July 5, 2024

అమ్మమ్మ – 58

రచన: గిరిజ పీసపాటి

ఇదేమో చాలా చిన్న గ్రామం. డాక్టర్ కాదు కదా కనీసం మెడికల్ షాప్ కూడా లేదు. తను ఇంకా ఉంటే తను బాధ పడడంతో పాటు, అందరినీ బాధ పెట్టాలి. పైగా అక్కడ అమ్మ తమ కోసం ఎదరుచుస్తూ ఉంటుంది. అమ్మమ్మ ఇంట్లో ఉంటే పరవాలేదు. ఒకవేళ వంట పనికి వెళ్ళిపోయిందంటే ఒక్కర్తే రాత్రిళ్ళు ఇబ్బంది పడాలి.
ఇన్ని ఆలోచనలతో గుండెల్లో విపరీతమైన దడ వస్తోంది. పైకి మాత్రం చాలా మామూలుగా ఉన్నట్లు నటిస్తోంది.
అక్క, తమ్ముడు ఇద్దరూ రామనేసరికి కళ్ళంట గిర్రున నీళ్ళు తిరగగా “ప్లీజ్ అక్కా! కావాలంటే నన్ను దింపేసి, మళ్ళీ మీరు రండి” అంది గిరిజ బతిమాలుతున్నట్లుగా.
“సరే! ఊరి నుండి బయలుదేరేవాళ్ళు ఎవరైనా ఉన్నారేమో నాన్నని కనుక్కుని చెప్తాను. కాసేపాగు” అంటూ తండ్రి దగ్గరకు శాలలో ఉన్న పోస్ట్ ఆఫీస్ గదిలోకి వెళ్ళింది వసంత.
అరగంట తరువాత తిరిగి వచ్చి నాన్న నిన్ను రమ్మంటున్నారు అని చెప్పడంతో తండ్రి దగ్గరకు వెళ్ళింది. తండ్రి బిజీగా ఉండటంతో అక్కడే ఉన్న బెంచీ మీద కూర్చుంది. ఆయన కాస్త హడావుడి తగ్గాక “ఇవాళ ఎవరూ వైజాగ్ వెళ్ళేవారు లేరు చిన్నతల్లీ! ఇప్పుడు ఎవరికైనా కబురు పెడదామన్నా అందరూ పొలాలకి వెళ్ళిపోయారు. రేపటికైతే ఎవరినైనా బెత్తయిస్తాను”
“పైగా బాబు తన పిల్లలతో పాటు అక్కకి మాత్రమే బట్టలు పెట్టాడు. తమ్ముడికి మగపెళ్ళివారు కాశీ ప్రయాణం సందర్భంలో బట్టలు పెట్టారు. నీకొక్కర్తికే బట్టలు ఎవరూ పెట్టలేదు. మధ్యాహ్నం పోస్ట్ పని అయాక బొబ్బిలిలో మీటింగ్‌కి వెళ్ళాలి. వస్తూ నీకు పంజాబీ డ్రస్ కొని తెస్తాను. అది తీసుకుని రేపు ఫస్ట్ బస్‌కి బయలుదేరి వెళ్ళు. అమ్మకి, గణేష్ గారికి నేను ఫోన్ చేసి చెప్తాను” అనడంతో ‘సరే’నన్నట్లుగా తలవూపి మౌనంగా ఇంట్లోకి వచ్చేసింది గిరిజ.
ఆ రోజు రాత్రికి తండ్రి బొబ్బిలి నుండి వస్తూ పసుపు రంగు పంజాబీ డ్రస్ కొని తెచ్చి చేతికి ఇస్తూ “తాతకి తెలియ నివ్వకు సుమా!” అని హెచ్చరించారు. డ్రస్ చూసి “చాలా బాగుంది నాన్నా” అంటూ తను మర్నాడు పట్టుకెళ్ళే బాగ్‌లో సర్దుకుంటూ “రేపు నన్ను తీసుకెళ్ళడానికి ఎవరినైనా అడుగుతానన్నారు?” అడిగింది ప్రశ్నార్ధకంగా.
“బయలుదేరుదువులే. అందరినీ కనుక్కుంటున్నాను. కాకపోతే ఫస్ట్ బస్‌కి అవకపోవచ్చు. కాఫీలు తాగాక గానీ, మధ్యాహ్నం భోజనాలు అయ్యాక గానీ బయలుదేరుదువుగాని” అంటూ స్నానానికి వెళ్ళారాయన.
‘ఎవరైనా ఫరవాలేదు కానీ చుట్ట తాగేవాళ్ళు కాకపోతే చాలు’ అనుకుంటునే తన ఆలోచనకి తానే నవ్వుకుంది.
ఈ ఊరిలో ఆడవాళ్ళతో సహా కాయ కష్టం చేసుకునే ప్రతీ ఒక్కరికీ చుట్ట లేదా బీడీ తాగే అలవాటు ఉంది. ఆడవారైతే ఏకంగా అడ్డ పొగ (నిప్పు ఉన్న వైపు నోట్లో పెట్టుకుని) కాలుస్తారు. నాన్న పొలం పనులకు వెళ్ళిపోయారు అని ఉదయం అన్నారంటే తనకు సాయం వచ్చేది ఖచ్చితంగా చుట్ట తాగేవారే అవుతారు. సందేహమే లేదు.
బ్రాహ్మణ వీధి నుండి ఎవరైనా బయలుదేరే వాళ్ళు ఉంటే బాగుండును. ఆడవాళ్ళు ఉంటే పక్కపక్కనే కూర్చుంటాము కనుక కొంచెం కాలక్షేపం కూడా అవుతుంది. ఇలా సాగిపోతున్నాయి గిరిజ ఆలోచనలు. ఇంతలో “రమణలూ! భోజనానికి రా!” అంటూ మామ్మ కేక వినబడే సరికి ఆలోచనలు కట్టిపెట్టి, పెరట్లోకి నడిచింది.
ఆ రాత్రి భోజనాలయ్యాక పిల్లలందరూ చాలాసేపు ‘దొంగ-పోలీస్’ ఆట ఉత్సాహంగా ఆడుతున్నా ఒంట్లోని అనారోగ్యం వల్ల తను ఆడలేనని చెప్పి నిద్రకు ఉపక్రమించింది. మూసిన రెప్పల మాటు నుండి కూడా కనుపాపల్లో పోట్లు వస్తూ, పెదవులు లాగేస్తూ నరకం చూసింది. ఎప్పటికైనా తెల్లవారితే వైజాగ్ వెళ్ళిపోవచ్చు. వెళ్ళగానే అమ్మని ముందర డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళమని అడగాలి.
మొత్తానికి తెల్లవారుజామున నాలుగు గంటలకు పెరటి తలుపులు తెరుస్తున్న చప్పుడు వినపడగానే లేచి పెరటి వైపు నడిచింది. “అప్పుడే లేచావేం? కాసేపు పడుకోలేకపోయావా?” అని అడిగిన మామ్మతో “నిద్ర పట్టడం లేదు మామ్మా!” అంటూ నీళ్ళు కాగుతున్న డేగిసా లోంచి ఒక పళ్ళ పుడక తీసుకుని పళ్ళు తోముకుని, స్నానం కూడా పూర్తి చేసేసింది.
నాలుగున్నర అయేసరికి ఆడవాళ్ళు లేచి వచ్చి, పనుల్లో పడడంతో, వాళ్ళను గమనిస్తూ పెరటి గచ్చు వాకిలి మీద కూర్చుంది. పూర్తిగా వెలుగు వచ్చాక మేనత్త గిరిజను చూసి “ప్రయాణానికేనేంటే? అప్పుడే రెడీ అయిపోయావు?” అని అడిగింది నవ్వుతూ. అవునన్నట్లు తల ఊపింది గిరిజ.
“సరదాగా అందరితో కలిసి మరో రెండు రోజులు గడపి వెళ్ళొచ్చు కదా!” అందావిడ ఆప్యాయత, నిష్టూరం కలగలసిన స్వరంతో.
“సెలవులు అయిపోయాయి అత్తా!” అంది ఇబ్బందిగా చూస్తూ.
“మీ అమ్మ కూడా వచ్చి ఇక్కడే ఉంటే ఎవరు కాదన్నారు? ఏంటో వీడిక్కడ, మీరక్కడ? సరే! మీ నాన్నని ఎన్నింటికి బయలుదేరాలో కనుక్కుని వస్తానుండు” నిట్టూరుస్తూ పెద్దన్నగారి కోసం వెళ్ళింది
పది నిముషాలలో వచ్చి “నాన్న ఇంట్లో లేడు. బహుశా అలా పొలాల వైపో, చెరువు గట్టు వైపో వెళ్ళి ఉంటాడు. రాగానే చెప్తాను. ఈలోగా కాఫీ తాగి, జడ వేసుకో” అంటూ చిన్న వంటింట్లోకి వెళ్ళి స్వయంగా కాఫీ తీసుకొచ్చి గిరిజ చేతికిచ్చింది. ఇంతలో పిల్లలంతా లేచి బిలబిలలాడుతూ బయటకు రావడంతో సందడి నెలకొంది.
గిరిజ కాఫీ తాగి జడ వేసుకుంటుండగా తండ్రి, తండ్రి వెనకే గిరిజ క్లాస్‌మేట్ హరి అనే అబ్బాయి వచ్చారు లోపలికి. ఆ అబ్బాయి వైజాగ్ నుండి తమ ఊరు వస్తాడని ఏమాత్రం ఊహించని గిరిజ పలకరించడం కూడా మర్చిపోయి ఆశ్చర్యపోయి చూస్తూ ఉండిపోయింది.
వైజాగ్‌లో ఆ అబ్బాయే కాక అతడి తల్లిదండ్రులు కూడా తమ ఇంటికి వస్తూ ఉంటారు. అక్క హాస్పిటల్ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు ప్రతీరోజూ ఉదయాన్నే టిఫిన్ చేసి ఈ అబ్బాయి చేత పంపిస్తూ, సాయంత్రాలు చూడడానికి వచ్చేవారట. కాకపోతే నిజంగానే గిరిజకు పరిచయం తక్కువ.
అందుకు ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది తనకి ఉద్యోగంతోనే ఉదయం నుండి రాత్రి వరకు
సరిపోతుంది. రెండవది స్వతహాగా గిరిజ బిడియస్తురాలు కావడంతో త్వరగా ఎవరితోనూ కలవదు. ముఖ్యంగా మగ
పిల్లలతో మాట్లాడడం అంటే మరీ ముడుచుకుపోతుంది.
పేరుకి ఆ అబ్బాయి గిరిజ క్లాస్‌మేట్ అయినా గిరిజతో కన్నా మిగిలిన వారితోనే చనువు ఎక్కువ. ఇంతలో “హాయ్ హరీ! ఇదేనా రావడం? ఎలా ఉంది మా ఊరు?” అంటూ నీళ్ళ పొయ్యి దగ్గర నుండి కేక పెట్టింది వసంత. నాని గబ గబా వచ్చి “మన గేంగ్ అంతా అక్కడున్నారు. రా!” అంటూ హరి చెయ్యి పట్టుకుని నీళ్ళ పొయ్యి దగ్గరకు లాక్కు పోయాడు.
ప్రశ్నార్ధకంగా తననే చూస్తున్న గిరిజతో “ఇక్కడి నుండి బయలుదేరే వాళ్ళు ఎవరూ లేకపోవడంతో మీ అమ్మకి ఫోన్ చేసి విషయం చెప్తే, నిన్ను తీసుకెళ్ళడానికి హరిని పంపిస్తానని చెప్పింది” అంటూ కాసేపాగి “మరొక్క మాట చిన్నతల్లీ? ఆ అబ్బాయి ఇప్పుడే వచ్చాడు. ఒక్కరోజైనా ఇక్కడ ఉండమనకపోతే బాగోదు.”
“మీ అమ్మ గణేష్ గారితో నీ సెలవులు పెంచమని చెప్పిందట. ఆయన కూడా ‘సరే’నన్నారట” అంటూ ఆయన చెప్పిన మాటలకు బిత్తరపోయి ‘బాబోయ్! ఇంకో రోజా!?’అనుకుంటూ మౌనంగా ఉండిపోయింది మరేం మాట్లాడలేక.
ఆ రోజంతా పిల్లలందరూ కలిసి తమ పొలాలు, తోటలు మొత్తం హరికి చూపించారు. అందరూ హరిని ఆదరంగా చూసారు. పాపమ్మ గారి వంటలు చాలా నచ్చాయి హరికి. ముఖ్యంగా పల్లెటూరి గురించి వినడమే తప్ప చూడని ఆ అబ్బాయి బాగా ఎంజాయ్ చేస్తున్నాడు.
సాయంత్రం జీడి తోటకి వెళ్ళడానికి ప్లాన్ చేసారు పిల్లలంతా. దాదాపు మూడు మైళ్ళ దూరంలో ఉంటుంది ఆ తోట. ఆ తోటకు వెళ్ళాలంటే స్మశానం మీంచి వెళ్ళాలి. అక్కడే పెచ్చెరువుగా పిలువబడే పెద్ద చెరువు ఉంది. సాయంత్రం ఆ వైపు వెళ్ళడానికి వీల్లేదని పాపమ్మగారు గట్టిగా చెప్పడంతో “సరే మామ్మా! అలా బొడ్డమాని గుడ్డి వరకు వెళ్ళి వచ్చేస్తాములే. జీడి తోటకు వెళ్ళము” అంది వసంత.
ఆవిడ “సరే చీకట్లు ముసురుకోక ముందే వచ్చేయాలి” అనడంతో అందరూ బొడ్డమాని గుడ్డి వైపు దారి తీసారు. దారిలో ఉన్న చింత తోపులోంచి నడుస్తుంటే చల్లని గాలి ఆహ్లాదపరుస్తోంది. సరదాగా కబర్లు చెప్పుకుంటూ… దారిలో దొరికే ఊట పళ్ళు, పరింపళ్ళు, బలిజ పళ్ళు, గురివింద గింజ ప్రమాణంలో ఉండే చిన్న వాక్కాయలు, వాక పువ్వులు, ఈత కాయలు తింటూ నడవసాగారు.
బొడ్డమాని గుడ్డికి చేరగానే కళ్ళకు ముందుగా కనిపించింది కనకాంబరం పువ్వుల మడి. విరబూసిన కనకాంబరాలతో వీళ్ళకు స్వాగతం పలుకుతున్నట్లుగా తలలూపుతున్నాయి పూలు. ఇంతలో ఆ గుడ్డి కాపరి నాయుడు వచ్చి పలకరించి, “వెళ్ళేటప్పుడు పూలు ఇస్తాను. తీసుకెళ్ళండమ్మా!” అన్నాడు.
అందరూ నేల నూతి దగ్గరకు చేరి, కాపరితో ఏతాం వెయ్యమని చెప్పారు. అతను ఏతాం కర్ర మీదుగా నూతి మధ్య వరకూ నడుచుకుంటూ వెళ్ళగానే ఆ కర్రకు వేలాడుతున్న ఇనుప డొప్ప లాంటిది నీటిలోపలి వెళ్ళింది. ఇతను తిరిగి కర్ర మీదుగా నడుస్తూ నూతి వద్దకు రాగానే పైకి వచ్చింది. దానిని చేది, వీళ్ళకు అందించాడు అతను.అందరూ నేల నూతి దగ్గరకు చేరి, నాయుడుతో ఏతాం వెయ్యమని చెప్పారు.
అతను ఏతాం కర్ర మీదుగా నూతి మధ్య వరకూ నడుచుకుంటూ వెళ్ళగానే ఆ కర్రకు వేలాడుతున్న ఇనుప డొప్ప
లాంటిది నీటిలోపలి వెళ్ళింది. ఇతను తిరిగి కర్ర మీదుగా నడుస్తూ నూతి వద్దకు రాగానే పైకి వచ్చింది. దానిని చేది,
వీళ్ళకు అందించాడు అతను. అందరూ దోసిళ్ళు పట్టి ఆ నీటిని కడుపు నిండా తాగారు. ఈ నూతి నీరు చల్లగా, కొబ్బరి నీళ్ళలా తియ్యగా ఉంటాయి.

***** సశేషం ******

1 thought on “అమ్మమ్మ – 58

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *