July 1, 2024

యస్.వి. రంగారావు

రచన: సుజాత తిమ్మన

గంభీరమైన రూపం, నిలువెత్తు విగ్రహం… అది యెస్.వి. రంగారావు.

సామర్లకోట వెంకట రంగారావు యస్.వి. రంగారావుగా సుప్రసిద్ధులు.
మన తెలుగు రాష్ట్రంలోనిది అయిన కృష్ణాజిల్లాలోని నూజివీడులో 1918 జులై 3 వ తేదీన తెలగ నాయుళ్ళ వంశములో లక్ష్మీ నరసాయమ్మ, కోటీశ్వరనాయుడులకు జన్మించారు రంగారావు.
రంగారావు తాత కోటయ్య నాయుడు వైద్యుడు. నూజివీడు ఆసుపత్రిలో శస్త్రచికిత్స నిపుణుడుగా పని చేశారు. రాజకీయ నాయకుడైన బడేటి వెంకటరామయ్య రంగరావుకి మేనమామ. తండ్రి న్యాయ శాస్త్రవేత్త అయినప్పటికీ, ఎక్సైజు శాఖలో పనిచేస్తూ వృత్తిరీత్యా పలుప్రాంతాలకు బదిలీలు అవుతుండటం వలన నాయనమ్మ అయిన గంగా రత్నమ్మ పర్యవేక్షణలో పెరిగాడు. తాత మరణానంతరం తండ్రి ఉన్న చోటికి నాయనమ్మతో సహా మద్రాసుకు వచ్చారు. రంగారావు అక్కడే విద్యాభ్యాసం సాగించారు.
మద్రాసు హిందూ ఉన్నత పాఠశాలలో మొదటిసారిగా నాటకంలో నటించారు తన పదిహేనవ ఏట. ఆయన నటనను అందరూ ఎంతో గొప్పగా కొనియాడేసరికి ఆయనకు నటుడిని అవ్వాలనే కోరికకు బీజం పడింది. అప్పటి నుంచి పాఠశాలలో ఏ నాటకం అయినా నటించేవాడు. క్రికెట్, వాలీబాల్, టెన్నిస్ క్రీడలతో పాటూ వక్తృత్వ పోటీల్లోనూ పాల్గొనేవారు.
మద్రాసులో ఎక్కడ తెలుగు నాటకాలు జరుగుతున్నా హాజరవుతూ ఉండేవారు. అన్ని భాషల సినిమాలు చూసి విశ్లేషించేవారు. రంగారావు చూసిన మొదటి తెలుగు చిత్రం 1934లో విడుదలైన లవకుశ.
ఏలూరులో ఉన్న మేనమామ మరణించటంతో తిరిగి ఆయన కూతురికి తోడుగా ఉండాలనే ఉద్దేశ్యంతో నాయనమ్మతో కలిసి రంగారావు ఏలూరు వచ్చి చేరారు. వారి కుటుంబంలో ఎవరూ నటులు లేని కారణంగా రంగారావు బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేయాలన్నదే ఆ కుటుంబ సభ్యుల కోరిక. కానీ రంగారావుకు నటుడుగా ఎదగాలనే ఆశను వదులుకోలేక చదువుకుంటూనే కాకినాడలోని యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్లో చేరి ఎన్నో నాటకాల్లో నటించారు. అంజలీదేవి, ఆదినారాయణరావు, బి.ఎ.సుబ్బారావు, రేలంగి వంటి వారితో అక్కడే ఆయనకు పరిచయం ఏర్పడింది.
నాటకాల్లో రంగారావు అనేక వైవిధ్యమైన పాత్రలు పోషించారు. పీష్వా నారాయణరావు ‘వధ’ నాటకంలో రంగారావు ఇరవై రెండేళ్ళ వయసులో అరవై ఏళ్ళ వృద్ధుని పాత్ర ధరించి మెప్పించారు. షేక్స్‌పియర్ నాటకాల్లోని సీజర్, ఆంటోనీ, షైలాక్ లాంటి పాత్రలను ఇంగ్లీషు మీద మంచి పట్టు ఉండటంలో పోషించి మెప్పును పొందారు.
ఓ వైపు నాటకాలు వేస్తూనే బి.యస్.సి. పూర్తి చేశారు. యమ్.యస్.సి. చేయాలనుకున్నారు కానీ అగ్నిమాపకదళంలో ఉద్యోగం రావడంతో బందరులో ఫైర్ ఆఫీసర్ గా పనిలో చేరారు. ఉద్యోగరీత్యా నటనకు దూరం అవుతున్నాను అన్న ఆలోచనతో ఆయన చాలా కొద్ది రోజులకే ఆ ఉద్యోగం నుంచి బయటికి వచ్చేశారు.
బి.వి రామానందం రంగారావుకు దూరపు బంధువు. ఆయన దర్శకత్వంలో ‘వరూధిని’ అన్న సినిమాలో ప్రవరాఖ్యుడి
పాత్రలో నటించారు మొట్టమొదటిసారిగా సినిమాలో. నటి గిరిజ తల్లి దాసరి తిలకం ఆయనకు జోడీగా నటించింది. 750 రూపాయలు పారితోషికం తీసుకున్నారట మొదటగా ఆయన. ఆ సినిమా సరిగా ఆడనందున రంగారావుకు తిరిగి సినిమా అవకాశాలు రాక మళ్ళీ ఉద్యోగంలో చేరారు.
తరువాత కొంత కాలానికి పల్లెటూరి పిల్ల సినిమాలో ప్రతినాయకుడి పాత్రకై పిలుపు వచ్చింది కానీ తండ్రి మరణంతో ఆ అవకాశం అందుకోలేకపోయారు.
‘మనదేశం’, ‘తిరుగుబాటు’ చిత్రాలలో కూడా అంతగా ప్రాధాన్యత లేని పాత్రలు దక్కాయి. అయినా నిరుత్సాహ పడకుండా రంగారావు మంచి పాత్రలకై ఎదురు చూశారు.
నాగిరెడ్డి, చక్రపాణి కలిసి ‘విజయ ప్రొడక్షన్స్’ అనే సంస్థను స్థాపించి తొలిసారిగా నిర్మించే ‘షావుకారు’ సినిమాలో రంగడి పాత్రను రంగారావుకు ఇచ్చారు. ఇక తిరిగి చూసుకోలేదు. అక్కడి నుండి ఆయన విజయం మొదలయింది అని చెప్పొచ్చు.
అదే సంస్థ నిర్మించిన ‘పాతాళభైరవి’ సినిమాలో మాంత్రికుడి పాత్ర ద్వారా ఆయన తన పేరును చిత్రసీమలో సుస్థిరం చేసుకున్నారు.
‘పెళ్లి చేసి చూడు’ చిత్రం తెలుగులోనూ, తమిళంలోనూ ఆయనే నటించారు. తెలుగు, తమిళమే కాక ‘పాతాళభైరవి’ హిందీలో తీసే చిత్రంలోనూ ఆయనే మాంత్రికుడి పాత్ర పోషించి, హిందీ భాషలో పట్టు ఉండటం మూలంగా డబ్బింగ్ కూడా ఆయనే చెప్పుకున్నారు. ‘భూకైలాస్’, ‘మాయబజార్’ వంటి పౌరాణిక చిత్రాలలోనూ నటించి ‘ఔరా!’ అనిపించుకున్నారు.
నటసామ్రాట్, విశ్వనట చక్రవర్తి మొదలగు బిరుదులతో తెలుగు ప్రేక్షకులు ఆయనను గౌరవించారు. ‘నర్తనశాల’ చిత్రంలో కీచకుడి పాత్రలో ఆయన చూపిన ప్రతిభకు ఇండోనేషియా ఆసియా అంతర్జాతీయ చిత్రోత్సవంలో భారత దేశం యొక్క తొలి అంతర్జాతీయ ఉత్తమ నటుడిగా బహుమతిని గెలుచుకున్నారు. అదే పాత్రకు రాష్టపతి అవార్డ్ కూడా అందుకున్నారు.
వ్యక్తిగా రంగారావు సహృదయుడు, చమత్కారి. సినిమా సెట్ మీద గాంభీర్యంగా ఉండేవారు. వ్యక్తిగత విషయాలు అందరితో చర్చించటం ఆయనకు ఇష్టం ఉండేది కాదు. ఆయన శివుడిని ఆరాధించేవారు. రంగారావుకు ఇద్దరు కుమార్తెలు విజయ, ప్రమీల, ఒక కుమారుడు కోటేశ్వరరావు.

యస్.వి.రంగారావు వేదాంత ధోరణిలో ఉండేవారు. వివేకానందుని పుస్తకాలు చదువుతూ ఉండేవారు. ఆయన రచయిత కూడా. మనసుకు తోచింది ఆయన రాసుకుంటూ ఉండేవారు.
రంగారావు ప్రాణహిత సంస్థకు ఎన్నో విరాళాలు ఇచ్చారు. ఎవరైనా సహాయం కావాలని వస్తే లేదు అనకుండా దానం చేసేవారు. ఆయనకు కుక్కలపై మక్కువ. అందుకే ఆయన తన ఇంట్లో జర్మన్ షెఫర్డ్ జాతి కుక్కలను పెంచుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని దాదాపు అన్ని జిల్లాలలోనూ ఆయనకు సన్మానాలు జరిగాయి. జకార్తాలో అవార్డును అందుకుని వచ్చిన తరువాత మద్రాసు సినిమా ప్రేక్షక సంఘాలవారు ఆయనను ఘనంగా సత్కరించారు.
విశ్వనటచక్రవర్తి, నటసార్వభౌమ, నటసింహ, నటశేఖర అన్న బిరుదులు ఆయనను వరించాయి. గుమ్మడి ఆయనను ‘ఇక్కడ పుట్టవలసిన వారు కాదు, విదేశాల్లో అయితే అంతర్జాతీయ అయిదుగురు ఉత్తమ నటుల్లో ఒకరుగా ఉండేవారు’ అనేవారు.
2013 లో భారత సినీ పరిశ్రమ వందేళ్ళ సందర్భంగా విడుదలయిన తపాలా బిళ్ళలలో ఒకటి య.వి. రంగారావు పేరు మీద విడుదలయింది.
ఆంగిక, వాచిక, ఆహార్య, సాత్వికాభినయాలు కలబోసిన సహజ నటుడు రంగారావు.
యముడిగా, మాయలఫకీరుగా, మాంత్రికుడిగా, ఘటోత్కచుడిగా, పౌరాణిక జానపద పాత్రల్లో, సామాజిక, సాంఘిక పాత్రల్లోనూ… ఏ పాత్ర చేసినా ఆ పాత్రలో ఒదిగిపోయి జీవించేవారు రంగారావు. ఆయన కళ్ళు, కంఠస్వరం వివిధ పాత్రలకు తగ్గట్టుగా మలచేవారు.
నటులే కాక ఆయన కథలు కూడా రాసేవారు. ఆయన కథలు ఆంధ్రపత్రిక, యువ, మనభూమి వంటి పత్రికలలో 1960-64 మధ్య కాలంలో ప్రచురింపబడ్డాయి. ఈ మధ్యకాలంలోనే ‘రంగారావు కథల పుస్తకం’ వెలువడింది.
యశోద కృష్ణ చిత్రం తరువాత ఆయన గుండెపోటుకు గురై 1974 జులై 18 వ తేదీన తుదిశ్వాస విడిచారు.
విలక్షణమైన నటనకు ఆయన పెట్టింది పేరు. ఇటువంటి విలక్షణమైన నటుడితో కూడా మన తెలుగువారు పాటలలో నటింపజేయించారు అంటే అతిశయోక్తి కాదు.
అందుకు ఉధాహరణ మాయబజార్ చిత్రంలో ఘటోత్కచుడిగా పాత్రలోని ఈ పాట
చిత్రం : మాయాబజార్ (1957)
సంగీతం : ఘంటసాల
గీతరచయిత : పింగళి
నేపధ్య గానం : మాధవపెద్ది సత్యం.
అహహహహహా
వివాహభోజనంబు ఆహా హా
వివాహ భోజనంబు వింతైన వంటకంబు
వియ్యాలవారి విందు ఓ హో హో నాకె ముందు
వివాహ భోజనంబు వింతైన వంటకంబు
వియ్యాలవారి విందు ఓ హో హో నాకె ముందు
అహాహాహాహా అహాహాహాహా అహాహాహాహా
ఔరౌరా గారెలల్ల… అయ్యారె బూరెలిల్ల
ఔరౌరా గారెలల్ల …అయ్యారె బూరెలిల్ల
ఓ హో రే అరెసెలిల్ల… అహాహా… అహాహా
ఇయెల్ల నాకె చెల్ల…
వివాహ భోజనంబు వింతైన వంటకంబు
వియ్యాలవారి విందు ఓ హో హో నాకె ముందు
అహాహాహాహా అహాహాహాహా అహాహాహాహా

భళేరె లడ్డు లందు వహ్ తేనిపోని ఇందు
భళేరె లడ్డు లందు వహ్ తేనిపోని ఇందు
భలే జిలాబి ముందు అహాహా హాహా
ఇయెల్ల నాకే విందు
వివాహ భోజనంబు వింతైన వంటకంబు
వియ్యాలవారి విందు ఓ హో హో నాకె ముందు
అహాహాహాహా అహాహాహాహా అహాహాహాహా

మఝారె అప్పడాలు… పులిహోర దప్పడాలు
మజారే అప్పడాలు ….పులిహోర దప్పడాలు
వహ్వారే పాయసాలు అహా హాహాహా

ఇయెల్ల నాకే చాలు…
వివాహ భోజనంబు వింతైన వంటకంబు
వియ్యాలవారి విందు ఓ హో హో నాకె ముందు
అహాహాహాహా అహాహాహాహా అహాహాహాహా
అహాహాహాహా అహాహాహాహా అహాహాహాహా
ఆయన అభినయం అనన్యసామాన్యం. అద్భుతమైన పాటల్లో మేటి పాట.
ఇప్పటికీ ఈ పాట మన జీవనంలో ఒక భాగం అయిపోయింది అనుకోవచ్చు.

అలాగే పండంటి కాపురం చిత్రంలో
‘బాబూ! వినరా… అన్నాతమ్ములా కథ ఒకటీ!’
తాతా – మనవడు చిత్రంలో
‘అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం’
లక్ష్మీ నివాసం చిత్రంలో
‘ధనమేరా అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం’
ఇలా ఒక్కటేమిటి… రాకరకాల పాత్రలలో ఆయన పాటలతో కూడా జీవించారు అని చెప్పవచ్చు.

2018 జూలై 3న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏలూరులో పన్నెండున్నర అడుగుల ఎత్తైన రంగారావు కంచు విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఆ తరం నటులు అయినా ఈనాటికి మరచిపోలేని మహోన్నతమైన వ్యక్తి, నటులు శ్రీ. యస్. వి. రంగారావుగారు.
నా హృదయాంజలి నివాళులతో…

*****

1 thought on “యస్.వి. రంగారావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *