May 13, 2024

నాన్నకూతురు (తండ్రి – కూతురు)

రచన: మణి వడ్లమాని
ఇల్లంతా   సందడిగా వుంది,  ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారో అర్ధం కావటంలేదు. ఒకళ్ళని ప్రశ్న అడిగితే వేరేవాళ్ళు జవాబు ఇస్తున్నారు. కాఫీలు  అడగడం తడవు  ఒక్కలా  అందరికి అందిస్తూనే   ఉన్నారు. ఆడవాళ్ళు అందరూ ఒక చోట చేరికబుర్లు చెప్పుకుంటున్నారు. అందులో ఆవకాయనుంచి అంతరిక్షందాకా  విశేషాలు వున్నాయి.   కొంతమంది ఇంటి ముందు పందిరి వేయించడం లో నిమగ్న మయ్యారు  మరికొంత మంది  ఆమూల సౌధంబులో అన్నట్లు మేడమీద గదిలో చతుర్ముఖ పారయణం చేస్తున్నారు. ఇంతకీ హడావుడికి కారణం  అంతా  స్నిగ్ధ పెళ్లి.
శేఖర్, స్వాతిల ఒక్కగానొక్క సంతానమే స్నిగ్ధ. ఇద్దరూ బ్యాంకు ఉద్యోగస్థులే, ఉన్నంతలో ఇప్పటి కాలానుగుణంగా ఉండాల్సిన  హంగులన్నీ సమకూర్చుకొని ఆనందంగా వుంటున్నారు. వేరు కుటుంబాలు అయినా పండగ, పబ్బం వచ్చింది అంటే శేఖర్ తోడబుట్టిన వాళ్ళు, స్వాతి తోడబుట్టిన వాళ్ళు కలుసుకుంటూనే ఉంటారు. అలా అందరి మధ్యన ప్రేమ, అభిమానం, చనువు అన్నీవున్నాయి.
శేఖర్ కి కూతురు అంటే పంచప్రాణాలు. ఎప్పుడన్నా బ్యాంకు నుంచి ఇంటికి వచ్చేసరికి కూతురు కనిపించకపోతే విలవిలాడిపోయేవాడు. భార్య స్వాతి అనేది  “మీకు ఒక్కరికే కాదు ప్రపంచంలో కూతురు వున్నది..  “ఎవరి సంగతో నాకు దేనికి నా కూతురే నా ప్రపంచం,  నా సర్వస్వం” అనేవాడు శేఖర్…
స్నిగ్ధ కూడా తల్లి కంటే తండ్రితోనే ఎక్కువగా అన్నీ చెప్పేది. స్వాతి సరదాగా అనేది మీ ఇద్దరికి నేను లేకపోయినా పర్వాలేదు అని. అప్పుడు మటుకు అమ్మో అమ్మ ఆ మాట అనకు అంటూ తల్లిని చుట్టేసుకోనేది. పాపం డాడికి నేనంటే కొంచెం ఎక్కువ ఇష్టం అనేది. శేఖర్ మురిపెంగా చూసుకునేవాడు ఇద్దరినీ
స్నిగ్ధ తల్లి స్వాతి, మేనత్త, పిన్ని పెళ్ళికి వచ్చిన వాళ్ళకి ఇవ్వడంకోసం  పండు తాంబూలం లాంటివి సిద్ధం చేసుకుంటున్నారు  మేనమామల పిల్లలు పైన మేడ మీదకి కిందకి  తిరుగుతూ ఒకటే గోల చేస్తూ ఆడుకుంటున్నారు.
వాళ్ళందరి  హుషారు చూస్తున్న  స్నిగ్ధ పెదవుల మీద  కూడా  సిగ్గుతో కూడిన ఆనందం మొహమంతా పాకింది. అందులోను పెళ్లికూతురాయె .
హాలులో నిలబడ్డ స్నిగ్ధని చూసిన  పిన్ని “వెళ్లి కాసేపు రెస్ట్ తీసుకో, ఇంక ఈ  రెండూ రోజులు పూర్తిగా నిద్ర ఉండదు” అని చెప్పింది
“అవును వెళ్ళు’ అంటూ ఇంచు మించుగా అక్కడవున్న  మేనమామల భార్యలు, మేనత్త, పెత్తల్లి  వగైరాలు అందరూ వంత పాడారు.
“బాబోయి ఇంతమంది ఒక్కసారిగా చెప్పేస్తున్నారు, ఇదిగో ఇప్పడే వెళుతున్నాను,”అంటూ పైకి వెళ్ళింది స్నిగ్ధ.
కొంచెంసేపు అయిన వెంటనే  మళ్ళీ కిందకి వచ్చేసింది
“అదేమిటే కొంచెం సేపు కూడా పడుకోలేదు.  అప్పుడే వచ్చేసావా? రెస్ట్ లేకపోతె ఫొటోస్ సరిగా రావు ఆ తర్వాత ఎంత మొత్తుకొన్న లాభం లేదు, వింటున్నావా? నా మాటలు అంటూ అబ్బా!ఆ ఫోన్  కాసేపు పక్కన పెట్టేయ్యి తల్లి” అంది స్వాతి
“అయ్యో ఫోన్ పక్కన పెట్టేసే ఎలా? మెసేజ్ లు వస్తూనే ఉంటాయి, అర్ధం చేసుకోరూ” అని మావయ్య భార్య అంటే
“ఈ పెద్దోళ్లు ఉన్నారు చూడూ” అని చిన్న మావయ్య భార్య అంది.
“అబ్బా!పెద్దత్తా, చిన్నత్తా ప్లీజ్” అని వాళ్ళవైపు  చిరుకోపంగా చూసింది.
ఇంతలో “ స్నిగ్ధా,ఒక సారి పైకి రా” అంటూ మనోజ్ఞ్య పిలిచింది.
మనోజ్ఞ్య, స్నిగ్ధకి  పెదనాన్నకూతురు,  అమెరికాలో వుంటుంది . అక్కడ యూనివర్సిటీ లో సైకాలజీ ప్రొఫెసర్ గా పని చేస్తోంది. బాబాయి కూతురు పెళ్ళికోసం వచ్చింది. ఆమె భర్త రాలేదు. పిల్లలు వచ్చారు. అది కాక మనోజ్ఞ్య, స్నిగ్ధ మధ్య  చుట్టరికాన్ని మించిన అనుబంధం వుంది. అందులో తను ఇంటికి పెద్దపిల్ల  కావటంతో సలహాలు, అవి కూడా తీసుకుంటూ ఉంటారు శేఖర్ దంపతులు
“ ఆ, దేనికి పిలిచావు అక్కా” అంటూ  గదిలోకి వచ్చింది.
“అదే రేపు నువ్వు కట్టుకునే చీరలు, నగలు అవి సెట్ చేద్దామని, ఒక సారి అన్ని చూసి పెట్లో సర్దమని పిన్ని చెప్పింది” అంటూ అన్ని పెట్టెలో పెడుతూ ఒకసారి “ఈ పెళ్లి చీర, నగలు పెట్టుకొని చూపించు” అంది.
సరే అంటూ అద్దంముందు నించొని అన్ని ఒక సారి వేసుకొని చూసింది. ఏదో లోటు కనిపించింది.
అంతే వెంటనే “ఏమి బాలేదు, అన్నీ డల్ గా వున్నాయి, చీ నా మొహానికి  ఏవి తొందరగా  నప్పవు” అంటూ విసుక్కొంది”.
స్నిగ్ధ మొహం చిన్నబోవడం, ఏదో  తెలియని విసుగు, ఆందోళన దానిలో కనిపించడం చూసింది మనోజ్ఞ్య
ఇదేమిటి, ఇలా అంటుంది అనుకొని పినతల్లిని, మేనత్తని పిలిచింది. వాళ్ళు చెప్పి చూసారు అయినా  వినలేదు.
“అదేంటి  తల్లీ అన్ని నీకు నచ్చినవే కదా కొన్నది ఇప్పుడు ఎందుకు బాగా లేదు”  అని అంది స్వాతి.
“అమ్మా !!”  ఇంతలో మనోజ్ఞ్య వారించి “నేను మాట్లాడతాను కొంత సేపు వదిలేద్దాము దాన్ని” అని చెప్పింది  “సరే అంటూ” వాళ్ళు కిందకి వెళ్ళిపోయారు. ఇంతలో స్నిగ్ధకి కాబోయే శ్రీ వారి దగ్గర్నుంచి ఫోన్ వచ్చింది.
తను ఫోన్ మాట్లాడుతున్నంత సేపు మనోజ్ఞ్య, స్నిగ్ధ నీ చూస్తూనే వుంది. మనోజ్ఞ్య  సైకాలజీ ప్రొఫెసర్, తన వృత్తి రీత్యా వచ్చిన అనుభవంతో ఒక విషయం గమనించింది.  బాబాయి ఇంత హడావుడి జరుగుతున్నా స్నిగ్ధతో  సరదాగా మాట్లాడటం. అది లేదు, తన పనులు తనవే గాని  పెళ్లి జోకులు వెయ్యడంలాంటివి  కూడా లేవు. దీనికి దానికి లింక్ ఏదైనా వుందా/ తెలుసుకోవాలి ముందు.  అంతకు ముందు ఒకసారి స్నిగ్ధతో  కూడా మాట్లాడదాము అనుకుంటూ తన  దగ్గరకు వెళ్ళింది.
పిల్లలందరూ స్నిగ్ధ చుట్టురా కూచొని వున్నారు. మెహందీ ఎవరెవరికి బాగా పండిందా అని చూసుకుంటున్నారు.
నెమ్మదిగా స్నిగ్ధ పక్కకు చేరి “నిన్నొకటి అడుగుతాను చెప్పు,ఈ పెళ్లి నీకిష్టమేనా? లేకపోతే బాబాయి ఏమన్నా ఫోర్సు చేసారా?”  “ఏం లేదు  నాకు కూడా నచ్చింది” అని అంది. అవును కూడా బాబాయి బిజీగా ఉంటున్నారా? ఎక్కువగా మాట్లాడటంలేదు”
“ఏమో తెలియదు, ఇదివరకు నాతో ఎంత క్లోజ్ గా వుండేవారో తెలుసా? ఇప్పుడు ఈ  వారం రోజులనుంచి అయితే అసలు  నాతో మాట్లాడటమే తక్కుయింది”
“పోనీ నువ్వు  పలకరిస్తున్నావా?”
“ఆ, అంటే నేను కూడా ఈ మధ్య కొంచెము  ఆర్యన్ తో ఫోన్లతో బిజీ అయ్యాను.”
“ఆర్యన్ బాబాయి బానే మాట్లాడుకొంటారా?”
“ఆ పెద్దగా లేదు హాయ్,హల్లో ఎలా వున్నారు లాంటి జనరల్ విషయాలే” అంటే ఇద్దరి మధ్య చనువు అంత కూడా లేదు కదా”
కొంచెం కొంచెంగా  అర్ధమయింది, మనోజ్ఞ్యకి, పొసేసివ్ నెస్ (possessiveness) ఇద్దరకి ఉండటంతో , చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడింది. ఇద్దరి మధ్య . అందులోను ఒక్కటే పిల్ల అవడం మరో కారణం.   ఇది ఇప్పుడు ఇలా వదిలేస్తే ముందు ముందు చాలా కష్టం అనుకొని? ఒక నిశ్చయానికి వచ్చి వీధి లో పందిరి దగ్గర నుంచొని ఫోన్ మాట్లాడుతున్న శేఖర్ దగ్గరకు వెళ్ళింది. అతనితో కొంచెం సేపు మాట్లాడి వస్తూ వుంటే
తళుక్కున ఒక ఆలోచన మెదిలింది మనసులో. అవును ఇలానే చేయాలి అనుకుంటూ  తన ప్లాన్ ని  అమలు చేసేపని లో పడింది.
ఇంతలో అందరకీ భోజనాలకు పిలుపు వచ్చింది. అందరూ కిందకు వచ్చారు కొంత మంది డైనింగ్ టేబుల్ మీద మిగత వాళ్ళు కింద కూచున్నారు. స్నిగ్ధ మావయ్యలు వడ్డిస్తున్నారు, సరదాగా కబుర్లు దొర్లుతున్నాయి.
పెళ్లి కూతురిగా కళకళలాడుతున్న కూతుర్ని  శేఖర్ తదేకంగా చూడటం మనోజ్ఞ్య గమనించింది.
“బాబాయి భోజనం అయిన తరువాత అందరం ఇక్కడ హాలులో కలుసుకోవాలి.” అని చెప్పింది
“అబ్బే నాకు పనివుంది” అన్నాడు శేఖర్
“ఇది అంతా కన్నా ముఖ్యమైనది  బాబాయి అని మొండిగా” అంది మనోజ్ఞ్య.
అందరూ “ఏంటి, ఏంటి అని” అప్పుడే అడిగేస్తున్నారు.
“కొంచెము ఓపికపట్టండి అందరూ “అని సాగదీసింది మనోజ్ఞ్య.
అంతకు ముందే  ‘ స్నిగ్ధ’ కజిన్స్ అందరూ  కలిసి  తన చిన్నప్పటినుంచి తీసిన వీడియోలన్నీ కలిపి ఒక మూవీ లా చేసారు. ఇదంతా సాయంత్రం నుంచి  జరుగుతోంది మనోజ్ఞ్య  ఆధ్వర్యంలో.  ఇప్పుడు వాళ్ళు అ పని మీదే ఉన్నారు.
అందరిని హాలులో టీవీ ముందుకు రమ్మంది మనోజ్ఞ్య.  “ఇప్పుడు నేను మీకు ఒక సినిమాను చూపిస్తాను మధ్యలో ఎవరూ మాట్లాడద్దు అన్ని వెండితెరమీదే చూడాలి ” అంది. ఎవరో  హాలులో లైట్స్ ఆఫ్ చేసేసారు. అందరూ నిజం సినిమాకి ఎంత  ఉత్కంఠగా ఎదురు చూస్తారో  అలా బిగపెట్టుకొని చూస్తున్నారు. తమాషాగా ఉందే అనుకుంటూ
శేఖర్ , స్వాతి ల మధ్యలో స్నిగ్ధని కుర్చోపెట్టింది.
మూవీ మొదలైంది. ముందు ఒక పెళ్లి సీన్ వచ్చింది తీరా చూస్తే అది శేఖర్ స్వాతిల పెళ్లి వీడియోలోది.  వెనకాలే  సీతారాముల కళ్యాణం పాట. తరువాత సీను మారింది. స్వాతి సీమంతం జరుగుతోంది.. దాని వెనకాలే అక్కయ్యకు సీమంతం అనే పాటను బ్యాక్ గ్రౌండ్ లో పెట్టారు. తరువాత ఒక బాలసారె వీడియో పెట్టారు  అందులో శేఖర్  ఆ పాపను మురిపెంగా చూస్తూ పేరు రాయడం చూసేసరికి  అందరూ “స్నిగ్ధా” అని అరిచారు. అప్పుడు వచ్చింది టైటిల్ ‘ మా నాన్నకూతురు”  అని. ఇక తర్వాత ప్రతి ఏడాది పుట్టినరోజు,16 ఏళ్ళ పుట్టినరోజు, కాలేజిలో చేరడం ఇవన్నీ చూస్తూ, ఆఖరున  పెళ్లి, ఎంగేజ్మెంట్ దగ్గరకు వచ్చేసరికి  ఒక్కసారిగా శేఖర్ లో దుఖం కట్టలు తెచ్చుకొంది. లావా బద్దలయింది,  స్నిగ్ధని పట్టుకొని చిన్నపిల్లాడిలా ఏడ్చాడు. స్వాతి వెంటనే లేచి భర్త వీపు రాస్తూ నిలుచుంది. ఒక్కసారిగా భారంగా మారింది వాతావరణం.
వెంటనే మనోజ్ఞ్య లేచి బాబాయి దగ్గరకు వెళ్లి “సారీ బాబాయి! నావల్లే ఇదంతా జరిగింది.  మీకు తెలియకుండా ఈ ప్రోగ్రాం  నేను ఎందుకు పెట్టానో తెలుసా? నువ్వు, స్నిగ్ధ కూడా  ఓపెన్ గా మాట్లాడటం మానేసుకొన్నారు. నువ్వేమో ఇంక  తను నీ దగ్గరనుంచి వెళ్ళిపోతోంది అన్న నిజాన్ని ఒప్పుకోలేకపోతున్నావు. పాపం అదేమో డాడీ  ఎందుకో సరిగ్గా మాట్లాడటంలేదు, ఇదివరకు  ప్రతి విషయం నాతో షేర్ చేసేవారు, ఏం కొన్నా వెంటనే బావుందనే వారు, అలాంటిది ఇప్పుడు ఏవి లేదు.  అసలు మునుపటి డాడీనే కాదు.  అసలు సరిగానే లేరు అని బాధపడింది”  దానికి తెలియదు కదా  ఇదంతా. అందుకే మీ ఇద్దరి మనసులోని ఆ దూరం మాయం చేస్తే ఇద్దరూ మళ్ళీ దగ్గర అవుతారని ఇలా ప్లాన్ చేశాను అని చెప్పింది.
అప్పుడు స్వాతి అంది “నా పెళ్ళికి  మా నాన్నగారు కళ్ళ నీళ్లు పెట్టుకొంటే, తెలియనితనంతో ఛా!! నాన్నగారు మీరు ఏడుస్తున్నారు ఏంటి అన్నాను..  అప్పుడు మా నాన్న “ఇంతవరకు అల్లారుముద్దుగా పెరిగిన  ఆడపిల్ల, ఇక నుంచి పరాయిది అయిపోతోంది అనే బాధ అమ్మా”  అని అన్నారు. ఇప్పుడు మా వంతు వచ్చింది”
వెంటనే శేఖర్ “అవునమ్మా, నాకు మాట్లాడటం చేత కాలేదు తల్లి, నిన్ను మిస్ అవుతాను అనే బాధ చాలా వుంది . ఇంటికి  వచ్చి ఎప్పుడూ మై డాల్ అని  పిలిస్తే, వెంటనే  వచ్చే నువ్వు ఇంక  ఇక్కడ ఉండవు. మా నుంచి విడిపోతున్నావు. నా శరీరం నుంచి ఒక ముక్క వెళ్ళిపోతూనట్లుగా ఉంది. మంచి సంబంధం అని అమెరికాకి పంపుతున్నాను. చాలా దూరంగా  వెళ్ళిపోతున్నావు. ఆ బాధని తట్టుకోలేక నేను ఎన్నోసార్లు మీ అమ్మ మీద గట్టిగా అరిచాను, విసుకొన్నాను., నువ్వు పెళ్లి కుదిరిందని యెంత సంతోషంగా ఉన్నావో చూస్తూనే వున్నాను.  అందుకే నీతో మాట్లాడితే ఎక్కడ బయట పడిపోతానో , అది చూసి నువ్వు  యెంత బెంబేలు పడతావో  అని దూరంగా వుండి  పోయాను తల్లి కానీ ఇదిగో  ఇవాళ మన మనోజ్ఞ్య  వచ్చి అన్ని భయాలు ఎగరకొట్టేసింది. కణ్వమహర్షి అంతటి వారే పెంచిన కూతురు శకుంతలను అత్తవారింటికి అంపకం పెడుతూ దుఃఖించాడట. ఇంక నాలాంటి వాళ్ళకి రాకుండా ఉంటుందా?చెప్పు  అని,  చాలా ఎమోషనల్ గ మాట్లాడాను కదా!  ఇక ఇప్పటి నుంచి  అందరం సరదాగా ఉందాము,  ఈ శుభ సమయంలో అందరికి మరొక్క సారి కాఫీ”అంటూ గట్టిగా ఈల వేసి అరిచాడు శేఖర్…
అందరూ” హే” అంటూ గొల్లున నవ్వారు, స్నిగ్ధ అయితే శేఖర్ ను పట్టుకొని వదలలేదు.
“మనూ, ఇలారా తల్లి మంచి పని చేసావు” అని దగ్గరకు తీసుకున్నాడు మనోజ్ఞ్యని  బాబాయి శేఖర్.
అప్పుడు స్నిగ్ధ మనోజ్ఞ్య తో “అక్కా! ఎస్  నేను Papa’s Princess” ని  అని గర్వంగా అంది

A FATHER ALWAYS REMAINS A DAUGHTER’s FIRST LOVE.

**********

విశ్లేషణ:

. “నాన్న కూతురు”— మణి వడ్లమాని.
ఇంట్లో పెళ్లి వేడుకలు మొదలయ్యాయంటే.. మామిడి తోరణాలకి పరుగెత్తాల్సిందే. మా చిన్నప్పుడు రాటలు, పందిళ్లు.. తాటాకు వాసనలు, మొగలిపూల ఘుమఘుమలు. నెల ముందుగానే చుట్టాలందరూ వచ్చేసే వారు. బాబాయనీ,, అత్తయ్యనీ.. రకరకాల పిలుపులు.. అంతా హడావుడి. సంబరాలు. అంత ఆనందం, సంతోషం.. అప్పగింతలు దగ్గరకొచ్చే సరికి, సన్నాయి శహనలో మొదలు పెట్టగానే.. అప్పగించుకుంటున్న అత్త గారితో సహా కన్నీరు మున్నీరయ్యే వారు. కన్న తండ్రి కండువా తడిసి ముద్దై పోయేది.
ఆ తరువాత, మూణ్ణిద్దర్లనీ, మణుగుడుపులనీ.. వీళ్లు వాళ్లింటికి.. వాళ్లు వీళ్లింటికి వస్తూ పోతూ, అన్నయ్యా, వదిన గారూ అని పిలుచుకుంటూ, ఏవో చిన్న చిన్న అలకలూ అవీ ఉన్నా అలా కలిసిపోయే వారు. మరి.. ఇప్పుడలాకాదే..
అంతా గుంభన.. ఏదీ గట్టిగా పైకి అనుకోకూడదు. వరుసలు, పిలుపులు మాయం అయిపోతున్నాయి. అంకుల్స్.. ఆంటీస్. నో పందిళ్లు.. నో తాటాకు స్మెల్స్. కొబ్బరాకులతో బూరాలు చేసే వాళ్లమంటే ఎవరు నమ్మరు. ఒకళ్ళో ఇద్దరో అమ్మాయిలు.. అమ్మాయి పెళ్ళంటే కూడా కళ్యాణ మండపానికెళ్ళేప్పుడే ఉంటారు చుట్టాలు.. అపార్ట్ మెంట్లలో అంతే కద.. అంతా సైలెంట్ గా. ఏ భావమైనా మనసులోనే.. పైకి చెప్తే ఏమనుకుంటారో. ముఖ్యంగా మగవారు.. తండ్రులు గంభీరంగా ఉండాలి. తన వరాల కొండ దూర దూరాలకి వెళ్లిపోతుంది.. ఇప్పుడు భూగోళమంతా ఒక్కటైపోయిందాయె!
ఆధునిక జీవనంలో ఒక నాన్న., కూతురి పెళ్లి ముందు పడే మానసిక వేదనని, ఆ కూతురు తండ్రి ముభావాన్ని మరో రకంగా అర్ధం చేసుకోవడాన్ని కళ్లకి కట్టినట్లు చిత్రించింది మణి వడ్లమాని ఈ కథానికలో. ఈ మధ్య కాలంలో రాకెట్ లా దూసుకుపోతున్న మరో రచయిత్రి మణి. ఒక సంఘటన తీసుకుని కథగా సులువుగా మలిచేస్తుంది. ఈ కథ తేలికగా అనిపిస్తుంది కానీ బరువైన సందేశముందిందులో.

17 thoughts on “నాన్నకూతురు (తండ్రి – కూతురు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *