May 13, 2024

దహనం (తండ్రి – కూతురు)

రచన: సి.ఉమాదేవి

“  రాత్రినుండి కాచుకుని కూర్చున్నాము,ఎక్కడమ్మా మీ అన్నగార్లు? ”

తండ్రి చేత ‘చిట్టి తల్లీ ’అని ప్రేమగా పిలిపించుకునే పావని, కళ్లు చిమ్ముతున్న దుఃఖాశ్రువుల్ని అదిమిపట్టింది.ఇప్పటికి పదిసార్లు వినివుంటుందా ప్రశ్న!

“వచ్చేస్తారు బాబాయిగారు,మీరు కంగారు పడకండి.” కందిన ముక్కు,కళ్లు చీరకొంగుతో మరోమారు తుడుచుకుంది పావని.

‘ అన్నయ్యలెందుకిలా చేసారు? ’

తండ్రిని,చెల్లెలిని వెలివేసినట్లు ఆ ఇంటి ముఖమేకాదు,ఆ ఊరి ముఖం కూడా ఎన్నటికీ చూడబోమని కుండబద్దలు కొట్టి మరీ చెప్పి వెళ్లారు.

‘ఆ ఎక్కడికి పోతారు? తండ్రి పోయినప్పుడైనా రాకుండా ఉంటారా? ’ అనుకుంటున్నారు అందరు.

వైకల్యంతో పెళ్లికాని కూతురికి అండగా తనకున్న  కాస్త  పొలము, చిన్న పెంకుటిల్లు ఇస్తానన్నందుకు అన్నలిద్దరు వేసిన చిందులు కథాకళిని మరిపిస్తూ పావని కళ్లల్లోనే ఇంకా పచ్చిగా మెదలుతున్నాయి.

పావని మనసులో చిరుగుపడ్డ దోమతెరలో ఝుయ్యిమని జొరబడి రొదచేసే దోమలదండులా ఆలోచనలు రక్తాన్ని మరిగిస్తున్నాయి.

‘ తాను వద్దనే అంది,తన అశక్తత సాకుగా అన్నలకన్యాయం చేసి సొమ్ము చేసుకునే దురాశ తనకు లేదు.అయితే తండ్రి ఆలోచనలో మరో కోణముంది. “లేదమ్మా,వారు చదువుకున్నారు,ఉద్యోగాలు చేసుకుంటున్నారు.డబ్బులకేం కొదవలేదు.నా అనంతరం నీ అన్నలు,వదినలు నీకు అండగా నిలబడతారనే నమ్మకమైతే నాకు లేదు. మరెలా జీవిస్తావు?కరుణగల అయ్య ఎవరైనా దొరికితే కన్యాదానంకాదు కాళ్లు కళ్లకద్దుకుని నీకు పెళ్లి చేస్తాను.కాని ఆదేవుడి కరుణెప్పుడో మనపైన! ” అని బాధ పడేవాడు.

‘ అంతే కాదు, భవిష్యత్తులో అన్నయ్యలిరువురు తమ కుటుంబం తరువాతే తల్లయినా , చెల్లయినా అంటే నీ బ్రతుకుకు నా అనంతరం ఏముంటుంది అండ అనడం,’ దానితో తన చేతులకు సంకెళ్లే పడ్డాయో,తన జీవితానికి దిగులుండదన్న స్వార్థం తనను ఏమూలో లొంగదీసుకుందేమో తండ్రి నిర్ణయానికి మౌనం వహించింది. అయితే  మరుక్షణంలోనే తనకు అన్నలిరువురు అండదండయితే తనకు తండ్రిచ్చిన పెంకుటిల్లు,పొలం తిరిగి వారికే ఇవ్వాలనుకుని మనసులో గట్టిగా నిర్ణయించుకుంది. అయితే త్రాసులోమనిషినొక ప్రక్క,డబ్బునొక ప్రక్క పెట్టి   డబ్బు దిశగా వాలిపోయే మనుషులున్న లోకంలో మనసును అందులోని ఆర్తిని తూకం వేసి చూసుకోగల త్రాసులు లేవుకదా! చెల్లెలిని అందునా వైకల్యంతో మానసికంగా కృంగిపోతున్న తనను కనీసం పలకరించడమైనా లేక క్షణాలలో ఆగర్భశత్రువును చూసినట్లు అటు అన్నయ్యలు, ఇటు వదినలు చూపులతోనే కాష్ఠాన్ని సైతం  మండించెయ్యగలరన్నట్లు చూస్తూ తమ సామానంతా లారీకెక్కించి అప్పటికప్పుడే  ప్రయాణమవడం  తనకన్నా తండ్రిని అమితంగా కృంగదీసింది.

‘మమ్మల్ని వదలి వెళ్లద్దు పెద్దాడా ’, అని చేతులు పట్టుకుంటే విదిలించి పారేసిన దృశ్యం, ‘నువ్వయినా చెప్పరా చిన్నాడా ’ అంటే , ‘ ఏం చెప్పాలి?ఇంటిపై మాకేం హక్కుంది? ఏం..గంతకు తగ్గ బొంత దొరకదా నీ కూతురికి?మాకు సున్నం రాసి దానికి వెన్న రాస్తానంటే అన్న ఒప్పుకున్నా నేను చస్తే ఒప్పుకోను,’ అంటూ నిక్కచ్చిగానేకాదు కచ్చిగా పలికాడు. తండ్రి వంటిపైనున్న గుడ్డలపైనే తన కాలకృత్యాలు తీర్చుకున్నా చిరాకనేదిలేకుండా నవ్వుతూ తనకన్న ముందు కొడుకును శుద్ధి చేసిన తండ్రికది అకాల మృత్యుఘోషే!

“ఇదిగో ఇది కూడా విను…మేమిక చచ్చినా రాము.” అని శూలాన్ని మాటలకే గుచ్చి వదిలారు.

‘అంటే నేను చ…..’ అప్పటికే గుండెపై ముల్లు గుచ్చుకున్నట్లు విలవిలలాడుతున్నతండ్రికి మంచినీళ్లిచ్చి కూర్చోబెట్టింది తను.

తండ్రిలోని ఆవేశం తెచ్చిన వణుకుతో శరీరమే కాదు మాటలు తూలాయి.

“ నేను చచ్చినా రాకండి.” అన్న తండ్రి మాటలే వారితో చివరి మాటలయాయి. అంతే పెనవేసుకున్న పేగుబంధాలు పుటుక్కుమని తెగిపోయాయి.

“నువ్వు పొరబాటు చేసావు నాన్నా,మనకు మనమే మన కుటుంబానికి చిచ్చుపెట్టుకున్నట్లయింది.” తన మాటలకు తండ్రి  నవ్వేసేవాడు.

“వాళ్లెక్కడికి పోతారమ్మా?రేపు నాకేదైనా జరిగితే పరిగెత్తుకుని రారూ! ” అనేవాడు. కన్నబిడ్డలపై తల్లిదండ్రుల గట్టి నమ్మకం అనుకున్నది  ఎంత గుడ్డినమ్మకమో తండ్రి అవసానదశకు చేరుకున్నప్పుడు కాని అర్థంకాలేదు. శారీరక రుగ్మతకన్నా మానసిక వేదనతో కృంగిపోతున్న తండ్రికి తన లోపమందించిన బాధను మనసులోనే దిగమింగుకుని వేళకన్నీ అమర్చి సేవ చేసేది. చేతికర్ర ఊతమిచ్చినట్లు తండ్రి జేబు, డబ్బుకు ఊతమివ్వలేదు. బ్రతకడానికి నాలుగు ముద్దలు, నాలుగు సుద్దులు తెలిస్తే చాలు.అలాగే నాలుగు అక్షరమ్ముక్కలు  నేర్చుకుంటే మొగుడికి జాబు రాయొచ్చు, చాకలి లెక్కలు, పచారీ కొలతలు తెలిస్తే చాలు అని తలపోసేవారు నేటికీ ఉన్న రోజుల్లో తాను నేర్వని కాలేజీ చదువులను ఏ కాగితం ముక్క దొరికినా,ఎవరైనా చదివి పడేసిన పుస్తకం దొరికినా  చదివి తృప్తిపడేది.ఈ అలవాటు మనిషిలోని తర్కాన్ని మేలుకొలిపే దిశగా శ్రీకారం చుట్టడం సహజం.ఈ కోణమే ఆమెలో ఆలోచనా నెగళ్లను ఎగదోస్తోంది. ‘ నేనెందుకు ఆడపిల్లగా పుట్టానా అని కరువుదీరా ఏడ్చిన క్షణాలు మరుగునపడి ఏం ఆడపిల్లయితేనేం?కన్నబిడ్డను కానా? ’ అనే చర్చకు పావని మనసు వేదికయింది. తనను కంటిపాపలా పెంచిన తల్లిదండ్రులకు వారి చివరి దశలో పిల్లలే వారికి ఆసరా అవుతారు.తల్లి మరణించాక గరళం మింగిన శివుడిలా దుఃఖాన్ని తన కడుపులోనే దాచుకున్నాడు. పైసా పైసా కూతురి పెళ్లికి కావాలంటే, పని మానేసి భార్యను తలచుకుని ఏడుస్తూ కూర్చుంటే కూతురి పెళ్లి ఎలా చేయగలనన్న స్పృహ మనసును వేధించేది.అందుకే  ఫ్యాక్టరీ తెరిచేలోపు కూతురందించిన రొట్టెలందుకుని తృప్తిగా  తనకు తల్లిగా మారిన  చిట్టితల్లి వైపు చిరునవ్వుతో చూసేవాడు. పావనికి అన్నీ నాన్నే.తండ్రికి కూతురే అన్నీను. పండుగకు రమ్మని కొడుకులకు కబురంపితే మాకు సెలవు దొరకదనో,పిల్లలకు సెలవులేదనో,అదీ ఏ ఆదివారమో పండగ సెలవులలో కలిసొస్తే కోడళ్లకు పిలిచినట్టు పలికిన జ్వరాలనో జవాబులొచ్చేవి. చివరికిక పిలవడమే మానుకున్నారు.ఇరుగు పొరుగే అన్నటికీ ఆసరాగా నిలిచేవారు,ఇక్కడేం మనుషులకు గొడ్డుపోలేదులే,ఏ కష్టమొచ్చినా మేం ఉంటాం నీకు అన్నారు.మరి అనుకోని కష్టం రానే వచ్చింది.తండ్రిని కబళించిన మృత్యు రూపంలో.అన్నీ తామై ఉంటామన్నవారు,ముఖాన ప్రశ్న పులుముకుని చూస్తున్నారు.వచ్చిన దగ్గరి బంధువులు శవమున్న ఇంట్లో వంటలు వండుకోలేక, అటు ఆకలిని జయించలేక, జయించగల ఒకే ఒక ఆయుధం ఘడియకోసారి టీ తెచ్చి అందిస్తున్న దగ్గర్లోని టీకొట్టువాడి ఆదాయాన్ని పెంచుతోంది. మరణించాక కూడా పుణ్యం చేసుకోవడమంటే ఇదే!

తండ్రి మరణం ఆకలినే కాదు బ్రతుకుపై ఆశనే చంపేసింది పావనిలో. ‘ మనిషి        వెరవాల్సింది చావుకు కాదు చిట్టి తల్లీ,మనసును గాయపరచే మాటకు ’ అనేవాడు తండ్రి.  ‘ అవున్నాన్నా’…తలపు లేపిన తండ్రి జ్ఞాపకానికి ఆగలేని దుఃఖం బావురుమంది.వెక్కివెక్కి ఏడుస్తున్న పావనిని చూసి అందరి కళ్లు తడిచి మసకబారుతున్నాయి. “ చూడమ్మా,నీకు అన్నీ తెలుసు,మీ తండ్రి నీకు చదువులెక్కువ నేర్పకపోయినా జీవితాన్ని చదవడం బాగానే నేర్పాడు.మరోమారు మీ అన్నలకు ఫోన్ చెయ్యి. ఎంతైనా తండ్రి కదా, తప్పక వస్తారు.”

వాళ్లు చెప్పిన మాటవింటే మంచిదనుకుని ఫోనందుకుంది.అన్న నంబరు స్విచ్చాఫ్ అని వస్తోంది.నిజానికి మనసునే ఆఫ్ చేసినట్లున్నాడు.ఇక రెండో అన్న గొంతు వినబడలేదు. ‘నాన్నపోయారు వదినా ,మీరు….. అంటుండగానే “ నేను చచ్చినా రాకండి అని మమ్మల్ని వెలివేసారుగా,,,కర్మ చేయడానికి కావలసివచ్చామా?” అని ఫోనే తుంచిందో,అన్న మనసునే విరిచిందో  దేవుడికెరుక!మనసు మండినపుడు మాటలెన్నో మండుతాయి. కాని బంధాలు మండిపోకూడదు కదా! ’

చీకటి పడకూడదు.మరో రాత్రి శవ జాగరణ చేయడానికి ఎవరు సిద్ధంగాలేరు. అందరిలోను అదే ఆలోచన.

“ ఆడపిల్ల  శ్మశానానికేమొస్తుంది? ఎవరైనా కొడుకు వరస ఉంటే చూడండి.” ఎవరికి వారు తలలు తడుముకున్నారు.దహనంతో ఆగదిది.మూడో రోజు పాలు పోయాలి,పదోరోజు దశదినకర్మ అవన్నీ చుట్టుకుంటాయి.తమ పనులన్నీ వదులుకుని  ఇలాంటి కార్యాలు చేయాలంటే ఎవరు ముందుకు వస్తారు?అదే పెళ్లో,పార్టీనో అయితే సెలవులు లేకున్నా సిక్ లీవ్ పెట్టయినా వచ్చేస్తారు.తినడం, తిరగడం కేరాఫ్ పెళ్లిపెద్దే అన్నిటికీ!ఇదే నేటి సమాజదర్పణంలో గోచరించే దృశ్యం.

చెత్తెత్తే సుబ్బడున్నాడుగా?ఎవరిదో గొంతు వినిపించింది. ఎంత చెత్త సలహానో అని ఓ క్షణం అనిపించినా అందరి ముఖాల్లో కొట్టొచ్చినట్లు కనబడ్డ రిలీఫ్. టీకొట్టువాడు      తనిక కొట్టును కట్టేసుకుని వెళ్లిపోవాలేమోనని దిగులుగా అనుకున్నాడు. చావు భయాన్ని మించిన బ్రతుకు భయమది. చిట్టితల్లి గొంతులో సుళ్లు తిరుగుతున్న దుఃఖం మంత్రమేసినట్లు ఆగింది. కర్తవ్యం సూచించిన దిశగా అడుగు మొదలయింది. ‘అపుత్రస్యగతిర్నాస్తి ’అనే పదాలకర్థాన్ని తిరగ రాయాలనుకుంది. ఒక చేతితో కుండ మరో చేతితో కాగడా అందుకుని ‘ పదండి బాబాయి’ అంది.

తెల్లబోయారందరూ.వద్దంటే తామే ప్రత్యామ్నాయం చూపాలి. అది దొరుకుతుందా అంటే అనుమానమే!

అయినా ఆక్షేపణలు వచ్చాయి.ఇది తగదన్నారు. మరణించిన వానికి పున్నామ నరకం తప్పదన్నారు.

“ఇంతకన్నా పున్నామ నరకమా బాబాయి?” ‘ తండ్రి కోటీశ్వరుడు కాడు.ఒక్క రూపాయి ఉన్నాదానిపై హక్కు తమదే కావాలి,ఎందుకంటే తాము కొడుకులై పుట్టాము. పైగా తామే తండ్రిని పున్నామ నరకం నుండి కాపాడగలిగే సుపుత్రులం అనుకున్నవారికి తండ్రి మరణం కించిత్తు బాధ కలిగించలేదా? కలియుగమే కాని మరీ ఇంత ఘోరకలా! ’

దృఢమైన మనసుకు మరో మాట అతకదు.లక్ష్యాన్ని వీడదు.చెదరని సంకల్పం కన్నీళ్లకు అడ్డుకట్టగా నిలిచింది. ఆశో,పేరాశో ఆ ఊరి చాకలి, పావని చేతినుండి కాగడా అందుకుని, ‘ ఇక లేవండయ్యా అందరు!’  అన్నాడు. మరణించిన వాడి బ్రతుకుబాధలను  కథలు కథలుగా చెప్పుకుంటూ కూర్చున్నవారంతా దిగులుగా లేచారు.

‘ ఎవరికి ఎవరు ఈ లోకంలో ’ అని మనసు ఎప్పుడు రాగమందుకుంటుందో  ఎవరికి ఎరుక!

కూతురే కొడుకై దహనకార్యక్రమం పూర్తి చేసి తండ్రి చితికి నిప్పు అంటించింది చిట్టితల్లి పావని.

భగవంతుని కళ్యాణకట్టలో సైతం స్త్రీలు క్షురకులైనారు. తండ్రి మరణంతో వారసురాలిగా  శ్మశానంలో కాటికాపరులైనారు.  దహనకీలలు చిట్టితల్లి మనసులో పాతను దహించి కొత్త ఆలోచనలను మేల్కొలుపుతున్నాయి.

విశ్లేషణ:

“దహనం”—సి. ఉమాదేవి
“ప్రపంచంలోని సంబంధాలన్నీ ఆర్ధిక పరమైనవే..” ఒక మహానుభావుడు చెప్పినట్లు సంసారం మొదలు సామ్రాజ్యాల వరకూ ఆస్థి.. డబ్బు. అంతే… అక్కచెల్లెళ్లు లేరు, తల్లిదండ్రులు లేరు.. తను తన చిన్ని పొట్ట, “అపుత్రస్య గతిర్నాస్తి..”.. పుత్రులనే వారు పున్నామనరకం నుండి తప్పిస్తారని, మన సంస్కృతిలో కొడుకనే వాడు కొరివి పెట్టాలని.. కొడుకు కోసం తపస్సు చేసే వాళ్లున్నారు.
ఆ కొడుకులే, అవిటి చెల్లెలికి ఆధారం కల్పించడానికి తన కున్న కొద్ది ఆస్థీ ఇచ్చిన తండ్రి మీద కోపంతో, అతను చనిపోతే కొరివి పెట్టడానికి రాకపోతే ఆ చెల్లెలి పరిస్థితి ఏమిటి? ఆదుకుంటామని అన్ని కబుర్లూ చెప్పిన ఊరివారు ఎవరూ ముందుకు రాకపోతే ఆ నిస్సహాయురాలి కర్తవ్యం ఏమిటి?
కుంటి పిల్లయిన పావని అంటే తండ్రికి ప్రత్యేక అభిమానం. చదువు చెప్పించలేకపోయినా చేతనయిన విధంగా కళ్లల్లో పెటుకుని చూసుకున్నాడు. చివరి క్షణం వరకూ, ఫాక్టరీలో ఉద్యోగం చేసి పోషించాడు. చెల్లెలికి, ఉన్న కొద్ది పొలమూ, కొంపా ఇచ్చాడని కత్తి కట్టిన కొడుకులు అర్ధం చేసుకుని వస్తారేమోనని ఎదురు చూశాడు. తండ్రి బ్రతికుండగా రానే లేదు ఎవరూ.. పోనీ పోయిన తరువాతైనా.. ఉలుకూ పలుకూ లేదు.. అప్పుడు ఆ చిట్టి తల్లి ఏం చేసింది? ఆమె తీసుకున్న నిర్ణయానికి ఊరివాళ్లు ఆశ్చర్యంతో మిన్నకుండడం మినహా ఏమీ చెయ్యలేక పోయారు.
సి. ఉమాదేవి గారు, ధృఢ నిశ్చయమున్న కూతురు తండ్రికి చెయ్యలేని విధులేమీ లేవని తమ కథలో నొక్కి చెప్పారు. ఎన్నో కథలు, మరెన్నో సమీక్షలు, వ్యాసాలు రచించిన చేయి తిరిగిన రచయిత్రి ఉమాదేవి. ఈ కథలో ఒక ఇంటి యజమాని చనిపోయాక ఊరి వాళ్ల చర్యలమీద ఎక్కువగా దృష్టి పెట్టారు. తండ్రీ కూతుళ్ల అనుబంధం మీద, అన్నదమ్ములు చెల్లెలిపై ఎందుకు నిరాదరణ చూపించారో అనే అంశాలపై ఇంకొంచెం దృష్టి సారించి ఉంటే బాగుండేదనిపించింది.
మనసున్న ప్రతీ మనిషినీ కదిలించే కథ “దహనం”.

8 thoughts on “దహనం (తండ్రి – కూతురు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *