June 28, 2024

క్షమించు నాన్నా!

రచన: మంగు కృష్ణకుమారి

సదా నవ్వుతూ కూల్ గా ఉండే చక్రపాణి చాలా డల్ గా ఉన్నాడు. అతని దుఃఖం కొడుకులు ముగ్గురూ చూసేరు.
చక్రపాణి సెక్రటేరియట్ లో సెక్షన్ ఆఫీసరు. చాలా క్రమశిక్షణ పాటించే వ్యక్తి. అతని దగ్గర ఎలాటి ఆటలూ సాగవనీ, ఇటు స్టాఫ్ కీ అటు కో వర్కర్లకీ‌ కూడా తెలుసు. అతని నిజాయితీని తట్టుకోలేక, అతన్ని ఇంటర్నల్ గా ట్రాన్సఫర్ చేయించేవారు కొందరు పలుకుబడి ఉన్నవాళ్ళు. ఇలాటి వాటికి జడిసే రకం కాదు చక్రపాణి. అతని‌భార్య పద్మావతి అతనికి తగ్గది. సద్దుకుపోయి సంసారంచేసే తరహా. ఇంటిపనులూ, పిల్లలకీ భర్తకీ, కావలసినవి సమకూర్చడం ఆమెవంతు. పిల్లలకు నడతా, క్రమశిక్షణా, విద్యాబుద్ధులూ, నీతీ, నిజాయితీ మప్పడం చక్రపాణి బాధ్యత.
కొడుకులు ముగ్గురూ తమ తండ్రిగురించి, తమ ఇంటి పద్ధతుల గురించీ చాలా గొప్పగా చెప్పుకొనేవారు. ఈ క్రమంలో ముగ్గురూ ఇంచుమించూ ఒకేసారి టీన్ ఏజ్లోకి వచ్చేరు.
పెద్దవాడు శ్రీరామ్ బిఎస్సి ఫైనల్.
రెండోవాడు అభిరాం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్… ఆఖరివాడు జయరాం ఇంటర్ ఫస్ట్ ఇయర్ లోకి వచ్చేరు. రకరకాల ఆకర్షణలు. మనసు కొంచెం అటు మొగ్గు చూపించేది‌ ముగ్గురికీ. అయినా… తండ్రి నేర్పిన విలువలు బుద్ధిని పట్టి ఉంచేవి.
ఇలా ఉన్నపుడు ఓరోజు చక్రపాణి ఎనలేని దుఖభారంతో ఎవరితోనీ మాటాడకుండా… తన గదిలో మంచం మీద వాలి ఉండటం అందరూ గమనించేరు.
“ఆఫీసు టైము దాటినా, మీనాన్న ఇలా కదలకుండా ఉన్నారు. ఏమయిందో?” పద్మావతి పిల్లలతో అన్నాది.
పెద్ద కొడుకు శ్రీరామ్ దిగాలుగా తమ్ముడు అభినవ్ తో అన్నాడు.
“నిన్న రమ్యతో ఒక మాల్ లో నవ్వుతూ మాటాడుతుంటే, ముగ్గురు పెద్దవాళ్ళు ముందుకు వెళ్ళడం చూసేను. బాగా దూరం వెళిపోయేరు.‌ ఒకాయన అచ్చం‌ మన నాన్నలాగే అనిపించింది. ఏమో! నాన్న చాలా పద్ధతయిన మనిషి. నా ప్రవర్తన నచ్చక ఇలా దుఖిస్తున్నారేమో”
రెండో కొడుకు అభిరాం కూడా సిగ్గుతో, “నేనో తప్పు చేసేను అన్నయ్యా! మా కాలేజ్ తరపున జిల్లా క్రికెట్ పోటీలకి ఒక టీమ్ ని పంపిస్తున్నారు. మా ఫ్రెండ్స్ అందరం దానిమీద మాటాడుకున్నాం. మాటమీద మాట పెరిగి ఆవేశంలో బెట్ అంటే ఓకే అనేసాను.”
“నాన్నకి చెప్పేవా?”
“అమ్మో! నాన్నకే! కానీ అప్పుడు అక్కడ వినయ్ గాడు ఉన్నాడు. వాడు వాళ్ళ నాన్నకి అన్నీ మోస్తాడు. ఆయనా, మన నాన్న బెస్ట్ ఫ్రండ్స్ కదా! నిన్న నాన్న అమ్మతో, వాళ్ళింటికి వెళ్తాను అనడం విన్నాను. అప్పటినించీ భయంగా ఉంది.”
అప్పుడే మూడో కొడుకు జయరామ్, అటువేపు వచ్చేడు. “ఏరా! ఏదయినా ఘనకార్యం చేసేవా! నాన్న అంత దుఃఖంగా‌ ఉన్నాడు?” అన్నాడు శ్రీరామ్.
జయరామ్ తలదించుకున్నాడు.
“ఏరా! మాటాడవ్?” శ్రీరామ్ గట్టిగా అన్నాడు.
“ఏం లేదన్నయ్యా! మా శేషు వాళ్ళ బేచ్ ఎప్పుడూ నన్ను వాళ్ళ పార్టీలకి రమ్మంటారు. నేను వెళ్ళను. నిన్న సుమన్ గాడి పుట్టినరోజని బలవంతంగా లాక్కెళ్ళేరు. ఒట్టు అన్నయ్యా! నేను అసలు తాగొద్దనే అనుకున్నాను! కోక్ లో ఏదొ కలిపి ఇచ్చేసారు. అర గ్లాసుడు కూడా తాగకుండా పక్కకు పడేసాను. గబ గబా ఇంటికి వచ్చేసాను. కాలింగ్ బెల్ నొక్కేసరికి, నాన్నే
తలుపు తీసేడు”
“పోల్చేసే ఉంటాడు” అభిరామ్ ఆందోళనగా అన్నాడు.
“ఏమో చిన్నన్నయ్యా! ‘ఎక్కడనించి?’ అని అడుగుతూ ఉంటే ఏదో గొణిగి లోపలికి వచ్చేసాను” చిన్నబుచ్చుకున్నమొహంతో అన్నాడు జయరామ్.
శ్రీరామ్ ఆలోచిస్తూ కూచున్నాడు. కొంచెంసేపటి తరవాత అన్నాడు “పదండి అభీ, జయా… మనంవెళ్ళి‌ నాన్నకి క్షమాపణ చెప్పాలి” అంటూ లేచేడు.
చిన్నవాడు జయరామ్, “నేనే కదా తప్పు చేసేను!” అంటూ ఉంటే‌ అభిరాం “మేమూ చేసేం! పద పద” అన్నాడు.
ముగ్గురూ తండ్రి గదిలోకి వెళ్ళేసరికి తల్లి పద్మావతి మజ్జిగ గ్లాస్ తొ లోపలకి వస్తున్నాది. చక్రపాణి కళ్ళు ఇంకా ఎర్రగా ఉన్నాయి.
శ్రీరామ్ బుర్ర వంచుకొని “నాన్నా! నన్ను క్షమించు. మొన్న మాల్ లో నాతో మాటాడుతున్న అమ్మాయి రమ్య. ఓసారి మనింటికి వచ్చింది కూడా! నాకు ఏ దురుద్దేశం, ఆ అమ్మాయి మీద లేదు. ఇకమీదట ఎప్పుడూ ఇలా తనని కలవను” అన్నాడు.
అభిరామ్ “నాన్నా! మొదటిసారిగా ఆవేశంలో ‘బెట్’ అని పక్కవాళ్ళు కవ్విస్తుంటే నేను కూడా ‘యా! బెట్ ఓకె’ అన్నాను. నాది తప్పే! అందరికీ చెప్పేస్తా! ఏ బెట్టింగ్ లోనీ నేను ఉండనని” అన్నాడు.
జయరామ్ “నాన్నా! అమ్మ మీద ఒట్టు. ఆ రోజు జరిగిందేమిటంటే” అంటూ పూసగుచ్చినట్టు చెప్పేడు. చక్రపాణి కళ్ళు తుడుచుకుంటూ ముగ్గురు కొడుకులనీ పిలిచేడు. ఇద్దరు మంచం మీదా, ఒకరు కుర్చీలో కూచున్నారు.
“చూడండి. మీరు ధైర్యంగా మీ తప్పులు ఒప్పుకున్నారు. ఒప్పుకోడంతో పాటు దిద్దుకొడం ముఖ్యం.” శ్రీరామ్ పక్కచూసి అన్నాడు.
“శ్రీ! ఈ రోజుల్లో ఓ ఆడపిల్లతొ మాల్ కి వెళ్ళడం చాలా కామన్ అవొచ్చు. ఒక్కసారి ఆ అమ్మాయి వేపునించీ ఆలోచించు. ఆ అమ్మాయి నీ మీద ఆశలు పెట్టుకోవచ్చు. లేకపొతే ఆ అమ్మాయి తల్లితండ్రులు ఆ అమ్మాయిని తిట్టొచ్చు. ఏదయినా జరగొచ్చు. ఆ ఛాన్స్ ఇవ్వడం తప్పే! మరోసారి చేయకు”
శ్రీరామ్ మాటాడలేదు.
“అభీ! నీ వయసెంత? బెట్టింగ్ అన్నది ఎంత నీచ నికృష్టపు సరదావో తెలుసా? అసలు ఆ తరహా సరదాలున్న వాళ్ళతో స్నేహమే తప్పు. బోధపడిందా?”
అభిరామ్ కంటనీరు పెట్టుకున్నాడు.
“ఏం జయా, ఒక వయసులో ఈ మందు పార్టీలకి వెళ్ళడమే ఒక గొప్ప‌ మగతనం కింద ఫీల్ అవుతారు మగపిల్లలు. ఇలాటి విషయాలు నేను మీకు ఎన్నోసార్లు చెప్పేను. ఇంకోసారి పక్కవాళ్ళ మొహమాటాలకి అంతగా లొంగకు” జయరామ్ ముందే హడలి ఉన్నాడు.
తండ్రి ముగ్గురినీ ఉద్దేశించి అడిగేడు, “ఏమర్రా! మీ వేపునించీ ఏమన్నా చెప్పాలా?” శ్రీరామ్ తమ్ముళ్ళకి సైగ చేసి చెప్పేడు.
“నాన్నా! మాటిస్తున్నాను.‌ ఇంకోసారి నా ప్రవర్తన వల్ల నువ్వు కంటనీరు పెట్టాల్సిన అవసరం రాదు” కోరస్ లాగ అభీ, జయా తండ్రికి అదే వాగ్దానం చేసేరు.
తండ్రి చిరునవ్వు నవ్వుతూ “వెళ్ళండర్రా! మీ పనులు చూసుకోండి. పద్మా… ఇవాళ భోజనాలకి పరమాన్నం చెయ్యి.”
అన్నదమ్ములు ముగ్గురూ తేటపడ్డ మొహాలతో వెళ్ళేరు.
పద్మావతి ఆశ్చర్యంగా “దీనికా మీరు ఇంతగా దుఖపడుతున్నారు?” అంది.
“మగపిల్లలని ఈ వయసులో కాస్కోడం చాలా అవసరం పద్మా! ఏముందిలే, ఓసారి మందలిస్తే అయిపోదా,
అనుకుంటే చెయ్యి దాటేస్తారు.‌ సమాజంలో అంత దరిద్రగొట్టు వాతావరణం ఈ వయసు మగపిల్లలకి ఉన్నాది. తల్లి తండ్రులు
పిల్లలని హోల్డ్ చేయాల్సిన వయసు ఇదే! ఎవరింటి వాతావరణం బట్టీ పిల్లల మనస్తత్వం బట్టీ తల్లితండ్రుల స్పందన ఉండాలి. మన పిల్లలకి ఇదే సరయిన గుణపాఠం” చక్రపాణి చెప్తూ ఉంటే పద్మ “అవునండీ! ముందు ఈ మజ్జిగ తాగండి” అంటూ మజ్జిగ గ్లాసు‌ చేతికి అందించింది.
***

1 thought on “క్షమించు నాన్నా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *