May 8, 2024

తాను – నేను

కళ్యాణదుర్గం స్వర్ణలత

కాంపౌండ్ వాల్ పక్కగా
తాను తొంగి చూసినపుడే,
నేనూ చూశా తొలిసారి తనను…
ఇంద్రలోకం నుండి నిటారుగా దిగిన సౌందర్యమది

ప్రతి రోజు తన నవ్వుతోనే
నాకు తొలి ఉదయం
చూసిన ప్రతిసారి గుభాళించే
ఆ నవ్వే నన్ను తనకోసం చూసేలా చేస్తోంది

తన నిత్య దర్శనంలో కాలం
అప్పుడే పుష్కరమై పూసింది
ఇంతలోనే ఎంత మార్పు ..
ఇంతే వున్న తాను
మానంతై చిరునవ్వుల గుభాళింపులతో
నన్ను ముంచేస్తుంటే
మనసంతా మైమరుపే

అమాంతంగా కాంపౌండ్ వాల్ దాటి
నన్ను తాకేంత దగ్గరగా తాను
సాయంత్రమైతే తనను చూడకుండా వుండలేని నేను..

కానీ…
కానీ…
ఇందాకే సందేశం
చివరిచూపని
ఎకాబికిన వచ్చేలోగా
వైకుంఠయాత్ర ముగిసిన దానికి ఆనవాళ్ళుగా
దారంతా పూలు

కన్నీళ్ళాగని నా కళ్ళెదురుగా
దహనమౌతూ తాను..
తన ఆనవాళ్ళనే స్మరిస్తూ
ఖననమౌతూ నేను..

( పక్కింట్లో పుష్కరకాలంగా పెరిగిన మల్లెచెట్టును కొన్న వాళ్ళు
కొట్టి కాల్చేసారు…విషాదంగా వుంది)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *