May 19, 2024

పుస్తక సమీక్ష: అమృతవాహిని                                                      –

మణి వడ్లమాని

అమృతవాహిని అవును ఆ పేరే ఒక తీయటిధారని  పానం చేస్తున్నంత  అనుభూతినిస్తుంది. రచయిత్రి సుజల గంటి రాసిన ఈ నవలకి ఆంధ్రభూమి వారు నిర్వహించిన నవలల పోటీలో ద్వితీయ బహుమతి వచ్చింది. ఇప్పటి దాక వీరు వ్రాసిన నవలలు ఆరు. ఏడవది ప్రచురణకి సిద్ధంగా ఉంది. ఈమె మొట్టమొదటి నవలకే  ప్రతిష్టాత్మకమైన అనిల్ అవార్డు వచ్చింది. రాసిన ఆరు నవలలో మూడు నవలలకి బహుమతులు పొందారు  దాదాపుగా నలభయి కధలు వ్రాసారు. వాటిలో కొన్ని కధలకి బహుమతులు పొందారు. ఈ నవల  ఆంధ్రభూమిలో ధారావాహికగా వచ్చినప్పుడు   మా అమ్మగారు  (ఆవిడకి 77 ఏళ్ళు) చదివి “అరవయి, డెబ్భయి దశకంలో వచ్చిన సీరియల్స్ ని ఎంత ఉత్సుకతతో ఈ సీరియల్  అంతే ఉత్సాహంగా  చదివేదాన్ని, తఱువాయి భాగం కోసం వచ్చేవారం వరకు ఎదురు చూడాలా? నవలగా  వస్తే  బాగుండును” అని అన్నారు. ఆ విధంగా మా అమ్మగారు మాత్రమే  కాదు ఎందరో పాఠకులు వారపత్రికలో  ఈ సీరియల్ కోసం  చాలా ఆసక్తిగా  ఎదురు చూసేవారు.

ఈ నవలకి కేంద్రబిందువైన మంజరి జీవితమంతా సమస్యల వలయంలోనే చిక్కుకుంటుంది. కాని ఆవిడలో ఉండే  పోరాడే గుణమే అన్నిటినీ ఎదుర్కోవడానికి సంసిద్ధమవుతుంది. చిన్నతనంలో పడ్డ కష్టాలకి ఆమె అంతగా బాధపడదు. కాని ప్రేగు తెంచుకొని పుట్టిన కన్నకొడుకు, గోరు ముద్దలు తిన్న కొడుకు, తన వేలుపట్టుకొని తప్పటడుగులు వేసిన కొడుకు, పెద్ద వయసులో తల్లిని చూసుకోవలసిన కొడుకు అవసరం తీరిపోయాక తెప్పని తగలేసే కుత్సితడని  తేలిపోవటంతో, ఒక్క క్షణం కుమిలిపోయినా … “చీ, నేనేం తప్పు చేశాను? ఆ మాత్రం  బ్రతకలేనా ఈ పరాయి దేశంలో” అని, తనకు తనే ధైర్యంగా నిలబడి  జీవనం సాగించాలని నిర్ణయం తీసుకుంటుంది.

ఇక్కడనుంచి  జీవితంలో మరో మలుపు తిరుగుతుంది. మొదటగా తన మేనకోడలుకి పరిచయస్తులయిన  డాక్టర్ దంపతుల ఇంట్లో వాళ్ళ పాపని చూసుకునే  నానీగా వెళుతుంది. అక్కడ జీవితం ఏంతో సాఫీగా సాగుతున్న సమయంలో  ఊహించని విధంగా ఆ  దంపతుల మరో ప్రదేశానికి వెళ్ళిపోవలసి వస్తుంది. అప్పటికి వాళ్ళు తమతో తీసుకొని వెళతామని అంటారు. అయితే మంజరి ఆలోచించుకుంటుంది. పాప పెద్దదయింది. తనతోటి అంత అవసరముండదు. పని లేకుండా ఎంతకాలం వాళ్ళ దగ్గర ఉండగలదు? లేదు, ఈ సమస్యకి  వేరే  పరిష్కారం చూసుకోవాలి  అనుకుంటుంది. ఆలోచిస్తుండగా డాక్టర్ ఇంట్లో మంజరి చేతివంటను రుచి చూసిన ఆ స్నేహితుడు ఆమెకి తన విజిటింగ్ కార్డు ఇస్తూ అంటాడు మంజరిగారు ఏదైనా  అవసరం పడినప్పుడు నాకు చెప్పండి. ఎటువంటి మొహమాటం లేకుండా అని.  ఆ సంగతి గుర్తుకు వచ్చి అతనికి ఫోన్ చేస్తే, అతను వెంటనే రమ్మనమని చెప్పి తను నడిపే రెస్టారెంట్ లో భాగస్వామ్యరాలుగా చేర్చుకుంటాడు.

ఆనందంగా రోజులు గడుపుతున్న మంజరి జీవితంలోకి  జాన్ ప్రవేశించాడు. అతని రాకతో ఆమెకి ఒక మానసిక తోడు దొరికింది. ఈ సంగతి తెలిసిన కొడుకు ఆమె మళ్ళీ పెళ్లి చేసుకున్నందుకు నానా మాటలు అంటాడు. అది భరించలేని మంజరి, జాన్ తో సహా ఇండియాలోని హైదరాబాద్ కి వెళ్ళిపోతుంది. అక్కడ  కొంతమంది అనాధ పిల్లలని చేరదీసి వాళ్ళని అమ్మగా అమృతమూర్తిగా  చూసుకుంటూ కాలం గడుపుతూ ఉండగా. ఒక రోజున భార్యని, ఉద్యోగాన్ని పోగొట్టుకొని మంజరి కొడుకు తల్లి చెంత చేరుతాడు. తల్లి కదా, ఆమెకి క్షమాగుణం పుట్టుకతోనే ఉంటుంది. వికలమైన మనసుతో వచ్చిన కొడుకుని ఆదరించిన ఆ అమృతమూర్తి ఈ లోకం నుండి నిష్క్రమించినా ఆమె ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ ఆ కొడుకు ఈ అమృతవాహిని ఎప్పటికి ఇలాగే  నిరంతరం ప్రవహించాలి అని అనుకుంటాడు.

ఈ నవలలో కష్టాలు, కన్నీళ్ళు ఉన్నా వాటిని ఒక క్రమంలో చూపించారు. ఇందులో స్త్రీ పాత్ర మంజరి ఒక డైనమిక్ లేడీ.  వంటలు చేస్తూ, కుట్లు అల్లికలు చేసుకుంటూ జీవనం సాగించే ఓ ఆడది అమెరికా వెళ్ళడం , అక్కడ నెగ్గుకు రావడం చాలా కష్టం అనే అభిప్రాయం ఉన్నవాళ్ళకి ఈ నవలలోని యాభై ఏళ్ళ మంజరి  ఏదీ అసాధ్యం కాదు సుసాధ్యమే అని నిరూపించింది.

ముందు మాట రాసిన, ప్రముఖ రచయత, సినీగేయ రచయిత భువనచంద్ర గారు ఒక విలువైన మాట అన్నారు. “తమ వ్యక్తిత్వం సిన్సియర్ గా మలచుకునే వారికి ఈ నవల ఖచ్చితంగా ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని మాత్రం నిర్ద్వంద్వంగా చెప్పగలను”.

మరో ముందుమాట రాసిన ప్రముఖ రచయిత్రి డాక్టర్ మంథాభానుమతి గారు “ఆర్ద్రతతో సాగే ఈ నవల చదివాకా ఒక రకమైన ఉద్వేగానికి లోనవక తప్పదు ఎవరికైనా! పాఠకుల మనసుని ఊపేసి కదిలించి వేస్తుంది”  అన్నారు.

ప్రముఖ రచయత శ్రీధర్ గారు ఈ నవలను సమీక్షిస్తూ “తన కోసం తాను బతకడం కాదు, ఇతరులకోసం బతకడమే గొప్ప” అన్న సూత్రాన్ని ఈ నవలలో రచయిత్రి ప్రస్ఫుటంగా చెప్పారు.

 

చివరకు తనవాళ్ళు పరాయి వాళ్ళయినప్పుడు అనాథలను చేరదీసి వాళ్ళ ఆనందంలో పరమార్థం వెతుకున్న ఒక అమృతమూర్తి కధ ఇది” అని వ్రాసారు.

ఒక చెయ్యి తిరిగిన రచయిత్రి నుంచి జాలు వారిన ఈ నవల నిజంగా అమృతవాహినే, ఆలస్యం ఎందుకు మీరు కూడా చదవండి. అమృతవాహిని పుస్తకం అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లో లభిస్తుంది.  ఈ-బుక్ (ebook) కినిగెలో అందుబాటులో ఉంది.  ధర: రూ.150.00.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *