July 1, 2024

సుందరము సుమధురము –13

రచన: నండూరి సుందరీ నాగమణి

1961 లో విడుదల అయిన ‘వాగ్దానం’ అనే చిత్రానికి ప్రముఖ మనసు కవి, పాటల రచయిత శ్రీ ‘ఆత్రేయ’ గారు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ప్రముఖ బెంగాలీ రచయిత శ్రీ శరత్ చంద్ర చటర్జీ రచించిన ‘వాగ్దత్త’ అనే నవల ఆధారంగా నిర్మింపబడింది. కవితాచిత్ర పతాకం పైన నిర్మించిన ఈ చిత్ర నిర్మాతలు – శ్రీ కె సత్యనారాయణ మరియు శ్రీ డి శ్రీరామమూర్తి గారలు. దీనికి శ్రీ పెండ్యాల నాగేశ్వరరావు గారు సంగీత దర్శకత్వం వహించగా, నేపథ్య గానం శ్రీ ఘంటసాల మాస్టారు, శ్రీమతి పి సుశీల, శ్రీమతి బి వసంత, శ్రీ పిఠాపురం నాగేశ్వరరావు, శ్రీమతి ఎస్ జానకి, శ్రీమతి సరోజిని గారలు పాడారు. పాటల రచయితలుగా, శ్రీశ్రీ గారు, దాశరథి గారు, నార్ల చిరంజీవి గారు, ఆత్రేయ గారు వ్యవహరించారు.
చిత్ర కథానాయికానాయకులుగా కృష్ణకుమారి, అక్కినేని నాగేశ్వరరావు గారలు నటించగా ఇతర ప్రముఖ పాత్రలలో గిరిజ, గుమ్మడి, చలం, నాగయ్య, రేలంగి వెంకట్రామయ్య, సూర్యకాంతం, పద్మనాభం, సురభి కమలాబాయి నటించారు. చిత్రం బాక్సాఫీసు వద్ద ఆట్టే విజయం సాధించలేకపోయినా, పాటలు మాత్రం చాలా పేరుపొందాయి. చక్కని సంగీత సాహిత్యాలతో కూడిన ఈ చిత్రగీతాలు పాడుకోవటానికి, వినటానికి ఎంతో వినసొంపుగా ఉంటాయి. ఇదివరకే నేను ‘సుందరము సుమధురము’ శీర్షికలో ఈ చిత్రంలోని ‘నా కంటిపాపలో నిలిచిపోరా…’ అనే గీతాన్ని విశ్లేషించటం జరిగింది.
ఈ సంచికలో శ్రీశ్రీ గారు రచించిన రాగమాలిక, హరికథ – శ్రీ సీతారామ కల్యాణం గురించి వివరించాలని అనుకుంటున్నాను. దృశ్యపరంగా పాటలో కృష్ణకుమారి పయనిస్తున్న బండి చక్రం ఒక గుంటలో ఇరుక్కుపోతే, కథానాయకుడైన అక్కినేని గారు దాన్ని పైకి తీస్తుంటారు. మరో ప్రక్క గుడిలో శ్రీ సీతారామ కళ్యాణ హరికథాకాలక్షేపం జరుగుతూ ఉంటుంది. హరికథా భాగవతార్ గా శ్రీ రేలంగి వెంకట్రామయ్య గారు, మృదంగ విద్వాన్ గా పద్మనాభంగారు, వయొలీన్ విద్వాంసురాలిగా శ్రీమతి సూర్యకాంతం గారు మనకు కనిపిస్తారు. వీరంతా, నిజమైన విద్వాంసుల వలెనే ఆయా సంగీతపరికరాలను వాయిస్తూ, మనకు తమ తమ హావభావాలతో పాటలో జీవించారన్న భావన మనకు కలుగుతుంది.
ముందుగా పాట సాహిత్యం, అర్థవివరణ చూద్దాము.
శ్లోకం:
శ్రీ నగజా తనయం సహృదయం || శ్రీ ||
చింతయామి సదయం త్రిజగన్మహోదయం || శ్రీ ||
(హరికథా సంప్రదాయంలో కథకు ముందుగా పాడే శ్లోకం ఇది… వినాయకుని స్తుతి.)
వచనం:
శ్రీరామ భక్తులారా! ఇది సీతాకళ్యాణ సత్కథ 40 రోజుల నుంచి చెప్పిన కథ చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకొస్తున్నాను అంచేత, కించిత్ గాత్ర సౌలభ్యానికి అభ్యంతరం ఏర్పడినట్లు తోస్తుంది. నాయనా… కాస్త పాలు మిరియాలు ఏవైనా…
(ఇక్కడ అభినయిస్తున్నది శ్రీ రేలంగి గారు… వారి సహజహాస్య ధోరణి ప్రతిబింబించేలా శ్రీ ఘంటసాల మాష్టారు తన గొంతులో ‘నాయనా! కాస్త పాలూ మిరియాలు ఏవైనా…’ అని పలికిస్తారు, వింటున్న మనకు నవ్వు వచ్చేలా… వెంటనే ఆయన కథలో లీనమై ఎంతో గంభీరంగా పాడతారు. అదే మాస్టారి గొంతులోని విశిష్టత.)
చిత్తం! సిద్ధం…
భక్తులారా! సీతామహాదేవి స్వయంవరానికి ముల్లోకాల నుంచి విచ్చేసిన వీరాధివీరుల్లో అందరిని ఆకర్షించిన ఒకే ఒక్క దివ్య సుందర మూర్తి. ఆహ్హా! అతడెవరయ్యా అంటే…

రఘురాముడు రమణీయ వినీల ఘనశ్యాముడు
రమణీయ వినీల ఘనశ్యాముడు
వాడు నెలఱేడు సరిజోడు మొనగాడు
వాని కనులు మగమీల నేలురా, వాని నగవు రతనాలు జాలురా || వాని కనులు ||
వాని జూచి మగవారలైన మైమరచి
మరుల్ కొనెడు మరోమరుడు మనోహరుడు
రఘురాముడు రమణీయ వినీల ఘనశ్యాముడు
(అతడు రఘురాముడు… రమణీయమైన నీలపు రంగులోని మేఘపు వన్నె కలవాడు. వాడు చంద్రుడితో సమానమైన వాడు,
మొనగాడు… వాని కనులు చేపల వంటివి, వాని నగవు రతనాల జల్లు వంటిది… ఒక్క మాటలో చెప్పాలి అంటే వాని జూచి మగవారలైనా ప్రేమలో పడిపోయేటంత మరొక మన్మథునితో సరిసమానమైన వాడు, మనసులను హరించేవాడు… అతడు రఘురాముడు…)
సనిదని, సగరిగరిగరిరి, సగరిరిగరి, సగగరిసనిదని,
సగగగరిసనిదని, రిసనిద, రిసనిద, నిదపమగరి రఘురాముడు
ఔను ఔను
సనిసా సనిస సగరిరిగరి సరిసనిసా పదనిసా
సనిగరి సనిస, సనిరిసనిదని, నిదసనిదపమ గా-మా-దా
నినినినినినిని
పస పస పస పస
సపా సపా సపా తద్ధిమ్ తరికిటతక
శభాష్, శభాష్

వచనం:
ఆ ప్రకారంబున విజయం చేస్తున్న శ్రీరామచంద్రమూర్తిని అంతఃపుర గవాక్షం నుండి సీతాదేవి ఓరకంట చూచినదై
చెంగటనున్న చెలికత్తెతో…

ఎంత సొగసుగాడే ఎంత సొగసుగాడే
మనసింతలోనె దోచినాడే ఎంత సొగసుగాడే
మోము కలువఱేడే… ఏ… మోము కలువఱేడే
నా నోము ఫలము వీడే! శ్యామలాభిరాముని చూడగ నామది వివశమాయె నేడే
ఎంత సొగసుగాడే
(ఇది సీతాదేవి తన మనోభావాలను, చెంతనున్న చెలికత్తెతో పంచుకుంటున్న వైనం: ఆహా ఎంత అందమైన వాడే… ఇంతలోనే నా మనసును దోచాడే… ఆయన ముఖం చూసావా, కలువ రేడైన చందమామే కాదటే? నా నోము ఫలము వీడేనే… ఈ శ్యామలాభిరాముని చూడగానే నా మనసు వివశమైనదే…)
వచనం:
ఇక్కడ సీతాదేవి ఇలా పరవశయై యుండగా, అక్కడ స్వయంవర సభామంటపంలో జనక మహీపతి సభాసదులను జూచి,

అనియెనిట్లు ఓ యనఘులార! నా యనుగుపుత్రి సీత !
వినయాధిక సద్గుణవ్రాత ముఖవిజిత లలిత జలజాత
ముక్కంటి వింటి నెక్కిడ జాలిన ఎక్కటి జోదును నేడు
మక్కువ మీరగ వరించి మల్లెల మాలవైచి పెండ్లాడు ఊ… ఊ… ఊ…

(సభలోని వారినుద్దేశించి, జనకుడు ఇలా అంటున్నాడు. ఓ పవిత్రమైన మనసు గలవారలారా! ఇదిగో ఇది నా అనుగుపుత్రి
సీత… వినయాధికమైన సద్గుణవ్రాత, లక్ష్మీదేవివంటి ముఖము కలిగిన చక్కని కన్య… ఆ శివుని విల్లును ఎక్కుపెట్టగలిగిన
వీరుడిని ఈరోజున వరించి, మల్లెల మాలను వేసి, పెండ్లాడుతుంది…)
వచనం:
అని ఈ ప్రకారం జనక మహారాజు ప్రకటించగానే సభలోని వారందరు ఎక్కడివారక్కడ చల్లబడిపోయారట. మహావీరుడైన రావణాసురుడు కూడా, “హా ! ఇది నా ఆరాధ్యదైవమగు పరమేశ్వరుని చాపము, దీనిని స్పృశించుటయే మహాపాపము” అని అనుకొనిన వాడై వెనుదిరిగిపోయాడట. తదనంతరంబున…

ఇనకుల తిలకుడు నిలకడగల క్రొక్కారు మెరుపువలె నిల్చి
తన గురువగు విశ్వామిత్రుని ఆశీర్వాదము తలదాల్చి
సదమల మదగజగమనము తోడ స్వయంవర వేదిన చెంత
మదన విరోధి శరాసనమును తన కరమున బూనినయంత

(సూర్యవంశములో జన్మించిన గొప్ప కుమారుడైన శ్రీరాముడు, తొలకరి వర్షాకాలంలో మెరిసే మెరుపువలె నిలిచి, అక్కడే ఉన్న తన గురువైన విశ్వామిత్రుని ఆశీర్వాదాన్ని తలదాల్చి, చక్కని గజగమనముతో ఆ స్వయంవర వేదిక చెంత నిలిచి, మదన విరోధియైన ఆ శివుని విల్లును తన చేతిలోకి తీసుకోగానే…)
(సదమల మదగజ గమనము తోడ అనే పంక్తులు పాడుతున్నప్పుడు శ్రీ రేలంగి గారి అభినయం అనన్యసామాన్యం. ఈ పద్యంలో విల్లును, శరము యొక్క ఆసనంగా అభివర్ణించటం చాలా బాగుంటుంది.)

ఫెళ్ళుమనె విల్లు గంటలు ఘల్లుమనే
గుభిల్లుమనె గుండె నృపులకు
ఝల్లుమనియె జానకీ దేహము…
ఒక నిమేషమ్ము నందే
నయము, జయమును, భయము విస్మయము గదురా
ఆ… శ్రీ మద్రమారమణ గోవిందో హరి…
(అతి చక్కని శబ్దాలంకారము… విల్లు ఫెళ్ళుమని విరిగిందట, గంటలు ఘల్లుమని మ్రోగాయట. రాజుల గుండెలు భయముతో
గుభిల్లుమన్నాయట, జానకీదేహము పరవశంతో ఝల్లుమనెనట… ఒక్క నిమిషంలో నయము, జయము, భయము,
విస్మయము గదురా… చక్కని ఈ పద్యాన్ని శ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి గారు రచించిన ‘శివ ధనుర్భంగము’ అనే గ్రంథం
నుండి తీసుకున్నారట.)
(ఇదివరలో నేను విశ్లేషించిన ‘రాముని అవతారం రఘుకుల సోముని అవతారం’ – అనే పాటలో కూడా చక్కని
క్రమాలంకారం ఉంటుంది… మీకు గుర్తుండే ఉంటుంది, అయినా చదవని వారికోసం…
ధనువో, జనకుని మనసున భయమో, ధారుణి కన్యా సంశయమో…
దనుజులు కలగను సుఖ గోపురమో… విరిగెను మిథిలానగరమున
– అది శివధనువో, జనకుని మనసున కల్గిన భయమో, సీత యొక్క సంశయమో, రాక్షసులు కలగను సుఖగోపురమో ఇవన్నీ ధనుస్సుతో పాటుగానే విరిగిపోయాయట! ఇది సముద్రాల వారి రచనాచమత్కృతి!)

వచనం:
భక్తులందరు చాలా నిద్రావస్థలో ఉన్నట్లుగా ఉంది!
(ఇక్కడ ఘంటసాల మాస్టారు తనగొంతులో నవ్వును కలిపి అంటారు… ఎంత బాగా అంటారో…)
మరొక్కసారి…
జై! శ్రీ మద్రమారమణ గోవిందో హరి…
భక్తులారా ! ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి శివధనుర్భంగము కావించినాడు అంతట…

భూతలనాథుడు రాముడు ప్రీతుండై పెండ్లియాడె
పృథు గుణమణి సంఘాతన్ భాగ్యోపేతన్ సీతన్ || భూతల ||
(భూమికి పతియైన శ్రీరాముడు, ఎంతో ప్రీతితో పెండ్లాడాడు – భూమాత యొక్క గుణాల సమూహాన్ని కలిగియున్న భాగ్యశాలి సీతను…
ఈ అద్భుతమైన పద్యాన్ని పోతన మహాభాగవతం నుండి తీసుకున్నారు.)
శ్రీ మద్రమారమణ గోవిందో హరి!

ఈ రాగమాలికను వరుసగా కానడ, శంకరాభరణం, మోహన, తోడి, కేదారగౌళ, కళ్యాణి రాగాలలో స్వరపరచారు. శ్రీ పెండ్యాల నాగేశ్వరరావు గారి సంగీత ప్రతిభకు, ఈ హరికథ దర్పణం పడుతుందనటంలో ఎంతమాత్రమూ అతిశయోక్తి లేదు.

మరి ఇంత మధురగీతాన్ని వెంటనే వింటూ, వీక్షించవద్దూ? రండి మరి, ఈ లింక్ క్లిక్ చేయండి.

వచ్చే సంచికలో మరో మధురమైన గీతాన్ని గురించి చర్చించుకుందాము.

***

1 thought on “సుందరము సుమధురము –13

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *