May 13, 2024

ఓ నాన్న.. (తండ్రి – కూతురు)

రచన:సమ్మెట ఉమాదేవి                 

 

“కాంచనా త్వరగా రెడీ అవ్వు ..”
“ఆ ఆ  వచ్చేస్తున్నానండి ..”

“మనం త్వరగా వెళ్ళాలి ..పుట్టిన రోజున  ఉదయానే మనలను చూసి .. శాన్వి  సర్వం మరచి ఉప్పొంగి పోతుంది..  తనకోసం తీసుకున్న డ్రెస్ పెట్టుకున్నావా?”
“ఆ! స్వీట్స్ ,కేక్ అన్నీ పెట్టుకున్నానండి.. ఇక బయలు దేరుదాం.”

ఇద్దరూ కారులో బయలు దేరారు. ఇద్దరికీ  రాను రాను ఏదో పోగొట్టుకున్న దానిలా  మారిపోతున్న కూతురి ముఖం గుర్తుకు  వచ్చింది.  శాన్వి ముఖంలో నీలి నీడలు పోయి ఏదయినా అద్భుతం జరిగి  ఇదివరకులా నవ్వుతూ .. గల  గలాడుతూ తిరిగితే  ఎంత  బాగుండు..అనిపిస్తున్నది.. ఇద్దరూ శాన్విని సంతోష  పెట్టాలన తపనతో   ఆలోచనల్లో మునిగిపోయారు . రాఘవరావు కయితే మనసు మనసులో లేదు .. పరి పరి విధాల అతని ఆలోచనలు సాగుతున్నాయి ..

“నాన్నా  భరత్ నన్ను ఇష్ట పడుతున్నాడు”.. అనగానే..  చాలా అలోచించి.. వాకబ్  చేసి మరీ  ఒప్పుకున్నాడు.

శాన్వి భరత్ ఇద్దరూ సాఫ్ట్ వేరే ఇంజనీర్సే.  సుఖపడతారు అన్న నమ్మకం .. ఇద్దరూ కొన్నాళ్ళు బాగానే ఉన్నట్టుగా అనిపించింది. జీవితమింకా మొదలు పెట్టనే లేదు కొన్నాళ్ళయినా ఆనందానుభూతులు పొందనే లేదు.  ఎన్నోభాద్యతలలో ఇరుక్కు  పోయారు. చెల్లెలి  పెళ్లి ..నాన్న అనారోగ్యం .. ఇలాంటివి కాదు .. తోటి ఉద్యోగులతో.. మిత్రులతో పోల్చుకుని.. బాంక్  లోన్ తీసుకుని ఇల్లు కట్టుకున్నారు అవసరం కోసమో .. హోదా కోసమో కారు  కొనుక్కున్నారు.  వెరసి ఇద్దరికి  ఏడాదిలో ఎన్నో లెక్కలు.

“ఏంటండి ఎప్పుడు సంతోషంగా ఉన్నట్టుగా ఉండరు..  అస్తమానం డబ్బు.డబ్బు . ఈ ఎం ఐ ల సర్దుబాట్లు. యెప్పుడూ  ఏదో అసహనంగా ఉంటారు. కళ్ళ ముందు వారిద్దరూ సంతోషంగా ఉంటేనే కదా మనకు సంతోషం..” కాంచన ఆరాటం..

ఆర్థిక సమస్యలు కాకుండ.. మరేమయినా  సమస్యలు వచ్చి ఉంటాయా?  పరిస్థితిని  ఊహించలేక పోతున్నాడు రాఘవ రావు..  కొన్ని సమస్యలు  తాము చక్క దిద్దగలిగేవి  కావు.  సర్ది చెప్పగలిగేవి  కావు. కొన్ని రోజులకు వాళ్ళే  బాగుంటారు అని ఆశగా ఎదురు చూడడం  తప్ప చేయ్యగలిగిందేమి లేదు . కాని శాన్వి ముఖంలో దాచలేని దిగులు . వారిద్దరి మధ్య  ఏమి జరుగుతున్నదో కాంచనకు తెలియదు. ఆలోచనల్లోనే కారు కొంపల్లి లోని శాన్వి ఇంటిని సమీపించింది.. ఇద్దరూ ఆత్రుతగా లిఫ్ట్ నుండి బయటకు వచ్చి శాన్వి ఇంటి డోర్ బెల్ నొక్క బోయారు ..గట్టిగా రోదిస్తున్న శాన్వి గొంతు..అతన్ని తిడుతూ..  దెబ్బలు తప్పించుకుంటూ భయంకరంగా శాన్వి కేకలు .. అతని అరుపులు బూతులు .. దాష్టికం ఆన్నీ స్పష్టంగా వినపడుతున్నాయి.. ఇద్దరి నవనాడులు కుంగి పోయాయి. లోపలికి వెడితే ఏమౌతుందో.. వెళ్లకుంటే ఏమౌతుందో అర్ధం కాలేదు.. ఇద్దరూ తలుపు దగ్గరే  నిలబడి పోయారు. కాంచన అప్పటికే వెక్కి వెక్కి ఏడవసాగింది .. కాసేపటికి రాఘవ రావు కాంచన చెయ్యి పట్టుకుని..  పద వెళదాం అంటూ లిఫ్ట్ వయిపుకి నడిచాడు ..

ఇద్దరు దగ్గరలోని ఓ గార్డెన్ కి వెళ్లి కూర్చుని శాన్వికి ఫోన్ చేసారు.

“అమ్మా మేము  ఓ అరగంటలో నీ దగ్గరకు  వస్తున్నాం ..”.  ఆ అరగంటా మనసును కుదుట  పరుచుకుని  మళ్ళీ శాన్వి ఇంటికి వెళ్ళారు.  “రండి నాన్న..” అంటూ ఏమి జరుగనట్టు శాన్వి ఆహ్వానించినా ఏమి జరుగనట్టు  వాళ్ళు నవ్వలేకపోయారు .. శాన్వి పెదాల మీద నవ్వుతో పాటు ముఖాన .. గాయాలు కనపడుతూనే ఉన్నాయి .. అల్లుడు అమాయకంగా మాట్లాడాడు .

“బాబు భరత్! మీ  అత్తయ్యకు  ఆరోగ్యం  బాగుండలేదు .. ఓ వారం రోజులు శాన్వి ఆక్కడనుండి ఆఫీస్ కి వెళ్తుంది ..” అడిగాడు.

“ఓ దానిదేముంది.. శాన్వికి కూడా మీ దగ్గర ఉండడమే ఇష్టం.. మీ దగ్గర ఉంటె ఆమెకి మొగుడు కూడా గుర్తుకు రాడూ..” వెటకారంగా అన్నాడు.. భరత్ మాటలు పట్టించుకోలేదు శాన్వి.. నాన్న తనను పంపించమని అడగడం .. భరత్ ఒప్పుకోవడం ఒక్కటే అర్ధమయ్యింది .. చెంగున ..దూకి బాగ్ సర్దుకుంది.

దారంతా ఏమి జరుగనట్టుగా మామూలుగా ఉన్నట్టు  యెంత ప్రయత్నిస్తున్నా.. ఆమె పెదవులు నవ్వుతున్నా  కన్నులు .. ఉండుండి వర్షిస్తూనే ఉన్నాయి. విషయం వాళ్ళకు అర్దమయినట్టు ఆమెకి తెలిసి పోతున్నా ఏదో బింకంగా ఉండాలని ప్రయత్నిస్తున్నది. అందరూ కల్సి ఓ రెస్టారెంట్ కి వెళ్లి భోజనం చేసారు. శాన్వి కాస్త తేట పడ్డది. ఇల్లు చేరారు.  గది లోకి వెళ్లి వంటరిగా కూర్చుందో లేదో  గంగ పొంగులా  దుఖం   పొంగుకు వచ్చింది

“ఏవండి శాన్వి ఏడుస్తున్నదండి .. నిన్నటి నుండి ఏమి తినకుండా ఉండుండి అలా ఏడుస్తూనే ఉన్నదండి..” కాంచన తాను ఏడుస్తూ అన్నది..
“ఏడవని కాంచనా.. ఇన్నేళ్ళ వయసు వచ్చి సమస్యలను ఎలా ఎదుర్కోవాలో తెలిసిన నీవే వెక్కి వెక్కి ఏడుస్తున్నావే.. అది పసి పిల్ల .. ఇప్పుడే జీవితం మొదలయిన పిల్ల.. ఏడవదా మరి .. ఏడవని..కరువు తీరా ఏడవని..  ఏడుపు సమస్యలను పరిష్కరించదేమో గాని గుండెను ఎంత తేలిక చేస్తుందో తెలుసా.  మనసు ఇష్టంగా చేసే పనుల్లో కన్నీరునించడం కూడా ఒకటి.. అలా  స్వేచ్చగా ఏడ్వాలని  ఎన్ని సార్లు తపన పడ్డదో.. ఏడవలేక ఎన్ని సార్లు నలిగిపోయి ఉంటుందో .. ఏడవలేక  ఏడవకుండా ఉండలేక అది ఎన్ని సార్లు సతమతమయ్యిందో..  ఏడవని..ఇప్పటికయినా గుండె బాధ తీరేదాక ఏడవని అలా ఏడిస్తేనన్నా. కాస్త సేద తీరుతుందేమో!” అతను కారిడర్ లోకి వెళ్లి పోయాడు..

ఇప్పుడు రాఘవరావుకి కూడా ఏడ్వాలని.. తన బంగారు తల్లి నిస్సహాయంగా కన్నీరు పెడుతుంటే..ఆమెని పట్టుకుని తనకూ  కరువు తీరా ఏడవాలని ఉంది. “నీకు నేను ఉన్నానురా!” అని గట్టిగా  చెప్పాలని  ఉన్నది. అతని  మనసులో తుఫాన్ రేగుతున్నా.. కళ్ళు పొడి బారి పోయాయి వెక్కి వెక్కి ఏడవలన్న కోరిక  అంతకంతకూ బలంగా పెరిగి పోతున్నది..మొగవాడన్న బింకమంతా కరిగి పోయి  పసి పిల్లాడిలా గట్టిగా  ఏడవాలని ఉంది. “ఏమండీ ఏమిటండి మీరు కూడా ఇలా అయితే దాన్ని ఎవరు ఓదారుస్తారండి?”  కాంచన అతన్ని కుదుపుతూ  ఏడుస్తున్నది.  అప్పటికి అతనికి అర్ధమయింది .. అతను ఏడవడం మొదలు పెట్టి చాల సేపు అయ్యిందని..

“కాంచన నన్నిలా వోదిలేసెయ్.” అన్నాడు.

“అదేంటండి అలా అంటారు. ఇక్కడ మీరు ఇలా ..  అవతల అదలా ఏడ్చి ఏడ్చి ఎమయిపోతుందో అని భయంగా ఉందండి…”
“ఏమి అవ్వదు. కాంచనా!  చిట్టి తల్లికి  మనం ఇద్దరం ఉండగా ఏమి అవ్వదు .. కాకపోతే కాస్త సమయం పడుతుంది.. ఏ సమస్యయిన మంత్రం వేసితే మాయమయినట్టుగా మాసిపోదు.. సమస్య పోతూ  పోతూ ఒకింత మన శక్తిని  లాక్కెళ్ళి పోతూనే  ఉంటుంది..”

“ఏమండి .. ఇంకా చాలు  అది అలా ఏడుస్తుంటే .. నా గుండె చెరువయి పోతున్నది .. మీరు వెళ్లి దాన్ని ఊరుకోబెట్టండి.. “ కాంచన  పదే పదే  అంటుంటే మెల్లెగా తలుపు తీసుకుని శాన్వి గది లోకి వెళ్ళాడు . వడలిన కలువ మొగ్గలా ముడుచుకుని మోకాళ్ళలో తల పెట్టుకుని ఉన్నది శాన్వి ..పాదాల  అలికిడికి తల ఎత్తి చూసింది.. కూతురిని చూసి అతని మనసు బేలగా మారిపోయింది..  మంచు బిందువులు రాల్చుతున్న కుసుమంలా.. అంత దుఖంలోను.. తనలో ఓ  వింత సోయగం.. అదే   నవకం  మాయని పూబాల శోభ..  ఇదే శాన్వికి పెద్ద శాపమయి పోయింది .ఇదే శాన్వికే కాదు ప్రతి తల్లి దండ్రులకు ఓ పెద్ద పరీక్ష. ఇవాళ ఆడ పిల్లలను కాపాడుకోవడం ఎంత కష్ట తరంగా మారిపోతున్నదో.. కదా .రాఘవ రావు ఆమె చేతిని తన చేతి లోకి తీసుకున్నాడు.. చాల ఏళ్ళ తరువాత తన నాన్న వళ్ళో తల పెట్టుకుని.. మనసు పరచింది శాన్వి.

“నాన్నా.. ! చాల కాలం నీ దగ్గర ఏమి చెప్పుకోలేదు.. ఎందుకో తెలుసా నాన్న ..అతని మీద ప్రేమతో కాదు అభిజాత్యంతో.. అతను నన్ను ఇష్టపడుతున్నాడు  నాన్నా .. నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను అనగానే.. నేను ఏది అడిగినా కాదనకుండా ఇచ్చే నువ్వు .. నేను అడిగిన అతనికి ఇచ్చి చేసావు. అడిగినవన్నీ  అమర్చిన కూడా  బతకడం రాలేదు అనుకుంటావేమోనని అన్ని సహించాను నాన్న.  నా  జీవితం ఇలా అయిపోయిందే అని నువ్వు అమ్మ బాధ పడే రోజు రాకూడదని ..  ఇంత  కాలం  అన్నీ  భరించాను  నాన్నా ..

 

భరత్.. అతనో సామాన్యుడు నాన్న.. నన్ను ఎవరయినా పొగిడితే భరించలేదు.. నా జీతం పెరిగితే సహించలేడు .. నేను కాస్త అందంగా అలంకరించుకుంటే  భరించలేడు.. ప్రతి రోజు దేనికో దానికి గొడవ ..ఇక  ఈ మధ్య కొత్తగా నా  మీద  చెయ్యి చేసుకోవడం కూడ  మొదలెట్టాడు ..రాను రాను నాకు ఓపిక పోతుంది నాన్న.. నా  వల్ల కావడం లేదు కాని ఇంత వరకు దేని లోను ఒడి పోనీ నేను మారిడ్ లైఫ్ లో ఓడి పోవడం ఇష్టం లేకః .. చాల ఓపిక పడుతున్నాను ..” తాము గుమ్మం దగ్గర విన్న గొడవ  పూర్వా పరాలు చెబుతున్నది.

“రాత్రి నా  బర్త్ డే అని ఫ్రెండ్స్ సడన్ గా పన్నెండింటికి వచ్చి తలుపు కొట్టారు. కేక్  బొకేస్ అన్నీ తెచ్చి చాల హడావిడి చేసి వెళ్లారు. వాళ్ళు వెళ్ళిన దగర్నుండి  గొడవ ఇంత టూ  మచ్ ఏమిటి నాన్నా? నేను వాళ్ళను రామ్మన్ననా .. వాళ్ళు నిన్ను అలా  హాగ్ చేసుకోవడమేమిటి అంటాడు .. అ నవ్వు లేంటి అ పాటలేమిటి అంటూ అక్కడనుండి మొదలయిన  గొడవ ఎక్కడెక్కడో కో వెళ్ళింది.  నీకు మాత్రమే ఇన్సెంటివ్స్ ఎందుకిస్తున్నారు అంటాడు.. అన్ని మీటింగ్స్ కి నిన్నే ఎందుకు పంపతున్నారు అంటాడు.  అందరూ నిన్నే ఎందుకు ఇష్టపడతారు? నువ్వు ఎగబడి పోతావు అంటాడు. ఇంకా చాల  మాట్లాడాడు నాన్నా.. లిమిట్స్  క్రాస్ చేస్తుంటే.. షట్ యువర్ మౌత్ అన్నాను. అంతే  నన్ను విపరీతంగా కొట్టాడు నాన్నా అంతే ..” వెక్కి వెక్కి ఏడవడం మొదలెట్టింది శాన్వి..  మనసంతా .. ముసురు పట్టినట్టుగా మారగా ..
కూతురిని దగ్గరకు తీసుకుని, “ఊరుకొరా.  నేను అన్నీచక్క బెడతానుగా..”  అని ఓదార్చాడు ..

“నో డాడ్! నాకు ఇంకా తని ముఖం చూడాలని  కూడా అనిపించడం లేదు..” విరక్తిగా అన్నది .. “సరే సరే నువ్వు కాస్త కుదుట పడు.. శాన్వి. ఇది జీవితమమ్మా ..” ఆమె తల నిముర్తూ ఎన్నో విషయాలు మాట్లాడాడు.  శాన్వికి కాస్త నిద్ర పట్టగానే.. ఇవతలకు వచ్చాడు. అతని మనసులో ఎన్నో ఆలోచనలు ..
మర్నాడు కార్ తీసుకుని లాంగ్ డ్రైవ్ కి బయలుదేరాడు ..
శాన్విని  చిన్న నాటి  నుండి ఆపురూపంగా పెంచుకున్నారు.  శాన్వి లాంటి అమ్మాయిని పెంచడం చాల క్లిష్టమయిన విషయం. ఎక్కడకు వెళ్ళినా అందరి దృష్టి శాన్వి మీదే ఉండేది.. సహజంగానే  శాన్వి చాల అందగత్తె దానికి  తోడు తెలివి తేటలు  మరీ అధికం తను ఏది మొదలు పెట్టినా  దేనిలో చేర్చినా చాల తక్కువ కాలంలో అందులో నేర్పరి తనం సంపాదించుకునేది..  ఒక వంక టీచర్ల అభిమానాన్ని.పొందింది.  మరో వంక కొంత మంది అల్లరి పెట్టె అబ్బాయిలతో వారి   ఓర్వలేనితనంతో ఎన్నో ఇబ్బందులు  పడింది.  అందరూ తనతో స్నేహం చెయ్యాలని చూస్తారు.

శాన్వి  ఎదుగుతున్న కొద్ది చిత్రమయిన సమస్యలు ఎదుర్కోవలసి వచ్చింది   రాఘవరావుకు. శాన్వి  ఎక్కడకు వెళ్ళిన ఆమె చుట్టూ  పెద్ద  గుంపు ఉంటుంది. ఎంత  మాములు దుస్తుల్లో అయిన శాన్వి గొప్ప ఆకర్షణగా కనపడేది . దానికి తోడూ కాంచన, శాన్వికి కుట్టించే అందమయిన దుస్తుల్లో శాన్వి  వెలిగి పోతుండేది .. శాన్విని తీసుకుని బయటకు వెడితే అందరి కళ్ళు శాన్వి వయిపుకు  గిర్రున తిరిగేవి.. అందరిని ఆకట్టుకునేంత అందంగా ఉన్నదుకు ఆనందంగా  ఉన్నా అందరి  చూపులు భరించడం కష్టంగా ఉండేది .. తరుచూ శాన్వి బయటకు తీసుకెళ్ళమని గొడవ చేసేది . తానూ వెంటనే తీసుకెళ్ళే వాడు.  లేకుంటే వంటరిగా  వెళ్తే .. ఎవరు చూసి  ఏమి వ్యాఖ్యానిస్తారో అని భయం వేసేది దానికి  తోడు శాన్వి చాల శ్రద్దగా  అలకరించుకునేది..  గోర్ల దగ్గర్నుంచి జుట్టు వరకు  ఎంతో శ్రద్ధ తీసుకుంటుంది. ఎప్పుడు ఉత్సాహంగా  తన ధోరణి లో తానుండేది.   తనను అందరూ ఎగబడి చూస్తున్న  విషయం శాన్వికి  పట్టేది కాదు.. చాల  అమయాకంగా ఉండేది .. రాఘవరావుది చిత్రమయిన పరిస్తితి .. శాన్విని  ఇంట్లో ఆపలేడు .ధయిర్యంగా బయటకు పంపలేడు.పంపకుండా ఉండలేడు. కూతురి భవిష్యత్తు చాల ముఖ్యం కదా. విరిసే పువ్వును.. పిడికిట పట్టి వికసించనియ్యకుండ ఎలా ఆపుతాడు. బయటకు  పంపితే  .. ఎవడు ఏమి చేస్తాడో భయం .. ప్రతీ సారి  తానూ వెంట  వెళ్ళడం కుదరదు కదా. దానికి తోడు “ఎందుకు నాన్న ప్రతీ సరి నా వెంట వస్తానంటావ్  నా  మీద అనుమానమా?” అని కస్సు మనేది .. దానితో బయటకు వెళ్ళిన పిల్ల  క్షేమమగా ఇంటికి వచ్చేదాకా ఇద్దరూ  వేయి దేవుళ్ళకు మొక్కుకుంటూ కూర్చునేవారు.. ఇక బి టెక్ లో చేరాకా సిస్టం వాడకం ఎక్కువయి . తరుచూ ఫోటోలు .. నెట్ లో పోస్ట్ చేసుకోవడం .. ఆ వచ్చే కామెంట్స్ కి మురిసి పోవడం .. బదులుగా తానూ కామెంట్స్ పెట్టడం .. బోలెడంత ఫ్రెండ్ సర్కిల్ పెరిగి పోయింది  .. దానితో  రాఘవరావుకి మరింత భయం పెరిగి పోసాగింది.  అతని స్నేహితులతో  ముచ్చటించగా   చాలామంది తల్లి దంద్రుల  సమస్య ఇదే కనపడింది .. మొగ పిల్లలకంటే .. వీళ్ళు  అని రంగాల్లోనూ వారి ప్రతిభ కనపరుస్తూ ఇంతకింతకు  ఎదిగిపోతూ. అన్నింటా  ముందుకు దూసుకుపోవడం.. ఒక వంక  సంతోషాన్నిస్తుంటే .. మరో వంక వారిని కాపాడుకోలేక సతమతంయి పోవడం చూడసాగాడు.. ఆడపిల్లలంటేనే సహజంగా మొగ పిల్లలకు ఒక ఆకర్షణ .. దానికి తోడు.. అధునాతమయిన  దుస్తుల్లా వారు మరింత ఆకర్షణ గా కనపడుతున్నారు ..కల్సి చదువుకోవడం వల్ల  ఒక్కప్పుడు ఉండే బెరకు.. ఒద్దిక ఇప్పుడు లేదు.  చాల స్వేచ్చగా మొగపిల్లలతో కలిసి తిరుగుతున్నారు.. ఓ పాతికేళ్ళ స్వేఛ్చాజీవనం తరువాత జరిగిన వివాహం జీవనంలో అకస్మాత్తుగా ఒద్దిక .. వినయం రమ్మంటే రావు ఇవి తండ్రిగా తనకు అర్ద మవుతాయి..  వాళ్ళు  ప్రతినిముషం కళ్ళలో  పెట్టుకుని కాపాడుకున్నారు.  శాన్వి  మొత్తానికి చదువు పూర్తీ చేసి.. మంచి కాల్ సెంటర్లో  మంచి ఉద్యోగం  సంపాదించుకున్నది.. అంతంత  మాత్రపు  ప్రతిభతో భరత్ మెల్లగా ఎదుగుతుండగా అతి త్వరలో చాల ఉచ్చ స్తాయికి చేరుకున్నది   కంపెని  తరుపున తరుచూ విదేశాలకు  వెళ్ళి వస్తున్నది.

ఇక్కడే భరత్ మనస్తత్వం  బాగా అర్దమవ్వ సాగింది. రాఘవరావుకి  శాన్వి ఎదుగుదలకు భర్తగా ఒక వంక సంతోషంగా ఉన్న .. ఒక మగాడిగా ఇదంతా భరించడం .. కష్టమయిపోతున్నది భరత్కి. ఈ రెండింటి మధ్య అతని సంఘర్షణ లో అతను ఓ సామాన్య మయిన మొగుడిలానే మగాడిలానే ప్రవర్తిస్తున్నాడు.. కార్ భరత్ కంపెని వైపుకు మళ్ళింది .. ఇద్దరు కలసి కాంటిన్ లో కూర్చున్నారు
భరత్కి  చాల టెన్షన్ గా  ఉంది .. ఏమి చెప్పా బోతున్నాడు ఇతను .. అసహనంగా ఉంది .

“ఏమిటి భరత్ అలా  ఉన్నావ్ .. నాకు చాలా ఆకలిగా ఉంది .. భోజనం ఆర్డర్ ఇవ్వు” అన్నాడు .. భరత్ తడబడి .. భోజనం ఆర్డర్ ఇచ్చాడు .. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ భోజనం ముగించారు .. కాని  భరత్ లో ఏదో అసహనం.
“అంకుల్ మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు. నాకు క్లాస్ తీసుకో వడానికే గా?” పొగరుగా  అన్నాడు
“లేదు భరత్! శాన్వికే క్లాస్ తీసుకుని వచ్చాను అని చెప్పడానికి వచ్చాను . ఈ ఆధునిక జీవన వేగం లో అతను .. అలసి పోతున్నప్పుడు .. నీవు అమ్మలా  అనురాగం చూపి.. అతన్ని దగ్గరకు తియ్యాలి గాని, హక్కులకోసం.. అసహనం వ్యక్తం చెయ్యడం నాకు  నచ్చలేదు అని చెప్పాను. విదేశీ కంపెనిలను మెప్పించడం కాదు నీ మనిషి మనసెరిగి.. ప్రవర్తించమని చెప్పాను..” అతని బుజం చుట్ట్టు చెయ్యి వేసి.. మెల్లని స్వరం తో చెప్పాడు .. రాఘవరావు .. మూగబోయాడు భరత్ ..
రాఘవరావు మళ్ళీ  మాట్లాడడం మొదలు పెట్టాడు.

“చిన్నపటినుండి ఓ వెర్రిబాగుల పిల్ల.  శాన్వి లాంటి అందమయిన తెలివయిన ఆడపిల్లతో  వేగడం ఎంత కష్టమో భరత్.. ఇప్పుడు నీ వంతు వచ్చింది.”  అంటూ శాన్విని  పెంచడంలో తానూ ఎదుర్కున్న అగచాట్లను ఏకరువు పెట్టాడు .. ఒక్కటే .మార్గం భరత్.. కాస్సేపు మొగుడినని మరచి పో.. శాన్విని  తండ్రివయి కాపాడుకో.. రాఘవ రావు కళ్ళలో చమరింపు చూడలేక తల వంచుకున్నాడు భరత్.

 

౭. “ఓ నాన్న.”— సమ్మెట ఉమాదేవి.

సాధారణంగా ఏ ఇంట్లోనైనా మనం తరచూ వినే మాటలు.

“మా అమ్మాయికి తండ్రి దగ్గరే చనువు, గారం. అది అడిగిందల్లా ఇచ్చేస్తారు..” మురిపెంగా నిష్ఠూరం వేస్తుందో తల్లి.

“మా ఆవిడేం తక్కువ తిందా! మా వాడికి అమ్మ దగ్గర ఆడిందాట, పాడింది పాట..” నవ్వుతూ చురక వేస్తాడు తండ్రి.

అదేమిటో కానీ తండ్రే, కూతురి మనోభావాల్ని బాగా అర్ధం చేసుకుంటాడేమో అనిపిస్తుంది, చాలా ఇళ్లల్లో వ్యవహారాలు చూస్తుంటే. సహజంగా బేల అయిన అమ్మాయికి తండ్రి భౌతిక, మానసిక బలాలు కొండంత అండనీ, సముద్రమంత ధైర్యాన్నీ ఇస్తాయి.

రాఘవరావుకి శాన్వి పెంపకం మొదట్నుంచీ సవాలే అయింది. చురుకుగా.. అన్నిటా ముందుండే కూతుర్ని సమాజంలోని దుష్ట శక్తులనుంచీ, సెల్ ఫోన్లు, కంప్యూటర్ల వంటి ఆధునిక పరికరాల ద్వారా పాకి పోతున్న చెడు సంస్కృతి నుంచీ కాపాడుకోవడం అంత సులభమైన వ్యవహారం కాదు. కూతురు అడిగినవన్నీ ఇచ్చిన ఆ తండ్రి, ఆమె ఎన్నుకున్న వరుడ్ని కూడా ఆనందంగా ఒప్పుకున్నాడు.

ఆడపిల్లలకి అన్నే శత్రువులే.. అందం, చదువు, తెలివీ, ధనం, కలుపుగోలు స్వభావం..

తెచ్చి పెట్టుకున్న ఆర్ధిక ఇబ్బందులు, అల్లుడి ఆత్మన్యూనతా భావం.. తన బంగారు తల్లిని చిత్ర హింసలు పెడుతుంటే విలవిల్లాడిపోయాడా కన్నతండ్రి. అరచేతిలో నడిపించి, అపురూపంగా చూసుకున్న కలల పంట హృదయ విదారకంగా, కంటి ముందే కుమిలి పోతుంటే ఏం చెయ్యాలి? కూతుర్ని తన దగ్గరికి తెచ్చేసుకుని సంసారం విఛ్ఛిన్నం చెయ్యడమా? కూతురి దీనమైన చూపు మనసుని కలచి వేస్తుంటే.. రాఘవరావు బయలు దేరాడు.. అల్లుణ్ణి కలవడానికి.

సమ్మెట ఉమాదేవి సమాజంలో పెరిగిపోతున్న చెడుని చూపించడమే కాక, దాన్ని తరిమెయ్యడానికి పరిష్కారాలు కూడా చెప్పే తపన ఉన్న రచయిత్రి. గిరిజన పాఠశాలలో ఉపాధ్యాయినిగా, నిరంతరం అట్టడుగు వర్గాల సమస్యలని గమనించి, పదిమందికీ తన రచనల ద్వారా తెలియపరుస్తుంటారు.

ఆధునిక జీవన విధానాన్ని, అందులోని అవకతవకల్ని తెలియజెప్తూ.. పరిస్థితులని నియంత్రించుకోవాలని తెలియజెప్తుందీ కథ. అర్ధరాత్రి పుట్టిన రోజు శుభాకాంక్షలు.. హత్తుకోవడాలు, వగైరాలు భారత దేశ సంస్కృతి కాదు. అవి జీర్ణం చేసుకోడానికి ఇక్కడి మగవారికి కొంత కాలం పడుతుంది, అంత వరకూ ఓపిక పట్టడమో.. చేతులు జోడించి నమస్కరించే పద్ధతి మంచిదనుకుని మారిపోవడమో! ఏదో నిర్ణయించుకోవలసింది నేటి యువతే. అది లేనంత కాలం రాఘవరావు వంట్రి తండ్రులు నలిగిపోవలసిందే!

 

 

 

 

11 thoughts on “ఓ నాన్న.. (తండ్రి – కూతురు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *