May 19, 2024

అంతిమం – 5

రచన: రామా చంద్రమౌళి

శైల చెప్పింది. ప్రస్తుతం ట్రెండ్ ఏమిటంటే. . ‘పాత ఒక వింత. . కొత్త ఒక రోత ‘. ఆంటిక్ సైకాలజీ అదే కదా. పురావస్తువులపై మనిషికి మక్కువెందుకంటే. . ఓల్డ్ ఈజ్ గోల్డ్. అందుకు. సర్కస్ కళ ఓల్డ్. అందుకే గోల్డ్. ఐతే మనం దీన్ని ఆధునీకరించి. . కొన్ని కొత్త భారతీయ గ్రామీణ యుద్ధ కళలనూ, స్కిల్స్ నూ ప్రవేశ పెట్టాలి.
కాబట్టి ఒక కార్యాచరణ ప్రణాళికను తయారు చేద్దాం శైలా. తర్వాత చూద్దాం. మన లక్ష్యమైతే ఈ కళను బ్రతికించడమేగాని డబ్బు సంపాదించడం మాత్రం కాదు.
“సో” అన్నాడు జయరాజ్.
ముందు సర్కస్ కంపనీకి ఒక పది రోజులు సెలవు ప్రకటించి స్టాఫ్ అందరికీ వాళ్ళ వాళ్ళ ఇష్టమున్న నిర్ణయం తీసుకొమ్మనీ. . ఈ జీవితమే బాగుంటుందని అనుకున్నవాళ్ళు మాత్రమే మనతో కొనసాగమనీ ఆప్షన్ ఇచ్చుట. తర్వాత చూద్దాం.
“మనం. . దుస్సాహసం చేస్తున్నామా జయరాజ్ ”
“లేదు శైలా. . ఐతే నేనేమనుకుంటున్నానంటే. . మన ఇండియన్ రూరల్ మార్షల్ కళలనూ, గ్రామీణ కళా నైపుణ్యాలనూ మనం విస్తృతంగా పర్యటించి గుర్తించి వాటిని గనుక తగురీతిలో మన సర్కస్ లో కూర్చినట్లయితే వాటిని విదేశాల్లో గనుక ఎఫెక్టివ్ గా ప్రదర్శించగలిగితే. . ఇదే ‘గ్లోబల్ సర్కస్ ‘ గ్లోబల్ గా రాణిస్తుంది తప్పకుండా. ”
“ఒప్పుకుంటా జయరాజ్. నేను నీ ఈ ఆలోచనలను. . కొత్త కళలను కూర్చుట. . విదేశీ ప్రయత్నాలు చేయుట. . అనే ప్రతిపాదనలను సమర్థిస్తాను. శ్రమ పడుదాం బాగా కలిసిమెలిసి. ”
“శైలా. . మూడు రకాల భార్యాభర్తలున్నారు ఈ సమాజంలో. . ఒకటి ఇద్దరూ విడి విడి వ్యవస్థలు. తెచ్చి పెడితే తింటా. . చస్తే ముండ మోస్తా. . టైపు. రెండు. . ఎవరికివారు రెండు వ్యవస్థలు. వేర్వేరు బాధ్యతలు. . హక్కులు. . కాని కలిసి పని చేయడాలు. ఇక మూడు. . ఇద్దరూ భౌతికంగా వేర్వేరే ఐనా ఒకే వ్యవస్థ. ఒకటే శరీరం. ఒకటే ఆత్మ. ఒకటే జీవితం. మనది మూడవ తరహా శైలా. నడుద్దాం కలిసి. . ముందు విసృతంగా పర్యటిద్దాం. కేరళ లో కుండలినీ విద్యపై అధారపడ్డ అద్భుతమైన కలరిప్పట్టు యుద్ధ కళ ఉంది. పంజాబ్ లో అద్భుతమైన గ్రామీణ క్రీడలున్నాయి. . కళ్ళకు నల్లని గుడ్డను కట్టుకుని సుత్తెతో మనుషుల మధ్య అక్కడక్కడ పెట్టిన వందల కొబ్బరికాయలను పగులగొట్టుట. మూడు గుర్రాలపై స్వారీ చేయుట. తెలంగాణాలో సాధనాసురుల విద్యలు. . చాతీపై బండలను సుత్తెతో పగులగొట్టుట. . ఇలా ఒక్కో ఐటం ను పది నిముషాల చొప్పున మూడు గంటలు ప్రదర్శిస్తే. . ” చెబుతూ పోతున్నాడు జయరాజ్ భవిష్యత్తును దర్శిస్తూ.
ఆ రోజు సర్కస్ హైదరాబాద్ జింఖానా గ్రౌండ్స్ లో ఉంది. ప్రదర్శన చివరిరోజు. దీని తర్వాత నాగపూర్ కు మారాలి. కాని ఒక నెల రోజులు విరామం ప్రకటించారు.
రాత్రి తొమ్మిది గంటలకు తనదీ, శైలదీ కత్తులు విసిరే విద్య ప్రదర్శనా, గ్లోబ్ మోటార్ సైకిల్ డ్రైవింగ్ షో ఉంది.
ప్రతిరోజూ ఒక మరణం. . ప్రతి రోజూ ఒక జననం.
ఏడు గంటలైంది. ఫస్ట్ షో మొదలై పావుహంటై. ,
మేనేజర్ క్యాబిన్ నుండి చూశాడు. ఆఖరి రోజు కాబట్టి జనం బాగానే ఉన్నారు. లోపల ఝూలా నడుస్తోంది. ఝూలా అనేది ఒక ఎవర్ గ్రీన్ ఐటం సర్కస్ ప్రదర్శనల్లో. బయటికి చెప్పుకోరుగాని ఆడవాళ్ళ అందాలు ఆ ఐటంలో చాలా కీలక పాత్ర వహిస్తాయి. అందమైన ఆడపిల్లలని ఝూలా కోసం అట్టిపెట్టుకుంటారు కాస్త ఎక్కువ పేమెంటైనా ఇచ్చి.
కిందికి వచ్చి ఒకసారి అనిమల్ లాంజ్ వైపు వెళ్ళాడు జయరాజ్.
పాపం పరాశర్ కు జంతువులంటే ఎంత ప్రేమో. అతను దగ్గరగా వెళ్ళగానే సింహం. ఏనుగులు, గుర్రాలు. . కోతులు. . అన్నీ చుట్టూ మూగుతూండేవి.
తన కూతురు జయకూడా లాస్ట్ రెండేండ్లవరకు ఈ జంతువులతోనే ఆడుకునేది.
ఇప్పుడు వాళ్ళెవరూ లేరు.
నిస్సందేహంగా తమ సర్కస్ జీవితం పూర్తిగా భిన్నమైంది.
ఇదో లోకం.
శైల చెప్పింది సిబ్బంది అందరికీ. . సర్కస్ మున్ముందు ఎలా ఉంటుందో అని. చాలా మంది వెళ్ళిపోతారనుకున్నారు తాము. కాని విచిత్రంగా ఏ ఇద్దరు ముగ్గురో తప్ప అందరూ తమతోపాటే కొనసాగుతానన్నారు. ‘డై టుగెథర్ ‘అన్నారు.
ఎంత సంతోషమో.
అప్పుడనిపించింది జయరాజ్ కు. . తాము తప్పనిసరిగా విజయం సాధించబోతున్నారని.
విజయానికి అతని నిర్వచనం బాగా డబ్బు సంపాదించడం కాదు. ‘ఒక యోగ్యమైన లక్ష్యాన్ని మనిషి అంచెలంచెలుగా అందుకోవడమే విజయం’ అని అతననుకుంటాడు.

*****

ఒక్క నాలుగు నెలల తర్వాత.
ఫ్రాన్స్.
పారిస్.
ఈఫిల్ టవర్.
ఈఫిల్ టవర్ నుండి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో. . హోటల్ కెన్సింగ్టన్ ప్రక్కన. . డి లా బోర్డొన్నై రోడ్. . విశాలమైన ఖాళీ స్థలంలో. ,
‘గ్లోబల్ సర్కస్-ఇండియా’
దేదీప్యమానమైన విద్యుత్ కాంతులీనుతున్న ఆవరణలో. ,
పదిహేనురోజుల నుండి హౌజ్ ఫుల్ కలెక్షన్లతో. . నడక.
ప్రతి వృత్తికి కొంత క్రమశిక్షణ అవసరమని పూర్తిగా విశ్వసిస్తాడు జయరాజ్.
ఏ పరిపాలనా వ్యవస్థలో నైనా యజమాని గానీ, అధికారి గానీ చాలాసార్లు ఎందుకు విఫలులౌతారంటే. . వాళ్ళు వాళ్ళ కింద పనిచేసే అందర్నీ సంతోషపెట్టాలనుకుంటారు. కాని జీవితంలో విజయాలను సాధించాలనుకునే వారు బిల్ కోస్బీ చెప్పిన ఒక మేనేజ్మెంట్ సూత్రాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయనేమన్నాడంటే ‘ నాకు విజయ రహస్యం తెలియదు. కాని ఓటమి రహస్యం తెలుసు. అందరినీ సంతోషపెట్టడానికి ప్రయత్నించడమే ఓటమికి కారణం’అని.
జయరాజ్ గ్లోబల్ సర్కస్ ను ఖండాంతరం చేయడానికి రెండే ప్రాధాన్యతలను పాటించాడు. ,
ఒకటి. . ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సర్కస్ లను విసృతంగా పర్యటించి చూచి వాటిలో లేని క్రొంగొత్త అంశాలను. . ముఖ్యంగా భారతీయ వారసత్వ యుద్ధ కళలను. గ్రామీణ సంప్రదాయ విద్యలను. . ప్రవేశపెట్టి అద్భుతమైన ఆదరణను ప్రపంచ ప్రేక్షకులనుండి పొందడం.
రెండు. . కఠినమైన క్రమశిక్షణను తమ టీంలోని ప్రతివ్యక్తీ తన జీవనవిధానంగా చేసుకుని విజయంలో భాగస్వామి కావడం.
ఉదాహరణకు. . భారతీయ పంచమ వేదమైన మహాభారతంలో వర్ణితమైన ‘మత్స్య యంత్రం’ ను ఒక ఐటంగా చేసి. . ఆ అంశాన్ని ప్రదర్శిస్తున్నపుడు ఒక స్త్రీ తన అద్భుతమైన గొంతుతో చేసే తీయని వ్యాఖ్యానం, ఇచ్చే వివరణ ఎంతో మందిని ఆకర్షించి దానికి ఎనలేని గౌరవాన్ని ఆపాదించి పెట్టింది. ఆ మత్స్య యంత్రంలోని చేపను బాణంతో కొట్టే వ్యక్తి మన భారతీయ హిమాచల్ ప్రదేశ్ కుర్రోడు. వాని చదువు ఏడవ తరగతి.
‘మీరు ఎంత గొప్ప ఉత్పత్తిని తయారు చేస్తున్నారన్నది ముఖ్యమే ఐనా దాన్ని ఎంత ఆకర్షణీయంగా వినియోగదారునికి అందించగలుగుతున్నారన్నది ఇంకా ప్రధానమైన విషయం’అనే సూత్రం ఏ ఔత్సాహికునికైనా ఉపయోగకరమైందే.
ఆ రోజు రాత్రి సెకండ్ షో లో తమ ‘కత్తుల విసిరివేత ‘అంశం ఐపోయిన తర్వాత శైల, జయరాజ్ తమ పై అంతస్తు ఆఫీస్ గదిలో కూర్చుని. ,
“షెడ్యూల్ చెప్పు శైల”అన్నాడు జయరాజ్.
తన టాబ్లెట్ ను చేతిలోకి తీసుకుంది శైల. వ్రేలితో టచ్ స్క్రీన్ ను జరుపుతూ. ,
ఈరోజు ఏప్రిల్ పదహారుగదా. . ఇరవరెండు వరకు ఇక్కడే. తర్వాత ప్రక్కన స్పెయిన్. . రాక్ గ్రౌండ్స్. మే మూడు నుండి పదహారు వరకు. తర్వాత బెల్జియం. . మే ఇరవై రెండు నుండి జూన్ ఐదు వరకు. . నెక్స్ట్. . స్విట్జర్ ల్యాండ్. . ఇటాలీ.
“మళ్ళీ ఇండియాకు ఎప్పుడు”
“సెప్టెంబర్ పది. న్యూ ఢిల్లీ”
“శైలా. . జీవితంలో చాలా కోల్పోయి. . ఇంకేవో చాలా పొంది. . కొంత వెలితి. . కొంత నిండుదనం. . కొంత తృప్తి. . కొంత ఆత్మానందం. . ఇక ఈ జీవితం చాలనిపిస్తోంది శైలా” జయరాజ్ ఎక్కడకో ఆకాశంలోకి. . చుక్కల్లోకి చూస్తూ.
అతని మనసు ఏ మేఘాలూ లేని ఒట్టి నిర్మల నీలాకాశంవలె ఉంది.

“ఒక విషయం చెబుతా జయరాజ్. . తక్కువ వయసులో ఎక్కువ జీవితాన్ని, ఎక్కువ కష్టాలను, ఎక్కువ కన్నీళ్ళను. ఇప్పుడు ఎక్కువ సంతోషాన్నికూడా చూస్తున్న వాళ్ళము మనం. జీవితమంతా సాహసాన్నే నమ్ముకున్న వాళ్ళం. మనుషులని నిర్మల హృదయంతో ప్రేమించి దురదృష్టవశాత్తు కొందరిని కోల్పోయిన వాళ్ళం. జయ. . పరాశర్. . చిత్ర. . వీళ్ళందరూ మనుషుల్లో దేవతలు. ఒక్కటే నేర్చుకున్నా ఈ జీవిత పయనంలో. పరిమితమైన ఆశ. . చిన్ని చిన్ని కోరికలు. . అంతే. కోట్ల మీద కోరికలు లేవు. . మన సర్కస్ మన కుటుంబం. మన సంపాదనంతా మన స్టాఫ్ దే. ఎందుకంటే మనదగ్గరున్న ప్రతి పైసానూ సంపాదించింది వాళ్ళే. భారతీయ చింతన ప్రకారం’నాది ‘అనేదే లేని పరిత్యాగ సిద్ధాంతం ఎంత గొప్పదో. ఐయాం ప్రౌడ్ టు బి ఏన్ ఇండియన్. ”
శైల చెబుతూనే ఉంది. . ఒక తాదాత్మ్యతలోనుండి.

***

కొన్ని అంతే. మొదట విన్నపుడు నమ్మబుద్ది కాదు.
భూమి గుండ్రంగా ఉన్నదని గెలీలియో చెప్పినపుడు ‘ఛీ వెధవా. . ఎంచక్కా భూమి కనుచూపు మేర చదునుగా. . బల్లపరుపుగా ఉంటే వీడేమిట్రా గుండ్రంగా ఉందని కారుకూతలు కూస్తాడూ అని ‘గెలీలియో ను గేలి చేసి ఆటపట్టించారు జనం. నమ్మలేదు
మాక్స్ మిల్లన్ రెండు చక్రాలపై సైకిల్ అనే యంత్రమొకటి ఎంచక్కా గాలిలో ఏ దన్నూ లేకుండా నిట్టనిలువుగా నిలబడి నడుస్తూ వస్తుందని చెబితే ‘మా అయ్యే. . ఎంటీ. . రెండు చక్రాలున్న బండి ఊర్కే గాల్లో నిలబడి గిరగిరా తిరుగుతూ నడుస్తూ రావడమే కాకుండా మనుషుల్ని మోసుకుని కూడా పోతుందా’అని బోలేడు ఆశ్చర్యపోయి ముక్కులమీద వేళ్ళేసుకుని జనం వెర్రోళ్ళయిపోయేరుగదా. అప్పుడూ నమ్మలేదు.
జనం ఏ పరమ సత్యాన్ని చెప్పినా మొదట్లో చచ్చినా నమ్మలేదు.
తర్వాత్తర్వాత వస్తువులు పుట్టి, కళ్ళముందు కనబడి. . ఋజువులేర్పడిన తర్వాతగానీ. . అప్పుడు నమ్మేందుకు కొంచెం సిద్ధపడి,
ఐతే ఎవరు నమ్మినా నమ్మకున్నా,
ఈ సృష్టి అలా సాగుతూ. . అలా జరుగుతూ. . అలా నడుస్తూనే ఉంది.
సదాశివం కూడా తను మొదలుపెట్టిన ‘సేవ్ రాక్’ఉద్యమం ఇంత త్వరగా. . అంటే ఈ మూడేళ్ళలోనే ఇంత ప్రజాదరణ పొంది ఇంత వేగంగా విస్తరిస్తుందని అతనే ఏ ఒక్కరోజూ అనుకోలేదు. ఒకే ఒక్కడు. చేతిలో ఒక ప్లకార్డ్ పట్టుకుని ఎక్కడ రాళ్ళను, కొండలను ముక్కలు ముక్కలు చేస్తున్నారో అక్కడికి చేరుకుని అరచి అరచిన రోజు అందరూ ‘వాడొక పిచ్చి వెధవ పొనీ’ అని చూస్తూ వెళ్ళిపోయారు. కాని ఇప్పుడు ఒక్క వ్యక్తే ఒక ప్రబలమైన శక్తిగా మారి. ,
‘ఈ రోజు సదాశివం ఒక శిలా రక్షకుడు ‘
సదాశివంకు ఒక పనిచేసే పద్ధతుంది. ఎప్పుడూ ఒంటరిగానే బయల్దేరుతాడు. ఎవరో వెంటవస్తారని ఎదురుచూడడు. ఎవరినీ నమ్మడుకూడా. తననుమాత్రమే తాను నమ్మి ప్రతిసారీ ఉద్యమంలోకి బయల్దేరాడు. . వెంట ఒక ప్లకార్డ్ మాత్రం తప్పనిసరి. ఆ అట్టముక్క ఒకటి చాలా శక్తివంతంగా జనంతో మాట్లాడుతూండడం గమనించాడు సదాశివం.
ఈ మధ్య ఒక విధానం కనిపెట్టాడు. అదేమిటంటే ఏ పనీ పాటా లేని, కాస్తో కూస్తో పేరూ గుర్తింపూ కావాలని ప్రాకులాడే ఇంజనీరింగ్ కాలేజ్ పోరగాండ్లను వెంటబెట్టుకుని ప్రతిఘటనకు బయల్దేరడం మొదలెట్టాడు. అందువల్ల పిల్లలకూ పబ్లిసిటీ. . మీడియాలో చర్చ.
చివరికి గ్రానైట్ బిజినెస్ చేసే ప్రతి వ్యాపారికీ సదాశివమంటే సింహస్వప్నమైపోయింది.
అప్పుడు. . ఆ క్షణం. . సదాశివం తన బట్ట సంచీని భుజానికి తగిలించుకుని బయల్దేరాడు. ఆ బ్యాగ్ లో గతవారం కలెక్టర్ ఆఫీస్ నుండి సమాచార చట్టంకింద సేకరించిన విష్ణు గ్రానైట్ ఇండస్ట్రీస్ చరిత్ర అంతా ఉంది.
అతని సిద్దాంతం ఒకటే. ‘ మొండివాడు రాజుకన్నా బలవంతుడు ‘. . అని.
సెల్ ఫోన్ తీసి సమ్మయ్యకూ, రవీందర్ రెడ్డికీ, ప్రసాదరావుకూ చేశాడు. వాళ్ళు వస్తున్నాం సార్. . అన్నారు.
ప్రతి సందర్భంలోనూ సదాశివం బట్ట సంచీలో ఒక రాయి ఉంటుంది. . నల్లగా. ఎవరైనా దగ్గరికి రాగానే దాన్ని బయటకు తీస్తాడు. చూసేవాళ్ళకు ఇతను దాంతో కొడతాడేమోనన్నట్టనిపిస్తే. . పాపం అలా ఎన్నడూ చేయకుండా. . రాయి గురించి చెప్పడం ప్రారంభిస్తాడు. ‘ ఒక రాయి ప్రకృతిసిద్ధంగా ఏర్పడ్డానికి ఎలా రెండున్నర బిలియన్ల సంవత్సరాల కాలం పడుతుందో. . అది మానవునితోపాటు సహజీవనం చేస్తున్న ఎంత పురాతన వస్తువో విడమరిచి చెబుతూ చివరికి గుమికూడిన జనం ముందు రాయిని అపురూపంగా ముద్దు పెట్టుకుంటాడు. . చూస్తున్నవాళ్ళకు ‘అయ్యోపాపం ఇది పచ్చి నిజం కదా’అని బోలెడు జాలి కలుగుతుంది. ఎలా చేస్తాడంటే ఆ క్షణం సదాశివంతోపాటు ఉన్న ప్రతివాడూ ఇక జీవితంలో రాయిని ధ్వంసం చేయడుగాక చేయడు. అంతే.
కొన్ని స్టాటిస్స్టిక్స్ చెబుతాడు సదాశివం ప్రజల ముందు. ప్రతి సంవత్సరం ఈ రాష్ట్రంలో ఎలా దాదాపు మూడు వేల కోట్ల రూపాయల గ్రానైట్ వ్యాపారం జరుగుతున్నదీ, ఎన్ని వందల గుట్టలూ, కొండలూ మాయమై భూమిపై అందంగా శిఖరమై ఉన్న సౌందర్యం ఎలా ఒక లోయగా మారుతున్నదీ. . మన ప్రకృతి సంపదను చైనా, జపాన్లాంటి దేశాలకు ఎలా షిప్పులకు షిప్పులుగా ఎగుమతి చేస్తూ ఇక్కడ భావితరాలకు రాయి అనబడే పదార్థమే లేకుండా చేస్తున్నదీ, అక్కడ చైనావాడు మాత్రం వాడి గుట్టను భద్రంగా దాచుకుని మన గుట్టలను మాత్రం ఎలా విస్తరించి కబళిస్తున్నదీ ఒక వీడియో ద్వారా చూపిస్తాడు. అంతే ఇక శిల అనే పదార్థం ఒక దివ్యద్రవ్యమై జనం దృష్టిలో ఇక ఎన్నడూ విస్మరణీయంకాని పదార్థమౌతుంది.
చివరికి అందరూ ‘మన శిలలను మనం. . కాపాడుకుందాం’. . ‘మన ప్రకృతిని మనం. . రక్షించుకుందాం’ . . ‘భావి తరాలకోసం. . శిలలను దాచిపెడదాం’ అని నినాదాలు చేస్తారు.
మొత్తం ఓ ముప్పైరెండుమంది తయారయ్యారు. ఇక ఫరవాలేదు అనుకుని తయ్యార్. మీడియాకు ఫోన్ చేయించాడు ఒక శిష్యునితో. ప్రెస్ వాళ్ళనూ రమ్మని కబురు. సమాచారముంది ఐలోని గుట్టల్లోనుండి రెండు స్పెషల్ లారీలు బయల్దేరబోతున్నై అని. ప్రత్యేకంగా ఈ గ్రానైట్ రాళ్ళను తరలించేందుకే డిజైన్ చేయబడి ఉన్న బాపతు పొడుగాటి లారీలు ఇక కదలాలి. ఒక్కోదాని మీద రెండ్రెండు టు బై టు గ్రానైట్ బండలు పెద్ద పెద్దవి. . నల్లగా.
ఒక్క పావుగంటలోనే పరిస్థితి ఉద్రికతంగా మారింది. ప్రశాంతంగా ఉన్న ఊరులో ఓ వందమంది కలకలం. అసలు ఉద్యమకారులకు మధ్యలో దారినబోయే దానయ్యలు ఓ ఇరవైమంది. . అలా.
“వారసత్వ సంపద. రాళ్ళనూ”
“రక్షిద్దాం”
“రాళ్ళను రక్షిద్దాం”
“ప్రకృతి సమతుల్యాన్ని కాపాడుదాం”
“సేవ్ రాక్స్ ఉద్యమం”
“వర్థిల్లాలి”
“భావి తరాలకోసం”
“శిలలను కాపాడదాం”
నినాదాలు మారుమ్రోగుతున్నాయి. . కొండల్లో. . గుట్టల్లో. చుట్టూ తిని పారేసిన ఎముకల రాశుల్లా స్లాబ్స్ ను కోసితీసుకోగా మిగిలిన రాతి స్క్రాప్. . గుట్టలు గుట్టలుగా.
అక్కడంతా గుంపులు గుంపులుగా లేబర్. . తమిళనాడు నుండి పొట్టచేత పట్టుకుని వచ్చిన వాళ్ళు. ఎక్కడ బతుకు తెరువుంటే అక్కడికే. . వలస బతుకులు. వాళ్ళకు కూడా అర్థమౌతోంది తాము చేస్తున్నది తప్పేనని. కాని బతుకు తెరువుకదా. ప్రభుత్వాలు తీసుకోవాలి తగు నిర్ణయం.
మేనేజర్ ఎవరెవరికో ఫోన్లు.
బయల్దేరుతున్న రెండు లారీలను అడ్డుకుని వాటిముందు బైఠాయింపు.
బిలబిలమని. . పోలీసులు. . టకటకమని ప్రెస్. . పది నిముషాల్లో మోటార్ సైకిళ్ళేసుకుని, కెమెరాలు పట్టుకుని టివి వాళ్ళు. . పరిస్థితి ఉద్రిక్తం. . నినాదాల హోరు.
“ఏమిటి ఈ స్థితికి పరిష్కారం”అని అడుగుతున్నాడు ఒక మీడియావాడు సదాశివంను.
“ఒక్కటే. . రాళ్ళను అనివార్యమైతే తప్ప ఉపయోగించకూడదు. సిమెంట్ ను వాడండి. నిర్మాణాలన్నింటినీ సిమెంట్. . ఇతర ప్రత్యామ్నాయాలతో కొనసాగించండి. . ఒక గుట్టపోతే మరో గుట్టను సృష్టించగలడా మనిషి. . . “సాగుతోంది సంవాదం.
“అసలు ఈ గ్రానైట్ మాఫియా వెనుక ఉన్న హస్తాలెవరివి. . ఆ వివరాలేవైనా ఉన్నాయా మీదగ్గర”అని ఓ 36 టివి చానెల్ వాడి ప్రశ్న. ఆ చానెల్ వాడు రెండ్రోజుల క్రింద క్వారీ ఓనర్ను ఒక వెయ్యి రూపాయలు లంచమడిగితే వాడివ్వలేదు. అందుకని ఇప్పుడీ ప్రశ్న.
“ఇప్పుడు మీ అందరిముందు ఈ క్వారీల గుట్టు రట్టు చేయబోతున్నాన్నేను. “అని సదాశివం తన బట్ట సంచీలోనుండి ఏవో కాగితాలను బయటికి తీస్తూండగా. ,
“ఒక్క నిముషం. . ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ ఉద్యమాన్ని లైవ్ టెలికాస్ట్ చేద్దాం. . జస్ట్ ఎ మినట్. . “సెంట్రల్ స్టూడియోతో సంధానం చేసుకుంటున్నాడు.
సదాశివం మూతి ముందు దాదాపు ఐదారు మైక్ లు.
“నా దగ్గర జిల్లా కలెక్టర్ గారినుండి అఫీషియల్ గా సమాచార చట్టం కింద సేకరించిన వివరాలున్నాయి. ఇదిగో. . ఈ చుట్టుపక్కలున్న మొత్తం పదకొండు గ్రానైట్ ప్రాజెక్ట్ లకు సంబంధించిన డిటైల్స్. ”
టివి చానెళ్ళలో ప్రత్యక్ష ప్రసారం మొదలైంది.
“ఆశ్చర్య పోతారు వింటే. . దేశాన్ని ఎలా దోచుకుతింటున్నారో”
“చెప్పండి. . ”
“ఈ పదకొండు గ్రానైట్ ప్రాజెక్ట్ లన్నీకూడా ఒకే గ్రూప్ వి. వీటిలో. . ప్లీజ్ నోట్ డౌన్. . వి. రాజేశ్వర రావు అనే కాలిఫోర్నియా లో ఉండే ఎన్నారై పెట్టుబడిదారు. బేసిక్ ఇన్వెస్ట్ మెంట్ అతనిది. పది శాతం వాటా ఈ అన్ని కంపెనీల్లో. . మన జిల్లా ఎంపి ఆర్. రాం నర్సయ్యగారిది. ఇదిగో ఆయన రెండో పెళ్ళాం పేర ఉన్న పార్ట్ నర్ షిప్ అగ్రిమెంట్. ఇంకో పది శాతం మన మంత్రి గారు డి. దేవసహాయం గారిది. బినామీ పేర. . అంటే కె. జార్జ్, అతని బామ్మరిది పేర. మరో పది శాతం డైరెక్టర్, డిపార్ట్ మెంట్ ఆఫ్ మైనింగ్ అండ్ జియాలజీ పి. రాఘవమ్మగారి భర్త రాజయ్య పేర. . డైరెక్ట్. ఇంకో పది శాతం. . ట్రాన్స్ పోర్ట్ అథారిటీ మహమ్మద్ రషీద్ గారి కొడుకు ఇక్బాల్ పేర. . డి ఎస్ పి ఇంటెలిజెన్స్ సి. నరసింహారెడ్డి తన ఉంపుడుగత్తె లక్ష్మీరాజం పేర పది శాతం. . ఇలా అందరూ. . అంటే రాజకీయ నాయకులూ, అధికారులూ, పెట్టుబడిదారులు అందరూ కుమ్మక్కయి ఈ దేశ ప్రకృతి సంపదను బహిరంగంగా దోచుకుంటూ.” మాట్లాడుతున్నాడు సదాశివం స్పష్టంగా. జంకు లేకుండా. ఆధారాలుగా తన చేతిలోని సర్టిఫైడ్ కాపీలను చూపిస్తున్నాడు.
అంతా రికార్డ్ ఔతోంది. గాలిలో వార్త వ్యాపిస్తూ ప్రపంచ పర్యంతమౌతోంది.
“ప్రతి సందర్భంలోనూ చెబుతున్నాను నేను. . ‘ఈ సృష్టిలో దేన్నైతే మనిషి మళ్ళీ సృష్టించలేడో దాన్ని విధ్వంసం చేసే దుష్కార్యానికి దయచేసి పాల్పడవద్దు ‘అని. మనిషి కొట్టేసిన చెట్టును మళ్ళీ మొలిపించలేడు. . కాబట్టి చెట్టును రక్షించాలి. నదులు తన గర్భంలో తయారుచేసి ప్రసాదిస్తున్న ఇసుకను మనిషి మళ్ళీ పునః సృష్టించలేడు. కాబట్టి మనుషులు దయచేసి ఇసుకను ఈ రకంగా విచ్చలవిడిగా ఉపయోగించవద్దు. బి నేచర్ ఫ్రెండ్ లీ. ”
స్టూడియో నుండి ఎవరో అడుగుతున్నారు. “మీరు ఎన్నాళ్ళ నుండి ఈ సేవ్ రాక్స్ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. . ఇంతవరకు ఏమైనా సాధించారా. “అని.
“ప్రతి సుదీర్ఘ యాత్రా ఒక్క అడుగుతోనే మొదలవుతుందని కదా ఆర్యోక్తి. మీరు చెప్పింది నిజమే. మొదట్లో నేనొక్కడినే ప్రతిఘటించే వాడిని. ఇప్పుడు మా సంస్థలో ఎనిమిదివేలమంది సభ్యులున్నారు. ప్రజల్లో చాలా అవేర్నెస్స్ ను కల్పించాం. ఇప్పుడు రాయి అంటే చాలా ప్రేమగా చూచేవాళ్లు వేల సంఖ్యలో ఉన్నారు నా చుట్టుప్రక్కల. ప్రభుత్వం కూడా ఈ ప్రతిఘటనను విస్మరించలేని స్థితికి వస్తోంది. మాలాగే ఈ కోణంలో ప్రయత్నిస్తున్న శిలల రక్షణ కారులతో. పర్యావరణ పరిరక్షణకారులతో చర్చలు జరుపుతోంది. రాయికి ప్రత్యమ్నాయమైన సిమెంట్. అడెసివ్స్ ఇతరేతర పదార్థాల గురించి అన్వేషణలు జరుగుతున్నాయి. నాకైతే నమ్మకముంది. మున్ముందు మనుషులు శిలలను ధ్వంసంచేయడానికి సాహసించని రోజు ఒకటి తప్పక వస్తుంది. ”
“ఆ సుదినం కోసం ఎదురు చూద్దాం”
తర్వాత కొందరు ఉద్యమంలో పాల్గొంటున్న ఇంజనీరింగ్ విద్యార్థులతో టివి యాంకర్ ప్రశ్న. . జవాబు. ,
నడుస్తోంది ప్రసారం.
అకస్మాత్తుగా రెండు వ్యాన్ లలో పోలీస్ దిగడం. . బిలబిలమని దూసుకురావడం. . లాఠీ చార్జ్. ,
సదాశివంతో సహా అక్కడే బైటాయించడం. . అంతా గడబిడ. . తోపులాట,
ఈలోగా ఎక్కడినుండో ఒక కంకర రాయి దూసుకొచ్చింది బుల్లెట్లా.
ఆ వచ్చిన రాయి ఫఢేళ్ మని సదాశివం నుదిటిని తాకి,
టపటపా రక్తం. . బొట్లు బొట్లుగా.
సదాశివం చేతిలో ఉన్న నల్లని మెరుస్తున్న రాయిపై. . ఎర్రగా చుక్కలు చుక్కలుగా రక్తం. . కారుతూ,
టివి ప్రసారాల్లో. . చేయి. . చేతిలో అచేతనమైన రాయి. . నల్లని రాయిపై ఎర్రని నెత్తురు బొట్లు. . ఫ్రీజ్ చేశారు.
ఏదో స్తంభించిపోయింది.
ప్రకృతి తనను తాను రక్షించుకునేందుకు ప్రత్యక్ష, అప్రత్యక్ష పద్ధతుల్లో ప్రయత్నిస్తుంటుందా.
యథా యథాహి ధర్మస్య. ,
*****

మహాకవి బమ్మెర పోతనామాత్య ప్రణీత
శ్రీ మహాభాగవతము-రెండవ సంపుటము
సప్తమ స్కంధము. . ప్రహ్లాద చరిత్ర. . అధ్యాయము-5
చదివించిరి నను గురువులు,
సదివితి ధర్మార్థముఖర శాస్త్రంబులు నే
జదివినవి గలవు పెక్కులు,
చదువులలో మర్మమెల్ల జదివితి దండ్రీ!
ముఖరము. . అంటే మ్రోగునది. . అని నిఘంటు అర్థం.
ధర్మార్థములచే మ్రోగుచున్నటువంటి అనేక చదువులను. . వాటిలోని మర్మములతో సహా చదివినాను. . చదివేందుకు ఇంకేమీ మిగులలేదు అని ప్రహ్లాదుడు తమ గురువుల సమక్షంలో తండ్రికి సవినయముగా విన్నవించినపుడు. ,
ఏది చదువు. . ఏది దానిలోని మర్మము. . ఏది దానిలోని ధర్మము అనేది మీమాంస.
‘యువర్ అటెన్షన్ ప్లీజ్. . ప్లైట్ నంబర్ క్యూ-త్రీ టు సిక్స్ ఖతార్ ఏర్ లైన్స్ . . . ‘అనౌన్సర్ తీయని స్వరం బోర్డింగ్ గేట్స్ దగ్గర వినబడగానే జానకి ఈ లోకంలోకొచ్చి తలెత్తింది. చేతిలోని భాగవత పుస్తకాన్ని మూసి హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని లేచి నిలబడింది.
అమ్మ వైదేహి, నాన్న విశ్వం. . ఎదురుగా నడచి వస్తూ కనిపించారు. లగేజ్ మొత్తం కౌంటర్లో ఇచ్చేసినట్టున్నారు. వెంట కేవలం రెండు. . చెరొక హ్యాండ్ బ్యాగ్స్ మాత్రమే ఉన్నాయి. తమతో తీసుకుపోవచ్చు వాటిని.
దగ్గరకు రాగానే జానకి కుర్చీలోనుండి లేచి నిలబడి వాళ్ళ ముఖాలలోకి చూచింది.
దీనంగా ఉన్నారు వాళ్ళు.
దూడను విడిచిపెట్టి పొలంలోకి తప్పనిసరై పనుల్లోకి వెళ్తున్న ఆవులవలె. . అమ్మా. . నాన్న.
జానకి ప్రక్కనే ఏడేండ్ల రవళి ఉంది.
ఇద్దరూ వీడ్కొలు చెప్పడానికి వచ్చారు ఏర్ పోర్ట్ కు.
“చాలా దుఃఖంగా ఉందమ్మా. నిన్నూ రవళినీ విడిచి వెళ్ళవలసి రావడం చాలా బాధాకరంగా ఉంది. కాని తప్పట్లేదు. ”
అమెరికాలో ఉన్న అన్నయ్య తన భార్య రెండవ కానుపుకోసం తప్పనిసరిగా రమ్మని చాలా ఒత్తిడి చేస్తున్నాడు ఎప్పటినుండో. తప్పలేదు. అన్నది సుగ్రీవాజ్ఞ. తమింట్లో వాణ్ణి ఎవరూ ఎదిరించరు వాడి నోటికి భయపడి. అతని భార్య దురుసుతనానికి ప్రతివాడూ హడలెత్తిపోవలసిందే.
డెట్రాయిట్ వెళ్ళాలి.
నాన్నకు ఆత్మగౌరవమూ, రోషమూ ఎక్కువ. అందుకే అమ్మదీ తనదీ రెండు టికెట్ల డబ్బూ తనే పెట్టుకుని వెళ్తున్నాడు. . చాలా అసంతుష్టిగా.
ఇక ఇక్కడ ఇండియాలో మిగిలింది తనూ, రవళీ ఇద్దరే.
కొన్నేండ్ల క్రితం తనకూ రమణకూ పెళ్ళయిన తర్వాత ఒక జూనియర్ కాలేజ్ ప్రిన్స్ పాల్ గా రెటైర్ ఐ ప్రశాంతంగా శేష జీవితాన్ని గడుపుదామని ఘట్కేసర్ దగ్గర కాస్త లోపల రాజయ్య గూడెంలో ఓ రెండెకరాల స్థలాన్ని తన మొత్తం రెటైర్మెంట్ బెనిఫిట్స్ ను పెట్టి కొని దాంట్లో ఎరువులు వేయకుండా కూరగాయలూ, పండ్లూ పండిస్తూ, నాల్గయిదు పశువులతోసహా ఇద్దరూ వానప్రస్థ జీవితాన్ని గడుపుతున్నారు. బాగానే ఉండే .
‘ప్యాసింజర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు .. “బోర్డింగ్ ప్రకటన అది.
గేట్ నంబర్ ట్వంటీటు.
వెళ్ళాలి.
తప్పదు.
పిలుపు రాగానే వెళ్ళాలి. ఎవరైనా. ఎక్కడికైనా.
నాన్నా అమ్మా వెనక్కు వెనక్కు తిరిగి తిరిగి తమవైపు చూస్తూ నీళ్ళు నిండిన కళ్ళతో. ,
మనుషులు విడిపోవడం. . కలుసుకోవడం. . మళ్ళీ విడిపోవడం. . చివరికి ఇక ఎప్పటికీ కలువకపోవడం. . చిత్రం.
రవళి ఉత్సాహంగా. . భారంగా చేతులూపుతోంది. ఏముంటుండి దాని హృదయంలో. ఒట్టి పసిడి ముద్ద. ఏ ముద్రా లేని మెరిసే తలం. ఖాళీ.
రవళికి దాని అమ్మమ్మా, తాతయ్యలతోనే ఎక్కువ సాన్నిహిత్యం. గత రెండు నెలలుగా చిరెక్ స్కూల్ నుండి విరమించిన తర్వాత అంతా అస్తవ్యస్తమైపోయింది.
తనుకూడా ఘట్కేసర్ దగ్గరి రాజయ్య గూడెం కు మకాం మార్చి అమ్మానాన్నలతోపాటే ఉండడంతో రవళికి వాళ్ళతో ఇంకా చనువెక్కువైంది.
చూస్తూ చూస్తూండగానే అమ్మా నాన్నా వెళ్ళిపోయారు గేట్లోకి. . తర్వాత గాజు తలుపుల ప్రక్కనుండి నడుస్తూ. . కొద్ది దూరం. . ఇక ఏరో బ్రిడ్జ్ లోకి. . తర్వాత కనబడలేదు.
వెళ్ళిపోయారు.
మనిషి వెళ్ళిపోయిన తర్వాత. . ఎవరో కవి చెప్పినట్టు. . వీడ్కోల్లన్నీ కన్నీళ్ళను మోసుకుపోయే రైళ్ళు.
జానకికి ఇక ఆపుకోలేని దుఃఖం ముంచుకొచ్చింది. మెల్లగా వెనుక ఉన్న కుర్చీలో కూర్చుని తలను కిందికి చేతుల్లో దాచుకుని కుమిలి కుమిలి ఏడ్చింది నిశ్శబ్దంగా. రవళికి అర్థంకాలేదు. బిక్క మొఖంతో. ,
ఒక ఐదు నిముషాలు. . కాలం గొప్పది ఓదారుస్తుంది తల్లివలె.
నిశ్శబ్దంగానే ఒక చేతితో రవళిని పట్టుకుని నడిపించుకుంటూ. . బయటికొచ్చింది.
టాక్సీ.
బయలుదేరుతూండగా. . ఒక విమానం ఎగురుతూ. ,
అమ్మా నాన్న ఉన్నారా దాంట్లో.
వ్చ్. . ఏమో.
జానకికి తలంతా దిమ్ముగా మొద్దుబారినట్టుంది.
మనసు నిశ్చేష్టంగా ఉంది.
“అమ్మా. . అమ్మమ్మ వాళ్ళు ఎప్పుడు దిగుతారమ్మా అమెరికాలో”
టైం చూసుకుంది. ఐదూ పదిహేను. వేసవికాలం గదా చల్లగా ఉంది. తెల్లవారుతోంది. పల్చగా వెలుతురూ. . చీకటి కూడా.
“రేపు. . ఉదయం నాన్న”
“అమ్మా. . “ఇంకేదో అడుగబోయింది రవళి. . కాని అడుగలేదు. ఊర్కే తల్లి ముఖంలోకి దీనంగా చూచి తలతిప్పుకుని జానకి ఒడిలో ముఖాన్ని దాచుకుని. . అలా ఉండిపోయింది.
మళ్ళీ ఏడుపు ముంచుకొచ్చింది జానకికి. అలా వెనక్కి సీట్లో ఒరిగి,
క్యాబ్ పరుగెడుతోంది. . మాసాబ్ ట్యాంక్ ఫ్లై ఓవర్ పై.
మౌనం.
ఒట్టి కార్ చప్పుడు.
పది నిముషాల్లో కారు జె ఎన్ టి యు. . మహావీర్. . హోటల్ అయోధ్య.
తెల్లవారింది పూర్తిగా.
ఏది ఆలోచించినా భయమేస్తోంది.
ఒకటే ప్రశ్న. ‘ ఇప్పుడు తనేం జేయాలి ‘
జవాబేమిటంటే. . తను తన ‘భవిష్యత్తును చాలా స్పష్టంగా పునర్నిర్వచించుకోవాలి ‘
ఇప్పుడు చేస్తున్నదదే. . మథన. . అంతర్మథన.
ఆమెకు తెలియకుండానే ఆమె చేయి అప్పటినుండి రవళి నెత్తిని నిమురుతోంది.
నాన్న నీతికి మారుపేరు. ఒక టీచర్ గా రాష్ట్రపతి నుండి ‘ఉత్తమ అధ్యాపకుడు ‘గా పురస్కారం పొందినవాడు. అనేక పాఠ్య పుస్తకాలు రాసినవాడు. “నాన్నా జీవించినంత కాలం నిజాయితీగా తలెత్తుకుని జీవించాలె” అని అనేవాడు. అమ్మ నాన్న వెనుక నాలుగో సింహం. ఎప్పుడూ బయటికి కనిపించదు. వెనుక లోపలిప్రాణంలా అదృశ్యంగా ఉంటుంది.
ఎందుకో జానకికి తన అమ్మమ్మ జ్ఞాపకమొచ్చింది. అమె పేరుకూడా జానకే. అమ్మమ్మ పేరునే తనకు పెట్టాడు నాన్న.
చిన్నప్పుడు మూడు పదాలు అమ్మమ్మద్వారా తన మనస్సులో పాతుకుపోయాయి.
అవి. . పశ్చాత్తాపం. . ప్రాయశ్చిత్తం. . పునీతం.
చేయకూడని పనిని చేసి. . తప్పును తెలుసుకుని, గ్రహించి తప్పును ఒప్పుకుని బాధపడడం పశ్చాత్తాపం.
‘పశ్చాత్తాప పడుతున్నాడూ అంటే ఇక ఆ తప్పును మళ్ళీ వాడు చేయడని అర్థం’. . అని అనుకోవాలి.
పశ్చాత్తాపం మనిషికి జ్ఞానోదయం వంటిది.
కాని మనిషి తప్పుచేసి ఒట్టిగ నాలుక్కరుచుకుని ఒప్పుకుంటే ఐపోద్దా. దానికి శిక్షో. . అని వెనుకటి నీతివంతుల ప్రశ్న.
తప్పుకు దండన ప్రాయశ్చిత్తం.
మనుషుల్లో నీతి నిజాయితీలను నిలబెట్టే క్రమంలో తప్పు చేస్తే అరచేతిపై కాల్చిన దబ్బుడంతో వాతలు పెట్టేటోల్లు.
అబద్ధం మాట్లాడితే నాలుకమీద కాల్చిన పెద్ద సూదితో వాత పెట్టేది చిన్నప్పుడు.
శిక్ష మనిషిలో క్రమశిక్షణనూ, పరివర్తననూ తెస్తుంది.
వేసిన ఎంత కఠిన శిక్షనైనా భరించి బయటపడడం అంటే మనిషి ‘పునీతుడైపోవడం’
అగ్నిపునీత సీత. . వలె.
తను చిన్నపుడు,
మళ్ళీ పోతన మహా భాగవతం జ్ఞప్తికొచ్చింది జానకికి.
అమ్మమ్మ ఒక పోతన పద్యాన్ని కంఠస్తం చేయమని ప్రతి పదార్థ తాత్పర్యాన్నీ చెప్పింది.
అప్పజెప్తోంది తను.
హిరణ్య కశ్యపుడు. . ‘ఒరే ఎక్కడున్నాడురా నీ హరి ‘ అని అడుగుతే ప్రహ్లాదుడు చెప్పిన జవాబు ఆ పద్యం.
‘కల డంభొధి గలండు గాలి గల డాకాశంబునం గుంభినిం
గల డగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్. .
‘అదీ పద్యం. చదవడమైపోయిన తర్వాత అమ్మమ్మ అడిగింది. . “కుంభిని అంటే” అని.
కుంభిని. . అంటే భూమి అని అప్పుడు తెలియదు. చదివిన నాలుగు వాక్యాల పద్యంలో మొత్తం పది ఉచ్ఛారణ దోషాలున్నాయని చేతిపై. . దండన.
చేతిపై వాత.
తర్వాత పశ్చాత్తాపం.
ఎంత పిచ్చో పోతన వచనమంటే తనకు. . చిన్నప్పుడు గుక్కతిప్పుకోకుండా చదివేది స్కూల్ వేదికపై. . ‘నరసింహావతార ఆవిర్భావ ‘ఘట్టాన్ని.
ఇట్లు దానవేంద్రుండు పరిగృహ్యమాణ వైరుండును, వైరానుబంధ జాజ్వల్య మాన రోషానలుండును, రోషానల జఘన్యమాన విజ్ఞాననినయుండును , వినయ గాంభీర్య ధైర్య జేగీయమాన హృదయుండును, హృదయ చాంచల్యమాన తామసుండును, తామస గుణ చంక్రమ్యమాణ స్థైర్యుండును నై, విస్రంభంబున హూంకరించి , బాలుని దిక్కరించి, హరి నిందు చూపుమని, కనత్కనక మణిమయ క్రేంకార శబ్ద . . ఇలా ఇంకో రెండు పేజీల వచనం. . అబ్బో. . నాలుక తిరుగక. . దమ్ము ఆగక. . కళ్ళు తెలేస్తూ,
ఆ చదువు పోయింది. . ఆ విలువలు పోయినై. . ఆ క్ర్రమశిక్షణా, శిక్షణా పోయినై.
పోయినయా. ?
మనమే పోగొట్టామా. ?
ఆ పోయిన విలువలతో కూడిన విద్యను మళ్ళీ మనం పునః ప్రారంభించలేమా.
నైతిక విలువల పునః స్థాపన జరిగితేగాని ఈ పతనం దిక్కు అతి వేగంగా జారిపోతున్న సమాజాన్ని మళ్ళీ బ్రతికించగలమేమో.
ఒక తరాన్ని తయారుచేయగలిగేదీ. . కొత్త బీజాలను పాతి కొత్త మొక్కలను సృష్టించగలిగేదీ. . ఈ సకల రుగ్మతలతో రోగగ్రస్తమైపోయిన ప్రస్తుత వ్య్వస్థను పునర్జీవింపజేసేదీ. . ఒక్క విద్యా వ్యవస్థే కదా.
విద్యా వ్యవస్థ. . . విద్యా వ్యవస్థ. . పసి. . పసిడి బాలలను ఋషులుగా. . మహర్షులుగా. మహోన్నతులుగా తీర్చి దిద్దే వ్యవస్థ. . స్కూల్.
పాఠశాల. . పాఠశాల.
పాఠశాలే ప్రయోగశాల.
కారు తమ రాజయ్య గూడెం కొచ్చింది.
పచ్చని చెట్లతో నిండిన ఆవరణ. ద్వారం. . చుట్టూ కూరగాయల మొక్కలు. . దూరంగా పశువులు.
ఎందుకు నాన్న సాగు చేస్తున్న ఆర్గానిక్. . కాలుష్యంలేని కూరగాయల కోసం జనం విరగబడి వస్తున్నారు సిటీ నుండి.
ఎందుకు కల్తీ లేని దేశీ గేదెల పాలకోసం ఇంతదూరం జనం పరుగులు పెడుతున్నారు.
కల్తీ. . కల్తీ.
ఆలోచనల్లో వచ్చిన కల్తీని విలువలతో కూడిన విద్యతో పరిహరించవచ్చుగదా.
మొలకలను నాటాలి. ,
ప్రపంచీకరణకు విరుగుడు స్థానీయత.
వలసలకు విరుగుడు ప్రాంతీయ అస్థిత్వం.
పతనానికి విరుగుడు నైతిక విలువల పునరుద్ధరణ.
క్యాబును పంపించింది జానకి.
రవళిని నిద్ర లేపి నడిపిస్తోంది.
రమణ అనే రాక్షసునితో కొన్నేళ్ళు ప్రతిఘటించకుండా రాజీపడి కాపురం చేసినందుకు ప్రాయశ్చిత్తం. ,
ఆ తప్పుకు స్వయంశిక్ష విధించుకుని జీవితానికి సార్థకత పొందడంకోసం. . ఒక ఆదర్శ పాఠశాలను వృద్ధి చేసి సమాజ ఋణం తీర్చుకోవడం.
జానకికి తన భవిష్యత్తు దర్శనమైంది.
ఆమె కళ్ళ ముందు ఒక భావి స్వప్నం ఆవిష్కృతమౌతోంది. . లీలగా.
ఎదురుగా ఎర్రగా ఉదయిస్తూ సూర్యుడు.
చాలా కాలం తర్వాత జానకి మనస్ఫూర్తిగా నవ్వుతూ అలా అకాశంలోకి చూచింది.
అంతా ప్రశాంతంగా. ,
11

“గోపాల్ నువ్వు ఎన్నేండ్లాయె ఆటో నడుపబట్టి”అంది వకుళ.
“అక్కా నాకు భయమైతాందే నిన్ను చూస్తాంటె. . అమ్మో నిన్నేమో అనుకున్న”
“తర్వాత భయపడుదువుగనీ. . నేనడిగింది చెప్పు”
“నాలుగేండ్లు”
“ఆటో నీ స్వంతమా”
“లే. కిరాయిది”
“గిట్లనే ఆటో నడిపించుకుంటనే ఉంటే ఆఖరికి నువ్వేమైతౌ”
“ఏమైత. . మా అంటె. . స్వంత ఆటో కొనుక్కొని నడుపుకుంట”
“గంతేగద. ఇగ ఆటో నడుపుడు బంద్ చెయ్. ”
“మరేం తినాలె”
“అన్నం. అరేబై. . ఈ దేశంల కష్టపడుడుకు. . తిండికి సంబంధంలేదు. ఇక్కడంత ఉల్టా. కష్టపడ్డోనికి తిండి ఉండదు. బాగా తిండి తినేటోడు అస్సలే కష్టపడడు. . ఇన్నవా”
“సమజైత లేదుగని. . చెప్పు”
“నిన్ను మూడేండ్లల్ల ఎమ్మెల్యే ను చేస్తర బై” అంది వకుళ.
“అక్కా. . ఏమన్న మందుగిట్ల కొట్టినవా నె . ”
“అరే కాదు తమ్మీ. . నిజంగ చెప్తాన. ”
“సరే. . నీ దండం పెడ్తగనీ. . చెప్పు ఇప్పుడు నేనేం చెయ్యాలె”
“ఒక కార్గో ఆటో. . తీస్కోని నా యెంబడి రా. ఢిల్లీ పోదాం. ”
“కార్గో ఆటో ఎందుకు”
“పనున్నది తమ్మీ”
“ఇదిగో పదివేలు అడ్వాన్స్”వకుళ నిజంగానే బ్యాగ్ లోనుండి తీసి ఒక వంద రూపాయల నోట్ల కట్టను గోఫాల్ ముందు పడేసింది.
వకుళ ఆరోజే. . అంటే పోలీసులకు లొంగిపోయిన పది దినాలకు బయటికొచ్చినట్టు లెక్క. ఆ పదిరోజులల్ల. . నాలుగు రోజులు ఉద్యమ రహస్యాలను చెప్పుమని. . ఇంకో నాలుగు రోజులు చత్తీస్ ఘడ్ అడవులల్ల తిప్పి ఏవేవో స్థావరాలను చూపించమని ఒత్తిడి. . ఇంకో రెండ్రోజులు అబ్జర్ వేషన్. . చిట్ట చివరికి పదిహేనుకు ఓ మూడు స్వాహా చేసి పన్నెండు లక్షల క్యాష్ ను చేతుల పెట్టి. . ఎక్కన్నో ఓ అడవిల విడిచిపెట్టి.
“వారీ. . మీ జుట్లె పుట్టినదాన్ని నేను. “అని వకుళ మళ్ళీ పోచమ్మ మైదాన్ కమలమ్మ ఇంటికొచ్చి. ,
“గోపాల్. . నిజంగ చెబుతాన. రేపు మబ్బులల్ల బయల్దేరుదం. ఒక మాంచి బాడీ ఉన్న కార్గో ఆటో తీస్క రా. పనున్నది. మనిద్దరం పోదాం. ఒకవేళ గాంధీ ఓకె అంటే అతన్నికూడా మన వెంట తీసుకపోదాం. జీవితంలో సాహసమే లక్ష్మి. పా”అంది.
అప్పుడు రాత్రి ఎనిమిదీ నలభై నిమిషాలైంది.
పొద్దుగాల ఐదు గంటలకు బయల్దేరుదామనుకున్నరు.
గాంధీ కూడా వస్తనన్నడు వెంట.
గోపాల్ వెళ్ళి ఒక గట్టి కార్గో ఆటో తెచ్చాడు కిరాయికి.
ఆ రాత్రి పోచమ్మ మైదాన్ కోహినూర్ బిర్యాని తిని అందరూ పడుకున్నారు.
అందరూ పడుకున్నాక రహస్యంగా కమలమ్మ గారి దగ్గర ఓ పది లక్షల రూపాయలను ఉంచింది వకుళ.
రెండు లక్షలు దారి ఖర్చు.
రాత్రి అందరూ పడుకున్నారు. అందరూ నిద్ర నటిస్తున్నారు కాని ఒక్క కమలమ్మ తప్పితే ఎవరూ నిద్రపోలేదు.
ఫిజిక్స్ స్ఫురించిందామెకు.
బిగ్ బ్యాంగ్ థియరీతో పాటు ఐక్య క్షేత్రీయ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన స్టీఫిన్ హాకింగ్ ప్రకారం. . ఏదైనా ఒక బిందువు వద్ద ఉన్న వస్తువును ఇదివరకు వెడల్పు, పొడవు, మందం అనే త్రిమితీయ పద్ధతితో సూచించేది. కాని హాకింగ్ దానికి కాలాన్ని కూడా నాల్గవ మితిగా జతచేసి స్థల కాలాదుల సమగ్రతతో చతుర్ మితులతో నిర్వచించాడు.
అప్పటినుండి ‘ కాలం ‘ఒక ప్రధాన పరిగణనగా ఉద్భవించింది.
ఇప్పుడు ఇక తమ . . అంటే వకుళ, గోపాల్ మరియు గాంధీ ల భవిష్యత్తును కాలం. . అంటే వయసుతో ప్రమేయ పరుస్తూ. . విజృంభించడం.
కాలాన్ని జయిస్తూ ప్రయాణం.
* *
ఆటో చత్తీస్ ఘడ్ లోకి ప్రవేశించి నాలుగు గంటలయింది. బస్తర్ జిల్లా.
జ్ఞాపకాలను తవ్వుకుంటోంది వకుళ.
ఒకప్పుడు తను రాత్రింబవళ్ళు తిరిగిన ప్రాంతాలు.
భీకరమైన ఆడవి. దండకారణ్యం. గోదావరి నదిని నడుముకు ఒడ్డాణంగా ధరించిన భూదేవి శరీరమంతా అడవులతో పరిపూర్ణయై నిరలంకార ఆకృతితో నగ్నంగా శోభించే మహాద్భుత దృశ్యం. మట్టిని మట్టి. . కన్నీళ్ళను కన్నీళ్ళు, ఒక చిరునవ్వు మరో చిరు నవ్వును ఆకర్షించి ప్రతిఫలించినట్టు. ,
అడవి మనిషిని. . మనిషి అడవిచేత. ,
ఒక అతీతానుభవముంది వకుళకు. అనేక రాత్రులు. . కళ్ళు మూసుకుంటే. . ఒంటినిండా అడవే. కాళ్ళు చేతులు దేహం. . లోపల ఆత్మకూడా. . అంతా అరణ్యమే ఐ. ,
అడవి వాసన.
అటో అడవిని చీల్చుకుని లోపలికి దూసుకు పోతున్నకొద్దీ. . చెట్ల వాసన. . సెలయేర్ల వాసవ. . కొండల వాసన. . మట్టివాసన. పక్షుల వాసన.
పసిగడుతోంది వకుళ.
కోకవాడ. . పదిహేను కిలోమీటర్లు లోపలికి. . కంగర్ వ్యాలీ ఫారెస్ట్. . కైలాష్ కేవ్. . నాగల్సార్.
జోమా గ్రామం.
విరాసత్ పహాడ్.
ఆగింది. ప్రక్కన ఏరు. పదిగంటల ఇరవై నిముషాలు.
ఆ రాత్రి రెండుగంటలవేళ తనూ. . తన గన్ మ్యాన్ భద్రు. . ఇంకో మహిళా కామ్రేడ్ జొంపా ముగ్గురే కలిసి అతిరహస్యంగా తవ్వి ప్లాంట్ చేసిన “డంప్”.
ఒక మేజర్ ఇండస్ట్రియల్ గ్రూప్ ఒక రాజకీయ పార్టీకి ఇవ్వజూపిన విరాళం. . తాము మధ్యలోనే స్నాచ్ ఔట్ చేసి. . ఇండియాలో. . ప్రభుత్వాలను నడిపిస్తూ, శాసిస్తూ ఇండస్ట్రీస్. . ఇండస్ట్రీస్ కు కట్టుబానిసలై ముక్కు నేలకు రాస్తూ ఊడిగం చేసే ప్రభుత్వాలు. రెండూ అవిభాజ్య దుష్ట శక్తులు.
రహస్యంగా అన్నీ వేయి రూపాయల నోట్ల కట్టలు. మొత్తం ఇరవై రెండు కోట్లు. వంద వేయి రూపాయల నోట్ల కట్టలు ఒక కోటి. ఒక బండిల్. బట్ట బ్యాగ్ లో. పైన లక్క సీల్ ముద్దలు. అటువంటివే ఇరవై రెండు సంచులు. ఇరవై రెండు కోట్లు. వాటితోపాటు. . మూడు ఎ కె ఫార్టీ సెవెన్ గన్స్. ప్లాస్టిక్ రాపర్లో. . బాగా జ్ఞాపకం.
“డంప్” పెట్టిన తర్వాత రెండు రోజులకే దంతేవాడ ఎంకౌంటర్. భద్రు, జొంపా హతం. తనుకూడా పోవలసింది. కాని చాలా చిత్రంగా తప్పించుకుంది. . ఆ క్షణం. . భద్రు బహిర్భూమికి వెళ్ళి తను చెట్టు మీద సెంట్రీ డ్యూటీ చేస్తున్నందువల్ల. . బతికింది.
తర్వాత ఎప్పుడూ ఈ ‘డంప్’ప్రస్తావనే రాలేదు తమ పీరియాడికల్ మీటింగుల్లో.
ఇప్పుడు తను ప్రభుత్వానికి పొంగిపోయిన తర్వాత ఈ అన్ నోటీస్డ్ “డంప్”ను మాయం చేసి ఇక తన భవిష్యత్తును నిర్మించుకోడానికి నిచ్చెనగా. ,
ఆటో వెళ్తూనే ఉంది అడవిని చీల్చుకుని. గోపాల్ భయపడుతున్నాడు. గజగజ వణికిపోతున్నాడు. “ఒకప్పుడు ఈ అడవిల ఎట్ల తిరిగినవే అక్కా. నీ కాళ్ళకు దండాలు. “అంటాండు. గాంధీ ఎప్పటినుండో తన తిరువనంతపుర అనంతశయన పద్మనాభస్వామి స్తోత్రం ‘శాంతాకారం. . భుజగ శయనం. . పఠన చేస్తున్నాడు.
బాగా ఆలోచన చేసింది వకుళ.
హత్య. . సంహారం. . రెండూ ఒకటికావు.
ఇప్పుడు తను చేస్తున్నది సంహారమే.
ఈ డంప్ పాపపు సొమ్మే. కాని నిర్మాణాత్మకంగా ఉపయోగించి వెలుగుల్లోకి పయనించాలి. దుష్టాంగ నిర్మూలన అనివార్యం.
ప్రాక్కుంటూ పదోఅంతస్తును చేరడం చాలా టైం పట్టే సంగతి. లిఫ్ట్ తప్పదు.
డబ్బు లిఫ్ట్.
తొందరగా చేరాలి శిఖరాన్ని. జీవితంలో ఎక్కువ టైం లేదు. ప్రణాళిక అంతా సిద్ధం చేసుకుంది.
మేనేజ్మెంట్ సైన్స్ లో రెండు సూత్రాలున్నాయి. అపెక్స్ డయాగ్రాంస్. త్రిభుజ శిఖర పటాలు.
ఒకటి. . టాప్ అప్. . బాటం డౌన్. పైన సర్వోన్నత పాలకులు, కింద వర్క్ ఫోర్స్. . కార్మికులు.
రెండు. . బాటం అప్. . టాప్ డౌన్. . పైన వర్క్ ఫోర్స్ , కింద టాప్ మేనేజ్మెంట్.
రెవర్స్ ప్రాసెస్.
వ్యతికేక విరుద్ధ దిశల్లో పయనించాలి తామిప్పుడి.
ఒంటి గంట తర్వాత దొరికింది”డంప్”ఆచూకీ. గుర్తు పట్టింది అక్కడ సుస్థిరంగా ఉన్న ‘గుండ్రటి గుండు ‘ను. ప్రక్క రావి చెట్టును.
ఒకే ఒక గంట. ముగ్గురూ కలిసి. . చెమటలు కక్కుతూ,
మొత్తం. . ఇరవై రెండు కార్టూన్స్. ఇరవై రెండు కోట్లు.
మూడు తుపాకులను అక్కడే భూమిలోనే విడిచిపెట్టింది వకుళ. . ‘హింసను భూస్థాపితం చేస్తున్నాను తల్లీ’ అని ప్రతిజ్ఞ చేస్తూ.
ఆటో నిండు గర్భిణిలా కదిలింది. ముగ్గురిలోనూ గజగజ భయం. ముచ్చెమటలు.
ఆలోచన ఏమిటంటే,
మూడు కన్ సైన్ మెంట్లుగా. . ఒక్కొక్కరు ఏడెనిమిది బాక్స్ లను తీసుకుని చాలా తక్కువ మంది ప్రయాణించే. . తాల్చేరు. . పూరీ ప్యాసింజర్. . అక్కడినుండి. . భువనేశ్వర్ టు ఢిల్లీ. . మళ్ళీ ప్యాసింజర్. . వీలున్నంత వరకు రాత్రుళ్ళు ప్రయాణం.
వకుళ చంకలో రెండు లక్షల క్యాష్ పెట్టుకుంది. అప్పటికే ఓ ఐదు వేలు ఖర్చయినై. . తమ కోసమే. ఇక తీయాలి బయటికి. ‘ పే అండ్ యూజ్ ‘
టి సి వస్తే టికెట్లుంటై. . ఓ కట్ట పడేస్తం లగేజ్ కింద.
మోర్ సేఫ్.
మొదలైంది ప్రయాణం.
“భయమైతాందక్కా”అన్నడు గోపాల్ దీనంగా.
“భయం మృత్యువు. . వినలే గీతల. . చుప్”అంది వకుళ.
అడవిలోనుండి బయటకు వచ్చి రాంఝా బావులీ దగ్గరకు రాగానే ఆటోను ఒక రోడ్డుప్రక్కనున్న ఛాయ్ టేలా దగ్గర ఆఫుకుని వకుళ ఎంక్వయిరీ చేసింది. ఢిల్లీ వెళ్ళేందుకు ఈజీ మార్గమేదని.
వివేకవంతులు గమ్యాన్ని నిర్దేశించుకోగానే అక్కడకు అతి తక్కువ కాలంలో చేరే దగ్గరి మార్గాన్ని అన్వేషిస్తారు.
బిలాస్పూర్ ఎక్స్ ప్రెస్స్ లేదా బిలాస్పూర్ ప్యాసింజర్ మాట తెలిసింది. అక్కడినుండి బిలాస్పూర్ నలభై రెండు కిలోమీటర్లు.
చటుక్కున పథకం మార్చింది వకుళ.
ఊద్యమంలో ఉన్నపుడు ఒక సిద్ధాంతముండేది. వెళ్ళే చోటు చెప్పొద్దు. చెప్పే చోటికి పోవద్దు. . అని.
వెళ్ళేప్పుడే ఆ ప్యాకింగ్స్ వంటివే ఇంకో మూడు ప్యాకింగ్స్ తయారు చేయించుకుని. . మొత్తం ఇరవై ఐదు కార్టూన్స్, సిమిలర్ గా.
రెండుగంటల తర్వాత బిలాస్పూర్ చేరి. . ఇంకో గంటలో ప్యాసింజర్. . స్టార్టింగ్ పాయింట్.
భోజనాలు ముగించుకుని. . ముగ్గురూ మూడు డబ్బాల్లో సర్దుకుని. . ఒక్కొక్కరి దగ్గర ఎనిమిది కార్టూన్స్. టిసి ని ముందే కలిసింది వకుళ. ఒక్కొక్కరికి మూడువందల లంచం. . చాలా ఎక్కువది.
ఒక కార్టూన్ విప్పి చూపించింది టిసి అడుగక ముందే. . పెట్టెనిండా క్లాస్ మేట్ నోట్ బుక్స్. అంతా ఓకె. ఆటో వేరే ట్రైన్ లో సికిందరాబాద్ కు పార్సల్.
మనుషులు. . మూడు డబ్బాల్లో. . అంటా టర్మ్ స్ ఇన్ క్యాష్.
అరగంట ఆలస్యంగా బిలాస్పూర్ ప్యాసింజర్ బయలుదేరింది.
నిశ్చింత అలవాటైపోతోంది. . ముగ్గురికీ క్రమంగా.
గాంధీ, గోపాల్ పడుకున్నారు ఒక మూలకు ఒదిగి కూర్చుని వేర్వేరు కంపార్ట్ మెంట్లలో.
వకుళ మేల్కొని గమనిస్తోంది. . జాగ్రత్తగా. రెండు గంటలు. . కోట. . తర్వాత గంట. . డుగ్రా. . మరో గంట. . పెంద్రా.
రైలు వెళ్తోంది. . రాత్రి మనుషులనూ, సమస్యలనూ మోసుకుంటూ.

*****

రెండు రోజుల అవిశ్రాంత నిర్వహణ తర్వాత. ,
ఓల్డ్ ఢిల్లీ. . కిషన్ గంజ్. . కైలాష్ అపార్ట్ మెంట్స్. . మూడు వందల రెండు. కొత్తది. టు బెడ్ రూం.
అర్జంట్ గా ఒక్కరోజులో కొన్నది వకుళ ఒక బ్రోకర్ ద్వారా. ఒక కోటి ఐదు లక్షలు.
ఇక మరునాటి నుండి ప్రారంభించింది. . కార్యాచరణ.
ఆమె స్పృహ. . కాలం-వేగం. . కాలం-దూరం. . కాలం-విజయం. . కాలం-జీవితం.
చిన్నప్పటి లెక్క. . ఒకటి , చాలా ఆసక్తికరంగా.
ఒక తొట్టిని రెండు పంపులు ఒక గంటలో నింపును. ఒక గొట్టము ముప్పావు గంటలో దానిని ఖాళీ చేయును. ఆ మూడింటినీ ఒకేసారి తెరిచినచో. ,
గమ్మత్తనిపించేది ఆ లెక్కలను చేస్తున్నపుడు. ,
ఇప్పుడు అవే లెక్కలు. . జీవితంలో. . ఖాళీ అగుట. . మళ్ళీ నిండుట. . మరల ఖాళీ. ,
గాంధీ, గోపాల్ చాలా మంచి స్నేహితులైపోయారు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని వాళ్ళకే తెలియని గమ్మత్తైన విషయమేమిటంటే ఇద్దరికికూడా తను తెచ్చిన ఇరవై రెండు కోట్ల రూపాయల గురించి ఏ మాత్రంకూడా ఉత్సుకత లేకపోవడం. కనీసం వాటికీ తమకూ ఏవైనా ఆర్థిక లావాదేవీలుంటాయా అన్న స్పృహ కూడా లేకపోవడం. అమాయకులా. . మహాత్ములా.
ఇద్దరూ ఢిల్లీని చూసొస్తామని ఒక ఆటోను ఎంగేజ్ చేసుకుని వెళ్ళిపోయారు పొద్దున్నే.
ఇడ్లీ తిని. . కొత్త అపార్ట్ మెంట్లోని బెడ్రూం నేలమీద ఒక గోడకు ఒరిగి కాళ్ళు చాపుకుని. . తన పేపర్ కట్టింగ్స్ ను దాచుకున్న ఫైల్ తెరిచింది వకుళ.
పాత పేపర్. . ఆంధ్రజ్యోతి తేది 20-01-2011 గురువారం.
1, 00, 00, 000, 00, 00, 000 స్వాతంత్ర్యం తర్వాత. . కోటి కోట్ల రూపాయల అవినీతి
స్వతంత్ర భారతం పుట్టింది1947లో!మరి స్కామిండియా పుట్టింది1948లో!స్వాతంత్ర్యం లభించి 63 ఏళ్ళు!స్కాముల్లో గల్లంతైన సొమ్ము 73 లక్షల కోట్లు.
1948 లో అంటే స్వాతంత్ర్యం వచ్చిన మొదటి సంవత్సరమే బ్రిటన్లో భారత హై కమీషనర్ గా ఉన్న వి కె క్రిష్ణ మీనన్ ఆర్మీ జీపుల కుంభకోణం తో ఈ అంటువ్యాధి మొదలైంది. అక్కడినుండి 2009-2010 నాటికి భారత కేంద్ర టెలికాం మంత్రిగా 3 జి స్పెక్ట్రం కుంభకోణం లో రు. 176000 కోట్లు తినే స్థాయికి ఈ దేశ దౌర్భాగ్యం పెచ్చరిల్లి. . శిథిలమైపోయింది. ఈ స్కాముల సొమ్ముతో మన దేశం అంతర్జాతీయంగా చేసిన అప్పులను రెండుసార్లు కట్టి చుప్తా చేయవచ్చు.
సాధారణ మానవుని పరిభాషలో చెప్పాలంటే ఈ దేశ సగం మంది ప్రజలకు ఉచితంగా టాటా కార్లను కొనివ్వొచ్చు.
పాత పేపర్. . ఆంధ్రజ్యోతి తేది 23-08-2010సోమవారం
తాజాగా ప్రవాస భారతీయ వ్యాపారవేత్త అనిల్ అగర్వాల్ తన కెయిర్న్ ఇండియా మరియు వేదాంత రెసోర్సెస్ సంస్థల మొత్తం నికర విలువను ప్రకటించారు. అతని సంపద రు. 1, 67, 000 కోట్ల రూపాయలు. తర్వాతి స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ సంపద రు. 1, 46, 000 కోట్ల రూపాయలని తెలుస్తోంది.
ఒక ప్రజాస్వామిక దేశంలో ఒక వ్యక్తి సంపద ఆంధ్రప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్ర వార్షిక బడ్జెట్ కంటే ఎక్కువగా ఉండడం ఈ దేశ గమనాన్ని సూచిస్తోంది.
ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత అసమర్థంగా పనిచేస్తున్నాయో అవగతమౌతోంది.
పాత పేపర్. . సాక్షి తేది 05-11-2010శుక్రవారం
టిడిపి హయాంలో. . ఒక లక్షా అరవై వేల కోట్ల రూపాయల విలువగల భూ కుంభకోణం.
రహేజా-110ఏకరాలు, వైజాగ్ ఫార్మాసిటీ 2143 ఎకరాలు, శంషాబాద్ ఏర్ పోర్ట్ 5500 ఎకరాలు, గంగవరం పోర్ట్ 1800 ఎకరాలు, కృష్ణపట్నం పోర్ట్ 2000 ఎకరాలు, డాబర్ 1000ఎకరాలు, బీచ్ శాండ్-ట్రైమెక్స్ 1700 ఎకరాలు. . ఇలా మొత్తం 17, 435 ఎకరాల భూమిని రాజకీయ నాయకులు తినేస్తూ. ,
పాత పేపర్. . . ఇండియా టుడే తేది 11-01-2011
ఖజానా లూటీ చేసిన దొరలు
2జి-కుంభకోణం ఏ. రాజా రు. 1, 76, 00 కోట్లు. సురేష్ కల్మాడి, కామన్వెల్త్ క్రీడలు రు. 665 కోట్లు తెల్గీ కుంభకోణం రు. 43000 కోట్లు, సత్యం కుంభకోణం రు. 24, 000 కోట్లు, బోఫోర్స్ కుంభకోణం రు. 64 కోట్లు, పశుగ్రాసం కుంభకోణం రు. 950 కోట్లు , జైన్ సోదరుల హవాలా కుంభకోణం రు. 810 కోట్లు కొట్లు, హర్షద్ మెహతా సెక్యూరిటీస్ కుంభకోణం రు. 4000 కోట్లు పారేఖ్ మ్యూచువల్ ఫండ్ కుంభఖోణం రు. 1350 కోట్లు, మధు కోడా కుంభఖోణం రు. 4000 కోట్లు .
పాత పేపర్. . . నమస్తే తెలంగాణా తేది 22-02-2014 శనివారం
పనులు చేయక ముందే కోట్ల రూపాయలు స్వాహా.
దేశంలో దొంగలుపడ్డట్టు ఆంధ్రప్రదేశ్ తో సహా దేశంలోని పోలవరం వంటి అనేక కీలక ప్రాజెక్ట్ల కాంట్రాక్టలను చేజిక్కించుకుని అసలు కొన్నిచోట్ల కనీసం పనులుకూడా ప్రారంభించకుండానే దాదాపు ముప్పైయ్ వేలకోట్ల రూపాయలను స్వాహా చేసిన తెలుగు ఘనులకు మొబలైజేషన్ అడ్వాన్స్ ల పేర జరిగిన చెల్లింపుల భాగోతం తెలుసుకుంటే కళ్ళు బైర్లు కమ్మి కిందపడిపోటాం. ఈ పాపక్రియలో ప్రాంతీయ భేదాలేవీ లేవు. అందరూ. . అన్ని రాజకీయ పార్టీల వాళ్ళూ ఉన్నారు.
కావూరి. . రు. 3739 కోట్లు, సుబ్బిరామిరెడ్డి. . రు. 4798కోట్లు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. . రు. 2618 కోట్లు, రాయపాటి సాంబశివరావు. . రు4054 కోట్లు , లగడపాటి రాజగోపాల్. . రు. 7052 కోట్లు, మోదుగుల. . రు. 3795 కోట్లు, నామా నాగేశ్వర రావురు. 1644, ప్రభాకరరెడ్డి రు. 120 కోట్లు. . ఇవీ ఈ చెల్లింపుల వివరాలు.
పాత పేపర్. . . నమస్తే తెలంగాణా తేది 14-02-2014శుక్రవారం.
ఐ పి ఎల్ పేరుతో ఒక రకమైన జూదక్రియ ఈ దేశం లో విచ్చలవిడిగా కొనసాగుతోంది. జాతి నిర్మాణంలో ఎంతో నిర్మాణాత్మక పాత్ర వహించవలసిన యువత ఈ వేసవికాలంలో టివి కి అతుక్కుపోయి అనుత్పాదకంగా తయారవుతున్న తీరూ. . పేరు మోసిన వ్యాపారులు ఈ క్రికెట్ బలహీనతను నగదుగా మార్చుకుంటూ కోట్లకు కోట్లను గడిస్తున్న వైనం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ సందర్భంగా జరిగిన ఆటగాండ్ల వేలంలో. . మనుషులను పశువులవలె హర్రజు పాడడం సిగ్గు చేటుగా ఊంది. ఐతే ఈ వేలంలో తగిన రేటు రాలేదని అమ్ముడుపోని క్రీడాకారులు దుఃఖపడి బహిరంగంగానే ఏడ్వడం ఈ తంతుకు పరాకాష్ట. అత్యధిక మొత్తలకు అమ్ముడుపోయిన క్రికెట్ ఆటగాండ్ల వివరాలు.
యువరాజ్ రు. 14 కోట్లు, కెవిన్ పీటర్సన్. . రు. 9 కోట్లు, కరన్ శర్మ. . రు. 3. 75 కోట్లు, కేదార్ జాదవ్ రు. 2 కోట్లు, రాస్ టేలర్. . రు. 2 కోట్లు, ఈశ్వర్ పాండే. . రు. 1. 5 కోట్లు, రిషి ధవన్. . రు. 3 కోట్లు. . ఇలా.
ఏమైపోతోందీ దేశం.
దేశమంతా దోపిడీదార్లు, దగాకోర్లు, జూదరులు. . డబ్బుకోసం ఏదైనా చేస్తూంటే మిన్నక చూస్తూ కూర్చునే చేవ చచ్చిన ప్రభుత్వాలు. ,
ఛీ ఛీ.
ఇంకా బోలెడన్ని పేపర్ కట్టింగ్స్. . అకృత్యాల బాపతువి.
దేన్ని చదివినా, గమనించినా క్షోభ.
ఎలా. . ఎలా. ?
చాలా తీవ్రాతి తీవ్రంగా ఆలోచిస్తోంది వకుళ.
ఇది దారితప్పిన ప్రపంచ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం.
గత 22 సవత్సరాలనుండి ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉన్న దేశమిది. . మూడవ తరగతిలో పదహారేండ్ల కుర్రాడిలా.
ఇది ‘అతి ‘వ్యాధితో బాధపడుతున్న దౌర్భాగ్య దేశం. అతి స్వేచ్ఛ. అతి అవినీతి, అతి దోపిడీ, అతి లంచగొండితనం, అతి ఆక్రమణలు, అతి మీడియా, అతి సినిమాలు, అతి ఎదురుతిరగడాలు. . అతి హీనంగా చచ్చిపోవడాలు.
ఐతే రాత్రికి రాత్రి ఏవో అద్భుతాలు జరిగి విప్లవాలు సంభవించి ప్రభుత్వాలు మారి ప్రజల బతుకులు సౌభాగ్యవంతం అయ్యే అవకాశాలు ఈ దేశ స్వరూపంలో సాధ్యంకాదు. ఏది జరిగినా ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే జరగాలి. అది ఎలా. ?
విషాదమేమిటంటే గత ప్రభుత్వాలు ఈ దేశ ప్రజలనుకూడా లంచగొండులను, సోమరిపోతులను, వెధవలను తయారుచేసి పెట్టాయి.
ఒక సమూహం కావాలి.
ఒక సమూహాన్ని తయారు చేయాలి.
పార్లమెంట్ ద్వారానే ఈ మహాద్భుత మార్పును సాధ్యం చేసి చూపాలి.
వకుళ లేచి నిలబడ్డది.
కొత్త ఇల్లు.
ఒక్క వస్తువుకూడా లేదు.
ప్రక్కనున్న వార్డ్ రోబ్ లో జాగ్రత్తగా గాంధీ, గోపాల్ సర్దిపెట్టిన ఆన్ని వేయి నోట్లే ఉన్న ఇరవై రెండు కోట్ల రూపాయల కార్టూన్లను చూచింది. అన్నీ పదిలం.
వాటిని భద్రంగా తేగలగడం నిజంగా విజయమే.
పాలు ఎన్నున్నా దాన్ని పెరుగుగా మార్చడానికి తగినంత తోడు అవసరం.
తను స్వప్నించే కొత్త దేశ పునర్నిర్మాణానికి ఈ డబ్బు తన ప్రయత్నాలకు ‘ తోడు ‘వంటిది.
లేచి. . అలా ఊరికే బయటకు నడిచిండి బట్టలు మార్చుకుని.
కిందికొచ్చి వీధి మూలమీది ఛాయ్ బండిమీద టీ తాగింది.
ఆలోచిస్తోంది.
ఏనుగునెక్కాలంటే తోకపట్టుకుని ఎక్కొద్దు. తొండం పట్టుకునికూడా ఎక్కొద్దు. రెండూ ప్రమాదకరమైనవే.
“టాప్ టు బాటం”. . అని నిశ్చయించుకుంది.
ఒక రాజకీయ శిబిరాన్నీ, శిఖరాన్ని గుర్తించాలి. అక్కడికి చేరాలి. చేరి. ,
ఒక పావుగంట ఆ పరిసరాల్లోనే అటుఇటూ తిరిగి మళ్ళీ ఒక ఛాయ్ తాగి కొత్త ఇంటికొచ్చి నేలమీద పడుకుంది వకుళ.
ఆలోచిస్తోంది.
*****

ఎంట్రప్యునర్ అని ఒక గమ్మత్తయిన పదముంది. తెలుగులో దానికి సమానార్థంగా. . ఔత్సాహికుడు అని చెబుతారు. అది ఎంతవరకు సరియైందో తెలియదుగాని. . అది చాలా అర్థవంతమైన మాట.
ఉద్యోగ రంగంలో ఒకడు ఉద్యోగం ఇచ్చేవాడు. . ఇంకొకడు తీసుకునేవాడుంటాడు
ఉద్యోగం చేసేవాడెప్పుడూ రిస్క్ తీసుకోడు. నెల తిరగ్గానే జీతం తీసుకుంటాడు. ఆ వ్యవస్థయొక్క బాగోగులతో అతనికి సంబంధం ఉండదు. కాని ఎంట్రప్యునర్ అలా కాదు. వాడెప్పుడూ రిస్క్ తీసుకుంటానికి సిద్ధపడి కార్యరంగంలో ఉంటాడు. జీవితమంటేనే ఒక చాలెంజ్ అని భావిస్తూ సాహసాలు చేస్తాడు.
అందుకే ఉద్యోగులు గొర్రెతోకలు.
ఎంట్రప్యునర్ ఎప్పుడూ ఆర్థిక ఉన్నతినీ, అధికారాలనూ హస్తగతం చేసుకునే విజేత.
వకుళ ఒక ఎంట్రప్యునర్ గా ఆలోచిస్తోంది.
రాజకీయంగా ఇద్దరు వ్యక్తులను గుర్తించింది ముందుగా.
ఒకరు అధికారంలో ఉన్న పార్టీ నేత.
రెండు. . ప్రతిపక్షం లో ఉండి ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే నేత.
స్పష్టంగా నిర్ణయించుకుంది వకుళ.
బయలుదేరింది.
ఆట నేర్చుకోవాలంటే క్రీడాస్థలిలోకి ప్రవేశించాలి. తప్పదు.
కాంగ్రెస్ పార్టీ. 10-జనపథ్.
మొదటి అడుగెప్పుడూ కొత్తే. తడబడుతుంది.
కలవాలి వ్యక్తులను. కాని వ్యక్తులను కలువనివ్వరు. దేవునికీ భక్తునికీ మధ్య చాలామంది బ్రోకర్లుంటారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. బ్రోకర్ అనేవాడు తప్పనిసరిగా దేనికో ఒకదానికి లొంగుతాడు. అది వందకా, వేయికా, పదివేలకా. . అనేది వేరే విషయం. కాని ఎంతకో ఒకంతకు బ్రోకర్ లొంగిపోవడం మాత్రం నిజం.
అందుకనే తెలివిగలవాళ్ళు బ్రోకర్లకు ముందు ప్రజెంటేషన్స్. . తర్వాత కానుకలు. . ఆ తర్వాత గిఫ్ట్ లు. . నజరానాలు. . బహుమతులు. . ఇలా ఒకటి వెనుక ఒకటి ఇచ్చుకుంటూ పోతూనే ఉంటారు.
రోజు-1
వకుళ వెళ్లింది 10-జనపథ్ కు.
లోపలికి అసలు ప్రవేశమే లేదు. బయట రోజూ అక్కడుండే పొలీస్ ను పసిగట్టి వాడికి పార్కర్ పెన్నును గిఫ్ట్ ఇచ్చింది.
రోజు-2
ఒక స్టెప్ లోపలికెళ్ళింది.
రెసిప్షన్ లో మాట్లాడింది. ఒక మొబైల్ ఫోన్ ను కానుకిచ్చింది. సాంసంగ్. చిరునవ్వు దొరికింది.
రోజు-3
ఒట్టిగానే డ్రాయింగ్ రూంలో కూర్చునుట.
“ఎం పని”
“ఏం పని లేదు. ఊర్కే మేడంను చూచుట”
“మగర్ క్యొం”అని ప్రశ్న.
“మేడంకా ఫ్యాన్”
“. . . . “. నీళ్ళు నములుతున్న వాడికి ఒక పది వంద రూపాయల నోట్లున్న సీల్డ్ కవర్ ఇచ్చుట.
ఫలితం. . రోజూ ఒక చిరు నవ్వు. ఒక పలకరింత.
రోజు-4
“అరే బై. ఏ బచ్చీ హర్ రోజ్ అత్తీహై. క్యోం”
“మేడంసే ఏక్ బార్ మిల్నా చాహతీహై సాబ్”
ఆ అడిగిన దిగ్విజయ్ సింగ్ నో, అహమ్మద్ పటేల్ నో, ఆంతరంగిక పరిచారకుడు వాసూ పాండే నో. . వినమ్ర నమస్కార బాణంతో ఒక బొకే ఇచ్చి. ,
“ఠీక్ హై. . కలాజా”
“థాంక్యూ”
రొజు-5
పట్టు వదలని విక్రమార్కుడు. . అనేది చాలా పెద్ద మేనేజ్మెంట్ సూత్రం. పట్టు విడవరాదు. పట్టి విడువరాదు.
“అరే బేటీ తెరేకో క్యా హోనా”
ఏ మొతీలాల్ ఓరానో రోజూ చూచీ చూచీ వకుళను అడిగితే వినమ్రంగా”కుచ్ నహీ చాహియే ముఝే. బస్ మేడంకో మిల్నా. . దేఖ్నా. ఉత్నీ”
“ఠీఖై. . కలావ్”
రోజు-6
“అరే ఏ బచ్చీకో ఏక్బార్ మేడంసే మిల్నే దే”
కార్యశూరుడు గమ్యం చేరేదాకా విశ్రమించడు.
“సాబ్ ఏ చోటా తోఫా లే”
” నహీ బేటీ. . ”
మొహమాటం.
వ్యవహారంలో మొహమాటాలకు తావులేదు. అంటే.
. . . . . ,
రోజు-32
సోనియా గాంధీ అడిగింది వకుళను”వాట్ డు యు వాంట్”అని
” ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ మేడం. . ఆప్కో దేఖ్నా. . మిల్నా. ఉత్నీ. . బస్”
“టీక్ హై. మిల్తే రహో కభీ కభీ”
వకుళ ప్రతిరోజూ నేరుగా వెళ్తుంది 10-జనపథ్ లోపలిదాకా.
చాలా సార్లు సోనియా ముందు కనబడుతుంది. కాని ఏ ఒక్కనాడూ ఏదీ అడుగలేదు ఎవ్వరినీ. బయట వాచ్మన్ నుండి లోపల మేడం సెక్రెటరీదాకా.
ఒక్కసారి నాకిది కావాలని అడిగామో. . ఐపోయింది.
జీవితంలో. . మనం అడిగితే ఇష్టంగా ఇవ్వరు. అడగనంతసేపు “నీకేంకావాలి”అని వాళ్ళే అడుగుతారు. లోకనైజమది.
అదగక ఇచ్చిన ముద్దే ముద్దు ముద్దు. . కదా.
రోజు -45
వకుళ అందరికీ చాలా తెలిసిన ఒక స్వంత ఇంటి మనిషి.
ఐతే,
చాలా మందికి తెలియని విషయమేమిటంటే,
ఈ 45 రోజుల్లో. . అదే పద్ధతితో,
వకుళ సుష్మా స్వరాజ్ కు కూడా అంతే చేరువయ్యింది. సూత్రమేమిటంటే. . “వకుళ కుచ్ నహీ చాహ్తీ. . అచ్చీ బచ్చీ హై”
మన యోగి వేమన ‘ తినగ తినగ వేము తియ్యనుండు ‘అని ఒవర్ యాక్షన్ చేసిండుగని. . అది తప్పు. వేము తియ్యగ కాదు గాని చేదు అనిపించకుండా మాత్రం అనిపిస్తది. గంతే.
చేదును. . . తీయగా ఎలా చేసుకోవాలో వకుళ నేర్చుకుంది.
రోజు-145
ఇప్పుడు భారత రాజకీయ శిఖర స్థాయి వ్యక్తులతో వకుళ నేరుగా వెళ్ళి కలిసి ఏ విషయమైనా సూటిగా మాట్లాడగలదు.
కొన్నిసార్లు మెట్లను ఒక్కొక్కటిగానే ఎక్కవలసి ఉంటుంది. . నిలకడగా ఎదగడానికి.
కొందరిముందు ఎప్పుడూ కనిపిస్తూండాలి. . ఊర్కేనే.
అది చాలా అవసరం.

*****

12
సిరి తా వచ్చిన వచ్చును
సలలితముగ నారికేళ సలిలము భంగిన్
సిరి తా పోయిన పోవును
కరి మ్రింగిన వెలగపండు కరణిని సుమతీ
ఆ సుమతీ శతక కారుని పద్యం పొద్దుటినుండి చెవుల్లో గింగురుమంటోంది.
అనురాధ ఏర్ పోర్ట్ నుండి తన టయొట క్యామ్రీ కార్లో వచ్చి. . జూబ్లీ హిల్స్ లోని రోడ్ నంబర్ పదిలో ఉన్న తన “స్వర్ణ” నివాసంలోకి దూసుకుపోయి. ,
“అసలు ఈ సిరి అనగా ఏమి ?”అని ప్రశ్నించుకుంటోంది ఆమె. . కొన్ని నెలలుగా. సిరి అంటే. . సంపద. . డబ్బు. . బంగారం. . భూములు. . మనీ. . బ్లాక్ అండ్ వైట్. . విజిబుల్ అండ్ నాన్ విజిబుల్. . జ్యువలరీ. . షేర్స్. . ఇన్వెస్ట్ మెంట్స్ అనుకుంటోందామె. . ఔను. . ఇవన్నీ నిజంగానే ఎలా వచ్చాయి తనకు. కొబ్బరి కాయలో నీరువలె వచ్చాయా. ?
కొబ్బరికాయలోకి నీరు ఎప్పుడు, ఎలా, ఎన్ని, ఏ రుచితో వస్తాయో ఎవరికీ తెలియదు.
కారు దిగి చాలా దుఃఖోద్వేగంతో చరచరా వెళ్ళి తన విశాలమైన పాల నురగవంటి బెడ్ పై అలా కూలిపోయిన పూల చెట్టులా పడిపోయింది.
దాదాపు రెండేండ్లు కావస్తోంది రమణా తనూ పెళ్ళి చేసుకుని,
ఏరీ. . పిల్లలేరీ.
పిల్లలకోసమే తను అతన్ని చేసుకుంది. తర్వాత్తర్వాత తనకర్థమైన విషయమేమిటంటే రమణ మాత్రం కేవలం డబ్బుకోసమే తనను చేసుకున్నాడని.
పిచ్చి. . వయసులో ఉన్నపుడు దేహ సౌందర్య వ్యామోహ మోహనంలో విహ్వలయై. . రేయింబవళ్ళు ఒకటే లోకం. సుఖం. . సుఖం. దాహం. . దాహం. పరుగు పరుగు. ఎటో. . ఖండ ఖండాంతరయై. అన్వేషణలో.
ఉదయం. . మధ్యాహ్నం. . సాయంత్రం.
ప్రకృతి చెబుతూనే ఉంది. . ఉదయం. . పుట్టుట. . మద్యాహ్నం. . పొంగుట. . సాయంత్రం. . కుంగుట.
వలయం. నిరంతర అనంత చక్ర భ్రమణం
సుడిగుండంలో ఎండుటాకులా గిరగిరా తిరిగి తిరిగి లుప్తమైపోయినట్టు
నశించిపోతోంది తను.
ఉనికినీ. . భౌతికతనూ. . జీవితాన్నీ. . సకలాన్నీ కోల్పోయి. ,
‘ సిరి తా పోయిన పోవును. . కరి మింగిన వెలగపండు ‘
“నాట్ పాజిబుల్ మేడం. యుటరస్ ఈజ్ ఫుల్లీ డామేజ్డ్. . ఇట్ ఈజ్ టు బి రిమూవ్డ్. నో వే. . . “దేశంలోనే ప్రసిద్ద గైనకాలజిస్ట్ నళినీ పాండ్యా రెండు గంటల క్రితం చెప్పిన మాటలు చెవుల్లో గింగురుమంటూనే ఉన్నాయి.
ఐపోయింది. అంతా ఐపోయింది.
విన్నాడా. . రమణ విన్నాడా. . ప్రతి ఫర్టైల్ పీరియడ్ లో మనం తప్పనిసరిగా కలుసుకోవాలని రమణా అని తను నెత్తిన నోరు పెట్టుకుని అరచినపుడు. . విన్నాడా.
ఉహు. . తిరుగుల్లు కావాలి. డబ్బుకోసం. సుఖాలకోసం. . పరాయి ఆడవాళ్ళకోసం. . సౌఖ్యాలకోసం. . ఎక్కడెక్కడో తిరగాలి. ఏరోజు ఎక్కడో తెలియకుండా క్యాంపులు.
ఏదో అదృశ్య శక్తి నియంత్రిస్తున్నట్టు వీలే అయ్యేదికాదు. . రమణకూ తనకూ ఆ కలయిక.
సమయం ఆగదు. . కాలం గర్జిస్తుంది. నియంత్రిస్తుంది.
ఇప్పుడు సకల సిరులూ, సంపదలూ వృధా.
తను శాశ్వతంగా గొడ్రాలు.
దుఃఖం సముద్ర కెరటంవలె అనురాధను ముంచేస్తూండగా ఆమె కన్నీళ్ళలో సుడితిరిగిపోయింది. . లక్ష రూపాయల బెడ్ పై.
ఆమె చేతిలోని మెడికల్ ఫైల్ జారి కిందపడింది. చెల్లాచెదురుగా రిపోర్ట్స్.
కరిమింగిన వెలగపండై. . తన సకలమూ, భవిష్యత్తూ నశించిపోయింది. ,
సరిగ్గా ఆ క్షణం. ,
అప్పుడు. . ఆ నిముషం. . సి ఎం. . క్యాంప్ కార్యాలయంలో. . రమణ,
ఇండస్ట్రీస్ మంత్రి ఆప్పలనాయుడుతో గొడవ పడుతున్నాడు.
పరస్పరం బూతులు తిట్టుకుంటున్నారు.
ఆప్పుడు రాత్రి. . ఎనిమిది గంటలా నలభై నిముషాలయ్యింది.
ప్రక్క గదుల్లో వేరువేరుగా ముగ్గురు మంత్రులు బుద్ధిగా కూర్చుని వాళ్ళ వాళ్ళ ఐ ఎ ఎస్ ఆఫీసర్లు చెప్పిన చోటల్లా ఫైళ్ళపై సంతకాలు చేస్తూ పోతున్నారు.
అదొక స్పెషల్ డొమైన్.
కొందరిని. . ప్రత్యేకంగా చదువు పూర్తిగా తక్కువగా. . అంటే ఎస్సెస్సెసీ, ఐటీఇ, ఒట్టి ఫేక్ డిగ్రీ ఉండి. . అస్సలు ఇంగ్లీషే రాని. . సి ఎం దయాదాక్షిణ్యాలపై ఆడా మగా మంత్రి పదవులు పొంది. . ఏది చెబుతే అది విని తు. చ. తప్పకుండా ఎక్కడ పెట్టమంటే అక్కడ సంతకాలు చేసే కొంతమంది దగ్గర అతి అవినీతిపరులైన బ్యూరోక్రాట్స్ ను పోస్ట్ చేసి. . ప్రతి రోజూ రాత్రి ఏడు నుండి తొమ్మిది వరకు సమాచారమున్న మంత్రులందరూ. . క్యాంప్ కార్యాలయానికొచ్చి ‘యువర్స్ మోస్ట్ ఒబీడియంట్లీ ‘ టైప్ లో ఆఫీసర్లు చెప్పిన చోట్లల్లా చేవ్రాల్లూ చేసి. . తరించి. . ఆ రకంగా సంతకాలు చేసినందువల్ల ఏ మంత్రికి ఎంత లాభమో తెలుసుకుని తమ తమ పి ఎ ల ద్వారా ‘పంపకాల లబ్ధిదారుల నుండి రావలసిన మొత్తములను. . టర్మ్ స్ ఇన్ క్యాష్ పద్ధతిన పొంది ‘. . అంతిమంగా ఆ రోజు చివరన ‘ఎల్లరూ సుఖులే ‘ ఐ. . ఎవరి ఇంటికి వారు వెళ్ళుట. ఈ అత్యంత నిగూఢ, అతి గోపనీయ ప్రభుత్వ ఆంతరంగిక నిత్య కార్యక్రమాలను ‘క్విడ్ ప్రో కొ ‘ విధానం పై నిర్వహించేందుకు ప్రత్యేక నిష్ణాతులు కొందరు. . అధికారిక, అనధికారిక . . రాజకీయ, అరాజకీయ. . బంధు, అబంధు స్థాయిల్లో పర్యవేక్షిస్తూండగా,
అంతా అతి నిశ్శబ్దంగా జరుగవలసిన చోట,
ఒక గదిలో రమణా, మంత్రి అప్పలనాయుడూ చాలా తీవ్రంగా. . తారాస్థాయిలో, ఒప్పంద మర్యాదలకు భిన్నంగా గొడవ పడుతూ పరస్పరం బూతులు తిట్టుకుంటున్నారు.
అప్పలనాయుడంటే ఒక అనధికార రాజకీయ శక్తికేంద్రం. ముఖ్యమంత్రీ, మరో ఇద్దరుముగ్గురు మంత్రులూ, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శీ, అధికార పార్టీ అధిష్టానం, న్యాయ, పోలీస్. . ఇతరేతర ప్రభుత్వ అధికార గణం. . అందరూ కలిసి ఏకవ్యక్తిగా రూపొందుతే వాడిపేరు అప్పలనాయుడు. అప్పలనాయుడు అస్సలే మాట్లాడడు. కనుసైగలు చేస్తాడు. అంతే. అన్ని పనులూ వాటంతటవే క్యూ కట్టి జరుగుతూ ఉంటాయి. ప్రతి రోజు కనీసం వంద కోట్ల ముడుపులు చేతులు మారంది అప్పలనాయుదు ఆ రాత్రి పెగ్గు ముట్టడు.
చెక్కులు. . డాక్యుమెంట్లు. . అధార విధారాలూ ఏవీ ఉండవు. . అంతా ‘నగదు బదిలీ పథకం. ‘
ఒక మంత్రి ఒక ఫార్మా కంపనీకి 1865 ఎకరాల భూమిని ప్రభుత్వం తరపున నామినల్ రేటుపైన ధారాదత్తం చేస్తున్నాడు. మొత్తం 15 గ్రామాలు నిర్వాసితులవుతారు. నో ప్రాబ్లం. కానీ. . ఒక గదిలో ఆ తతంగం నడుస్తోంది. ఆ గది యాంటీ రూంలో ఆ ఫార్మా కంపనీ మనుషులు ఎక్కడెక్కడో రహస్యంగా ఏర్పాటు చేసిన డబ్బు వివరాలతో. . అప్పజెప్పడానికి వేచి చూస్తున్నారు. కాగితాలిటు. . క్యాష్ అటు.
మరో ఏర్ కండిషండ్ గదిలో. ,
ఎనిమిది బ్రూవరీస్ కంపనీలు.
వాటి ఐ ఎ ఎస్ ఎండి లు. ఫైళ్ళు పట్టుకుని క్యూలో. మంత్రిగారు చేతులు నొప్పి పెట్టేట్టు సంతకాలు చేస్తున్నాడు. తన సంతకానికి ఎంత విలువో అని లోలోపల పొంగిపోతున్నాడు. ఒకప్పుడు ఒక సారాకొట్టు యజమాని ఆ మంత్రి. చదువు 10 వ తరగతి ఫేల్. ఎవరేమన్న ఏమన్నా. . ‘ యస్ బాస్. ‘శైలి.
ఇంకో ఎ. సి గదిలో. ,
దుబాయ్ లో కట్టబోయే ఇరవై అంతస్తుల సి ఎం గారి పర్సనల్ బిల్డింగ్ కోసం. . తాపీ కాంట్రాక్టర్ స్వంత ఇల్లు కట్టుకుంటూంటే వానికింద పనిచేసే పిల్ల తాపీవాళ్ళండరు తలోరోజు ఉచితంగా పనిదానం చేసినట్టు. . ఓ పదిమంది మంత్రులు కలిసికట్టుగా తలో చేయివేసి చేస్తున్న కార్యం తాలూకు ఫైనలైజేషన్. ప్రతి మంత్రీ తలో పది కోట్లు విరాళం.
క్యాషివ్వద్దు. సంతకాలు పెట్టాలి. అంతే. ఆ చేవ్రాల్లే వేయి రూపాయల నోట్లకట్టలుగా మారి చందాలైపోతాయన్నమాట.
ఐతే ఇన్ని ఏండ్లుగా బయట గడ్డిపీకడానిక్కూడా పనికిరాని ఈ మంత్రులందరూ ఇలా తమ తమ దిక్కుమాలిన సంతకాలు ఎలా కోట్లక్కోట్ల రూపాయలుగా మారిపోతున్నాయో అర్థంకాక చచ్చిన చావు చావకుండా తలలు బద్దలు చేసుకుంటున్నప్పుడు. ,
అప్పుడు. . అప్పుడు మొదలైంది. . గొడవ. . కోట్ల రూపాయల పంపకాల గొడవ అప్పలనాయుడికీ. . రాటుదేలి ఐ ఎ ఎస్ రమణకీ.
“కుదరదు. . కుదరదంతే. . ఐదు వందల కోట్లు దీంట్లో మీకు. నాకు తెలుసు. . అంతా తెలుసు మిస్టర్ అప్పలనాయుడూ”రమణ అప్పటికే ఒక బ్రూవరీస్ వాడిచ్చిన కార్టూన్ గోల్డ్ లేబుల్ విస్కీ లోంచి రెండు పెగ్గులు కొట్టి కైపుతోనున్నాడు.
“ఆ. . తెలుస్తే ఏమిట్రా. ”
“ఏమిట్రా. . యేయ్. . హోల్డ్ యువర్ టంగ్. ”
“ఏందిరా ఓల్డ్ చేసేది. . వెధవ ఐ ఎ ఎస్ నా కొడకా”
“ఏయ్. . మంత్రీ. . నువ్వు హద్దులు దాటుతున్నావ్. . మాటలు జాగ్రత్తగా రానీ. . బి కేర్ ఫుల్”
ప్రక్కన ఇంకో ఇద్దరు ఐ ఎ ఎస్ లు చూస్తున్నారు. . అవాక్కయి. ‘ ఏదో జరుగబోతోంది ‘ అని అనుకుంటూనే ఉన్నారు.
రమణకు తెలియదు. . అప్పలనాయుడుకూడా పూటుగా మందు కొట్టి ఉన్నాడని.
“ఏందిగా కేర్ ఫుల్లు నీతో. . బొచ్చు. . ఏం పీకుతవురా. . మోచేతి పాకం నాకే నా కొడకా”
“యేయ్. . యేయ్. . నువ్వు మాటలు దాటుతున్నవ్. . హద్దులు”
“నాకు హద్దులేందిరా నా కొడకా. ఎవ్వరితొ పెట్టుకుంటున్నావో తెలుసా. . అరేయ్”
రమణకు చిర్రెత్తుకొచ్చింది. . “ఎవరివి. . ఎవరివి. . ఏంచేస్తవ్. . పీకుతవా” రమణ కూడా అప్పలనాయుడు పైపైకి వెళ్ళాడు.
అంతలోనే. . క్షణంలో. . ఎలా జరిగిందో. . ఠప్పున ధన్ మని చప్పుడైంది. రివాల్వర్ పేలింది.
లిప్తలో. ,
రమణ ధబాలున నేలపైబడి. ,
“అమ్మా”అని కేక.
బ్లాకంతా దద్దరిల్లే ప్రతిధ్వని.
ఎర్రగా రక్తం.
చచ్చిన రమణ శవం.
చుట్టూ పదిమంది దాకా జనం.
బహిరంగ హత్య.
అప్పలనాయుడు తన రివాల్వర్ ను. . ప్రేమగా ముద్దుపెట్టుకుని చాలా తాపీగా నడుస్తూ బయటికి వెళ్ళి కారెక్కాడు.
అంతా స్తంభించిపోయింది.
నేలంతా రక్తం.
13

రెండు సంవత్సరాలు దాటింది వకుళ ఢిల్లీ వచ్చి.
సాధారణ వ్యక్తులు పది సంవత్సరాలలో చేయలేని అనేక పనులను ఆమె రెండు సంవత్సరాలలో అతి విజయవంతంగా పూర్తి చేసింది.
తనను తాను, తన శక్తి సామర్థ్యాలను తాను తెలుసుకునేందుకు రెండు పనులను చేపట్టి విజయవంతం చేసింది వకుళ.
ఒకటి. . ఇప్పుడు మోడీ ‘ఒక ఛాయ్ వాలా ప్రధాని కావద్దా’ అని ఓటర్లను కవ్విస్తూనే పబ్బం గడుపుకునే పద్దతిని తను ఎప్పుడో పాటించి వరంగల్లు నుండి ‘ఒక ఆటోవాలా ఎమ్మెల్యే ఎందుకు కావద్దు ‘ అని ప్రశ్నిస్తూనే తానిచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు గోపాల్ కు ఒక బై-ఎలక్షన్ లో కాంగ్రెస్ టికెట్ ఇప్పించి ఎమ్మెల్యేగా గెలిపించింది.
రెండు. . ‘తెర ముందా. . తెర వెనుకా. ?’ అని తనను తాను ప్రశ్నించుకుని ఖచ్చితంగా తెర వెనుకనే అని నిర్ధారించుకుని తెరపై ఉన్నవాళ్ళకంటే తెరవెనుక ఉన్నవాళ్ళే అతిశక్తివంతులని బోలెడన్ని సందర్భాల్లో నిరూపించుకుంది.
ఆ రెండవ పనిలో భాగంగానే వకుళ భార్గవ గాంధీని పెళ్ళిచేసుకుని వకుళగాంధీ గా మారింది.
తను ఉద్యమం నుండి వైదొలగి ప్రజాస్వామిక పంథాలోనే ఈ దేశంలో సమూలమైన మార్పులను తేవాలని నిర్ణయించుకుని. . ఒక బూర్జువా పారిశ్రామిక వేత్తకు చెందిన నల్లదనాన్ని . . ఇరవై రెండు కోట్ల రూపాయలను. . రాజకీయ రంగ ప్రవేశం, విస్తరణ, వృద్ధి కార్యాలకు ‘తోడు పెరుగు ‘వలె ఉపయోగించుకోవాలనుకున్నా. . ఆ డబ్బు అవసరం అస్సలే ఏర్పడలేదు. పై రెండు కోట్లుకూడా ఖర్చు కాలేదు ఆమెకు.
అందువల్ల అసలు డబ్బు అనే వ్యామోహం దాదాపు లేకుండా పోయింది.
ఇక ఏం కావాలి తనకు.
పూర్తి స్థాయి రాజకీయ వ్య్వస్థ యొక్క విలువలతో కూడిన పునర్నిర్మాణం.
ఆ పనిలోనే వకుళ పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉంది.
ఆమె పార్టీ ఆఫీస్ లో ఫుల్ టైం కార్యకర్త. ప్రతిరోజూ సోనియా దగ్గరనుండి ఇతరేతర అదృశ్య మేధావులందరితోనూ నిత్య సంబంధాలుంటాయి.
వకుళ ఏమంటుందంటే. . తెరపై కనబడే పార్లమెంట్ సభ్యులు. . ఎమ్మెల్యే లు ఒట్టి చదరంగంలో పావులు. అసలు రాజక్రీడను ఆడేవాళ్ళు తెరవెనుక ఉండి నడిపించేవాళ్ళే. . . అని.
ఆ రోజు రాత్రి అత్యంత ఆంతరంగిక వార్ రూం భేటీ జరిగింది చాలా పొద్దుపోయేదాకా. 2014 జనరల్ ఎన్నికలు. కొన్ని రాష్ట్రాల్లో రెండూ పార్లమెంట్ మరియు అసెంబ్లీ ఎన్నికలు. . కొన్ని చోట్ల ఒక్క పార్లమెంట్ ఎన్నికలే. ఏదైనా దేశ భవిష్యత్తును నిర్ణయించే కీలకమైన ఎన్నికలే ఇవి.
అదీగాక చాలా ప్రత్యేక పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ను విభజించి తెలంగాణా ను ఏర్పరచి రెండుగా చీల్చుట. అందువల్ల రాజకీయ సమీకరణాలన్నీ చిన్నాభిన్నమై. ,
చాలా అస్థిరత. . అటువేపు ఒక సుడిగాలిలా దేశాన్ని ఒక ఊపు ఊపుతూ దుమారం సృష్టిస్తున్న ప్రత్యర్థి మోడి.
రాత్రి ఐదు ఉత్తర భారత దేశ రాష్ట్రాల పార్లమెంట్ అభ్యర్థుల తుది నిర్ణయం. . ఐపోయింది.
ఇప్పుడు లలిత్ మాకెన్ ప్రకటిస్తాడు ఉదయం ఎనిమిది గంటలకు.
ఇంటికొచ్చేసరికి ఉదయం నాలుగు గంటలు. నిద్రపోయింది నాలుగు గంటలే.
రాత్రి ఎనిమిది గంటలకు సుష్మాజి ఇంటికెళ్ళొచ్చింది. ఆమెకు కొద్దిగా జ్వరం. . జలుబు.
రాజకీయాలు వేరు. . వ్యక్తిగత స్నేహాలూ, ఆత్మీయతలూ వేరు.
అదే విధంగా షీలా దీక్షిత్ తో ఉన్న అనుబంధం వేరు.
అటు. . అమిత్ షా.
మోడీ ప్రధాన సహచరుడు. మంచి చురుకైన ఆలోచనా పరుడు. స్నేహితుడే.
నిన్న సాయంకాలమే కేజ్రీవాల్ తనను చెంపమీద కొట్టినవాణ్ణీ, పైకి చెప్పు విసిరినవాణ్ణీ కలిసి పోలీస్ లు కొట్టినందుకు క్షమాపణలు.
ఒక అతి కీలకమైన. . దేశానికి ప్రాణమైన ప్రజల నిజ జీవితాన్ని వాళ్ళలో కలిసిపోయి. . పబ్లిసిటీకోసం కాకుండా. . గ్రాస్ రూట్ లెవెల్ కు వెళ్ళి అద్యయనం చేసే నిజాయితీతోకూడిన ప్రయత్నం ఏ ఒక్కరూ ఎందుకు చేయడంలేదు.
వెనుకట రాజే మారువేశాల్లో జనంలోకి పోయేవాడుకదా.
‘ప్రభుత్వమిస్తున్న సంక్షేమ నిధుల్లో 95 శాతం అవినీతితో హరించుకు పోతున్నాయని ‘ రాహుల్ గాంధీ ఒక వైపు చెబుతూనే. . ఏమీ చేయని నిష్క్రియాప్రియత్వంతో మౌనం వహించుట. . ఎందుకు.
పార్టీ మీద కొంత అదుపు. . పెద్దవాళ్ళతో కొంచెం సాన్నిహిత్యం. . రాహుల్తో ఏదైనా చెప్పగలిగే దగ్గరితనం ఏర్పడ్డ తర్వాత భారత రాజకీయాల్లో కొత్త రక్తం ఎక్కించాలని చేస్తున్న ప్రయత్నాలన్నీ క్రమంగా విఫలమౌతున్న స్వానుభంలో. ,
ఏదో నిస్పృహ.
పార్టీలు ఏవైనా కొన్ని దుర్మార్గమైన సందర్భాల్లో అందరూ ఒకటై వ్యవహరించే తీరు మహా రోతగా ఉంటుంది.
పార్టీలన్ని వృద్ధుల చేతుల్లోనే. పేరు ఏదైనా అన్ని పార్టీల పగ్గాలన్నీ 65 ఏండ్లు పైబడ్డవాళ్ళచేతుల్లోనే.
టైం చూచుకుంది వకుళ.
ఎనిమిదిన్నర.
మళ్ళీ పార్టీ ఆఫీస్ కు వెళ్ళాలి పదిగంటలకు.
చాలా అసహనంగా ఉంది. ఒక్కతే ఇంట్లో.
గాంధీ టేబుల్ టెన్నిస్ ఆడుకోడానికెళ్ళాడు.
అటు చూస్తే ఓ బుక్ కనిపించింది.
‘గెలుపు సరే. . . బతకడం ఎలా. ?’-కె. ఎన్. వై. పతంజలి.
గాంధీ తెచ్చినట్టున్నాడు. చెప్పాడు మొన్న చాలా బాగుందని.
పేజీలు తిరగేసింది కొన్ని. రచయిత చూపు బాగుంది. అందువల్ల పాత విషయాలే సరికొత్తగా అర్థమౌతున్నాయి.
ఒక చోట అంటాదు. ,
మూడు అడుగుల నేల అడిగి ఒక అడుగుతో భూమినీ, రెండో అడుగుతో ఆకాశాన్నీ ఆక్రమించి వామనుడు మూడో అడుగును ఎక్కడ పెట్టమంటావని అడిగితే అమాయకుడైన బలి చక్రవర్తి తన నెత్తిమీద జాగా చూపించాడు. నువ్వడిగింది మూడడుగుల నేల, ఈ నేలమీదే మూడడుగులు తీసుకో, ఆకాశం నాది కాదు, నాదికాని దానిని నీకివ్వలేను, మర్యాదగా ఆ కాలు దించు అని కదా చెప్పాలి. కాని చెప్పలేదు. అదీ ఓవర్ యాక్షన్.
విషయం పాతదే. . కాని విప్పి చెప్పివ విధానం బాగుంది.
సరియైన సంధర్భాన్ని సరియైన దిశలో వీక్షించి స్వీకరించే తత్వం లోపిస్తోందా ఈ తరంలో.
అర్థం కావడంలేదు. . వకుళ అసహనంగా లిఫ్ట్ ఎక్కి పైకి టెర్రాస్ మీదికొచ్చింది.
ప్రశాంతంగా ఉంది పైన. ఆరోజు ఎందుకో ఆకాశం మబ్బుగా, చల్లగా, ఆహ్లాదంగా ఉంది.
గాంధీ అక్కడే ఉన్నాడు. అపార్ట్ మెంట్ పిల్లలు టీనా. రవి. నూతన్, యజ్ఞేష్. కైలాష్. . ఇంకా ఇద్దరు ముగ్గురు. . అందరు కలిసి పతంగులెక్కిస్తున్నారు. గాంధీ వయసువాడే ప్రవాసి కూడా ఉన్నాడు. అతనుకూడా సాఫ్ట్ వేర్ ఇంజనీరే.
చుట్టూ చూచింది వకుళ.
ఢిల్లీ మహానగరం కాంక్రీట్ అరణ్యమై కనుచూపుమేర విస్తరించి వ్యాపించింది. అలా చూస్తూంటే శతాబ్దాల ఈ నగరం. . ఎన్ని జ్ఞాపకాలో. ఎంత చరిత్రో. మహాభారత కాలం నుండి. . ఆర్యులు. . మొగలులు. రాజపుత్రులు. . సంస్థానాధీశులు. . బ్రిటిషర్లు. కాల నాళికలో నిక్షిప్తమై నిదిరిస్తున్న దీర్ఘ మానవ పరిణామ చరిత్ర.
ఆకాశం నిండా పతంగులు. . రంగు రంగులవి. . కొల్లలు. . కోకొల్లలు.
గాంధీ ఎగురేస్తున్నాడు పతంగిని.
వకుళకు కూడా బుద్ది పుట్టింది గాలిపటం ఎక్కిస్తే బాగుండునని.
చటుక్కున రాత్రి వార్ రూం భేటీ జ్ఞాపకమొచ్చింది.
జేబులు తడుముకుంది.
అలాగే ఉంది తానిచ్చిన కాగితం. . వాటిని వెన్వెంటనే ప్రవేశ పెట్టి అమలు చేయకుంటే ఈ”దేశమే గతి బాగు పడునోయ్ ‘అని తానన్న సంగతి కూడా జ్ఞప్తికొచ్చింది.
వకుళ కాగితాన్ని విప్పి చూచుకుంది.
1. ప్రభుత్వ ఉద్యోగులకున్నట్టే రాజకీయాల్లో కూడా రెటైర్ మెంట్ వయసు ఉండాలి. అరవై ఏండ్లు దాటిన ప్రతి రాజకీయ నాయకుడూ తప్పనిసరిగా అన్ని రాజకీయ పదవులనుండి తప్పుకోవాలి.
2. పార్లమెంట్ సభ్యుడు. . ఎమ్మెల్యే. . ఇతరేతర రాజకీయ నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారెవరైనా ఆర్థిక లావాదేవీలున్న ఏ ఇతర వ్యాపారాలూ చేయకూడదు.
3. చిన్న అటెండర్ పోస్ట్ కు కూడా కనీస విద్యార్హతలు ఉన్నట్టే రాజకీయ నాయకుడికికూడా కనీస విద్యార్హత డిగ్రీ ఉండాలి.
4. ప్రజా ప్రతినిధుల మీద ఏ చిన్న నేరం ఋజువైనా అతన్ని మరుక్షణమే ఆ పదవినుండి తప్పించాలి
5. నేర చరితులకు అసలు పోటీ చేసే అవకాశమే లేకుండా చేయాలి.
6. ఒక బడుగు దేశమైన మన దేశం లో ఉన్న ఏ ప్రజాప్రతినిధైనా ఇక్కడి సగటు పౌరునికన్నా ఎటువంటి అదనపు సౌకర్యాలను అనుభవించకూడదు.
7. ప్రజా ప్రతినిధులెవరైనా స్వేచ్ఛగా ప్రజల్లో తిరుగ గలగాలి. అందువల్ల ప్రజాధనంతో ఏర్పాటు చేసే గన్ మ్యాన్ల రక్షణ వ్యవస్థను తక్షణమే తొలగించాలి.
8. అవినీతి ఆరోపణలు మోపబడినప్పుడు ఎఫ్ ఐ ఆర్-ప్రై మా ఫేసి గనుక ఉన్నట్టయితే తక్షణమే పదవి నుండి బర్త్ రఫ్ చేయాలి.
ఇలా. . ఇంకో పది సూచనలున్నాయి కాగితంపై.
రాత్రి ఈ అంశాలపై చాలా చర్చించింది తను.
వాటిలో. . ఒక్క అంశాన్ని కూడా ఎవరూ హర్షించలేదు.
కారణమేమిటంటే. . వార్ రూంలో ఉన్న పదిహేను మంది వయసు డెబ్బై ఏండ్లకు పైననే.
అందరిదగ్గరా వేల కోట్ల రూపాయల ఆస్తులున్నాయి.
దాంట్లో నలుగురి క్వాలిఫికషన్ మెట్రిక్ లోపలే.
ఇక. ,
గాంధీ. . “వకుళా. . గాలిపటం ఎగురేస్తావా” అని పిలుస్తున్నాడు.
సరే. . అని వకుళ గాంధీ దగ్గరనుండి ఎగురుతున్న గాలిపటపు దారాన్ని తన చేతిలోకి తీసుకుంది.
గాలి బాగానే వీస్తోంది. పతంగి జోరుగా దూసుకుపోతోంది రివ్ రివ్వున.
“మళ్ళీ వార్ రూం మీటింగ్ ఉందన్నావుగదా. వెళ్ళాలా. ?”అని అడుగుతున్నాడు గాంధీ.
“అవసరం లేదు గాంధీ. . వార్ రూంకు పోను. ఎందుకంటే అక్కడ వార్ జరగట్లేదు. అన్ని కాంప్రమైజ్ లే జరుగుతున్నాయి. ”
ఈ లోగా ఏమైందోగాని. . గాలి బలంగా, గట్టిగా వీచింది.
పుటుక్కున దారం తెగి. . గాలిపటం కొట్టుకుపోయింది.
వకుళ చేతిలో వట్టి తెగిన దారం మిగిలి. ,
దూరంగా. . ఆకాశంలో పల్టీలు కొడ్తూ. . తేలిపోతూ. . తెగిన గాలిపటం.
వకుళ చూస్తోంది నిస్సహాయంగా. . ఆకాశంలోకి. . గాలిపటం దిక్కు.

*** సమాప్తం***

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *