July 1, 2024

కర్ణాటక సంగీతంలో రాగమాలికలు 10

రచన: కొంపెల్ల రామలక్ష్మి

ఈ సంచికలో కూడా మనం, లలిత గీతాలలో చేయబడిన రెండు రాగమాలికా రచనల గురించి వివరించుకుందాం. ముందుగా – ‘వచ్చెనదిగో వర్షసుందరి, నిండినది భువి హర్షమాధురి’, అనే రచన. ఈ పాట రచించిన వారు శ్రీ కందుకూరి రామభద్ర రావు గారు. సంగీతం సమకూర్చిన వారు ఎన్ సి వి జగన్నాథాచార్యులు గారు. ఆకాశవాణి కోసం మొట్టమొదట గానం చేసిన వారు కుమారి. శ్రీరంగం గోపాల రత్నం గారు. ముందుగా ఈ ముగ్గురు ప్రముఖుల గురించి తెలుసుకుని, ఆ తర్వాత పాట గురించి వివరించుకుందాం.

ఈ పాట రచించిన శ్రీ కందుకూరి రామభద్రరావు గారు తూర్పు గోదావరి జిల్లా రాజవరం గ్రామంలో 31.01.1905 తేదీన జన్మించారు. గాంధీ మహాత్ముని ప్రభావం వల్ల చిన్నప్పటి నుంచి దేశసేవ పట్ల మక్కువ ఎక్కువ. వీరు గొప్పవక్త. పిఠాపురం మహారాజావారి కళాశాలలో విద్యార్థిగా ఉన్న సమయంలోనే వీరు కవితలు వ్రాయడం మొదలు పెట్టారు. లేమొగ్గ, తరంగిణి, వేదన, జయపతాక వంటి ఖండకావ్యాల సంపుటాలు ప్రచురించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ‘చిత్ర’ అనే రచనను తెలుగులో అనువదించారు. ‘నివేదనము’ అనే మకుటం లేని శతకాన్ని రచించారు. ఉపాధ్యాయునిగా తూర్పు గోదావరిలో పలు ప్రదేశాల్లో ఉద్యోగం చేసి, పదవీ విరమణ తర్వాత, ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో విద్యాకార్యక్రమ ప్రయోక్తగా సుమారు పది సంవత్సరాలు పనిచేసారు. ఆ సమయంలో ఎన్నో దేశభక్తి గేయాలు, సంగీత రూపకాలు వ్రాసి ప్రసారం చేసారు.
ఈ పాట సంగీత కర్త శ్రీ ఎన్ సి వి జగన్నాథాచార్యులు గారు, గొప్ప గాయకులు మరియు స్వరకర్త. వీరు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో నిలయ విద్వాంసులుగా 1961వ సంవత్సరం నుంచి పని చేసారు. ఆ సమయంలో ఎన్నో అందమైన రచనలకు వీరు సంగీతం సమకూర్చారు. వీరు తమ సంగీత విద్యను నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు గారి దగ్గర అభ్యసించారు.
ఈ పాటను పాడినవారు కుమారి (పద్మశ్రీ) శ్రీరంగం గోపాలరత్నం గారు. వీరు కూడా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో కళాకారిణిగా ఎన్నో లలిత గీతాలు అందంగా ఆలపించారు. వీరు 1939 సంవత్సరంలో విజయనగరం జిల్లా పుష్పగిరిలో జన్మించారు. వీరి గురువులు శ్రీ కవిరాయుని జోగారావు గారు మరియు శ్రీపాద పినాకపాణి గారు.

భూపాల రాగం
పల్లవి:
వచ్చెనదిగో వర్షసుందరి
నిండినది భువి హర్షమాధురి
గ్రీష్మతాప పరివృతమ్మై
సోలు జగతిని మేలుకొలుపగ

చరణం 1 – బెహాగ్ రాగం:
కారుమబ్బుల తేరుపై
శంపాలతల దివిటీలు బూని
ఉరుముల అందియలు మ్రోయగ
ఊహకందని సోయగముతో
వచ్చెనదిగో వర్షసుందరి…

చరణం 2 – కాపి రాగం
చినుకు చినుకున చిందు లయతో
వర్షధారలనొదుగు శృతితో
బీటవారిన ధరణి హృదయము
పులకరించి మొలకలెత్తగ
వచ్చెనదిగో వర్షసుందరి…

చరణం – 3 మలయ మారుతం
మురిసి తరువులు తలలనూపగ
కురిసినది సుధ కుండపోతగ
మలయపవనుని వలపు కౌగిట
మేను మరచిన మధురవాహిని
వచ్చెనదిగో వర్షసుందరి…

చరణం – 4 బిళహరి రాగం
పూచిన చేమంతి దొంతులు
నోము నోచిన ఇంతులు
శ్రావణమ్మున సాదరముతో
పిలచిరట పేరంటమునకని
వచ్చెనదిగో వర్షసుందరి

చరణం – 5 సురటి రాగం
మరలి వచ్చిన నెచ్చెలిని గని
పొంగినవి సరసులు ముదమ్మున
గలగల కేరింతలాడుచు
కదలె నదులు స్నేహఝరితో
వచ్చెనదిగో వర్షసుందరి

ఈ గీతం ఒక చక్కని భావగీతం. వర్షాన్ని ఒక సుందరిగా భావించి ఆ వర్షసుందరి ఆగమనంతో ప్రకృతి పులకరించి పరవశించు వైనాన్ని కందుకూరి వారు అమోఘంగా అభివర్ణించారు. పల్లవిలో, అమితమైన వేడి తాకిడికి కమిలిపోయిన భూమికి ఉపశమనం కోసం వర్షసుందరి వచ్చిందని, తాపంతో సోలి ఉన్న జగతికి, ఉపశమనాన్ని మేలుకొలుపుగా అందించడానికి వర్షసుందరి వచ్చెనదిగో అన్నారు కవిగారు. మేలుకొలుపు పద ప్రయోగానికి అనుగుణంగా, భూపాల రాగాన్ని ఎన్నుకోవడం సంగీత కర్త ప్రజ్ఞను సూచిస్తుంది.
మొదటి చరణంలో, నీలిమేఘాల రథముపై మెరుపులనే దివిటీలతోటి వర్షసుందరి వస్తోందని, ఆమె కాలి అందెల సవ్వడులే ఉరుములని, ఆమె ఊహకందని సౌందర్యరాశి యని కవి భావన.
రెండవ చరణంలో, నింగివిడిచి నేలకు చేరే చినుకుల చిందులు లయాత్మకమని, అట్టి వాన జల్లు ధారగా పుడమిని తాకడంలో ఒక చక్కని శ్రుతి ఒదిగి ఉందని, ఆ శ్రుతిలయల సత్సంగమ ధార తాకిడితో అంత వరకూ బీటలువారి బీడుగా పడి ఉన్న భూమికి పులకరాలు పుట్టుకొచ్చాయని అన్నారు కవి గారు.
మూడవ చరణంలో, అలా భువికి చేరే వర్షసుందరి అమృతంలా కుండపోతగా కురుస్తూ, మెల్లన వీచే పిల్లవాయువుల వలపు కౌగిలిలో మైమరచిపోయిందని, తడిసి సేదతీరి మురిసే ముచ్చటలో చెట్లు తమతమ తలలనూపి హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాయని కందుకూరి వారి యోచన, కవన వివేచన. వర్షసుందరి, మలయ పవనుని కౌగిట మైమరచి పోయిన వైనం ప్రస్తావించడం జరిగింది కాబట్టి, సంగీత కర్త ఈ చరణానికి మలయమారుత రాగాన్ని ఎన్నుకోవడం ఒక విశేషం, ఔచితీమంతం.
నాల్గవ చరణం మరో మధుర భావ మందారం. విచ్చుకున్న చేమంతి పూల దొంతరలు శ్రావణ మాసపు నోము నోచుకున్న ఇంతులలా ఉన్నాయట. ఆ ఇంతులు సాదరముగా పేరంటానికి పిలువగా వర్షసుందరి వస్తోందట. ఇది భావలాలిత్యానికి పరాకాష్ట.
ఐదవ చరణంలో కూడా భవ్య భావచారణం సాగింది. నేలమీదకి నెచ్చెలిగా వచ్చిన వర్షసుందరిని చూసి సరస్సులు, సరోవరాలు, నదీనదాలు కేరింతలు కొడుతూ మహదానందంతో అల రేగి, చెలరేగుతూ స్నేహమాధుర్యాన్ని వెదజల్లుతున్నాయట. చివరి చరణం కాబట్టి, సురటి రాగాన్ని ఎన్నుకోవడంలో సంగీత కర్త విజ్ఞత ప్రకటితమవుతుంది (ఆది నాట, అంత్య సురటి అన్నది సంగీతంలో ఒక చక్కటి సంప్రదాయం).
ఇది సంగీత రాగమాలిక
వర్షసుందరి అనురాగమాలిక
కందుకూరి భావ జలదూర్మిక
ప్రాకృతిక నవరాగ డోలిక.

ఈ ‘వచ్చెనిదిగో వర్షసుందరి’ గీతాన్ని ఈ క్రింది యుట్యూబ్ లింక్ లో విని ఆనందించండి.

***
రెండవ రచన – భువన భవన దీపం భువనేశ్వరి రూపం. ఈ రచన చేసినవారు శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు. సంగీత కర్త శ్రీ మోదుమూడి సుధాకర్ గారు. ముందుగా వీరి గురించి తెలుసుకుని, ఆ తర్వాత పాట గురించి వివరించుకుందాము.
సామవేదం షణ్ముఖశర్మ గారు, ఒక గొప్ప ఆధ్యాత్మిక వేత్త, ప్రవచన కర్త, కవి, సినీ గేయ రచయిత, ఋషిపీఠం అనే పత్రిక సంపాదకులు. వీరు ప్రవచనాల రూపంలో ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను విపులంగా వివరించారు. అలాగే, లలిత మరియు విష్ణు సహస్ర నామాలకు భాష్యాలు, రామాయణ, భారత, భాగవతాలు కూడా వివరించారు. గణేశ పంచరత్న స్తోత్రం, భజగోవిందం స్తోత్రం వంటి ఎన్నో స్తోత్రాలకు భాష్యం చెప్పిన గొప్ప ప్రవచన కర్త.
మోదుమూడి సుధాకర్ గారు గాయక సార్వభౌమగా పేరొందిన శ్రీ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి మనుమడు. వీరు గొప్ప కర్ణాటక సంగీత విద్వాంసులు. విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో 30 సంవత్సరాలు తమ సేవలను అందించారు. అత్యుత్తమ సంగీత కళాకారునిగా, స్వరకర్తగా సమర్థవంతంగా విధి నిర్వహణ చేసిన సుధాకర్ గారు మనందరికీ కూడా బాగా తెలిసిన ఈతరం విద్వాంసులు.
పల్లవి: సారమతి రాగం
భువన భవన దీపం భువనేశ్వరి రూపం
వెలుగులతో విశ్వమేలు తొలి తొలి దీపం

చరణం 1: సారమతి రాగం
రవి శశి నక్షత్రాదుల రాజిల్లే తేజం
వివిధాగ్నుల వెలిగించే విశ్వ మూలదీపం
నిరాకార పరంజ్యోతి పరమేశ్వరి పరాశక్తి
అనేక దివ్యాకృతులను అద్భుతమౌ దీపం

చరణం 2 దుర్గ రాగం:
అఖండకాలమె రూపుగ మహాకాళికాద్యుతి
సిరులు కురిసి జగములేలు శ్రీమయమే దీపం
చదువుల పలుకుల కాంతుల శబ్దమహాజ్యోతి
దుష్ట తమోదళనమైన దుర్గాకృతి దీపం

చరణం 3 కర్ణ రంజని రాగం:
కన్నుల దృక్శక్తిగా, కంఠమ్మున వాక్కుగా,
నాసికలో ఘ్రాణమై, కర్ణమ్మున శ్రవణమై,
హృదయమ్మున స్పందనమై, తనువున చైతన్యమై
తన వెలుగులే నింపినట్టి సనాతనపు దీపం

శక్తి స్వరూపిణి అయిన లలితాదేవి సహస్ర నామాలలో, అతి ముఖ్యమైన నామం భువనేశ్వరి నామం. శక్తి రూపాలలో పరిపూర్ణమైన రూపం భువనేశ్వరి రూపం. ఈ నామరూప వైభవాన్ని ఎన్నో చోట్ల ప్రవచనంగా సామవేదం గారు వివరించారు. అది ఈ పాట రూపంలో ఇంకా హృద్యంగా, మనసుకు హత్తుకునే విధంగా వివరించారు శర్మ గారు.
ఈ పదునాలుగు భువనాలు ఒక పద్ధతిగా క్రమం తప్పకుండా నడవడానికి కారణం శక్తి స్వరూపిణి అయిన అమ్మ. ఆ అమ్మే సకల చరాచర జగత్తును నడిపిస్తుంది. ఆ అమ్మ సమస్తంలో నిండి ఉంది. లక్ష్మీ, సరస్వతి, పార్వతీ స్వరూపం కూడా ఆ తల్లే.
మనలో ఉంటూ మనలను నడిపించేది కూడా ఆ అమ్మే. అలా అమ్మవారి గొప్పదనాన్ని సంపూర్ణంగా వివరించేదే ఈ రచన.
పల్లవి మరియు మొదటి చరణం సారమతి రాగంలో సంగీతం సమకూర్చారు.
పల్లవిలో, భువనేశ్వరి రూపం భువన భవనానికి దీపం వలె వెలుగును ప్రసాదిస్తుంది అని అన్నారు రచయిత.
సౌరశక్తి ఆ తల్లే అన్న అర్థం గోచరిస్తుంది పల్లవిలో. బాలభానుడిలో లలితా దేవి స్వరూపాన్ని ధ్యానిస్తూ ఆరాధించే ఉపాసకులు ఎంతో మంది ఉన్నారు.
మొదటి చరణంలో, సూర్యచంద్రులు, నక్షత్రాలలో కనిపించే కాంతి ఆ తల్లి తేజమే అని, వివిధమైన అగ్నులను వెలిగించేది సైతం (ఉదాహరణకు, మనకు వేళకు ఆకలి దప్పులు కలిగేది ఆ తల్లి కరుణ వల్లనే) ఆ అమ్మే అన్నారు. నిరాకారంగా ఉండే పరంజ్యోతి, పరాశక్తి, అనేక దివ్యాకృతులలో వెలుగొందే అద్భుత దీపం భువనేశ్వరి దేవియే.
రెండవ చరణం దుర్గ రాగంలో చేయబడింది. ఇందులో అమ్మవారిని ముగురమ్మల మూలపుటమ్మగా వర్ణించారు. కాళీ, లక్ష్మీ, సరస్వతి రూపాలతో విలసిల్లే దుర్గాకృతి ఆ అమ్మదే అని భావం. రచనలో ఉన్న దుర్గ అన్న పదం అందం ఇనుమడించేలాగా, ఆ చరణానికి, అందమైన దుర్గ రాగాన్ని ఎన్నుకున్నారు సంగీత కర్త.
మూడవ చరణం కర్ణ రంజని రాగంలో చేయబడింది.
మనిషి పంచేంద్రియాలు నిరవధికంగా వాటి పని అవి చెయ్యడానికి కావలసినది అమ్మ కృపయే. గుండె కొట్టుకోవాలన్నా, శరీరంలో చైతన్యం ఉండాలన్నా, అమ్మ కరుణ వల్లనే అది సాధ్యం. మనం సజీవంగా ఉన్నాము అంటే, మనతో ఆ భువనేశ్వరి ఉన్నట్టే. ఆ తల్లి తేజం మనలో లేనినాడు మన ఉనికి లేదు. ఆ ఎరుక మనిషికి ఎప్పుడూ ఉండాలి.
ఈ మధురమైన భక్తిగీతాన్ని ఈ లింక్ లో వినేయండి మరి!

ఈ సంచికలో ఒక భావగీతం, ఒక భక్తిగీతం గురించి వివరించుకున్నాము. వచ్చే సంచికలో మరో రాగమాలికాంశాన్ని గురించి తెలుసుకుందాం.

***

1 thought on “కర్ణాటక సంగీతంలో రాగమాలికలు 10

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *