May 19, 2024

ఆరాధ్య – 12

రచన: శ్రీమతి అంగులూరి అంజనీదేవి

”నాకు ఆఫీసు నుండి ఇంటికొచ్చేటప్పటికే ఆ ట్రాఫిక్‌ జామ్‌లో రాత్రి 8, 9 కి తక్కువ కావటం లేదు. అప్పటికే అలసిపోతున్నాను. అందుకే షాపింగ్‌ చెయ్యలేదు. నా రిసెప్షన్‌ చీర కడతాన్లే! ఇవ్వు” అంది.
”ఇంటికి కలర్స్‌ వేసేటప్పుడు సామాన్లన్నీ సర్దుతూ ఆ చీర వున్న కవరు ఎక్కడ పెట్టానో ఆరాధ్యా! గుర్తు రావడం లేదు. మీ అక్కయ్యల దగ్గర కాస్ట్లీ డ్రస్‌లు వున్నాయి. అడిగితే ఇస్తారు. అవి వేసుకుంటావా?”
”వాళ్ల సైజెక్కడ! నా సైజెక్కడ! వాళ్లు నాకన్నా లావుగా వుంటారని నీకు తెలియదా?” అంటూ సుడిగాలిలా వెళ్లి చీరకోసం ఇల్లంతా వెతికింది ఆరాధ్య. చీర వున్న కవరు కన్పించలేదు. బీరువా పక్కన కంప్యూటర్‌ పెట్టే పాత బల్ల కూడా కన్పించలేదు. డౌటొచ్చి ఇంటి వెనకాల వుండే జామచెట్టు దగ్గరకి వెళ్లింది. అక్కడ నేలంతా మట్టి, రాళ్లు వుంటాయి. చెప్పులు లేకుండా నడవలేం. సునీల్‌ పెళ్లి వల్ల ఇంట్లో పనికి రాని సామాన్లన్నీ అక్కడికి చేరి గుట్టలు, గుట్టలుగా వున్నాయి. ఆ గుట్టల్లో ఎక్కడని వెదకాలి? అటు ఇటు చూసింది. ఎదురుగా వున్న ఆ పాత బల్లకిందనే వుందా కవరు. ఆ కవర్ని తను ఈజీగా గుర్తుపట్టింది. వెంటనే వంగి అందుకొని, ఓపెన్‌ చేసి చీరను బయటకు తీసింది.
అప్పుడెప్పుడో విప్పి మడతేసి కవర్లో పెట్టిన చీర కావటం వల్లనో ఏమో చీర బాగా వాసన వస్తోంది. వెంటనే కవర్లో పెట్టేసింది.
ఇప్పుడు తనేం చెయ్యాలి? కళ్యాణి ఆంటీ అడిగితే ఏం చెప్పాలి? ఆమె పక్కనే వున్న శార్వాణి ఆంటీ కూడా కళ్యాణి ఆంటీ చెప్పింది విన్నది. ఆమె ఏమనుకుంటుంది? అయినా తన తల్లి ఈ ఒక్క చీరను జాగ్రత్త చెయ్యలేకపోయిందా? డ్రైక్లీనింగ్‌కి ఇచ్చి బీరువాలో పెట్టివుంటే బావుండేది కదా! తనకు లగేజి ఎక్కువవుతుందని ఈ చీరను పట్టించుకోలేదు. పైగా తనకంటూ ఓ స్థిరమైన ప్లేస్‌ లేదు… ఆరాధ్యకు కళ్లలో నీళ్లు రావడం లేదు. నేరుగా తల్లిని వెదుక్కుంటూ వెళ్లింది.
రమాదేవి ఆమె హడావుడిలో ఆమె వుంది. కోడలికి తాము కొన్న పెళ్లి చీరల్ని పెళ్లికి వచ్చినవాళ్లకి చూపించి వాటిని జాగ్రత్తగా బీరువాలో పెడుతోంది.
”ఇంత ఖరీదైన చీరల్ని మనలో ఇంతవరకు ఏ కోడలికి కొనలేదు. రమాదేవికి తన కోడలంటే ఎంత ప్రేమో చూడు…” అన్నారెవరో.
”ప్రేమ ఎందుకుండదు… కోడలేమైనా పరాయిదా? కూతురులాగా ఏదో అంత ఇస్తే తీసుకొని బయటకి పోయేదా? ఇంటి పేరును సొంతం చేసుకొని వంశాన్ని నిలబెట్టేది కోడలే కదా! అందుకే రమాదేవి తన కోడలు అందరి కోడళ్లకన్నా ఘనంగా వుండాలని ఇంత ఖరీదైన చీరల్ని కొన్నది” అన్నారు వాళ్ల పక్కన వున్నవాళ్లు. అలాటి చీరల్ని ఎప్పుడూ చూడనట్లు వాళ్ల కళ్లు వెలిగిపోతున్నాయి.
అదంతా విన్నది ఆరాధ్య. వెంటనే వాళ్ల ముందుకెళ్లి తన చీరను, చీర నుండి వస్తున్న వాసనను చూపించి ”మీరుకూడా మీ కూతుళ్లను ఇలాగే చూస్తారా? కట్టుకునే చీర తీసికెళ్లి ఇంటి వెనకాల పడేస్తారా? ఎప్పటికైనా వెళ్లిపోయేదనేగా కూతురంటే ఇంత నిర్లక్ష్యం మీకు… మీరసలు అమ్మ మనసున్న ఆడవాళ్లేనా? మీలాంటి వాళ్లు ‘అమ్మ’లో వుంటారని తెలిస్తే ఏ ఆడపిల్లా అమ్మను నమ్మదు” అని అరవాలనుకుంది. అలా అరిస్తే తమ్ముడి భార్య వైభవాన్ని చూడలేక పిచ్చిపట్టి ఏదేదో అంటుందనుకుంటారు. అలాంటి అవకాశం వాళ్లకిచ్చి తను అవమాన పడకూడదు.
అందుకే ”మమ్మీ! కొంచెం ఇలా వస్తావా?” అంటూ పక్కకి పిలిచింది ఆరాధ్య. రమాదేవి వెంటనే బీరువా డోర్‌ మూసి ఆరాధ్య దగ్గరకి వెళ్లింది.
”నువ్వు నా కన్నతల్లివా? పెంచిన తల్లివా? దీన్ని డ్రైవాష్‌కి ఇవ్వాలని తెలియదా? ఇప్పుడు నేనేం కట్టుకోవాలి? నలుగురిలో ఎలా తిరగాలి? సునీల్‌ పెళ్లికి మీ అందరు తీసుకున్నట్లే నాకెందుకు కొనలేదు చీర?” అంది.
ఆమె ఎప్పుడూ పోనంతగా బిత్తరపోయి ”నువ్వు కొనుక్కుంటావనుకున్నా ఆరాధ్యా! ఇందులో నా తప్పేంలేదు” అంది.
కొంచెం దూరంలో నిలబడి వున్న ఆరాధ్య బాబాయ్‌ కూతురు అవంతి ఈ మాటల్ని విని ఆరాధ్య దగ్గరకి వచ్చి, భుజాన్ని గట్టిగా పట్టుకొని ”పెద్దమ్మనెందుకే అలా నిలదీస్తావ్‌! నిన్ను నేను మేకప్‌ చేస్తాను రా! అసలు నీకు చీరలేం బాగుంటాయే! మాకన్నా చిన్నదానివి. డ్రస్‌ వేసుకో! మాలాగే వుంటావ్‌!” అంటూ డ్రస్సింగ్‌ రూంలోకి తీసికెళ్లి డోర్‌ పెట్టింది. అప్పటికే నలుగురు అమ్మాయిలు ఆ గదిలో మేకప్‌ అవుతున్నారు. ఎక్కడ చూసినా పెళ్లి జనమే! ఇంత జనం ఆరాధ్య పెళ్లికి రాలేదు.
”అవంతక్కా! చూశావుగా! మావాళ్లంతా హోటల్‌కెళ్లారు. మేము రాకముందే హోటల్‌లో రూం బుక్‌ చేయించాలని మా మమ్మీకి, డాడీకి తెలియదా? సునీల్‌తో చెబితే చెయ్యడా? అల్లుడి మర్యాదలు ఇలాగేనా చేసేది?” అంది ఆరాధ్య.
మొన్నటి వరకు వాళ్లెవరో నేనెవరో అన్నట్లున్న ఆరాధ్య ఇప్పుడు కొత్తగా వాళ్లను మావాళ్లు అనటం వింతగా వుంది అవంతికి…
”పెళ్లిలో ఇలాంటివి పట్టించుకోవద్దు ఆరాధ్యా! ఇప్పటికే పెద్దమ్మ, పెద్దనాన్న చాలా టెన్షన్‌ పడుతున్నారు. నువ్విప్పుడు ఏమన్నా వాళ్లు ఇబ్బంది పడతారు. మనం వుండేది వాళ్లను ఇబ్బంది పెట్టానికా?” అంది.
”అది కాదు అవంతక్కా! సునీల్‌ చాలా మారాడు కదూ!”
”మారింది మనిషా! లేక ఇంకేమైనానా?”
ఆరాధ్య నవ్వి ”ఏమో! నాకైతే సునీల్‌ బాగా మారిపోయినట్లు అన్పిస్తున్నాడు”
”నీకెలా అన్పిస్తే అలా అనుకో! వద్దని ఎవరంటారు. నీ ఆనందమే నీకు ముఖ్యం కదా!”
”అక్కా! నన్నెందుకో మీరందరు పరాయిదాన్ని చూసినట్లు చూస్తున్నారు. నాకు తెలసిపోతోంది” అంది ఆరాధ్య.
”ఛ…ఛ అదేం లేదులే ఆరాధ్యా. నువ్వలా అనుకోకు” అంది అవంతి.
”ఎందుకనుకోను. నాకు మా పేరెంట్స్ కావాలనే అబార్షన్‌ చేయించారని మీరంతా ఒకటై ప్రచారం చేశారటగా! తెలిసింది. మా డాడీ ఎంత బాధపడ్డాడో తెలుసా?” అంది సడన్‌గా ఆరాధ్య.
ఆ మాటతో అవంతికి కోపం వచ్చింది.
”నువ్వు మాత్రం తక్కువా! మా అక్క తను చదువుతున్న కోర్స్‌ నచ్చక వేరే కోర్స్‌లోకి వెళ్లగానే అక్కడేదో జరిగి, అబార్షన్‌ జరిగి కోర్స్‌ మారిందని ప్రచారం చెయ్యలేదా? మేము నీ అంత దారుణంగా ఏం చెప్పలేదులే! నీలాగా చెప్పాలంటే నీకు పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ వచ్చిందని, అందుకే అబార్షన్‌ చేయించారని చెప్పగలం… అలా చెప్పామా?”
”మీ అక్కను వాడెవడో అంటే నేనన్నానని అంటున్నావేమక్కా?”
”వాడు క్యారెక్టర్‌ లెస్‌ క్యాండిడేట్ అని మనందరికి తెలుసు. వాడి నోటికి అలాంటి మాటలే వస్తాయి. వాడు అలాగే వూహించి అంటాడు. ఆ పాపం వాడికి వూరికే పోదు. అనకూడదు కాని ఢిల్లీలో ‘నిర్భయ’కు పట్టిన గతే వ్యూచర్లో వాడి కూతురికి కూడా పడుతుంది. కానీ నువ్వు చేసిందేంటి? నువ్వేమైనా తక్కువ చేశావా? వాడికన్నా నువ్వే డేంజర్‌! వాడు అలా అంటున్నాడని తెలియనివాళ్లకి కూడా తెలిసేలా చేశావ్‌! అది నీక్కూడా అక్క కదనే! ఇదేనా! అక్క మీద నువ్వు చూపించే ప్రేమ! ఇలాగే వుంటారా అక్కాచెల్లెళ్లు? నువ్వొక్కదానివే మనశ్శాంతిగా వుండి మేమంతా తప్పు చేసినవాళ్లలా వుండాలా? అందుకే నిన్ను కూడా అన్నాం! నీ రహస్యాలను మేము మాత్రం ఎందుకు కడుపులో పెట్టుకుంటాం! మాకు తోచింది మేము కూడా అనగలం” అంటూ అలిగి ఆ గదిలోంచి బయటకెళ్లిపోయింది అవంతి.
అవాక్కయింది ఆరాధ్య. కళ్లవెంట కన్నీళ్లు టపటప రాలాయి. తల పట్టుకొని, తనకి ఎవరి వల్లా మనశ్శాంతి లేదనుకుంది. నిజానికి అవంతి అక్కయ్య గురించి ప్రచారం చేసింది ఆరాధ్య కాదు. సీతాలమ్మ, రమాదేవి. రమాదేవికి ఎప్పుడు చూసినా తోడికోడళ్ల పిల్లలంటే ఈర్ష్య.. కుళ్లు… అది అటు తిరిగి ఇటు తిరిగి ఆరాధ్య మీదకి వచ్చింది.
ఆరాధ్య మేకప్‌ పూర్తయి గదిలోంచి బయటకొచ్చింది.
హేమంత్‌ ఆరాధ్యకు ఫోన్‌ చేసి ”మేము హోటల్‌ నుండి నేరుగా కళ్యాణ వేదిక దగ్గరకి వెళ్తున్నాం! మాకోసం వెయిట్ చెయ్యొద్దు. నువ్వు సునీల్‌తో రా!” అన్నాడు.
”అలాగే!” అంది ఆరాధ్య.
సునీల్‌ ఇంటి దగ్గర నుండి పక్క సిటిలో వున్న కళ్యాణవేదిక దగ్గరకి బయలుదేరినప్పటి నుండి అతని కారులోనే వుంది ఆరాధ్య. అతని కారులో ఒక్క ఆరాధ్యనే కాదు. అవంతి వాళ్లు కూడా వున్నారు. వాళ్ల కారు కళ్యాణవేదిక చేరుకుంది. పెళ్లికొడుకు గెటప్‌లో వున్న సునీల్‌ కళ్లు జిగేల్‌మనేలా మెరిసిపోతున్నాడు. పెళ్లికూతురు కూడా అలాగే వుంది. పెళ్లికూతురు ఒంటిమీద బంగారు నగలు దగదగమని మెరిసిపోతూ తమ స్వచ్ఛతను చాటుతున్నాయి.
పెళ్లి జరుగుతోంది. ఆ వాతావరణం, ఆ అరేంజ్‌మెంట్స్ లక్షల రూపాయలను తలపింపజేస్తున్నాయి. కోటీశ్వరుల పెళ్లి అని చెప్పకనే చెబుతోంది.
ఉపేంద్ర, హేమంత్‌, శార్వాణి, కళ్యాణి, సృజిత్‌ ముందు వరసలో కూర్చుని ఆ పెళ్లిని చాలా ఆసక్తిగా చూస్తున్నారు.
ఇద్దరు పురోహితులు మంత్రాలు చదువుతూ వధూవరుల తలల మీద మంచి ముహూర్తంలో జీలకర్ర బెల్లం పెట్టించారు. మాంగళ్య ధారణ, సప్తపది, అరుంధతి, అప్పగింతలు జరిగిపోయాయి. పెళ్లికూతురు అమ్మా, నాన్నల దగ్గర సెలవు తీసుకొని వచ్చిన వాళ్లంతా తమ కార్లలో వెళ్లిపోతున్నారు. దగ్గరి బంధువులు మాత్రం మిగిలిపోయారు.
పెళ్లిలో హారతి పట్టిన ఆరాధ్యకు హారతిపళ్లెంలో ఐదువందల రూపాయల నోటు ఒకి పెట్టాడు సునీల్‌. ‘అంతేనా! నువ్విప్పుడు కోటీశ్వరుడివి’ అని ఎవరో అంటే నవ్వి వూరుకున్నాడు. రమాదేవి మురిసిపోతూ ‘దాన్ని మనం ఐదు లక్షలు అనుకోవాలి’ అంది.
”అనుకోగానే ఐదు లక్షలు అయిపోతాయా రమా?” అంది సీతాలమ్మ.
ఆ ఆనందం చూసి ”పోన్లే రమా! నువ్వు నీ కూతురు పెళ్లిలో చెయ్యలేని సాంగ్యాలన్నీ మీ వియ్యంకుల పుణ్యమా అని నీ కొడుకు పెళ్లిలో చూసుకున్నావ్‌! ముహూర్తానికి పెళ్లి చెయ్యటమంటే ఎలానో కూడా తెలుసుకున్నావ్‌! నువ్వు ఆరాధ్య పెళ్లిలో చెయ్యని కన్యాదానం, అప్పగింతలు కూడా వాళ్లు చేశారు. నువ్వు ఆరాధ్య పెళ్లి చేసినట్లు ఏదో జరిగిందంటే జరిగిందనిపించలేదు. నేను దగ్గరుండి అన్నీ చూస్తూనే వున్నానుగా!” అంది సీతాలమ్మ.
”ఇప్పుడవన్నీ ఎందుకు గుర్తుచేస్తావ్‌ వదినా! అదసలే నామీద కోపంగా వుంది. విన్నదంటే నన్ను చంపినా చంపుతుంది. అవన్నీ నేను కావాలనేమైనా చేశానా? నీకు తెలుసో లేదో అది పుట్టింది రాహుకాలంలో… అందుకే దాని పెళ్లి రాహుకాలంలో జరిగింది. ఇక దాన్ని వదిలెయ్‌!” అంది రమాదేవి.
”వదిలెయ్యక నేనేమంటున్నాను రమా! ఇంత పెళ్లి చేశావ్‌! కోటీశ్వరుల సంబంధం. ఎంతో కాలంగా నిన్నే కనిపెట్టుకొని ఇంటి పనంతా చేస్తున్నాను. నాక్కాస్త మంచి చీర, మీ అన్నయ్యకి చొక్కా, ప్యాంటు తెచ్చావా? లేదే వదిలెయ్యక నేనేమన్నాను” అంది.
”నువ్వేమీ అనకు వదినా! నీకు, అన్నయ్యకు ఈ పెళ్లి హడావుడి తగ్గగానే సునీల్‌ని అడిగి కాస్త ఖరీదైన బట్టలే తెప్పించి పెడతాను” అంది రమాదేవి. ఎవరైనా వింటారేమోనని చుట్టుపక్కల చూసింది. సీతాలమ్మ నోరు అంత చిన్నదేం కాదు. అక్కడున్నవాళ్లకి విన్పిస్తూనే వున్నాయి.
అక్కడెవరో చాలా ఆసక్తిగా ఆరాధ్యవైపు చూసి ”ఈ అమ్మాయి సునీల్‌ అక్కయ్యకదూ! చాలా బావుంది. సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేస్తోందట కదా! వాళ్ల హజ్బెండ్‌ కూడా అదే జాబ్‌ చేస్తున్నాడట. అందుకే బాగా సంపాయించినట్లున్నారు. ఒంటినిండా ఎన్ని బంగారు నగలో చూడు. చాలా లేటెస్ట్‌ మోడల్లో వున్నాయి” అంటున్నారు.
ఆ కాంప్లిమెంట్ ని విని తట్టుకోలేకపోయింది అవంతి. ఆమె పైకి మామూలుగానే వున్నా సమయం వచ్చినప్పుడు బుసకొట్టాలని పొంచి వుంది. వెంటనే వాళ్ల దగ్గరకి వెళ్లింది.
కళ్లూ, నోరూ చిత్రంగా తెరిచి ”ఆంటీ! మా ఆరాధ్య పెట్టుకున్న నగలు ఫ్యూర్‌ గోల్డ్‌వి కావు. చూడానికి బంగారంలా అన్పిస్తున్న ఒన్‌గ్రాం గోల్డ్‌వి… అవి బయట దొరుకుతాయి… సునీల్‌ వాటిని హైదరాబాదులో తెచ్చాడు. ఆరాధ్య తన పెళ్లిలో అవే పెట్టుకుంది”
”పెళ్లిలో అవి పెట్టుకుందా? పెళ్లిలో అలా ఎవరైనా పెట్టుకుంటారా? మీ పెద్దమ్మ ప్యూర్‌ గోల్డే పెట్టుకుందిగా! కూతురికి గోల్డెందుకు పెట్టలేదు? ఇంకెప్పుడు పెడుతుందట?” ఆశ్చర్యపోతూ అన్నారు.
పక్కనే వున్న సీతాలమ్మ అందుకొని ”పెడుతుంది. పెడుతుంది. ఎందుకు పెట్టదు? ఈ పెళ్లి హడావుడి కాస్త తగ్గితే!” అంది ఎగతాళిగా.
ఆ మాటలు అక్కడే వున్న రమాదేవితోపాటు ఆరాధ్యను కూడా గుచ్చుకున్నాయి. అక్కడ వుంటే ఇంకా ఏం వినాల్సి వస్తుందోనని పక్కకి వెళ్లారు. బంధువుల్లో ఇలాంటి మాటలు వస్తాయనే హేమంత్‌ సేవింగ్స్‌ మొత్తం గోల్డ్‌ కోసం ఇప్పించింది కళ్యాణమ్మ. ఆమెది ముందుచూపు. ఇప్పుడు తెలుస్తోంది ఆరాధ్యకు గోల్డ్‌ విలువ. హేమంత్‌ విలువ.
ఒంటరిగా కూర్చుని చాలాసేపు ఆలోచించింది ఆరాధ్య. తల్లి దగ్గరకి వెళ్లి ”మమ్మీ! మేమిక బయలుదేరుతాం!” అంటూ లోపలకి ఎవరూ రాకుండా డోర్‌ పెట్టింది.
”అప్పుడేనా? మీవాళ్లేరి?” అంది రమాదేవి.
”మావాళ్లు నీకిప్పుడు కన్పించరు. వాళ్లేమైనా కోటీశ్వరులా?”
”ఏంటే! అలా మాట్లాడుతున్నావ్‌! మనమేమైనా పరాయివాళ్లమా! అవంతీ, సీతాలొదిన మాట్లాడినట్లు మాట్లాడుకోటానికి? అమ్మా, బిడ్డలమే!” అంది.
నాకది తెలుసు మమ్మీ! అందుకే నాకేదైనా పెట్టాలనుకుంటే పెట్టు. ఆడపిల్లను కదా! తమ్ముడి పెళ్లికెళ్లి ఏం తెచ్చుకున్నావని ఎవరైనా అడిగితే చూపించాలి కదా! పుట్టింటివాళ్లు ఆడపిల్లకి ఇచ్చే గౌరవాన్ని బట్టే అత్తింట్లో మర్యాద పెరుగుతుందని ఈ మధ్యనే తెలుసుకున్నాను. ఎంత సాఫ్ట్‌వేర్‌ అమ్మాయినైనా నాక్కూడా అలాంటి మర్యాదలు కావాలనిపిస్తాయి కదా! సోషల్‌ రిలేషన్స్‌ లేకుండా ఎన్నిరోజులు?”
”ఇవి నీమాటలు కావు. నీకెవరో నేర్పారు”
”నాకెవరు నేర్పుతారు మమ్మీ! నేనేమైనా చిన్నపిల్లనా?”
”ఇన్నిరోజులు చిన్నపిల్లవనే అనుకున్నాను ఆరాధ్యా! కానీ నువ్విప్పుడు చిన్నపిల్లవు కావు. ఆ ఉపేంద్ర, శార్వాణి కలిసి నిన్ను కొత్తరకంగా తయారు చేసిపెట్టారు. లేకుంటే ఎప్పుడైనా నాకది పెట్టు, ఇదిపెట్టు అని అడిగావా? ఒకవేళ నేను బ్రతిమాలి పెట్టినా ఇవన్నీ ఎక్కడ పెట్టుకోవాలి? అని ఇక్కడే వదిలేసి వెళ్లేదానివి…”
”అది ఒకప్పుడు. నాకు పర్మినెంట్ షెల్టర్‌ లేనప్పుడు. ఇప్పుడు సునీల్‌ పెళ్లి పుణ్యమా అని హేమంత్‌ దగ్గరకి వెళ్లానుగా! మరి సునీల్‌ పెళ్లయిపోయింది. హేమంత్‌ దగ్గర వుండేదెందుకు? మళ్లీ నా ఫ్రెండ్స్‌ దగ్గరకే వెళ్లి వుండమంటావా?”
ఈసారి వూహించని విధంగా ఖంగుతిన్నది రమాదేవి.
”చెప్పు మమ్మీ! హేమంత్‌ దగ్గర వుండమంటావా? నా ఫ్రెండ్స్‌ దగ్గరకెళ్లి వుండమంటావా? నువ్వెక్కడ వుండమంటే అక్కడ వుంటాను. ఎందుకంటే నాకంటూ సొంత ఆలోచనలు, సొంత తెలివితేటలు ఎక్కడివి? పుట్టినప్పటి నుండి నిద్రపోవటం, కాలేజీకెళ్లటం, ఇప్పుడేమో ఆఫీసుకెళ్లటం. అది తెలిసే కదా నిన్న మొన్నటి వరకు నీ చేతుల్తోనే అన్నం కలిపి నా నోట్లో పెట్టేదానివి. అది ప్రేమనుకునేదాన్ని… ఇప్పుడలా అన్పించడం లేదు. నా చేతుల్తో నన్ను తిననిస్తే నాలుగు ముద్దలు ఎక్కువ తింటానేమోనన్న భయంతో అలా చేసేదానివనిపిస్తోంది” అంది.
వినలేనట్లు చెవులు మూసుకుంది రమాదేవి.
”ఒక్కరోజన్నా హేమంత్‌ని బాగా చూసుకోమని, హేమంత్‌తో బాగుండమని చెప్పావా మమ్మీ? తల్లి మనసున్న ఏ స్త్రీ అయినా కూతురికి పెళ్లయ్యాక చెప్పే మొట్టమొదటి మాటలు ఇవి. అలా చెప్పే తల్లులు లేకనే చాలామంది అమ్మాయిలు తమ భర్తల్ని మనస్ఫూర్తిగా తన లైఫ్‌లోకి స్వీకరించలేకపోతున్నారు. నేను చేసిన పని కూడా అదే! ఇప్పుడు బాగుందా నీకు?”
రమాదేవి తల కిందకి వాలిపోయింది.
”మమ్మీ! ఒక అమ్మాయి తల్లిదండ్రుల దగ్గర ఏం కోరుకుంటుంది?” అడిగింది ఆరాధ్య.
ఏం చెబితే ఏమో అన్నట్లు బిక్కచచ్చిపోయి చూస్తోంది రమాదేవి.
”నాకు తెలిసి నేను మిమ్మల్నేమీ కోరలేదు. మీ పరిస్థితులకి అనుగుణంగానే నా కోరికల్ని నేను మలచుకున్నాను. ఎక్కడైనా ఆడపిల్ల పుడితే అభిమానంగా పెంచటం, చదివించటం, పెళ్లి చెయ్యటం, చట్టవిరుద్ధం అయినా సరే కట్నం రూపంలో కొంత డబ్బును ఇవ్వటం తల్లిదండ్రులు తమ బాధ్యతగా భావిస్తారు. కొడుకులకి లేకపోయినా పర్వాలేదు కూతుర్ని ఒక ఇంటికి పంపుకోవాలని ఎంతో ప్రేమగా తాపత్రయపడతారు. అత్తగారింట్లో అందరూ తమ కూతుర్ని గౌరవంగా, విలువగా చూసుకోవాలని కట్నకానుకల్ని అనుకున్న దానికన్నా ఎక్కువగానే అర్పించుకుంటారు. తమ దగ్గరకన్నా అల్లుడి దగ్గరే ఎక్కువ జీవితకాలం తన బిడ్డ వుంటుంది కాబట్టి అల్లుడ్ని గౌరవిస్తారు. అందుకే ఆడపిల్లకి మగపిల్లలతో సమానమైన ఆస్తిహక్కు వున్నా దాని గురించి ఏ ఆడపిల్లా ఆలోచించదు. అలా ఆలోచించాల్సిన అవసరం ఏ తల్లిదండ్రులు ఆడపిల్లకి రానివ్వరు. కానీ ఇస్తామన్నవి కూడా ఇవ్వకుండా, ఎప్పుడో ఇస్తామని రోజులు దాటేస్తూ, అసలేమీ ఇవ్వకుండానే ఎంతో ఇచ్చామని ప్రచారం చేసుకునే మీలాంటి వాళ్లు వుంటే ఆడపిల్లలకి అత్తగారింట్లో పరువు వుంటుందా? విలువ వుంటుందా? అసలు చాలామంది ఆడపిల్లలు అత్తగారింట్లో ఉరేసుకొని చనిపోతున్నారంటే మీలాగా బిజినెస్‌ మైండ్‌ వుండే తల్లిదండ్రులే కారణం… అది తెలియక అనవసరంగా అత్తమామల్ని, ఆడపడుచుల్ని దోషుల్ని చేస్తున్నారు. అసలు నేరస్థుల్ని వదిలేస్తున్నారు” అంది ఆరాధ్య.
”ఏంటే ఆరాధ్యా! నీ మాటలు? మేము నేరస్థులమా?” అని అనలేకపోతోంది రమాదేవి.
”నా మాటలు నిన్ను బాధపెడతాయని నాకు తెలుసు మమ్మీ! కానీ నీ తల్లిదండ్రులు నీకు నీ భర్తను వదిలెయ్యమని ఎప్పుడైనా చెప్పారా? మరి నువ్వెందుకు నన్ను హేమంత్‌ని వదిలి నా ఫ్రెండ్స్‌రూంలో వుండమనే దానివి? నీకుండే విలువలు, కుటుంబ బంధాలు నాకొద్దా? ఉద్యోగం చేస్తున్నంత మాత్రాన వాటికి దూరంగా వుండాలా? అలా ఒంటరిగా బ్రతకాలంటే బయట ఎన్ని బాధలు పడాలో నీకు తెలుసా? డబ్బు సంపాదనే ముఖ్యమనకున్నప్పుడు నాకు పెళ్లి చెయ్యటం ఎందుకు? హేమంత్‌ అనే అబ్బాయిని నా జీవితంలోకి రప్పించటం ఎందుకు? మమ్మల్నిద్దర్ని కలపటం ఎందుకు? కలిపాక ప్రెగ్నెన్సీ రాదా? వచ్చాక ఏ తల్లి అయినా కూతుర్ని అక్కున చేర్చుకొని ఎంతో గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటుంది. మరి నువ్వేం చేశావ్‌?
నాతో ఏం చెప్పావ్‌! ఒక్కసారి గుర్తు తెచ్చుకో! డ్రస్‌లు పట్టవని, అందం పోతుందని ఆడవాళ్లు పిల్లల్ని కనరా? పిల్లల్ని కని అందం తగ్గితే భర్తలు వదిలేస్తారా? అలా వదిలేసిన భర్తలు కాని, అందం తగ్గిన ఆడవాళ్లు కాని మన వీధిలో ఎవరైనా వున్నారా? అసలే మాది ఫాస్ట్‌ జనరేషన్‌! అందం తగ్గితే ఎంజాయ్‌ చెయ్యలేమని, తల్లిదండ్రులకి తెలియకుండా రహస్యంగా అబార్షన్లు చేయించుకుంటున్నారు. కన్నతల్లివి నువ్వే నాకు దగ్గరుండి అబార్షన్‌ చేయించావ్‌! ఏ తల్లి అయినా ఇలా చేస్తుందా? నువ్వెందుకలా చేశావ్‌?”
అప్పుడు నోరెత్తింది రమాదేవి ”నీకోసం, నీ సౌకర్యం కోసం, నీ ఉద్యోగం కోసం, నువ్వు ఎదగడం కోసం నువ్వు కష్టపడకుండా వుండడం కోసం అంతా నీకోసమే చేశాను. అయినా నీకు కృతజ్ఞత లేదు” అంది.
”ఎదగడం అంటే నీ దృష్టిలో అదే అయితే అది నాకొద్దు. ఎదగడం ఒక్కటే సక్సెస్‌ కాదు. విలువలు కూడా వుండాలి. నీ తల్లిదండ్రులు నీకే విలువలు నేర్పారో నాక్కూడా అవే నేర్పాల్సింది. కొత్తవి ఎందుకు? ఏ తల్లి అయినా తన మనసును చనుపాలకన్నా స్వచ్ఛంగా వుంచుకోగలిగితేనే పిల్లల్ని కనాలి. లేకుంటే వద్దు. ఎందుకంటే పిల్లలకి కన్నతల్లే కోచింగ్‌ సెంటర్‌! తల్లిని మించిన విశ్వవిద్యాలయం ఈ ప్రపంచంలోనే లేదు” అంది.
”తెలిసో, తెలియకో నీ విషయంలో నేను అన్యాయమే చేశాను ఆరాధ్య. నా చేతులతోనే నా తప్పు దిద్దుకుంటాను. నాక్కొద్దిగా టైమివ్వు… సునీల్‌ని అడిగి నీకు నేనేం చెయ్యాలనుకున్నానో అన్నీ చేస్తాను. నన్ను నమ్ము…” అంటూ బొట్టుపెట్టి, చీర పెట్టింది.
తలుపు గడియ తీసుకొని బయటకొచ్చి అదేవిధంగా శార్వాణికి, కళ్యాణమ్మకు కూడా పెట్టింది. ఉపేంద్రకి, హేమంత్‌కి డ్రస్‌లు పెట్టింది. సృజిత్‌కి కూడా రెడీమేడ్‌ డ్రసెస్‌ తెప్పించి పెట్టింది.
….వాళ్లు ఎప్పటిలాగే తామొచ్చిన కారులో బయలుదేరి హైదరాబాద్‌ వెళ్లారు.
*****
ఉపేంద్ర రిటైరయ్యాడు. ఆయనది గవర్నమంట్ ఉద్యోగం కాకపోవటం వల్ల పెన్షన్‌ రాదు. ఆయనకు రావలసిన డబ్బంతా ఒక్కసారే చేతిలో పెట్టి, ఓ పూలదండ వేసి, పార్టీ ఇచ్చి ఇంటికి పంపారు.
ఆయన ఆ డబ్బు తెచ్చుకొని సంతోషంగా బీరువాలో పెట్టుకున్నాడు. వీరాస్వామి కూడా వారం క్రితం అలాగే డబ్బు తెచ్చుకొని బీరువాలో పెట్టుకొని ఉపేంద్ర ఎప్పుడు రిటైరవుతాడా? అని ఎదురుచూస్తున్నాడు. ఆయన అలా ఎదురుచూడానికి కారణాలు చాలా వున్నాయి.
ఆ డబ్బును బ్యాంకులో వేసుకొని నెలనెలా దాని వడ్డీ తెచ్చుకొని తినాలని వీరాస్వామికి లేదు. వీరాస్వామి భార్య కూడా ఉద్యోగం చేస్తోంది. ఆమె జీతంతో ఇంటి ఖర్చులు గడచిపోతాయి. సమస్య లేదు. ఉపేంద్ర పరిస్థితి కూడా అదే కాబట్టి ఈ విషయంలో ఇద్దరి అభిప్రాయం ఒక్కటే అయింది.
ఐతే ఆ డబ్బును ఏం చేయాలీ అన్నది చర్చలోకి తెచ్చుకున్నారు. ఆ డబ్బు రాకముందే ఇద్దరు రోజుకో చోట కూర్చుని మార్చి, మార్చి మ్లాడుకున్నారు.
వీరాస్వామి ”ఏదైనా ల్యాండ్‌ కొందాం ఉపేంద్రా!” అన్నాడు.
”ల్యాండెందుకు వీరాస్వామి! దాన్ని మనం ఏం చేసుకుంటాం! ఈ వయసులో నెలకోసారైనా దాని దగ్గరకి వెళ్లి మనం చూస్తామా! అదెక్కడో వుంటుంది. మనమెక్కడో వుంటాం! దానివల్ల ఉపయోగం వుండదు. అదే డబ్బు రూపంలో కొంత, బంగారం రూపంలో కొంత, వెండి రూపంలో కొంత వుంచుకుందాం! లేదంటే ఎక్కువ వడ్డీలకి బయట తిప్పుకుందాం!” అన్నాడు ఉపేంద్ర.
”వడ్డీలకి ఇచ్చి వసూలు చెయ్యటం కష్టం. బంగారం, వెండి, డబ్బు ఇంట్లో పెట్టుకుంటే దొంగల భయం. ఇంతెందుకు మన ఇంట్లో మనం పెట్టుకున్న పనివాళ్లే దొంగలవుతారు. దాన్ని తీసుకోటానికి ప్రాణం తియ్యటానికి కూడా వెనుకాడని పరిస్థితి వస్తుంది. దాన్ని మనంతట మనమే కల్పించిన వాళ్లమవుతాం! ల్యాండ్‌ నీకిష్టం లేకుంటే ఇంకేదయినా ఆలోచిద్దాంలే!” అన్నాడు వీరాస్వామి.
వీరాస్వామి ఆ మాటలు ఏ టైంలో అన్నాడో కాని ఆ టైంకు చాలా బలం వున్నట్లు సునీల్‌ పెళ్లిలో గొప్ప బిజినెస్‌ మాగ్నెట్లు కలిశారు ఉపేంద్రకి… నిజానికి ఉపేంద్ర వాళ్లను పరిచయం చేసుకోలేదు. అదృష్టం బాగుండి వాళ్ళే ఉపేంద్రను పరిచయం చేసుకున్నారు. ఇంతగొప్ప ఆఫర్‌ నాకు రావాలని వుండబట్టే వాళ్లతో మాట్లాడే అవకాశాన్ని దేవుడు నాకు కల్పించాడని ఇంటికొచ్చాక భార్యతో చెప్పుకున్నాడు ఉపేంద్ర.
”వాళ్ల మాటల్ని బట్టి వాళ్ల బిజినెస్‌ డీలింగ్సన్నీ అమెరికా వాళ్లతో వున్నట్లున్నాయి. ఒకసారి హేమంత్‌తో చెప్పండి! ఇది కాకుండా ఇంకా మంచి ఆఫర్స్‌ వున్నాయేమో చెబుతాడు. ఎందుకంటే మీ ఇద్దరే కాకుండా ఇంకో ఐదుగురు మీలాగే రిటైరైన వాళ్లు కలుస్తున్నారు కాబట్టి అది చిన్న అమౌంటేమీ కాదు. ఆ డబ్బుతో కళ్లు మూసుకొని ఏ బిజినెస్‌ స్టార్ట్‌ చేసినా డెవలప్‌ కావచ్చు. అదీకాక ఆ డబ్బు మీకు ఒక్కరోజులో వచ్చింది కాదు. దాన్ని మీరేం చెయ్యాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించండి! అబ్బాయితో కూడా చెప్పండి!” అంది చాలా ప్రశాంతంగా శార్వాణి.
”అబ్బాయితో ఎందుకు? అసలే వాడు ఫైనాన్స్‌ వాళ్ల దగ్గర తీసుకున్న డబ్బు ఇంకా కట్టనే లేదని నువ్వే చెప్పావ్‌! ఈ డబ్బు వుందని చెబితే వాడు తీసుకోడా? ఇన్ని రోజులంటే ఏదో జరిగి పోయింది. ఇప్పుడు ‘నేనివ్వనురా!’ అని ముఖం మీదే అంటే ఏం బావుంటుంది? ఈ డబ్బుతో ఇంకా సంపాయించాలి కాని అటు కొంత ఇటు కొంత పోనివ్వకూడదు. పోనిస్తే మళ్లీ దాన్ని గేదర్‌ చెయ్యటం అంత సులభం కాదు” అని భార్యతో అనకుండా
”నేను వీరాస్వామితో కూడా ఈ విషయం చెప్పి ప్రోసీడవుతాను శార్వాణీ!” అంటూ ఆయన బయటకెళ్తుంటే ఆపింది శార్వాణి.
”ఏంటి! ఆపావ్‌! ఇప్పుడు మంచి గడియలు లేవా? అయితే ఓ గంటాగి వెళ్తానులే!” అంటూ లోపలికొచ్చి కూర్చున్నాడు ఉపేంద్ర.
”గడియల కోసం కాదండి మిమ్మల్ని నేను ఆపింది”
”మరి దేనికి?”
”మీరు కోర్టు కేసులో గెలుచుకున్న డబ్బు కూడా ఇందులోనే పెడతారా?”
ఆయన గతుక్కుమని ”ఆ… పెడతాను. ఏం పెట్టొద్దా? అది నా డబ్బు కాదా? నీదా?” అంటూ ఉరిమి చూశాడు.
”నాది కాదు. మీదే ! మీరా కంపెనీలో పెట్టుబడి పెట్టేముందు అంటే పెట్టుబడి పెట్టాక లాభాలు వచ్చేదాకా డబ్బులు రావు కాబట్టి కొంత డబ్బును మీ అవసరాలకు వుంచుకోండి! అవసరాలనేవి చెప్పిరావుగా!”
”నీ బాధ నాకు అర్థమైంది. ప్రతిదీ నిన్ను అడుగుతాననేగా నీ అనుమానం. అడగనులే! అవసరమైతే అప్పు చేస్తాను. పెట్టుబడి తగ్గితే లాభాలు తగ్గుతాయి. ఇందులోంచి ఒక్క రూపాయి కూడా పక్కకు తియ్యను”
”పోనీ మీకోసం కాకపోయినా మీ చెల్లెళ్ల కోసమైనా కొంత తీసి వాళ్లకి పంపండి! వాళ్లు సంతోషిస్తారు. సెంటిమెంటల్‌గా ఆలోచిస్తే వాళ్ల సంతోషమే మనల్ని కాపాడుతుంది. ఎంతయినా వాళ్లు మన ఇంటి ఆడబిడ్డలు కదా!”
”నీకు మాట్లాడే అవకాశం ఇవ్వటం నాదే తప్పు! ఇక నీ సొల్లు వినే ఓపిక నాకు లేదు. వెళ్తున్నా! మళ్లీ వెనక్కు పిలవకు” అంటూ ఆయన వీరాస్వామి దగ్గరకి వెళ్లిపోయాడు.
వీరాస్వామికి ఉపేంద్ర చెప్పిన ఆఫర్‌ నచ్చింది.
వెంటనే బీరువాలోంచి డబ్బులు తీసుకొని సునీల్‌ పెళ్లిలో కలిసిన వ్యక్తులకి ఫోన్‌ చేసి, వాళ్లను కలవానికి వాళ్లు వుండే ఆఫీసు దగ్గరకి వెళ్లాడు.
ఆ ఆఫీసు చాలా రద్దీ ఏరియాలో వుంది. పొడవైన ఎత్తయిన కాంప్లెక్స్‌ అది. లిఫ్ట్‌ ద్వారా వాళ్లు చెప్పిన చోటుకి వెళ్లాడు.
అక్కడ చాలా హంగామాగా వుంది. సునీల్‌ పెళ్లిలో కలిసిన వ్యక్తుల్ని కలవటం కోసం పెద్ద ‘క్యూ’ ఏర్పడి మేం ముందు వెళ్లాలి, మేం ముందు వెళ్లాలి అన్నట్లు పోటీలు పడుతున్నారు. కొందరైతే ‘ఈ డబ్బు ఇచ్చి వెంటనే వెళ్లిపోతాం. మాకు పెద్ద టైం అవసరం లేదు’ అంటున్నారు. రిసెప్షనిస్ట్‌తో… అక్కడ నలుగురమ్మాయిలు కంప్యూటర్ల ముందు కూర్చొని వర్క్‌ చేస్తున్నారు. వాళ్లు ఎం.బి.ఏ. చేసినవాళ్లే! ఉపేంద్ర అడిగి తెలుసుకున్నాడు. ఆ వాతావరణం చూస్తుంటే బిజినెస్‌ పరంగా అది పెద్ద ప్రొడెక్ట్‌లా అన్పిస్తోంది.
ఉపేంద్ర, వీరాస్వామి అందర్ని చూస్తూ అక్కడ సోఫాలో కూర్చున్నారు. ఉపేంద్రకి ఆరోగ్య సమస్యలేమి లేవు కాని వీరాస్వామిలోనే వయసు ప్రభావం స్పష్టంగా కన్పిస్తోంది. పైగా ఆయనకు బి.పి., సుగర్‌ వున్నాయట. ఉదయాన్నే లాబ్‌లో సుగర్‌ టెస్ట్‌ కోసం బ్లెడ్‌ కూడా ఇచ్చి వచ్చాడు.
ఎక్కువసేపు వెయిట్ చెయ్యాల్సి వస్తుందేమోనని ముందు భయపడ్డారు కాని ఒక గంట లోపలే ఉపేంద్రను, వీరాస్వామిని లోపలకి పిలిచారు. వాళ్ల దగ్గర వున్న డబ్బు మొత్తం సునీల్‌ పెళ్లిలో పరిచయమైన వ్యక్తుల చేతిలో పెట్టి రిలాక్సయ్యారు. వాళ్లిచ్చిన యాపిల్‌ జ్యూస్‌ తాగి ఇంటికెళ్లారు ఉపేంద్ర, వీరాస్వామి.
*****
సునీల్‌ వుండే ఛాంబర్‌లోకి వెళ్లి కూర్చుంది రమాదేవి.
తల్లిని చూడగానే షాకయ్యాడు సునీల్‌.
అతనిప్పుడు మామూలు సునీల్‌ కాదు. వాళ్ల మామగారి మూడు ఐ.టి. కంపెనీలకి చెయిర్‌మెన్‌. ఖరీదైన ఛైర్లో హుందాగా కూర్చుని వున్నాడు. అతనికోసం ఖరీదైన కారు బయట పార్క్‌ చేయబడివుంది. అతన్నిలా చూస్తుంటే రమాదేవికి ఇన్నిరోజుల కష్టం ఫలించినట్లు అన్పించింది.
సునీల్‌ షాక్‌లోంచి తేరుకొని ”ఇక్కడికెందుకొచ్చావ్‌ మమ్మీ? ఇంటికెళ్లకపోయావా? నేనొస్తాను కదా!” అన్నాడు.
”వస్తావులే సునీల్‌! అక్కడ నీతో మ్లాడాలంటే నీ పక్కన నీ భార్య వుంటుంది. నీ భార్య అమ్మ… అమ్మమ్మ, తాతయ్య నీ చుట్టే కూర్చుని వుంటారు. అందుకే ఇలా వచ్చాను” అంది.
”త్వరగా మాట్లాడు మమ్మీ! నేను ఇప్పుడు అర్జంటుగా ఒక మీటింగ్‌కి అటెండవ్వాలి” అంటూ టైం చూసుకున్నాడు. టైం కూడా చెప్పాడు. ఆ లోపలే నువ్వు వెళ్లిపోవాలి అన్నట్లు చూశాడు.
”నాకు ఐదు లక్షలు డబ్బు కావాలి సునీల్‌!”
”ఐదు లక్షలా? ఎందుకు?” షాక్‌.
”అక్కయ్య కోసంరా! మీ అత్తమామలు కోటీశ్వరులు కదా ఆడపడుచు కట్నం వాళ్లంతట వాళ్లే ఇస్తారనుకున్నాం. ఇవ్వలేదు. నువ్వేమో పెళ్లి కాగానే ఇటు వచ్చేశావ్‌!” అంది.
”ఇప్పుడు ఆ డబ్బు అంత అవసరమా! ఏదో లాంచనప్రాయంగా ఇచ్చేది కదా! ఎప్పుడైనా ఇవ్వొచ్చు కదా!” అన్నాడు.
ఆమె షాక్‌! షాక్‌! షాక్‌!
”అది కాదు సునీల్‌! అక్కయ్యకు పెళ్లిలో ‘వద్దురా! అంటే నువ్వే వినకుండా డబ్బు సరిపోదని మీ బాబాయిలతో చేయికలిపి 17 క్యారెట్ల గోల్డ్‌ కొన్నావు. కనుక్కోలేదులే అన్నావు. కానీ దానివల్ల అది మన కళ్లముందే ఎన్నో ఇబ్బందులు పడింది. ఆ గోల్డ్‌ ఇప్పటికీ మన ఇంట్లోనే వుంది. నువ్విప్పుడు దానికివ్వాల్సిన ఐదు లక్షలు ఇస్తే ఇంట్లో వున్న గోల్డ్‌ని ప్యూర్‌గోల్డ్‌ చేసి దానికి నచ్చిన నగలు చేయిస్తాను. అలా చేయిస్తానని అక్కయ్యకి మొన్న మాట కూడా ఇచ్చాను. అది మన బాధ్యత…”
”మాట ఇచ్చేముందు నన్ను అడగాల్సింది”
ఆమె మళ్లీ షాక్‌! షాక్‌! షాక్‌!
”అదేంటి సునీల్‌ అలా అంటావు. నిన్నెందుకు అడగాలి? అక్క నెలనెలా కట్టే చిట్టీ డబ్బుల్ని అక్కయ్య తనకోసం అడిగినా ఇవ్వకుండా నీ ఉద్యోగం కోసం వాడాను… ఆ ఉద్యోగం చూసే కదా వీళ్లు నీకు పిల్లనిచ్చింది. పిల్లనిచ్చాకనే కదా ఇంత పెద్ద సీట్లో కూర్చోబెట్టారు. కాని అంతకు ముందు నువ్వు చేసిన ఉద్యోగం అక్కయ్య డబ్బులతో వచ్చిందేగా! అప్పుడు నేనేమైనా అక్కయ్యను అడిగి చేశానా? ఏదో అవసరాన్ని బట్టి ఇద్దరూ నా పిల్లలే కదా అన్నట్లు చేశాను. అలా చెయ్యటంలోనే కొన్ని అవకతవకలు జరిగాయి. అప్పట్లో ఏది ముఖ్యం అన్నది గ్రహించలేక పోయానో మరి ఇంకేదో నాకు తెలియదు కాని అక్కయ్యకు అయితే అన్యాయం జరిగింది. ఇప్పుడైనా దానికి న్యాయం చెయ్యాలి. నువ్వా డబ్బులు ఇస్తే నేను అనుకున్నది అనుకున్నట్లే జరుగుతుంది” అంది రమాదేవి.
సునీల్‌ నవ్వి ”బాకీ వసూలు చేసుకుపోవటానికి వచ్చినట్లే మాట్లాడుతున్నావ్‌ మమ్మీ! నాకు తెలిసిన సంగతుల్నే మళ్లీ, మళ్లీ చెప్పి విసిగిస్తున్నావ్‌! నువ్వెంత విసిగించినా ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు” అన్నాడు.
”అదేంటి సునీల్‌! నువ్విప్పుడు కోటీశ్వరుడివి… నీ దగ్గర డబ్బులు లేవని చెబితే విన్నవాళ్లు నవ్వుతారు. అక్కయ్యకు ఇవ్వాల్సి వస్తుందని నువ్వు కావాలనే చెబుతున్నట్లున్నావు. నీ దగ్గర డబ్బులు లేకపోవటం ఏమి? ఈ ఏరియాలో వుండే ఐ.టి. బిల్డింగ్‌లన్నీ మీ మామగారివే! ఇంతకు ముందే నేను నువ్వుండే చోటు తెలుసుకోలేక రెండు మూడు బిల్డింగ్‌లు తిరిగొచ్చాను. అవన్నీ నీ భార్య పేరుతోనే కన్పిస్తున్నాయి. అంటే నా కోడలి పేరు” అంది సంబరంగా.
సునీల్‌ మళ్లీ నవ్వి ”నీ కోడలికి ఇంకో రెండు ఐ.టి. కాలేజీలు కూడా వున్నాయి. వాటికి ఆమెనే చెయిర్‌పర్సన్‌. ఇప్పుడింకా సంబరంగా వుందా?”
”వుంటుంది సునీల్‌! ఎందుకుండదు. ఈ సంతోషం కోసమే కదా ఈ సంబంధాన్ని మనం ఏరికోరి చేసుకుంది?”
”నువ్వెంత సంతోషపడినా ఒక్క రూపాయి రాదు మమ్మీ! ఇక్కడంతా రికార్డెడ్‌గా వుంటుంది. నేను ఒక్క రూపాయి తీయాలన్నా అకౌంటెంటుకి తెలియకుండా జరగదు. ఒకవేళ నేనలా తీసుకున్నా వాటిని నేనెందుకు తీసుకున్నానో నా భార్యకు చెప్పుకోవాలి. ఇప్పుడు నేను ఐదు లక్షలు తీస్తే మా ఇద్దరి మధ్యన గొడవలొస్తాయి”
”అది ఆడపడుచు కట్నంగా ఇచ్చేదే కదరా! వాళ్లు కోటీశ్వరులు ఆమాత్రం ఇవ్వలేరా?”
”ఎంత కోటీశ్వరులైనా ఆ ఐదు లక్షల్ని వాళ్లకుండే కోట్లలోకి కలుపుకోవాలని చూస్తారు కాని అలా ఇవ్వరు. అయినా ఐదు లక్షలు ఇస్తామని వాళ్లు నీకు చెప్పారా?”
”చెప్పలేదు… ఊహించాను. ఎందుకంటే ఈరోజుల్లో మామూలుగా వున్నవాళ్లు కూడా ఆడపడుచుకి ఇచ్చే క్నాన్ని లక్షకి తక్కువ ఇవ్వటం లేదు. వీళ్లు కోటీశ్వరులు. 5 లక్షలు ఇస్తే తప్పేంటి?”
”ఇస్తే తప్పులేదు. ఇవ్వాలి కదా! అసలెందుకివ్వాలి? ఆయాచితంగా అంత డబ్బు రావాలని, అడగాలని, గొడవపడి అయినా ఇప్పించుకోవాలని నువ్వెందుకు అనుకోవాలి? అలాంటి ఆలోచనలు నీకెందుకు వస్తున్నాయి? అక్కయ్యకు ఏది పెట్టుకోవాలన్నా ప్రేమతో నువ్వు పెట్టుకోవాలి కాని మా అత్తమామలు ఎందుకు పెడతారు? నన్ను నువ్వు ఈ సంబంధం చేసుకోమన్నది ఇందుకేనా? ఇలా వాళ్లతో వ్యాపారం చెయ్యాలనా? నువ్వూ, నాన్న జీవితాంతం స్వీట్ హౌజ్ నడిపినా మమ్మల్ని చదివించటం వరకే చేశారు. ఇప్పుడు చేతిలో రూపాయి లేదు. ఐదు లక్షలు సంపాయించాలంటే మీలాంటి వాళ్లకి ఎన్ని జీవితాలు కావాలి? అలాంటప్పుడు ఎంత కోటీశ్వరులైనా అంత డబ్బు ఇవ్వాలంటే ఆలోచించరా? డబ్బు విలువ ఒక ఆోవాడికి తెలిసిన దానికన్నా కోటీశ్వరులకే ఎక్కువగా తెలుస్తుంది. దాన్నిబట్టి డబ్బుకుండే విలువ ఎలాంటిదో ఆలోచించు” అన్నాడు.
”అలా డబ్బుకి విలువ కట్టుకుంటూ పోతే అంతం వుంటుందా సునీల్‌! మానవ విలువలు అంతరించిపోవా?”
”ఒకరి సొమ్మును ఆశించేటప్పుడు మానవ విలువల గురించి మాట్లాడొద్దు మమ్మీ! ఇంకెప్పుడైనా మాట్లాడు. బావుంటుంది” అన్నాడు.
”నిన్ను వీళ్ల చేతిలో అనవసరంగా పెట్టామురా! అమ్మాయి ఒక్కతే! కోట్ల ఆస్తి వుందనుకున్నాము కాని ఇలా వుంటుందనుకోలేదు. పెళ్లికి ముందు మీ మామగారు కార్లో మన ఇంటిచుట్టూ తిరుగుతుంటే ఎప్పటికీ అలాగే తిరుగుతాడనుకున్నాను. ఇంతకుముందు నేను గేటులోంచి లోపలకి వస్తుంటే ఆయన అదే కారులో వెళ్తూ కన్పించాడు. కారు ఆపలేదు. నన్ను పలకరించలేదు. ఇలాగే వుంటారా వియ్యంకులు. మరీ ఘోరంగా వుంది” అంది.
”వాళ్లు నీకు వియ్యంకులేంటి మమ్మీ! నువ్వలా చెప్పుకుంటావేమో! వాళ్లలా చెప్పుకోరు. అప్పుడేదో ఆయన నాకోసం మన ఇంటిచుట్టూ కారులో తిరిగితే తిరిగి వుండొచ్చు. ఇప్పుడు తిరుగుతాడా? ఆయన టైం విలువ లక్షల్లో వుంటుంది. లక్షల విలువ చేసే టైం గురించి ఆలోచించకుండా ఆయన మన ఇంటిచుట్టూ అన్నిసార్లు తిరిగింది కూడా ఎందుకో తెలుసా?”
”ఎందుకురా!” వెంటనే అడిగింది రమాదేవి.
”నేను మనిషిని బాగుంటానని. వాళ్ల అమ్మాయికి కరెక్ట్‌గా మ్యాచ్‌ అవుతానని… అంతేకాని నాలాగా బి.టెక్‌ చేసినవాళ్లు బయట లేక కాదు. ఇంకా ఏంటంటే నా చదువు వాళ్ల కంపెనీలను డెవలప్‌ చెయ్యానికి పనికొస్తుంది కాబట్టి వాళ్లు మనల్ని వదల్లేదు. కావాలంటే చూడు ఇకముందు ఆయన మన ఇంటివైపుకి వస్తాడేమో! రాడు. ఆయనకు ఆ అవసరం లేదు. అంతెందుకు ఇప్పుడు నాకు తల్లిదండ్రులు వున్నారన్నది కూడా వాళ్లకి గుర్తుండదు. వాళ్లెక్కడ? మీరెక్కడ? వాళ్లది ఆరువందల గజాల స్థలంలో నిర్మించిన ఇంద్రభవనం… మనది వంద గజాల స్థలంలో కట్టిన నాలుగు గదుల పాత కొంప… ఇవి రెండూ ఎప్పటికి సమానం కావాలి? ఎప్పుడు కలవాలి? ఇదంతా నేనెందుకు చెబుతున్నానంటే జీవితాంతం టీ అమ్ముకొని, ఆటో నడుపుకుని తమ కొడుకుల్ని బి.టెక్‌లు, ఎంబిఏలు చేయించుకున్న తల్లిదండ్రులు తమ కొడుకుల్ని రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలని కోరుకుంటున్నారు. వాళ్ల కోరిక ఫలించి వాళ్ల కొడుకుల్ని ఏ ఐ.టి. కంపెనీ డైరెక్టరో, ఏ మొబైల్‌ కంపెనీ మేనేజరో అల్లుడ్ని చేసుకుని తన్నుకుపోతే కొద్దిరోజులు బాగున్నా ఆ తర్వాత తల్లడిల్లి పోతుంటారు. ఇదిగో నీలాగే!” అన్నాడు.
ఆమె షాక్‌లోకి వెళ్లి తిరిగి తేరుకునే లోపలే
”ఐనా కోటీశ్వరుల అమ్మాయిల్ని పెళ్లి చేసుకోగానే కోటీశ్వరులైపోతారా మమ్మీ! దానికింకేం లెక్కలుండవా? క్రెడ్‌ట్ కార్డు జేబులో పెట్టుకొని ఓ పల్లెటూర్లో తిరిగితే ఎలా వుంటుందో అలా వుంది ఇప్పుడు నా పరిస్థితి. దీన్ని నేనెవరికి చెప్పుకోవాలి?”
”ఎవరికి చెప్పినా నమ్మరు సునీల్‌. నువ్వు కావాలనే నాకు కథలు చెబుతున్నావు. నువ్వు డబ్బు ఇచ్చేదాకా నేను వెళ్లను. నువ్వు నన్ను పోలీసుల్ని పిలిపిస్తానని బెదిరించినా సరే వెళ్లను” అంటూ భీష్మించుకు కూర్చుంది.
”ఛ..ఛ.. ఎందుకలా మ్లాడతావు మమ్మీ! నేను మరీ అంత పిరికివాడిననుకున్నావా? నిన్ను ఇంటికి పంపటానికి పోలీసులెందుకు? నువ్వేమైనా నన్ను చంపటానికి వచ్చావా? డబ్బులు అడగటానికేగా వచ్చింది? కాకపోతే ఫ్రీగా ఇమ్మని అడుగుతున్నావు. అది సాధ్యం కాదని నేను చెబుతున్నాను. దానికి పోలీసులెందుకు?”
తన మాటలకు తనే సిగ్గుపడింది రమాదేవి. కాదు కాదు సిగ్గుపడే స్థితిని తన చేతులతో తనే తెచ్చుకుంది. ఆమె మాట్లాడకపోవటంతో అతనే మాట్లాడాడు.
”నీకు డబ్బులు కావాలంటే దానికో మార్గం వుంది మమ్మీ!” అన్నాడు.
”ఏంటా మార్గం?” వెంటనే చెప్పు అన్నట్లు అడిగింది.
”మన ఇంటిని నాపేరుతో రాయించుకొని రా! నీకిప్పటికిప్పుడే ఆ ఐదు లక్షలు అరేంజ్‌ చేస్తాను. ఇల్లు వుంది కాబట్టి నా భార్యకాని, మామగారు కాని నన్నేమీ అనరు.” అన్నాడు.
ఒక్కక్షణం తను విన్నది నిజమేనా అన్నట్లు అనుమానంగా చూసింది. ఆ తర్వాత నెమ్మదిగా ”అది ఎప్పటికైనా నీ ఇల్లే కదరా! మళ్లీ దాన్ని అది పనిగా నీపేరుతో రాయడం ఎందుకు?” అంది.
”ఎప్పటికైనా నాది కావచ్చేమో! ఇప్పుడైతే కాదుకదా! నీకు డబ్బులు కావలసింది ఇప్పుడే కదా! ఎప్పుడో కాదుకదా!” అంటూ అతను చాలా ప్రశాంతంగా ఆలోచించుకుంటూ మాట్లాడుతున్నాడు.
రమాదేవి ఎటూ ఆలోచించుకోలేకపోతోంది.
ఇంటికెళ్లాలని లేచి నిలబడింది.
”వుండు మమ్మీ!” అంటూ డ్రైవర్ని పిలిచి ”ఈమెను బస్టాండ్‌ వరకు డ్రాప్‌ చేసిరా!” అన్నాడు.
ఆమె కొడుకు వైపు, డ్రైవర్‌ వైపు మార్చిమార్చి చూసి డ్రైవర్‌తో ”వద్దు నాయనా! నేను ఎలా వచ్చానో అలాగే వెళ్లిపోగలను. నువ్వు వెళ్లు” అంటూ ఆమె ఆ ఛాంబర్‌లోంచి బయటకు నడిచింది.
*****
ఉపేంద్ర, వీరాస్వామి ఆరోజు డబ్బులు ఇచ్చి వచ్చాక చాలాసార్లు వాళ్లకి ఫోన్లు చేసి మాట్లాడారు. వాళ్లు చేస్తున్న బిజినెస్‌ల వివరాలు ఫోన్లో చెబుతుంటే విని సంతోషించారు. రాబోయే లాభాలను ఊహించుకొని ఆనందించారు… ‘అసలు మీరిచ్చిన డబ్బు మొత్తం ఎప్పటికీ మా దగ్గరే వుంచుకుంటాం. దాని లాభాలను మాత్రం మీ బ్యాంక్‌ అకౌంట్లో వేస్తాం. అదే ఎక్కువ మీకు… ఎందుకంటే అది చాలా ఎక్కువ మొత్తంలో వస్తుంది’ అంటూ బ్యాంక్‌ ఖాతాలను ఓపెన్‌ చేయించినప్పుడు పొంగిపోయారు. బ్యాంక్‌ అకౌంట్లో జీరో బ్యాలెన్స్‌ వుండకూడదని చెరి వెయ్యి రూపాయలు వాళ్లే పంపినప్పుడు ఇంత మంచివాళ్లు ఎక్కడైనా వుంటారా అని ఆశ్చర్యపోయారు.
ఆ తర్వాత మళ్లీ ఫోన్‌ చేస్తే వాళ్లు సమాధానం ఇవ్వకపోవటంతో షాకయ్యారు. అవాక్కయ్యారు. అప్పుడే ఇంట్లో చెప్పకుండా ఎప్పటిలాగే ఇద్దరూ కలిసి వాళ్లు మొదట్లో డబ్బులు ఇచ్చిన ఆఫీసు దగ్గరకి వెళ్లారు. ఆ ఆఫీసులో వాళ్లు లేరు. కొరియర్‌ సర్వీస్‌ వుంది. ‘వీళ్లేరి?’ అని అడిగితే ‘వాళ్లు చాలా రోజులైంది స్టేట్స్ వెళ్లి!’ అని చెప్పారు. ‘మీకేమైనా వాళ్ల వివరాలు కాని, ఫోన్‌ నెంబర్లు కాని తెలుసా?’ అని అడిగితే ‘వాళ్ల నెంబర్లు మనకు కలవవు. మన నెంబర్లు వాళ్లకు కలవవు. ఇక వాళ్లను మరచిపోండి’ అన్నారు.
అది విని ఉపేంద్రకి ఏమీ కాలేదు కాని వీరాస్వామికి మూతిలాగడం, చేయి చచ్చుబడిపోవటం జరిగింది. అప్పటికప్పుడే ఆయనను ఉపేంద్ర హాస్పిటల్లో చేర్పించాడు.
హాస్పిటల్లో ఖర్చు పెట్టాలనుకున్నప్పుడు వీరాస్వామి స్వార్జితం అంటూ ఒక్క రూపాయి లేకపోవటం మనసును కదిలించింది. కన్నీళ్లు తెప్పించింది. దీనికి కారణం తనేనని ఎవరూ చూడకుండా పక్కకెళ్లి చేతులతో తల బాదుకున్నాడు ఉపేంద్ర.
వీరాస్వామి భార్య ఎక్కడి నుండి తెచ్చిందో డబ్బు తెచ్చి హాస్పిటల్లో కడుతుంటే- వీరాస్వామి ఉపేంద్ర వైపు లోతుగా చూశాడు. ఏదో మాట్లాడాలని ప్రయత్నించాడు. ఆయనకు మూతి వంకర పోకపోతే ఎలా వుండేదో కాని ఇప్పుడు ఉపేంద్రతో మాట్లాడదామన్నా మాట్లాడలేక మౌనంగా చూస్తున్నాడు. ఆ మౌనం ఉపేంద్ర హృదయాన్ని ఛిద్రం చేస్తోంది.
ఉపేంద్ర ఎన్నో పాపాలు చేశాడు… ఏ పాపం చేసినా డబ్బు కోసమే చేశాడు. కన్నకొడుక్కి వైద్యం చేయిస్తే డబ్బులు అయిపోతాయని భార్య చేత బయట ఎక్కడో వదిలేయించాడు. కన్నతండ్రికి కడుపు నిండా తిండి పెడితే ఎక్కువ రోజులు బ్రతుకుతాడని సగం తిండే పెట్టాడు. ఆస్తికోసం అభాగ్యులైన చెల్లెళ్లతో కోర్టులో పోరాడి గెలిచాడు. జీవితంలో మాత్రం పూర్తిగా ఓడిపోయాడు. ఏ డబ్బు కోసమైతే ఇన్నిరోజులు కక్కుర్తి పడ్డాడో ఆ డబ్బే అతనికి నిలవకుండా పోయింది… విషయం తెలిశాక శార్వాణి చూసిన చూపుకన్నా, వీరాస్వామి ఆఖరిసారిగా మాట్లాడిన మాటకన్నా వీరాస్వామి భార్య వీరాస్వామికి చేస్తున్న సేవలే కొరడాతో కొట్టినట్లు బాధపెడుతున్నాయి. జీవితం పట్ల భయాన్ని కలిగిస్తున్నాయి. తను కూడా వీరాస్వామిలా అయితే తన పరిస్థితి ఏమి? అన్న ప్రశ్న అన్నికన్నా అతి దారుణంగా హింసిస్తోంది.
”శార్వాణీ! ఇప్పుడు నేనెలా బ్రతకాలి? నువ్వున్నావు సరే! నీకన్నా, హేమంత్‌కన్నా, నా తండ్రికన్నా, చెల్లెళ్ల కన్నా డబ్బునే నేనెక్కువగా ప్రేమించాను. డబ్బు తప్ప ఈ ప్రపంచంలో ఏదీ ముఖ్యం కాదనుకున్నాను. నా వృద్దాప్యంలో నన్ను ఆదుకునేది ఆ డబ్బే అనుకున్నాను. నాకిప్పుడు వృద్ధాప్యం మాత్రమే మిగిలింది. డబ్బు పోయింది” అంటూ ఉపేంద్ర కుమిలిపోతుంటే ఆయన్ను ఓదార్చాలో అసహ్యించుకోవాలో అర్థం కాలేదు శార్వాణికి.
ఒకప్పుడు ఉపేంద్ర-
”నా ఒక్కడి శాలరీతో నిన్ను పోషించటం నావల్ల కాదు శార్వాణీ! నువ్వు కూడా ఉద్యోగం చెయ్యి. లేదంటే ఇంట్లోంచి వెళ్లిపో!” అన్న మాటలు సడన్‌గా ఆమెకు గుర్తొచ్చి దేవుని లీలలు బహు విచిత్రం అన్పించాయి.
ఎలాంటి మనిషికి ఎలాంటి జీవితం ఇవ్వాలో శిలాశాసనంపై చెక్కినట్లు ముందే రాసిపెట్టి వుంటుంది. అది మళ్లీ తిరిగి రాసేది కాదు. ఇది నచ్చలేదని చెరిపేసేది కాదు.
”హేమంత్‌కు, ఆరాధ్యకు ఈ విషయం తెలిస్తే ఏమనుకుంటారో శార్వాణి! ముందు నువ్వు చెబుతావా? నేను చెప్పాలా?” అడిగాడు ఉపేంద్ర.
ఆమెకు భర్తపై చాలా కోపంగా వుంది. కానీ ఒక్క నిముషం కోపంగా వున్నామంటే ఒక్క నిముషం సంతోషానికి దూరమైనట్లేనన్నది ఆమెకు తెలుసు. అందుకే ఆయన మీద కోప్పడలేదు. నాలుగు నీతి వాక్యాలు చెబితే విని, ఈ వయసులో ఆయన కొత్తగా నేర్చుకుని సాధించేదీ ఏదీ లేదు. అసలు ఆయన మీద ఇప్పుడు నీతివాక్యాలు కూడా పనిచెయ్యవు. వదిలేస్తే హాయిగా వుంటాడు. లేదంటే సగం చస్తూ బ్రతుకుతాడు. అందుకే ”మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి! నేనైతే చెప్పను” అంది శార్వాణి.
తగిన ప్రాయశ్చిత్తం జరగడం వల్లనో లేక పశ్చాత్తాపం వల్లనో తెలియదు కాని ఉపేంద్ర ముఖం పాలిపోయి వుంది.
అతని ముఖంలోకి చూడాలంటేనే భయంగా వుంది శార్వాణికి… డబ్బు పోయిన బాధ కన్నా ఉపేంద్ర పడుతున్న బాధను చూస్తుంటే ఇతను కోలుకోటానికి ఈ జీవితం సరిపోదేమోననిపించింది శార్వాణికి… అందుకే మాటలతో ఆయనను గాయపరచకూడదనుకుంది. అలా గాయపరిస్తే ఉపేంద్రకు శార్వాణికి తేడా ఏముంది?
*****
ఆరాధ్య హేమంత్‌తో చెప్పి సృజిత్‌ని తీసుకొని ఊరెళ్లింది.
కూతురుని చూడగానే ఇప్పుడు దీనికి నేను ఏం సమాధానం చెప్పాలి అన్నట్లు కంగారు పడింది రమాదేవి.
”నేను ఫోన్‌ చేసినప్పుడు రావలసింది ఆరాధ్యా! అప్పుడే వచ్చావేం? డబ్బులింకా చేతికి అందలేదు. అందాక నీకు నేనే ఫోన్‌ చేసి రమ్మని చెబుతాను” అంది.
”అంటే! నన్నిప్పుడు వెళ్లిపొమ్మంటావా మమ్మీ!”
”లేదు. లేదు. ఆరాధ్యా! నేనలా అనటం లేదు”
”నువ్వలా అన్నా నేను వెళ్లను. నా కొలీగ్‌ మ్యారేజ్‌కి నేను నగలు చేయించుకోవాలి. లేకుంటే దాని పెళ్లిలో కూడా నేను ఆబాసుపాలు కావలసి వస్తుంది. నువ్వు నాకిప్పుడు ఆ నగలు చేయిస్తేనే వెళ్తాను” అంది ఆరాధ్య.
”ఇదెక్కడి నరకమే!” అంటూ తల పట్టుకుంది రమాదేవి.
”అందుకే! ఎప్పటివి అప్పుడే క్లియర్‌ చేసుకోవాలి. ఇలా పెండింగ్‌లో పెట్టుకోకూడదు” అంది ఆరాధ్య.
”ఈ ఒక్కసారికి నా మాట నమ్ము ఆరాధ్యా! ఏదో ఒకటి చేసి నీకు నగలు చేయిస్తాను”
”ఏదో ఒకటి చెయ్యడమెందుకు? సునీల్‌కేమో అన్నీ చేస్తావ్‌! దేవతలు ఆశీర్వదించేలా కరెక్ట్‌ ముహూర్తానికి దగ్గరుండి వాడి పెళ్లి చేయించావు. వాడి భార్యకేమో ఫ్యూర్‌ నగలు, పట్టుచీరలు కొనిపెట్టావు. నా దగ్గరకి వచ్చేటప్పటికి మాత్రం ఏదో ఒకి చేస్తానంటావ్‌! ఏమీ లేని దానిలా ముఖం పెడతావ్‌! అయ్యో పాపం మా మమ్మీ దగ్గర ఏమీ లేనట్లుందే అని నేను కంగారు పడాలి. అదేం అంటే ఏడుస్తావ్‌! నిన్నెలా అర్థం చేసుకోవాలో నాకర్థం కావటం లేదు. నువ్విలా నాది నాకు ఇవ్వకుండా పోస్ట్‌పోన్‌ చేస్తూ పోతే నేను నా భర్తతో, అత్తామామలతో కలిసి వుండొద్దా? పెళ్లిళ్లల్లో గిల్ట్‌ నగలు పెట్టుకొని వాళ్ల పరువు తియ్యాలా? నువ్వూ, నీ కోడలు ప్యూర్‌ నగలు పెట్టుకోవాలా? చెప్పు! మమ్మీ?”
”ఏం చెప్పనే ఆరాధ్యా! తమ్ముడ్ని డబ్బులడిగితే ఈ ఇంటిని వాడి పేరుతో రాసివ్వమని అడిగాడు”
”రాసివ్వొచ్చుగా! వాడేమైనా కూతురా? ఆలోచించానికి… కొడుకేగా!”
బాధగా ముఖంపెట్టి ”వాడిలా అడుగుతాడని అనుకోలేదు ఆరాధ్యా!”
”ఎవరూ ఏదీ అనుకోరు మమ్మీ! మీరు నాకు అలాంటి గోల్డ్‌ పెడతారని, దానికోసం నన్నిలా తిప్పుకుంటారని నేను మాత్రం అనుకున్నానా? అసలు నీలాంటి తల్లులు మన సొసైటీలో అక్కడక్కడ వున్నా కచ్చితంగా వుంటారని మాత్రం ఎవరూ అనుకోరు. దానికి ఎవరేం చెయ్యగలరు చెప్పు?” అంది ఆరాధ్య.
రమాదేవి మాట్లాడలేదు. లోలోపల కుమిలిపోతోంది.
రెండు చేతుల్లో ముఖం దాచుకొని ఏడ్చింది.
”ఏడుస్తూ పెళ్లి చేశావ్‌! నా బ్రతుకు ఏడ్చినట్లే అయింది. చివరకు కడుపు తీపి కూడా తెలియకుండా చేశావ్‌! ఇంకా ఏడ్చి నన్నేం చెయ్యాలని…? ఆ బంగారం నువ్వే వుంచుకో! దాన్ని అమ్ముకొని ఈ ఇంటిమీద ఇంకో ఇల్లేసుకో!” అంటూ వెళ్లిపోయింది ఆరాధ్య.
రమాదేవి తేరుకొని చూసే లోపలే అక్కడ సృజిత్‌ లేడు, ఆరాధ్య లేదు.
అప్పుడొచ్చి ”ఆరాధ్య వచ్చిందా రమా?” అని అడిగాడు శాంతారాం.
శూన్యంలోకి చూస్తూ కూర్చుంది రమాదేవి.
*****
ఉపేంద్ర ఇప్పుడు ఖాళీగా ఇంట్లో వుండటం లేదు. అలా అని బయటకెళ్లి ఉద్యోగం లాంటిదేం చెయ్యటం లేదు. వీరాస్వామి దగ్గరకి వెళ్లి గడుపుతున్నాడు. శార్వాణి కూడా ”నీ వల్లనే వీరాస్వామికి ఈ గతి పట్టింది. డబ్బులు పోయినా కనీసం ఆయన వాళ్ల భార్య పెట్టిన తిండి తిని తన పనులు తను చేసుకోలేకపోతున్నాడు. అసలే మూలుగుతుంటే తలమీద తాటికాయ పడ్డట్లు చేయి చచ్చుబడిపోయింది. మూతి వంకర పోయింది. ఆ మూతి వంకరను మీరేమీ చేయలేరు కాని చేతికి ఎక్సర్‌సైజులు చేయించండి! వాకింగ్‌కి తీసికెళ్లండి! ఆయన మామూలు మనిషి అయ్యేంత వరకు ఆయన్నే కనిపెట్టుకుని వుండండి! మీ ఫ్రెండే కదా! పాపం! వాళ్ల భార్య ఉద్యోగం చెయ్యలేక ఆయన్ని చూసుకోలేక డిప్రెషన్‌లో వుంది. ఇలాంటి టైంలోనే మనిషి ఆసరా అవసరం. అప్పటికీ వాళ్ల భార్య చాలా మంచిది. డబ్బులు పోగొట్టుకున్న ఈ మనిషితో నాకేం పని అని అనుకోకుండా, మంచంలో వున్నా మనిషి అనేవాడు వుంటే చాలనుకుంటోంది. ఆయన్ను ఒక్క మాటకూడా అనకుండా మర్యాదగా చూసుకుంటుంది. ఎవరుంటారండీ ఆవిడలాగా? అవకాశం దొరికినా, ఆధారపడినా మాటలతో పొడవాలని చూసేవాళ్లే ఎక్కువగా వుంటారు” అంది శార్వాణి.
అది కూడా నిజమే అనిపించింది ఉపేంద్రకి.
అప్పటి నుండి వీరాస్వామి దగ్గరే ఎక్కువగా వుంటున్నాడు.
వాకింగ్‌ కెళ్లినప్పుడు వీరాస్వామి చాలా కృతజ్ఞతగా ”నువ్వే లేకుంటే నన్నిలా బయటకి ఎవరు తీసుకొస్తారు ఉపేంద్రా? ఈ నడకే లేకుంటే నేనెప్పుడో పడకేసేవాడిని… ఈ మాత్రం నడవబట్టే నా బాడీలో సుగర్‌ కంట్రోల్‌లో వుంది. లేకుంటే ఆ జబ్బు నా శరీరాన్నెప్పుడో చీమలు తినేసినట్లు తినేసేది” అన్నాడు. ఆయన అల్పసంతోషి. ఆయన ఇప్పుడు కొద్దికొద్దిగా మాట్లడగలుగుతున్నాడు.
ఉపేంద్ర వెంటనే వీరాస్వామి చచ్చుబడిపోయిన చేతిని రెండు చేతుల్లోకి తీసుకొని విచారంగా, గుండె కరిగేలా చూస్తూ… ”వీరాస్వామీ! నీదెంత మంచి మనసు. ఇంత జరిగినా నన్నొక్క మాట కూడా నువ్వు అనలేదు. ఏదో షాపింగ్‌ కెళ్లినప్పుడు మొబైల్‌ పోయినట్లు మౌనంగా వుండిపోయావు. మనం మాత్రం ఇలా అవుతుందని అనుకున్నామా? ఏదో చెయ్యాలనుకున్నాం. వాళ్లు మనల్ని ఇలా చేశారు. వాళ్లకి స్ట్సేట్స్ వెళ్లి స్థిరపడానికి మన రిటైర్‌మెంట్ డబ్బులే కావలసి వచ్చాయి! ఏం చేద్దాం! నువ్వు చెప్పే కర్మలు ఎవరినీ వదలవు. వాళ్లను మాత్రం వదులుతాయా?” అన్నాడు.
”ఎవరినీ వదలవు ఉపేంద్రా! ఇప్పుడు మనల్ని వదులుతున్నాయా? ఏదో మాట్లాడుకుంటున్నాం కాని, ఎంత మాట్లాడినా వదిలే సమస్యలా మనవి… రిటైర్‌మెంట్ డబ్బులతో బ్రతకాలి కాని అత్యాశతో కోట్లు సంపాయించాలనుకున్నందుకు ఇది దేవుడు చూసి, చూసి వేసిన శిక్షలా లేదూ? అయినా ఈ వయసులో కోట్లు ఎందుకు మనకు? అందుకే ఇలా అయింది” అన్నాడు వీరాస్వామి.
జీవితంలో విలువైన క్షణాలను డబ్బును పోగేసుకోవటంతో పోగొట్టుకున్న ఉపేంద్ర వీరాస్వామి మాటల్ని తీసెయ్యలేకపోయాడు.
ఇంకో రెండు నిమిషాల్లో ఇల్లు వస్తుందనగా ఆో దిగి నడుచుకుంటూ వస్తున్న శాంతారాం, రమాదేవిలు కన్పించారు.
”అదిగోనయ్యా! ఉపేంద్రా! మీ వియ్యంకులు వస్తున్నారు” వాళ్లను ముందుగా చూసిన వీరాస్వామి చెప్పాడు.
వీరాస్వామి చెప్పగానే వాళ్లవైపు చూసిన ఉపేంద్ర నవ్వుతూ వెళ్లి ”బావగారూ! మీరా? బాగున్నారా? ప్రయాణం బాగా జరిగిందా?” అంటూ శాంతారాం రెండు చేతుల్ని పట్టుకొని వదిలి ప్రేమగా మ్లాడుకుంటూ ఇంట్లోకి తీసికెళ్లాడు. లోపలికెళ్లగానే ”ఎవరొచ్చారో చూడు శార్వాణీ!” అంటూ గట్టిగా కేకేశాడు. ఆమె కిచెన్‌ లోంచే వాళ్లను గమనించి నవ్వుతూ వచ్చి పలకరించింది. కొద్దిసేపు వాళ్ల దగ్గర కూర్చుని మాట్లాడింది. వాళ్లకి మర్యాదలు చేసింది.
వీళ్ల మర్యాదలు, పలకరింపులు చూస్తుంటే శాంతారాంకి, రమాదేవికి- సునీల్‌ అత్తగారిల్లు గుర్తొచ్చింది. మర్యాదలు చేయించుకోవాలన్నా చేయాలన్నా సమాన స్థాయి అవసరమనిపించింది.
శాంతారాం ఉపేంద్రను, శార్వాణిని కూర్చోబెట్టి ”బావగారు! ఆరాధ్య విషయంలో ఏది చెప్పుకోవాలన్నా పెద్దవాళ్లు మీరే కాబట్టి మీతోనే చెప్పుకోవాలని వచ్చాం!”
”చెప్పండి బావగారు!” అన్నాడు ఉపేంద్ర. శార్వాణి కూడా ఆయన ఏం చెబుతారా అని చూస్తోంది. రమాదేవి బ్యాగ్‌ లోంచి డాక్యుమెంట్స్ లాంటివి బయటకి తీసి భర్త చేతిలో పెట్టింది.
శాంతారాం దాన్ని ఉపేంద్ర చేతిలో పెట్ట ”ఇవి మా ఇంటి తాలూకు వీలునామా పేపర్స్‌ బావగారు! వీటిని మీ దగ్గర వుంచండి!” అన్నాడు

ఇంకా వుంది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *