారి రచన. ఇష్టంలేని పెళ్ళి చేసుకోబోతున్న పెళ్ళికూతురు ముందురోజు రాత్రి ఇల్లు వదిలి వెళ్ళాలనుకోవటం, విషయం తెలుసుకొన్న బామ్మగారు రెండువైపుల వారినీ ఒప్పించి పెళ్ళికూతురికి ఆమెకు నచ్చిన వానితో పెళ్ళి జరుపటంతో కధ సుఖాంతం అవుతుంది. ఈ రోజుల్లో ప్రతివారి నోట తెగ వినిపించేమాట -కమ్యూనికేషన్ గ్యాప్ … దీని ఆధారంగా నడిచిన కధ ఇది. మధ్య వయస్కులు పెద్దలను తక్కువగా అంచనా వేసి, వారికేమీ తెలియవని అనుకొంటారనీ, వారికి గౌరవమిచ్చి వారి తోడ్పాటుతో పనిచేస్తే విడాకులూ ఉండవు, వితండ వాదనలూ ఉండవు, వేర్పాటు ఆలోచనలూ రావు అని రచయిత్రి ఇచ్చిన పరిష్కారం ఈ కధ చదివినా చదువక పోయినా ప్రతిఒక్కరికి వర్తిస్తుంది.

వర్ణాంతర వివాహాల వల్ల వచ్చే సాధకబాధకాలని వివరించిన కధ నాగలక్ష్మికర్రా రచించిన “తొలగిన మబ్బులు”. ఉత్తర భారతీయిణ్ణి పెళ్ళి చేసుకొన్న శివానీ ఆ ఇంట్లో ఇమడలేక పుట్టింటికి వచ్చేసినపుడు ఆమె మేనత్త ఆమెకి ఆమెకి నచ్చచెప్పి సంసారాన్ని సరిదిద్దటం అనే అంశంతో సాగిన కధ. “వీధిలో విషయాలు గుమ్మం బయటే విడిచి పెట్టాలి. అలాగే పడకగది విషయాలు గది దాటి బయటకు రాకూడదు. ఇంట్లో విషయాలు వీధిగుమ్మం దాటకూడదు. ఆలుమగల మధ్య వచ్చే సమస్యలకి ఆవేశంతో కాక వివేకంతో ఆలోచిస్తే పరిష్కారాలు వాటంతటవే దొరుకుతాయి … అంటూ మేనత్త ఇచ్చిన పరిష్కారాలు చదివితే ఒకానొక కాలంలో వచ్చిన “మాంగల్యబలం” సినిమాలో “హాయిగా ఆలుమగలూ కాలం గడపాలి … అనే పాట గుర్తుకు రాకతప్పదు. కాళిదాసుకు అత్యంత ప్రాముఖ్యతను తెచ్చిపెట్టిన “అభిజ్ఞాన శాకుంతలం” నాటకంలో కణ్వుని నోట వినిపించే నాలుగు శ్లోకాలు గుర్తుకు రాకతప్పవు. ఆ కాలంలో అమ్మలే, నాన్నగార్లే, అత్తలే మెరైటల్ కౌన్సిలర్స్ మరి. వర్ణాంతర, రాష్ట్రాంతర, దేశాంతర వివాహాల్లో ఎదుర్కొన వలసిన సమస్యలని సంయమనంతో వాటిని అధిగమించటానికి జీవితంలో అమలు పరచవలసిన మార్పులు చక్కగా వివరించారు ఈ కధలో నాగలక్ష్మిగారు.

కోసూరి ఉమాభారతి రచించిన “నిరంతరం నీ ధ్యానంలో” ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న సరొగసీ ఆధారంగా నడిచిన కధ. అర్ధం చేసుకొన్న అత్తగారు, ప్రేమగా చూసుకొనే భర్త ఉన్నప్పుడు ఆ జీవితం స్వర్గమే.

విశాలి రాసిన కథలో పండుగకి పుట్టింటికి వచ్చిన కూతురు చిన్ననాడు ఇంట్లో గొబ్బెమ్మలు పెట్టటం, తల్లి భోగిపళ్ళు పోసి దిష్టి తియ్యటం, కనుమనాడు పనివాళ్ళకు బట్టలు పెట్టటంలాంటి విషయాలని నెమరువేసుకొనటంతో కధ మొదలవుతుంది. ఇప్పుడు తాను తల్లి అవతంతో చరిత్ర పునరావృతమవుతోంది. కూతురు వచ్చి పిలవటంతో ఊహాలోకంలో లోంచి వాస్తవంలోకి వచ్చి తాను తల్లివనే విషయాన్ని గుర్తుకు తెచ్చికొని, “అమ్మకి ప్రతిరూపం తను. ఇంకో “అమ్మ” లా ఆదర్శం కావాలి అనుకొంటుంది. కూతురే తల్లి అవుతుంది. ఆ తల్లికి మళ్ళీ పిల్లలు, ఆ పిల్లలు తల్లులవటం. ఇదే కాలచక్రం. ఇక్కడ తల్లీ శాశ్వతం కాదు ఆ కూతురూ శాశ్వతం కాదు. వారు మిగిల్చిపోయిన విలువలే శాశ్వతం.

గౌతమి గారి కధ “అవును, వాళ్ళు చేసిన తప్పేమిటి?” – మానసిక పరిపక్వత లేక ఫేస్ బుక్ ప్రేమల ప్రవాహంలో కొట్టుకుపోతూ ప్రేమ వివాహం మాత్రమే చేసుకొంటానని భీష్మించుకు కూర్చున్న ఒక యువతి కధ. “ఏ కాలమయినా కులాంతర వివాహాన్ని ఆ ప్రేమికులు మాత్రమే గౌరవిస్తారు తప్ప వారి కుటుంబాలు మాత్రం గౌరవించకపోవటం సర్వసాధారణం”. ఒక ఆడపిల్ల ఇలా కులాంతర వివాహం చేసుకొని పడ్డ అష్టకష్టాలకి రూపం ఈ కధ. పెద్దలు చేసిన సంబంధంలో సమస్యలున్నా కుటుంబరీత్యా ఎన్నో సమస్యలు రాకుండా ఉంటాయి కారణం కుటుంబ రక్షణ వారికుంటుంది అంటూ పరిష్కారం చూపేరు రచయిత్రి.

“తాతినేని వనజ” గారి “వెన్నెల పురుషుడు” పిల్లలు లేరనే మానసిక అశాంతికి లోనయిన ఒక వివాహిత వెన్నెలలో ఒక ఊహా పురుషుని ఊహించుకొని ఆ ఊహల్లో ఆనందాన్ని వెతుక్కోవటం. చివరకు అది ఒక మానసిక వ్యాధిగా మారటం కధాంశం. అర్ధం చేసుకొన్న అత్తగారు ఆ కోడలిని కంటికి రెప్పలా కాపాడటం, ఆమె ఒక పండంటి బిడ్డకు తల్లి కావటంతో కధ సుఖాంతమవుతుంది.

“498 (ఎ)” రాజా విజయలక్ష్మిగారి రచన. ఈ కాలంలో ఎవరినోట విన్నా వినిపించే సెక్షన్ ఇది. చిన్నప్పుడే పెళ్ళై ఆడపడుచుల్ని, మరుదుల్ని, అత్తమామలని ఓర్పుతో సహనంతో మెప్పించిన రమణమ్మ ఆ మొనాటనస్ లైఫ్ కి ఎదురు తిరిగి అరవయ్యోపడిలోకి వచ్చాక భర్తకు విడాకులివ్వాలనుకోవడంతో మొదలవుతుంది కధ. కూతురు తన అత్తమామల, భర్త ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చుచేసి, అత్తవారింటితో తెగతెంపులు చేసుకొని పుట్టింటికి వచ్చేస్తుంది. ఆమె ధోరణి మొదటినుండి గమనిస్తూ వచ్చిన తండ్రి ఆమెకు బుద్ధి చెప్పటంతో కధ ముగుస్తోంది.

ఒకనాటి భర్తలు పెళ్ళాలు చేసిన పనిని, పడుతున్న కష్టాలని గమనించి వారి కష్టాలని అర్ధం చేసుకొన్నా పైకి చెప్పలేని అశక్తులు. ఏదో తెలియని మెంటల్ బ్లాకు దీనికి కారణమవ్వొచ్చు. విషయాన్ని అర్ధం చేసుకోలేని భార్యలు తమ కష్టానికి తగ్గ ప్రతిఫలం భర్త దగ్గర కూడా దక్కలేదే అని బాధపడడం కూడా నాడు సర్వసాధారణం. అయితే ప్రస్తుత కాలంలో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగస్తులవటం, చుట్టాలు పక్కాలేకాదు చివరకు అత్తమామలతో కూడా అంతగా సంబంధ బాంధవ్యాలు లేకుండానే కాలం గడిపేస్తున్నారు. దానితో కుటుంబ విలువలు తెలుసుకొనే అవకాశం, అవసరం వారికి కలుగాం లేదు. మనది అనే మాట వారి నిఘంటువుల్లో లేకుండానే జీవితం వెళ్ళబుచ్చేస్తున్నారు. ఇంటి ఖర్చు భర్తది, తన డబ్బు తనదేగా జీవితాన్ని గడుపుతూ, అత్తమామలు ఇంట్లో ఉన్నా వాళ్ళు పనిచేసే పనిమనుషులు మాత్రమే అనే భావనతో ఉన్న ఆడపిల్లలూ ఉన్నారు ఈ రోజుల్లో. ఇటువంటి ఆడపల్లలకు ఫక్తు ప్రతినిధి ఈ కధలోని కధానాయిక. తన మాట చెల్లలేదని అత్తమామలనీ, భర్తనీ ఈ ఆర్టికల్ 498 (ఎ) చట్టం క్రింద జైల్లో పెట్టించటం, తండ్రి వారిని విడిపించి కూతురికి బుద్ధి చెప్పటంతో కధ సుఖాంతమవుతోంది. అయితే ఇంటి పనులకే పరిమితమయిపోయిన తన భార్య పట్ల ఏనాడూ సానుకూలత కూడా కనబరచని తండ్రి కూతురు కాపరం చక్కదిద్దే ప్రయత్నంలో తన భార్య పడ్డ కష్టాలని కూతురుకి జ్ఞాపకం చేయటంతో అంతవరకూ ఒక విధమైన అభద్రత, అసంతృప్తితో ఉన్న రమణమ్మ, కూతురుకి బుద్ధి రావటంతో కధ సుఖాంతమై కంచికెళుతుంది. కధలైపోయాయి కనుక మనం ఇంటికి వెళ్ళాలిగా?

యత్రనార్యస్తు పూజ్యంతే రమంతే తత్రదేవతా
యత్రైతాస్తు పూజ్యంతే సర్వాస్తాత్ర ఫలా: క్రియా:||

అన్నాడు మనుధర్మకారుడు. ఎక్కడ స్త్రీ గౌరవింపబడుతుందో అక్కడ దేవతలూ అనందిస్తారు అని ఈ శ్లోకం అర్ధం. ఆ కధల్లో స్త్రీలందరూ మంచివాళ్ళే. కనుక పై శ్లోకం వాళ్ళందరికీ చక్కగా వర్తిస్తుంది. ప్రమదాక్షరి కధాసంపుటిలో అన్ని కధలూ సుఖాంతమే. ఒకనాటి ఐదురోజుల పెళ్లిళ్ళలో జరిగే హడావిడులు, మగపెళ్ళివారి అలుకలు, అవి తీర్చే విధానాలతో మొదలయి, పెళ్ళిళ్ళ సమస్యలు, ఆధునిక కాలంతో వచ్చిన మార్పులకి ప్రతీకగా సహజీవనాలు, విడాకులు, అద్దె గర్భాలు, మానసిక సమస్యలు, కార్పొరేట్ ఆఫీసుల్లో పని చేసే భార్యా భర్త మధ్య వచ్చే పొరపొచ్చాలు, ఆధునికకాలంలో యువతీ వువకుల మనస్తత్వాలు, చివరకు గృహహింసా చట్టం కూడా ఈ కధల్లో చోటు చేసుకోవటం అన్నిటికీ సుఖాంతమైన పరిష్కారాలివ్వటం మెచ్చుకోదగ్గ విషయం.

అయితే సమస్యలుండవా? అంటే జీవితమన్నాక సమస్యలు ఉండకుండా ఉండవుగా? అవి ఒక్కొక్కప్పుడు దు:ఖాంతం కూడా కావచ్చు కదా అంటే రచయిత్రులు కధల్లో సుఖాంతమైన కోణాన్నే ఎంచుకున్నారు. అంతేకాదు కధల్లో పాత్రలు సమస్యలున్నవారికీ, మనసుతో ఆలోచించని, ఆలోచించలేని వారికి ఇవి చక్కటి రసగుళికలు, ఒక్కొక్కప్పుడు ఒక చిన్న వాక్యం, ఒక చిన్న కధ జీవితాలని మార్చవచ్చు.

ఒకానొక కాలంలో మరమరాలు, అటుకులు చంటిపిల్లల ముందు నేల మీద పోసేవారు. తెల్లగా కనిపిస్తాయి కనుక నేలమీద పాకే పసిపిల్లలు అక్కరలేని వాటి జోలికి వెళ్ళకుండా వీటినే తినేవారు. అవీ ఇవీ నోట్లో పెట్టుకోకుండా ఉండేందుకు ఇదొక టెక్నిక్ అన్నమాట! ఆ పసిపిల్లకి వ్యాధినిరోధకత ఇలా అభివృద్ది అవుతుందన్నమాట! “ఏరుకుని తింటే ఏనుగంత బలం” అనే సామెత ఇలా పుట్టినదే. ఈ కధలు కాలక్షేపానికి చుదువుకొనే మరమరాల్లాంటివే. కారణం ఈ కధలన్నీ మానసిక శక్తిని పుంజుకొనేట్లు చేస్తున్నాయి. జీవితం పట్ల ఒక పాజిటివ్ యాటిట్యూడ్ వృద్ది అయ్యేటట్లు బలాన్నిస్తున్నాయి. ఒక యాంటీ బయాటిక్ లా పనిచేసి వ్యాధినిరోదక శక్తిని పెంచుతున్నాయి. కనుక “ప్రమదాక్షరి” లో అక్షరాలు ఏరుకొని తింటే నిజంగానే ఏనుగంత బలం వస్తుంది.

6 thoughts on “ప్రమదాక్షరి – కధామాలిక -2 || తరాలు-అంతరాలు ||

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *