July 5, 2024

కర్ణాటక సంగీతంలో రాగమాలికలు – 12

రచన: రామలక్ష్మి కొంపెల్ల

ఈ సంచికలో కూడా మనం సినిమా పాటల విభాగంలోని రాగమాలికల గురించి తెలుసుకుందాం. మనందరికీ చిరపరిచితమైన ఘంటసాల గారి పాట గురించి ముందుగా వివరించుకుందాం. ఈ పాట 1961వ సంవత్సరం విడుదలైన ‘బావ మరదళ్ళు’ చిత్రంలోనిది.

చిత్రానికి సంబంధించిన వివరాలు:
నిర్మాణ సంస్థ : కృష్ణ చిత్ర
దర్శక నిర్మాత : శ్రీ పి ఎ పద్మనాభరావుగారు
సంగీతం: శ్రీ పెండ్యాల నాగేశ్వరరావుగారు
ముఖ్య తారాగణం: కృష్ణకుమారి, జె వి రమణమూర్తి, మాలిని తదితరులు

ఈ సినిమా గురించిన వివరాలు ఎక్కువగా లభ్యం కావడం లేదు. సినిమా వీడియో కానీ, సినిమా పాటలకు సంబంధించిన వీడియోలు కానీ, ఎంత వెతికినా దొరకలేదు. ఆడియోకి ఒక ఫోటో జత చేసి యూట్యూబ్ లో పెట్టిన వీడియోలు మాత్రమే లభ్యమౌతున్నాయి.

పాట రచన: శ్రీ ఆరుద్రగారు
పాడిన వారు: శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావుగారు

మా చిన్నప్పుడు ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్తే, ఆ క్షేత్రమంతా ప్రతిధ్వనిస్తూ, ఈ పాట వినపడుతూ ఉండేది. అందులో ఉండే కొన్ని వాక్యాలు, ఉదా: ‘బరువాయె బ్రతుకు చెరువాయె కన్నీరు’, ‘అంతు తెలియగరాని ఆవేదనలు గలిగె’, లాంటివి చాలా ఆర్తితో కూడిన వాక్యాలు. అవి వినిపించినపుడు, ఎవరి కష్టం వాళ్లకు గుర్తు రావడం ఖాయం. కష్టం తీర్చమని భగవంతుడిని వేడుకోవడం తప్ప మానవమాత్రులం మనం చెయ్యగలిగింది కూడా ఏమీ లేదు.
అటువంటి ఆర్తి, ఆర్ద్రత సంపూర్ణంగా పాటలో పొదిగి రాయడం ఆరుద్ర గారికే సాధ్యం. చిన్న చిన్న పదాలలో, అపరిమితమైన భగవద్భక్తి నింపి పాటను పరిపూర్ణం చేస్తారు ఆరుద్ర.
ఆరుద్ర గారి గురించి క్లుప్తంగా:
1925వ సంవత్సరంలో పుట్టిన ఆరుద్ర అసలు పేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి. వీరు గొప్ప కవి, సాహితీవేత్త, విమర్శకులు, పరిశోధకులు, సినీ గేయ రచయిత, అనువాదకులు, ప్రచురణ కర్త కూడా. 1987వ సంవత్సరంలో వీరు సాహిత్య అకాడెమీ అవార్డు అందుకున్నారు. వీరి రచనల్లో ప్రత్యేకంగా చెప్పుకోవలసినవి త్వమేవాహం, కూనలమ్మ పదాలు, సినీవాలి, సమగ్ర ఆంధ్ర సాహిత్యం మొదలైనవి. 1998లో వీరు స్వర్గస్థులైనారు.

ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గురించి క్లుప్తంగా:
1922వ సంవత్సరంలో పుట్టిన ఘంటసాల గారు, పేదరికం కారణంగా, సంగీతం అభ్యసించడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. పట్రాయని సీతారామశాస్త్రి గారు, ఘంటసాల గారికి సంగీతగురువు. మద్రాస్ చేరుకుని సినిమాలో పాడే అవకాశం సంపాదించడానికి కూడా చాలా కష్టపడ్డారు. స్వర్గసీమ, పాతాళభైరవి, మల్లీశ్వరి, దేవదాసు, మాయాబజార్ వంటి సినిమాల్లో అద్భుతమైన పాటలు పాడిన ఘంటసాల గారు, నేపథ్య గాయకుడుగా, సంగీత దర్శకుడుగా తనదైన ముద్రను వేసి చాలా కీర్తి ప్రతిష్టలు గడించారు. 1970లో వీరు పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. 1974వ సంవత్సరంలో వీరిని తెలుగుజాతి, సినీప్రపంచం కోల్పోయింది. వీరు అనారోగ్యంతో బాధపడుతున్న రోజుల్లోనే, భగవద్గీతను అర్థంతో సహా వీరి చేత పాడించి రికార్డు చేయించారు.

ఈ పాట సంగీత దర్శకులు శ్రీ పెండ్యాల నాగేశ్వరరావు గారి గురించి కొన్ని విషయాలు:
1917వ సంవత్సరంలో పుట్టిన పెండ్యాల గారు, 1948లో విడుదలైన ‘ద్రోహి’ అనే చిత్రం ద్వారా సంగీత దర్శకునిగా చిత్రసీమకు పరిచయం అయ్యారు. వీరి సంగీత దర్శకత్వంలో విడుదలైన ఎన్నో చిత్రాలు, సంగీతపరంగా అఖండ విజయం సాధించాయి. ఘంటసాల మరియు పెండ్యాల గారి కలయికలో ఎన్నో గొప్ప గొప్ప పాటలు వెలువడ్డాయి. ఉదా: జయభేరి చిత్రంలోని, ‘మది శారదాదేవి మందిరమే’, ‘రాగమయీ రావే’, శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యంలోని ‘శేషశైలావాసా శ్రీవేంకటేశ’, ఉయ్యాల జంపాల చిత్రంలోని ‘కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది’ – ఇలా ఎన్నో ఉన్నాయి. పెండ్యాల గారి దృష్టిలో గాయకుడు అంటే ఘంటసాల గారు మాత్రమే అన్నంత ఇష్టంగా ఉండేవారట. పెండ్యాల గారు 1984లో ఈలోకం విడిచిపెట్టారు.

ఇంతమంది గొప్ప వ్యక్తుల కలయికతో వచ్చిన ఈ పాట గొప్పదనం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పల్లవి: కాంభోజి రాగం
ముక్కోటి దేవతలు ఒక్కటైనారు
చక్కన్ని పాపను ఇక్కడుంచారు
ఎక్కడున్నాగాని దిక్కువారేకదా
చిక్కులను విడదీసి దరిజేర్చలేరా llముక్కోటి దేవతలుll
చరణం 1 కాంభోజి రాగం
ఆలి ఎడబాటెపుడు అనుభవించెడువాడు
అలమేలుమంగపతి అవనిలో ఒకడే
ఏడుకొండలవాడు ఎల్లవేళలయందు
దోగాడు బాలునికి తోడునీడౌతాడు llముక్కోటి దేవతలుll

చరణం 2 కానడ రాగం
నెల్లూరి సీమలో చల్లంగ శయనించు
శ్రీ రంగనాయకా ఆనందదాయకా
తండ్రి మనసుకు శాంతి తనయునికి శరణు
దయచేయుమా నీవు క్షణము ఎడబాయకా llముక్కోటి దేవతలుll
చరణం 3 కీరవాణి రాగం
ఎల్లలోకాలకు తల్లివై నీవుండ
పిల్లవానికి ఇంక తల్లి ప్రేమ కొరతా
బరువాయె బ్రతుకు చెరువాయె కన్నీరు
కరుణించి కాపాడు మా కనకదుర్గా llముక్కోటి దేవతలుll
చరణం 4 మాయామాళవగౌళ రాగం
గోపన్నవలె వగచు ఆపన్నులను గాచి
బాధలను తీర్చేటి భద్రాద్రివాసా
నిన్ను నమ్మిన కోర్కె నెరవేరునయ్యా
చిన్నారి బాలునకు శ్రీ రామరక్ష llముక్కోటి దేవతలుll
చరణం 5 నాటకురంజి రాగం
బాల ప్రహ్లాదుని లాలించి బ్రోచిన
నారసింహుని కన్నా వేరు దైవము లేడు
అంతు తెలియగరాని ఆవేదనలు గలిగె
చింతలను తొలగించు సింహాచలేశ llముక్కోటి దేవతలుll

ఒక పసివాడి విషయంలో తండ్రి పడే ఆవేదన కనిపిస్తుంది ఈపాటలో. 5 రాగాలు ఉపయోగించి సంగీతం సమకూర్చిన ఈపాటలో, 5 పుణ్య క్షేత్రాలు, ఆయా క్షేత్రాలలో కొలువైన దేవతల గురించిన వర్ణన కూడా ఉంది. పాట మొత్తం చాలా సులభంగా అర్థం అయ్యే రీతిలో ఉంది. తిరుమల శ్రీవారి నుంచి మొదలుపెట్టి, ఆంధ్రరాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు, నెల్లూరు, విజయవాడ, భద్రాచలం, సింహాచలం గురించి చెప్పారు ఆరుద్ర.
పిల్లలను భగవత్ప్రసాదంగా స్వీకరిస్తాం మనం. అటువంటి అభిప్రాయమే వ్యక్తం చేసారు ఆరుద్ర పల్లవిలో. ముక్కోటి దేవతలు ఒక్కటై, చక్కటి పసిబిడ్డను ప్రసాదించారు అన్న భావం ఉంది పల్లవిలో. పిల్లవాడు ఎక్కడున్నా సరే, వాడిని కాపాడేది, కష్టాలన్నీ కడతేర్చి, దరి చేర్చేవారు కూడా ఆ దేవతలే అన్న అర్థం ఉంది పల్లవిలో. ఇది ప్రసిద్ధమైన కాంభోజి రాగంలో చేయబడింది.
మొదటి చరణం కూడా కాంభోజి రాగంలోనే చేసారు. చరణంలో, వేంకటేశ్వరస్వామి వారు తిరుమల కొండలలో ఉండడం, అలమేలు మంగమ్మవారు తిరుచానూరులో ఉండడం (ఇద్దరి ఎడబాటు) గురించి ప్రస్తావించారు ఆరుద్ర గారు. ఆ స్వామి దోగాడే పసివాడిని రక్షించే దైవం అన్నారు.
రెండవ చరణం కానడ రాగంలో చేయబడింది. ఈ చరణంలో నెల్లూరులో కొలువైన రంగనాయక స్వామి వారి గురించిన ప్రస్తావన ఉంది. నిజంగానే స్వామివారు శయన భంగిమలో ఉంటారు గర్భగుడిలో. చిన్న చిరునవ్వుతో హాయిగా ఉండే స్వామి, తండ్రికీ, తనయుడికీ కూడా రక్షగా ఉండాలని అన్నారు ఈ చరణంలో ఆరుద్ర గారు.
మూడవ చరణం కీరవాణి రాగంలో ఉంది. ఈ చరణంలో విజయవాడలో కొలువైన కనకదుర్గ అమ్మవారి గురించి వర్ణించారు. అమ్మలగన్న అమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ ఉండగా, పిల్లవాడికి తల్లిప్రేమ కొరత ఉండదు అన్నారు. కష్టాల నుంచి గట్టెక్కించి కాపాడమన్న వేడుకోలు కూడా ఉంది.
నాలుగవ చరణం మాయామాళవగౌళ రాగంలో చేసారు. ఈ చరణంలో భద్రాద్రి రామయ్య గురించిన ప్రస్తావన చేసారు. భక్త రామదాసుగా ప్రసిద్ధి చెందిన గోపన్న వంటి ఆర్తులను బ్రోచే దైవం రామభద్రుడు కాక వేరెవరు కలరు? పిల్లలను పెంచే క్రమంలో అందరం కూడా వారిని దీవిస్తూ రోజుకు ఎన్నోసార్లు శ్రీరామరక్ష అనడం పరిపాటి. అదే అన్నారు ఆరుద్ర గారు ఈ చరణంలో.
ఐదవ చరణం నాటకురంజి రాగంలో ఉంది. ఈ చరణంలో సింహాచలం నరసింహస్వామి వారి గురించిన వర్ణన ఉంది. తండ్రి అయిన హిరణ్య కశిపుని వల్ల ఎన్నో కష్టాలు పడ్డ బాల ప్రహ్లాదుడిని అడుగడుగునా రక్షించిన దైవం నారసింహుడే. అట్టి నరసింహస్వామి పిల్లవాడిని రక్షించి తన చింతలను దూరం చెయ్యమన్న ప్రార్థన కూడా ఉంది ఈ చరణంలో.
ఈ క్రింది యూట్యూబ్ లింక్ ద్వారా పాటను విని ఆనందించండి.

***

1 thought on “కర్ణాటక సంగీతంలో రాగమాలికలు – 12

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *