July 1, 2024

జీవనయానం

రచన: మణి గోవిందరాజుల

“నాన్నా! అమ్మ వున్నన్నాళ్ళూ మాకు ఓపికలున్నాయి, అక్కడికి వచ్చి వుండలేమని రాలేదు. పోనిలే ఇద్దరూ ఒకళ్ళకి ఒకళ్ళు వున్నారు కదా అని నేను మాట్లాడలేదు. మన దురదృష్టం అమ్మ వున్నదున్నట్లుగా మాయమయింది” కళ్ళు తుడుచుకున్నాడు అశ్విన్.
“ఇప్పుడు అమ్మలేదు. ఒక్కడివి ఎంత ఇబ్బంది పడుతున్నావో, అని మాకు ఎంత బెంగగా వుంటుందో తెలుసా?” కంఠం రుద్దమయింది అశ్విన్ కి.
“ఇప్పుడు నాకు నేను చేసుకునే ఓపిక వుందిరా. అది కూడా తగ్గాక వస్తాను.”
“అప్పుడొచ్చి ఏమి చేస్తావు నాన్నా? పిల్లల్నాడించే వయసు నీకు దాటిపోతుంది. ‘తాతా’ అని నీ చేయి పట్టుకుని నడిచే వయసు నా పిల్లలకి దాటిపోతుంది. మనవలు మనవరాళ్ళతో గడపాలని నీకు లేదా నాన్నా?”
“అసలు కన్నా వడ్డీ ముద్దు. నీకంటే వాళ్ళే ఎక్కువ నాకు. కాని ఏదో ఇబ్బందిరా? నన్ను బంధించినట్లుగా ఉంటున్నది అక్కడ. మీరు ఒక రకమైన జీవితానికి అలవాటు పడ్డారు. .కాలానుగుణంగా మీరున్నారు. అలాగే ఉండాలి కూడా. కాని నేను అలవాటు పడలేకపోతున్నారా. మన భాష కాదు. మాట్లాడించే వాళ్ళుండరు. ఏదో ఇంతకాలం గడిచింది. ఇంకొంత కాలమైతే ఈ ఆకు రాలి మీ అమ్మను చేరుకుంటుంది” ఆవేదనగా అన్నాడు పరంధామయ్య.
“అక్కడ మన భాష కాదనే కదా నాన్నా, మేము ఇక్కడికొస్తామని చెప్తున్నది” మాటలు పూర్తి కాకముందే …
“దండాలయ్యా!” చెబుతూ లోపలికి వచ్చాడు బక్కడు “చిన్నదొరా బాగుంటిరా?” ఆప్యాయంగా అడిగాడు ఆశ్విన్‌ని.
“బాగున్నాను బక్కా? ఏమి కనపడటం లేదు?” తాను కూడా ఆప్యాయంగా అడిగాడు. ఈ ఇంటికి వచ్చినపుడు వాడికి పదేళ్ళు. ఈ పదిహేను సంవత్సరాలుగా తమ ఇంటినే అట్టిపెట్టుకుని ఉన్నాడు. తండ్రే బలవంతంగా పదో తరగతి వరకు ప్రైవేట్ గా చదివించాడు. ఇక ఆ తర్వాత చదవను, అని మొండికేసుకుని ఈ ఇంటినే కనిపెట్టుకుని ఉన్నాడు.
ఇంతలో లోపలినుండి కాఫీ తీసుకొచ్చిన రంగి, “చిన్నయ్యా వాడికి పెళ్ళి కుదిరింది కదా? ఆ పిల్లెనకాలే తిరుగు తున్నాడు” టీజ్ చేసింది.
రంగి ఇచ్చిన కాఫీ ఇద్దరూ తాగుతుండగానే పరంధామయ్య వయసు వాళ్ళు ముగ్గురొచ్చి లోకాభిరామాయణం మొదలు పెట్టారు. రంగి వాళ్ళకు కూడా కాఫీ తీసుకొస్తానని లోపలికి వళ్ళీంది.
వాళ్ళను చూడగానే తండ్రి మొహంలో కనపడిన వెలుగు, తమదగ్గరున్న మూడు నెలలలో ఎప్పుడూ లేదన్న సంగతి గుర్తొచ్చింది ఆశ్విన్‌కి.
కొద్దిసేపు కూర్చుని వాళ్ళు వెళ్ళిపోయారు. భోజనాల వేళ అయిందని రంగి వచ్చి చెప్పింది. లేవబోతుండగా బాగా దూరపు చుట్టం ఒకాయన వచ్చాడు. సరే అతన్ని కూడా భోజనానికి లేవమని ముగ్గురూ భోంచేసారు. భోజనాలయ్యాక వాళ్ళిద్దరూ కొద్దిసేపు లోకాభిరామాయణం మాట్లాడుకుని పడుకుంటామని నడుం వాల్చారు.
అలా ఊళ్ళో తిరిగొద్దామని వెళ్ళాడు అశ్విన్. దార్లో పలకరిస్తున్నవారందరికీ సమాధానం చెప్తూ కాసేపలా తిరిగి చీకటిపడుతుండగా ఇంటికి వచ్చిన అశ్విన్ భోంచేసి పడుకున్నాడే కాని నిద్ర పట్టలేదు.
పరంధామయ్య అన్నపూర్ణలకు అశ్విన్ అర్చన ఇద్దరు పిల్లలు. పరంధామయ్యది తరతరాలుగా వ్యవసాయ కుటుంబం. పరంధామయ్య ఒక్కడే సంతానం. ఆయన బాబాయిలు మేనత్తలు అందరూ ఆయన చిన్నతనం లోనే పై చదువులకు పట్నాలెళ్ళి అక్కడే ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు. కాని పరంధామయ్య మటుకు ఆ నేల తల్లినే నమ్ముకుని ఉన్న రెండెకరాల పొలాన్ని సాగు చేసుకుంటూ ఉన్నంతలో పిల్లల్ని బాగా చదివించాడు.. పిల్లలిద్దరూ కూడా మంచి చదువులు చదువుకుని విదేశాల కు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన కొత్తల్లోనే తల్లినీ తండ్రినీ తీసుకెళ్ళి అమెరికాలో ముఖ్య మైన ప్రదేశాలన్నీ చూపించారు. ఏడాది క్రితం తల్లి చనిపోయింది.తల్లి ఉండగా ఎన్నిసార్లు వచ్చి తమతో పాటు ఉండమని బలవంతం చేసినా రాలేదు. తల్లి పోయాక తండ్రిని తమతో పాటు అమెరికా రమ్మంటే రానన్నాడని, తనే ఇండియా రావడానికి నిశ్చయించుకున్నాడు అశ్విన్. అయితే మళ్ళీ అమెరికా వచ్చే అవకాశం ఉండదని, అక్కడ ఉండగానే తండ్రిని పిలిపించుకున్నాడు కొడుకు మనసు నొప్పించలేక అమెరికా వెళ్ళిన పరంధామయ్య, అక్కడ బలవంతాన ఉండి మూడు నెలలకే తిరిగొచ్చేసాడు. ఇప్పుడు ఇండియా వచ్చేస్తాను, తమతో ఉండాలని బతిమాలు తున్న కొడుకుకు రాననే సమాధానం చెప్తున్నాడు పరంధామయ్య. ఆలోచిస్తూ పడుకున్న ఆశ్విన్‌కి ఎప్పటికో నిద్ర పట్టింది.
మర్నాడు పొద్దున్న లేచేసరికే తండ్రి పొలానికి వెళ్ళిపోయాడు. రంగి ఇచ్చిన కాఫీ తాగి స్నానం చేసాక టిఫిన్ చేసి తను కూడా పొలం బయలు దేరాడు అశ్విన్. పొలమెళ్లేసరికి తండ్రి పాలేర్లందరికీ పనులప్ప చెప్తూ హుషారుగా కన పడ్డాడు. పాలేరు ఏదో అన్నదానికి నవ్వుతున్న తండ్రి మొహం చూసేసరికి తండ్రిని రమ్మని బలవంతం చేస్తూ తనే మన్నా తప్పు చేస్తున్నాడా, అన్న ఆలోచన వచ్చింది అశ్విన్ కి. కొడుకుని చూసిన పరంధామయ్య కొబ్బరి బోండాలు తెమ్మని బక్కడికి చెప్పి దగ్గర్లో ఉన్న చెట్టుకింద ఉన్న మంచం మీద కూర్చుని, రమ్మని అశ్విన్ కి చెయ్యూపాడు. వచ్చి పక్కన కూర్చున్న అశ్విన్ చేతిని చేతిలోకి తీసుకుని,
“చూడు అశ్విన్… నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉందిరా! నా పెంపకం మీద నాకు ఆనందంగా ఉంది. తల్లి తండ్రులను పట్టించుకోని వాళ్ళున్న ఈ రోజుల్లో నీ కెరిర్ కూడా ఆలోచించకుండా నా కోసం వచ్చేస్తానంటున్నావు. నీకు తగ్గదే నీ భార్యా.. చాలా సంతోషం. కాని ఒక్కటాలోచించు. నాలుగు రోజులనుండి ఇక్కడ ఉండి అన్నీ చూస్తు న్నావు. నేను ఎలా ఉన్నాను? భారంగా గడుపుతున్నానా? లేదే… మీ అమ్మ పోయిందన్న బాధ కూడా నాకు లేదు. ఎవరమైనా పోవలసిన వాళ్ళమే.కాని దేవుడు ఆమెని ముందు పిలిపించుకున్నాడు. నా టైం ఎప్పుడో వస్తుంది. కాని పోయే లోపల నిస్సారంగా ఎవరికీ ఉపయోగం లేకుండా పోవాలని లేదురా? నిజమే తగ్గే వయసు. ఈ రోజున్న ఓపిక రేపుండదు. ఈ సంవత్సరం బానే ఉండొచ్చు. కాని వచ్చే ఏడు ఇంత ఓపిక ఉండకపోవచ్చు. కాని ఈ సంవత్సరం ఆనందంగా గడుపుతాను కదా? ఆ తర్వాత చూదాము ఏమి జరుగుతుందనేది….నా దగ్గర ఆనందం ఉండదా అంటావేమో. ఎవరికైనా పిల్లల కంటే ఎక్కువ ఏదీ కాదు, ఆనందంగా గడపడానికి. కాని వెనకటి లాగా లేవురా రోజులు. వెనక మీ తాతయ్యా, బామ్మా వాళ్ళు మా దగ్గ ఉన్నారంటే ఇంటినిండా మనుషులుండేవారు. ఒంటరితనం ఉండేది కాదు. నేను ఎక్కడ తిరిగినా ఇంట్లో చూసుకోవడానికి మీ అమ్మా, చిన్న పిల్లలైన మీరూ, వచ్చీ పోతూ పలకరించే చుట్టాలు… అదో సందడిగా కాలం గడిచేది. కాని ఇప్పుడలా కాదు. మీరంతా మీ మీ పనుల మీద బయటికి వెళ్తే తిరిగి మీ దర్శన భాగ్యం కలిగేది రాత్రికే. మీ అమ్మ ఉంటే అదో తీరు. రాత్రి వరకు నేనొక్కణ్ణీ అలవాటు లేని టీవీ పెట్టుకుని కూర్చొని కాలక్షేపం చేయాలంటే ఎంత కష్టం? పలకరించే మనిషి లేని జీవితము జైలే కదరా? అరే! నాన్నా… మీరు కాక నాకింకెవరున్నార్రా? ఇప్పుడు నువు అర్జెంటుగా నీ ఇల్లూ ఉద్యోగమూ అన్నీ వదులుకుని వస్తే ఇక్కడ ఏమి చేయగలవు? మనకున్న రెండెకరాల పొలంతో ఆ రోజుల్లో కాబట్టి అన్ని బాధ్యతలని తీర్చుకోగలిగాను. కాని ఇప్పుడు జీవించడమే ఖరీదయినది. అందుకని నువు తొందరపడకు. నిన్ను రావొద్దని నేను అనను. జననీ జన్మభూమి.కాని ఒకసారి వచ్చాక ఎందుకొచ్చామా అని పశ్చాత్తాప పడకూడదు. నీకు మంచి అవకాశాలు వచ్చినపుడు రా. ఈ జీవనయానం ఇలా సాగనివ్వు. ఇక్కడ నా కోసం ఎదురు చూసేవాళ్ళు, నా గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు. బెంగ పడకు” అనునయంగా చెప్తున్న తండ్రిని ఏమీ అనలేకపోయాడు అశ్విన్.
కొబ్బరి బోండాలు కొట్టుకొచ్చిన బక్కడు ఆ మాటలు విన్నాడు. “చిన్న దొరా! పెద్దయ్య గురించి మీరు అస్సలు బెంగ పడమాకండి. నేను ఉన్నాను కదా?” కొట్టిన బోండాం చేతికిస్తూ చెప్పాడు.
“నువున్నావనే నా ధైర్యం రా. నాన్నను జాగ్రత్తగా చూసుకో. అన్నట్లు మీ ఆవిణ్ణి చూపించలేదు?” నవ్వుతూ అడిగాడు.
“రేపు తీసుకొస్తానయ్యా!” సిగ్గుపడుతూ బుర్ర గోక్కుంటూ వెళ్ళిపోయాడు బక్కడు.
“అదిరా సంగతి. ఎప్పుడు నాకు ఇబ్బంది అనిపించినా తప్పక మీ దగ్గరికే వస్తాను. కానీ అంత అవసరం రాదనే అనుకుంటున్నాను. ఈసారికి మాత్రం కొన్నాళ్ళు వదిలెయ్యి”
తండ్రి చెప్తున్న మాటలు వింటుంటే నిజమే, కదా అనిపించింది. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఇప్పుడు ఉన్న వారున్నట్లుగా తామొస్తే అద్దె ఇల్లూ, ,పిల్లల చదువులూ,పై ఖర్చులూ… ఆలోచిస్తే భయమేసేంత పరిస్తితి. అలాగని తండ్రిని ఒంటరిగా వదిలి పోవడానికి మనస్కరించడం లేదు. అందరూ లక్జరీగానే బతగ్గలరా, అంటే కాదు కాని ఒకసారి అక్కడికెళ్ళాక లైఫ్ స్టైల్ మారిపోతుంది.లేదా మారిన లైఫ్ స్టైల్ కి అలవాటు పడిపోతాము. అదొక సాలె గూడు. ఇక అందులో నుండి బయటకు రాలేము.లోపల ఉండడానికి కొట్టుకోవాలి. కొంతన్నా సంపాయించుకుని వస్తే కాని ఇక్కడ గడపలేము. అక్కడే ఉండి తండ్రి ఒప్పుకుంటే అక్కడికి తీసుకెళ్దామన్నా వీసా?. మళ్లీ ఆరునెలలకు తిరిగి ఇండియా రావాలి. అప్పటికి ఇక్కడకు వచ్చి ఉన్నా, అంతా మళ్ళీ మొదటికి వస్తుంది. మధ్యతరగతి వారిది ఎంత విషాదకరమైన పరిస్తితి? తలితండ్రులను దగ్గర ఉంచుకుందామన్న కోరిక ఉన్నా, ఉంచుకోలేని పరిస్తితి. కొడుకుని తన ఆలోచనకే వదిలి తన పనిలో తాను పడ్డాడు పరంధామయ్య.
“నాన్నా! నేను ఇంటికి వెళ్తున్నాను.” తండ్రికి వినపడేట్లుగా కేకేసి ఇంటికి బయలుదేరాడు అశ్విన్. తండ్రి రాడు. తాను రాలేడు. ఏమి చేయాలి? ఆలోచిస్తూ నడుస్తున్న అశ్విన్ ఇంటికి ఎప్పుడు చేరుకున్నాడో గమనించలేదు. గేటు తీసుకుని లోపలికి వస్తూ తలెత్తి ఇంటిని చూసాడు. ఎప్పుడూ ఇంటినిండా చుట్టాలున్నా చెరగని చిరునవ్వుతో అందరినీ ఆదరించే తల్లి జ్ఞాపకం మదిని నింపింది. ఇంటిచుట్టూ పరుగులు పెడుతూ,రకరకాల ఆటలు ఆడిన తమ బాల్యం గుర్తొచ్చింది. కాసేపు కోపం, కాసేపు అలకలతో చెల్లితో గడిపిన మధురమైన కాలం గుర్తొచ్చింది. నిన్న తన చుట్టూ పదిమందినేసుకుని కూర్చుని నవ్వుతూ వారితో మాట్లాడుతున్న తండ్రి కళ్ళముందు కనపడ్డాడు. ఆ మధ్య అమెరికా తన దగ్గరికి వచ్చి ఉన్న తండ్రి గదిలో బందీ లాగా కూర్చొని తామొచ్చేవరకు ఎదురు చూడడం గుర్తొచ్చింది. ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా మనసు తేలిక పడ్డది అశ్విన్ కి.
ఇంతలో చేతిలో సెల్ మోగింది… అర్చన… “అన్నా! నాన్న ఏమన్నారు? వస్తానన్నారా?” ఆతృతగా అడిగింది.
“లేదు అర్చనా… రానన్నారు” చెప్పాడు అశ్విన్.
“నీకేమి చెప్పారా? ఎలాగో ఒకలా ఒప్పించు అన్నానా?” విసుక్కుంది అర్చన.
“నాన్న చెప్పిన దానిలో కూడా లాజిక్ ఉన్నదే… మొన్న నాన్న అక్కడికి వచ్చినప్పుడు, ఒకే దేశంలో ఉన్నా, నువెన్ని సార్లు వచ్చి నాన్నని కలవగలిగావు?”
“రెండు సార్లు” సిన్సియర్ గా చెప్పింది.
“అక్కడ ఉన్నప్పుడు మా దోవన మేము వెళ్ళిపోతే, నాన్న ఎలా ఉన్నారో చెప్తుంటే బాధేసిందే…మన ఆఫీసూ మనమూ… మన బిజీ జీవితమూ… అవి కూడా మనకు తప్పించుకోలేని బాధ్యతలే కదా? ఈ నాలుగు రోజులనుండి చూస్తున్నాను కదా? నాన్నకు పదేళ్ళు తగ్గినట్లుగా ఉన్నారు. ఇక్కడ ఏదో వ్యాపకం ఉంటుంది. అక్కడికి వస్తే ఏమీ లేదు కదా? అందుకే అది చూడటానికే నన్ను నాలుగు రోజులు ఉండటానికి రమ్మన్నట్లున్నారు. సో నాన్న ఇప్పుడు రారు…నా ఇండియ షిఫ్టింగ్ కూడా నాకు అక్కడి సిటిజన్ షిప్ రాగానే చేస్తాను. ఈ లోపల మనం మధ్య మధ్య వద్దాము. నీకు కుదిరినా కుదరక పోయినా నేను వస్తాను… ప్రస్తుతానికి ఇవే సంగతులు” చెప్పాడు అశ్విన్.
“మాకు తెలిసిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏదో ఒక వ్యాపకం పెట్టుకుంటూ హాయిగా ఉంటున్నారు. నాన్న కూడా అలా ఉండొచ్చు కదా? హాయిగా ఇద్దరం ఇక్కడే ఉన్నాము”
“ఎన్నాళ్ళుండగలరే? ఆరునెలల తర్వాత మళ్లీ తిరిగి రావాల్సిందే కదా? అదీకాక అందరూ ఒకేలాగా ఉండరు కదా? ఒక్కొక్కళ్ళు ఒక్కో తత్వము. పిల్లలుగా మన బాధ్యత వాళ్ళను ఆనందంగా ఉంచటము. అందుకే ఇక నాన్నను బలవంతం చేయ దల్చుకోలేదు. ఇక్కడ ఉన్నా హాయిగా ఉండే ఏర్పాట్లు చేద్దాము. ఉంటానే ఇక.” ఫోన్ ఆపేసాడు.
మర్నాడు పొద్దున్నే కాబోయే భార్యను తీసుకుని వచ్చాడు బక్కడు. ఆ అమ్మాయి కూడా చలాగ్గా ఉన్నది.
“మా చిన్న దొర! అయ్యా, కావేరి” అని పరిచయం చేసాడు బక్కడు.
వెంటనే కొంగు తల మీంచి కప్పుకుని “దండాలు చిన్నదొరా” అంటూ అశ్విన్ కాళ్ళకు, బక్కణ్ణి కూడా కలుపుకుని దండం పెట్టింది.
“చిన్నదొరా! తమరేమీ దిగులు పడకండి. పెద్దయ్యను కంటికి రెప్పలా చూసుకుంటాము. మీరేమీ దిగులు పడమాకండి” చెప్పింది ఆప్యాయంగా.
ఆ మాటలు వినగానే ఆనందం అనిపించింది అశ్విన్ కి. ఏదో గుర్తొచ్చినట్లుగా జేబులోనుండి ఒక కవర్ తీసి ఇచ్చాడు. “బక్కా! మీ ఇద్దరూ బట్టలు కొనుక్కోండి. కావేరీ. నల్లపూసల గొలుసు కొనుక్కో” అంటూ వాళ్ళిద్దరి చేతుల్లో ఆ కవరు పెట్టాడు.
“ఇంక బయలుదేరాలిరా నువ్వు” చెప్పాడు పరంధామయ్య.
బాగ్ చేతిలోకి తీసుకున్నాడు అశ్విన్. “నాన్నా! నేను వెళ్ళోస్తాను. నీ ఇష్టం. నీ మనసుకు ఎలా నచ్చితే అలా ఉండు.ఏ మాత్రం ఆరోగ్యం బాలేకపోయినా నాకు చెప్పడానికి ఆలోచించవద్దు. ఏ సమయం లో నైనా నీకు మేమున్నాము. నలుగురికీ ఉపయోగపడాలన్న నీ కోరికకి నా వంతు సాయం కూడా నేనందిస్తాను. ఇది మాత్రం కాదనడానికి వీల్లేదు. మేము చాలా తొందరలోనే నువన్నట్లుగా మంచి అవకాశాలు చూసుకుని వస్తాము.” తండ్రి కాళ్ళకు దణ్ణం పెట్టి ప్రయాణానికి సిద్దమవుతూ చెప్పాడు అశ్విన్.

శుభం

1 thought on “జీవనయానం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *