July 1, 2024

అత్తా, ఒకింటి కోడలే…

రచన: నండూరి సుందరీ నాగమణి

“అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు అంతగా ఇష్టపడ్డారు. నువ్వెందుకే కనకం, కట్నం డబ్బు కోసం వియ్యంకుడిని అంత ఒత్తిడి చేస్తున్నావు? మనకేం లేదా, పోదా? మరీ ఇంత ఆశ పనికి రాదు కనకం…” మందలింపుగా అన్నాడు, భద్రయ్య భార్యతో.
“మీకు తెలియదు, నోరు మూసుకోండి. కోడలు ఏం తెచ్చింది అంటే నలుగురిలోనూ ఏం చెప్పుకోవాలి నేను?”
“అలాగని, పాపం ఆ బడిపంతులును అంతగా హైరానా పెట్టాలటే? నీకు కట్నం ఇవ్వటం కోసం అతనికున్న ఎకరం పొలం బేరం పెట్టేసాడట తెలుసా? మరీ అంత మానవత్వం లేకుండా మనం ఉండకూడదే. పెళ్ళి అనేది వాళ్ళమ్మాయికి ఎంత అవసరమో మనబ్బాయికీ అంతే కదా. మన కోడలే మహాలక్ష్మి అనుకుని సహృదయంతో ఆహ్వానిస్తే అరమరికలు లేకుండా కలిసిపోతుంది… నా మాట విను.” నచ్చజెప్పటానికి ప్రయత్నించాడు.
“ఆడపిల్లను కన్న తండ్రి… ఇవన్నీ తప్పదండీ… మనం జాలి చూపించాల్సిన అవసరం లేదు. మనం మగపిల్లాడి తల్లిదండ్రులం…” దర్పంగా అన్నది కనకమ్మ.
‘అవును… ఆరోజు మా నాన్నకూడా ఇలాగే అనుకుని ఉంటే…’ స్వగతంగా గొణుక్కున్నాడు, భద్రయ్య.
***
వాసు, భద్రయ్య కలిసి ఎక్కడో అప్పు పుట్టించి, లక్ష రూపాయలు సంపాదించి, సత్యవతి తండ్రి లక్ష్మణరావు చేత, ఆయన ఎంత వద్దన్నా వినకుండా కనకమ్మకు ఇప్పించారు.
ఆయన భయంగానే అందుకు ఒప్పుకున్నాడు.
డబ్బు చూసిన కనకమ్మ ఎంతో సంబరంగా కొడుకు వాసుకి, సత్యవతికి పెండ్లి జరిపించింది.
***
వారం రోజులేమో ఆనందంగా ఉన్నారు నవదంపతులు. ఆ తరువాత కనకమ్మ సాధింపులు మొదలయ్యాయి. మౌనంగా ఊరుకుంటున్న కొద్దీ కనకమ్మ మరింతగా రెచ్చిపోయి కొత్త పెళ్ళికూతురు అని కూడా చూడకుండా నానామాటలు అంటూ అడ్డమైన చాకిరీ చేయించసాగింది.
తల్లి సంగతి తెలిసిన వాసు, ఆమె అహంకారానికి విరుగుడుగా ఏం చేయాలో భార్యకు చెప్పాడు.
మర్నాడు ఏడైనా నిద్రలేవని కోడలికి వినిపించేలా, పెద్ద శబ్దంతో గిన్నె ఎత్తి పడేసింది కనకమ్మ.
“ఏయ్… ఏమిటీ డిస్ట్రబెన్స్ నాకు? కంటినిండా నిద్రకూడా పోనివ్వవా?” గట్టిగా అరిచింది సత్యవతి.
కొయ్యబారిపోయింది కనకమ్మ. తనకు ఎదురు సమాధానం చెప్పటమే కాకుండా ఏకవచన ప్రయోగం!
“ఏంటే మర్యాద లేకుండా? ఏమనుకుంటున్నావ్ నేనంటే?” కోపంగా అడిగింది.
“అత్తగారివని ఊరుకుంటున్నాను. నన్ను ఏమే అనే ముందు… నేను కూడా నిన్ను అనే అవకాశాన్ని ఇస్తున్నావని గుర్తు పెట్టుకో అత్తమ్మా… అసలు నేనెందుకు లేచి ఇంటిపని చేయాలి? నువ్వున్నావుగా!”
“నేనా? నేనెందుకు పనిచేస్తానే, నువ్వు చెయ్యాలి కానీ…”
“నేను చెయ్యను అత్తమ్మా… ఇవాళ్టినుంచీ నువ్వే చేయాలి. ఎందుకంటే నేను ఊరికే చేతులూపుకుంటూ ఈ ఇంటికి రాలేదు. లక్ష… లక్ష రూపాయలు తీసుకువచ్చాను…” విలాసంగా అన్నది సత్యవతి.
“అయితే ఏమిటి?”
“ఆ రోజుల్లో నువ్వు కట్నంగా ఏమీ తేలేదట కదా! మరి నీకే ఇంత అధికారం ఉంటే, నాకెంత ఉండాలి?”
“ఎవరు చెప్పారు నీకు?”
“నీ స్నేహితురాలు రాజమ్మ చెప్పిందిలే. నిజమా కాదా?”
“ఆ… మా రోజుల్లో కట్నకానుకలవీ ఏమీ లేవు…”
“ఏ రోజుల్లోనైనా మనం వద్దనుకుంటే ఉండవు అత్తమ్మా… ఇదిగో చెప్తున్నాను విను. ఈరోజు నుంచి ఇంటిపని, వంటపని నీదే. నేను ఉద్యోగంలో చేరుతున్నాను. మొత్తం పని చేసి, అణిగి మణిగి ఆకుల్లో పిందెల్లా ఉండండి నువ్వు, మామయ్యా. లేకపోతే మీ మీద కేసు పెడతా…” తర్జని చూపి మరీ బెదిరించింది సత్యవతి.
అయోమయంగా భర్త వైపు చూసింది, కనకమ్మ. “నోరు మూసుకుని ఉండాలని ఇప్పటికైనా తెలిసిందా? కోడలు వచ్చిన తరువాత ఆమెదే అధికారమంతా. మనం వీళ్ళతో ఉండాలో వద్దో నిర్ణయించేది కూడా ఆవిడే. సామరస్యంగా ఉంటే ఉండగలం, లేకుంటే మనదారి మనం చూసుకోవాలి. అర్థం చేసుకుని మసలుకో కనకం…” చెప్పదలచుకున్నది చెప్పేసి, బయటకు వెళ్ళిపోయాడు భద్రయ్య.
పిల్లిలా వంటింట్లోకి నడిచింది, కనకమ్మ.

***

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *