April 27, 2024

రాముడుండాడు…రాజ్జిముండాది. – కేశవరెడ్డి

రచన:చక్రధర్                                                                                                        

 

 

భూస్వాములో .. దొరలో.. జమీందారులో.. మోతుబరీ రైతులో.. కార్పొరేట్ మేధావులో .. ఎవరైతేనేమిటి ?

సామాన్యుల జీవనావసరాలని.. నిసిస్సహాయతనీ ..

బలహీనతనీ ఆధారం చేసుకొని  ఏళ్ళకి ఏళ్ళు శ్రమదోపిడీ చేసి కూలీలుగా, జీవమున్న యంత్రాలుగా మార్చే పెట్టుబడి దారీ వ్యవస్థ..ఆ చట్రంలో ఇరుక్కొని బతుకీడ్చే సామాన్యుని బతుకే ఈ కథ. ఈ పెట్టుబడిదారీ వ్యవస్థకి ఆసరాగా నిలిచి ఊతమిచ్చేదే మన గవర్నమెంటు. అందుకే అది చేసే చట్టాలుకూడా సామాన్యుడి ఎదుగుదలకి ఉపయోగపడవు. అది కట్టించే పక్క ఇళ్ళు.. రేషన్…చౌకధరదుకానాలు మొదలైనవి అన్నీ  తమ చాకిరీకి ఉపయోగపడే సామన్యులు చావకుండా చేసే ప్రయత్నాలే. వాళ్ళేసే ఓట్లకోసం పడే పాట్లే.

కూనిగాడు ఎప్పుడోచేసిన చిన్న అప్పు తీర్చటానికి.. ముప్పైయేండ్ళు పెదనాయుడు పొలం కూలీగా మారతాడు.

అతనికి ఒక్క ఎకరం ఎరచూపి.. కూనిగాడి కొడుకు పులిగాడిని మరోముప్పై ఏండ్లకు కూలీ కుదుర్చుకుందామని ఆశ జూపుతాడు పెదనాయుడు. అప్పటికే ఈ జమీందారుల చేతుల్లో అన్యాయానికి గురైపోతున్నామనీ..ఈ పల్లె జీవితం గిట్టుబాటు కాదని తెలుసుకున్న పుల్లిగాడు పట్నంలో కూలీ జీవితం గడుపుతుంటాడు. తండ్రి తనకి ఉన్నపళంగా రమ్మని రాసిన ఉత్తరం చూసి ఎదో జరిగుంటుందేమో అన్న భయం తో పల్లెకొస్తాడు పుల్లిగాడు. అప్పుడు అక్కడ వివిధ జనాల పీడన జీవితాలనీ, వడ్డేర..చాకలి..కంసాలి వంటి వృత్తులవాళ్లూ.. నిమ్నవర్గాలకి చెందిన రోజుకూలీల  దుర్భరజీవితాన్ని ఆవిష్కరిస్తాడు రచయిత.

అప్పుడెప్పుడో దొంగలు ..బందిపోట్లు ఉండేవారు. వాళ్ళు ఊరిమీదపడి  అంతా దోచుకుపోయేవాళ్ళు. కానీ ఈనాడు ఈ పెట్టుబడి దారులు..గవర్నమెంటూ కలిసి పరోక్షంగా దోచుకుంటున్నారు. మనిషి చస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం, అతడు తన కాళ్లమీద నిలబడి పది రూపాయలు సంపాదించగానే ఇంకంటాక్స్, ఆ టాక్స్ ఈ టాక్స్  అంటూ చట్ట  ప్రకారం దోచుకుంటుంది ప్రభుత్వం . బలవంతుడు బలహీనత మీద  దోచుకుంటాడు. పెట్టుబడిదారులు మనుషులని కూలీలుగా మార్చి శ్రమనీ.. స్వేచ్చనీ దోచుకుంటారు. ఈ ‘దోపిడి’ ప్రత్యక్షంగా ఎక్కడా కనపడదు.కానీ దోపిడీ జరుగుతుంటుంది.రోజువారీ జీవితాలలో అంతర్బాగం ఐపోతుంది.  అందుకే ఈ కథలో  దోపిడీ దారుడు పెదనాయుడు ప్రత్యక్షంగా కథలో కనిపించడు.  పెదనాయుడి  పాలేరు ముత్యాలనాయుడు కపిపిస్తాడు.అతడు జనాల భయం…బలహీనత బాగా తెలిసినవాడు. యుగ యుగాలుగా అణువణువునా బానిసత్వాన్ని ..భయాన్ని నిలువెల్లా నింపుకున్న సామాన్యులు తమ గురించి తాము తెలుసుకోలేరని..తెలుసుకున్నా ఎదురించి నిలవలేరనీ అతనికి తెలుసు.అందుకే నోటికొచ్చిన పచ్చి బూతులూ తిడుతుంటాడు. జనాలు నోరుమూసుకొని పడటం తప్ప  ఏమి చెయ్యగలరు ??

పట్నంలో ఇంతకంటే మెరుగైన బతుకు ఉందనీ తెలిసినా

‘ఈ కొలిమిని నమ్ముకొని మా తాత.. తండ్రీ బతికారు.. నేనూ ఈ ఉళ్ళో యాభై ఏళ్ళనించీ బతుకుతున్నా దీన్ని నమ్ముకొనే’  అనే కంసాలి సెంటిమెంటుకు బానిస.

నేలనే తన ప్రాణంగా నమ్మిన  చిన్నరైతు తిరుపాలనాయుడు..తీసుకున్న అప్పు తీర్చలేక, పొలం జప్తు వాయిదా వేయించేప్రయత్నంలో ప్రభుత్వాదికారి లంచగొండితనానికి..నిర్ధయకీ బలయిపోతాడు. కళ్ళముందు జరుగుతున్న ఇలాంటి అన్యాయాన్ని చూడలేక, పుట్టినప్పటినించీ దేవాలయంలో పూజలు చేసే పూజారి..

‘ఊల్లో గుడి ఉండేదేవిటికి ?కంటికి రెప్ప మాదిరి..కాలికి గోరుమాదిరి ఊరును దేవుడు కాపాడాల. ఊరు ఇట్టా కిలపడిపోతా ఉంటే దేవుడు ఉన్నట్టా లేనట్టా ?? మరి గుళ్ళో దేవుడు లేనపుడు ఆ రాతిబొమ్మకి పూజల్జేసే దేవిటికి ?? ‘

దీనులకి..దిక్కులేని వారికి..దరిద్రలకీ అణగారిన ఆర్థ  జనానికి  ఏ సహాయమూ చేయని రాతిబొమ్మకి పూజలు చేస్తున్నానని తెలుసుకుంటాడు పూజారి. అర్చకత్వాన్ని వదిలేస్తాడు.

ముప్పయేళ్ళ బానిసత్వం నించి విములక్తుడయిన కూనిగాడు, కుల వృత్తి ని వదిలేసిన కంసాలి, పూజారీ,  ఉన్నపాటి భూమిని పోగొట్టుకొన్నతిరుపల నాయుడుని  పుల్లిగాడి తో పాటు పట్టణానికి బయలుదేర తీయటంతో  ఎక్కడో  ‘రాముడుండాడూ..రాముని రాజ్జిముండాది,  తమ జీవితాలు బాగుపడతాయ్ అన్నట్టుగా..ఒక చిన్న నమ్మకాన్ని మిగులుస్తాడు రచయిత.

ఇక ప్రత్యెకంగా చెప్పుకోవలసింది రచయిత  శైలి. సునిశితత్వం. పల్లె జీవిత అనుభవం, అక్కడి మనుషుల మనసులోతులు అన్నీ పూర్తి అధికారం ఉన్నది. సన్నివేశ వాతావరణాన్ని అమాంతం కళ్లముందు ఉంచుతాడు. ప్రకృతి వర్ణన అయితే చెప్పనే అక్కరలేదు, ఆ వర్ణనతో  జరగబోయే సన్నివేశాన్ని చూచాయగా చెప్పకనే చెపుతూ కథ మీద ఆసక్థి భిగువు కలిగింపచేస్తాడు. కేశవరెడ్డి నవలల్లో కథ కంటే కథ చెపుతున్న తీరే అద్భుతంగా ఉంటుంది.

భయానికి.. భక్తికి..సెంటిమెంట్కి..సాంప్రదాయానికి…మూడనమ్మకానికి..సంఘనీతికీ..అర్థం లేని నియమాలకీ.. మనమంతా,  ఒక్కోరం ఒక్కదానికి బానిసలం.

ఆ బానిసత్వం మన మనసుల్లో ఉంది. దాన్ని ఎదిరించిన నాడు.. జీవితంలొ కొత్త వెలుగూ, ఆనందం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *