May 22, 2024

యమ తీర్థ విశిష్టత – బ్రహ్మపురాణమునందలి గోదావరీ మాహాత్మ్యము 3

రచన: విశ్వనాధశర్మ కొరిడె
రచన: విశ్వనాధశర్మ కొరిడె

                                      సమస్త పాపములను నశింపజేయునట్టి యమతీర్థమును గురించి బ్రహ్మదేవుడు నారదునకు ఇలా వివరించినాడు. ఈ తీర్థము పితరులకు మిక్కిలి ప్రీతిని కలిగింప జేయునట్టిది. దృష్టాదృష్ట,సంతుష్టకర ఫలితముల నిచ్చునట్టిది. పూర్వము “అనుహ్లాదు”డను మిక్కిలి బలముగల కపోతరాజున్నాడు. ఆ అనుహ్లాదుని భార్య పేరు “హేతి”.  మృత్యువు యొక్క  పౌత్రుడు అనుహ్లాదుడు కాగా, హేతి ఆ మృత్యువు యొక్క దౌహిత్రి (కూతురి కూతురు). వారికి పుత్ర , పౌత్రులు కలిగినారు. అనుహ్లాదునకు ’ఉలూకుడు’ అను బలవంతుడైన శత్రువు కలడు. గోదావరికి ఉత్తర తటమున అనుహ్లాదుని ఆశ్రమముండగా, దక్షిణతీరమున పుత్రపౌత్రులతో నున్నఉలూకుని అశ్రమమున్నది. పరాక్రమవంతులైన వారిరువురికి చాలాకాలము నుండి వైరమున్నది. వీరిరువరు  చాలాకాలము యుద్ధములు జరుపుకొన్నా , జయాపజయములు ఎవరిని వరింపలేదు. అందువలన అనుహ్లాదుడు తన తాతయైన యమధర్మరాజును ఆశ్రయించి, ఆరాధించి , యామ్యాస్త్రమును పొందినాడు. ఉలూకుడు కూడా  అగ్నిని ఆరాధించి ఆగ్నేయాస్త్రమును పొందినాడు.

వాటితో వారిరువురు ఉన్మత్తులవలే భీకర యుద్ధమును గావించినారు. పరస్పరము తాము సంపాదించుకొన్న అస్త్రాలను ప్రయోగిస్తూ జరిగే ఆ భీషణ యుద్ధాన్ని, ఆ యుద్ధము నందు అగ్నిపాశముచే చుట్టుకోబడిన  తన పుత్రులను కూడ చూచిన హేతి దుఃఖితురాలైనది. అగ్నిదేవుని వద్దకు వెళ్ళి  పలువిధములుగా స్తుతించినది. అందులకు సంతోషించిన అగ్ని ప్రత్యక్షమై, “ఓ కపోతకి ! అమోఘమైన నా అస్త్రములు యుద్ధమునందు ప్రయోగించబడిన పిదప ఫలితములను గాంచక విశ్రమించవు. కావున ఓ పతివ్రత ! వాటిని ఎక్కడ ఉపశమనము పొందవలెనో నీవే చెప్పుము” అన్నాడు. అప్పుడా హేతి ” ఓ హవ్యవాహన ! అటులైన నీ అస్త్రములను నా భర్త, పుత్రులతో కాక (నన్ను చంపడము ద్వారా) నాయందే ఉపశమించనిమ్ము. ” అని కోరినది.

ఆ మాటలకు సంతుష్టుడైన అగ్ని “ఓ సాధ్వి! నీ భర్తపుత్రులతో పాటు నీకు కూడా క్షేమాన్ని కలిగిస్తున్నాను. నా ఈ అస్త్రము నీ భర్త, పుత్రులను కాని, నిన్ను కాని దహించదు. ” అని వర మిచ్చినాడు.

ఇంతలో ఉలూకుని భార్య కూడా యమపాశములతో బంధింపబడిన తన భర్తను చూచి మిక్కిలి దుఃఖాన్ని పొంది, యమధర్మరాజును భక్తిపూర్వకముగా స్తోత్రము గావించినది. ఆమె స్తోత్రమునకు సంతోషాన్ని  పొందిన యముడు ’ప్రియమైన వరమును కోరుకొ’మ్మనగా ” ఓ సురశ్రేష్ఠ ! నా భర్త నీ పాశములచేత బంధింపబడినాడు. నీ దండముచే బాధించబడుచున్నాడు. నా భర్తను, పుత్రులను కాపాడుము.” అని కోరినది. అందులకు దయతలచిన యమరాజు ” ఓ శుభముఖి ! మరి ప్రయోగింప బడిన నా పాశదండములు చేరుకోదగిన లక్ష్యమేదో నీవే చెప్పు”మన్నాడు. అది విని ఆ ఉలూకి “దేవా ! నావారికెవరికినీ నష్టము కలుగకుండునటుల నాయందే అవి లీనమగునట్లు జేయుము.” అని అనగా అప్పుడా నరకాధిపతి కృపాకరుడై ” నీ భర్త, పుత్రులు అందరూ జీవింతురు గాక! “యని తన దండపాశములను నివారింపజేసినాడు.

ఇరువురు దేవతల అనుగ్రహముల ద్వారా పాశములనుండి నివారించబడిన వారై, కపోత , ఉలూక రాజులు భక్తితో యామాగ్నులను అనేక విధములుగా స్తుతించినారు. ఆ దేవతలు కూడా సంతసించి, వరములను కోరుకొమ్మనమని అన్నారు. అప్పుడు వారిరువురు ” ఓ దేవతలారా !  అనేక పాపములనాచరించిన వారమైననూ, మీ ఇరువురి దర్శన బాగ్యమును పొందినారము. ఇంతకు మించిన ప్రయోజనమేమున్నది ? ఐనప్పటికినీ మాకిభీష్టమైన వరమడుగుచున్నారు . మా స్వప్రయోజనమునకై మేమిక వరమడుగము. స్వార్థమునకై వరమును కోరువాడు క్షుద్రుడైనవాడే కదా! పరార్థమునకై అహర్నిశలు పాటుపడిన వాడే నిజమైన ధన్యజీవి. పంచభూతములు , సూర్యచంద్రులు, ఔషధములు అన్ని కూడ పరార్థమునకే కదా బ్రహ్మాదులకు కూడా మృత్యువు అనివార్యమైనప్పుడు స్వార్థమునకు పాటుపడుట నిష్ప్రయోజనమే ! నొసటపై బ్రహ్మ వ్రాసిన వ్రాత తిరుగు లేనిదైనప్పటికినీ జీవులు వ్యర్థముగా శ్రమనొందుచున్నారు. అందువలన ఓ సురేశ్వరులారా! జగద్ధితములైన శుభకరములైన వరములను కోరుకొనుచున్నాము. ఏమనగా ఈ గౌతమీ తటములందలి మా ఇరువురి ఆశ్రమములందు మీ ఇరువురూ  వసించాలి. ఇదే మా ఇరువురి ఉత్కృష్టమైన కోరిక . ఇక్కడ స్నాన, దాన, జప, హోమములు, పితృయజ్ఞము మొదలైనట్టి సుకృతులు గాని దుష్కృతులు గాని చేసిననూ వారికది అక్షయ పుణ్యఫలితములనిచ్చునదిగా కావలెను అనియే మా ఇరువురి కోరిక .” అని కోరినారు.

అందులకా దేవతలిద్దరు “మేము మీ స్తోత్రములకు మిక్కిలి సంతోషించాము మీరు కోరినట్లే అగుగాక !” అని పలికినారు. అంతే కాక మరల యమధర్మరాజు ” ఎవరైతే మీరు గావించిన యమస్తోత్రము ఉత్తర తటమున పఠింతురో వారి వంశాన ఏడు తరములవరకు కూడ అకాలమృత్యువు కలుగదు. జితేంద్రియుడై నిత్యము పఠించినవాడు సర్వ రోగ బాధా నివృత్తుడై, సర్వ సంపత్తులను పొందును. వంధ్యయైనప్పటికినీ  స్త్రీ ఈ తీరమున స్నానముగావించినచో త్వరలో సంతానమును పొందగలదు. వీరప్రసవయగును. అట్టి పుత్రుడు శతవర్షాయుష్కుడై అష్టైశ్వర్య సంపన్నుడగును. పుత్రపౌత్రాభివృద్ధిని పొంద గలడు. ఈ గౌతమీ తీరమున పితరులకు పిండదానము గావించిన పితరులు ముక్తినొందుదురు. ఇంతెందులకు ఇచట స్నానముచేతనే త్రికరణములద్వారా చేసిన పాపములన్నీ పటాపంచలగును.” అని వరములనిచ్చినాడు.

అగ్నిదేవుడు కూడా వారితో “ఓ భక్తులారా! దక్షిణతీరమున నన్ను మీ స్తోత్రము ద్వారా స్తుతింతురో వారికి ఆయురారోగ్య రూపలావణ్యైశ్వర్యములను నేనిత్తును. నిత్యము ఇంటిలోనైనూ, మరెక్కడైననూ పఠించినచో వారికి సమస్త భయములను తొలగింతును. ఈ అగ్ని తీర్థమునందు స్నాన దానములు గావించినచో అగ్నిష్టోమయాగఫలితములను పొందగలడు.’ అని అనుగ్రహించినాడు.

అప్పటినుండి ఆ తీర్థములు ’యామ్య’ ’ఆగ్నేయము’లుగానూ, ’కపోత’ , ’ఉలూక’, ’హేత్యూలక’  తీర్థములుగా కీర్తించబడుచున్నవి. అక్కడ మూడువేల మూడువందల తొంబది తీర్థములు అన్నియూ ఒక్కొక్కటి ముక్తిదాయకములు. వాటియందు స్నాన, దాన, పితృకర్మలను గావించిన వారు తమ కాలానుగుణముగా మృత్యువును పొందినవారైననూ స్వర్గములను చేరుదురు. వారి వంశము ధన, కనక, వస్తు, వాహనాదులతో సుఖించును..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *