May 2, 2024

గర్భాశయపు సమస్యలు-3

 రచన: డాక్టర్ జె. గౌతమి సత్యశ్రీ ., పి.హెచ్.డి.pic. for maalika

 

అవుటుగ్రంధి (థైరాయిడ్ గ్లాండ్) వ్యాధి- అధిక రక్తస్రావం

 

పైన మెయిన్ హెడ్డింగు దాని క్రింద సబ్ హెడ్డింగు చూస్తుంటే అసలు థైరాయిడిసము ఏమిటి? దానితో రక్తవ్యవస్థకు పనేమిటి? అదీ వీటివల్ల గర్భాశయానికి సమస్యయేమిటి? అనే ఆశ్చర్యకరపు ప్రశ్నలు తలెత్తుతున్నాయి కదూ… ఈ మూడింటికీ ఒక అద్భుతమైన లింకుందండీ! అది తెలుసుకోవడానికి  ఒక కేస్ స్టడీ పరిశీలిద్దాం.

 

మహారాష్ట్ర లోని పూనె సిటీలో ప్రసిద్దిచెందిన హాస్పిటల్స్ లో జహంగీర్ హాస్పిటల్ ఒకటి. ఇది గైనిక్ తో పాటు మరెన్నో స్పెషాలిటీస్ ఉన్న హాస్పిటల్. మనం పరిశీలించబోయే కేస్ స్టడీ ఇక్కడిదే. ఈ పేషంటుకి దగ్గిర దగ్గిర 23 ఏళ్ళు ఉంటుంది. ఈమె మొదటిసారి గా ఎనిమిదేళ్ళ క్రితం బహిష్టులో అధిక రక్తస్రావంతో బాధపడుతూ గైనకాలజిస్ట్ (స్త్రీ వైద్యనిపుణులు) ని కలిసింది. మధ్య మధ్యలో తెరిపిచ్చినా, మళ్ళీ మొదలై నెల అంతా రక్తస్రావంతో బాధపడుతూ ఉండేది.  గర్భనిరోధక మాత్రలని వాడమని రాసిచ్చారు. ఈ మాత్రల వల్ల రక్తస్రావం తగ్గేది, కాని దాని పర్యవసానం దానికి ఉండేది. మాత్రలలోని ఈస్ట్రోజెన్, ప్రొజెస్టీరోన్ హార్మోనులు ఒక ప్రక్క రక్త స్రావాన్ని ఆపినా, మరో ప్రక్క అండం విడుదలని కూడా ఆపుతాయి. ఈ పేషంటుకు, కొద్దికాలం తర్వాత అల్ట్రాసోనోగ్రఫీ చేస్తే, ఆమె అండాశయం పై చిన్న చిన్న కోశాలు లేదా సిస్టులు (అసామాన్యమైన పెరుగుదలలు) ఉన్నాయి. వాటిని నివారించడానికి మళ్ళీ మరి కొన్ని మందులు రాశారు. పేషంటు ఈ తదుపరి పరిణామాలన్నీ నివారించేందుకు ఆయుర్వేదపు మందులు కూడా కొన్నాళ్ళు తీసుకుంది. కానీ లాభం లేకుండా పోయింది.

 

ఇక కేసుని హిమటాలజిస్ట్ (రక్తవైద్యనిపుణులు) వద్దకు పంపించారు. వీరు చేసిన సాధారణ పరీక్షల్లో శరీరంలో అంతర్గత రక్తస్రావం గాని, ముక్కునుండి రక్తస్రావం గాని పేషంటుకి ఉన్నట్లు తేలలేదు. కాకపోతే రక్తహీనత, శరీరం నీరు పట్టడం, బరువు పెరగడం తేలాయి. బ్లడ్ గ్రూపు AB+. ప్లీహము, ఉదరకోశము, లింఫ్ వ్యవస్థలు నార్మల్ గా ఉన్నాయి. లోతైన పరీక్షలుచేస్తే, సూదితో చర్మంపై గుచ్చిన తర్వాత రక్తం దానంతట అదే సహజంగా ఆగిపోవు వ్యవధి 2 నిముషాల 1 సెకను, నార్మల్ గా ఉంది (నార్మల్ రేంజ్ 1-9 నిముషాలు). అంటే రక్తపళ్ళెరాల పనితనంలో లోపం లేదు, హీమోస్టాసిస్ ప్రాధమిక చర్య నార్మల్ గా ఉంది. దానితో పాటుగా జరిగే ద్వితీయక చర్య ‘కోయాగ్యులేషన్ లో తేడా కనబడింది. అంటే రక్తస్రావం దానంతట అదే ఆగిపోవడానికి పట్టే వ్యవధి 11-13.5 సెకన్లు ఉండాలి. కాని ఈ పేషంటుకు 6 నిముషాల 4 సెకన్లు పడుతున్నది. మరికొన్ని పరీక్షలు చేయగా మరిన్ని వివరాలు బయటపడ్డాయి. Von Willibrand Factor లేదా VWF (వాన్-విల్లీ బ్రాండ్ ఫేక్టరు/ప్రోటీను) బ్లడ్ ప్లాస్మాలో తక్కువ మోతాదులో ఉంది. అవటుగ్రంధి ఉత్పత్తి చేసే హార్మోన్ల లెవెల్స్ కూడా తక్కువ గా ఉంది.  దీనిని హైపో థైరాయిడిసము (hypothyroidism) అంటారు. చివరికి పేషంటుకు ‘హైపో థైరాయిడిసము వల్ల వచ్చిన వాన్-విల్లీ బ్రాండ్ వ్యాధి’ అని తేల్చారు.

vwf_disease-new figure

VWF బ్లడ్ ప్లాస్మాలో ఉండే గ్లైకో ప్రోటీను. ఇది బోన్ మేర్రో (Bone marrow) లోని పెద్ద కణాలైన మెగా కార్యోసైట్స్ (mega karyocytes) లో ఉత్పత్తి అవుతుంది. కాలేయం (liver) లో ఉత్పత్తి అయ్యే కోయాగ్యులేషన్ ఫేక్టర్ VIII తో బైండ్ అయ్యి, కోయాగ్యులేషన్ లో పాల్గొనేటప్పుడు ఫేక్టర్ VIII కు స్థిరత్వాన్ని ఇస్తుంది. మరి ఆ VWF ఉత్పత్తి లేనప్పుడు, ఫేక్టర్ VIII కు స్థిరత్వం లోపించి కోయాగ్యులేషన్ లో పాల్గొనలేదు, ఫలితంగా కోయాగ్యులేషన్ పూర్తిగా జరుగదు, ఇటువంటి ఫాక్టర్లు మరి కొన్ని కోయాగ్యులేషన్ లో పాల్గొన్నప్పటికీ కూడా.  అంతేకాకుండా, ఈ VWF కు ప్రాధమిక హీమోస్టాసిస్ (రక్తం గడ్డకట్టుట) లో కూడా కీలక పాత్ర ఉంది. రక్తపళ్ళెరాలు ఒకదానితో ఒకటి మరియు అవన్నీ కలసి ధమని చిట్లిన చోట VWF సహాయంతో సమూహకరిస్తాయి. VWF  లోపిస్తే రెండు చర్యలూ దెబ్బతిని రక్తస్రావమాగదు.  ఈ పేషంటు విషయం లో సరిగ్గా ఇదే జరిగింది. ఈమె రక్తపరీక్షలలో VWF ఉత్పత్తి తక్కువ కనబడింది, రక్తస్రావమాగడానికి ఎక్కువ కాలం కూడా పట్టింది. తరువాతి పరీక్షల్లో బ్లడ్ లో ఫేక్టర్ VIII యొక్క అస్థిరత్వాన్ని కూడా సూచించారు.

 

అవటు గ్రంధి మెదడులోని పిట్యూటరీ గ్రంధి వలన పని చేస్తుంది. అవటుగ్రంధి నుండి  ఉత్పత్తి అయ్యే హార్మోనులు శరీరంలోని అన్ని జీవక్రియల్లోనూ పాల్గొని వాటిని క్రమపరుస్తాయి. అలానే బోన్ మార్రో లోని ఉత్పాదనలు- VWF తో సహా అవటు గ్రంధి పైనే ఆదారపడిఉంది. ఈ పేషంటుకు, అవటుగ్రంధి హార్మోన్ల ఉత్పత్తి కూడా తక్కువ గా ఉండడం వలన, ఈ VWF లెవెల్స్ తగ్గిపోయాయి. దీనివల్ల ఫేక్టర్ VIII యొక్క అస్థిరత్వము మరియు కోయాగ్యులేషన్ ప్రక్రీయలో లోపము పెరిగిపోయి, ప్రతినెలా వచ్చే ఋతుచక్రంలో రక్తస్రావమాగలేదు. గర్భసంచిలో ఏ లోపమూ లేకపోయినా గర్భాశయపు సమస్యను తెచ్చిపెట్టింది. వెంటనే వైద్య చికిత్స గా ఆమెకు రక్తహీనతను పోగొట్టడానికి, రక్తం ఎక్కించారు. హైపో థైరాయిడిసం పోవడానికి, ప్రతిరోజూ ఓరల్ గా థైరాయిడ్ మాత్రలు వేసుకోమని రాసిచ్చారు. ఆరు నెలల్లో పేషంటు యొక్క పరిస్థితి మెరుగయి, అధిక రక్త స్రావం తగ్గింది. ఆమె ఆరోగ్యవంతురాలయ్యింది. ఈ రోగనిర్దారణే సరిగ్గ జరగకపోయినట్లయితే, గర్భసంచిని తొలగింపవలసిన పరిస్థితి ఏర్పడేది. హైపో థైరాయిడిసం వలన రక్తవ్యవస్థకే కాదు ఇతర జీవ క్రియలకు కూడ సమస్యలు వచ్చి మనిషి ప్రాణానికి ముప్పు వచ్చేది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *