May 18, 2024

దివ్యుడా! కనువిప్పుకో!!

రచన: నాగులవంచ వసంతరావు

…….

ఆత్మవీర లేవర! అజ్ఞాన పథము వీడరా!
సకల జీవరాసులలో స్వామిని దర్శించరా!

బుల్లి బుల్లి నడకలతో బాల్యమంత గడిచిపోయె
చిట్టి చిట్టి మాటలతో చిరుప్రాయం కరిగిపోయె

విద్య ఉద్యోగమంటు విదేశాలకేగినావు
ఉద్యోగం దొరకదాయె ఊడిగాలు తప్పవాయె

డాలర్లు, యూరోలు పౌండ్లెన్నో పంపినావు
ముదుసలైన తల్లిదండ్రుల వృద్ధాశ్రమాల జేర్చినావు

పచ్చగ కళకళలాడే పల్లెటూళ్ళు బోసిబోయె
పల్లెలోని జనమంతా పట్నాలకు వలసబోయె

పశు పక్షి జాతి అంతరించె. పల్లెలన్ని మోడువారె
జీవరాశి సమతుల్యత ఘోరంగా మారిపోయె

శిధిలమైన ఇండ్లున్న పల్లెసీమల గాంచినంత
గత వైభవ జ్ఞాపకాలు గుండెను పిండేస్తాయి

యవ్వనంపు పొంగులలో, ఇంద్రయాల పరుగులలో
ఎండమావి సుఖములకై వడివడి దరిజేరినావు

సుందర దేహంబు జూసి చిందులెన్నో వేసినావు
అంతరాత్మ ప్రభోదాన్ని అణగదొక్క జూసినావు

పెదవిపైన చిరునగవులు మనసులోన ద్వేషాగ్నులు
కపట నాటకంబులతో జీవితమ్ము సమసిపోయె

ప్రతిమల పూజించనేర్చి ప్రాణుల హింసించినావు
సకల జీవరాసులలో స్వామిని దర్శించలేక

బలంబాగ వస్తుందని జీవులారగించినావు
చావు దగ్గరైనవేళ చతికిలబడి పోయినావు

బలంబేడ బోయెర నీ బతుకేమైపోయెర
శాకాహారంబులోనే శక్తున్నది చూడర

గుడులు గోపురాలంటూ దేశమంత తిరిగినావు
గుండెలోని దైవాన్ని గాంచలేకపోయి నీవు

తానె దైవంబన్న తత్త్వంబును దెలియలేక
కస్తూరి మృగంవోలె కంగారుగ తిరిగినావు

గురువే మన సర్వస్వం పెద్దలు మన అస్తిత్వం
సకల జీవరాసులను ప్రమించుట మన తత్వం

త్రగుణాలలొ జిక్కినీవు తిప్పలెన్నొ బడుచుంటివి
మాయచేత పెడతన్నులు దండిగనువు దినుచుంటివి

జీవులెనుబది నాలుగు లక్షల దేహాలలో జేరినావు
బహుజన్మల పుణ్యంబున మానవజన్మ మెత్తినావు

కాలమెల్ల కరిగిపోయె వయసేమొ తరిగిపోయె
మృత్యువేమొ ముంచుకొచ్చె బ్రతుకు ఆశచావదాయె

కళేబరంబు గాంచినంత వైరాగ్యం లెస్సబెంచి
స్మశానంబు దాటగనె మాయలొబడి పోతివోయి

మాటవినని మనసుజేరి మాయచేత జిక్కినావు
మానవ పరమార్థమైన జ్ఞానంబును మరచినావు

// ఆత్మవీర లేవర //

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *