May 20, 2024

రామమును నేను

రచన: డా.వారణాసి రామబ్రహ్మం

రామమును నేను లోకాభిరామమును నేను
సామమును నేను గానామృత సారమును నేను
రాగమును నేను రస హృదయానంద పూర్ణ భాగమును నేను
సౌమ్యమును నేను కవితా తరంగ సంగీత ఝరిని నేను
రమ్యమును నేను రసమయ యువతీ శృంగారమును నేను
పద్యమును నేను అనురాగ హృదయ గద్యను నేను
అమృతమును నేను అధర చుంబన జనిత రస సుధను నేను
గమ్యమును నేను కౌతుకయుత శరీర రస గంధర్వమును నేను
సావేరిని నేను అసావేరిని నేను
సిరిదొర పల్లవాధర స్పర్శా జనిత మురళీ రవ శ్రుతిని నేను
రసాంతరంగ ప్రణయమును నేను ప్రణవ కలరవమును నేను
కావేరిని నేను ప్రియ స్మరణా జనిత రస గోదావరిని నేను
అబ్ధిని నేను హృదయాంతర్లీన సుదాబ్ధిని నేను
రామమును నేనునదిని నేను
సమస్తమును లీనము చేసికొను
భగవత్ కరుణా సంద్రమును నేను
అరమరికలు లేని మనసును నేను అనంతుని జతను నేను
అబద్ధపు నేనును నేను నిజ స్థితికి ఆలవాలమైన అసలునేనునూ నేనే
రాముడును నేను అంజనీసుత హృదయ రంజనుడను నేను
రాధను నేను నల్లనయ్య చల్లని ఎద మధుర బాధను నేను
సోముడను నేను పూర్ణ సుధాకర బింబమును నేను
నటరాజును నేను “సై” అని ఆడు శైలజ పద విన్యాసమును నేను
చతుర్ముఖ బ్రహ్మను నేను శారదాంబుద
శారదేందు ధవళ వస్త్రదారి సరస్వతిని నేను
రామమును నేను లోకాభిరామమును నేను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *