May 17, 2024

అండమాన్ డైరీ – 2

రచన: దాసరి అమరేంద్ర  amarendra

 

ప్రకాష్ – ప్రశాంతిల సాహచర్యమూ, గైడెన్సుల పుణ్యమా అని అండమాన్ చేరిన మొదటి రోజునే ‘అదేదో స్వంత ఊరు’ అన్నంత చనువు కుదిపేసింది… ‘కొత్త ప్రాంతం’ అన్న బెరుకూ, వెరపూ – వాటికి చోటే లేదు.. బాగా పొద్దు పోయేదాకా కబుర్లు…మర్నాటి మూడు ద్వీపాల యాత్రకు మానసికంగా సిద్ధం…

ఇంకా ఇండోనేషియాలో ఉన్నట్టుగా – ఈ పర్వత శ్రేణులు ఒకప్పుడు నిప్పులు గక్కే అగ్నిపర్వతాలట. ఇప్పటికీ ఆ అవశేషం ‘బారెన్ ఐలెండ్’ అన్న ద్వీపంలో కనపడుతుంది. పోర్ట్ బ్లెయిర్‌ నుంచి 140 కిలోమీటర్లు.. మన దేశంలో ఉన్న ఏకైక ‘సజీవ’ అగ్నిపర్వతం ఈ ద్వీపంలో వుంది… అడపాదడపా ఇది నిప్పు చిమ్ముతూ ఉంటుంది… 1991లో ఒకసారి, 95లో మరోసారి జూలు విదిలించిందట. మామూలుగా ఈ చిరుద్వీపాన్ని వెళ్లి చూడటం కష్టం.. పర్మిషన్లూ అదీ సంపాదించుకొని మరో బోట్లలో వెళ్లి రావచ్చు – మీరు విక్రమార్కులయితే, విదేశీయులకు అ అవకాశమూ లేదు – వాళ్లు ఓడ దిగరాదు… దూరము నుంచే చూసి ఆనందించాలట…

ఈ ద్వీపాల్లోని 572 ద్వీపాలనూ కలుపుకొంటే మొత్తం విస్తీర్ణం 8250 చదరపు కిలోమీటర్లు… అండమాన్ ద్వీపాలు దాదాపు 500 కిలోమీటర్ల పొడవు.. వెడల్పు బాగా తక్కువ, ఓ పాతిక కిలోమీటర్లు… నికోబార్లు 260 కిలోమీటర్ల పొడవు.. ఇవి అండమాన్ల కన్నా కొంచెం ‘వెడల్పు’ ఎక్కువగలది – ఒక చోట ఏకంగా అరవై కిలోమీటర్లట. అన్నట్టు భారతదేశపు తూర్పు తీరపు సముద్రాన్ని మనం బంగాళాఖాతం అని పిలుస్తాం గదా.. ఆ పిలుపు అండమాన్ల వరకు మాత్రమే!  అండమాన్లకు తూర్పున బర్మాకు మధ్యన ఉన్న సముద్రాన్ని ‘అండమాన్ సముద్రం’ అంటారు..

పోల్చి చూస్తే అండమాన్ నికోబార్ల విస్తీర్ణం మన ఈశాన్యభారతంలోని ‘త్రిపుర’ రాష్ట్రమంత ఉంటుంది – జనాభా మాత్రం పదోవంతు… అంతా కలసి అయిదు లక్షలు.. ఆర్కియాలజీ రికార్డుల ప్రకారం కనీసం రెండువేల సంవత్సరాల నుంచి అక్కడ జనసంచారం ఉందన్న విషయం ఆధారపూర్వకంగా రుజువయిందట. కానీ మానవ పరికామ శాస్త్రం పునాదులమీద అక్కడున్న ఆదిమ జాతులవారి భాషా, సంస్కృతీ, జీవలక్షణాలూ పరికరిస్తే వాళ్లు ఏభై అరవై వేల సంవత్సరాల క్రితపు వాళ్లు అని అర్థమవుతుందట – ఆయా జాతుల గురించి ముచ్చట్లు మరోసారి.

SAM_3703

మళ్లీ ద్వీపాల దగ్గరకు వద్దాం….

మార్చి అయిదో తారీఖు – మా యాత్రలో రెండోరోజు – మూడు ద్వీపాలు…

నిన్నంతా.. ఆదివారం – మాతోనే గడిపారు గాబట్టి ఈనాడు సోమవారం పనిరోజు గాబట్టి ప్రశాంతీ, ప్రకాష్ మాతో వచ్చే ప్రసక్తిలేదు. ప్రశాంతి వాళ్ల నాన్నగారికి ప్రశాంతంగా ఇంటి పట్టున ఉండటమే ఇష్టం.  వాళ్ల అమ్మగారు, మాత్రం ఇలాంటి విషయాల్లో మహా ముందుంటారు. ఆవిడ పుట్టి పెరిగిందీ, నివసిస్తోందీ గుంటూరు జిల్లా గ్రామీణ ప్రాంతమే అయినా – పిల్లలు అనేకానేక పట్టణాలూ నగరాల్లో ఉంటున్నారు గాబట్టి  ఆయా ప్రదేశాలను వాళ్ల కన్నా ఉత్సాహంగా వెళ్లిపోయి చూసి వస్తూ వుంటారు… టీనేజి మనుమలూ, మనుమరాళ్లూ  ఉంటే మాత్రమేమీ! మనసు ఉత్సాహము గదా ముఖ్యం!!

ఆవిడ, మేమిద్దరం – ముగ్గురం కలసి మూడుద్వీపాల వేటకు బయల్దేరాం.

SAM_3696

వెళుతోన్నది రాస్ ఐలెండ్, లైసర్ ఐలెండ్, నార్త్ బే బీచ్… ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగుదాకా – ఓ బడా ఫెర్రీ, వందా, నూట ఏభైమంది సులువుగా పట్టేది. లంచ్ కూడా కలుపుకొని మనిషికి నాలుగొందలు.. బయలుదేరేది ఊళ్లో. ఇలాంటి లోకల్ ట్రిప్పులు ఆరంభమయ్యే అబెర్‌డీన్ జెట్టీ నుంచి…  వర్కింగ్‌డే అయినా, సీజను ముగిసిపోతోన్న మార్చి నెల అయినా ఫెర్రీ నిండుగా ఉంది. పంజాబీలు, బెంగాలీలు, తమిళులు, యూపీ భయ్యాలు, మహారాష్ట్రీయులు, ఒరిస్సావారు, ఇక మన తెలుగు వాళ్లు – అదో మినీ భారతదేశం. గోవా ఫెరీల్లాగా గానాబజానా ఉత్సవ వాతావరణం  లేకపోయినా సందడికి మాత్రం లోటులేదు.. అందరిలోనూ అండమాన్ సంతోషం.. మాలాగే చాలా మంది టూరిస్టులకు ఇదే మొట్ట మొదటి నీలద్వీపాల నౌకావిహారం

ముందుగా వెళ్లింది ‘రాస్’ ఐలెండ్‌కు..

SAM_3659

చిన్న ద్వీపం. అంతా కలసి ఒక చదరపు కిలోమీటరు విస్తీర్ణం. కన్యాకుమారిలో వివేకానందా రాక్‌లాగా ఈ ద్వీపం కూడా పడవల రేవు నుంచి చేతికందే దూరంలో ఉన్నట్టనిపిస్తుంది. అండమాన్లు వచ్చే టూరిస్టులంతా విధిగా చూస్తారు.. చక్కని పరిశుభ్రతా.. కళకళా తళతళా మెరిసే మెయింటెనెన్సు… సముద్రం… కొబ్బరిచెట్లు.. వృక్షాలు… తీగలు.. శిధిలాలయాలు.. జపనీస్ బంకర్లు… మామూలే… వెళ్లీ వెళ్లగానే స్పష్టంగా కనిపించే లోపలికి రమ్మని పిలచిన బంకరు…

ఒకప్పుడు ఈ ద్వీపం ‘గ్రేట్ అండమానీస్’ అన్న స్థానిక తెగ నివాస స్థలమట. అయిదువేల జనాభా ఉన్న ఆ తెగ బ్రిటిషువాళ్లు అడుగు పెట్టిన ఇరవై ఏళ్లలో ఇరవై ఎనిమిదిమందికి పడిపోయిందట. ఇంగ్లీషు వారికి 1858 నుండి 1941 ఇదే ‘రాజధాని’ గా వ్యవహరించింది.. జపానువారి ఆక్రమణలోకి వచ్చాక యుద్ధ ఖైదీల స్థావరమయింది.. ఇప్పటికీ అప్పటి చీఫ్ కమిషనర్ ఇంటివీ, ఒక చర్చివీ శిధిలావశేషాలు కనిపిస్తాయి.

వెళ్లి వెళ్లగానే ఫెర్రీ మనుషులంతా అక్కడ అమ్ముతోన్న కూల్ డ్రింకులూ, చిప్సూ, కొబ్బరి బోండాల మీద దండెత్తారు. నేను మాత్రం ‘ప్రకృతి ఎక్కడా?’ అంటూ వెదుకులాట మొదలెట్టాను. అసలు ఆ ద్వీపం ఉన్నదే అసలు సిసలు ప్రకృతి మధ్యన అయినా కొంచెం వెదకగా, ఓ రెండు మూడువందల మీటర్లు నడిచి ద్వీపపు తూర్పు కొనకు చేరగా నా అన్వేషణ ఫలించింది. నే ఒక్కడినే అక్కడ.. రెండువందల ఢెబ్భై డిగ్రీల మేర ఎటు చూసినా సముద్రం వెనక్క చూస్తే రాస్ ద్వీపపు నేలామట్టీ, చెట్లూ పచ్చదనం, కుడిచేతి వేపున పడవల రేవు. ఆ కనిపించీ వినిపించని కోలాహలం, ఎడమన అనంతసాగర నీలం. అపురూప క్షణాలు…

ఆ ఏకాంత యాత్ర ఓ అరగంట సాగించాను. ఓ నేవీ వారి నిషిద్ధ ప్రాంతం తప్పించి ఆ ద్వీపాన్ని అడుగడుగునా పలకరించాను. అలా ఓ రెండు కిలో మీటర్లు ఆయా దారులూ డొంకలూ మధ్య సాగి సాగి, చెట్ల మధ్య కనిపించీ, కనిపించకుండా పోతోన్న పెంపుడు జింకలను పలకరించి తిరిగి వెళ్లి ఫెర్రీ బృందాన్ని, అక్కడే చేరగిలి ద్వీపపు అందాన్ని ఆస్వాదిస్తోన్న లక్ష్మినీ కలిసేసరికి – కరెక్టుగా ఫెర్రీ వారు నిర్దేశించిన ‘గంట’ గడిచింది.

SAM_3729

అంతా పోలోమని ఫెర్రీ ఎక్కేసాం.. రెండుగంటల సహనౌకా యాత్రావాసంతో మెల్లగా ఒకరొకరితో ముఖ పరిచయం కలగసాగింది.. ఎవరెవరి ఎవరెవరి కుటుంబాల్లోని వారో – ఆ ఎరుక – పదీ పన్నెండు చిరునవ్వులు.. ఒకటీ అరా పలకరింపులు.. మా ట్రిప్పు మొదలయినప్పుడు  కొత్తగా స్కూల్లో చేరిన విద్యార్థులలాగా బుద్ధిగా ‘లోపలికి’ వెళ్లి సీట్లలో కూర్చున్నవాళ్లమంతా యాత్ర ఒక పాదం ముగిసేసరికి అనుభవం గడించి, రెండో పాదపు యాత్ర కోసం లోపలి సీట్లని పక్కకు నెట్టి అన్ని వైపులా ఏ అడ్డంకి లేకుండా కనిపించే సాగర దృశ్యాలకోసం నావా పై కప్పున ఉన్న కొద్దిపాటి కుర్చీల కోసం పరుగులు పెట్టాం. చిక్కించుకొన్న వాళ్లల్లో సంతోషం కించిత్ గర్వం;

‘ఓడిపోయిన’ వాళ్లలో నిరాశ, విషాదం, కించిత అవమానభారం – ఇల్లాంటి ట్రిప్పుల్లో మనం ఎంతో జాగ్రత్తగా కాపాడుకొచ్చే ‘పెద్దరికం’ మరుగున పడిపోయి మనం అనవసరంగా అసంకల్పితంగా అణచిపెట్టి ఉంచే పసితనం బయటపడిపోతుంది. మళ్లా ‘జీవించడం’ ఆరంభించామనడానికి అది ఒక శుభసంకేతం గాదూ!!

మా మరుసటి మజిలీ వైపర్ ద్వీపం..

1768లో లెఫ్టినెంట్ ఆర్చిబాల్డ్ బ్లెయిర్ అన్న పెద్దమనిషి ‘వైపర్’ అన్న ఓడలో ‘ఇక్కడ ఖైదీల కోసం ఓ పర్మనెంటు సెటిల్మెంటు ఏర్పాటు చెయ్యాలి’ అన్న ద్యేయంతో అండమానులో అడుగుపెట్టాడట. అదిగో ఆ ఓడపేరే ఈ ద్వీపానికి పెట్టారు. ద్వీపంలోని ఒక గుట్ట మీద ఉరికంబమూ గట్రా ఏర్పాటు చేసారు. ‘అక్కడ ఉరి తీస్తే చక్కగా ద్వీపంలో ఉన్న అందరు ఖైదీలూ ఆ దృశ్యాన్ని చూసి తరించి గుణపాఠం నేర్చుకుంటారు’ అన్నది ఆ నిర్మాణంలోని తాత్విక వ్యూహం. 1867లో అక్కడి జైలు నిర్మించారట. 1872లో అప్పటి వైస్రాయ్ లార్డ్ మేయోను ఈ అండమాన్లలోనే కత్తితో పొడిచి వ్యక్తిగత కారణాలవల్ల హత్య చేసిన షేర్ అలీ అన్న పఠానును ఉరితీసిన ప్రదేశమిది.

అదంతా గతం… కొంచెం దిగులనిపించిన మాట నిజమేగానీ, ప్రస్తుతం అక్కడ ఉన్నది అచ్చమైన ప్రకృతే.. రాస్ ద్వీపం నుంచి వైపర్‌కు వెళ్లడానికి సుమారు అరగంట పట్టింది. అటూ ఇటూ నేలా కొండలూ చెట్లూ కనిపించే జలమార్గంలో ఓ ఐదారు కిలోమీటర్ల ప్రయాణం.. అన్నట్టు మా ఓడ మేము ఉంటోన్న నావీ కాలనీ పరిసరాల్లోంచే వెళ్లింది – మేము ఆ పరిసరాలను గుర్తించెయ్యగలుగుతున్నామన్న స్మృతి కలిగి – సంతోషం.. ఎవరో అన్నారు దారిలో ‘అదిగో ఆ పక్కనే చాటం ద్వీపం – చాలా పాత కలపమిల్లు ఉందా ద్వీపంలో..’  అని

పాత జ్ఞాపకాలలోకి తీసుకెళ్లడమే తప్ప వైపర్ ద్వీపంలో చెప్పుకోదగ్గ విషయాలేమీ  లేనట్టే… ‘ప్రకృతి’ విషయంలో రాస్‌ద్వీపం చాలా మెరుగు – ఓ ముప్పావుగంట ఆ ద్వీపంలో గడిపాం.  ద్వీపం సంగతి ఎలా ఉన్నా అక్కడికి వెళ్లడం, రావడం,  ఆ గంట గంటన్నర సముద్రయానం – అదో పెద్ద ఆకర్షణ అందరికీ.

SAM_3747

వైపర్ ముగిసాక తధుపరి – ఆఖరి – మజిలీ ‘నార్త్ బే బీచ్’. ఇది పోర్టు బ్లెయిర్ పట్టణానికి – సరిగ్గా ఉత్తరాన ఉంది. నిజానికి ఇది ద్వీపం గాదు. సముద్ర జలాల్లోకి చొచ్చుకు వచ్చిన ఓ ద్వీపకల్పపు కొసన ఈ బీచ్ ఉంది. అండమాన్ ద్వీపాలు పగడాల – కోరల్స్ – సంపదకు సుప్రసిద్ధం. పోర్టు బ్లెయిర్ నుంచి ఆపగడాలను చూడడానికి వెళ్లాలి అంటే ఈ నార్త్ బేబీచ్ అతి దగ్గరలో ఉన్న ప్రదేశం… అంచేత టూరిస్టుల తాకిడీ ఎక్కువే…

మా టూరు బ్రోషర్‌లో ఈనార్త్ బేదగ్గర కోరల్స్ చూడడానికి గాజుతో చేసిన అడుగు ప్రాంతమున్న బోట్లలో తీసుకు వెళ్లడం కూడ ఒక ఐటమ్‌గా లిస్టులో ఉంది. అదిగాక స్నోర్‌కెలింగ్ అన్న చిన్న ప్రక్రియ ద్వారా ఎవరికి వాళ్లు చూడదలచుకొంటే అందుకు అవసరమయిన చిరు పరికరాలూ గైడూ – వాటి చార్జీలు అదనం – అని వ్రాసి ఉంది. ‘మీరు నార్త్ బేలో స్నోర్క్లింగ్ చెయ్యకండి. ఎలానూ హేవ్‌లాక్ వెళుతున్నారు గాబట్టి అక్కడ చేద్దురుగాని – బావుంటుంది అని హెచ్చరించాడు ప్రకాష్ ముందే. అంచేత ఉన్న గ్లాస్ బాటమ్ బోటులోనే సరిపెట్టుకొన్నాం. ఏ మాత్రమూ తృప్తి కలిగించలేదు..

ఫెర్రీయాత్ర ముగించుకొని నేలమీద అడుగుపెట్టే సరికి సాయంత్రం నాలుగుదాటింది. అబ్బుర పడాల్సినంత వింతలూ విశేషలూ ఏమీ చూడక పోయినా మెల్లగా, మెల్ల మెల్లగా అండమాన్ల గాలీ నీరూ మా మా మనసుల్లోకి ఇంకుతోన్న భావన. ఆయా ప్రదేశాలతో స్నేహం పండుతోన్న భావన.. ఒకటి రెండు కుటుంబాలతో  మాటలు, ముచ్చట్లు, కబుర్లు,

SAM_3705

జెట్టిలో దిగేసరికి ప్రకాషూ, ప్రశాంతి వాహన సమేతంగా ఎదురు చూస్తూ కనిపించారు. నావీ అధికారి గాబట్టి మధ్యాహ్నానికల్లా అఫీసయిపోతుంది. అయిదుగురము కలసి ఆ జెట్టి ఉన్న ప్రాంతంలో ఓ అరగంటసేపు తిరుగుదాం… ( తన చివరి రోజులు గుర్తుగా ) పూలదండ విసురులోన్న రాజీవ్ గాంధీ విగ్రహం, మళ్లా విగ్రహమున్న పీఠం దగ్గరకు వెళ్లడానికి ‘ఒడ్డు’ నుంచి సముద్రంలోకి నిర్మించిన ఓ వందా నూటయాభై అడుగుల పొడవున్న దిట్టమైన కాలిమార్గం.. ఆ పక్కన వాటర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో వాటర్ స్కూటర్లూ, స్పీడుబోట్ల మీద కేరింతలు కొడుతోన్న టూరిస్టులు (విండ్ సర్ఫింగూ, పారా సైక్లింగూ, వాటర్ స్కీయింగూ లాంటి వినోదాలూ ఉన్నాయట – మరి మాకు కానరాలేదు… సీజను ముగిసి పోతుంది గాబట్టా??!) – అంతా కోలాహలం. కానీ నిన్న సెల్యులర్ జైలులో అయినా, ఈనాటి మూడు ద్వీపాలలో అయినా మా సాహచర్యం అంతా మెయిన్‌లాండ్ నుంచి వచ్చి విభిన్న భాషల భారతీయులతోనే.. పైగా మా హోస్టులూ మాతో పాటు ఉంటున్నారేమో-ఇహ ఈ ఐలాండర్లతోనూ, అటు ఏడేడు సముద్రాలు దాటి వచ్చిన ఫారిన్ టూరిస్టులతోనూ సంపర్కమే లేదు!!

యాత్రలో యాత్ర మా హేవలాక్, నీల్ ద్వీపాల యాత్ర.

SAM_3820

రెండు రాత్రులు మూడూ పగళ్లు… ఒక రాత్రి హేవలాక్లో. మరో రాత్రి నీల్ ద్వీపంలో.. సుమారు రెండు పూటలు పడవ ప్రయాణం, రెండు పగళ్లు ఆయాద్వీపాల్లో.

ప్రకాష్‌కు  తెలిసిన ఓ సెమీఫార్మల్ ట్రావెల్ ఏజెంటు కుర్రాడు – ఈ మా ద్వీపాల యాత్రాసారధి. పోర్ట్ బ్లెయిర్ నుంచి హేవలాక్‌కూ, అక్కడ్నించి మర్నాడు సాయంత్రం నీల్ ద్వీపానికీ, మూడోరోజు సాయంత్రం నీల్‌నుంచి తిరిగి పోర్ట్ బ్లెయిర్‌కూ టికెట్లు కొని తీసుకొచ్చాడు – మరి ఎంచేతో ఈ ఫెర్రీలకు టికెట్లు అంత సులభంగా మామూలు వాళ్లకు దొరకవట.. అయితే గవర్నమెంటు వాళ్లకు తెలిసే ఉండాలి – లేదా చురుకైన ట్రావెల్ ఎజెంటు ద్వారా వెళ్లాలి! ఏమిటోమరి ఈ మాయ! లోగుట్టు పెరుమాళ్లు కెరుక!!

అండమాన్ ద్వీప సమూహాల్లో ఉత్తర అండమాన్, మధ్య అండమాన్, దక్షిణ అండమాన్ అన్నది ముఖ్యమయినది. దక్షిణ ద్వీపానికి ఇంకా దక్షిణాన, 150 కిలోమీటర్లు సముద్రం దాటాక లిటిల్ అండమాన్ ద్వీపం ఉంది. అండమాన్ నికోబార్ ద్వీప సమూహాల్లో 80 శాతం భూభాగం అండమాన్లదే.  లిటిల్ అండమాన్ ‘విడిగా’ సముద్రంలో ఉన్న ఆ మిగిలిన మూడు ‘ద్వీపాలూ’ దాదాపు ఏక బంధంగా ఉత్తర దక్షిణ దిశల్లో నాలుగువందల కిలో మీటర్ల పొడవున వ్యాపించి ఉన్నాయి. రాజధాని పోర్ట్ బ్లెయిర్ సౌత్ అండమాన్ దక్షిణ భాగంలో ఉంది. ఇంకో ముప్పై అయిదు కిలోమీటర్లు వెళితే ఈ బృహత్ ద్వీపపు దక్షిణ కొస – చిడియా తపు” అక్కడ్నించి నేషనల్ హైవే 223 మొదలవుతుంది. దాన్ని స్థానిక పరిభాషలో ‘ది గ్రేట్ అండమాన్ ట్రంక్ రోడ్’ అంటారు.. ఆ హైవేమీద పోర్ట్ బ్లెయిర్ నుంచి ఓ వందకిలోమీటర్లు సాగితే సౌత్ అండమాన్ ద్వీపపు ఉత్తర కొసవస్తుంది. అక్కడ ఓ చిన్న సముద్రపు పాయ – మిడిల్ స్ట్రెయిట్ – సౌత్ అండమాన్ ద్వీపాన్ని మిడిల్ అండమాన్ ద్వీపంనుంచి విడదీస్తుంది. ఇక్కడ వంతెన లేదు. ఆ బస్సులన్ని ఓ పెద్ద ఫెర్రీ మీద ఎక్కి అవతలి ఒడ్డుకు చేరవలసిందే… అలా చేరాక మళ్లా హైవే మీద ఓ నూటయాభై కిలోమీటర్లు ఉత్తరంగా వెళితే కదమ్‌తాలా రంగత్ అన్న చిన్న పట్నాలు దాటుకొని (చిన్న చిన్న అనేక గ్రామాల సంగతి సరే సరి..) ఆ హైవే మిడిల్ అండమాన్ ఉత్తర కొసన ఉన్న మాయాబందర్ అన్న పట్నం చేరుతుంది… ఆ తర్వాత నార్త్ అండమాన్ ద్వీపం.. అది అంది పుచ్చుకొని సాగగా డిగ్లీపూర్ అన్న పట్నం… ఎండాఫ్‌ది హైవే!! హేవలాక్ నీల్ ద్వీపాల యాత్ర ఆరంభించే శుభ సమయంలో రాత్రి మ్యాపులు శ్రద్దగా స్టడీ చెయ్యగా అందిన సమాచారం.. నోరూరింది.  ఈ హైవే వెంబడే సాగిసాగి అండమాన్ల చివరికి చేరి డిగ్లీపూర్ చూసి రావాలన్న కోరికకు అంకురార్పణ.

మళ్లా మన ద్వీప ఉపయాత్ర దగ్గరకు వస్తే – ప్రకాష్ ఉదయం ఆరుగంటలకల్లా ఫీనిక్స్ జెట్టీ దగ్గర మమ్మల్ని దింపి కాసేపు గడిపి మేం ఎక్కవలసిన ఫెర్రీ చూపించి బై బై చెప్పి వెళ్లిపోయాడు.. అది బయల్దేరవలసిన సమయం దగ్గర పడుతోన్న ఆ ఓడ ఇంకా నిద్ర లేచిన లక్షణాలే కనిపించలేదు.. వెదకి వెదికి ఆ ఓడకు సంబంధించిన వ్యక్తిని పట్టుకొంటే ‘ఇది ఇవాళ హేవలాక్ వెళ్లదు’ అని పరమ ప్రశాంతంగా ప్రకటించేసాడు.  ‘మరి మా టికెట్లలో మీ ఓడ పేరు ఉంది గదా’ అని టికెట్లు చూపిస్తే అతను నాకు తెలియదని చేతులెత్తేసాడు! అప్పటికే సహ యాత్రికులు ఒకరొకరుగా పోగుపడసాగారు..  అందరిలోనూ ఆందోళన.. అసహనం.. అలజడి! కొంచెం స్థిమితంగా ఆలోచించగలవాళ్లూ గబగబా వెళ్లి అక్కడ ఉన్న జెట్టీ వారి ఆఫీసుల్లో వాకాబు చేసారు- ‘నిజమే.. టికెట్లమీద ఈ ఓడ పేరుంది. కానీ వెళ్లేది అల్లదిగో ఆ ఫెర్రీ.. ఈ టికెట్లు ఆ ఫెర్రీకి మహరాజులా చెల్లుతాయి’ అని విశదీకరించారు ఆ ఆఫీసువారు. అందరి చెవుల్లోనూ అమృతం.. గబగబా ఓడలో ‘బోర్డింగ్’ చేసి (గుర్తింపు కార్డులు కంపల్సరీ!) మామా సీట్లలో చేరబడి స్థిమిత పడ్డాం. నేలమట్టానికి సమాంతరంగా ఉన్నాయి సీట్లు.. కిటికీ సీట్లు దోరకని నాలాంటి ‘చిన్నవాళ్లకు’ కొంచెం అసహనం…

SAM_3721

పోర్ట్ బ్లెయిర్ నుంచి హెవలాక్ ఏభై కిలోమీటర్లు… ఈశాన్య దిశలో ప్రయాణం.. మేం ఎక్కిన ఫెర్రీలో రెండూ  రెండున్నర గంటల ప్రయాణం.. మనిషికి మూడువందల చార్జి… ఇదిగాక పవన్ హన్స్ వారు నడిపే సీప్లేన్ సర్వీసు ఉంది.. ఆ విమానానికి చార్జీ మూడువేలు.. ఇరవై నిమిషాల ప్రయాణం.

సీట్లలో సర్దుకోవడమన్న మురిపెం కాస్సేపటిలోనే ముగిసింది. ఆ ఫెర్రీ పై అంతస్థుకు వెళ్లడానికి అనుమతిస్తారనీ… నాలుగు గోడల మధ్య బిక్కు బిక్కుమని కూర్చోకుండా ఆ పై భాగానికి వెళ్లి ఆకాశంతో ఊసులాడుతూ సముద్రాన్ని పలకరిస్తూ ప్రయాణం సాగించవచ్చనీ కొద్ది సేపట్లోనే బోధపడింది.. మెల్లగా అందరమూ పైకి చేరాం. కొంతమంది బుద్ధిమంతులు మాత్రం చేరువలోనే ఉన్న బెర్తులను పసిగట్టి చేరి గురక కూడా పాడడం మొదలెట్టేసారు – అదృష్టవంతులు…

అండమాన్ల టూరిస్టు పేకేజ్‌లు సామాన్యంగా ఓ వారం రోజులు సాగుతాయి. ఆదివారంతో మొదలెట్టి శుక్రవారం దాకానో, మళ్లా ఆదివారం దాకానో ఉంటాయి. అంచేత దాదాపు అందరి కార్యక్రమమూ – ఇటినరీ – ఒక్కలాగే ఉంటుంది. మొదటి రోజూ, రెండూ రోజూ మాతో సెల్యులర్ జైలూ, మూడు ద్వీపాలూ తిరిగిన నాలుగయిదు కుటుంబాలు ఈ ఫెర్రీలోనూ తటస్థపడ్డాయి.. కబుర్లు.. పరిచయాలు.. ఓ ఢిల్లీ సీనియర్ సర్దార్జి గారి కుటుంబం, ఓ బెంగాలీ మధ్య వయసు దంపతులు, ప్లస్ టీనేజీ పిల్లలు, మరో ఢిల్లీ యూనివర్సిటీ యువ లెక్చరర్ దంపతులు.. అంతా టూరిస్టు కోలాహలం.

SAM_3739

ఉదయపు ఎండ… కొంచెం ఆహ్లాదం, కొంచెం చిరాకు, నీళ్లను సరసరా కోస్తూ సాగిపోతోన్న ఫెర్రీ, నీలమూ ఆకుపచ్చా గాకుండా కృష్ణ వర్షపు సముద్రజలాలు (‘సజా ఏకాల పానీ’ అన్న వాడుకమాట గుర్తుందా!), ఆ నీళ్ల మీద తళ తళా ధగ ధగా మెరుస్తోన్న సూర్యకిరణాలు.. దూరాన భూతలం.. దగ్గర్లో తోటి ఫెర్రీలు. ఇంకా పరిచయం గానీ హనీమూన్ జంటల మైమరపులు.. అడుగడుగునా క్లిక్కుమంటోన్న ఓ డజను కెమేరాలు, ‘లోపలికి రండి’ అని ఆహ్వానించి ఆదరించే ధర్మేంద్ర అంత అందంగా హుందాగా ఉన్న మధ్యవయసు ఓడ కెప్టెన్, ఓడ సాగినంతమేరా ఏదో రహదారిలా విచ్చుకొంటోన్న నిశ్చల సాగర జలాలు – రెండున్నర గంటలు ఎప్పుడు గడిచాయో తెలియనేలేదు. తొమ్మిదిగంటల ప్రాంతంలో హేవలాక్ ద్వీపంలో అడుగుపెట్టాం.

 

*                            *                                  *

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *