May 8, 2024

నందోరాజాభవిష్యతి

రచన: డా. ఇందిరా గుమ్ములూరి

NandorajaBhavishyati

పురాణ వైరగ్రంధమాలలో ఇది నాలుగవది. దీని రచనకాలం 1960. విశ్వనాధవారు దీనిని ఆశువుగా చెపుతుంటే శ్రీ జువ్వాడి గౌతమరావుగారు లిపిబద్ధం చేసేరు.

మగధరాజ్యం శిశునాగవంశం నుండి నందవంశ పరం ఎట్లయిందో నిరూపించే రచన “నందోరాజాభవిష్యతి” అనే నవల. పురాణాల ప్రకారం, చరిత్ర ప్రకారం కూడా శిశునాగులు పదిమంది. వీరు మగధని మూడువందల అరవై ఏళ్ళు పాలించారు. మౌర్యవంశపు రాజులు వరుసగా చంద్రగుప్తుడు, భద్రపారుడు, అశోకుడు, కుణాలుడు, దశరధుడు, ఇంద్రపాలితుడు, హర్షవర్ధనుడు, శాలిశూకుడు, సోమశర్మ, శతధనువు, బృహద్రధుడు అనేవారు. ఈ రాజులు 316 ఏళ్ళు మగధనేలుతారని విష్ణుపురాణం చెబుతోంది.

క్రీస్తుకు పూర్వం పదహారు వందల ముప్పైనాలుగవ సంవత్సరాన భారతదేశాన్నేలుతున్న సర్వక్షత్రియులను సంహరించి, నందుడు మగధదేశానికి రాజయాడు. ఈతడు మాగధుల నేలిన శిశునాగవంశపు రాజులలో చివరి వాడైనా మహానందికి జన్మించిన కుమారుడు. ఈ నందుడు శూద్రాపత్యమని పెక్కు పురాణాలు పేర్కొన్నాయి.

మహానందుడు మగధదేశానికి చక్రవర్తి. శిశునాగవంశజుడు. భారతదేశంలో మగధకున్న ప్రాముఖ్యం కారణంగా వాడు ఆర్యావర్తాన్ని పాలిస్తున్న మిగిలిన క్షత్రియరాజులు మహానందిని చక్రవర్తిగ అంగీకరించారు. అతని సేనాని ఉత్తుంగభుజుడు. తనకు తానై పిపీలికాలను భస్మీపటలం గావించే దావాగ్నిలాంటివాడు. అకారణంగా మారణహోమం కావించే నైజం గలవాడు. ఈ మహానందునికి ముగ్గురు కుమారులు. అందులో మొదటివాడు యువరాజు కాలాశోకుడు. ఉత్తుంగభుజుడు అగ్ని అయితే కాలాశోకుడు నెయ్యి వంటివాడు. మిగిలిన ఇద్దరు కుమారులు రిపుంజయ విధుపారులు నిత్యం కామం మత్తులో మునిగి తేలే నిర్వ్యాపారులు. మహానందునికి క్షత్రియాపత్యమే కాక శూద్రపత్యం కూడా ఉన్నది. అతడు కూడా “నంద” నాముడే. నాటి క్షత్రియ ప్రముఖులితనిని క్షత్రియునిగా పరిగణించకపోయిన కారణంగా ఈతడు శూద్రుడే కావలసి వచ్చింది.

రాజ్యం పేరుకే మహానందునిది. పాలనా వ్యవహారాన్నంతా సేనాపతియైన ఉత్తుంగభుజుని పాహాయ్యంతో కాలాశోకుడే నిర్వహిస్తున్నాడు. బ్రాహ్మాణాధిపత్యం చేత ఇతర వర్ణాలు అధ: కృతాలౌతున్నాయని భావించిన బౌద్ధప్రజలు బ్రాహ్మణ నిర్మూలన చేయ ఉద్యుక్తులయ్యారు. ఈ సంధర్భంలో బ్రాహ్మణపక్షమేతర వర్ణస్థులు కూడా బాధితులు కాసాగేరు. అగ్రవర్ణ నిర్మూలనగా ప్రారంభమయిన ఈ అకృత్యాలు సర్వవర్ణ, సర్వప్రజాబాధకంగా పరిణమించాయి. కాలాశోక, ఉత్తుంగభుజులు దేశంలో నాడున్న పరిస్టితిని తమకనుకూలంగా మలచుకొని ప్రజలందరినీ పీడింపసాగేరు. వీరిద్దరిచే తిరస్కృతుడైన నందుడు, వీరిచేత పీడితులైన ప్రజలు ఒక పక్షం కాగా కాలాశోక, ఉత్తుంగభుజులు వేరొక పక్షం అయ్యారు.

సర్వక్షత్రియరాజ సమావేశ మగధలో ఏర్పాటు కాగా ఇక్ష్వాక, పాంచాల, హైహయ, శూరసేన, మైథిలీ, కౌశంబి రాజ్యాధిపతులందరూ అందులో సమావేశమయ్యారు. కౌశాంబి ప్రభువైన క్షేమకుడు ఉగ్రవాదులైన బ్రాహ్మణులను మాత్రం శిక్షించాలని ప్రతిపాదించగా, మిగిలిన రాజులందరూ బ్రాహ్మణ వధను నిర్ధంద్వంగా అంగీకరించారు. ఈ సభకు క్షత్రియేతరులెవ్వరూ ఆహ్వానితులు కారు. మహారాజు మహానందుని అనుమతిని తీసుకొని కాలాశోక ఉత్తుంగభుజులు నందుని సభాప్రవేశాన్నీ నిరోధించారు. కుపితుడైన నందుడు తాను ప్రజాపక్షమవలంభించి సర్వక్షత్రియ నిర్మూలన తన ధ్యేయమని శపధం గావించి, కోటను దాటేడు. క్షత్రియ సంహారానికి ఇదే బీజమయింది.

నాడు మాహిష్మతీపురాన్ని ప్రసేనజిత్తు పాలిస్తున్నాడు. ఇతడు హైహయ వంశీయుడు. పురాణకాలంలో మాహిష్మతీపురాన్నేలిన కార్తవీర్యార్జునునిగా పరశుధారులై కట్టెలు కొట్టుకొని జీవించమని ఆజ్ఞాపించాడు. రాజశాసనం మేరకు నాటినుండి రాజ్యంలో బ్రాహ్మణులందరు పరశురాములైనారు. ఆ విధంగా పరశుధారులైన బ్రాహ్మణులని హైహాయుడు పీడిస్తుండగా, ఇది బ్రాహ్మణేతరులకి కూడా జుగుప్స కలిగించింది. చివరకు ఒక బ్రాజ్మణ యువకుని పరశువు వల్ల హైహాయార్జునుడు మరణించాడు. ఆ బ్రాహ్మణ యువకుడు బ్రాహ్మణుడో లేక చద్మవేషధారో ఏ దేశమ్నుండి వచ్చాడో, ఏ దేశానికి వెళ్ళాడో తెలియకుండా అదృశ్యుడౌతాడు.

కౌశంబి రాజయిన క్షేమకుని కుమారుడు విరమిత్రుడు. సకల రాజన్యుల పట్ల ప్రత్యయమున్న కారణాన క్షేమకుడు బౌద్ధుడు కాకపోయినా బౌద్ధమతానుయాయులైన క్షత్రియులతని పట్ల ఉపేక్షితులు. నిరమిత్రుడు గదాయుద్ధ ప్రవీణుడు. తాను బౌద్ధుడై కూడ, తన్ను తాను బలరామ దుర్యోధనులతో పోల్చుకొని, తన వద్దనున్న విద్యను పెక్కుమందికి నేర్చాడు. తన శిష్యులలో ఒకానొక ఆటవికుడు ఈతని గురుత్వాన్ని నిరసించగా, ఆతనిపై యుద్ధానికి వెళ్ళి, అచట ఒక గధాధరుని గదాఘతానికి గురై మరణిస్తాడు. కుమారుని మరణవార్త విన్న మరుక్షణం క్షేమకుడు ప్రాణాలు వదిలివేస్తాడు.

సుదామ, విపాశ, గోకులి, శత్రుడు, వితప్తా నదులు పంచసింధువుగ ప్రసిద్ధం. పాంచాల, బాహ్లిక, కేకయ, ముద్ర, రోహిత దేశాలు దీని పరివర్తిత భూభాగాలు. ఈ రాజ్యాలలో పాంచాలదేశానికి అధిక ప్రాధాన్యం. బాహ్లికదేశంలో నీలగిరి పట్టణవాసియైన వంశధరుడనే సామాన్య క్షత్రియుడు పాంచాలాధిపతినని చెప్పుకొనసాగేడు. విపాశానదీ తీరాన ఒకానొక మహావీరుని పాహాయ్యంతో ఈతని రాజ్యం నడుస్తోంది. పాంచాల ప్రభువు వద్దకు వంశధరుడు రాయబారానికేగి, అతనిచే తృణీకృతుడై కోటకు సేనతో తరలి వస్తాడు. వంశధరుని బదులు ఒక ప్రచ్చన్న వేషధారి పాంచాలరాజుని తులాయుద్ధంలో సమ్హరిస్తాడు. వంశధరుడు పాంచాలదేశానికి రాజవుతాడు.

ఉశీనరుడు విదేహరాజు, వేదవేదాంగవేత్త, ఒకానొక వృద్ధ బ్రాహ్మణుడు యజ్ఞం చేయ సంకల్పించి తన్నిర్వహణార్ధం కోసలకి విచ్చేయవలసిందిగా ఉశీవరుని పార్ధిస్తాడు. కోసల బలవంతమైన రాజ్యం. కోసలరాజు సుమిత్రుడు బౌద్ధుడు. ఆ కారణంగా కోసలలో బౌద్ధం బాగా పాతుకొనిపోయింది. కోసలలో యజ్ఞం జరుగుతున్నందువల్ల యజ్ఞాన్ని నాశనం చేసే ఉద్దేశ్యంతో అక్కడకు చేరిన బౌద్ధశ్రమణుకులు కొందరు ఉశీనరుని కుతర్కాలతో వేధించి, వాదిస్తారు. చివరకు బౌద్ధులకు, వైదికులకు జరిగిన కాష్టవాదం శ్రుతిమించి, గుడుసులాటగా పరిణమించి, ఆ తొక్కిసలాటలో భల్లాట, విదేహరాజులు ససైన్యంగా హతులౌతారు. కోసలరాజు సుమిత్రుడు ఈ మూడు దేశాలను ఆక్రమిస్తాడు.

ఏకలింగ శూరసేన కాలక దేశాలు నాడు పెద్ద జలపాతాలున్న దేశాలు. ఆ దేశపు రాజులు, తత్ప్రాంతీయ క్షత్రియులు ఆ జలపాతాల వెంబడి దూకి, పైకి వచ్చేట్లు ఒక జలక్రీడా మహోత్సవాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ ఉత్సవానికి లోకోత్తర సౌందర్యవతియైన ఒక పదునారేండ్ల బాలిక పణంగా, ఆమెతో సమంగా భృగుపాతం చేసి, ఎవరు ఈదుకొని వస్తారో వారినామె వరించేటట్లు పందెం నిర్ణీతమవుతుంది. నిర్ణీత దినాన రాకుమారులతో పాటు ఆమె కూడా జలపాతంలో దూకింది. ఎందరు పైకి వచ్చారో, ఎందరు ఒడ్డుకి చేరారో లెక్కపెట్టతానికి ఎవ్వరూ మిగలలేదు. ఆ స్త్రీ ఎవరో, ఏమయిందో దేవరహస్యం. ఈ విధంగా ఒక పధకంతో ఆ ప్రదేశమందలి సర్వ క్షత్రియులు విహతమయ్యారు. ఈ విధంగా రాజ్యం విక్షత్రియం గావించిన అదృశ్యవ్యక్తి నందుడే. రాక్షసుని రాజనీతి ఈ క్షత్రియ సమ్హారాన్ని వెనుకనుండి నడిపించింది.

కోసలరాజు సుమిత్రుడు విదేహ భల్లాట రాజ్యాలనాక్రమించిన పిమ్మట మగధ రాజ్యానికి చేరువగా ఉన్న కారణాన కోసల మగధకి పక్కలొ బల్లెం అయింది. చక్రవర్తియైన మహానందుని ప్రోద్బలంతో కాలాశోకుడు అయిష్టంగానే రాక్షసుని పిలిపించి, ఆతని బుద్ధి విశారదతకు, వాక్చమకృతికి, రాజనీతిజ్ఞతకు, గంభీరకంఠ నినాదానికి ఆశ్చర్యపడి, సుమిత్రుని వద్దకు రాయబారానికి పంపుతాడు. సుమిత్రుడు రాక్షసుని రాయబారాన్ని ఏకాంతంలో విని, వానిని సమ్హరింప ఉద్యుకుడై అది అంత తేలిక కాదని గ్రహించి, వానిని వెనుకకి పంపివేస్తాడు.

మగధరాజ్యం బౌద్ధులకాటపట్టు. వాటి బౌద్ధులు సంఘనియమాచరణం కారణంగా రెండు వర్ణాలుగా చీలిపోయారు. పిటకాలను యధాతధంగా గ్రహించిన వారు స్థవిర వాదులని, అజాతశత్రుని మంత్రియైన వస్సకారుని సప్తనియమపాలనను ఆచరించే వారిని వజ్జి భిక్షువులని అంటారు. గిరివ్రజపురంలో ఈ వివాదాలపై బౌద్ధభిక్షువుల సమావేశం జరుగుతుండగా రాజుగా కాలాశోకుని తీర్పు మాత్రం మిగిలివుంది. ఈ బౌద్ధసంఘం సమావేశం ఒక చారిత్రక సంఘటన.

కాలాశోకుడు తన సేనాని ఉత్తుంగభుజుని చేతిలో కీలుబొమ్మై దేశంలో జరిగే అరాచకాలు తెలుసుకోలేని స్థితిలో ఉంటాడు. తన సోదరులలో ఒకడైన రిపుంజయుడు తన అతికాముకత్వం కారణంగా సమ్హరితమయ్యాడన్న వార్తను, తన ఆనతి లేకుండానే ఉత్తుంగభుజుడు మిధిల మీదకు దండెత్తేడన్న వార్తనే కాక, సర్వక్షత్రియ రాజులని సమ్హరించినది రాక్షసుడేననీ, సర్వక్ష్త్రియసమ్హారం వెనుక ఉన్న వ్యూహా కర్త కూడా రాక్షసుడేననీ, బౌద్ధ భిక్షు సమావేశం ఈ వ్యూహంలో అంతర్భాగమనీ, తన రెండవ సోదరుడైన విధుపారుడు మరణించాడని ఒక అర్ధరాత్రి వేళ దేవభయంకరుడనే ఒక ఆంతరంగికుని వలన కాలాశోకుడు తెలుసుకుంటాడు. పుత్రుల మరణవార్తను విన్న మహానందుడు ప్రాయోపవేశం చేసి ప్రాణాలు వదిలేస్తాడు. కాలాశోకుడు వజ్జీయుల పక్షాన తీర్పునిచ్చాడన్న వార్త వెలువడగానే అతను కూడా మరణిస్తాడు. కాలాశోకుని మరణ కారణం ఎవరికీ తెలియదు. కోసలధిపతి సుమిత్రుడు, మగధ సేనాని ఉత్తుంగభుజుడు బంధితులై సభాముఖంగా జరిగిన ద్వంద్వయుద్ధంలో రాక్షసునిచే ఖండితులవుతారు. నందుడు మగధ సిమ్హాసనాన్ని అధిష్టిస్తాడు. శిశునాగవంశం అంతరించి నందవంశం మగధలనాక్రమిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *