July 7, 2024

అలనాటి తారలు – రమణారెడ్డి (హాస్యనటుడు)

రచన: సుజాత తిమ్మన

సన్నగా, పొడుగ్గా, చూడగానే హాస్యరసం ఉట్టి పడే విధంగా ఉన్న ఆనాటి హాస్య నటుడు రమణారెడ్డి గారి అసలు పేరు తిక్కవరపు వెంకట రమణారెడ్డి. రమణారెడ్డి 1921, అక్టోబర్ ఒకటవ తేదీన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, జగదేవిపేటలో జన్మించారు.
నెల్లూరులో సానిటరీ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తూ, శని, ఆది వారాల్లో మద్రాసు వెళ్ళి సినిమాల్లో వేషం కోసం ప్రయత్నం చేసేవారు. 1951 లో A. శంకరరెడ్డి గారు ‘మాయపిల్ల’ సినిమా నిర్మిస్తూ, అందులో రమణారెడ్డికి హాస్య పాత్ర ఇచ్చి ప్రోత్సహించారు కానీ, ఆ సినిమా సరిగా ఆడలేదు. తరువాత అనేక చిత్రాలలో చిన్న చిన్న పాత్రలు పోషించినా మొదట ‘బంగారుపాప’ చిత్రం ద్వారా ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. పిదప ‘మిస్సమ్మ’ చిత్రంలో ‘డేవిడ్’ పాత్రతో అతనేంటో అందరికీ తెలిసివచ్చింది. సినిమాలలో వేషాలు విరివిగా రావడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిగా సినిమాల మీదే దృష్టి కేంద్రీకరించారు.
రమణారెడ్డి గారికి మ్యాజిక్ అంటే అభిమానం. అందువలన మ్యాజిక్ లో డిప్లమా కూడా చేశారు. కొద్దిగా ఖాళీ దొరికితే మ్యాజిక్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండేవారు. ఆ నిధిని ధర్మకార్యక్రమాలకు ఉపయోగించేవారు.
ఆయనలో ఉన్న ప్రత్యేకత సన్నగా ఉండటం. ఎంత వయసు వస్తున్నా ఆ సన్నదనం పోవకపోవటం అతనికి వరం. అందువలన కాళ్ళు, చేతులు, నడుము ఎలా అంటే అలా వంగిపోతూ చూపరులకు హాస్యం పుట్టించేవి. నటిస్తూ నటిస్తూ అలా పడిపోవడం, లేవడం, ఆ లేవడంలో హాస్యం పండించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అలా పడిపోయినా దెబ్బలు తగలకుండా జాగ్రత్తగా ఉండేవారట.
ఇంకో విశేషం ఏమిటంటే… ఎ. సుబ్బారావు గారు రేలంగి చేత నారదుడి వేషం వేయించారు. ఆ సినిమా కూడా బాగా ఆడింది. అలాగే రేలంగికి కూడా మంచి పేరు వచ్చింది. రమణారెడ్డిగారిని అభిమానించే కె ఎస్ ప్రకాశరావు గారు అంటే నేటి ప్రసిద్ధ దర్శకుడు కె రాఘవేంద్రరావుగారి తండ్రి అన్నమాట.
అయితే ప్రకాశరావుగారికి, ‘అప్పుడు రేలంగి చేత నారదుడి వేషం వేయించినప్పుడు, రమణారెడ్డి గారి చేత నారదుడి వేషం ఎందుకు వేయించకూడదు?’ అన్న ఆలోచన వచ్చింది.
రమణారెడ్డి గారిని పిలిపించి నారదుడి వేషం వేయమన్నారు. అయితే ఆ మాట విన్న రమణారెడ్డిగారు పక్కున నవ్వి ‘ఏంటి నేనా! నారదుడి వేషమా? ఎముకల గూడులా ఉన్న నన్ను నారదుడి వేషంలో చూస్తే ప్రేక్షకులు దడుచు కుంటారు’ అని అన్నా వినక ‘ఏమీ కాదు నువ్వు వెయ్యవయ్యా!’ అని రమణారెడ్డిగారితో నారదుని వేషం వేయించారు.
‘రేణుకాదేవి మహత్యం’ సినిమాలో రమణారెడ్డిగారు నారదుడి వేషం వేశారు. అది కూడా జనాన్ని మెప్పించింది. అయితే మళ్ళీ బీఏ సుబ్బారావుగారు రేలంగి చేత హనుమంతుడి వేషం వేయించారు. అయితే రమణారెడ్డి అది గుర్తు చేసుకుని కే ఎస్ ప్రకాశరావు గారి దగ్గరకు వెళ్లి, ‘నా చేత నారదుడు వేషం వేయించారు. మరి హనుమంతుడి వేషం ఎప్పుడు వేయిస్తారు?’ అని అడిగేసరికి ఆయనకు కోపం వచ్చి రమణారెడ్డి చెవి మెలితిప్పేలోపే ఆయన పారిపోయారట. ఇలా రమణారెడ్డి సినిమాల్లోనే కాక ఎక్కడైనా నవ్విస్తూ ఉండేవారని ఆయనే చెప్పారు.
తెరమీద అల్లరి చిల్లర వేషాలు వేసినా వ్యక్తిగా అతను సౌమ్యుడు. నెమ్మదైన మనసుతో నిదానంగా ఉండేవారు. వేరెవరి గురించి చెడు మాట్లాడటం కానీ, అటువంటి మాటలని విని ప్రోత్సహించడం కానీ చేయక తన పని తాను చేసుకుంటూ ఉండేవారు.
సుమారు 200 చిత్రాలకు పైగా నటించిన శ్రీ రమణారెడ్డిగారి చిత్రాలలో చాలా పాత్రలు మనలను ఆకట్టుకుంటాయి. ‘మిస్సమ్మ’ చిత్రంలోని డేవిడ్ పాత్ర, ‘మాయాబజార్’ చిత్రంలోని ‘చినమయుడు’ పాత్ర, ‘గుండమ్మ కథ’ చిత్రంలోని గంటయ్య పాత్ర, ‘లవకుశ’ చిత్రంలోని ముని పాత్ర… ఇలా ఎన్నో పాత్రలు పేరెన్నిక గొన్నాయి.
అశేష ప్రేక్షకులను ఎంతగానో నవ్వించిన రమణారెడ్డి తన అనారోగ్యాన్ని మాత్రం దూరం చేసుకోలేక పోయారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ 1974, నవంబరు 11వ తేదీన, తన 53వ ఏట ఈ లోకాన్ని ఏడిపిస్తూ తుదిశ్వాస విడిచారు.
ఆ వయసులో ఆయన చనిపోవడం అందరిలో షాక్ కు గురి చేసింది. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా గాని సినిమా రూపంలో మనల్ని పలకరిస్తూనే ఉంటారు.
ఆయన పాటలలో ‘ఇద్దరు మిత్రులు’ చిత్రం లోని ‘ఓ రామ నీ నామమెంతో రుచిరా…’ అనే రామదాసు కీర్తన ఆధారంగా వ్రాసిన పాట ఎంతో ఆకట్టుకుంటుంది. శ్రీరామ భక్తుడిగా శ్రీ రమణారెడ్డి గారు ఆ పాత్రలో జీవించారు. మాధవపెద్దిగారు గానం చేసిన ఈ పాటను శ్రీ యస్ రాజేశ్వర రావు గారు స్వరపరచారు.
అలాగే, కులగోత్రాలు చిత్రంలోని ‘అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే’ అనే పాట విన్నప్పుడల్లా మనకి రమణారెడ్డిగారే గుర్తుకు వస్తారు. దృశ్యపరంగా శ్రీ రేలంగి గారు కూడా ఈ పాటలో కనిపిస్తారు.
చిత్రం: కులగోత్రాలు.
రచన: సాలూరు రాజేశ్వరరావు.
సంగీతం: కొసరాజు రాఘవయ్య.
గానం: మాధవ పెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు

అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే
అయయ్యో జేబులు ఖాళీ ఆయెనే

ఉన్నది కాస్తా ఊడింది
సర్వ మంగళం పాడింది
పెళ్లాం మెళ్లో నగలతో సహా
తిరుక్షవరమై పోయింది

ఆ మహా మహా నలమహారాజుకే
తప్పలేదు భాయీ ఓటమి తప్పలేదు భాయీ
మరి నువు చెప్పలేదు భాయీ
అది నా తప్పుగాదు భాయీ
తెలివి తక్కువగ చీట్ల పేకలో
దెబ్బ తింటివోయీ
బాబూ నిబ్బరించవోయీ

నిలువు దోపిడీ దేవుడికిచ్చిన
ఫలితం దక్కేది
ఎంతో పుణ్యం దక్కేది
గోవిందా గోవిందా!
చక్కెర పొంగలి చిక్కేది?
ఎలక్షన్లలో ఖర్చుపెడితే
ఎంఎల్ఏ దక్కేది…
మనకు అంతటి లక్కేదీ

గెలుపూ ఓటమి దైవాధీనం
చెయ్యి తిరగవచ్చు మళ్ళీ ఆడి గెల్వవచ్చు
ఇంకా పెట్టుబడెవడిచ్చు? ఇల్లు కుదువబెట్టవచ్చు!
ఛాన్సు తగిలితే ఈ దెబ్బతో మన కరువు తీరవచ్చు
పోతే?
అనుభవమ్ము వచ్చు, చివరకు జోలె కట్టవచ్చు!

అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే
అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయెనే

ఇలా అనేక పాత్రలలో ఒదిగిపోయి మనను తన నటనతో ఎంతగానో అలరించిన శ్రీ రమణారెడ్డి గారు తెలుగు చలనచిత్రసీమ ఉన్నంతవరకూ చిరంజీవియే అనటంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు.

***

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *