May 20, 2024

మాయానగరం – 21

రచన: భువనచంద్ర

బిళహరి కామేశ్వరరావు అనబడే “కామేష్ ” ని అడిగింది…. “ఎన్నాళ్ళు ఇక్కడ పడుండమంటావు? ” అని. ప్రస్తుతం బిళహరి కామేశ్వరరావు వుంటున్న రెండు గదుల పెంకుటిల్లు ( ఓ చిన్న కిచెను, ఓ వరండా, ఇంటికి వెనక వైపు వున్న పూర్వకాలపు లెట్రీను అధనం) సర్వేశ్వరరావుది. సర్వేశ్వరరావుకి లోకంలో కనిపించే సర్వమూ ఒక్కటే .. దాని పేరు ‘లాభం ‘ . లాభం లేకపోతే ఏ పని జోలికీ వెళ్ళడు. కామేశ్వర రావు ఫోన్ చేసి బిళహరి అనే అమ్మాయిని ప్రేమించానని , పెళ్ళి చేసుకుంటానని అప్పటి వరకు దారి చూపమని అనగానే సర్వేశ్వరరావు ఒప్పేసుకున్నాడు. సర్వేశ్వర రావు, కామేశ్వర రావు పని చేసేది ఒకే ఆఫీసులో. సర్వేశ్వరరావు కామేశ్వరరావు కంటే పదేళ్ళు పెద్దవాడు. అంతే కాదు పెళ్ళైనవాడు. అదీ ‘లాభం ‘ కోసం పెళ్ళి చేసుకున్నవాడు.
ఆ ‘లాభం ‘ అనేది ఏ రూపంలో వున్నా చాలు అనుకునేవాడు. అందుకే వెంటనే ఓ.కే. చెప్పేశాడు. ఓ షరతు మీద.. అదేమిటంటే ” ఆ అమ్మాయిని నా పెంకుటింట్లో వుంచుతా, నా చుట్టం అని చెబుతా, నువ్వు ఓ నాలుగైదు రోజుల తరవాత నాతో పాటు ఆ యింటికి రా. అప్పటి నుంచి రెండురోజులకోసారి కూరగాయలో, వంటదినుసులో “నేను ” పంపించానని నువ్వు అక్కడికి తీసుకెళ్ళు. హాయిగా మాట్లాడుకో. మీ యింట్లో వాళ్ళు పెళ్ళికి ఒప్పుకుంటారో లేదో కనుక్కో. ఒప్పుకుంటే ఓ.కే. లేకపోతే ఎలా అనేది జాగ్రత్తగా ప్లాన్ చేసి ఆలోచిద్దాం ! ” అని.
కూరగాయల మొక్కలు పెంచాలంటే చాలా శ్రద్ధ కావాలి. ముళ్ళ మొక్కలు వాటంతట అవే పెరుగుతై తామరతంపగా. సర్వేశ్వరరావు బుర్రలో వున్నవన్నీ ముళ్ళ పొదలే. కానీ ఖర్చులేకుండా ఓ రకమైన “లాభం ” రాబోతోందని విషయం వినగానే అతని బుర్రకి తట్టింది. అందుకే దూరాలోచనతో పధకం వేశాడు. ఇవేమీ తెలియని కామేశ్వరరావు సర్వేశ్వర రావుని ” ఏ ఫ్రండ్ ఇన్ డీడ్ ” గా కొలుస్తున్నాడు.
“ఎన్నాళ్ళో కాదు బిల్లూ! అతి త్వరలోనే మన పెళ్ళి జరిగిపోతుంది. మంచి రోజు చూసుకొని మీ అమ్మానాన్నని వొప్పించి వైభవంగా నిన్ను నాదాన్ని చేసుకుంటాను. ప్రామీస్…. మన ప్రేమ మీద వొట్టు. ” అన్నాడు కామేష్.
చాలా దీర్ఘంగా నిట్టూర్చింది బిళహరి. ఆమె మనసుకి కామేష్ అమాయకత్వం అర్ధం అవుతూనే వుంది. అంతేకాదు సర్వేశ్వర రావు గాడి విషపు చూపులు “ముళ్ళ మాటలు ” కూడా అర్ధం అవుతూనే వున్నాయి. కానీ ఏం చేయగలదు? మరోదారి లేదు. వెనక్కి వెళ్ళలేదు. ఈ పాటికి తన తల్లిదండ్రులు ఎప్పుడో తనకి “ఘట శ్రాద్ధం ” పెట్టేసి వుంటారు. (అంటే బ్రతికున్న వాళ్ళనే చచ్చిపోయినట్లు భావించి పెట్టే శ్రాద్ధం).
ఇలా నిట్టూర్చకు బిల్లూ.. నా మాట నమ్ము. ఒక్క నెల… అంతే!! ఆ తరవాత నేను నీ రాజుని, నువ్వు నా రాణివి! ” నాటకీయంగా అన్నాడు కామేష్.
************
రెండు రోజులు గడచిపోయాయి శంఖుచక్రపురంలో. అక్కడ ఓ “మహాకూటమి ” జరిగింది. వందమంది ఫాదర్లే కాక, రెవరెడ్ బ్రదర్స్, సిస్ట్రస్, ఇతర భక్తులూ పూటకి రెండు వేల విస్తర్లు లేచాయి. కేవలం వంట చేసినందుకు రోజుకి పదివేల రూపాయిలు ఇచ్చేట్టు ఒప్పందం జరిగింది.
వెంకటస్వామి మహదానందంగా వున్నాడు. కారణం ఫాదర్ జోసఫ్ అతన్ని ప్రత్యేకంగా మెచ్చుకోవడమే కాక, తనుండే బెంగుళూరు అడ్రస్ ఇచ్చి ” ఎప్పుడొచ్చినా ఓ.కె. ” అని అభయం ఇవ్వడం.
సినిమా పరిభాషలో చెప్పాలంటే వంట సూపర్ హిట్. “వెంకటస్వామీ… నువ్వు గ్రేట్ రా… నీ చేతిలో వంట మహాదేవి కూర్చుంది. అసలు నిన్ను చూస్తుంటే చంపాలని అనిపించడం లేదురా. మహాదేవన్ ఎలాగో పోతాడు. హోటల్లో నువ్వు నాకు తోడుంటే డబ్బేడబ్బు! కానీ నందిని నిన్ను మరిగితే? ” వంకరగా నవ్వి అన్నాడు పరమశివం. రోజుకో ఫుల్ బాటిల్ అందుతోంది వాళ్ళకి. నిఖార్సైన విస్కీ! అదీ ఫారన్ ది.
నవ్వి వూరుకున్నాడు వెంకటస్వామి. పరమశివం వాగుడు వెంకటస్వామిని ఏనాడో భయపెట్టడం మానేసింది. కారణం తను స్థిరంగా వుండటమే!
“వాడు అరిచే కుక్క… నేను అరవను. కరవాల్సి వస్తే భయంకరంగా కరుస్తా ” అని ఏనాడో వెంకటస్వామి నిర్ణయించుకున్నాడు.
రాత్రి ఆరున్నర దాటుతోంది. ఆరున్నరకే రాత్రి ఎందుకంటే, సాయంత్రం వర్షం భీకరంగా కురిసింది. ఆ ప్రాంతాలలో వర్షం చాలా తక్కువగా కురుస్తుంది. అలాంటిది “కూటమి ” మీటింగ్ ప్రారంభం కాగానే దడదడా ” వాన మొదలైంది. దాంతో భక్తులు ఆనంద పారవశ్యులయ్యారు. “హలలూయా… హ లెలూయా ” నినాదాలతో ఊరు మారుమ్రోగింది. ఆ ఆనందంతో జోసెఫ్ గారు “విరామం ” ప్రకటించారు.
ఆకాశమంత షామియానా ! కింద భక్తులు మిని డిన్నర్ చేస్తున్నారు. రెండు వేలమందికి పైమాటే. వెజిటేబుల్ బిర్యాని, కర్డ్ రైస్, చిప్స్, స్వీట్స్. చపాతీ మిక్స్డ వెజిటేబుల్ కర్రి ఉండనే వున్నాయి. ఆ సభా ప్రాంగణానికి దక్షిణాన వున్న చర్చి ఔట్ హౌస్ ముందు కూర్చుని వున్నారు వెంకటస్వామి, పరమశివం.
వడ్డన వాళ్ళ పని కాదు గనక రిలాక్స్ అయిపోవచ్చు. కానీ లోలోపల ఒకళ్లంటే ఒకరికి భయం. ఏ క్షణంలో ఎవరు ఎవరిని చంపుతారో తెలియని విచిత్ర స్థితి.
“నా…చాం..బాబా.. ” అంటూ పరిగెత్తుకొచ్చింది మూగమణి. ఆ పిల్ల మూగది. బా..బా … బి.. బి శబ్ధాలు తప్ప.. మాటలు రావు. వెంకటస్వామికి ఆ పిల్లంటే రెండు రోజుల్లోనే చాలా ఇష్టం కలిగింది. కారణం తనకి ఓ మూగ చెల్లెలుండటం. అయితే ఆ చెల్లెల్లు అయిదో ఏటే చచ్చిపోయింది.
మూగమణి వయసు పదెనిమిదేళ్ళు. పెద్దపెద్ద కళ్ళు , చెప్పలేని అందం. చిన్నప్పుడే ఆ పిల్లని చర్చి గేటు దగ్గర వదిలిపోవడంతో, చర్చివారే పెంచి పెద్ద చేశారు. మాట్లాడ లేదు కానీ, అన్నీ అర్ధమౌతాయి.
“ఆడి దగ్గరకు ఎందుకే మూగి… నా దగ్గరకు రా” వంకరగా నవ్వాడు పరమశివం. భయంగా వెంకటస్వామి వెనక్కి చేరింది మణి.
” పరమశివం… ఆ పిల్ల జోలికి రాకు. ” స్థిరంగా అన్నాడు వెంకటస్వామి.
“ఏం? లడ్డులా వుంది. యీ చుట్టుపక్కల ఎవరూ లేరు. హాయిగా పంచుకుందాం! ” ఇంకా వంకరగా అన్నాడు పరమశివం.
“నువ్వు వెళ్ళమ్మ… ” మణి భుజం తట్టి అన్నాడు వెంకటస్వామి.
“నో దాన్ని వదలను.. దాన్ని చెరుస్తా. నువ్వు అడ్డం వస్తే నిన్నూ చంపి నేరం నీ మీదకు తోస్తా. ” పంతంగా అన్నాడు పరమశివం.
“నువ్వెళ్ళమ్మ ” అని మరోసారి మణి భుజం మీద అనూనయంగా తట్టి వెళ్ళిపొమ్మని సైగ చేశాడు వెంకటస్వామి. ఆ పిల్లకి అర్ధమై చర్చి వైపు పరుగు తీసింది.
“వెంకటస్వామి ఇక నిన్ను బ్రతకనీయను. ” పిచ్చి కోపంతో లేచాడు పరమశివం.
“నువ్వు నన్నేమీ చేయలేవు ” కవ్వించినట్లు అన్నాడు వెంకటస్వామి.
చుర్రున కత్తిలాగాడు పరమశివం. అంత ఫాస్ట్ గా కత్తి లాగటం పక్కా ప్రొఫిషినల్ కి తప్ప సాధ్యం కాదని గుర్తించడానికి కొన్ని క్షణాలు పట్టింది వెంకటస్వామికి.
“పొడుస్తావా? పొడు. ఒకవేళ చచ్చినా, ఇంతమంది నిన్ను ఒంటరిగా వదిలిపెట్టరు. పారిపోవడం నీ అబ్బ తరం కూడా కాదు. ఊరు ఊరంతా నిన్ను చూశారు గనక, మనిద్దరి ఫొటోలు ముందుగానే వీళ్ళు తీసుంచారు గనక నువ్వెక్కడకి పారిపోయినా, తప్పించుకోలేవు.
ఒరే పరమశివం.. నాకు డబ్బంటే మోజు. అడ్డదారిలో పైకెళ్ళాలనుకొని మెంటాలిటీ నాది… కానీ నీలా కుక్కని కాదు! ” నిబ్బరంగా అన్నాడు వెంకటస్వామి. లోలోపల భయపడుతున్న బయటకు నిబ్బరం ప్రదర్శించకపోతే ముప్పు తప్పదని అతనికి తెలుసు.
“హి..హి.. నీ బుర్ర బ్రహ్మాడంగా పని చేస్తోందిరా! కానీ ఒరే , నువ్వు నన్ను చంపినా జరిగేది అదే.. అంటే తప్పించుకోలేవు. కనక ఇంకో పెగ్గు వేసుకొని లాభనష్టాల బారేజు వెసుకుంద్దాము… ఎవరు ఎవర్ని చంపితే మంచిదీ అని.. సరేనా! ” నవ్వాడు పరమశివం. ఆ నవ్వులో కౄరత్వం నిజంగా వెంకటస్వామిని ఒణికించింది.
“ఒరే స్వామీ… నాకెప్పుడో కానీ ఆడదాని మీద మోజు రాదు. ఆ మోజు కలిగే వరకు నేను మంచివాడ్నే. ఒక్కసారి కలిగిందనుకో దాన్ని వదలను. ఇప్పుడీ మూగది వుంది. దాన్ని అనుభవించాలన్న కోరిక వచ్చింది. చెడగొడితే మాత్రం అది అడిగేదెవుడు? చెడగొట్టినా ఎవరితో చెబుతుంది. నీతోటా? నువ్వే చెడగొట్టావంటాను. అసలు…. ” గటగటా గ్లాసు ఖాళీ చేశాడు పరమశివం.
రాత్రి సముద్రం లాంటిది. ఎన్ని కోట్ల రహస్యాలని తన కడుపులో దాచుకుంటుందో!!

*************

కొన్ని కొన్ని విషయాలకు వివరాలు అనవసరం. అఫ్ కోర్స్ వివరాలు తెలుసుకోవాలనే కుతూహలం మనుష్యులకి ఎక్కువ. అందుకే రూమర్లు రాజ్యాలని ఏలుతూ వుంతాయి.
అది కేవలం “గాలి కబురు ” అని తెలిసినా వివరాల గురించి జనాలు ఆరాతీయ్యడమే విచిత్రం. అలాంటిది తెల్లవార్లు ఓ ఆడదాని ఏడుపు వినిపిస్తే చుట్టుపక్కల వాళ్ళు ఎంత ఆరాటంగా ఆత్రంగా వివరాలు సేకరిస్తారు? ప్రస్తుతం జరుగుతున్నది అదే.
అయాచితుల సుందర రామమూర్తి చాలా బుద్ధిమంతుడు. ఇక్కడ తలదించితే ఆఫిసులో కానీ “తల ఎత్తని ” సుగుణాభిరాముడు. మరి ఆయన ధర్మపత్ని మదాలస తెల్లవార్లు ఎందుకు ఏడ్చినట్లు?
“సుభద్రొదినా… మొన్న ఆ టక్కులాడిని ఓ కుర్రాడితో చూశా. ఆరడుగులున్నాడు… భలే చాకులాగున్నాడనుకో … ఆలాంటి వాడ్ని ‘ఒళ్ళోకి ‘ తెచ్చుకుందంటే ఇదెంత జాణ అయుండాలీ? ఆ మొగుడేమో ఉత్తి అమాయకుడాయే! రంకు బయటపడి వుంటుంది… అందుకే ఉత్తుత్తి ఏడుపులేడుస్తోంది. లేకపోతే ఇన్ని గంటలు మొగుడు చచ్చినా ఏడవగలమా వదినా? ” అని దీర్ఘం తీసింది కృష్ణ సుందరి. ఆవిడకి యాభై దాటి ఐదారేళ్ళు దాటినా ఆ “యావ ” చావలేదు. మొగుడు ఎప్పుడో పోయాడు గనక నోటి దూల ఎక్కువ.
“మాంఛీ కొబ్బరి ముక్కలా వుండే ఆడదాయే! ఆ సుందర్రావేం సరిపోతాడు? ” సుందరమూర్తిని సుందర్రావుగా తప్పు పలికాడు తప్పోష్టు నాగభూషణం. వాళ్ళావిడ రెండు నెలలకోసారి పుట్టింటికి ఎందుకు వెళ్తుందో అతనికి బాగా తెలుసు.
“మంచి మాటన్నావన్నయ్య! వెధవ పిడపకాలము, సూపర్ తిండినూ, మగాలలో మగతనం ఎక్కడ చచ్చింది? ” దీర్ఘం తీసింది తాయారమ్మ.
అన్నీ వింటూ గుడ్ల నీరు కక్కుకుంటోంది నీరజ. ఆ పిల్ల గుండె అగ్ని గుండంగా వుంది.
ఇంకా వుంది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *