July 1, 2024

బాలమాలిక – పసి మనసు

రచన: కాశీ విశ్వనాథం పట్రాయుడు

సీతాలు, నర్సింహులు భార్యాభర్తలు. వారికి ఒక్కగానొక్క కొడుకు శీను. నర్సింహులు వ్యవసాయ కూలీ. శీను పుట్టిన ఏడాదికే రోడ్డు ప్రమాదంలో నర్సింహులు చనిపోయాడు. అప్పటి నుంచి పుట్టింట్లో ఉంటూ కాలం వెళ్లదీస్తోంది సీతాలు.

ఆ రోజు ఆగస్టు 15. ఊళ్ళో ఎక్కడ చూసినా మూడురంగుల జెండాలు రెపరెపలాడుతున్నాయి. దుకాణాలన్నీ దేశభక్తి భావాన్ని పెంపొందించే స్టిక్కర్లు, రబ్బరు బ్యాండ్లు రకరకాల ఆకృతుల్లో దర్శనమిస్తున్నాయి. వాటిని పిల్లలంతా డబ్బులిచ్చి కొనుక్కుంటున్నారు.

పాఠశాల ప్రాంగణమంతా మూడు రంగుల జెండాలతో ముస్తాబైంది. ప్రతీ పిల్లాడి చేతిలో ప్లాస్టిక్ జెండా ఎగురుతూ ఉంది.

ప్రతీ పిల్లాడు తన చొక్కా జేబుకి జెండా కాగితాన్ని పెట్టుకుని ‘జయహో భారత్! జయహో భారత్!’ అంటూ ఉల్లాసంగా ఉత్సాహంగా పరుగులు తీస్తున్నారు.

ఆరోజు ఉదయం నుంచి స్కూల్ గేటు దగ్గర నిలబడి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని గమనిస్తున్నాడు శీనుగాడు.

స్టిక్కర్ పెట్టుకోడానికి చొక్కా లేదు. పోనీ పట్టుకుని పరుగులు తీద్దామంటే జెండాలు లేవు. ‘నేను కూడా చదువుకుని ఉంటే మా అయ్యా అమ్మా కొనేవారేమో. అయ్య వార్లు చాక్లెట్లు ఇచ్చేవారేమో’ అని మనసులో అనుకుంటూ ఉండగానే కళ్లంట నీళ్ళు కారాయి శీనుకి.
అటుగా వస్తున్న కాశీ మాష్టారు శీనుని దగ్గరికి తీసుకుని చాక్లెట్లు ఇచ్చారు. బడిలోకి తీసుకు వెళ్లి రెండు జెండాలు ఇచ్చి “ఏరా శీనూ, రేపటి నుంచి బడికి వస్తావా?” అని అడిగారు.

“వస్తాను మాష్టారు, వస్తాను మాష్టారు” అని ఏడుస్తూ కళ్ళు తుడుచుకుంటూ చెప్పాడు.

పొద్దెక్కినా నిద్రలేవలేదని గమనించిన సీతాలు, శీను దగ్గరికి వెళ్లింది. శీను ఏడుస్తూ చెప్తున్న మాటలన్నీ విని, కొడుకు కోరికను తెలుసుకుంది. కొడుకుని నిద్రలేపింది. శీనుకు వచ్చిన కల గురించి అడిగి తెలుసుకుంది.
చక్కగా స్నానం చేయించి ఎర్ర తువ్వాలు ఒంటికి చుట్టింది. నుదుటిపై మూడు రంగుల బొట్టు పెట్టింది. రెండు జెండాలు చేతికిచ్చి “రేపటినుంచి నువ్వు బడికి వెళ్ళు” అని చెప్పి బుగ్గమీద ముద్దిచ్చింది.

మూడు రంగుల జెండాల మధ్య మెరిసిపోతున్న కొడుకుని చూసి, “రెపరెపలాడుతూ ఎగురుతున్న జెండాకున్నంత ఠీవి ఉండాలి… అంత ఎత్తుకు ఎదగాలి” అని కొడుకుని ఆశీర్వదించింది సీతాలు.
జెండాలు పట్టుకుని “మాతా జయహో, భారత్ మాతా జయహో.” అంటూ ఊరంతా తిరిగాడు శీను. కొడుకు కళ్ళల్లో ఆనందం చూసి మురిసిపోయింది సీతాలు.

రేపటి బంగారు భవిష్యత్తు కోసం కొడుకుని బడికి పంపించింది సీతాలు. శీను బుద్ధిగా చదువుకుని ఉన్నత చదువులు పూర్తి చేశాడు. అనంతరం నావికా దళంలో ఉద్యోగం సంపాదించాడు. దేశసేవలో తరిస్తూ అందరి మన్ననలు పొందాడు. అంతటి దేశభక్తుడైన కొడుకును చూసి మురిసిపోయింది, భారతమాతతో పాటుగా అతన్ని కన్న సీతాలు కూడా.

(సమాప్తం)

1 thought on “బాలమాలిక – పసి మనసు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *