May 19, 2024

కృష్ణ , వేణిల సంగమం

రచన: నాగలక్ష్మీ కర్రా

satara

కృష్ణాపుష్కరాలు అనగానే మనకి జ్ఞాపకం వచ్చేది విజయవాడ కనకదుర్గ అమ్మవారి పాదాల దగ్గర వున్న కృష్ణ, అక్కడవరకు వెళ్లలేనివారి సంగతి అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కృష్ణా తీరాన యెన్నో స్నానఘట్టాలు నిర్మించి ఉభయరాష్ట్ర ప్రజలకు పుణ్యస్నానాలకు చేసిన యేర్పాట్లు న్యూస్ ఛానల్స్ లో చూసి పూనేలో వున్న మేం యెక్కడకు వెళ్లి పుణ్యం సంపాదించాలి అని మనసులో రోజూ బాధ పడుతూ వుండేదాన్ని.
గోదావరి , కృష్ణ నదులు మహారాష్ట్ర లో పుట్టాయని తెలుసు. వెంటనే గూగులమ్మని ఆశ్రయించగానే పూనేకి దగ్గరగా ‘ సతారా ‘ దగ్గర ఘాట్ వున్నట్లు చూపించింది. ఇంకేముంది లేడికి లేచిందే పరుగన్నట్లు మరునాడు పొద్దున్నే పులిహోర , దద్దోజనం కలుపుకొని బ్రేక్ ఫాష్ట్ చేసుకొని బయలుదేరేం.
బాంబే బెంగుళూరు హైవే మీద సుమారు 115 కిలోమీటర్ల దూరంలో వుంది సతారా. సతారా అంటే యేడుకొండలు అని అర్దం. చిన్నగా పడుతున్న వర్షం , పెద్దగా ట్రాఫిక్ లేకపోవడంతో మా ప్రయాణం యెటువంటి అలసట లేకుండా సాగింది.
పడమట కనుమలలోని మహాదేవ పర్వతాలలో మహాబలేశ్వర్ లో పుట్టి సుమారు 1400 కిలోమీటర్లు మహారాష్ట్ర, కర్నాటక , తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ లలో ప్రవహించి హంసలదీవి దగ్గర బంగాళాఖాతంలో కలుస్తోంది. మహారాష్ట్ర లోని వేసవి విడిదిగా పేరు పొందిన మహాబలేశ్వర్ వెళ్లినప్పుడు పాత మహాబలేశ్వర్ టౌనులో పంచగంగ మందిరం చూడ్డానికి వెళ్లినపుడు అక్కడ గోవు ముఖం నుంచి పడుతున్న నీటిధార కృష్ణా నది పుట్టిన ప్రదేశం అని స్థానికులు చెప్పేరు. ఆ ప్రదేశం ‘ గాయత్రి ‘ , ‘ సావిత్రి ‘ , ‘ కొయిన ‘ , ‘ కృష్ణ ‘ , ‘ వెణ్ణ ‘ నదులు పుట్టిన ప్రదేశం అని చెప్పేరు. కృష్ణ అక్కడ నుంచి యెన్నో సెలయేళ్లతో కలిసి ప్రవహిస్తూ ‘ సతారా ‘ దగ్గర ‘ వెణ్ణ ‘ తో సంగమంచి కృష్ణవేణి గా పిలువబడుతూ కిందికి ప్రవహించి ద్వాదశ జ్యోతిర్లింగాలలో వొకటైన ‘ భీమశంకరం ‘ దగ్గర పుట్టిన ‘ భీమ ‘ నదితో కలిసి తరువాత ‘ కొయిన ‘ నదితో సంగమించి కర్నాటకలో ప్రవేశిస్తోంది.
స్నానం చేసేందుకు వీలుగా వుంటుందో లేదో అనుకుంటూ వెళ్లిన మాకు పాడుబడిన ఘాట్ వుండడం ఆనందాన్ని కలుగజేసింది. నది వరకు కారు వెళ్లే వీలుండడంతో నది ఒడ్డున కారు పెట్టుకొని స్నానానికి వెళ్లేం. మేం మరో నలుగురు తప్ప మరెవరూ లేరు. ‘బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను ‘ అన్నట్లుగానే పరుగులు పెడుతోంది కృష్ణమ్మ , మరో పక్కనుంచి మెల్లగా ప్రవహిస్తూ వస్తోంది వెణ్ణా నది , ఒకే చోట పుట్టినా వేరు వేరు ప్రదేశాలగుండా ప్రవహించి సతారా దగ్గర వున్న ‘ కొరెగావ్ ‘ లో రెండు నదులూ కలిసి దిగువకు పరుగులు పెడుతున్నాయి. ఏ విధమైన హడావుడి లేదు , చెత్తలు చెదారాలు లేవు , నీరు వ్యర్ధ పదార్ధాలతో కలుషితం కాలేదు. స్వచ్ఛమైన నీళ్లు చూడగానే మనసాగక నీళ్లల్లో దిగిపోయేం.
సంగమం దగ్గర స్నానానికి వీలుగా మెట్లు లేవు కాని మేం అక్కడే స్నానాలు చెయ్యాలని అనుకున్నాం కాబట్టి జాగ్రత్తగా నీళ్లల్లో కి దిగేం. కిందట నీళ్లల్లో చిన్న పెద్ద శివలింగాలు కనిపించేయి. కాస్త ముందుకు వెళితే అక్కడ కనిపించిన అవశేషాలు అక్కడ పూర్వం పెద్ద మందిరం వుండేదేమో అనిపించింది. పెద్ద పెద్ద స్థంబాలు , దేవీ దేవతా విగ్రహాలు కొన్ని విరిగిపోయినవి , చాలామటుకు విరగనివి వున్నాయి. స్నానం చేస్తూ పరిసరాలను పరికించిన నాకు యెదురు గట్టుమీద ఓ మందిరం, బాగా దూరంగా అవతలవైపు న వున్న మరో రెండు చిన్న మందిరాలు కనిపించేయి. మేము స్నానం చేస్తున్న వైపు ఓ మందిరం ఆకర్షించింది. ఆ రోజు శ్రావణ సోమవారం కావడంతో భక్తులు శివాభిషేకం చేసుకోడానికి వస్తున్నారు. మనకి కార్తీకసోమవారం లాగ వీరికి శ్రావణ సోమవారం , ఉపవాసాలు , శివార్చనలు చేస్తారు. రెండువైపులా స్మశానాలు , రాజ వంశస్థుల సమాధులు కనిపించాయి. కృష్ణవేణికి రెండువైపులా కనుచూపు మేర వరకు పురాతనమైన చిన్న పెద్ద మందిరాలు వున్నాయి. ఒకప్పుడు యీ ప్రదేశం యెంతో ప్రాముఖ్యత కలిగి వున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా యిక్కడ రెండు శివమందిరాలు వున్నాయి. ఈ మందిరాలు యెప్పుడు నిర్మించబడ్డాయి అనే దానికి ప్రమాణాలు దొరకలేదు కాని సుమారు 800 సంవత్సరాల కు ముందు నిర్మించబడ్డాయని స్థానికులు చెప్పేరు. కృష్ణవేణి అవతల వొడ్డున ఒకటి దానికి యెదురుగా యివతల వొడ్డున వొకటి. విశ్వేశ్వర మందిరం వున్న ప్రదేశాన్ని ‘ సంగమ మావులి ‘ అని రామేశ్వర మందిరం వున్న ప్రదేశాన్ని ‘ శ్రీక్షేత్ర మావులి ‘ అని అంటారు.
విశ్వేశ్వర మందిరం మామూలు మందిరాలకు భిన్నంగా అనిపించింది , మందిరంలోకి ప్రవేశించడానికి రెండు వైపుల నుంచి మెట్లు వున్నాయి , ఆ మెట్లు యెక్కి పైకి వెళితే 30 అడుగుల దీపమాల చేరుతాం , రాతితో కింద వెడల్పుగానూ పోనుపోను సన్నగా అయి ఒక ప్రమిద పట్టేటట్టుగా వుంటుంది. విశేష పూజలప్పుడు దీన్ని దీపాలతో అలంకరిస్తారు. మహారాష్ట్ర మందిరాలలో యీ దీపమాల వుండి తీరుతుంది. అక్కడ నుంచి సుమారు పది పన్నెండు మెట్లు యెక్కితే మంటపం చేరుతాం. అక్కడ స్థానికులతో మాట్లాడిన తరువాత మందిరం యెందుకు భిన్నంగా వుందో బోధపడింది. సాధారణంగా మందిరం ఆరు , యెనిమిది భుజాలతో వుంటాయి. కాని యీ మందిరం యేడు భుజాలు , కోణాలతో వుంది . మందిరానికి యెదురుగా ‘ నంది ‘ మంటపంలో పెద్ద నంది , అక్కడనుంచి మరో ఆరేడు మెట్లు యెక్కి వెళితే అక్కడ మూడు వైపులా ద్వారాలతో వున్న సభా మండపం వుంది , నేలపైన రాతితో చెక్కిన ‘ కూర్మం ‘ వుంది , పక్కన గోడకి వున్న చిన్న అరలో ఒకవైపు వినాయకుడు మరోవైపు పార్వతి పూజలందుకుంటున్నారు. ఈ మందిరం ‘ హేమద్పంతి ‘ అనే శిల్పకళ తో నిర్మింపబడింది. ‘ హేమద్పంత్ ‘ యాదవ సామ్రాజ్యంలో మంత్రిగా వుంటూ శిల్ప శాస్త్ర అధ్యయనం చేసి తన జ్ఞానంతో రూపొందించిన శిల్పకళ అతని పేరుమీదుగా ప్రసిధ్ది పొందింది. హేమద్పంత్ యేకాలానికి చెందినవాడో కూడా ఆధారాలు మాకు దొరకలేదు. మందిరం మీద దేవీదేవతల విగ్రహాలు వున్నాయి. గర్భగుడిలో సుమారు నాలుగడుగుల శివలింగం యిత్తడి తొడుగు తొడిగి వుంది. గర్భగుడి శివలింగం యేక శిలా నిర్మితాలు , రామేశ్వర మందిరం కూడా యేక శిలా నిర్మితమేనట. పూజారి అంటూ యెవరూ లేరు. భక్తులు యెవరికి తోచిన విధంగా పూజాదులు నిర్వహిస్తున్నారు. మేం కూడా యధాశక్తి పూజ చేసుకొని అవతల వొడ్డుకి చేరే వీలులేక ఆ మందిరం గురించి స్థానికులనుంచి సమాచారం సేకరించేం.
శివాజీ మహరాజు కాలంలో యీ క్షేత్రం దక్షిణకాశీ గా ప్రాచుర్యం పొందిందట. నదికి రెండువైపులా చాలా మందిరాలు వుండేవట. చాలా మందిరాలు కూలిపోయి నదిలో కొట్టుకొని పోయేయట. సుమారు కిలోమీటరు దూరం వరకు శిథిలాలు నదిలో వుండడం కనిపిస్తుందట , యెదురుగా వున్నది రామేశ్వర మందిరం , విశ్వేశ్వర మందిరం కంటే చిన్నది కాని శిల్ప కళలో యేమాత్రం తక్కువకాదు.
రెండు మందిరాలకూ పక్క పక్కనే శ్మశానాలు వుండడం , లింగాయతుల సమాధులు వుండడం కనిపించింది.
కొన్నివందల సంవత్సరాలుగా యే ప్రభువులుగాని , ప్రభుత్వాలు గాని పట్టించుకోక పోవడంతో యింత గొప్ప శిల్ప సంపద , యింత పెద్ద మందిరాలు నేలమట్టమయేయి. స్థానిక రాజకీయనాయకులు కూడా పట్టించుకోక పోవడం విచారాన్ని కలుగ జేసింది.
శివాలయంలోంచి బయటికి వచ్చేక పక్కనే వున్న చిన్న మందిరం లోకి వెళ్లేం. ఆ మందిరం కృష్ణ , వెణ్ణ లకు సమర్పించబడింది. ముత్తైదువలు పసుపు , కుంకుమ , పూలు , పండ్లు సమర్పిస్తున్నారు. అక్కడ వున్న పూజారి కృష్ణానది విష్ణు స్వరూపం కాబట్టి చేతిలో శంకం చక్రం ధరించి వుంటుంది అని వెణ్ణ శివస్వరూపమని దండం కమండలం సర్పము , చంద్రుడు లను ధరించి , పక్కన నంది వున్నాయని చెప్పేరు. అందుకే యీ ప్రదేశాన్ని శివకేశవ సంగమం అవికూడా అంటారని చెప్పేరు. విగ్రహాలకు ఫొటో తీసుకోవచ్చు అంటే ఫొటో తీసుకొని బయటికి వచ్చేం.
గూగులమ్మ ప్రకారం యిక్కడ ‘ ఉత్తర చిదంబర ‘ క్షేత్రం వుండాలి. తిరుగు ప్రయాణంలో బాంబే బెంగుళూరు హైవే కి దగ్గరగా కాస్త లోపలికి వుంది యీ క్షేత్రం , మేం 12-30 చేసేం మందిరం 12-15 వరకు తెరచి వుంటుంది. తిరిగి 3-30 కి తెరుస్తారు. ఈ మందిరాన్ని కంచికామకోఠి పీఠాధిపతి ఆధ్వర్యంలో నడుస్తోంది.
1980 జూలైలో వ్యాస పూజ కోసం వచ్చిన చంద్రశేఖరేంద్ర సరస్వతి ( కంచికామకోఠి పీఠాధిపతి ) సతారా లో కొన్ని రోజులు గడపవలసి వచ్చింది. యేడు కొండల మధ్యనున్న యీ ప్రదేశంలో చిదంబరంలో వున్న నటరాజ మందిరాన్ని పోలిన మందిరాన్ని నిర్మించాలనే కోరిక కలిగింది , స్ధానికంగా వున్న స్వామివారి భక్తుడు మందిరానికి కావలసిన భూమిని సమకూర్చడంతో స్వామివారి చొరవతో మహారాష్ట్ర ,తమిళనాడు , ఆంధ్ర , కర్నాటక అప్పటి ప్రభుత్వం ఆర్థిక సహాయంతో 1981 లో మందిర నిర్మాణం చేపట్టి 1984 లో స్వామి జయేంద్ర సరస్వతి వారిచే కుంబాభిషేకం నిర్వహించబడింది. మందిరానికి నిత్యపూజాది కార్యక్రమాలకు కావలసిన ఆర్ధికసహాయం కంచిమఠం సమకూరుస్తోంది. స్వామి జయేంద్ర సరస్వతి గారి కోరిక మేరకు చిదంబర నటరాజ మందిర పూజారులు ‘ రొటేషన్ ‘ పద్దతిలో యిక్కడకు వచ్చి పూజలు నిర్వహిస్తున్నారు. మందిరానికి అనుబంధంగా వేదపాఠశాల , నాట్యశాల నిర్వహించబడుతున్నాయి.
ఈ మందిరం చిదంబరంలోని నటరాజ మందిరానికి ‘ డూప్లికేట్ ‘ అని చెప్పొచ్చు , కాని చాలా చిన్నది. మందిరానికి ఓ ప్రదక్షిణ చేసుకొని మరెప్పడైనా వచ్చి మందిరం లోపల భాగాన్ని , నటరాజు ని దర్శించుకుందామని నిర్ణయించుకొని తిరిగి పూనాకి బయలుదేరేం.
మరుగున పడిపోయిన అద్భుతమైన మందిరం గురించి తెలుసుకున్నాకా యిలాంటి వెల కట్టలేని యెన్ని మందిరాలు మనదేశంలో వున్నాయో కదా? అని అనిపించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *