May 10, 2024

కలిసి నడుద్దాం

రచన: అశోక్ అవారి |

అభిమతం గొప్పదైనప్పుడు..
ఆచరించే మతమూ గొప్పదే.
మనసు మంచిదైనప్పుడు..
మనిషి కూడా మహాత్ముడే.

ఏ భగవద్గీతా..
చెడుగీత దాటమననూ లేదు.
ఏ బైబిలూ..
గుండెల్లో గునపాలు దించమననే లేదు.
ఏ ఖురానూ..
ఉగ్రవాదానికి ఊపిరులూదిందీ లేదు.

అందరూ ఆగర్భ శత్రువులే..
నాల్గన్నం మెతుకులు కరువైనప్పుడు.
అందరి మతాలు చెడ్డవే..
నరుల అంతరంగం క్రూరమైనప్పుడు.

హిందువేంటి..?
ముస్లీమేంటి..?
బైబిలేంటి..?
భగవద్గీతేంటి..?
మనమంతా భారతీయులమే.
భరతమాత ముద్దు బిడ్డలమే.

మతం అంటే మారణ హోమం కాదు
ఆదర్శ అభిమతం మాత్రమే.
మతం ఎప్పుడూ మంచిదే..
నరుడే నర రూప రాక్షసుడు.

ఎక్కడైనా జరగాల్సింది..
కలహాల తిరోగమనం కాదు
కలిసి నడిచే పురోగమనం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *