July 5, 2024

స్వప్నాలూ , సంకల్పాలూ – సాకారాలు -11

రచన: డా. లక్ష్మీ సలీం
అనువాదం: స్వాతీ శ్రీపాద

ఈ కేస్ కి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. దానివల్ల మరింత తరచుగా కాలిన కేస్ లు రాడం మొదలయింది. సరైన సమయంలో వస్తే వారిని రక్షించగలిగే దాన్ని. కాని కాలిన గాయాలున్న కేస్ లకు చికిత్స చెయ్యడానికి చాలా సమయం తీసుకోడమే కాక శ్రమ కూడా ఎక్కువే. దానికి తోడు, చాలా మటుకు కాలిన వాళ్ళు క్రింది తరగతి, మధ్యతరగతి కుటుంబాల నుండి కావడం వల్ల వాళ్ళూ బిల్ కూడా కట్టలేకపోయే వారు. తరచు చికిత్స చార్జీలు వదులుకోవలసి వచ్చేది కాని నేనే మాత్రం వెనక్కు పోలేదు. ఎవరినీ వెనక్కు పంపలేదు, చికిత్స అందించడం నా ప్రధమ కర్తవ్యం గనక.
ఒకసారి ఒక సిమెంట్ ఫాక్టరీలో ప్రమాదం జరిగింది. అక్కడ ఫర్నెస్ పేలిపోయి ఎనిమిది మంది పనివాళ్ళకు కాలిన గాయాలయ్యాయి. ఏ సమస్యలూ లేకుండా ఎనిమిది మందికీ మేం చికిత్స అందించగలిగాం. ఇది జనాలలో, కాలిన గాయాల చికిత్సలో చక్కని ఫలితాల కోసం ప్లాస్టిక్ సర్జరీ ఆవశ్యకత పట్ల అవగాహన కలిగించింది.
మాకు మరింత మంది రోగులు రాడంతో వారికి మంచి ట్రీట్మెంట్ అందించడానికి మరింత స్థలం కావాలని తెలుసుకున్నాం . మరింత సౌకర్యవంతమైన ఆసుపత్రి భవనం కోసం, సౌకర్యాల కోసం, కాలిన గాయాల విభాగం కోసం నేను ఆశ పడ్డాను.
ఆ సమయంలో కొత్త ఆసుపత్రి భవనానికి దగ్గరలో ఉన్న ఇంటికి మారాము. ఆ ఇంటికి పెద్ద తోట కూడా ఉంది. ఆ ఇంటి యజమానికి ముగ్గురు పిల్లలు దాదాపు అమ్ము , బాబీ వయసుల్లోనే ఉన్నారు. మేం ఇల్లు చూసినప్పుడు పిల్లలు ఆడుకుందుకు, సలీం, నేనూ మా కొత్త ఆసుపత్రి నిర్మాణం పర్యవేక్షించుకుందుకు అది చాలా అనుకూలమైనదిగా అనిపించింది .
వేరు వేరు స్కూళ్ళకయినా బాబీ కూడా అమ్ములానే స్కూల్ కి వెళ్ళడం మొదలుపెట్టాడు. మా రెండో సోదరి కూతురు శాంతి న్యూయార్క్ నుండి మమ్మల్ని చూడటానికి వచ్చింది. ఆమె తొలిసారి గర్భవతి. శాంతి స్కూల్ కి లంచ్ పట్టుకుని వెళ్ళేది, వాడు అలవాటు పడతాడని.
ఆ సమయంలో నేనూ, సలీం, మా కొత్త ఆసుపత్రి నిర్మాణం మీద దృష్టి పెట్టాము. సలీం దుబాయిలో స్ట్రక్చరల్
ఇంజనీర్ అయిన తన సోదరుడు హకీం సాయం తీసుకునే వాడు. హకీమ్ ఒకసారి సలీం దుబాయ్ వస్తే ఆసుపత్రి బ్లూ ప్రింట్ ఫైనల్ చెయ్యవచ్చని సూచించాడు. సలీం పిల్లలను కూడా తీసుకుని వెళ్ళాడు వాళ్ళూ దుబాయ్ చూస్తారని.
చివరికి మా ఆసుపత్రి భవనానికి అనుమతి లభించింది. సలీం అతని సోదరులు, హకీం, సిరాజ్ నిర్మాణం పనులు చూసుకుంటే నేను రోగులను చూసేదాన్ని.
ఈ సమయంలోనే ఒక యాక్సిడెంట్ కేస్ వల్ల మేం లీగల్ ఇబ్బందుల్లో పడ్డాం. ఆ రోజు శనివారం, స్కూల్ యూనిఫాంలో ఉన్న పదేళ్ళు మించని ఒక అమ్మాయిని ఊపిరందని స్థితిలో తీసుకు వచ్చారు. ఒక పెద్ద గుంపు ఒక పోలీస్ ఆ పిల్లతో వచ్చారు. నేను ఆ పాపను పరీక్షించే లోపల ఆ పిల్ల షాక్ లో ఉందనీ అయోమయంగా మాట్లాడు తోందనీ గమనించాను.
నా పరీక్షలో ఆమె పక్కటెముకలు విరిగాయనీ కడుపులో ఎడమవైపు రక్తం చేరుతోందనీ, చెస్ట్ లో రక్తం, కాళ్ళూ చేతుల ఎముకలు పలు చోట్ల విరగడం తెలిసింది. రోడ్ దాటుతుంటే ఆమె పైనుండి లారీ వెళ్ళిందని, ఆ పిల్ల తన అంకుల్ కుటుంబంతో ఉందనీ తెలిసింది.
వెనకాడుతూనే ఆ అంకుల్ ని పిలిచి చెప్పాను, ” సర్, మీ మేనకోడలికి యాక్సిడెంట్ జరిగింది, చాలా సీరియస్ గా గాయపడింది. వెంటనే రక్తం ఎక్కించాలి. ఆ పిల్ల షాక్ నుండి బయటకు వస్తుందని హామీ ఇవ్వలేను.”
అతను నాకు రక్తం ఎక్కించడానికి అనుమతి ఇవ్వడంతో తల ఊపాను. సలీం కూడా ఆసుపత్రి చేరుకున్నాడు, చెస్ట్ లో రక్తం తొలగించడానికి ట్యూబ్ పెట్టాలని.
విచారకరమైన విషయం, ఆ చిన్నారిని రక్షించలేకపోయాం. గాయాలతో మరణించింది. ఆ మధ్యాన్నం మూడున్నరకు ఆమె మరణించిందని ప్రకటించాను. నేను ఆరోజు జరిగినవి ఆలోచిస్తూ ఆ పిల్ల శరీరం పక్కన కూచున్నాను. స్కూల్ ప్రిన్సిపల్ కూడా వచ్చి నాతో కూచున్నారు, మే ఆ చిన్నారి మరణానికి బాధపడుతున్నాము.
ఒక గంట పై చిలుకు గడిచాక ఒక సబ్ ఇన్స్పెక్టర్ అరుచుకుంటూ ఆసుపత్రిలోకి వచ్చాడు.
“ఎంత ధైర్యం రోడ్ ట్రాఫిక్ యాక్సిడేంట్ అయిన మనిషిని మాకు సమాచారం ఇవ్వకుండా, న్యాయపరమైన ఫార్మాలిటీస్ పూర్తి చెయ్యకుండా ఎలా అడ్మిట్ చేసుకున్నారు?
“పేషంట్ జీవితాన్ని రక్షించాల్సి ఉండటం వల్ల నాకు ఫార్మాలిటీస్ పూర్తి చేసే సమయం లేదు” చాలా నమ్మకంగా చెప్పాను.
“సర్, డాక్టర్ పేషంట్ ను బ్రతికీంచడానికే ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆ పిల్ల ఊపిరి కూడా పీల్చుకోడం లేదు, మేం
ఇక్కడికి తీసుకు వచ్చేటప్పటికి. ” ప్రిన్సిపల్ కూడా నన్ను బలపరచారు.
సబ్ ఇన్స్పెక్తర్ చెయ్యి పైకెత్తి ఆపి నాకు ఒక మెమో ఇచ్చారు, లీగల్ ఫార్మాలిటీ ఎందుకు అనుసరించలేదో వివరణ ఇవ్వమంటూ. నేను పోలీస్ సూపరింటెండెంట్ తో మాట్లాడాలని నిర్ణయించుకుని కేస్ గురించి అన్ని వివరాలు, నా పరిస్థితి చెప్పాను.
సబిన్స్పెక్టర్ బలవంతాన బాడీని మార్చురీకి తరలించి నేనిచ్చిన వివరణకు నాకు జవాబు ఇవ్వవలసి వచ్చింది.
స్కూల్ ప్రిన్సిపల్ లీగల్ గొడవలు అంటూ వర్రీ చెయ్యకుండా చూపిన మానవత్వానికి నాకు ఒక ప్రశంసా పత్రాన్ని పంపించారు.
బాగా అలసిపోయి రచ్చరచ్చగా ఆ రోజంతా గడిచాక ఇంటికి వెళ్ళగానే పిల్లల సవాలక్ష ప్రశ్నలు.
అమ్ము జరిగినదాన్ని మనసులో ఉంచుకుని అడిగింది, “భవిష్యత్తులో ఇలాటి ప్రమాదాలు ఎలా అరికట్టగలం?”
ఆపైన తనకొచ్చిన అద్భుతమైన ఆలోచన చెప్పింది, “యూకే లో ఉన్నట్టు ఇక్కడా గ్రీన్ క్రాస్ కోడ్ వినియోగిస్తే బాగుంటుంది కదా? దాని వల్ల పిల్లలు సురక్షితంగా ఉంటారు, క్షేమంగా స్కూల్ కి వెళ్లగలరు కూడా.”
అమ్ముకి వచ్చిన ఆలోచనకు గర్వపడ్డాను, అక్కడి స్కూల్ ప్రిన్సిపల్స్ ను కలిసి స్కూల్ పిల్లల క్షేమం గురించి అవగాహన కల్పించాలని చెప్తానని అమ్ముకు ప్రామిస్ చేసాను.
విచారం ఏమిటంటే లీగల్ సమస్యలు అంతటితో ఆగిపోలేదు. మా ఆసుపత్రి భవన నిర్మాణం జరుగుతుంటే మా ప్లాన్ కి కావలసిన అనుమతికి లంచాలు ఇవ్వాలని అడిగారు. మేం ఏ నియమం అతిక్రమించలేదు గనక ఎలాటి లంచాలు ఇవ్వదలుచుకోలేదు. కాని వెంటనే మాకొక లీగల్ నోటీస్ వచ్చింది, అధికారిక అనుమతి రాకముందే కట్టడం మొదలుపెట్టాం గనక పెనాల్టీ కట్టమని.
ఇలాటి సంఘటనలు నన్ను మరింత బలవత్తరం చేసాయి. నా సిద్ధాంతాలు, ఆదర్శాలతో రాజీపడకుండా అవసరం ఉన్న వారికి సేవలు అందించడం నా లక్ష్యం.
” ఈ సమాజంలో నిజాయితీని ప్రశంసించడం అరుదు. కాని నన్ను ఇష్టపడాలని దాన్ని వదులుకోలేను. నేను నిద్రలో జీవితం ఆనందమని కలగన్నాను, మేలుకొని జీవితం సేవ అని తెలుసుకున్నాను”
రవీంద్రనాథ్ టాగూర్.

28. కుటుంబం -ప్రాధాన్యత
కొత్త భవనం నిర్మాణం, రోగులబాగోగులతో బాటు మా కుటుంబాలకూ వైద్యపర్యవేక్షణ అవసరమయింది. ఏ సమయంలోనూ మా కుటుంబాల అవసరాలను మేం నిర్లక్ష్యం చెయ్యలేదు.
మా పెద్దన్నయ్యను చూడటానికి వచ్చిన అమ్మకు చెస్ట్ పెయిన్ వచ్చింది. ఇన్ఫీరియర్ ఇన్ఫ్రాక్షన్. మా హాస్పిటల్ లో చేర్చమని ఆమె పట్టుబట్టింది. ఏం జరగకుండా పదిరోజుల్లో కోలుకున్నా ఆమెకు మా మీదున్న నమ్మకం బాగని పించింది.
తరువాత మా ప్రాధాన్యత శాంతి వైపు మళ్ళింది. ఆమె ప్రసవ సమయం సమీపిస్తోంది. ఆ రోజుకు కాస్త ముందుగా సిజేరియన్ జరిగి చక్కటి అబ్బాయికి జన్మనిచ్చింది. వాళ్ళు ఇంటికి వచ్చినా పసివాడు పాలు తాగినప్పుడల్లా వాంతి చేసుకోడం మొదలుపెట్టాడు. నా మిత్రురాలు , పిల్లల డాక్టర్ హేమ దాన్ని పాలకు అలర్జీగా గుర్తించి యూ ఎస్ నుండి పాలడబ్బాలు వచ్చే వరకూ ఇంట్రావీనస్ ఫీడింగ్ ఇవ్వాలనుకుంది.
కాని శాంతి పిల్లవాడు పెరగటమే లేదు. హేమ ఆపిల్లడు బ్రతుకుతాడని ఆశ వదులుకుంది. మా సోదరి శాంతి పిల్లవాడిని పెద్ద పీడియాట్రిక్ సెంటర్ ఉన్న హైదరాబాద్ తీసుకెళ్ళాలనుకున్నారు. కాని నేనే బలవంతం చేసాను, ఇక్కడే మా పర్యవేక్షణలో చికిత్స జరిపిద్దామని. ఇరవై నాలుగ్గంటలూ ఐవీ ఫ్లూయిడ్స్ ఇస్తూ రాత్రిళ్ళు ఎవరో ఒకరు మేలుకుని పిల్లవాడిని గమనిద్దామనీ అన్నాను.
పిల్లవాడు బాగా కోలుకున్నాక శాంతిని, ఆమె కొడుకునూ న్యూయార్క్ పంపగలిగాము.
రకరకాల రోగులతో నా అనుభవాలతో నేను నిర్ణయించుకున్నాను, ఏ రోగిపైనా నేను ఎప్పుడూ ఆశ వదులుకోను, కుటుంబం వాళ్లకేం కావాలో ప్రత్యేకంగా కోరుకుంటే తప్ప.
మా పెళ్ళి రోజు దగ్గరకు వస్తోంది, మా భవన నిర్మాణం కూడా దాదాపు పూర్తికావచ్చింది. మేమెప్పుడూ మా రెండు కుటుంబాలకూ ఎలాటి పార్టీలు ఇవ్వలేదు గనక నేనూ సలీం వారినీ , కొంత మంది మిత్రులనూ ఆహ్వానించి గృహ ప్రవేశం చెయ్యాలనుకున్నాము.
1998 ఫిబ్రవరి 21 న మేం ఒక డిన్నర్ ఏర్పాటు చేసాము. బిర్యానీ చెయ్యడానికి సలీం కుటుంబం ఒక మేకను బలిచ్చింది. అతని సోదరులు కావసిన ఏర్పాట్లన్నీ చేసారు. మా నాన్న, మామగారు మిత్రులను వారి వారి కుటుంబాలను సాదరంగా ఆహ్వానించారు.
మా కొత్త హాస్పిటల్ గార్డెన్ లో పార్టీ ఏర్పాటు చేసి అక్కడే డిన్నర్ అనుకున్నాము. ఆసుపత్రి గ్రౌండ్ ఫ్లోర్ లో రెండు ఆపరేషన్ థియేటర్లు కట్టాము. తూర్పు వైపున్న థియేటర్ లో నేను పూజ చేస్తే , సలీం , అతని సోదరీమణులు పడమటి వైపున్న దాన్లో నమాౙ్ చేసారు.
అతిధులలో ఒకరు డిన్నర్ సమయంలో మా ఇద్దరి దగ్గరకు వచ్చి, ” ఒకే కప్పు కింద ఒకే సమయంలో పూజ, నమాజ్ జరగడం ఎంత అద్వితీయం. రాబోయే తరాల కోసం మీరిది రికార్డ్ చెయ్యాల్సింది.” అన్నాడు.
గృహప్రవేశం పార్టీ ఎలాటి తగువులూ లేకుండా జరిగిపోయింది కాని మా నిలవ డబ్బంతా భవన నిర్మాణానికి కరిగిపోయింది. ఫర్నిచర్ , పరికరాల కొనుగోలుకు మరింత డబ్బు సంపాదించే వరకూ ఆగాలి. మా పాత ఆసుపత్రిలోనే పని కొనసాగిస్తూ డబ్బు ఆదా చెయ్యాలని ఆశపడ్డాం.
నేనూ సలీం కూడా కొత్త ఆసుపత్రికి మారడానికి వెనకాడాం కాని నర్స్ ల వసతి, వంట గది సిద్ధం చెయ్యడం, మా పేరెంట్స్ ఉండటానికి వసతి పుర్తి చెయ్యలనుకున్నాం, వారి గురించి కేర్ తీసుకోగలమని.
మా కజిన్ కొడుకు ఒకడికి మణిపాల్ లో యాక్సిడెంట్ జరిగింది. సలీం అబ్బాయి తలిదండ్రులతో మణిపాల్ వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అతని ట్రిప్ వారం పాటు తీసుకోవచ్చు గనక నేను కొత్త భవనానికి మారడం మొదలుపెట్టి అక్కడ పని ఆరంభించాలనుకున్నాను. థియేటర్ పరికరాలు చేరవేయడం పెద్ద పనే కాని నా స్టాఫ్ సహకారంతో నేను సమన్వయించుకోగలిగాను. నా మొదటి సర్జరీ ఒక అమ్మాయికి పెదవిని తగ్గించడం, లోకల్ మత్తు ఇచ్చి చేసాను. దీని వల్ల ఆసుపత్రి మొత్తం కొత్త భవనానికి మార్చే ధైర్యం వచ్చింది. సలీం తిరిగి వచ్చేసరికి మేమాపని చేసేసాం.
రోగులకు అనుకూలమైన, కావలసినంత విశాలమైన స్థలం ఉన్న కొత్త భవనంలో పనిచెయ్యడం బాగుంది. సలీం కు నాకు విడివిడిగా కన్సల్టింగ్ గదులు, విశాలమైన ఆపరేషన్ రూమ్స్ తో ఉన్నాయి. అవసరమైన పరికరాలతో ఒక ప్రత్యేకమైన డ్రెస్సింగ్ రూమ్ కూడా ఉంది. థియేటర్ కాంప్లెక్స్ కింద ఫ్లోర్ లో ఉన్నా , మిగతా వాటికి దూరంగా విడిగా ఉంది. ఎమర్జెన్సీ రోగులందరికీ కింద చికిత్స జరుగుతుంది, ఎంచుకున్న సర్జరీ రోగులను మొదటి అంతస్థులో ఉంచుతాము.
కొత్త ఆసుపత్రి భవనానికి స్పూర్తి కాలిన గాయాల రోగులకు మంచి చికిత్స ఇవ్వాలన్న అవసరం నుండి వచ్చింది. వాళ్ళకు క్రాస్ ఇన్ఫెక్షన్ రాకుండా విడిగా ఉంచే వారం.
ఆసుపత్రికి దగ్గరలోనే ఉండటం వల్ల ఎమర్జెన్సీ కేస్ లు చూడటం సులువైంది. మా తల్లిదండ్రులు కూడా నర్స్ లున్న రెండవ అంతస్థులో చిన్న అపార్టమెంటుకి మారిపోయారు. రొటేషన్ విధానంలో ఇరవైనాలుగ్గంటలూ ఎప్పుడు పిలిచినా రాడానికి మా దగ్గర పన్నెండుగురు నర్స్ లు ఉండేవారు.
హాస్పటల్ కాంపస్ లో మా గార్డెన్ విరిసిన పూల మడులతో ఆకర్షణా కేంద్రంగా ఉండేది. అది విజయవాడ హాస్పటల్స్ కి అరుదైన దృశ్యం. కొత్తగా వచ్చే ఆసుపత్రులకు గార్డెన్ అమరిక ఒక స్పూర్తిగా మారింది. మా హాస్పటలే కాక తల్లీ బిడ్డల ఆసుపత్రి, యూరాలజీ ఆసుపత్రి, ఒక డెంటల్ క్లినిక్, ఒక ఇమేజింగ్ సెంటర్ విజయవాడలో ఆపరేషన్లు
మొదలుపెట్టారు.
చిత్రంగా, కొత్త ఆసుపత్రిలో గార్డెన్ అనేది సూత్రంగా మా అందరినీ ఇతర కొలీగ్స్ తో బంధించింది. తరచు మేం కుటుంబాలతో డిన్నర్లకు కలిసే వాళ్లం.
వృత్తిపరంగా, వ్యక్తిగతంగా అన్ని విషయాలు ఎక్కడికక్కడ సర్దుకున్నట్టు అనిపించాయి.
అవసరం ఉన్న వాళ్లకు ప్రేమాప్యాయతలతో సేవచెయ్యడమనే ఈ నా స్వప్నం సలజ సృష్టించడానికి దారితీసింది.

29. బాధపడే రోగులకు పరిచర్య
వృత్తిపరంగా అన్ని విషయాలూ సర్దుకుంటుంటే, అమ్మకు హఠాత్తుగా ఎడమ వైపున పక్షవాతం రాడం, ఆమె రోజు వారీ పనులకు కూడా వేరే వారి మీద ఆధారపడటం జరిగింది. దీని వల్ల నా హృదయం ముక్కలయినా అమ్మ మాత్రం చాల ధైర్యం ఉన్న మనిషి. ఎలాగైనా తన కాళ్ళూ చేతులూ స్వాధీనంలోకి తెచ్చుకోవాలని నిర్ణయించుకుంది. ఫిజియో తెరపీ సూచనలన్నీ తూచా తప్పకుండా పాఠించడానికి సిద్ధంగా ఉండి పన్నెండు వారాల్లో బాగా తేరుకుంది, ఏవో కొన్నిచిన్న చిన్న లోటుపాట్లు తప్పించి.
నాకేం సహాయం అవసరం లేదని ఆమె అన్నా ఆమెకు ఇంట్లో సహాయపడడానికి ఒక మనిషిని పెట్టుకున్నాం. నా తలిదండ్రులు వాళ్ళ వైద్య అవసరాలు తీరుతాయి గనక హాస్పటల్ ఉన్న భవనంలో ఉండటానికి ఆనందపడ్డారు. కాలక్షేపానికి వారు తరచూ రోగులతో, వారి వారి కుటుంబాలతో సమయం గడిపే వారు.
ఆసుపత్రిలో పని ఎక్కువయిపోయింది. రాష్ట్రం మొత్తం నుండి రోగులు రాడం వల్ల ఎప్పుడూ దాదాపు 80-90% నిండిపోయి ఉండేది ఆసుపత్రి. నేనూ, సలీం మా ట్రైనింగ్ నర్స్ ల సాయంతో ఎప్పుడూ రోగులందరినీ పర్యవేక్షించే వాళ్ళం. కాని ఒక్క విషయం మాత్రం నాకు మాత్రం ప్రత్యేకం , అది స్కూల్ నుండి రాగానే నాపిల్లలతో పాటు ఉండటం.
ఒకసారి వాళ్ళకు తినిపించాక నేను ఔట్ పేషంట్ యూనిట్ కు వెళ్ళేదాన్ని. నా పిల్లలు చాలా స్వతంత్రులు, గార్డెన్ లో ఇతర పిల్లలతో ఆడుకునేవారు. నేనూ , సలీం కూడ ఒక విషయాన్ని ప్లాన్ చేసుకున్నాము. మాలో ఒకరం పిల్లలను స్కూల్లో దింపటానికి మళ్ళీ ఇంటికి తీసుకురాడానికి అందుబాటులో ఉండేలా చూసుకున్నాం.
మేం క్రిస్మస్ దీపాలతో, హోలీని రంగులతో జరుపుకున్నాము. మా పిల్లలు భారతీయ సంస్కృతి బహు ముఖీయతను ఆస్వాదించాలని అనుకున్నాము.
మా అమ్మ తన స్ట్రోక్ నుండి తేరుకోగానే ఆమె నాలుక మీద చిన్న కురుపును గమనించింది. ఆమె వయసు దృష్టిలో ఉంచుకుని మేమ్ బయాప్సీ చేసాము, మాకు భయాందోళన కలిగిస్తూ అది కాన్సర్ కురుపే.
విజయవాడలో రేడీయేషన్ సౌకర్యాలు అందుబాటులో లేకపోడం వల్ల మా మొదటి ఎంపిక మద్రాసులోని కాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడయార్. మా పెద్ద మరిదిగారు మా అమ్మతో మద్రాసు వెళ్ళారు. అక్కడ మా సోదరులు ఆమె చికిత్సను పర్యవేక్షించారు. ఆమె చికిత్సకు నాలుక మీద, బయట రేడియేషన్ కు మెడ మీద రేడియమ్ సూదుల అవసరం ఎనిమిది వారాల పాటు ఉంది.
ఆమె మా సోదరుడితో, సలీంతో ఉండేది. నేను వెళ్ళి చూసి వస్తూండేదాన్ని. ఇదంతా అమ్మ అనుభవించడం చూడాలంటే కష్టంగానే ఉండేది, దాని ప్రభావం ఆవిడ మీద కనిపించేది. ఆమెకు అసలు ఆకలనేదె ఉండేది కాదు. జుట్టు ఊడిపోడం మొదలైంది. ఎనిమిది వారాలు గడిచాక అమ్మ ఇంటికి వచ్చినప్పుడు ఆమె బొత్తిగా నీరసించిపోయినట్టు అనిపించింది. మేం క్రమంగా ఆమె పోషకాహారాన్ని పెంచడంతో బాగానే కోలుకుంది.
సలీం తలిదండ్రులు ఇద్దరూ కూడా, బీపీ, షుగర్ తో బాధపడుతున్నవాళ్ళే. వాళ్ళు సక్రమంగా రెగ్యులర్ చెకప్స్ కి వస్తున్నా వారి బ్లడ్ ప్రెష్షర్ , షుగర్ నియంత్రణలో ఉండేవి కాదు. మేం వాటిని నియంత్రణలో ఉంచాలని చూసినప్పుడల్లా తెనాలి వెళ్ళిపోయేవారు, మళ్ళీ కొన్నాళ్ళకు తిరిగి రాడానికి.
కాని ఈ సారి మేం ఈద్, ముహర్రం జరుపుకుందుకు సలీం కుటుంబంతో గడపాలనుకున్నాము. బాబీ తన తండ్రితో ప్రార్ధనలకు వెళ్ళినప్పుడు, అమ్ము, నేను సలీం కుటుంబం తో గడిపే వాళ్ళం.
మా ఇంటి యజమాని మాకు ఇల్లు ఖాళీ చెయ్యమని మూడు నెలల నోటీస్ ఇచ్చినప్పుడు మేం అదిరిపడ్డాం. మరో ఇల్లు రెంట్ తీసుకునే ఆలోచన కూడా చెయ్యలేకపోయాం. హకీం తో చర్చించాక తక్కువ ఖర్చుతో హాస్పిటల్ పై అంతస్థును ఇల్లుగా మార్చుకోడం ఉత్తమం అని నిర్ణయించుకున్నాము.
మన తలిదండ్రులకు మన అవసరం ఉన్నప్పుడు మనం వారిని చూసుకుందుకు సమయం కేటాయించు కోడానికన్న గొప్ప ఆనందం మరొకటి ఉండదు. అది చెయ్యగలగటం మన అవసరాలు భగవంతుడు తీర్చటం వల్ల మనకు కావలసిన వనరులు, పనీ ఇవ్వడం వల్ల.

30. అసాధారణమైన కేస్ లు
లయన్స్ క్లబ్ , రోటరీ క్లబ్ నిర్వహించే వివిధ సభల్లో నేను ప్లాస్టిక్ , రీకన్స్ట్రక్టివ్ సర్జరీ గురించి మాట్లాడటం మొదలుపెట్టాను. ఇలాటి చాలా క్లబ్ లు బీద రోగులకు మందులు, అనస్థీషియా ఇవ్వడానికి సిద్ధమయ్యాయి, మేం ఉచిత సాంకేతిక సేవ మా వంతుగా అందించాము. మేం,గ్రహణపు మొర్రి, అంగుటి చికిత్సలు అతి తక్కువ ఖర్చుతో చెయ్య గలిగాం.
ప్లాస్టిక్ సర్జరీ గురించి అవగాహన పెరుగుతుంటే నా కోసం ఎంతో ఆసక్తి కలిగించే రోగులు రాడం మొదలు
పెట్టారు. ఒక రోజున ఊరి పిల్లవాడిలా మాట్లాడుతున్న అద్దూ అదుపూలేని ఒక పదేళ్ళ అమ్మాయి ఆ పిల్ల ఇష్టానికి విరుద్ధంగా నా దగ్గరకు తీసుకు వచ్చారు. బాగా పరీక్షించాక ఆ పిల్లకు తీవ్రమైన అధశ్శిశ్న మూత్ర మార్గం ఉన్నట్టు తెలిసింది. మూత్ర ద్వారం అసాధారణ స్థితిలో వంకర తిరిగిన పురుషాంగం కింద ఉండటం వల్ల అది అమ్మాయిల జననాంగంగా పొరబడతారు.
ఆ బిడ్డ తల్లి నావైపు నిస్సహాయంగా చూసింది, ” ఎన్నో ఏళ్ళుగా పిల్లను ఎన్నో ఆసుపత్రులకు తిప్పాము, ఆమె లింగం ఏమిటో తెలుసుకుందుకు. మాకూ స్పష్టంగా తెలియలేదు.”
ఆమె భర్త కొనసాగిస్తూ, ” ఏవో కొన్ని పరిక్షలు చేసాక ఆ బిడ్డ ఆడపిల్ల అని చెప్పారు. మేము ఆ విధంగానే పేరు పెట్టాము. మేం చదువుకున్న వాళ్ళం కాదు. మాకు ఈ వైద్య సమస్యల అవగాహన లేదు. మాకు సాయం చెయ్యండి.”
ఆ బిడ్డ తల్లి కన్నీళ్ళు పెట్టుకుంది. “నా బిడ్డ ఎప్పుడు విచారంగానే ఉంటుంది. తలిదండ్రులుగా మేమది భరించలేము. ఆమె పెరుగుతున్నకొద్దీ అబ్బాయిలా మోటుగా తీవ్రంగా అనిపించడంతో మీ వద్దకు వచ్చాము.” నన్ను అర్ధిస్తూ చేతులు జోడించారు.
నేను వాళ్ళను కొంచం శాంతపరచి చెప్పాను.
“మీ బిడ్డ మగబిడ్డ. పురుష అవయవాలు సరైన స్థానంలో లేవు అంతే. మిమ్మల్ని మీరు నిందించుకోకండి. ఒక్కోసారి డాక్టర్లు కూడా ఇలా పొరబడతారు. చిన్న సర్జరీతో దాన్ని సరిచేయగలము, బిడ్డను ఆడపిల్ల కన్నా, మగవాడిగా చెయ్యడం సులువు.”
ఆ బిడ్డ తలిదండ్రులు కాస్సేపు ఆలోచించి లాభనష్టాలు బేరీజు వేసుకుని చివరికి తమ బిడ్డ మగవాడిగా ఉండటం మంచిదని నిర్ణయించుకున్నారు. వాళ్ళ గ్రామం నుండి దూరంగా మరో చోటికి తరలిపోయి తమ కొడుకును కొత్తపేరుతో కొత్త వాతావరణంలో పెంచుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు నేను బహిర్ జనానాంగాలను సరి చేసే సర్జరీ మొదలుపెట్టాను. అది విజయవంతం అయింది. పదిహేను సంవత్సరాల తరువాత ఆ పిల్లవాడు నా వద్దకు వచ్చి తను చదువుకున్నాననీ, ఉద్యోగం చేస్తున్నాననీ చెప్పాడు. నేను వాడిని చూసి ఆనందపడ్డాను. పెళ్ళికి నన్ను పిలవమనీ చెప్పాను.
కొన్నేళ్ళ తరువాత మరో ఇరవై రెండేళ్ళ అమ్మాయి విషయంలోనూ ఇదే పరిస్థితి ఎదురయింది. విజయవాడ స్థానిక కాలేజీలో చదువుకుంటోంది. ఆమె స్పోర్ట్స్ కోచ్ నా వద్దకు తీసుకువచ్చారు.
ఆ అమ్మాయి అప్సెట్ అయింది. “కాలేజీలో, యూనివర్సిటీ లెవెల్ లో ఎన్నో మెడల్స్ గెలుచుకున్నాను. గర్ల్స్ సెక్షన్ లో ఎన్నో రికార్డ్ లను అధిగమించాను. ఒలింపిక్స్ కోసం లిస్ట్లో ఎంచుకున్నారు కూడా. ఈ మధ్యనే మెడికల్ చెకప్ కి వెళ్ళాను.”
కోచ్ ఒక విధమైన ఉన్మత్తతతో చెప్పింది, “మెడికల్ చెకప్ లో డాక్టర్ చెప్పాడు ఆమె మగవాడనీ అధః శిశ్న మూత్ర మార్గంతో ఉన్నాడనీ (హైపోస్పాడియాస్). ఆమె చెస్ట్ మొత్తం చదునుగా ఉండటం, పురుషుల్లా జుట్టు శరీరం మీద పెరగటం వల్ల ఆమె అమ్మాయిల పోటీల్లో పాల్గొనడానికి అనుమతి ఇవ్వలేదు. కరెక్టివ్ సర్జరీ చేసుకుని అబ్బాయిగా మారమని సూచించారు.”
ఆ పిల్ల ఏడవటం మొదలుపెట్టింది, “నా జీవితమంతా అమ్మాయిగానే పాల్గొన్నాను. స్పోర్ట్స్ కోటాలో నాకు రైల్వేలో ఉద్యోగం కూడా ఇచ్చారు. నా తలిదండ్రులు ఒక చిన్న గ్రామానికి చెందిన వారు. వారికీ ఈ విషయం ఏ మాత్రం అవగాహన లేదు. నేనిప్పుడు హఠాత్తుగా ఒక మగవాడిలా మారలేను. ఇదంతా ఎలా భరించాలో నాకు తెలీదు.”
ఆమె జీవనోపాధి, జీవితం దృష్టిలో పెట్టుకుని ఆమె స్త్రీగా ఉండటమే ఎంచుకుంది. నేనామెకు సిలికాన్ ఇంఫ్లాంట్స్ తో బ్రెస్ట్ పెరిగేలా ఆపరేషన్ చేసాను. పెనిస్ చర్మంతో వెజైనా ఏర్పాటు చేసాను. ఏళ్ళ తరువాత ఆమె పెళ్ళి చేసుకుని , ఇంకా రైల్వే లో పని చేస్తోందని తెలిసింది.
ఇలాటి పరిస్థితుల్లో పేషంట్ కాని, వారి కుటుంబం కాని నిర్ణయం తీసుకోవచ్చును, మేం ఎలాటి తీర్పు చెప్పకుండా వారి నిర్ణయాన్ని గౌరవిస్తాము.
ఒకసారి ఒక ముప్పైయేళ్ళ స్తీ, ఆమె మొహం సగం చేరతో కప్పుకుని ఆసుపత్రికి వచ్చింది. ఆమె మొహం ఎడమ వైపున బాగా కాలిన గాయలున్నాయి, ఆమె కనురెప్పలు బిగిసిపోయి వాటిని పూర్తిగా ముయ్యలేకపోతోంది. ఒక కనుబొమ్మ మొత్తం లేదు. ఎడమ వైపు ఆమె ముక్కు, బుగ్గ, పైపెదవి పూర్తిగా దెబ్బతిని ఆమెకు వికృత రూపాన్ని ఆపాదించాయి.
“కొన్ని నెలల క్రితం రాయ్ పూర్ లో వంట చేసేప్పుడు గాస్ సిలిండర్ పేలి విపరీతంగా గాయపడ్డాను.” ఆమె వివరించింది. ఆమెను పూర్తిగా పరీక్ష చేసి ముందు చూపును రక్షించడానికి, మరింత నష్టం కలగకుండా కనురెప్పలు సరి చెయ్యడం మంచిదని అనుకున్నాను.
మొదటి సిట్టింగ్ లో లోకల్ గా మత్తునిచ్చి పైన, కింద కనురెప్పలను, స్కిన్ గ్రాఫ్ట్ తో కవర్ చేసి సరిచేయాలని, కనుబొమ్మను తల మీది జుట్టు ఉన్న ప్రాంతం నుండి స్కిన్ తో ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసుకున్నాను. రెండవ సిట్టింగ్ లో బుగ్గను, ముక్కును, పై పెదవిని గజ్జల దగ్గర స్కిన్ అదే మందంలో తీసుకుని గ్రాఫ్ట్ చేసి సరిచెయ్యడం. తొమ్మిది వారాల తరువాత స్థానికంగా ఇచ్చే మత్తు మందుతోనే రెండో సిట్టింగ్ ప్లాన్ చేసాను. ఆమెను కాని ఆమె చిత్రాన్ని కాని చూడటానికే వాళ్ళు భయపడిపోయినా లయనెస్ క్లబ్ ఆమె చికిత్సకు స్పాన్సర్ చేసింది. రెండు సిట్టింగ్ ల సర్జరీ లు పూర్తయాక ఆమె మామూలు కనుబొమతో పాటు కనురెప్పలనూ కదిలించగలుగుతోంది. ఆమె ఆనందంగా తన మొహం చూపించ గలగడం మిగతా చికిత్సకు ఆమె వచ్చినప్పుడు నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది.
ఇలాటి కేసులలో ఆర్ధిక విషయం అంత పట్టించుకునేది కాదు కాని నాకు అద్భుతమైన తృప్తి వృత్తిపరంగా కలిగేది. దీనివల్ల అలాటి పేషంట్లకు మరింత మందికి చికిత్సనందించి, తిరిగి పొందిన ఆత్మ గౌరవంతో వారిని తలెత్తుకుని సమాజంలో తిరగగలిగేలా చెయ్యగలిగాము.
కొత్త ఆసుపత్రిలో కాలిన గాయలకు రోగులకు చికిత్స ఇవ్వడమే కాక వారి కుటుంబాలను కూడా చూసుకో గలిగాము. కాలిన రోగుల డిమాండ్లను నిభాయించడం కష్టమే అయినా నేను కాని సలీం కాని ఎప్పుడూ రోగులతో ఉండేవాళ్ళం. సలీం పనులతో ఇంటి విషయాల్లో సాయపడితే , నేను వీటన్నింటి మధ్యా ఇల్లు చూసుకునేదాన్ని. మా మామగారికి పెరాలిటిక్ స్ట్రోక్ రావడం వల్ల వాళ్ళు మాతో ఉండేందుకు వచ్చారు, దానివల్ల మేం వాళ్ళను జాగ్రత్తగా చూసుకోగలిగాం. ఆయన షుగర్ కంట్రోల్ లో లేకపోడం వల్ల స్ట్రోక్ నుండి తేరుకుందుకు చాలా సుదీర్ఘ సమయం తీసుకున్నారు. మా అత్తగారి సాయంతో ఆయనను సౌఖ్యంగా ఉంచుతామని హామీ ఇచ్చాము.
అహమ్మదాబాద్ లో ఒక ప్లాస్టిక్ సర్జన్స్ కాన్ఫరెన్స్ లో నేనొక పేపర్ ప్రెజెంట్ చెయ్యాలని అనుకున్నాను. నాలుగు సంక్షిప్త సారాంశాలను తయారు చేసుకున్నాను. నాలుగూ కూడా ప్రెజెంటేషన్ కి అనుమతి పొందాయి. పెద్దగా తయారయేందుకు సమయం లేకపోయినా నిమ్స్ లోని వెంకట్రాజు అనే ఒక మిత్రుడి సాయంతో 1988 లో ప్రొఫెషనల్ ప్రెజెంటేషన్స్ సిద్ధం చేసుకున్నాను.
అమ్ము పన్నెండేళ్ళు, బాబీకి అయిదు, ఇద్దరికీ స్కూల్ ఉండటంతో, సలీం వాళ్ళను చూసుకుంటాడని నేను ఒక్క దాన్నే అహమ్మదాబాద్ బయలుదేరాను. నా లోలోన నిరంతం ఆ ప్రెజెంటేషన్ నెమరు వేసుకుంటూనే ఉన్నాను. చాలా మంది నా పనిని మెచ్చుకున్నారు, నేను చూసిన చాలా కేసుల గుర్ంచి ఎన్నో ప్రశ్నలు అడిగారు. అది నాకొక గొప్ప అవకాశమే కాదు నేర్చుకోగల అనుభవం కూడా.
ఈ అనుభవం వల్ల ప్లాస్టిక్ సర్జరీ గురించి నూతన వ్యాసాలు చదవాలనే జిజ్ఞాస కలిగినా కాలేజీ లైబ్రరీలలో ఆ పుస్తకాలు లేవు. అందుకే అమెరికన్ ప్లాస్టిక్ సర్జికల్ జర్నల్ కు నేనే చందా కట్టాను. కన్వర్స్ ప్లాస్టిక్, రీకన్స్ట్రక్టివ్ సర్జరీ పుస్తకాలను కొత్తవి కొనుక్కున్నాను. నా కోసం నేను ఒక చిన్న లైబ్రరీ ఏర్పరచుకున్నాను.
సలీం నన్ను సవాల్ చేస్తుంటే, రీకన్స్ట్రక్టివ్ సర్జరీ నూతన ఆవిష్కరణల గురించి విస్తృతంగా చదివాను.
అన్ని వివరణలతో అతనికేదైనా విధానం నేను వివరించినప్పుడు దాని సాధ్యాసాధ్యాల గురించి ప్రశ్నించే వాడు, “ఇది పనిచెయ్యకపోతే మాటేమిటి? నీకున్న ప్రత్యామ్నాయం ఏమిటి ?” అని.
అది నాకు చాలా సాయపడింది, ఎప్పుడూ నేను మొదటిది పని చెయ్యని పక్షంలో రెండోది మూడోది ప్రత్యామ్నాయాలతో సిద్ధంగా ఉండేదాన్ని. అన్ని సాధ్యమయే కాంప్లికేషన్లు, వాటిని ఎదుర్కొనే విధానాలతో నేను పని
చేసేదాన్ని. ఈ సాధన వల్ల నాకు మంచి జరగటం, నా రోగులకు సంతృప్తి కరమైన ఫలితాలు సాధ్యపడ్డాయి.
నాకు క్లిష్టమైన సమస్య వచ్చినప్పుడల్లా అది పరిష్కరించడానికి మరో అర్హత గల ప్లాస్టిక్ సర్జన్ లేడే అనిపించినప్పుడు సలీం నాకు అండగా నిలబడే వాడు. అతనికున సర్జికల్ అనుభవంతో పీజీఐ లోని రొటేషనల్ ప్లాస్టిక్ సర్జరీ శిక్షణ వల్ల సాంకేతిక పనుల్లో నాకు మరో మారు విధానం సూచించే వాడు.
సలీం, నేనూ ఒక టీముగా పనిచేసి మా పని, మా కుటుంబ జీవితం అతుకులు లేని ఐకమత్యాన్ని స్థిరపరచు కున్నాం.
మా రోగుల నుండి నేర్చుకోడం మాకు ఎనలేని తృప్తినిచ్చింది. రోగి మా అత్యుత్తమ గురువు , మార్గదర్శి, వేదాంతి, పుస్తకాల కన్నా వారి వద్దే ఎక్కువ నేర్చుకున్నాం.

*****

1 thought on “స్వప్నాలూ , సంకల్పాలూ – సాకారాలు -11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *