May 19, 2024

విపర్యయాలు – వేటూరి కథలు 2

రచన: వేటూరి సుందరరామమూర్తి

“ఇదిగో! ఇదే ఆఖరుసారి చెబుతున్నా, తర్వాత నన్నని ప్రయోజనం లేదు. గడువులోగా నాకివ్వవలసిన ఆరువేలూ అణాపైసల్తో సహా చెల్లించావా, సరి. లేదా నా పెళ్ళాం బిడ్డల్ని నీవు శపించి లాభం ఉండదు, జాగ్రత్త!”
చెప్పవలసిన మూడు ముక్కలు టకీమని చెప్పి వెనక్కి తిరిగాడు వీరభద్రం.
నడిరోడ్డు కెక్కిన బ్రతుకుతో, ముళ్ళకంచెపై దుప్పటి పడ్డవాడిలా కర్మవివశుడై నిగూఢంగా నిట్టూర్చాడు సూర్యం.
————–
“అమ్మాయి రాణీ! నువ్వు ఎప్పుడెళ్ళాలమ్మా కాలేజీకి.. ఎంత కట్టాలి? అసలు మొత్తం నీకెంత కావాలి? వీరభద్రం కూతుర్నడిగాడు.
“మూడు వందలు, టెరం ఫీజు కాకుండా ఈ నెలకు బట్టలు కావలసి ఉంటుంది నాన్నా, అంటూ జవాబిచ్చింది రాణి.
“అన్ని వందలే? ఏమిటే మహ లావు . ఎంతసేపు గుడ్డలు! దేనికైనా హద్దూ, అంతూ ఉండాలి. జార్జి కూతురు కూడా ఇలా ఉండి ఉండదు చదువుకునే రోజుల్లో ఇలా, ఈ సాటిన్ లూనూ. ఎక్కడి డబ్బూ చాలదు అందం ఉండి చావని గుడ్డలకు. ఏం పిదపకాలం వచ్చింది?” అన్నాడు వీరభద్రం.
రాణి నొచ్చుకున్నది. ఒకమాదిరిగా కళ్ళు తిప్పి సూది మొనల్లాంటి చూపులు పెట్టి, అయితే ఆడవాళ్ళ బట్టల్దగ్గర్నించీ, నగల్నించీ నీకక్కరలేనివేమీ లేవు! మూడు వందలకు బట్టలేం రావు మంచి హోదాగా బతకాలనుకుంటే. నీకింత కష్టం దేనికి? సరి అయిన బట్టల్లేక సాటివాళ్ళలో తలెత్తుకునెలా తిరగను? అక్కసునంతా మాటల్లోకి అనువదించింది రాణి.
కండువా విదిలించి భుజంపై పారేసి పైకం సోఫాలో పెడుతూ ” కానీండి ఇదిగో పైకం, నా మాటలు కాచుకోండి మీరంతా. రోజాలు పూయండి ఎట్లాగో” అంటూ బరువుగా వెళ్ళిపోయాడు.
“మీ నాన్న తీరే అంత!” అంటూ నోట్లు ఇచ్చి అమ్మాయిని అనునయించింది వర్ధనమ్మ.
చేతితో కట్టిన పాత జంపఖానా, గుండీకి బదులు ఒక పిన్నీసు పెట్టుకున్న కోటుతో చక్రవర్తి, కొత్త కాన్వాస్ మొదలైన టిప్ టాప్ సామాను కూలింగ్ గ్లాసెస్ తో రాణి మరునాడు ఉదయం బండికి వచ్చి థర్డ్ క్లాస్, ఫస్ట్ క్లాస్ లోనూ ఎక్కారు. బండి సాగిపోయింది నిశ్చలంగా.
చక్రవర్తిని రాణి అభిప్రాయము వ్రాసాము అని. దానిగురించి రాణి అభిప్రాయపడవలసిన అవసరము, అవకాశం లేకపోయాయి.
మద్రాసులో ఒకే కాలేజీలో ఉన్నారు ఇద్దరు. ఆ విషయం ఇద్దరికీ తెలుసు. కానీ ఇద్దరిదీ ఒకే క్లాస్ కాదు. చక్రవర్తి ఫైనల్ ఇయర్, రాణి బి.యే మొదటి ఏడాది.
అదే ఉత్సవాల్లో లైలా మజ్ఞూ నాటిక ప్రదర్శించాలని తల్చారు విద్యార్ధినాయకులు. మజ్ఞూ పాత్రధారిగా చక్రవర్తిని ముందే నిర్ణయించాడు సూత్రధారి. మేకప్ చేసి చూసి ” మై గాడ్, అచ్చం మజ్నూవే ఫో!” అంటూ జబ్బ విరక్కొట్టాడు మితృడు మోహన్ రావు.
“చక్రవర్తి ఎప్పుడూ ఇంత అందంగా కనిపించలేదు. వెలగల దుస్తులు వేస్తే అతను చక్రవర్తి లాగే ఉన్నాడు. బీదతనం అందాన్ని మక మకలాడిస్తుంది” అన్నది సరోజ – రాణితో కదూ అంది ప్రశ్నించే కనుపాపలతో.
ఈసుతో నిర్లక్ష్యంగా కళ్ళు చక్రవర్తి పైకి తిప్పిన రాణి లజ్జతో మోములు చేసే ఊసులతో కళ్ళు సరోజవైపు తిప్పింది. తర్వాత అదో లోకంలో నివసించడం మొదలెట్టింది రాణి.
దేహం ఇక్కడే వదిలి మరో లోకంలోకి బట్వాడా అయిన రాణి బుగ్గపై వేలితో కోపంగా పొడిచి మరీ అడిగింది మాలిని
“అక్కడ పిలుస్తున్నారు వినపడుతోందా? “అని.
రాణీ వెనుదిరిగి చూసేసరికి కాలేజీ విద్యార్ధి సంఘం నాయకుడూ, నాటక సూత్రధారీ అయిన ఫలానా రావుగారు ‘సదరు నాటకం విషయంలో లైలా పాత్రకు మిమ్మల్ని ముందే బుక్ చేసుకున్నా. వెనకాల అడగాలని వచ్చాం. ఇందుమూలంగా దానికి మీ అంగీకారం అడుగుతున్నాం కనక అది ముందే ఇచ్చేసినట్టు భావిస్తూ దానికి మీకు నమస్తే” అని తర్వాత కార్యక్రమంలోకి వెళ్ళిపోయాడు.
పెదవి దాకా వచ్చి ఆగిపోయిన అనేక అనుమానాల, అభ్యంతరాల మరీ కారణాల, భయాల తిరస్కారం పురస్కారంగా మారి నవ్వులు పువ్వొత్తిలా రాలువారాయి రాణీకి. మేకప్పులో చక్రవర్తిత్వం పెర పెరలాడుతున్న చక్రవర్తి చలించాడు ఒకింత. “వీరభద్రం కూతురు రాణీయా!”
“అవున్రా! అప్పుడే విషాద భంగిమా నువ్వూనూ, ఇహ పద నీ పోర్షన్ చదవాలి” అన్నాడో నేస్తం.
ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య సవాలక్ష ప్రేక్షకుల నవ్వొత్తుల మధ్య నాయికా నాయకులు రజత పాత్ర అందుకున్నారు ఉత్తమ నటనకు. కాలేజీలో ఉత్సవాలు దీపావళి లా వెలుగుతో వెలసిపోయాయి.
వీరభద్రం సూట్ ఫైల్ చేశాడు కోర్టులో. సూర్యం-ఫలానా తేదీలోగా బాకీ మొత్తం కక్కాలనీ లేకపోతే అటాచ్మెంట్ తప్పదనీ జడ్జి గర్జించాడు.
సదరు తేదీకి అన్నీ అయిపోయాయి. సూర్యం సూర్యచంద్రాదులు తోడుండే పాకలో కాపురం- బతకలేక బడిపంతులు ఉద్యోగం బరువుగా లాగుతూ.
ఇంట్లో వళ్ళు పట్టించుకుంటూ వీరభద్రం సూర్యం చెంబూ, తప్పేలా ఇల్లూ వాకిలీ వేలం వేసిన డబ్బంతా బాకీ కింద జమ కట్టించి గుమాస్తా రామనాధంతో “ఏమంటున్నారు తండ్రీ కొడుకూనూ?” అన్నాడు వైఖరిగా తన దెబ్బకు సూర్యం, చక్రవర్తీ ఏమనుకుంటున్నారో తెలుసుకుందామని.
భాగ్యవంతుల ఇళ్ళల్లో భాషాప్రవీణ రామనాధం చేతులు నలుపుతూ ” ఆ ఇంకా అనేదేముంది కొంపంతా చీకటయ్యాకా వాడింకా సూర్యమేమిటి? అన్నాడు దీర్ఘం తీస్తూ.
సింహంలా నోరంతా తెరిచి ‘హ హ హా అంటూ హాస గర్జన చేశాడు స్వీయ విజయగర్జనగా వీరభద్రం. కొంచం సేపు అలా గడిచింది.
‘చక్రవర్తిట, కొడుక్కు పేరు పెట్టాడు చూడు. దేనికి చక్రవర్తో? హడుక్కు తింటానికి అన్నాడు బొజ్జ నిమురుకుంటూ వీరభద్రం ఏవగింపు మొహంతో.
” అయ్యా, ఒక్క మాట. ప్రపంచం చూడండి అన్నీ విపర్యయాలూ, విపరీతాలూనూ. గ్లాసెడు మంచినీళ్ళు తెచ్చి పెట్టని పిల్ల పేరు గంగ! కానీలేని బిచ్చగత్తె పన్నెండో కూతురు పేరు రాజకుమారి- పట్టెడన్నం పెట్టి యెరగని మహాతల్లి అన్నపూర్ణ- యేదో విలోమానుబంధాలూ, విపర్యాయానువాదాలూనూ లోకం” అన్న రామనాధం పాండిత్య ప్రకర్షకు బొబ్బరింత పెట్టి నవ్వి ‘ అధ్భుతం” అని తలవిదిలించి కాంప్లిమెంటిచ్చాడు వీరభద్రం.
‘తన కూతురు నిజంగా రాణీయే’ అనుకున్నాడు సగర్వంగా తనలోతాను. “అన్నట్టు అమ్మాయి దగ్గర్నించి ఉత్తరాలు లేవేమిటో ఈ గొడవల్లో మరచాను”.
రామనాధం అందుకున్నాడు.
‘అమ్మాయి గారు మూడు లెటర్స్ రాసారండి వారం వారం తేడాతో- మూడు మూడు వందలు పంపమని- తొమ్మిది వందలు సదరు మేరకు దాఖలు చేశానండి మనీయార్డరుగా. ఈ గొడవల్లో పడి నేనూ మరచాను “అన్నాడు కంఠం కాళ్ళూ వణుకుతూ వినయం ప్రస్ఫుటమౌతున్న రామనాధం.
కాల్తున్న వళ్ళు పట్టించుకోలేక మండుతున్న ఉక్కు పిండంలా స్నానాల కొట్లోకి వెళ్ళి అవుతు ఖానా జీవం తీసేశాడు వీరభద్రం.
” ఆయన తత్వమే అంత, ఇవాల్టిదా” అని రామనాధంతో అంటూ మూతి విరుస్తూ వెనుదిరిగి లోపలికి వెళ్ళింది వర్ధనమ్మ.
ఒకనాడు వీరభద్రం పేరిట ఉత్తరం వచ్చింది. పరీక్షలకు అమ్మాయి హాజరు కాలేదని.. హాస్టల్ లో ఆమె ఉండటం లేదని.. పదిహేను రోజుల క్రితం ఖాళీ చేసిందని.
తెల్లబోయాడు వీరభద్రం. బావురుమంది వర్ధనమ్మ. కనుబొమలు ముడివేసి మరీ ఆలోచించసాగాడు రామనాధం. వర్ధనమ్మకు ధైర్యం చెప్పి, రామనాధం భార్యను ఆమెకు తోడుగా ఉంచి వీరభద్రం రామనాధం ఆదుర్దాగా బయలుదేరి వెళ్ళారు మూడుగంటల బండిలో మద్రాసుకు.
రైలు నడుస్తుండగా రామనాధం అన్నాడు. “మన సూర్యం కొడుకున్నాడే, వాడికైనా తెలీకుండా ఉంటుందంటారా ఏమిటో, ఏం జరిగిందో, ఎక్కడైనా అమ్మాయి కనిపించి అయినా ఉండదూ”
చటుక్కున ఏదో స్ఫురించిన వీరభద్రం ‘ లేకపోతే మన మీద పగ చేత ఆ దిక్కుమాలిన చక్రవర్తిగాడు ఏదైనా అత్యాచారం చేయించలేదు కదా” డగ్గుత్తికతో సందేహం వెలువరించాడు.
” ఛా ఛా వాడివల్ల అటువంటిదేం జరగదు. అయినా తల్లితండ్రులని కూడా పిలిపించాడట మద్రాస్. వాళ్ళు కూడా వెళ్ళి పక్షం రోజులవుతోంది” అంటూ చెప్పుకు రాసాగాడు.
‘ఏవిటో గొడవ’ అన్నట్టు వీరభద్రం కిటికీలోంచి బయటకు చూస్తూ కాసేపు ఆలోచించాడు.
ఆదుర్దాతో ప్రిన్సి పాల్ రూములో అడుగుపెట్టి, తొట్రుపాటుగొంతుతో తన విషయం వివరించి ప్రిన్సిపాల్ రాసిన ఉత్తరం ఏమిటని ప్రశ్నించాడు వీరభద్రం. ఆశతో, ఆచూకీల కొరకు రామనాధం కూడా కొన్ని ప్రశ్నలు వేశాడు. కాని ఇద్దరూ నిరుత్సాహంతో బయటకు వచ్చారు.
మళ్ళీ ఏదో జ్ఞాపకం వచ్చి రామనాధం లోపలకి వెళ్ళి బయటకొచ్చాడు. “చక్రవర్తి గాడు పరీక్షలు కూడా వ్రాసాడట” అన్నాడు వీరభద్రంతో. “ఐతే ఇప్పుడేమంటావ్” అన్నాడు వీరభద్రం. వాడింటి ఎడ్రస్ తీసుకున్నాను, పోదాం పదండి మాంబళం’ అంటూ దారి తీశాడు రామనాధం.
ఇంటి గేటు మూసి ఉంది. “చక్రవర్తి, సినీ ఆర్టిస్ట్’ అని బోర్డ్ ఉంది.
గేట్ దగ్గర తారాట్లాడుతూ ‘పెద్ద కాంపౌండూ, బంగళా వీడెవడో సినిమా యాక్టరు, ఛా వీడైఉండడు ‘ అనగానే గేటు వెనక భౌమన్న ఆల్సేషియన్ కుక్క అరుపుకు ఉలిక్కి పడ్డాడు వీరభద్రం. “కుక్కలున్నాయి జాగ్రత్త’ అని వత్తురు వత్తురు మంటూ రాసి ఉన్న బోర్డ్ చదివాడు రామనాధం.
ఇంతలో సింహద్వారంలోంచి సిల్కు లాల్చీ పైజామా వేసుకున్న యువకుడు మూర్తిగొన్న యువత లాగా, సుందరతి దగ్గరకు వచ్చి చూసి, గేటు తెరిచాడు. రామనాధం నిలువునా ఆశ్చర్యపోయి ” నేనెవరో”.. అనబోయాడు. “అదేమిటండి గుర్తు పట్టాను లెండి’ అంటూ నవ్వి ఆహ్వానించాడు యువకుడు.
వీరభద్రం వెనుతిరిగి చూసాడు. అవమానం, ఆశ్చర్యం, భయం మూడు ముప్పిరిగొని ఉక్కిరిబిక్కిరైపోయాడు. తలదించుకుని మెల్లిగా అడుగులు వేస్తూ వెళ్ళిపోబోయాడు. రామనాధం ఏమీ చేయలేక ఇటు యువకుడివైపూ, అటు వీరభద్రం వైపూ చూస్తూ నిలబడిపోయాడు. యువకుడు ఆశ్చర్యంతో చూస్తూ ఉండి పోయాడు. ఇంతలో ఒక పెద్ద ప్లిమత్ కారు నడిచి మెల్లిగా రెండడుగులు వేసిన వీరభద్రం ముందు వచ్చి ఆగింది.
కార్లోంచి దిగిన ఒక బక్కపలచటి పెద్దమనిషిని చూసి వీరభద్రం మరింత నివ్వెరపడిపోయాడు. అయిదు వేళ్ళకు తొడిగిన రాళ్ళ ఉంగరాలు ధధగ మని మెరుస్తుండగా వీరభద్రం భుజం పై చెయ్యి వేసి ” రండి వీరభద్రం గారూ” అంటూ లోపలకి ఆహ్వానించి తీసుకువచ్చాడు.
గేటు దగ్గర నిలుచుండిపోయిన యువకుడిని చూపిస్తూ “వీడెవరో మీకు తెలుసనుకుంటాను” అనాడు ఆ వ్యక్తి. గొంతు కాస్త సర్దుకుని ” మీ అబ్బాయి, నేను గుర్తుపట్టాను” అధోస్వరంతో అన్నాడు వీరభద్రం. కాదు, అయితే సరిగా గుర్తించలేదు. ప్రఖ్యాత సినీ నటుడు, లక్షా ధికారి. పూర్వాశ్రమంలో ఒక బడిపంతులు కొడుకు. పేరుకు మాత్రం “చక్రవర్తి” అని కొంచం ఆగి పరీక్షగా చూసాడు వీరభద్రం ముఖంలోకి ఆ పెద్దమనిషి.
అణువు అణువు తనువెల్లా మాటలు ఈటెలై బాధించగా ” సూర్యం అదృష్టవంతుడివి, నాకు ఈ జన్మలోనే బాగా బుధ్ధి చెప్పావు” అని గొణిగాడు తలవంచుకుని వీరభద్రం.
ఏమీ అర్ధం కాక తనను తను గిల్లి మరీ చూసుకుని మరీ చూస్తున్నాడు రామనాధం.
తిరిగి సూర్యం అందుకున్నాడు. అప్పటి చక్రవర్తి కాదు సుమండీ వీరభద్రం గారు. అన్నానికి లేనివాడు చక్రవర్తేమిటని మీరు నా ముఖాన్నే నిందించారు. కనుకనే మీ ముఖాన్నే నేనూ ఒక మాట చెప్పవలసి వస్తున్నది. నా కొడుకు ఈ నాడు మీ ఇంటికే చక్రవర్తి. మీ అమ్మాయి నా కోడలు.
ఈ మాటలు విని ఒక్కసారి గరిమనాభి తిప్పినట్లయింది వీరభద్రానికి. ఉప్పెనలో తెప్పమీద ఉన్నట్లు కళ్ళు తిరిగిపోయాయి.
“మంగళాశాసనం పొలిమేర దగ్గరనే అయిందిగా. సరే లోపలకి దయచేయండి బావగారూ. అమ్మాయినీ అల్లుడినీ దీవించండి ” అంటూ సూర్యం దారితీశాడు భావగర్భితంగా.
వెంటనే వెనకనించి రామనాధం అన్నారు. ‘ఇంత ఆస్తిపరులై కట్నం ఆశించలేదు సరికదా, ఉన్న చెంబూ తప్పేలా కూడా ఎదురిచ్చి చేసుకున్నట్లయింది’ అన్నాడు. వీరభద్రం ‘దౌ టూ బ్రూటస్’ అన్నప్పటి సీజర్ ముఖం పెట్టి రామనాధం ఆయన అన్నది చాలక నువ్వు కూడానా’ అన్నాడు సినిమాలో నటుడిలాగ.
అమ్మాయిని వెతుక్కుంటూ వచ్చి ఒక గొప్ప ఇంటి కోడలిగా చూసిన ఆనందంతో వీరభద్రం, విపర్యయ సిద్ధాంత ప్రవక్త రామనాధం ఇల్లు చేరుకున్నారు మర్నాడు.
మర్నాడు ఒళ్ళు పట్టించుకుంటూ వీరభద్రం ” నీ విపర్యయ సిద్ధాంతం వీగిపోయిందోయ్ రామనాధం, దానిప్రకారం చక్రవర్తి ఏమీ లేని వాడు కావాలి. ఆ కార్లలో షికారు చేసేవాడు ఎలా అవుతాడు? ” అన్నాడు సల్లాపంగా.
“లంకంత మీ కొంపకు వాడు చక్రవర్తి అయ్యాడే. బ్రతకలేక బడిపంతులు కొడుకు విపర్యయం కాదుటండీ” అన్నాడు రామనాధం.
“మరి వాళ్ళ పెళ్ళి మన అంతస్థుకు తగ్గట్టు చేద్దామండీ- ఆ రిజిష్ట్రీ పెళ్ళితో సరిపెట్టుకోక. ఒక్కగానొక్క పిల్ల మనకు ” అంది వర్ధనమ్మ.
“చిన్నపిల్లలు పెద్దవాళ్ళకు బాగా బుధ్ధి చెప్పారు. ఓడలు బళ్ళూ, బళ్ళు ఓడలూనూ. సదరు కధ అంతా విపర్యయాలూ, విడ్డూరాలూనూ” అని గొణుక్కుంటూ మెట్లు దిగి ఇంటికెళ్ళాడు రామనాధం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *