May 18, 2024

||కవిత్వమంటే||

రచన : ప్రియనాయుడు

కవిత్వమంటే ఏమిటి ?? అది ఎలా ఎలా వివరించేది ??
యెక్కడని వెదికేది ?? యెక్కడని పట్టుకొనేది??
నవ్వులో పువ్వులో నింగిలో నేలలో
కళ్ళల్లో కలలలో చెలి బుగ్గల్లో చిరుసిగ్గుల్లో
వలపులలో తలపుల్లో పగటిలో రేయిలో
పచ్చని పైరులో సాగే చల్లని చిరుగాలిలో
వానలో ఎండలో ఉరికే జలపాతంలో
తనువులో అణువులో మనసులో మమతలో
పూవులో తావిలో పలవరించే పలుకులో
కన్నీటిలో కవ్వింతలో అలకలో ఆరాధనలో
ఇంకా ….
అధరంలో మధురిమలో మౌనంలో మురిపెంలో
అడుగులు చేసే సవ్వడిలో గాజులు చేసే గలగలలో
మదనుడు చేసే అల్లరిలో తనువుల రేగే తపనలలో
కోకిల కూసే గానంలో తుమ్మెద పాడే సంగీతంలో
చెరుకు గడలలోని తియ్యదనంలో పాలనురగలోని తెల్లదనంలో
మల్లెలోని సువాసనలో మత్తెక్కించే సంపంగి పువ్వులో
అమ్మలోని కమ్మదనంలో నాన్న కురిపించే లాలనలో
అన్నింటా అంతటా వెదజల్లిన పరిమళంలా ఉన్నావమ్మ కవితమ్మ .
కవితంటే…..చెప్పాలా!! మదివిప్పాలా!!

జగమంత నిండిన భావాల సరాగాలు
అది జల జల పారే చల్లని సెలయేరు
మది హోరుల జోరుల సాగే పరవళ్ళు
యెదలో పొంగి పొరలే భావాల చిరుజల్లు
కన్నుల దాగిన తరగని వెన్నెల హరివిల్లు
మనసున దాచినా దాగని భావాల సందడులు
అబ్బబ్బా యెంతని యేమని చెప్పను !!
అణువణువునా పరవసింపజేసే అనుభవాల పోరు
కదిలే ఆలోచనలకూ ఊపిరినిచ్చే ఊసుల రాసులు
ప్రతి కదలికలోను అక్షారాలు పలికించే సోయగాలు
ఏ భంగిమ చూసినా తన్నుకువోచ్చే మధుర భావాలు
శిలలను సైతం కరిగించగలిగే భావోద్రేకపు అలజడులు
అక్షారాల జడివానలో తడిచి మొలకెత్తే అక్షర సుమాలు
భావోద్వేగము కలిగినప్పుడు పదములు కూర్చే కుసుమాలు
వర్ణనకి అందనపుడు పదాల రూపములో జాలువారే ఆవేశాలు
పద పదములో పదనిసలు పలికించగలిగే తొలి ఉషాకిరణాలు
ఆధరముల మాటున దాగిన అమృత మధుకలశములు
మృదు మందార భావనలను మధురంగా వివరించగలిగే కావ్యాలు
ఆనందము ఆవేదన ఒకే పదములో వివరించగలిగే మధుర భావాలు
అమ్మ అనురాగము ఆలి ఆలింగనం అవలీలగా తెలపగలిగే అస్త్రాలు
ప్రేమను ప్రేమగా పలికించగలిగే ఒక తియ్యటి సుస్వరాల గానామృతాలు
కవితంటే ఒక దివ్యానుభూతి అనుభవాల సిరిమల్లి !!!

మనసును ఊయలలూపి లాలించగలిగే ఒక మహోత్తర శక్తీ
ఇది అది అని వివరిచలేని పరిస్థితిలో వొచ్చే ఒక తియ్యటి ఆర్తి
కవిత్వమంటే అంతులేని ఆలోచనలకూ ఊపిరిదిద్దె ఒక అనురక్తి
నర నర మున ఉద్రుతిని పెంచి హృదయాన్ని హత్తుకొనే చురకత్తి
పదాలకందని భావ ప్రకటన చెయ్యగలిగే తియ్యని హృదయ స్పందన
మనసు మారుమూలదాగిన జ్యపకాలకు జతకూరే మనో ఆలంబన
ప్రతి క్షణం విరామం లేకుండా కలిగే తపనల కోరికల ప్రతిస్పందన
కనీరైన పన్నీరైన ప్రేమ ఐనా విరహమైనా కవిత్వమే కదా అంతరాన
కవిత్వానికి లేదు భాష బేధము ..లేదు పేద గొప్ప భావము
ఎవరికైన ఎప్పుడైనా కలిగే ఒక అనిర్వచనీయ అనుభవ సారము
ప్రతి మనిషిలోను ప్రక్రుతి అందములోను దాగి ఉంది కవిత్వము
కవిత్వమా నిన్ను వివరింప గలమా నీవు దాగిన చోట కనుగోనగలమా
అది ఒక మహాసముద్రము ,,ఎంత యీదినా లోతు తెలియని మహసాగరము
ప్రతిమనిషిలోనూ ఎక్కడో ఒకచోట దొంగాలా దాగిన ఒక భావాల వెల్లువల సారము ..
ఒక అనురాగము ఒక అనుభవాల మణిహారము
ఊహకే అందని అక్షరాల దారము…జీవాధారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *