May 20, 2024

శుభోదయం 4

రచన: డి.కామేశ్వరి

రేఖమీద అత్యాచారానికి పట్టణం అంతా కదిలిపోయింది. ఆడపిల్ల తల్లిదండ్రులు భయంతో గుండెలమీద చెయ్యి వేసుకున్నారు. అన్ని కాలేజీలలో, హైస్కూళ్లలో విద్యార్థినులు పెద్ద అలజడి లేవదీసి వీధిలో గుంపులుగా ఊరేగి తోటి విద్యార్థిని మీద జరిగిన అత్యాచారానికి ప్రతీకారం కావాలి, సమాజంలో స్త్రీకి వున్న రక్షణ ఏమిటంటూ ముఖ్యమంత్రి వద్దకు బారులు తీరి వెళ్లి మెమొరాండం సమర్పించారు. ఆ వార్త ముఖ్యమంత్రిని కలచివేసింది. ఆయన దోషులని త్వరలో పట్టుకుని కఠినంగా శిక్షించుతామని స్వయంగా హామీ యిచ్చారు. రేఖమీద జరిగిన అత్యాచారానికి నిరసనగా అన్ని కాలేజీలలో విద్యార్థినులు క్లాసులు బాయ్ కాట్ చేశారు. వారికి అండగా మేమున్నాం అంటూ విద్యార్థులు కాలేజీ మానేశారు. విద్యాసంస్థలన్నింటికి ఆ రోజు సెలవు యివ్వక తప్పలేదు. రేఖమీద జరిగిన అత్యాచారం గురించి మీ అభిప్రాయం ఏమిటి అంటూ పత్రికలవాళ్లు అనేకమంది విద్యార్థినులని ఇంటర్వ్యూ చేసి ప్రచురించారు.
ప్రతి ఆడపిల్ల చాలా ఆవేశంగా ఈ యిరవయ్యో శతాబ్దంలో కూడా స్త్రీకి సమాజంలో రక్షణేలేదని, సాధించిన అభ్యుదయం అంతా మాటల్లో, వేషంలో తప్ప కార్యసాధనలో లేదని, ఎన్ని యుగాలు తడిచినా పురుషుల దృష్టిలో స్త్రీ విలాస వస్తువుగానే వున్నదనీ, ఈ మానం, నీతి అంతా స్త్రీకి అంటగట్టి పురుషుడు స్వేచ్ఛగా తిరుగుతున్నాడని, యిప్పుడు మానం కోల్పోయిందంటూ రేఖమీద ముద్ర వేస్తుంది సంఘం. ఆమె తప్పు లేకపోయినా చెడిపోయినా ముద్ర వేసి ఆమెని వెలేసి, ఆమె భవిష్యత్తుకి దారి మూసివేస్తుంది మన సమాజం. ఇప్పుడింక రేఖని పెళ్లాడడానికి ఏ పురుషుడన్నా ముందుకు వస్తాడా? ఇలా ఎందుకు జరగాలి? స్త్రీకో నీతి, పురుషుడికో నీతా? ఇలా స్త్రీలమీద అత్యాచారం జరిపే పురుషులని చట్టం అంత తేలిగ్గా వదలకుండా యింకా కఠినశిక్షకి గురిచేయాలి. అలాంటి రాక్షసకృత్యాలు జరిపే పురుషుడు ఎప్పుడూ తప్పించుకుంటున్నాడు. స్త్రీయే శిక్ష అనుభవిస్తూంది. ఈ మానభంగానికి గురి అయిన స్త్రీని ఓ నేరంలా, తప్పులా కాకుండా, అది ఓ యాక్సిడెంటు అన్న భావం పురుషులలో కలిగేటంత మార్పు రానిదే అలా గురి అయిన స్త్రీలకి విమోచనం వుండదు. అంటూ ప్రతీ అమ్మాయి రకరకాల అభిప్రాయాలు వ్యక్తపరిచి చాలా ఆవేశంగా మాట్లాడారు.
“భగవంతుడా! అసలే జరిగిన అవమానంతో తలెత్తుకోలేకపోతూంటే ఈ పేపర్లు మన బతుకు బట్టబయలు చేస్తున్నాయి ఏమిటండీ…! ఓ ఆడపిల్ల భవిష్యత్తు గురించైనా ఆలోచించకుండా ఇలా పేపర్లలో బహిరంగంగా ఫోటోతో సహా ప్రచురిస్తున్నారేంటండీ? మీరు గట్టిగా చెప్పండి వాళ్లకి..” రేఖ తల్లి వార్తలు చదివి ఉగ్రురాలై అంది. రేఖ తండ్రి అత్యాచారం జరిగిన రోజునించి ఆ షాక్ నించి యింకా కోలుకోలేదు. ఆయనమీద హఠాత్తుగా రెండు రోజులలో వార్ధక్యం ముంచుకు వచ్చినట్టుగా కృంగిపోయాడు.
“హు.. మన ఖర్మ యిలా కాలింది. రోడ్డుపై పడివున్న స్త్రీ గురించి వార్త రాసాం. మీ అమ్మాయిని నాల్గుగోడలనించి దాటించి అన్యాయంగా రాస్తే అనండి. పోలీసులు, డాక్టర్లు యిచ్చిన వార్తనే మేం రాశాం అంటారు. మనమేం చేస్తాం? దాని బతుకు రోడ్డున పడింది. ఇంక అంతే దాని గతి అంతే..” అన్నాడు ఆయన విచలితుడై పట్టుకున్న గొంతుతో.
భర్త దేనిగురించి బాధపడుతున్నాడో ఆమెకి అర్ధం అయింది. నిట్టూర్చి లోపలికి వెళ్లిపోయింది. వాళ్లిద్దరూ భోంచేసి రేఖకి కారియర్ పట్టుకుని ఆస్పత్రికి వెళ్లారు.
“రేఖా.. యివాళ నీ మొహం కాస్త తేటగా వుందమ్మా. గుడ్.. చూశావా మనసు తేలికపడితే శరీరం దానంతటదే కోలుకుంటుంది..” రాధాదేవి ఆప్యాయంగా ఆమె ముంగురులు సవరిస్తూ అంది.
“ఆంటీ.. దానికి మీకు నేను థాంక్స్ చెప్పుకోవాలి. మీ మాటలవల్లే నాకేదో ఘోర అన్యాయం జరిగిందన్న సంగతిని తేలిగ్గా తీసుకోగలుగుతున్నాను…. ఆంటీ.. మీరిచ్చిన ధైర్యంతో ఆ పీడకలని మరిచి పోగలననుకుంటున్నాను.”
అప్పుడే రూములోకి వచ్చిన రేఖ తల్లిదండ్రులు రేఖ దగ్గిర కూర్చున్న రాధాదేవిని చూసి గుమ్మం దగ్గిరే సర్పద్రష్టల్లా ఆగిపోయారు. ఆలికిడికి రేఖ, రాధాదేవి యిద్దరూ తలలు తిప్పి చూశారు. రాధాదేవి మొహం ఒక్క క్షణంలో పాలిపోయినట్లయింది.
“ఆంటీ, మా అమ్మ, నాన్నగారు… డాడీ.. ఈవిడ నిన్న చెప్పాను గదా మా కాలేజ్‌మేట్ శ్యాం. అతని అమ్మగారు రాధాదేవి..” రేఖ పరిచయం చేసింది.
“ఏమండి రాధండి..”
“రాధా .. నీవా, ఇక్కడ?..” అని రేఖ తల్లి, తండ్రి ఇద్దరూ ఒక్కసారిగా అన్నారు.
రాధాదేవి “మీరు.. మీరు రేఖ తల్లిదండ్రులా?” గొణిగినట్లుంది. ఒక్క క్షణం నిశ్శబ్దం తాండవం చేసింది.
“డాడీ.. మీకు రాధాదేవిగారు తెలుసా?” రేఖ ఆశ్చర్యంగా అడిగింది.
“ఆ..ఆ.. తెలుసు.. బాగా తెలుసు..” మాధవరావు ముందుగా తేరుకున్నాడు. రాధాదేవి అలా తన కూతుర్ని ఈ స్థితిలో చూడడం పుండుమీద కారం జల్లినట్లయింది. రాధాదేవి యిపుడేం చేస్తావు అని సవాల్ చేస్తున్నట్లుగా అవమానం పొందాడు. ఆమె మొహంలో వ్యంగ్యపు చిరునవ్వు మెదిలినట్టు అతనికి అనిపించింది… అంతే తనని అవమానపరచడానికి, ఎద్దేవా చేయడానికే వచ్చింది. అతనున్న స్థితిలో అంతకంటే ఆలోచించలేకపోయాడు..”రాధా, నీకిప్పుడు చాలా సంతోషంగా ఉందా? చాలా సంతృప్తిగా వుందా.. నీ అక్కసు తీరిందా.. నా కూతురు ఈ స్థితిలో వుంటే చూసి నవ్వి నా మీద ప్రతీకారం తీర్చుకోవాలని వచ్చావా? నవ్వు.. బాగానవ్వు.. నాకు బుద్ధి చెప్పు. బాగా శాస్తి జరిగిందని సంతోషించు. అదేగా నీకు కావలసింది. నా మీద ఇన్నాళ్లుగా పేరుకున్న నీ కక్ష చల్లారిందా?” మాధవరావు వళ్లు మరిచి ఆవేశంగా అన్నాడు. రాధాదేవి మొహంలో రక్తం పొంగింది. ఏదో చెప్పాలని నోరు తెరవబోయింది. పెదాలు వణికాయి. నోట్లోంచి మాట రాలేదు.
“ఏం. అర్ధం కానట్టు అలా చూస్తావు? కావాలని కాకపోతే యిన్నాళ్ల తరువాత సరిగా ఈ సమయానికి ఎలా వచ్చావు? అవకాశం కోసం కాచుకుని నా మీద దెబ్బ తీయాలని ఎదురు చూసి వచ్చావు. కానీ.. అనాల్సినవన్నీ ఆను..”కర్కశంగా అన్నాడు. అంతలోనే ఏదో గుర్తుకు వచ్చినట్టు.. “మైగాడ్!! రెండు రోజుల నుంచి బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను.. రేఖమీద ఎవరికీ యింత పగ ఎందుకని ఆలోచించాను.. రాధా.. నీవు..నీవు.. నా మీద కోపంతో, నా మీద కసితో యిలా చేసి ప్రతీకారం తీర్చుకుని సంతోషించాలనుకున్నావు. ఇది నీ పనే.. లేకపోతే యింకెవరికీ యింత క్రూరంగా, నిర్ధాక్ష్యిణ్యంగా పగ తీర్చుకునే అవకాశం లేదు.. రాధా.. ఇది నీ పనే.. ఓ మైగాడ్” మాధవరావు ఆవేశంతో రాధాదేవి మీదమీదకు వచ్చి కోపంతో వణికిపోతూ అన్నాడు. అందరూ నిశ్చేష్టులై చూడసాగారు.
ఈ అభియోగానికి రాధాదేవి మొహంలో ఒక్కసారిగా రక్తం పొంగింది. “మిస్టర్ మాధవరావు… స్టాపిట్.. వాట్ నాన్సెన్స్ యూ ఆర్ టాకింగ్” కోపంగా అరిచింది. “మీకు పిచ్చి పట్టిందా.. రేఖని నేను పాడు చేశానా..” వెర్రిదానిలా అంది.
“చేయించావు. నా మీద కక్ష తీర్చుకున్నావు..” కర్కశంగా అన్నాదు.
“మిస్టర్ మాధవరావు. డోంటాక్ ఎనదర్ వర్డ్.. మీకు నిజంగా పిచ్చిపట్టింది. ఇంతవరకు రేఖ మీ కూతురని, మీరు రేఖ తండ్రి అని కూడా తెలీదు నాకు. తెలిస్తే నా నీడ కూడా యిక్కడ పడనిచ్చేదాన్ని కాదు.”
“ఆహాహా.. తెలీదూ. నా పేరు తెలీదూ. తెలీకుండానే యింత నీచానికి వడిగట్టావన్నమాట…”
“చీ..” రాధాదేవి తిరస్కారంగా చూస్తూ చీత్కారం చేసింది. “మాధవరావు.. యిన్నాళ్లూ నీవో మనిషివనుకున్నాను. ఇంత నీచంగా, యింత హేయంగా ఆలోచించే హీనుడవని తెలియలేదు.. నీ మీద కక్ష వుంటే నీ మీదే తీర్చుకోగలను. దానికోసం ఓ అభంశుభం తెలియని ఆడిపిల్లని వాడుకోను. అండర్‌స్టాండ్.. యింకొక్క మాట మాడ్లాడావంటే పరువునష్టం దావా వేస్తాను..”ఆడపులిలా గర్జించింది.
” నా కూతురు ఇలా కావడానికి కారణం నువ్వే అని కేసు వేస్తాను..”పౌరుషంగా అన్నాడు.
రాధాదేవి అదోలా నవ్వింది. “వేయి. తప్పకుండా వేయి.. మిస్టర్ మాధవరావు. నీవెంత చేసినా ఇన్నాళ్లుగా, యిన్నేళ్ళుగా నా మనసులో ఏమూలో నీకు స్థానం వుండేది. నౌ.. యూ ఆర్ డెడ్ టు మీ. శ్యాం.. పద వెడదాం..”ముందుకు వెళుతూ ఒక్క క్షణం ఆగి… రేఖవంక చూసి ” రేఖా.. నీ స్థితి చూసి మతిపోయిన నీ తండ్రి మాటలు నిజమని అనుమాన పడకమ్మా.. నేనూ ఆడదాన్ని.. ఎంత నీచురాలనైనా… యింత నీచానికి వడిగట్టనని నమ్ము..” అంటూ వడివడిగా గదిలోంచి వెళ్లిపోయింది.
“శ్యాం.. ఆంటీ” అంటూ నిస్సహాయంగా చూసింది రేఖ. శ్యాం ఒక్కక్షణం ఆగి ఏదో అనబోయి మాధవరావు వంక ఒకసారి చూసి తలదించుకుని వెళ్లిపోయాడు.
“వీడెవడు? దాని కొడుకా!! ఆ నల్లవెధవ యింతవాడయ్యాడన్నమాట..” కర్కశంగా అన్నాడు మాధవరావు శ్యాంని చూస్తూ..
“డాడీ..” బాధగా అరిచింది రేఖ… “ఎవరో రౌడీ వెధవలు చేసిందానికి రాధాదేవిగార్ని నిందిస్తావేమిటీ.. ఆవిడని అలా యిన్సల్టు చేశావు. ఆవిడ ఎంతో మంచావిడ డాడీ.. నాకెంత ధైర్యం చెప్పిందో.. ఎంత ఓదార్చారో..”
“ఆ. ఆ… చేసింది చేసి , తన మీదకు రాకుండా నీ దగ్గిరకు వచ్చి కల్లబొల్లి మాటలు చెప్పిందన్నమాట. రేఖా.. నీకేం తెలీదు అసలు సంగతి. నాకు తెలుసు. ఆవిడకి నీమీద కక్షకాదు నా మీద కక్ష.. నా మీద ప్రతీకారం తీర్చుకోవడానికి నిన్ను ఉపయోగించుకుంది. బదులు తీర్చుకుంది ఇన్నాళ్లకి” తండ్రి మొహంలో పొంగుతున్న కోపం చూసి రేఖ ఇంకేం అనలేక, ఏం అర్ధం కాక ఆ క్షణంలో అంతకంటే ఆలోచించే ఓపిక లేక నెమ్మదిగా తలగడ మీదకి జారింది.
“ఇది రాధ పని కాదేమోనండి. మీ మీద ఎంత కోపం వున్నా రేఖ మీద యింత క్రూరంగా పగ తీర్చుకోలేదండి. ఎంతయినా ఆడది. అందులో.. ” అంతవరకు మౌనంగా శ్రోతలా మిగిలి, భర్త అభియోగం నిజమా అబద్ధమా అని సంకోచిస్తూ రాధాదేవి మొహం చూసి నిజం కాదనిపించి నెమ్మదిగా అంది ఆవిడ.
“లేకపోతే యింకెవరు చేశారింతపని? రోడ్డున పోయే రౌడీలు ఏదో వాగుతుంటారు తప్ప ఇంతలా ప్లాన్ చేసి చేయరు? ఖచ్చితంగా అన్నాడు.
“ఏమో, నిజానిజాలు భగవంతుడికే తెలియాలి..” ఆవిడ బత్తాయి పళ్ల రసం తీయసాగింది.
**********

“ప్లీజ్.. శ్యాం.. ఫర్ గాడ్ సేక్.. నన్నేం అడక్కు, నేనేం చెప్పలేను.. వెళ్లు.. నన్ను విసిగించకు..” రాధాదేవి అరిచింది.
తల్లి కోపం ఎన్నడూ చూడని అతను ఖిన్నుడై చూశాడు. అతని మొహం చూసిన రాధాదేవి అనవసరంగా శ్యాం మీద తన కోపం చూపినందుకు లజ్జితురాలై “శ్యాం.. నన్నేం అడగకు. నేనేం చెప్పలేను చెపితే విని నువ్వు భరించలేవు.. వెళ్లు శ్యాం.. నన్ను కాసేపు వంటరిగా వదలి వెళ్లు” రాధాదేవి ఆవేదనగా తల తిప్పుకుంది.
అరగంటనించి శ్యాం ఆరాటంగా తల్లిని ఎన్నో ప్రశ్నలు వేశాడు. ఇంటికి వస్తుండగా ఆటోలోనే తల్లిని ఎన్నో విధాలుగా అడిగాడు. “ఎవరమ్మా ఆయన? రేఖ మీద అత్యాచారం నీవు చేయించావంటాడేమిటీ..” కోపంగా అడిగాడు. రాధాదేవి కళ్లలో తిరుగుతున్న నీరు కొడుకు కంటపడకూడదని తల అటు తిప్పుకుంది.
“అమ్మా! అసలు ఆయనెవరమ్మా? నీకు ఆయనపై కక్ష ఏమిటీ?” దానికీ జవాబు లేదు. మాటిమాటికి కళ్లల్లో వుబుకుతున్న కన్నీళ్లని యింక దాచలేక కొంగుతో తుడుచుకుంది. దాంతో శ్యాంకి పట్టరాని ఆగ్రహం కల్గింది. “అమ్మా, నీవు చెప్పకపోతే నా మీద వట్టే. అసలు ఆయనెవరు నిన్ను అన్ని మాటలు అన్నాడు. నీవు అనవసరంగా తొందరపడి వచ్చేశావుగాని, వుండి ఆయనన్నవాటికి నోరు మూయించి రావాలనిపించింది నాకు. అసలు సంగతి ఏమిటో తెలియకుండా ఏం అనలేక వచ్చేశాను. నాకు చెప్పు వెళ్లి వాడిపని పడ్తాను. మనం రేఖ కోసం అంత బాధపడ్తుంటే మనం చేయించామంటాడా స్టుపిడ్…” ఆవేశంగా అన్నాడు.
తల్లి మౌనం అతనిలో మరింత అసహనాన్ని పెంచింది.
“అమ్మా..” అసహనంగా ఏదో అనబోతుంటే… “ష్.. ఆటోలో ఏమిటి గొడవ.. నీవూరుకో. నా మనసు బాగులేదు అసలే, నన్ను చంపకు..” అంది రధాదేవి.
శ్యాం యిల్లు చేరాక మళ్లీ మళ్లీ అడిగాడు. “అమ్మా, నీవు ఏదో దాస్తున్నావు నా దగ్గిర, ఏమిటో చెప్పాలి. ఏమీ లేకపోతే ఆయనన్న మాటలకు నీవు ఎందుకూరుకుంటున్నావు? నాతో చెప్పడానికేం..” ఎన్నో విధాలుగా అడిగాడు. రాధాదేవి మొహం, కళ్ళు ఏడ్చినందువల్ల ఎర్రబడ్డాయి. ఇంటికెళ్లి బాత్‌రూంలో మొహం కడిగి వచ్చినా కళ్లనించి నీరు వూరుతూనే వుంది. ఏమీ లేకపోతే ముక్కూమొహం తెలియనివాడు అంతలా అనలేడని, ఎవడో ఏదో అన్నంత మాత్రాన తల్లి అంతలా బాధపడదని అనిపించింది శ్యాంకి.
శ్యాం అడిగే ప్రశ్నలకి జవాబు చెబితే ఇన్నాళ్లుగా తను వాడినించి దాచిన రహస్యం విని భరించగలడా? రాధాదేవి బాధ అది. మాధవరావు అన్నదానికి తాత్కాలికంగా బాధపడి నొచ్చుకున్నా… యిప్పుడు ఆ విషయం శ్యాంకి చెప్పి వాడి మనసు నొప్పించడానికి ఆమె మనసు వప్పలేదు. అంచేత అనవసర కోపం నటించి శ్యాంని కసిరింది.
“అమ్మా.. నీకు చెప్పడం యిష్టం లేకపోతే నిన్నింక విసిగించను.. కాని ఒక్క సందేహానికి మాత్రం జవాబు చెప్పు. ఆయన.. ఆయన…”
రాధాదేవి నిశ్చలంగా చూసి “అవును.. నీ ఊహ సరి అయినదే, అతను నా భర్త ఒకప్పటి భర్త..” అంది.
శ్యాం మొహం ఒక్కక్షణం వెలిగింది. “అంటే నాన్నగారు..”
“ఇంకేం అడగకు. వెళ్లు.. నన్ను వంటరిగా వదులు” శ్యాంని ఒక విధంగా బలవంతంగా అవతలికి నెట్టి తలుపులు మూసుకుని పక్క మీద వాలిపోయింది ఆమె.
మాధవ్… మాధవ్.. ఎంత మాటన్నాడు. ఎంత మాట అనగలిగాడు. తననెంత నీచంగా ఊహించాడు. ఎంత నీచంగా మాట్లాడగలిగాడూ. ఆ ప్రేమ.. ఆ అనురాగం.. అన్నీ మరిచిపోయినా.. ఆ తాలూకు నీడలే ఆమె మనసులో అతనికి మిగిలితే తనని గురించి ఇంత నీచంగా ఊహించేవాడు కాదేమో! ఏమూలో ప్రేమించి పెళ్లాడి కాపురం చేసిన భార్య అన్న మమత అయినా వుంటే అతనింత కఠినంగా తనని ఈ విధంగా అవమానించగలిగేవాడా? ఈ మమతలు, ఈ ప్రేమలు యింత క్షణికమా! అతనితో అన్ని బంధాలు తెంచుకుని వచ్చి ఇరవై ఏళ్లయినా ? తన మనసులో మాధవ్‌కి ఏదోమూల స్థానం వుంది. అలాంటిది మాధవ్.. యింతలా తనని ఎలా ద్వేషించగలిగాడు. కన్నమమకారం ప్రేమని తోసిపుచ్చి అలా అనిపించిందా.. రేఖ .. మాధవ్ కూతురు! ఎంత చిత్రం.. మాధవ్ పోలికలు తను గుర్తించలేకపోయింది. రేఖ తల్లి పోలిక కాదు తండ్రి పోలిక. ఆ పోలిక ఎక్కడో చూసినట్లనిపించింది కాని మాధవ్ కూతురని ఎలా అనుకోగలదు. ఒకే వూర్లో వుంటూ. ఒకరి వునికి ఒకరికి తెలియనే తెలియలేదు.. శ్యాం.. రేఖ.. రేఖని శ్యాం తీసుకురాకపోతే ఈ గొడవ వుండేది కాదు.. యిన్నాళ్ల తరువాత తను ఈ విధంగా మాధవ్ చేత పరాభవం పొందడానికే రేఖ తమకి చేరువైంది. తనలో తను గతం గుర్తు తెచ్చుకుంటూ కుమిలిపోసాగింది రాధాదేవి. మర్చిపోయిన మాధవ్ మానుతున్న గాయాన్ని కెలికాడు. ఉత్త కెలకటమే కాదు. ఇంత కారం జల్లి మంట రేపాడు. రాధామాధవ్. ఎంత తియ్యగా, మత్తుగా వుండేవి ఆ పిలుపులు. ఆ పేర్లు. రాధా.. మాధవ్.. ఎంత చక్కటి జంట అనేవారంతా.. నిన్న మొన్నలా వుంది యింకా యిద్దరూ చెయి చెయ్యి కలుపుకుని నడిచి వస్తున్నట్లు..
*****
రిజిస్ట్రార్ ఆఫీసులో సంతకాలు చేసి పూలదండలు మార్చుకుని చేయి చేయి కలుపుకుని మెట్లు దిగుతుంటే మాధవ్ చేతిలోని రాధ చెయ్యి వణికింది.
“భయంగా వుందా రాధా?….” మెల్లిగా చెయ్యి నొక్కి అన్నాడు మాధవ్.
రాధ సిగ్గుతో తలదించుకుంది. “ఊహూ. కాదు..” యింకేదో చెప్పబోయి చెప్పలేక కళ్లు వాల్చుకుంది.
టాక్సీ దగ్గరకి రాగానే మిత్రులంతా మరోసారి అభినందనలు తెలిపి నూతన దంపతుల దగ్గిర శలవు తీసుకున్నారు. ఇద్దరూ టాక్సీ ఎక్కారు. అందరూ చేతులూపుతుండగా టాక్సీ కదిలింది.
“రాధా! ఏమిటంతలా సిగ్గు పడ్తున్నావు. కొత్తవాడినా నీకు” చిలిపిగా అన్నాడు చెయ్యి చేతిలోకి తీసుకుని. “పెళ్లికూతురు కాగానే సిగ్గు ముంచుకు వస్తుంది కాబోలు మీ ఆడవాళ్లకి.” కొంటెగా అన్నాడు.
రాధ చెయ్యి లాక్కుని కోపం నటిస్తూ “అదేం కాదు” అంది బింకంగా.
“మరేమిటి?” అన్నాడు మాధవ్.
రాధ జవాబు చెప్పకుండా మెల్లిగా హ్యాండ్‌బాగులోంచి పసుపుతాడుకి కట్టిన మంగలసూత్రాలు తీసి మాధవ్ ముందు చెయ్యి జాపింది. మాధవ్ ఒక్క క్షణం ఆశ్చర్యంగా చూసి “ఇదేంటి?” అని అంతలోనే నవ్వేసి “రిజిస్టర్ పెళ్లి సరిపోలేదన్నమాట. ఈ మంగలసూత్రంతో బంధిస్తే కాని నీ భర్తని కాదనిపించిందా?” అన్నాడు.
రాధ చప్పున “అది కాదు.. మధూ.. నీకర్ధం అయ్యేట్టు చెప్పలేను..” అంది తల దించుకుని.
ఆమె మొహంలో భావం చెప్పక్కర్లేకుండానే అర్ధం అయింది మాధవ్‌కి. ఆర్ధ్రంగా ఆమె వంక చూసి ఆ చెయ్యి మృదువుగా నొక్కి “నీ ఇష్టాన్ని నేను కాదనను రాధా.. ఇలాగె అది. టాక్సీలోనే కట్టేయమంటావా ఏమిటి, లేక యింటికి వెళ్లాక..” అన్నాడు.
“కాదు. దేవాలయానికి వెడదాం. టాక్సీవాడికి చెప్పు..”
“చంపావు.. ఇదంతా ఏమిటి రాధా.. యూ సిల్లీ గర్ల్… ముందెందుకు చెప్పలేదు. సరే పద, నీ ముచ్చట నేనెందుకు కాదనడం..”
దేవాలయంలో అర్చకుడు మంత్రం చదువుతుణ్డగా మాధవ్ రాధ మెడలో మంగలసూత్రం కట్టాడు. పూజారి అందించిన కుంకుమ నుదుట దిద్దాడు. మెడలో పసుపుతాడుతో, నుదుట కుంకుమతో కళకళలాడే రాధ మొహం చూసి రాధ కోరిక అర్ధం అయి సంతృప్తిగా నిట్టూర్చాడు. రాధ.. రాధ మొహంలో ఎన్నాళ్లకి కళ కనిపించింది. రాధ అందుకోసమే మంగళసూత్రం కట్టించుకుంది. పచ్చని పసుపుతాడుకి వున్న పవిత్రత రిజిష్ట్రార్ ఆఫీసులో సంతకాలతో ఎలా వస్తుంది? ఎంత్ ఆధునికులమవుతున్నా ఈ సెంటిమెంట్లు, చాందసభావాలు మనుషులని వదలవు కాబోలు.. నవ్వు వచ్చింది మాధవ్‌కి.
“ఇంకేమన్నా తంతు వుందా, అయిందా” అన్నాడు మాధవ్ నవ్వుతూ. రాధ కోపంగా చూసింది. “పద, యింటికి వెడదాం”
టాక్సీ కదిలింది.
“రాధా.. అందరూ వుండి ఎవరూ లేనివాడిలా ఈ రోజు నాకై నేను నిన్ను తీసుకెడుతున్నాను. అమ్మావాళ్లు యిదంతా ఎంత సంబరంగా చేసి వుండేవారు యిదంతా యింకో సందర్భంలో అయితే.. ” దిగులుగా అన్నాడు మాధవ్.
“నావల్లే కదూ.. అన్నింటికి దూరం అయ్యావు మధూ..” బాధగా అంది.
“అదికాదు రాధా.. నాకోసం కాదు ఈ బాధ. నీకోసం..నీకెవరూ లేరు ఎలాగూ. నా వారు వుండీ.. ఇంటికెడితే కొత్త కోడలిని గుమ్మంలో ఆహ్వానించేవారైనా లేకుండా కొత్త పెళ్లికూతురిలా నిన్ను తీసుకెళ్లలేకపోతున్నానని నా బాధ.”
“పిచ్చి మధూ.. నా యింటికి నన్ను ఒకరు ఆహ్వానించేదేమిటి.. నీవే దగ్గిరుండి తీసుకెడ్తూండగా ఇంకెవరో లేరన్న దిగులెందుకు” రాధ నిండుగా అంది.
టాక్సీ యింటి ముందాగింది. ఇద్దరూ దిగి లోపలికి నడిచారు.
“ఆగు నాయనా.. ఆగండి..”యింటావిడ పార్వతమ్మ ఆదరాబాదరాగా లోపల్నుంచి వచ్చింది. సంబరంగా చూస్తూ “అమ్మాయ్ శారదా, హారతి తీసుకురా..” హడావిడిగా లోపలికి కేకపెట్టింది. మాధవ్ , రాధ ఇద్దరూ ఆశ్చర్యంగా చూశారు.
మాధవ్ యింటి పోర్షన్ గుమ్మాంలో గడపకు పసుపు పూసి కుంకం పెట్టి వుంది. వరండాలో ముగ్గులు వేసి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి వుంది. మాధవ్ ఆశ్చర్యంగా చూశాడు. “మీరు.. మీరు చేశారా యిదంతా..” అన్నాడు ఆనందంగా..
“అవున్నాయనా,, ఎంత రిజిష్టరు పెళ్లి చేసుకు వస్తున్నా కొత్త కోడలు గుమ్మంలోకి వస్తుంటే గుమ్మానికి పసుపు పూసి, మామిడాకన్నా కట్టకుండా వుంచడానికి నా ప్రాణం వప్పలేదు సుమా.. అందుకే ఉదయం తాళం అడిగి పుచ్చుకున్నాను.”
మాధవ్ కళ్లు కృతజ్ఞతతో చెమ్మగిల్లాయి. తల్లి గుర్తు వచ్చింది ఆ క్షణాన. చటుక్కున వంగి పార్వతమ్మ కాళ్లకి నమస్కారం పెట్టాడు. రాధ కూడా వంగింది.
“అయ్యయ్యో.. వుండు నాయనా.. ముందు హారతి యియ్యనియ్యి.” పార్వతమ్మ గాభరాగా యిద్దరిని లేపి కూతురి చేతిలో పళ్లెం అందుకుని యిద్దరికీ బొట్టుపెట్టి హారతి యిచ్చి అక్షింతలు చల్లింది..”కుడిపాదం ముందుపెట్టి లోపలికి పదమ్మా…” అంది రాధ చెయ్యి పట్టి నడిపిస్తూ.. రాధ లోపలికి రాగానే మెడలో మంగళసూత్రంవంక ఆశ్చర్యంగా చూసి “రిజిష్టర్ పెళ్లన్నావుగా నాయనా” అంది పార్వతమ్మ.. “అయ్యో ఈ మాట చెప్తే మేం రాకపోయేవారమా. వంటరిగా వెళ్లకుండా” అంది నొచ్చుకుంటూ.
“అబ్బే లేదండి. రిజిష్టర్ పెళ్ళే చేసుకున్నాం. కాని యిదిగో ఈవిడ ముచ్చట యిది. మంగళసూత్రం చూపించి కట్టమంది. దేవుడి గుళ్లో మూడుముళ్లు వేశాను.” నవ్వుతూ అన్నాడు మాధవ్.
“మంచిపని చేశావు నాయనా, అమ్మాయి. నిజంగా యిప్పుడు నిండుగా వున్నావు. పసుపుతాడు లేకపోతే పెళ్లికి నిండేమిటి” పార్వతమ్మ రాధని చూసి “బంగారు బొమ్మని సంపాదించావు. యిలాంటి కోడలిని చూసుకునే అదృష్టం మీవాళ్లకి లేదు. దేనికన్నా పెట్టిపుట్టాలి. ఒసేవ్ శారదా.. ఏమిటలా చూస్తున్నావు. ముందు కాఫీ తీసుకురా” అంది పార్వతమ్మ..”ఉదయం నించి ఒకటే సంబరపడిపోతుంది నాయనా.. ముగ్గులు పెట్టి, పసుపు కుంకుమలు పెట్టి వూరికే గాభరాపడిపోతుంది. చూడు బాబూ మీ ఇద్దరి భోజనం ఈ పూట మా ఇంట్లోనే. నాలుగు బూరెలు, యింత పులిహార కలిపాను. పెళ్లిరోజు కదా అని. శారదే చేసింది అన్నీ” కూతుర్ని చూస్తూ అంది.
” ఓ .. యిదంతా శారద పనన్నమాట.. థాంక్స్ చెప్పండి ” మాధవ్ నవ్వుతూ అన్నాడు.
శారద సిగ్గుగా తల దించుకుంది.
“కూర్చో అమ్మా కూర్చో, ఈ ఇల్లు నీది. నీ ఇంట్లో నీకు సిగ్గెందుకు. కొత్త పెళ్లికూతురివి యింటికి వస్తే నా అన్నవాళ్లు లేకపోయారేనని నా బాధ.”
“ఎవరూ లేని లోటు మీరు తీర్చారు కదా పిన్నిగారూ” రాధ మనస్ఫూర్తిగా అంది.
“నే చేసిందేముందమ్మా. అబ్బాయి నిన్ను తీసుకొస్తున్నానని చెప్పగానే అయ్యో అందరూ వుండి ఎవరూ లేనివారయ్యారే, హారతిచ్చి లోపలికి తీసికెళ్ళేవారన్నా లేరే, అనిపించి ఈ మాత్రం చొరవ తీసుకున్నాను. అబ్బాయికి చెప్పకుండా. అవును గాని నాయనా అమ్మానాన్న దగ్గరికి తీసికెళ్లావా.. ఒకసారి చూపించి ఆశీర్వాదం తీసుకో బాబు” అంది పార్వతమ్మ.
“వెళ్లాలంటారా? వెడితే.. మొహం చూడను పొమ్మన్న యింటికి ఏ మొహంతో వెళ్లను..” సందిగ్ధంలో పడి అన్నాడు.
“పిచ్చివాడా!! తల్లిదండ్రుల కోపం ఎన్నాళ్లుంటుంది? వున్నా బంగారంలాంటి కోడలుని చూశాక కరిగిపోతుందిలే. వాళ్ళేం అనరు. ఒకసారి వెళ్లడం నీ ధర్మం. తప్పకుండ వెళ్లి కనపడి రండి బాబూ..”
“హు.. మీకు నాన్న సంగతి తెలియదు. అయినా. సరే మీరన్నట్టు కొడుకుగా నా ధర్మం నెరవేరుస్తాను..” అన్నాడు మాధవ్.
“వెళ్లు నాయనా, కనీసం మీ అమ్మగారి తృప్తికోసమన్నా వెళ్లు. ఆవిడ ప్రాణం ఎంత కొట్టుకుంటుందో” ఆర్ద్రంగా అంది పార్వతమ్మ.
తల్లి జ్ఞాపకాలతో మాధవ్ మనసు కలతపడింది.
రాధ దోషిలా తలదించుకుంది..

ఇంకా వుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *