February 21, 2024

సంస్కృత సాహిత్యములో ప్రముఖ కవయిత్రులు.

రచన: కొరిడె విశ్వనాథ శర్మ

మహోన్నతమైన ప్రాచీన భారతీయ సంస్కృతీ నాగరికతలకు దర్పణమువంటిది వైదిక వాఙ్మయము. అది మొదలుకొని నేటి వరకును సంస్కృతవాఙ్మయమునందు గణనీయముగా సారస్వతసేవయొనరించిన మహిళామణులెందరో మనకు కానవచ్చుచున్నారు. వైదిక వాఙ్మయముపరిశీలించిన ఆత్మజ్ఞాన సముత్తీర్ణులైన గార్గి,మైత్రేయి మున్నగు వారు  జగత్ప్రసిద్ధులైయ్యిరి. విశ్వవార, అపాల, లోపాముద్ర మొదలుగాగల గృహిణులుమంత్రదర్శినులుగా పేరొందియున్నారు. తనభర్తయైన మండనమిశ్రునకు జగద్గురు ఆదిశంకరులకును జరిగిన వాదమునకు న్యాయాధిపురాలుగా నుండిన ఊభయభారతి మిక్కిలి ప్రసిద్ధురాలైయ్యెను.

 

శ్లో. గోధా ఘోషా విశ్వవారా పాలేషా మ్మాతృకర్షికా,

బ్రాహుర్నామా అగస్త్యస్య స్వసాదితిః,

లోపాముద్రా చ నద్యశ్చ యమీ నారీ చ శశ్వతీ

శ్రీర్లాక్షా సార్పరాజ్ఞీ వాక్ శ్రద్ధా మేధా చ దక్షిణా

రాత్రీ సూర్యా చ సావిత్రీ బ్రహ్మవాదిన్య ఈరితాః.

 

అని అపాలోపనిషత్తునందు మంత్రదర్శినులపేర్లు పేర్కొనబడినవి. దీని వలన ఆనాడు స్త్రీవిద్య యే కాక వేదవిద్య కూడ స్త్రీసమాజమున ఎట్లు వ్యాపించి యున్నదోతెలిసికొనవచ్చును. ఇదేవిధముగ లౌకిక సాహిత్యమునందునూ ప్రశంసనీయములైన సేవలందించిన కవయిత్రులు ఎందరో ! వారిలో ప్రముఖమైన కవయిత్రుల పరిచయము దిఙ్మాత్రముగ ఉదహరించుటే ఈవ్యాసము ఉద్దేశము.

 

శ్లో. శీలావిజ్జా మరులా మోరికాహ్వాః,

కావ్యం కర్తుం సంతు విజ్ఞాః స్త్రియోఽపి.

విద్యాం వేత్తుం వాదనే నిర్విజేతుం,

దాతుం విద్యాం యః ప్రవీణః స వంద్యః.

 

అని ధనదేవుడు తెలిపి యున్నాడు. అనగా శీల, విజ్జ మారల, మోరిక, యనువారలు కావ్యమును వ్రాయగలుగుదురేమోగాని, విద్యనభ్యసించుటకు,విద్యనభ్యసింపజేయుటకు,  విద్వద్గోష్ఠివాదనలో జయించుటకు కూడ ప్రవీణుడైన పురుషుడే సమర్థుడని అభిప్రాయపడినాడు. ఇయ్యది ఆతని అసూయను తెలిపినప్పటికినీ, ఆయా కవయిత్రుల విశయములను పరిశీలించినచో వారు శాస్త్రచర్చాదులలో పురుషులతో సమానులని తెలియుచున్నది.

 

విజ్జిక/విజయ.

శ్లో. సరస్వతీవ కర్ణాటీ విజయాంకా జయత్యసౌ,

యా వైదర్భీ గిరాంవాసః కాలిదాసాదనంతరమ్.

అని రాజాశేఖరుడిచే కాలిదాసుని తరువాత స్థానాన్నే పొందిన కవయిత్రి విజయాంక. ఈమెయే విజయ. విద్య,

విజ్జిక అని కూడ ఈమె ప్రసిద్ధినొందినది. ధనదేవుని చే పేర్కొనబడిన విజ్జ కూడ ఈమెయే!

 

శ్లో. నీలోత్పలదలశ్యామాం విజ్జికాం మామజానతా,

వృథైవ దండినా ప్రోక్తా సర్వశుక్లా సరస్వతీ,

’దండికి తన గురించి తెలియకనే శ్వేతవర్ణురాలిగా సరస్వతీదేవిని వర్ణించినాడు.’ అని ఈ కవయిత్రి తానే సరస్వతినని గర్వంగా ప్రకటించుకొన్నది. ఈమె కర్ణాటక దేశస్థురాలని, రెండవ పులకేశి కుమారుడైన చంద్రాదిత్యుని భార్య యని క్రీ.శ.ఏడవశతాబ్దికి చెందినదని సాహిత్య విమర్శకుల అభిప్రాయము.

 

శ్లో.  ఏకో భూన్నలినాత్ తతశ్చ పులినాద్వల్మీకతశ్చాపరః,

తే సర్వే కవయో భవంతి గురవ స్తేభ్యో నమస్కుర్మహే।,

అర్వాంచో యది గద్యపద్య రచనై శ్చేతశ్చమత్కుర్వతే

తేషాం మూర్ధ్నిదదామి వామచరణం కర్ణాటరాజప్రియా॥

అని విజ్జికశ్లోకము గా లభించు ఈశ్లోకమునందు కవయిత్రి “బ్రహ్మ, వ్యాస, వాల్మీకులు మాత్రమే కవులు, గురువులు. అట్టివారికి మాత్రమే నమస్కరిస్తున్నాను. తదితరులు గద్యపద్యరచనా చమత్కారమును వినోదము  కొరకే కలుగ జేయువారు గాన అట్టివారి తలపైన కర్ణాట రాజప్రియయైన తాను వామపాదమునుంచెదనని ప్రకటించుకొన్నది. కాని  అజ్ఞాతకర్తృత్వకమై ’కౌముదీమహోత్సవము’ అను కావ్యమును ఈమెయే వ్రాసెనని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

 

సుభద్ర

శ్లో.పార్థస్య మనసి స్థానం లేభే ఖలు సుభద్రయా,

కవీనాం చ వచో వృత్తి చాతుర్యేణ సుభద్రయా.

పార్థుని మనస్సునందు అలనాటి సుభద్ర స్థానము నొందినట్ట్లు, కవయిత్రియగు సుభద్ర తన వాగ్వృత్తి చాతుర్యముచేత కవులమనస్సునందు స్థానము నొందినదని రాజశేఖరునిచే కొనియాడబడిన  కవయిత్రి ఈ సుభద్ర.  కావ్యమాలలో నుదహరించబడిన ఈమె శ్లోకమొక్కదానిని గమనించండి.

 

శ్లో. దుగ్ధం చ యత్ తదను యత్కథితం తతో ను

మాధుర్యమస్య హృతమున్మథితం చ వేగాత్,

జాతం పునర్ఘృతకృతే నవనీతవృత్తి

స్నేహో నిబంధన మనర్థపరంపరాణామ్.

ఈ శ్లోకమునందు పాలయొక్క దీనావస్థను  తెలుపుతూ స్నేహవృత్తి అనర్థపరంపరలనే కలికించునని అన్యాపదేశమున తెలిపెను. పదవశతాబ్దీయుడైన రాజశేఖరునిచే ప్రసిద్ధ కవయిత్రిగా కొనియాడబడిన ఈమె కాలము అంతకంటె పూర్వమని చెప్పవచ్చును . ప్రస్తుతము ఈమె గ్రంథములేవియును కానరాకున్నవి.

 

అవంతి సుందరి

రాజశేఖరుని ప్రశంసలందు కొన్న మరొక ముఖ్యమైన కవయిత్రి అవంతి సుందరి . ఈమె రాజశేఖరుని భార్య కావడము మరొక విశేషము .

శ్లో.  చాహుణకులమౌలిమాలికా రాజశేఖర కవీంద్ర గేహినీ ,

భర్తుః కృతిమవంతి సుందరీ సాప్రయోజితు మేతదిచ్ఛతి ||

అని తనకర్పూరమంజరిని ఆమె ప్రయోగింపనిచ్ఛగించుచున్నదని రాజశేఖరుడు తన నాటకమున తెలియజేసినాడు . ఇంకను ఆయన తన కావ్యమీమాంస యందు కొన్ని చర్చనీయాంశములందు ఈమె అభిప్రాయములనుతెలిపియున్నాడు . తద్ద్వారా ఈమె యొక్క సునిశితపరిశీలనజ్ఞానము వ్యక్తమగుచున్నది

 

గంగా దేవి    

కవయిత్రులలో ఉత్తమమైన రచన గావించిన కవయిత్రి గంగాదేవి . క్రీ. శ. 14 వ శతాబ్ది కాలమువాడై తనభర్త కంపరాయుని శౌర్యసాహసములను ‘వీరకంపరాయచరితమ్ ’ అను కావ్యముద్వారా తెలియజేసినది. వీరరస స్ఫొరకమైన ఈ కావ్యమునకు “మధురావిజయం “నామాంతరముకూడ కలదు . మనోహరమైన, సరళమైన శైలిలోనున్న ఈ కావ్యము కాళిదాసకవిత్వమును స్ఫురింపజేయును . ఈమె శ్లోకమోకదానిని గమనించండి.

శ్లో || ఘనమాన దలారరీపుటం నలిన మందిరమిందిరాస్పదమ్,

పరిపాలయతిస్మ నిక్వణన్ పరితో యామికవన్ మధువ్రతః .

 

తిరుమలాంబ

క్రీ.శ. 16వ శతాబ్ద ఉత్తరార్ధమునకు సంబంధించిన అచ్యుతరాయలభార్యలలో నొకతె యైన తిరుమలాంబ కూడ తన భర్తనే నాయకునిగా జేసికొని ‘వరదాంబికా చంపు’ అను చంపూకావ్యమును వ్రాసినది. ఈ కావ్యమున అచ్యుతరాయలు వరదాంబతో వివాహము మొదలుకొని, వెంకటాద్రి యౌవరాజ్యపట్టాభిషేకమువరకు వర్ణించినది. శబ్దచమత్కారములతోనూ,అర్థప్రౌఢిమతోనూ కావ్యము రసవత్తరముగానూ కొనసాగుతూ ఈ కావ్యము పాఠకుల మనస్సును రంజిల్లజేయును.

 

రామభద్రాంబ :

అధిక శ్రియమచ్యుతేంద్రసూనుం,

రఘునాథం రఘునాథమేవ సాక్షాత్ ,

హృదయే కలయన్తి యే మహాంతః ,

పరమానందభరాత్త ఏవ ధన్యాః .

అని 16 వ శతాబ్దమునకు సంబంధించిన తిర్యుమలాంబాకాలమునకు సంబంధించిన  “రామభద్రాంబ” కవయిత్రి కూడ తన భర్తయైన తంజావూరు ప్రభువైన రఘునాథనాయకుని నాయకునిగా జేసికొని ఆయన అనుజ్ఞతో చారిత్రికకావ్యశ్రేణిలో జేరు “రఘునాథాభ్యుదయ మహా కావ్యము”ను వ్రాసినది. 900 శ్లోకములకు పైగా వ్రాయబడిన ఈ కావ్యము 12 సర్గలతో నిబద్ధమైనది. “అష్టభాషాకల్పితచతుర్విధకవితాను ప్రణీత సాహిత్య సామ్రాజ్య భద్రపీఠారూఢ రామభద్రాంబా విరచితే… “అను గద్యమును బట్టి ఈమె పాండిత్యప్రకర్షత్వమును అర్థం చేసుకొనవచ్చు.

 

మధురవాణి

తంజావూరు ప్రభువైన రఘునాథనాయకు (1614-1633) ని చే వ్రాయబడిన రామాయణమును ఆయన కొలువులోనున్న మధురవాణి అనే కవయిత్రి సంస్కృతీకరించినది. ప్రస్తుతము ఈ కావ్యము 1500 శ్లోకములకుపైగా 14 సర్గలతో లభించుచున్నది. ఈమె రచన ఆమె పేరుకుతగినట్లుగా లలితమధురమైనట్టిది.

 

శీలభట్టారిక

ధనదేవునిచే పరిచయము  గావించబడిన మరొక కవయిత్రి శీలబట్టారిక. ఈమె గురించి రాజశేఖరుడు –

శ్లో. శబ్దార్థయో సమో గుంఫః పాంచలీరీతిరుచ్యతే,

శీలాభట్టారికావాచి బాణోక్తిషు చ సర్పతి .

అని బాణునితో సమముగా ప్రశంసించినాడు. ఈమె రచన యైన ప్రసిద్ధమైన ఈ శ్లోకము రసజ్ఞులైన సహృదయులగు మీ స్మృతిపథమున విరాజిల్లుచునేయుండును. అట్టి ఈ శ్లోకమును గమనించితిరా?..

 

శ్లో. యః కౌమారహరః స ఏవ వరః తా ఏవ చైత్రక్షపాః ,

తే చోన్మీలితమాలతీసురభయః ప్రడాః కదంబానిలాః,

సా చైవాస్మి తథాఽపి తత్ర సుతవ్యాపారలీలావిధౌ,

రేవారోధసి వేతసీతరుతలే చేతః సముత్కంఠతే .

ఈ శ్లోకమున నాయిక తన చెలికత్తెలతో తన వైవాహికజీవితమును వివరించుచూ, “ పూర్వమున తన మనోహరుడైన ప్రియుడినే పెండ్లియాడిననూ,రేవానదిలోని యిసుకతెన్నెలపై అట్టి ఆప్రియునితో గావించిన సురత వ్యాపారమే తన మనస్సునకూ ఇప్పటికినీ ఉత్కంఠమును కలిగించుచునేయున్నది.” అని తెలిపిన ఈ

శ్లోకము ఎంత హృద్యముగానున్నదో సహృదయులెరుగనది కాదు.

 

దేవకుమారిక

క్రీ. శ. 17 వశతాబ్ది ఉత్తరార్ధ, 18 వశతాబ్ది పూర్వార్ధములకు   సంబంధించిన ఉదయ్ పూర్ రాజవంశీయుడైన రాణా అమరసింహుని భార్య యైన దేవకుమారిక “బైద్యనాథప్రాసాదప్రశస్తిః ” అను కావ్యమును రచించినది. ఈ లఘుకావ్యమునందు రాణావంశీయులచరిత్రను పేర్కొన్నది. ముఖ్యముగా తనకుమారుడైన సంగ్రామసింహుని పట్టాభిషేకమును అద్భుతముగా వర్ణించినది. మచ్చునకు ఈమె శ్లోకమునొకదానిని పరిశీలించండి.

 

శ్లో. గుంజద్ భ్రమద్ భ్రమరరాజివిరాజితాస్యం,

స్తంబేరమాననమహం నితరాం నమామి |

యత్పాదపంకజపరాగపవిత్రితానాం,

ప్రత్యూహరాశయ ఇహ ప్రశమం ప్రయాంతి ||

 

వికటనితంబ

శ్లో. కే వైకటనితంబేన గిరాం గుంఫేన గుంఫితాః|

నిందంతి నిజకాంతానాం న మౌగ్ధ్యమధురం వచః ||

అని రాజశేఖరుడు తన సూక్తిముక్తావళియందు పేర్కొన్న మరొక కవయిత్రి వికటనితంబ. ‘వికటనితంబపదగుంభనములను గమనించినవారెవరు  తమ భార్యలమృదుమధుర వాక్యములనైననూ నిందించకమానరు?’ అని ఈమెను ప్రశంసించియున్నాడు. ఈమె కాశ్మీరదేశస్థురాలు. ఈమెను గురించి భోజమహారాజు కూడ తన శృంగారప్రకాశిక లో ప్రస్తావించినాడు. ఐనప్పటికినీ ఈమె కావ్యములేవియూ ప్రస్తుతము లభ్యములుకాకున్నవి.

 

ఫల్గుహస్తినీ

ఏనిమిదవ శతాబ్ది ఉత్తరార్ధమున ప్రసిద్ధినొందిన కవయిత్రి ఫల్గుహస్తిని. సుభాషితావళియందు ఈమె శ్లోకములు రెండు కానవచ్చుచున్నవి.

శ్లో. త్రినయనజటావల్లీపుష్పం నిశావదనస్మితం,

గ్రహకిసలయం సంధ్యానారీనితంబనఖక్షతమ్|

తిమిరభిదురం వ్యోమ్నః శృంగం మనోభవకార్ముకం

ప్రతిపదినవస్యేందోః బింబం సుఖోదయమస్తు నః ||

అను ఈ శ్లోకమునందు శుక్లపక్షప్రతిపదచంద్రునివర్ణన గావించబడినది. అలంకారశాస్త్రకర్తయైన వామనుడు కూడ ఈమె ప్రస్తావనగావించినాడు.

 

త్రివేణి

క్రీ. శ. 19వ శతాబ్దికి చెందిన త్రివేణి యను కవయిత్రి దక్షీణభారతమునకు చెందినట్టిది. శ్రీవైష్ణవీయురాలగు నీమె  దౌర్భాగ్యమువలన తనకు వైధవ్యము ప్రాప్తించగా,ఆధ్యాత్మికవ్యాసంగమొనరించుచూ,స్తోత్రములను, కావ్యములను రచించుటేకాక మేఘసందేశముననుసరించుచు రెండు కావ్యములను, రెండు వేదాంత నాటకములను కూడ రచించియుండెను.

 

బీనాబాయి

చాహువాక వంశీయుడు ఫాటలీపుత్రరాజైనహరిసింహుని భార్య బీనాభాయి. ఈ రచయిత్రి కాలము 15వ శతాబ్దమని తెలియవచ్చుచున్నది. మిక్కిలి పవిత్ర క్షేత్రమైన ద్వారకానగరము గురించి ద్వారకాపట్టల యను గ్రంథమును సంకలనమొనరించెను. ఈమె గొప్ప ప్రతిభావంతురాలు.ఈమె కాలమునకు సంబంధించినట్టిదే విశ్వాసదేవి. ఈమె గంగావాక్యావళీ యను గ్రంథమును సంకలనమొనర్చెనని చెప్పుదురు. అదే విధముగా 14 శతాబ్దానికి చెందిన లఖిమ ,16 వ శతాబ్దానికి చెందిన ఇందులేఖ ,17 వశతాబ్దానికి చెందిన వైజయింతిక అను కవయిత్రులు వ్రాసిన కావ్యములు  కూడ లభ్యములు కాకున్నవి. క్షమారావయను 20 వ శతాబ్దికి చెందిన కవయిత్రి సత్యాగ్రహగీత యను కావ్యమును వ్రాసినది. ఇట్లు ప్రాచీన సంస్కృతసాహిత్యమునకు సేవజెసిన మహిళామణులెందరో! నాటికాలముననే  “ముదితల్ నేర్వగరానివిద్యగలదే ముద్దార నెర్పింపగన్”అని విద్యా, సాహిత్యరచనా పాటవమున మగధీరులను కూడా తలదన్నువారమని చాటి చెప్పినట్టి మాతృమూర్తులకు వందనమర్పించుచూ..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *