July 1, 2024

మధ్యతరగతి మందహాసం – నవలా సమీక్ష

రచన: మంగు కృష్ణకుమారి
నవల పేరు: మధ్యతరగతి మందహాసం
రచయిత్రి: పి సత్యవతి

శ్రీమతి పి సత్యవతిగారు చాలా అభ్యుదయ భావాలతో ఉంటారు. అలాగే రాస్తారు కూడా. చాలా డెప్త్ ఉండేలా సాగుతుంది ఆమె రచన.
పాతకాలంలో… జ్యోతి, స్వాతి, విజయలాంటి పుస్తకాలకి అనుబంధ నవలలు వచ్చేవి. అలా వచ్చినది ఈ మధ్యతరగతి మందహాసం. మొదటి పేజీలోనే ఆమె డాక్టర్ సినారె గారికి క్షమాపణలతో ఈ పేరు వాడుకున్నాను అని చెప్పేరు.
కథంతా అమ్మాయి చెపుతున్నట్టే ఉత్తమపురుషలో సాగుతుంది.
ఒక మధ్యతరగతి గృహస్థుకి మొదటిభార్య ఆడపిల్లని కని చనిపోతే మళ్ళా పెళ్ళి చేసుకుంటాడు. ఆ పాపని ఈ మొదటి భార్య తండ్రి తామే పెంచుతామని తీసుకెళ్ళిపోతాడు.
ఈ రెండో భార్యకి నలుగురు పిల్లలు.
మొదట ఇద్దరు కొడుకులు. తరవాత ఇద్దరు కూతుళ్ళు. ఈ పెద్దకూతురు పెద్దయి తన వేపునించీ కథ చెప్తూ ఉంటుంది.
విజయవాడలో మంచి సెంటర్లో సొంత ఇంట్లో కాపురం వీళ్ళది. వీళ్ళ మేనమామే వీళ్ళింటి వ్యవహారాలు నడుపుతూ ఉంటాడు. చాయ, చదువూ తక్కువగా ఉన్న కూతురుని రెండో కొడుకు సుధాకర్ కి ఇచ్చి చేయాలని మనసులో కోరిక అతనికి. ఎందుకంటే రెండో కొడుకు తెలివైనవాడు. బేంకు ఉద్యోగి.
పెద్దకొడుకు మనోహర్ – నోట్లో నాలిక లేని మంచివాడు. టెంపరరీ ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఈ మేనమామకి అతని చెల్లి రాచమర్యాదలు చేస్తూ ఉంటుంది.
పిల్లలందరికీ ఈ మేనమామ జోక్యం ఒళ్ళు మంటగా ఉంటుంది. రెండో కొడుకు తల్లిని హెచ్చరిస్తూ ఉంటాడు కూడా.
ఈయన మొదటి భార్య కూతురుకి పెళ్ళయిపోతుంది. ఇక్కడే ఒక అన్యాయం ఆ అమ్మాయికి జరుగుతుంది. రెండో ‌భార్య చెడ్డది కాదు.
కూతురంటే ప్రేమున్న గృహస్థు పిల్లని తాతగారింట వదిలిస్తాడు. అలాగే ఆ భార్య వందతులాల బంగారం కూడా మాజీ భార్య తండ్రి తీసుకొని, ‘చిన్నపిల్ల పెళ్ళికి వచ్చినపుడు ఇచ్చేస్తాం’ అంటాడు. అలాగే అనుకొని ఈ అసలు తండ్రి పెళ్ళి సంబంధం కుదిర్చేస్తాడు. తీరా పెళ్ళికి ముసలాయన బంగారం పిసరు కూడా ఇవ్వడు. అమ్మాయి అత్తగారు మండిపడుతుంది. భర్త కూడా భార్యని బంగారం తేలేదన్న కోపంతో హింసిస్తూ ఉంటాడు.
ఆ బంగారం అంతా… ఈ ముసలాయన తన కీప్ కి ఇచ్చేసేడని తాపీగా తెలుస్తుంది. ఇందరి మధ్యా ఆ అమాయకపు
ఆడపిల్ల నలిగిపోతుంది. ఆమెకి మొదట ఒక ఆడపిల్ల. రెండో పురిటికి ఈ సవతితల్లి దగ్గరకి వస్తుంది.
సవతి తల్లికి బంగారం అంతా ఆ అమ్మాయి తాత మండబెట్టేడన్న కోపం ఉంటుంది. కానీ కథ చెప్పే పెద్దకూతురు, సుధాకర్ అక్కకి అండగా మాటాడతారు. రెండో పిల్ల పుట్టిన తరవాత అత్తారింటికి వెళ్ళడం ఆమె బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది.
‘పిల్లలిద్దరినీ మీరే పెంచాలి కొన్నాళ్ళపాటు’ అని వియ్యపురాలు… ఈ సవతి తల్లికే ఇచ్చేస్తుంది.
పిల్లలని చూసి జాలిపడి ఈ సవతి తల్లి బాగానే చూస్తూ ఉంటుంది. అంతకుముందే పెద్దకొడుకు మనోహర్ కి తులసి అన్న తెలివైన అమ్మాయితో పెళ్ళవుతుంది.
ఈ తులసి చాలా తెలివైనది. కోడలిగా వచ్చి ఇంట్లో చాలా మార్పులు తెస్తుంది. ‌ముఖ్యంగా ఈ మేనమామకి విలువ ఇవ్వడం తగ్గించేస్తుంది. భర్తకి చాలా ప్రోత్సాహం ఇచ్చి మంచి ఉద్యోగాలకి ప్రిపేర్ చేయిస్తుంది. తన జీతంలో దాచి అతన్ని ఇంటర్వ్యూలకి పంపుతుంది. ఆడపడుచుని ఉద్యోగం చేయమని ప్రోత్సహిస్తుంది. తనకి టైమున్నపుడు ఈ పసిపాపలని ముద్దుచేస్తుంది.
అయినా అత్తగారికి కోడలంటే కోపమే… చిన్నకొడుకు, మేనమామ కూతురుని పెళ్ళిచేసుకోనని చెప్పేస్తాడు. అప్పుడే ఈ తల్లికి కేన్సర్ వస్తుంది.
ఆమె జబ్బుకి ఇల్లు అమ్మేస్తారు. ఈ మేనమామ ఎంతో విలువైన ఇంటిని కారుచవకగా అమ్మించి తనే కొంటాడు. తన కూతురుని పెళ్ళి చేసుకుంటే ఆ ఇల్లు కట్నంగా ఇస్తానని రెండో కొడుక్కి చెప్తాడు. అయినా అతను ఆ అమ్మాయిని చేసుకోడు.
అప్పటికి ఈ సవతికూతురు భర్త కాస్త మారతాడు. భార్య చచ్చిపోయిన తరవాత పశ్చాత్తాపం వస్తుంది. అతన్ని ఈ కథ చెప్పే అమ్మాయి చెల్లెలు కోరి పెళ్ళిచేసుకుంటుంది.
పెద్దకొడుక్కి మంచి ఉద్యోగం వస్తుంది. ఈ పెద్దమ్మాయి అన్నయ్య స్నేహితుడిని పెళ్ళి చేసుకుంటుంది.
తల్లి‌ కేన్సర్ తో చనిపోతుంది. తండ్రి వికలమనస్కుడై, ఆ కొడుకు దగ్గరకీ ఈ కూతురు దగ్గరకీ తిరుగుతు ఉంటాడు. సుధాకర్ తన కొలీగ్ ని పెళ్ళి చేసుకుంటాడు.
నేను పేర్లు మరచిపోయేను. ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేసే రోజుల్లో వచ్చిన నవల.
ఒక మధ్యతరగతి కుటుంబం ఎన్నో ఇక్కట్లు పడి ఆర్థికంగా పతనం అవుతూ… మళ్ళా తేరుకోడం… ఈ నేపథ్యంలో ఒక అమాయకురాలు అందరి ధనకాంక్షల మధ్యా చనిపోడం… ఇవన్నీ సత్యవతి గారు సమర్థవంతంగా రాసేరు.
మనకి తెలిసిన మనుషుల మధ్య తిరుగుతున్నట్టే ఉంటుంది చదువుతూ ఉంటే…
***

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *