May 19, 2024

ఉగాది ప్రత్యేకం   

సిరి వడ్డే

“శిశుర్వేత్తి పశుర్వేత్తి

వేత్తి గానరసం ఫణిః

కో వేత్తి కవితా తత్త్వం

శివో జానాతి వా నవా”…

అన్నారు పెద్దలు. భారతీయ సంగీతానికి మూలం సామవేదం. ఎందరో గొప్ప వాగ్గేయకారులు ఈ సంగీతాన్ని సుసంపన్నం చేశారు.  వీరు నవరసాలను ఒలికించిన కీర్తనలను, మన ఉగాది ‘షడ్రసాలు’ (షడ్రసాలు: అనగా ఆరు రుచులు) అయిన… మధురం = తీపి, ఆమ్లం = పులుపు, లవణం = ఉప్పు, కటువు = కారం, తిక్తం = చేదు, కషాయం = వగరులతో సంధాన పరిస్తే, ఈనాటి ఉగాది మరింత రుచులతో నవరసాలను కలిపిన షడ్రుషుల విందులతో, పసందులతో వీనులవిందులేకదా !

మధురం

జయదేవుడు అనగానే మనకు స్పురించేది ఆయన రచించిన “గీత గోవిందం”. ఈ గీత గోవిందమును శృంగార రసముతో, మధుర భక్తితో, నాయకా, నాయకీ భావముతో స్తుతించారు.  దీన్నే”అష్టపదులు” అని కూడా అంటారు. వీటిని వినని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు కదా!

ప్రళయ పయోధిజలే ధ్రుతవానసివేదం.

కేశవా, ధ్రుత దశవధరూపం, జయ జగదీశహరే.

శ్రీతకమలాకుచమ మండల ధ్రుత కుండల

శ్రీజయదేవకవే రదం కురుతేముదం ఏ

మజ్గల ముజ్వల గీతి జయజయదేవహరే

లలితవజ్ఞలతా పరిశీలన కోమల మలయసమీరే

సరసవసంత సమయవనవర్నణ మనుగత మదన వికారం

చందనచర్చిత నీల కలేబర పీతవసన వనమాలీ

కేళి చలన్మణి కుండల మండిత గండయుగ స్మితశాలీ

హరిరిహముగ్ధవధూనికరే వలాసిని వలసతి కేళివరే

చంచరదధరసుధామధురధ్వని ముఖరిత మోహనవంశం

రాసే హరిమిహ విహితవిలాసం ….

ఈ గీతి కావ్యంలో మూడే పాత్రలు – రాధ, కృష్ణుడు మరియు సఖి.  విరహవేదన ఈ కావ్యంలోని విషయం. ఇందులో లౌకికంగా శృంగారం కనిపించినా, ఆధ్యాత్మికతే ప్రధానం. భక్తి, శృంగారం ఇందులో ఎంతో మధురంగా కలసిపోయాయి.

పులుపు

“విన్నపాలు వినవలె వింత వింతలు

పన్నగపు దోమతెర పైకెత్త వేలయ్యా…అంటూ వినయంగా మదిని నివేదిస్తూనే … సిరిమొగము దెరచి చిత్తగించవేలయ్యా …”

అంటూ కాస్త పుల్ల విరిచి నిలదీయడం కూడా ఒక గమ్మత్తైన రుచిని తెలియచేస్తుంది.

అన్నమయ్య కీర్తనలు అటు భక్తి పరంగానూ, ఇటు శృంగార పరంగానూ కూడా ఎంతో ప్రసిద్ది చెందాయి. “జో అచ్యుతానంద జోజో ముకుంద” – “నారాయణతే నమో నమో” – “పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు” – “రామ దశరధరామ” – “సిగరి పెండ్లి కూతురా సీతమ్మ” – “త్వమేవ శరణం”వంటి కొన్ని వేల కీర్తనలు మన తెలుగు శ్రోతలను ఇప్పటికీ వీనుల విందుగావిస్తూనే ఉన్నాయి. చందమామ రావే అంటూ, పసిపాపలకు గోరుముద్దలు తినిపించినా,“జో అచ్యుతానంద జోజో ముకుంద” అంటూ జోలపాటలతో ఊయలలూపి నిద్రపుచ్చినా అన్నమయకే చెల్లు.

కారం

కంచర్ల గోపన్నగా జన్మించిన భక్త రామదాసు సుమారు 400 కీర్తనలు భద్రాచల శ్రీరామచంద్రమూర్తిని ప్రార్ధిస్తూ రచించారు. ఎంత భక్తిగా శ్రీరామచంద్రుని కొలిచారో, కానరాని ఆ దైవాన్ని తన కీర్తనలలో అంత ఘాటుగానూ, ఏ తీరుగ నను దయచూసెదవో…ఏల దయరాదో రామయ్యా అంటూ ఆయన్ని మమ’కారంతో కటువు(కారం)గా అలిగేసి మరీ అడిగేసిన ఈ కీర్తనలోని షడ్రుచులలోని ఒకటైన కారంతో ముడిపడిన మమకారాన్ని విందామా ?

ఇక్ష్వాకు కుల తిలక (కాంభోజి రాగం-త్రిపుట తాళం)

ఇక్ష్వాకు కుల తిలక యికనైన పలుకవె రామచంద్రా నన్ను

రక్షింప కున్నను రక్షకు లెవరింక రామచంద్రా ||పల్లవి||

సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్రా

ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్రా || చ6 ||

వాహనములు మీకు వరుసతో చేసితి రామచంద్రా జగ

న్మోహన సంకెళ్ళు వేసిరి కాళ్ళకు రామచంద్రా || చ7 ||

కలికి తురాయి నీకు పొలుపుగ చేసితి రామచంద్రా

నీవు కులుకుచు తిరిగెద వెవరబ్బ సొమ్మని రామచంద్రా || చ8||

మీ తండ్రి దశరథ మహారాజు మెట్టెనా రామచంద్రా

లేక మీ మామ జనక మహారాజు పంపెనా రామచంద్రా || చ9||

అబ్బా తిట్టితినని ఆయాసపడవద్దు రామచంద్రా

ఈ దెబ్బల కోర్వక అబ్బ తిట్టితినయ్య రామచంద్రా || చ10 ||

వగరు

క్షేత్రయ్య అసలు పేరు మొవ్వా వరదయ్యగా భావిస్తున్నారు. అనేక పుణ్యక్షేత్రాలు, దేవాలయాలను సందర్శిస్తూ వాటి గురించిన వివరాలు తెలుసుకుంటూ ఉండటం చేత ఈయనకు క్షేత్రజ్ఞుడనే పేరు వచ్చింది. క్రమేణా అది క్షేత్రయ్యగా మారింది. వీరు దర్శించిన అన్ని క్షేత్రాలలో ఉన్న దైవాలపై ఈయన ఎన్నో కృతులు, కీర్తనలు, తత్వములు, పదములు, జావళీలు, పాటలు వ్రాసారు. వీటి అన్నిటిలో నవరసాలు నిండుగా ఉండి మనకు ఆరు రుచుల సమ్మేళనాలను అందిస్తాయి.  మచ్చుక్కి క్షేతయ్య మువ్వగోపాలా అంటూ గోపికల వగరు నిష్ఠూరాలను ఎంత చక్కగా పాడారు?

ఆనంద భైరవి రాగం – ఆదితాళం

పల్లవి:

శ్రీపతి సుతు బారికి నే-నోపలేక నిను వేడితే

కోపాలా? మువ్వ గోపాలా?

అనుపల్లవి:

ఏ ప్రొద్దు దానింటిలోనే-కాపైయుండి నీ సరస స

ల్లాపాలా? మువ్వ గోపాలా?

చరణాలు:

పైపూత మాటలు నేర్ప-జూపుదాని రతిపై నింత

తీపేలా? మువ్వ గోపాలా?

చూపుల నన్యుల దేరి-చూడని నాతో క

లాపాలా? మువ్వ గోపాలా?

నా పొందెల్ల దానికబ్బి-యే పొందును లేక యుసురనుటే

నా పాలా? మువ్వ గోపాలా?

ఇంతసేపు మోహమేమిరా? ఇందరికంటే – నింతి చక్కనిదేమిరా?

సుంతసేపు దాని – జూడకుండలేవు

అంతరంగము దెలుప – వదియేల మువ్వగోపాలా!

కొంత యున్నదో మువ్వగోపాల? గోరడ మేలా?

ఉప్పు

త్యాగరాజు కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరు. త్యాగయ్య, త్యాగబ్రహ్మ అనే పేర్లతో కూడా ప్రసిద్ధుడు. నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడు. ఆయన కీర్తనలు శ్రీరామునిపై ఆయనకుగల విశేష భక్తిని, వేదాలపై, ఉపనిషత్తులపై ఆయనకున్న జ్ఞానాన్ని తెలియపరుస్తాయి. త్యాగయ్యలేని సంగీత ప్రపంచం ఉప్పు లేని విందు, రుచి లేని పసందు.

త్యాగరాజస్వామి వారి – జగదానంద కారకా (రాగం:నాట, తాళం:ఆది, కృతి:త్యాగరాజ)

పల్లవి: జగదానంద కారక జయ జానకి ప్రాణ నాయక

అనుపల్లవి: గగనాధిప సత్కులజ రాజ రాజేశ్వర సుగుణాకర సురసేవ్య భవ్య దాయక సదా సకల (సుగుణాకర సురసేవ్య భవ్య దాయక) (జగదానంద)

చరణం 1

అమర తారక నిచయ కుముద హిత పరిపూర్ణానఘ సుర సురభూజ

దధి పయోధి వాస హరణ సుందరతర వదన సుధామయ వచో

బృంద గోవింద సానంద మా వరాజరాప్త శుభకరా నేక

అనంతమైన(అగణితము=లేక్క పెట్టలేని) సుగుణాలను కలిగిన వాడవు.బంగారమయమైన పట్టు వస్త్రాలను ధరించినవాడవు. ఒక్క బాణముతో ఏడు సాల వృక్షములను కూల్చినావు. ఎర్రని పాదపద్మములు కలవాడవు. అపారము, అద్భుతమైనా మహిమలు కలవాడవు. సజ్జనులైన కవి హృదయాలలో నివసించెడి వాడవు. సకల దేవతాది మునులకు,సజ్జనులకు,శుభము కూర్చేడి వాడవు. లక్ష్మీ వల్లభుడవు. పాపమనే గజమునకు నరసింహ స్వామివి. త్యాగరాజాది భక్తులచే పూజలను అందుకునే జగన్నాధుడవు అంటూ ఈ కృతిలో శ్రీరామ చంద్రుని స్తుతించినా, ఎందరో మహానుభావులు అంటూ మహానీయులందరికి వందనాలను అర్పించిన ఆయన ప్రతి కీర్తన ఎంతో రుచిగా ఉంటుంది కదూ!

చేదు

కర్ణాటక సంగీత సామ్రాజ్యాన్ని ఏలిన త్రిమూర్తులుగా చెప్పబడే శ్రీ త్యాగరాజు, శ్రీ ముత్తుస్వామి దీక్షితులు, శ్రీ శ్యామశాస్త్రి లలో మూడవ వారైన, ఈయన అసలు పేరు “వేంకట సుబ్రహ్మణ్యము”. వీరిని తల్లిదండ్రులు “శ్యామకృష్ణా” యని ముద్దుగా పిలిచేవారు. అదే ఈయన కృతులలో ఈయన ముద్ర అయినది. ఈయన బంగారు కామాక్షి ఉపాసకుడు. అమ్మపై తప్ప వేరొకరి పై రచనలు చేయలేదు. ఆంధ్ర గీర్వాణ భాషా కోవిదుడై ఈయన కృతులలో ముఖ్యమైనవి: ఓ జగదంబా, హిమాచలతనయ, మరి వేరే గతి యెవ్వరమ్మా, హిమాద్రిసుతే పాహిమాం, శంకరి శంకురు, సరోజదళనేత్రి, పాలించు కామాక్షి, కామాక్షీ (స్వరజతి), కనకశైలవిహారిణి, దేవీ బ్రోవ సమయమిదే, దురుసుగా, నన్ను బ్రోవు లలిత, మొదలగునవి. ఎంతగా ఉపాసించినా అమ్మ కరుణకు నోచుకోలేక పోతున్నాననే చేదు మింగుడుపడక ….తల్లీ నిన్ను నెరనమ్మినాను వినవే అంటూ గొంతులో చేదు అనుభవాన్ని పలికించిన మన శాస్త్రిగారి కీర్తన అమోఘం!

కళ్యాణి – మిశ్ర చాపు

పల్లవి: తల్లి నిన్ను నెఱ నమ్మినాను వినవే॥

అను పల్లవి: ఎల్లలోకముల కాధారమైయున్న నా॥

చరణము(లు):

ఆదిశక్తి నీవు పరాకుసేయకు ఆదరించుటకిది మంచిసమయము గదా సరోజభవాచ్యుత శంభునుతపదా నీదు దాసానుదాసుడౌ నా॥

దేవి నీదు సరిసమానమెవరని దేవరాజమునులు నిన్ను పొగడగ నా వెద దీర్చి బిరాన వరాలొసగి నన్నుబ్రోవ నీ జాలమేలనే॥

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *