May 18, 2024

“కవిత్వంలో ఏకాంతం”

రచన: టేకుమళ్ళ వెంకటప్పయ్య.

loneliness
“A man does not communicate with another man except when the one writes in his solitude and the other reads him in his own. Conversations are a diversion, a swindle, or a fencing match”.

అంటే.. ”ఒక మనిషి తన ఏకాంతంలో రాసిందాన్ని మరో మనిషి తన ఏకాంతంలో చదువుకున్నప్పుడు మాత్రమే ఒకరికొకరు అర్థం కావటమనేది సాధ్యం. సంభాషణల వల్ల జరిగేదల్లా పక్కదారి పట్టడమూ, దగా చేయటమూ, లేదా కర్రసామూ మాత్రమే” అంటాడు కొలంబియాకు చెందిన నికోలస్ గోమెజ్ డావిలా అనే ప్రముఖ కవి. “అసాధ్యమైన ఏకాంతం అంటూ ఏమీ లేదు. ప్రపంచ రహస్యాలను రూపకాలంకారాలతో తప్ప హేతువాదంతోనో, తర్కంతోనో విప్పి చూపలేము”– చిలీ మహాకవి పాబ్లో నెరుడా నోబుల్ స్వీకారోపన్యాసంలో చెప్పిన మాటలివి. కవిత్వమే జీవితంగా భావించే కవి తన ఏకాంత వాతావరణాన్ని తనే సృష్టించుకోవలసిన అగత్యం ఉంది. “కలలు పండే వేళ/మౌనపుటలల మీదుగా/గతాన్నీ, భవిష్యత్తునూ/కలిపే స్వప్న సేతువు/ఏకాంతం” అంటాడు ఇంద్రగంటి శ్రీకాంతశర్మ.

కవిత్వం ఏకాంతంలోనే సృజింపబడుతుందా? అని అలోచిస్తే ఏ కళకైనా మొదలు ఏకాంతమే. కవులే కాదు ఏ గొప్ప కళాకారుడి జీవితాన్ని తరచి చూసినా ఇది స్పష్టం. ఏకాంత హృదయస్పందన, మస్తిష్క మనోల్లాసాల్లో నుండే మహా కావ్యాలు, గొప్ప గొప్ప కళా ఖండాలు ఆవిర్భవించాయి, ఆవిష్కరించబడ్డాయి. అందువల్లే ఏకాంతం గొప్ప ఆవిష్కరణలకు మహాద్వారం.

“కవిత కొత్త అనుభవాల కాంతి పేటికను తెరవాలి, కదిలించాలి. ఈ కాలంలో బ్రతుకు; ఈ ప్రపంచాన్ని ప్రతిఫలించు. ఇంటికున్న కిటికీ లన్నీ తెరచి అన్ని పవనాల్ని ఆహ్వానించు, నువ్వు చెప్పేదేదైనా నీదై వుండాలి. నీలో నుంచి రావాలి, చించుకొని రావాలి. మళ్ళీ ఈనాడు అలనాటి చిత్ర కవితల్నీ, అయోమయ బంధాల్నీ, పునరుద్ధరించకు” అంటాడు దేవరకొండ బాలగంగాధర తిలక్. ఎంత మంచి ఎంత మహత్తర మైన సందేశం! కవితా రచనను తపస్సుగా సాగించే రచయితలందరూ త్రికరణశుద్ధిగా ఆచరించదగ్గ సందేశమిది! తిలక్ మహాకవి కవితాహృదయానికి దర్పణమనదగిన ఆలోచనా ధార. “కవిత్వం ఒక ఆల్కేమీ,/ దాని రహస్యం కవికే తెలుసును/కాళిదాసుకు తెలుసు, పెద్దన్నకీ తెలుసు/కృష్ణ శాస్త్రి కి తెలుసు, శ్రీ శ్రీ కి తెలుసు” అన్నా! “కవిత్వం అంతరాంతర జ్యోతి స్సీమల్ని బహిర్గతం చెయ్యాలి, విస్తరించాలి చైతన్య పరిధి” అన్నా! అగ్ని జల్లినా, అమృతం కురిసినా /అందం, ఆనందం దాని పరమావధి” అన్నా తిలక్ బౌద్ధికంగా ఏకాంత వాసి – గొప్ప అనుభూతి కవి. చూడండి అమృతం కురిసిన రాత్రి కవితలో “ఎక్కడెక్కడ ఒక్కణ్ణి తిరిగానో రాత్రి ఏకాంతంలో/ఎన్ని దీన నయనాల్ని ఎన్ని మౌన నిశ్వాసాల్ని/ఏరుకున్నానో చటుక్కున నా సంగీతం ఆగిపోయి/ఆపూర్వమైన సంగీతాన్ని తెచ్చి నీకు కానుకగా ఇస్తానని/అనంతమైన నా ప్రేమ నిరూపిస్తానని ప్రతిజ్ఞ చేసి/ఆ రాత్రి వెళ్ళి పోయాను నేను…/ఆలా నగరాలకి నగరాలు దాటి అడవుల్ని దాటి” అంటాడు. అలా ఏకాంతంగా ఈ భూమండాలాన్ని దాటి ఇతర గ్రహాలలో సైతం సంచరించి అనుభవించి పలవరించ గల కవి తిలక్.

మహాకవి శ్రీ.శ్రీ కూడా…”కవితా..ఓ కవితా” అంటూ కవిత్వ పంధాను చెప్తూ.. “అమోఘ, మగాధ, మచింత్య, మమేయం,/ఏకాంతం, ఏకైకం,/క్షణికమై శాశ్వతమైన దివ్యానుభవం,/ బ్రహ్మానుభవం కలిగించిన,/నను కరిగించిన కవనఘృణీ!/ రమణీ!/కవితా! ఓ కవితా!” అన్నారు. అద్భుతమైన లోతైన అంతులేని ఏకాంతంలో శాశ్వతంగా నిలిచిపోయిన ఓ గొప్ప దివ్యానుభూతి, మహా అనుభవం నను కరిగించిన అందమైన కవితాకిరణం అంటారు.
ఈ కాలంలోనే కాదు శ్రీకృష్ణదేవరాయలచే గండపెండేరం పొందిన అల్లసాని పెద్దన గారు కూడా “తూగుటుయాల, రమణి ప్రియ దూతిక తెచ్చి ఇచ్చు కప్పురపు విడేము, ఉహ తెలియంగల లేఖక పాటకోత్తములు” కావాలి కవిత్వానికి అంటూ, కవిత్వం ఎక్కడబడితే అక్కడ, ఎప్పుడు బడితే అప్పుడు చెప్పేది కాదు సుమా అంటూ.. తనకు అవసరమైన జాబితా ఏకరువు పెట్టాడు. కొండేపూడి నిర్మల గారు ఆధునిక కవయిత్రికి కూడా ప్రేరకాలుగా కొన్ని సదుపాయాలు౦డాలట అవేమిటంటే..“మ౦చి కవి మిత్రులు, సరళమైన జీవన విధానం, ప్రకృతితో మమేకం, ఈ అన్నిటితో కూడిన ఏకాంతం” ఇంకా అంటారు.. ఆ మాటకొస్తే కవిత్వం రాయడానికే కాదు బిడ్డకు పాలిచ్చే కూలి తల్లికి, మగ్గంమీద బట్ట నేస్తున్న ముసలి తాతకి కూడా ఏకాంతం అవసరమే అని.. ఏకాంతం కవిత్వానికి ఎంత అవసరమో చెప్తున్నారు.

ఓ గమనించదగ్గ విషయం ఏమిటంటే ఏకాంతం అంటే ఏ మారుమూల గదిలోకో వెళ్ళి తలుపులు వేసుకోవడం కాదు. అలాంటప్పుడు కవిత్వం స్పాంటేనియస్ గా రావడం దుస్సహం. అలాంటి బలవంతపు ఏకాంతాలు మనసును రంజింపజేయలేవు అని మనస్తత్త్వవేత్తల అభిప్రాయం. కవి చెయ్యవలసినది మనసును ఏకాంతంలోకి తీసుకెళ్ళగలగడమే! అదే ఏకాంతం. ఎంత జన సమూహంలో ఉన్నా ఏకాంతంలోకి వెళ్ళగలగాలి. అలాగే ఎంత ఏకాంతంలో ఉన్నా జన సమూహంలోకి మనసు ప్రసరించగలగాలి కవి. అలా వీలవుతుందా అన్న ప్రశ్నకు సమాధానమే కవి జాన్ కీట్స్. తన కవితల ద్వారా ప్రపంచానికి ప్రేమను దగ్గర చేసిన కీట్స్ జీవితం విషాధ భరితం. హాస్పిటల్లో కాంపౌండర్ గా పని చేసేవాడన్న మాటేగానీ అతని మనసు మాత్రం ఎక్కడో ఏకాంత దీవుల్లో తిరుగాడేదట. ఆ దీవుల్లో తాను పుంఖాను పుంఖాలుగా కవిత్వం రాస్తున్నట్లు కలగనేవాడట. కీట్స్ రాసిన ‘ఒ సాలిట్యూడ్’ (ఏకాంతం) కవిత అచ్చయింది. ప్రపంచ ప్రఖ్యాతి లభించింది. జన సమూహాల్లో ఉంటూనే ఏకాంత వీధుల్లో విహరించే కవుల్లో అగ్రగణ్యుడు కీట్స్.

‘‘మన కాలపు కవికి ఏకాంతమూ సమూహమూ రెండూ ప్రాథమిక విధులుగానే ఉన్నాయి’ అని అని అన్న మహాకవి పాబ్లో నెరూడా మాటల తో ముగిద్దాం.

3 thoughts on ““కవిత్వంలో ఏకాంతం”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *