May 20, 2024

మన వాగ్గేయకారులు – (భాగము – 8)

రచన:- సిరి వడ్డే

kancherla gopanna

శ్రీ రామదాసు :

భద్రాచల రామదాసుగా ప్రసిద్ధి పొందిన భక్త రామదాసు అసలు పేరు కంచెర్ల గోపన్న. వీరు 1620లో, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో శ్రీ లింగన్నమూర్తి, శ్రీమతి కామాంబ దంపతులకు జన్మించారు. వీరి భార్య శ్రీమతి కమలమ్మగారు. రామదాసు శ్రీరాముని కొలిచి, కీర్తించి, భక్త రామదాసుగా సుప్రసిద్ధులైనారు. భద్రాచల దేవస్థానమునకు, ఈయన జీవిత కథకు అవినాభావ సంబంధమున్నది. తెలుగులో కీర్తనలకు ఈయనే ఆద్యులు. “దాశరధి శతకము”, ఎన్నో రామ సంకీర్తనలు, భద్రాచలం దేవస్థానము – ఇవన్నీ రామదాసు నుండి తెలుగు వారికి సంక్రమించిన పెన్నిధులు. ఈయన గురువు శ్రీ రఘునాథ భట్టాచార్యులు. (కబీర్ దాసుగారు రామదాసునకు తారక మంత్రముపదేశించిరని కూడా ఒక కథ యున్నది)
గోపన్నగారి మేనమామ మాదన్నగారు అప్పటి గోల్కొండ నవాబు తానీషా గారి కొలువులో పెద్ద ఉద్యోగి. మేనమామ సిఫారసుతో గోపన్నకు పాల్వంచ పరగణా తహసిల్దారు పని లభించింది. గోదావరి తీరములోని భద్రాచల గ్రామము ఈ పరగణలోనిదే. వనవాసకాలమున సీతాలక్ష్మణులతో శ్రీరాముడు ఇక్కడే పర్ణశాలలో నివసించెననీ, భక్తురాలైన శబరి ఆతిథ్యము స్వీకరించెననీ స్థలపురాణము. పోకల దమ్మక్క అనే భక్తురాలు అక్కడి జీర్ణదశలోనున్న మందిరమును పునరుద్ధరింపవలెనని గోపన్నను కోరగా, స్వతహాగా హరి భక్తులైన గోపన్న అందుకు అంగీకరించారు. ఆలయనిర్మాణానికి విరాళములు సేకరించారు గాని, అది చాలలేదు. జనులు తమ పంటలు పండగానే మరింత విరాళములిచ్చెదమని, గుడి కట్టే పని ఆపవద్దనీ కోరినారు. అప్పుడు అతను తాను వసూలు చేసిన శిస్తునుండి కొంతసొమ్ము మందిరనిర్మాణ కార్యమునకు వినియోగించెను. కోపించిన నవాబుగారు గోపన్నకు 12 ఏండ్ల చెరసాల శిక్ష విధించారు. గోల్కొండ కోటలో ఆయన ఉన్న చెరసాలను ఇప్పటికీ చూడవచ్చును. ఖైదులోనున్న రామదాసు గోడపై సీతారామ లక్ష్మణాంజనేయులను చిత్రంచుకొని, వారిని కీర్తించుచూ, ఆ కరుణాపయోనిధి శ్రీరాముని కటాక్షమునకు ఆక్రోశించుచూ కాలము గడిపినారు. రామదాసు యొక్క మార్దవభరితమైన ఎన్నో ప్రసిద్ధ సంకీర్తనలు ఈ కాలములోనే వెలువడినాయి. “నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి”, “పలుకే బంగారమాయెనా”, “అబ్బబ్బో దెబ్బలకునోర్వలేనురా” వంటివి. అతని బాధను వెళ్ళగక్కిన “ఇక్ష్వాకు కులతిలక, ఇకనైన పలుకవే రామచంద్రా”, కీర్తన బాగా ప్రసిద్ధి చెందినది- “నీకోసము ఇంతింత ఖర్చు పెట్టాను. ఎవడబ్బ సొమ్మని కులుకుచున్నావు? నీ బాబిచ్చాడా? నీ మామిచ్చాడా?” – అని వాపోయి, మరలా – “ఈ దెబ్బలకోర్వలేక తిట్టాను. ఏమీ అనుకోవద్దు. నా బ్రతుకిలాగయ్యింది. నీవే నాకు దిక్కు” – అని వేడుకొన్నారు. గోపన్న సీతమ్మ వారికి చేయించిన చింతాకు పతకము, లక్ష్మణునకు చేయంచిన హారము, సీతారాముల కళ్యాణమునకు చేయించిన తాళి వంటి ఆభరణాలు ఇప్పటికీ దేవస్థానములోని నగలలో ఉన్నాయి.
ఈయన కర్మశేషము పరిసమాప్తి కాగానే, రామలక్ష్మణులు తానీషాగారి వద్దకు వెళ్ళి, ఆరు లక్షల వరహాలు శిస్తు సొమ్ము చెల్లించి, రామదాసు విడుదల పత్రము తీసుకొన్నారని ప్రతీతి. అప్పుడిచ్చిన నాణెములను “రామటంకా” నాణెములని అంటారు. వీటికి ఒకవైపు శ్రీరామ పట్టాభిషేకము ముద్ర, మరొకవైపు రామభక్తుడు హనుమంతుని ముద్ర ఉన్నాయి. ఇవి ఇప్పుడు కూడా ఉన్నాయి. రామదాసు గొప్పతనము తెలిసికొన్న నవాబుగారు వెంటనే ఆయనను విడుదల చేయించి, భద్రాచల రాముని సేవా నిమిత్తమై భూమిని ఇచ్చారు. శ్రీ సీతారామ కళ్యాణ సమయంలో గోల్కొండ దర్బారు నుండి ముత్యాల తలంబ్రాలను పంపే సంప్రదాయము అప్పుడే మొదలయ్యింది. శ్రీ రాముని సేవలో, సంకీర్తనలో రామదాసు తమ శేషజీవితమును గడిపారు. త్యాగరాజాదులకు గోపన్న ఆద్యులు, పూజ్యులు. త్యాగరాజు కీర్తన – “ధీరుడౌ రామదాసుని బంధము దీర్చినది విన్నానురా రామా?” – ఇంకా ప్రహ్లాదవిజయములో “కలియుగమున వర భద్రాచలమున నెలకొన్న రామచంద్రుని పాదభక్తులకెల్ల వరుడనందగి వెలసిన శ్రీరామదాసు వినుతింతు మదిన్” – అన్నారు.

శ్లో. శ్రీ రామచంద్ర శ్రితపారిజాత
సమస్త కళ్యాణ గుణాభిరామ
సీతా ముఖాంభోరుహ చంచరీకో
నిరంతరం మంగళ మాతనోతు.

భద్రాచలం లేదా శ్రీరామ దివ్యక్షేత్రం తెలంగాణ, ఖమ్మం జిల్లాలో, గోదావరి నది దక్షిణ తీరమున ఉన్న ఒక పట్టణం. జిల్లాకేంద్రమైన ఖమ్మం పట్టణానికి 105 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ పట్టణం, భక్త రామదాసు నిర్మించిన రామాలయానికి ప్రసిద్ధి చెందింది. పూర్వం భద్రుడు అను భక్తుడు శ్రీ రామునికొరకు తపస్సు చేసి, తను ఒక కొండగా మారి తనపై శ్రీ రాముడు వెలసే విధముగా వరము పొందాడు అంటారు. ఆ కొండకు భద్రుడు పేరు మీద భద్రగిరి అని తరువాత కాలంలో ఆ పట్టణానికి భద్రాచలం (భద్ర + అచలం) అని పేరు స్థిరపడింది. దీనినే రామాలయం అని కూడా అంటారు. దేవాలయమందు సీతా, లక్ష్మణ, హనుమంత సమేతంగా శ్రీరామచంద్రుడు ఇక్కడ అత్మారాముని రూపంలో కొలువుతీరి ఉన్నాడు. సీత, రాముని తొడపై కూర్చొని ఉన్నట్లు ఇక్కడి విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. మరే దేవస్థానంలోనూ లేని ప్రత్యేకత ఇది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి వైభవంగా జరిగే సీతారామ కళ్యాణ ఉత్సవానికి అశేష ప్రజానీకం వస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కళ్యాణోత్సవానికి ముత్యపు తలంబ్రాలు, పట్టు వస్త్రాలు పంపించడం సాంప్రదాయం. ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి, ఇక్కడ శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది. రామదాసు చేయించిన వివిధరకాల నగలు దేవస్థానపు ప్రదర్శనశాలలో ప్రదర్శనకు ఉంచారు. భధ్రాచలంలోని శ్రీరాముడిని వైకుంఠ రాముడు అని అంటారు. ఎందుకంటే ఇక్కడి రాముడు వైకుంఠమునకు వెళ్ళిన తరువాత మరల భూమి మీదకి వచ్చి, తన భక్తుడైన భద్రుడి కోరిక తీర్చి భద్ర పర్వతంపై నిలిచినాడని ఈ స్థల పురాణం చెపుతోంది.

రామదాసు కీర్తనలు :

అంతా రామమయం ఈ జగమంతా రామమయం, అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి, అడుగు దాటి కదల నియ్యను, అమ్మ నను బ్రోవవే రఘురాముని, అయ్యయ్యో నీవంటి అన్యాయ దైవము, అయ్యయ్యో నే నేరనైతి ఆదినారాయణుని తెలియనైతి, ఆదరణలేని, ఆనబెట్టితినని, ఆనందమానందమాయెను, ఇక్ష్వాకుకులతిలక, ఇతడేనా యీ, ఇతరము లెరుగనయా, ఇనకుల తిలక ఏమయ్య రామయ్యా, ఇన్ని కల్గి మీరూరకున్న, ఉన్నాడో లేడో, ఎంతపని చేసితివి, ఎంతో మహానుభావుడవు, ఎందుకు కృపరాదు, ఎక్కడి కర్మము, ఎటుబోతివో, ఎన్నగాను, ఎన్నెన్ని జన్మము, ఎవరు దూషించిన, ఏ తీరుగ నను, ఏమయ్య రామ, ఏమిర రామ నావల్ల నేర మేమిరా రామ, ఏటికి దయరాదు, ఏడనున్నాడో, ఏల దయ రాదో రామయ్య, ఏలాగు తాళుదునే, ఓ రఘునందన, ఓ రఘువీరా యని నే పిలిచిన, ఓ రామ నీ నామ, కట కట, కమలనయన, కరుణ జూడవే, కరుణించు దైవ లలామ, కలయె గోపాలం, కలియుగ వైకుంఠము, కోదండరాములు, కంటి మా రాములను కనుగొంటి నేను, కోదండరామ కోదండరామ, గరుడగమన, గోవింద సుందర మోహన దీన మందార, చరణములే నమ్మితి, జానకీ రమణ కళ్యాణ సజ్జన, తక్కువేమి మనకు, తగునయ్యా దశరధరామ, తరలిపాదాము, తారక మంత్రము, దక్షిణాశాస్యం, దరిశనమాయెను శ్రీరాములవారి, దశరధరామ గోవిందా, దినమే సుదినము సీతారామ స్మరణే పావనము, దీనదయాళో దీనదయాళో, దైవమని, నందబాలం భజరే, నను బ్రోవమని, నమ్మినవారిని, నరహరి నమ్మక, నా తప్పులన్ని క్షమియించుమీ, నామొరాలకింప, నారాయణ నారాయణ, నారాయణ యనరాదా, నిను పోనిచ్చెదనా సీతారామ, నిన్ను నమ్మియున్నవాడను, నీసంకల్పం, పలుకే బంగారమాయెనా, పాలయమాం జయ రామ, పాలయమాం రుక్మిణీ నాయక, పావన రామ, పాహిమాం శ్రీరామ, పాహిరామ, బిడియమేల నిక, బూచివాని, భజరే మానస రామం, భజరే శ్రీరామం హే, భళి వైరాగ్యంబెంతో, భారములన్నిటికి, భావయే పవమాన, మరువకను నీ దివ్యనామ, మానసమా నీవు మరువకుమీ పెన్ని, మారుతే నమోస్తుతే, రక్షించు దీనుని రామ రామ నీ, రక్షించు దీనుని, రక్షించే దొర నీవని, రక్షింపు మిదియేమో, రామ నీ దయ రాదుగా, రామ రామ నీవేగతి, రామ రామ భద్రాచల, రామ రామ యని, రామ రామ రామ, రామ రామ రామ శ్రీరఘు, రామ రామ శ్రీరామ రామ, రామ రామ సీతా, రామకృష్ణ గోవింద, రామచంద్రా నన్ను, రామచంద్రాయ, రామచంద్రులు నాపై, రామజోగి మందు, రామనామము బల్కవే, రామనామమే జీవనము, రామపరాకు, రామభద్ర రారా, రామసుధాంబుధీ, రామహో రఘురామహో, రామహో సీతారామహో, రామా నామనవిని చేకొనుమా, రామా నీచేతేమిగాదుగా, రామా దైవశిఖామణి, రామా దయజూడవే, రామా నను బ్రోవగరాదా, రామా రా రా సీతారామ, రాముని వారము మాకేమి విచారము, రామునివారమైనాము, రావయ్యా అభయము, రావయ్యా భద్రాచల, వందనము, వందే రఘురామా శుభనామ శుభనామ, శరణాగతరక్షణ, శ్రీరామనామమే, శ్రీరాముల దివ్యనామస్మరణ్, సకలేంద్రియములారా, సీతారామస్వామి,హరిహరి రామ.

దాశరథీ శతకము :

దాశరథీ శతకము శ్రీరాముని ప్రస్తుతిస్తూ కంచర్ల గోపన్న 17వ శతాబ్దంలో రచించిన భక్తి శతకము. ఈ శతకానికి “దాశరథీ కరుణాపయోనిధీ” అనే మకుటం అన్ని పద్యాలలో చివరగా వస్తుంది. దాశరథీ అనగా దశరథుని పుత్రుడైన శ్రీరాముడు. గోపన్న ఆత్రేయస గోత్రుడు. కాంమాంబ యాతని తల్లి, తండి… లింగన మంత్రి. ఈ విషయమును ఆయన ఈ పద్యమున తెలెపెను.

అల్లన లింగ మంత్రి సుతుడత్రిజగోత్రజడాదిశాఖ కం
చెర్లకులోద్భవుండన బ్రసిద్దుడనై భవ దంకితంబుగా
నెల్ల కవుల్ నుతింప రచియించితి గోపకవీంద్రుడన్ జగ
ద్వల్లభ: నీకు దాసుడను దాశరథీ కరుణాపయోనిధీ.

ఈ కవి ఈ శతకమే గాక మరికొన్ని గ్రంధములను కూడ వ్రాసినట్లుగా తెలియవస్తోంది కానీ వాటిని ఇతరులు మోసముతో తస్కరించినట్లూ ఈ క్రింది పద్యము వలన తెలియుచున్నది.

మసగొని రేగు బండ్లకును మౌక్తికముల్ వెలపోసినట్లు దు
ర్వ్యసనము జెంది కావ్వము దురాత్ములకిచ్చితి మోసమయ్యెనా
రసనకు బూతవృత్తి సుకరంబుగ జేకురునట్లు వాక్పుధా
రసములు చిల్క పద్యముఖరంగము నందు నటింపవయ్య సం
తపసమును జెంది భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.

ప్రారంభం:

శ్రీ రఘురామ! చారుతుల – సీదళధామ శమక్షమాది శృం
గార గుణాభిరామ ! త్రిజ – గన్నుత శౌర్య రమాలలామ దు
ర్వార కబంధరాక్షస వి – రామ ! జగజ్జన కల్మషార్నవో
త్తారకనామ ! భద్రగిరి – దాశరథీ కరుణాపయోనిధీ

కొన్ని ఉదాహరణలు :
రంగదరాతిభంగ, ఖగ రాజతురంగ, విపత్పరంపరో
త్తుంగ తమఃపతంగ, పరి తోషితరంగ, దయాంతరంగ స
త్సంగ ధరాత్మజా హృదయ సారసభృంగ నిశాచరాబ్జమా
తంగ, శుభాంగ, భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.

పరమదయానిధే పతితపావననామ హరే యటంచు సు
స్ధిరమతులై సదాభజన సేయు మహాత్ముల పాదధూళి నా
శిరమునదాల్తుమీరటకు జేరకుడంచు యముండు కింకరో
త్కరముల కాన బెట్టునట దాశరథీ కరుణాపయోనిధీ.

రాముఁడు ఘోర పాతక విరాముడు సద్గుణకల్పవల్లికా
రాముడుషడ్వికారజయ రాముడు సాధుజనావనవ్రతో
ద్దాముఁడు రాముడే పరమ దైవము మాకని మీ యడుంగు గెం
దామరలే భుజించెదను దాశరథీ కరుణాపయోనిధీ.

ఎంతటిపుణ్యమో శబరి యెంగిలిగొంటివి వింతగాదె నీ
మంతన మెట్టిదో యుడుత మైనిక రాగ్ర నఖాంకురంబులన్
సంతసమందఁ జేసితివి సత్కులజన్మము లేమి లెక్క వే
దాంతముగాదె నీ మహిమ దాశరథీ కరుణాపయోనిధీ.

ముగింపు : ఈ చివరిపద్యంలో కవి తనగురించి వివరాలు తెలియజేశారు. తాను అల్లన లింగమంత్రిగారి పుత్రుడిగా, అత్రిజగోత్రం ఆదిశాఖలో కంచెర్ల వంశంలో జన్మించినట్లుగా వివరించారు.

అల్లన లింగమంత్రి సుతుడత్రిజ గోత్రజుడాదిశాఖ కం
చెర్ల కులోద్బవుం దంబ్రసిద్ధిడనై భవదంకితంబుగా
నెల్లకవుల్ నుతింప రచియించితి గోపకవీంద్రుడన్ జగ
ద్వల్లభ నీకు దాసుడను దాశరథీ కరుణాపయోనిధీ!

(సేకరణ – కొన్ని అంతర్జాల లింకుల నుండి…వారికి హృదయపూర్వక ధన్యవాదములు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *