May 4, 2024

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 10

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య

%e0%b0%ac%e0%b0%be%e0%b0%b2%e0%b0%be%e0%b0%9c%e0%b0%bf

మనం ఎవరు? ఎందుకీ భూమి మీద జన్మించాము? జన్మించక ముందు మనం ఎవరు? ప్రతి మనిషీ ఈ జననమరణాల చక్రంలో ఓ ఆటబొమ్మేనా? అన్న సంశయాలు అన్నమయ్యను నిత్యం చుట్టుముడుతూనే ఉండేవి. ఈ విషయాలను పలుపలు విధాలుగా తర్కించి శోధించి ఆయా విషయాలను సంకీర్తనలరూపం లో మనకందించిన మహానుభావుడు అన్నమయ్య. బాల్యం నుండి జీవ బ్రహ్మైక్యం వరకు సాగే ప్రస్థానంలో మానవ అంతరంగం యొక్క పాత్ర చాలా ప్రధానమైనదని చెప్తూ.. ఈ వింత చక్రంలో, అంతర, బాహ్య పరిధులను అతిక్రమించక, అంతా పరమాత్మదనే నిస్సందేహమైన ధృఢ భక్తిని గ్రహించి జన్మ పరంపరలనే ఈ సంసార సాగరాన్ని దాట వలసిఉన్నదని సందేశమిస్తూ, ఈ లౌకిక జగత్తంతా పరమాత్మదేనని శ్రీవేంకటేశ్వరుడే అంతర్యామి అని పదే పదే భావించడం లో ఎంతో అర్ధమూ..పరమార్ధమూ మన బతుకుకు ఉందంటాడు అన్నమయ్య. యౌవనంలో నిగ్రహించలేనప్పుడు ఇంద్రియాలు వాటి విషయాలతో తాదాత్మ్యం చెందడం, తన శరీరానికున్న ప్రజ్ఞ, పటిమా, అనుకుని భ్రమ పడి విర్రవీగడం. చివరకు జవసత్వాలు బలహీనమై, జీవునిచే తోసివేయ బడుచునప్పుడు, ఉద్ధరణకు, భగవంతుని కరుణ వలన, అతని పూర్వ పుణ్యాల ఫలితంగా అంతరాత్మకు శరణాగతుడై, స్వస్థ చిత్తుడై, అంతా తన ప్రజ్ఞ అనే అజ్ఞానం నశించి మనసును అంతర్ముఖం చేసుకొని ఆత్మారాముడై బ్రహ్మంలో రమిస్తాడంటాడు ఈ కీర్తనలో అన్నమయ్య.
పల్లవి: ఎవ్వరివాడో యెఱుగరాదు
అవ్వలివ్వలిజీవు డాటలో పతిమే

చ.1. ధర జనించక తొలుత తను గానరాదు
మరణమందినవెనుక మఱి కానరాదు
వురువడి దేహముతో నుందినయన్నాళ్ళే
మరలుజీవునిబదుకు మాయవో చూడ ||ఎవ్వరి||

చ.2. యిహములో భోగించు నిందు గొన్నాళ్ళు
మహిమ పరలోకమున మలయు గొన్నాళ్ళు
తహతహల గర్మబంధముల దగిలినయపుడే
అహహ దేహికి బడుచులాటవో బదుకు ||ఎవ్వరి||

చ.3. సంతానరూపమై సాగు ముందరికి
కొంత వెనకటిఫలము గుడువ దా దిరుగు
యింతటికి శ్రీవేంకటేశు డంతర్యామి
అంతి నితనిగన్నబదుకువో బదుకు ||ఎవ్వరి||
(ఆ.సం.(1980) 95 వ రేకు. కీ.సం.471)

విశ్లేషణ:
పల్లవి: ఎవ్వరివాడో యెఱుగరాదు
అవ్వలివ్వలిజీవు డాటలో పతిమే

ఓ జీవుడా! నీవెవరు? ఈ జన్మలో ఆమెకు భర్త, వారికి తండ్రివి…వీరికి తాతవు. మరి ఇవన్నీ శాశ్వతమైన బంధాలేనా? అన్న ప్రశ్నకు ఆ దేవదేవుని ఆటలో మట్టి బొమ్మలం మనం అని తెలుస్తుంది. బొమ్మ విరిగి పగిలిపోగానే మన యాత్ర పరిసమాప్తమౌతుంది. ఆ విషయం గ్రహించలేను అశక్తులం మనం. ఆట బొమ్మలాంటి జీవితం శాశ్వతమని భ్రమించి ఎన్నో కలలు గంటాము. కలవీగిపోగానే.. శరీరం పడిపోగానే.. అకస్మాత్తుగా ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోతాము.
చ.1. ధర జనించక తొలుత తను గానరాదు
మరణమందినవెనుక మఱి కానరాదు
వురువడిదేహముతో నుందినయన్నాళ్ళే
మరలుజీవునిబదుకు మాయవో చూడ!
ఓ జీవుడా! విను! నీవు జన్మించకు ముందు నీ గురించి ఎవరికైనా తెలుసా? ఎవరికైనా కనుపించావా? అలాగే మరణించాక నీవు కనిపిస్తావా? అంతా మూణ్ణాళ్ళ ముచ్చటని తెలీడంలేదా నీకు! ఎందులకీ తహ తహ? ఎందుకీ తొందర? ఈ శరీరం ధరించినంత కాలమే మన ఈ నాటకం. అంతా మాయ! అమ్మా, నాన్న, తాతా బంధాలన్నీ ఈ తనువుతో ఏర్పడినవే! ఆ విషయం మరచిపోయి ఉన్నన్నాళ్ళూ.. అహంకరిస్తావు.. గర్విస్తావు..సంతోషిస్తావు.. దు:ఖిస్తావు. ఎందుకు?
చ.2. యిహములో భోగించు నిందు గొన్నాళ్ళు
మహిమ పరలోకమున మలయు గొన్నాళ్ళు
తహతహల గర్మబంధముల దగిలినయపుడే
అహహ దేహికి బడుచు లాటవో బదుకు ||ఎవ్వరి||

ఈ ఐహిక ప్రపంచంలో తాత్కాలికంగా కొన్ని దినాలు భోగ భాగ్యాలు అనుభవిస్తావు. ఇంద్రియ సుఖాలూ అనుభవిస్తావు. ఆ తర్వాత పరలోక ప్రయాణంలో కొన్నాళ్ళు గడిపుతావు. ఈ జననమరణ చక్రమూ..ఇవన్నీ నిత్య సత్యాలని తెలియక కర్మ బంధాలలో చిక్కుకొని..తగులుకొని ఏవో తహతహలతో గడుపుతూ ఇంకా కావాలి కావాలి అంటూ…అంతా నాదే…నేనే అన్న భ్రమతో జీవి ఆటలాడుతూ తన బతుకని గమనించలేక పోతాడని వాపోతాడు అన్నమయ్య.
చ.3. సంతానరూపమై సాగు ముందరికి
కొంత వెనకటి ఫలము గుడువ దాదిరుగు
యింతటికి శ్రీవేంకటేశు డంతర్యామి
అంతి నితనిగన్నబదుకువో బదుకు !

జీవి సంతానాన్ని కని ముందు జన్మలలో జేసిన పుణ్యఫలాల వల్ల ఆ ఫలితాలనుభవిస్తూ ముందుకు సాగిపోతూ ఉంటాడని చెప్తూ కర్మ సిద్ధాంతం గురించి చెప్తాడు. కర్మ సిద్ధాంతం ప్రకారం జరగాల్సినది జరగక మానదు. అలాగే జరగాలి అని రాసి ఉన్న దాని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. జరిగేది ఆపలేరు. జరగనిది మన ప్రయత్నం చేసినా జరగదని అర్థం. కర్మను కర్మచేతనే జయించాలి. పూర్వం చేసిన కర్మను దానివల్ల వచ్చే ఫలితాన్ని అదృష్టమని, దైవికమని పిలుస్తుంటారు. “విహన్యాద్దుర్బలం దైవం పురుషేణ విపశ్చితా” అనే వ్యాసుని వచనం పూర్వ కర్మను ప్రస్తుత కర్మచే జయించ వచ్చనే అభిప్రా యాన్ని బలపరుస్తుంది. వీటన్నిటికీ లోపల నివసించే జీవాత్మ అంతర్యామిగా నిలిచి ఉన్నప్పటికీ, శ్రీ వేంకటేశ్వరుని గమనిచలేకపోతాడు. ఆ శ్రీనివాసుని, పరంధాముని గన్న బతుకే బతుకు అంటూ ముగిస్తాడు అన్నమయ్య.

విశేషాంశములు: కర్మ మూడు విధాలు. ప్రారబ్ధం, సంచితం, ఆగామి.
ప్రారబ్ధం: ప్రారబ్ధం అంటే… పూర్వ జన్మలో మనం చేసిన కర్మను ఫలితం అనుభవించడం ప్రారంభించింది. ప్ర – ఆరబ్ధం: ఇంతకు ముందే ఆరంభింపబడింది. దానిని జయించ శక్యం కాదు. విడిచిపెట్టిన బాణం యొక్క మార్గాన్ని మళ్లించడం అంత సులభం కాదు.
సంచితం: సంచిత కర్మ అంటే పూర్వం చేయబడి నిల్వవున్నది.
ఆగామి: ఆగామి అంటే రాబోవుకాలంలో పరిపక్వయ్యేది. మన సత్ప్రవర్తన ద్వారా ఆగామి మంచిగా మలచుకోవచ్చు. మన ప్రతి క్రియల ద్వారా దుష్టమైన సంచిత కర్మను తొలగించుకోవచ్చు. దుష్టదశ వచ్చేవరకు ఆగి దుష్టఫలితాన్ని అనుభవించడం ప్రారంభించిన తరువాత దాన్ని తొలగించుకోవడం అనేది అనారోగ్యం వచ్చాక మందు పుచ్చుకోవడం లాంటిది.

ముఖ్యమైన అర్ధాలు:
పతిమ = ప్రతిమ, బొమ్మ; ఉరువడి = శ్రీఘ్రం, వేగం; అంతర్యామి = లోపల నివసించేవాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *