May 18, 2024

మధ్యతరగతి మిథ్యా సూరీడు

రచన:- జి. మధుబాబు

నివురు గప్పిన ఆశల నింగిలో
నిప్పుల కొలిమిలా మండుతున్నాడు
ఎండమావుల వేటలో
యాంత్రిక జీవన బాటలో
ఎడతెరిపిలేక యేగుతున్నాడు
శ్వాసించే శిలలా శ్రమిస్తున్నాడు
మధ్యతరగతి మిథ్యా సూరీడు
ఈ మధ్యతరగతి భారతీయుడు!!

అనుక్షణం అనుక్రమిస్తూ
ప్రతీక్షణం పరిక్రమిస్తూ
అభ్యుదయం కొసం అల్లాడుతున్నాడు
ఉద్యమం ఊపిరిగా జీవిస్తున్నాడు
మధ్యతరగతి యెర్ర సూరీడు
మధ్యతరగతి మిథ్యా సూరీడు
ఈ మధ్యతరగతి భారతీయుడు!!

సామ్యవాదమంటాడు
సమసమాజమంటాడు
తన దాకా వస్తే ధనస్వామ్యమంటాడు
ప్రపంచానికేమొ ఇదే ప్రజాస్వామ్యమంటాడు
ప్రజాతంత్ర తాంత్రికుడు
గణతంత్ర మాంత్రికుడు
నడమంత్రపు వైతాళికుడు
మధ్యతరగతి మిథ్యా సూరీడు
ఈ మధ్యతరగతి భారతీయుడు!!

అహింస ముసుగేసుకొని
తెల్లటోపీ పెట్టుకొని
“అన్నా” మంత్రం జపిస్తాడు
“ఆమ్ ఆద్మీ” (Aaam Aadmi) అవుతాడు
అవినీతిని ఆపుతాడు
అధికారం దక్కగానే
అరాచకుడౌతాడు
ఆపద్ధర్మ విప్లవవీరుడు
మధ్యతరగతి మిథ్యా కిశోరుడు
ఈ మధ్యతరగతి భారతీయుడు!!

విరివిగా దొరికే ఆప్యాయతల కరువు
విరిసీవిరియని అనుబంధాల బరువు
వ్యక్తిత్వాన్ని అరవుగా కొని తెచ్చు’కొన్న’ కొలువు
కృత్రిమత్వాన్ని ఎరువుగా పండించుకున్న చెలువు
ప్రతీక్షణానికీ వెలకట్టి
వెలకట్టలేని జీవితాన్ని వృథాచేస్తున్నాడు
ఎండమావుల వేటలో
యాంత్రిక జీవన బాటలో
ఎడతెరిపిలేక యేగుతున్నాడు
శ్వాసించే శిలలా శ్రమిస్తున్నాడు
మధ్యతరగతి మిథ్యా సూరీడు
ఈ మధ్యతరగతి భారతీయుడు!!

వ్యక్తిత్వ ఆదర్శాలు వల్లెవేయటంలో నిచ్చెన అంబరానికి
సమిష్టి బాధ్యత నిర్వర్తనలో ప్రాథమ్యం స్వసంబరానికి
జీవాలంబాన అంబలి అయినా ప్రాధాన్యం ఆడంబరానికి
ఒడిషా/ఒరిస్సా లో వరోదొస్తే
విశాఖాలో ఉప్పెనొస్తే
మానవత్వం ముసుగేసుకొని
విలువల పతనానికి పరాకాష్ఠ అవుతున్నాడు…
ఉత్తుత్తి కొవ్వొత్తుల నీరాజనాలు
పసలేని ప్లకార్డుల ప్రదర్శనలు
పరిపాటిగా మారిన ఈ వానరమేటి
స్వజాతి ఔన్నత్య నిదర్శనానికి
పరజాతి లేమిని ఆకాంక్షిస్తున్నాడు
మధ్యతరగతి మిథ్యా సూరీడు
ఈ మధ్యతరగతి భారతీయుడు!!

సంస్కృతి, నాగరికతల వ్యత్యాసం అవగతమవక
సతమతమైన, సంకరమైన త్రిశంకుస్వర్గంలో సంభ్రమిస్తున్నాడు
సంఘానికి బానిసగా తన ఉనికి అదేనని భ్రమిస్తున్నాడు
చుక్కాని లేని నావలా పరిభ్రమిస్తున్నాడు
ఎండమావుల వేటలో
యాంత్రిక జీవన బాటలో
ఎడతెరిపిలేక యేగుతున్నాడు
శ్వాసించే శిలలా శ్రమిస్తున్నాడు
మధ్యతరగతి మిథ్యా సూరీడు
ఈ మధ్యతరగతి భారతీయుడు!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *