May 13, 2024

కణ్వ శాకుంతలం (తండ్రి – కూతురు)

రచన: నండూరి సుందరీ నాగమణి
బెరుకు బెరుకుగా గేటు తెరుచుకుని తన చేయి పట్టుకున్న నాలుగేళ్ళ పాపతో, భుజాన ఎయిర్ బ్యాగ్ తో ఆ ఆవరణ లోపలికి అడుగుపెట్టింది సుధీర. ఎయిర్ బ్యాగ్ ను కింద పెట్టి చుట్టూ కలయజూచింది. ఎంత అందమైన పూలతోట ఇది? ఈనాడు ఇలా జీవకళ లేనట్టుగా ఎండిపోయిందేమిటీ? ఎదురుగా ఉన్న రెండంతస్తుల భవనం వైపు ఆర్తిగా చూసింది. తాను పెరిగిన నేల ఇది… ఈశాన్యం మూల ఉన్న గిలకల బావి వైపు చూసింది సుధీర. అది కాస్తా పాడుబడిపోయినట్టుగా అయి, వాడుకలో లేనట్టుగా…  చుట్టూరా ఇసుక మేట వేసి ఉన్నది. వైభవమంతా కోల్పోయిన వనకాంత అచ్చు తనలాగానే ఉందని తోచింది సుధీరకి. దుష్యంతుడిచేత పరిత్యజించబడి, తిరిగి కణ్వమహర్షి ఆశ్రమానికి వచ్చేసిన శకుంతలలా ఉంది, సుధీర.
గేటునుండి ఉన్న కాలి బాట మీదుగా ఇంటి వైపు నడిచింది, సుధీర. అంతే… ముందుగదిలో కట్టేసి ఉన్న కుక్క ఒకటి భయంకరంగా మొరుగుతూ కటకటాల్లోంచి కోపంగా చూడసాగింది. కటకటాల తలుపులకు పెద్ద తాళం వేళ్ళాడుతోంది. ఆ కుక్క  అరుపులు వినగానే  పాప ఒక్కసారిగా తల్లి చీర కుచ్చిళ్ళలో తలదాచుకొని గుక్క పెట్టి ఏడవసాగింది.
‘లేదురా, లేదు…’ అని దాన్ని ఎత్తుకుని సముదాయిస్తూండగా ఇంటి పక్కనే ఉన్న చిన్న అవుట్ హౌస్ లోంచి ఎవరో దగ్గుతున్న సవ్వడి వినిపించింది. ఎవ్వరూ కనిపించకపోవటంతో అటువైపు నడిచింది, సుధీర. దగ్గరగా వేసి ఉన్న తలుపులు తెరచింది. మందుల వాసన మధ్య మంచం మీద పడుకుని ఉన్న వృద్ధుడు… ఎవరు? ఎవరదీ… నాన్న! నాన్నేనా? తండ్రిని గుర్తించిన సుధీర ఒక్క సారిగా ఉప్పెనంత దుఃఖానికి గురైంది. ఇదేమిటీ… నాన్న ఇలా అయిపోయారు? ఐదేళ్ళలో ఇంత మార్పా?
కళ్ళమీద వెలుగు పడటంతో కళ్ళు తెరచి కంటికి అడ్డంగా అరచేయి పెట్టుకొని చికిలించి చూసారు రఘుదేవయ్యగారు. “ఎవరు? ఎవరమ్మా?” దగ్గు తెర అడ్డుపడటంతో ఆగిపోయి, దగ్గుతూ ఉండిపోయారు. ఆగలేని సుధీర గబుక్కున ఆయన పొదివి పట్టుకుని బల్ల మీద ఉన్న నీళ్ళ చెంబులోంచి నీళ్ళు గ్లాసులోనికి వంచి తాగించింది.
ఆ స్పర్శ తెలియజెప్పింది ఆయనకి ఆమె ఎవ్వరో…నమ్మలేనట్టు ఆమె వైపు చూసాడాయన. ఆ కళ్ళలో చిగురిస్తున్న వెలుగు రేఖలు. “అమ్మా చిట్టీ నువ్వా! నువ్వేనా?” వణుకుతున్న వేళ్ళతో ఆమె ముఖాన్ని తడమసాగాడు రఘుదేవయ్య.
“అవును నాన్నా, నేనే…. ఇదేంటి నాన్నా, ఇక్కడ? ఈ అవుట్ హౌస్ లో ఉన్నావు? నీకు ఆరోగ్యం బాగాలేదా?” ఆయన చేయి పట్టుకుని ఊపుతూ ఆత్రంగా అడిగింది, సుధీర. అప్పటికే ఆమె కళ్ళు అవిరామంగా వర్షిస్తున్నాయి.
“లేదురా చిట్టీ, ఊరు పొమ్మంటోంది, పైనుంచి అమ్మేమో రమ్మని అంటోంది. ఇక నా టైమ్ అయిపోయిందిరా..”
“అయ్యో అంత మాటనకు నాన్నా..” ఏడుస్తూ అంది, సుధీర.
“నా మాటకేం కాని, నువ్వు ఎలా ఉన్నావు రా? నీ కూతురా?”
“అవును ఇది సుశీల. షీలా అంటాము. అమ్మ పేరే పెట్టుకున్నాను నాన్నా…”
“అలాగా..?” ఆయన కళ్ళు మెరిసాయి. “చాలా సంతోషంరా.. కూర్చోరా అలా.. ఎప్పుడనగా బయలుదేరావో, ఏమైనా  తిన్నావా?” లేవటానికి ప్రయత్నిస్తూ అన్నాడు రఘుదేవయ్య.
“అయ్యో మీరు పడుకోండి నాన్నా… అసలు ఇక్కడెందుకున్నావు నువ్వు? ఆ ఇల్లు తాళమేసి ఉందేమిటి? అన్నయ్యా వదినా ఊరిలో లేరా?” ప్రశ్నల వర్షం కురిపించింది సుధీర.
“ఒవులదీ?” అంటూ లోపలికి అడుగుపెట్టింది ఓ మధ్యవయస్కురాలు. ఆమెను సింహాచలంగా పోల్చుకుంది సుధీర. “సింహాచలం, బాగున్నావా?” అంది ఆప్యాయంగా.
“చిట్టమ్ములూ నువ్వా? ఎంతకాలమైపోనాదమ్మా నిన్ను సూసి! ఎంతసేపైనాది వచ్చి? అదిగో తానాలగది, తానం సేసుకుంతారా? నాను వొణ్ణం వండేత్తాను.” అంది సింహాచలం.
నాన్నగానీ, సింహాచలం గానీ తానంటే ఎలాంటి కోపమూ లేకుండా మాట్లాడటంతో వారి ఆప్యాయతకు సుధీర మనసు ద్రవించిపోయింది. నాన్న నాన్నే… తనే ఆయనకి తగిన కూతురు కాదు.
పాపాయికి  సింహాచలం సహాయంతో స్నానాలు చేయించి, బిస్కట్లు తినిపించి, పాలు తాగించి పడుకోబెట్టి తాను స్నానం చేసి వచ్చింది సుధీర. అప్పటికి రఘుదేవయ్యగారికి వెచ్చని నీళ్ళలో తడిపి పిండిన బట్టతో ఒళ్ళు తుడిచి, ఆయన బట్టలు మార్చుకున్నాక, పాలు, రొట్టె తినిపించి, ఆయన   విడిచిన బట్టలను ఉతికి ఆరేసి గబగబా గ్యాసుపొయ్యి మీద వంట చేయసాగింది, సింహాచలం. కూర తరుగుతున్న సుధీర మనసంతా కల్లోల కడలియైపోయింది. అంత పెద్ద ఇంటికి అధిపతియైన సింహం వంటి నాన్న ఇక్కడ ఇలా అవుట్ హౌస్ లో ఎందుకున్నారు?
“అది సరే కాని నాన్నా, నువ్వేంటిలా ఇక్కడ? ఆ ఇంట్లో ఎందుకుండటం లేదు? అసలు అన్నయ్యా, వదినా లేరా? తలుపులు తాళం వేసి ఉన్నాయేంటి?” ఇక ఆపుకోలేక మళ్ళీ అడిగింది ఆయన్ని. ఆయన ముఖం వివర్ణమయింది. బాధగా నుదురు రాసుకున్నారు. సింహాచలం ఆ విషయాలు ఏవీ అడగవద్దన్నట్టుగా సుధీరకు సైగ చేసి, ఆయన వేసుకునే మాత్రలు తెచ్చి మింగించింది. ఆయన అలసటగా వెనక్కి వాలి నిద్రలోనికి జారారు.
ఏం చేయాలో తోచక కూర వేయిస్తున్న సింహాచలం వైపు చూసింది, సుధీర.
***
కంచంలో అన్నం వడ్డించి తెచ్చింది, సింహాచలం. “తిను చిట్టి పాపమ్మా” అంటూ.
సుధీర భోజనం చేస్తుండగా అడిగింది, “ఏమ్మా, అల్లుడుగారు బాగున్నారా, తీసుకు రావలసింది కదా?”
పెద్ద పెద్ద ఇండుపగింజలంతంత కన్నీటి బిందువులు తింటున్న అన్నంలో పడ్డాయి. కలవరంగా… “అయ్యో, చిట్టెమ్మా, ఏమ్మా, ఎందుకు.. ఏమైనాది?” అనడిగింది సింహాచలం.
ఏం లేదన్నట్టుగా తలూపి నోట్లోని ముద్దని బలవంతంగా మింగి పెరుగు పోసేసుకుంది సుధీర. నొచ్చుకుంది సింహాచలం, తాను మాట్లాడకూడనిది మాట్లాడినట్టు అనిపిస్తూండగా.
“కాసేపు పడుకుంటాను సింహాచలం. నువ్వుంటావా?” అనడిగింది.
“నాన్నగోరు లెగిస్తే వొణ్ణం పెట్టి ఎల్తాను చిట్టెమ్మా…” అంది సింహాచలం. “నాన్నకి నేను అన్నం పెడతానులే, నువ్వెళ్ళు…” అని సుధీర చెప్పటంతో  సింహాచలం వెళ్ళిపోయింది.
ప్రయాణ బడలిక వల్ల అలా చాపమీద పాపాయి పక్కగా ఒరిగిందే కాని సుధీరకు నిద్ర రాలేదు. మనసు అనే కవ్వం గతమనే సముద్రాన్ని తరచటం మొదలుపెట్టింది.
***
సుశీల, రఘుదేవయ్య దంపతులకు ఇద్దరే సంతానం. సుందర్ పుట్టిన అయిదేళ్ళ తరువాత పుట్టిన సుధీర పుట్టినప్పటినుండీ రఘుదేవయ్యకు ప్రాణమైపోయింది. అపురూపంగా పెంచుకున్నాడు పాపాయిని. సుశీల ఉన్నా సరే తానే పాపకు అన్నం తినిపించేవాడు. సాయంత్రం ఆఫీసునుండి రాగానే పాపను సైకిల్ పై షికారుకు తీసుకుపోయేవాడు. స్కూల్లో వేస్తే టీచర్లు కొడతారని ఒకటో తరగతి సిలబస్ మొత్తం తానే ఇంట్లో నేర్పించాడు కూతురుకి. సుశీల తరచుగా కోప్పడుతూ ఉండేది రఘుదేవయ్యను, రేపు అత్తారింటికి తరలి వెళ్ళిపోయే పిల్ల మీద అంత మమకారం పెంచుకోవటం తగదంటూ… అయినా వినేవాడు కాదు ఆయన.
చెల్లెల్ని ప్రేమగానే చూసినా, తండ్రి ఎంతో ముద్దు చేసే సుధీర అంటే ఒకింత ఈర్ష్యగా ఉండేది, సుందర్ కి.  సుధీర పదవ పుట్టినరోజుకు రఘుదేవయ్యకు పిల్లలు లేని పెదనాన్నగారు చనిపోవటంతో వేరే వారసులు లేని కారణంగా కొంత ఆస్తి కలిసివచ్చింది. అప్పుడే ఈ స్థలం కొని రెండంతస్థుల మేడ కట్టించాడు ఆయన. సింహాచలం అప్పట్నుండే వారింట్లో పనికి చేరింది.
సుధీర పదవతరగతి పూర్తి చేసి ఇంటర్ లో చేరే సరికి సుశీలకి నిండు నూరేళ్ళూ నిండిపోయాయి. తల్లిని పోగొట్టుకున్న సుధీర తండ్రికి మరింత దగ్గరైంది. జీవిత భాగస్వామినిని పోగొట్టుకున్న తన తండ్రికి ఆ బాధ తెలియకూడదని కంటికి రెప్పల్లే చూసుకునేది సుధీర. సుందర్ కి అప్పటికే ఉద్యోగం రావటం వలన అతను ఢిల్లీ వెళ్ళిపోయాడు. సుధీర ఉదయమే లేచి, సింహాచలం సాయంతో వంట, టిఫిన్ తయారు చేసి, తండ్రికి పెట్టి, ఇద్దరికీ కారేజీలు సర్ది కాలేజీకి వెళ్ళిపోయిన తరువాత ఆయన కూడా ఆఫీసుకు వెళ్ళిపోయేవారు. సాయంత్రం ఇంటికొచ్చిన తర్వాత ఇద్దరూ కలిసి కబుర్లే కబుర్లు… కలిసి చెస్ ఆడే వారు. కలిసి బాడ్మింటన్ కూడా ఆడే వారు. కాలేజీ కబుర్లు చెప్తూ ఆమె నవ్విస్తే, ఆఫీసు కబుర్లు చెబుతూ ఆమెను ఉత్సాహంగా ఉంచేవాడు ఆయన. రాత్రి భోజనం అయిన తరువాత ఆమె చదువుకుంటూ ఉంటే తాను తోడుగా పక్కనే కూర్చుని న్యూస్ పేపర్ చదువుకునే వాడు రఘుదేవయ్య.
కాలం ఎప్పటికీ ఒకేలా ఎలా సాగుతుంది? సుందర్ కి మళ్ళీ తమ ఊరికే బదిలీ అయింది. కొడుక్కి మంచి సంబంధమే చూసి పెళ్ళి చేసాడు, రఘుదేవయ్య. సుధీర బీ.కామ్ పూర్తి చేసి ఉద్యోగంలో జాయినైంది. మామగారు తన ఆడపడుచుకి అంత ప్రాధాన్యత ఇవ్వటం, ఇంటి వ్యవహారాలన్నీ సుధీర చేతులమీదుగా నడవటం సుందర్ భార్య ఇందిరకు ఏమాత్రం నచ్చలేదు. కాని కొత్తకోడలు కనుక ఓర్పుగా ఉండేది. వదిన మనసు గ్రహించిన సుధీర మాత్రం ఇంటి పెత్తనం, బీరువా తాళాలతో సహా వదిన చేతికి ఇచ్చేసింది.
సుధీరకు పెళ్ళి సంబంధాలు చూడటం మొదలుపెట్టిన రఘుదేవయ్య గారు సుధీర చెప్పిన విషయం విని మొట్టమొదటిసారిగా ఆమెపై ఆగ్రహానికి గురయ్యారు. తన సహోద్యోగిని ఇష్టపడుతున్నానని ఆమె చెప్పిన మాటలు ఆయనకి ఎంత మాత్రం నచ్చలేదు. ఆచారవ్యవహారాలు వేరు కాబట్టి,  కులాంతరానికి తాను ఆమోదించనని చెప్పారాయన. అదీ గాక ఆమె చేపట్టాలనుకున్న  ప్రతాప్ కి ఇద్దరు తమ్ముళ్ళూ, ఇద్దరు చెల్లెళ్ళూ ఉన్నారు. ఆ బాధ్యతలతో తన చిట్టితల్లి ఏమైపోతుందో అన్న పితృప్రేమ కూడా ఆయన్ని ఆ పెళ్ళికి అభ్యంతరం చెప్పటానికి పురికొల్పింది.
కాని అదేదో సామెత చెప్పినట్టు నిండా ప్రేమలో మునిగిపోయిన వారికి ఎవరి మాటా పట్టదు కదా… తననెంతగానో ప్రేమించే తండ్రి తన అభీష్టానికి అడ్డం చెబుతాడని అనుకోలేదు సుధీర. చిన్నతనం నుంచీ ప్రేమగా, ప్రాణంగా పెంచిన తండ్రికన్నా ప్రతాపే మనసుకు మక్కువయ్యాడు. అంతే, ఓ సుమూహూర్తాన ఇంట్లోంచి వెళ్ళిపోయి ప్రతాప్ ను పెళ్ళి చేసేసుకుంది, సుధీర.
మనసా వాచా నమ్మిన స్నేహితుడు వెన్నుపోటు పొడిస్తే ఎలా ఉంటుందో అర్థమైంది రఘుదేవయ్యకి. భార్య చనిపోయినప్పుడు దుఃఖించాడో లేదో తెలియదు కాని, కూతురి పెళ్ళి వార్త విని అంత పెద్దమనిషి ఆడపిల్లలా వెక్కి వెక్కి ఏడ్చాడు. అప్పటికే బదిలీ చేయించుకుని తండ్రికి దూరంగా వెళ్ళిపోయింది సుధీర.
***
రంగుల వలయం కరిగిపోయి, కటిక చేదు వాస్తవాలు కళ్ళముందు కనబడసాగాయి. వేరే రాష్ట్రంలో విడి కాపురం పెట్టి ఒకే ఆఫీసులో ఉద్యోగం చేస్తున్న ఆ దంపతుల మధ్య అపార్థాలు, కలతలు మొదలయ్యాయి. అప్పటికే పాపాయికి తల్లి అయింది సుధీర. ప్రతాప్ తమ ఇద్దరి జీతం కూడా విలాసంగా ఖర్చు పెట్టేసేవాడు. ఒక్క పైసా కూడా జమ చేసేవాడు కాదు. పోనీ అతని తల్లిదండ్రులకు కాని, తమ్ముళ్ళకు చెల్లెళ్ళకు కాని ఏ విధమైన ఆర్థిక సహాయమూ చేసేవాడు కాదు.
అతని స్నేహితుల ప్రభావం కూడా అతని మీద పడి, మెల్లమెల్లగా మద్యపానం, పేకాట అలవాటయ్యాయి. అతన్ని మార్చటానికి ప్రయత్నించి ప్రయత్నించి, విసిగి వేసారిపోయింది, సుధీర. ఓ వైపునుంచి తమ కొడుకును తమ నుంచి వేరు చేసావని ఆమెను శాపనార్థాలు పెడుతూ అత్తగారింటినుంచి ఫోన్ కాల్స్, తానొక శత్రువులా కనబడుతూ నిత్యమూ తనను ద్వేషించే తన భర్త… ఇతన్నేనా తాను దేవుడని భావించి, తన పితృదేవుణ్ణి సైతం కాదని వచ్చేసింది? అసలు ఇతని గురించి ఏం తెలుసని పుట్టి, పెరిగిన పాదును తెంచుకొని వచ్చేసింది? ఏ భరోసాతో? తనమీద తనకే అసహ్యం కలగటంతో అతన్నుంచి విడిపోవాలని నిర్ణయించుకుంది సుధీర. అందుకే తన ఊరికే బదిలీ చేయించుకొని, పాపను తీసుకుని వచ్చేసింది.
***
సింహాచలం ద్వారా అన్న చేసిన దురాగతాలు ఒక్కొక్కటీ తెలుసుకొని నివ్వెరపోయి, ఆపై కుమిలిపోయింది సుధీర. రఘుదేవయ్య గారు ఆస్తి మొత్తాన్ని రెండు భాగాలు చేసి, సుందర్ కీ, సుధీరకీ రాస్తే సుందర్, అతని భార్యా ఆయన మీద విరుచుకు పడ్డారు. తండ్రిని కాదని లేచిపోయిన కూతురికి ఆస్తి ఇచ్చినందుకు ఆయన్ని దుయ్యబట్టారు. ‘సుధీర ఎక్కడున్నా, తన కూతురే అని, తన ఆస్తికి వారసురాలే…’ అని నొక్కి చెప్పారాయన. దాని ఫలితమే వ్యాధిగ్రస్తుడైన ఆయనకి వైద్యం సైతం చేయించకుండా అవుట్ హౌస్ లో పడేసి తాను భార్యాపిల్లలతో టూరుకి వెళ్ళిపోయాడు సుందర్.
‘అన్నయ్య సంగతి సరే, నీ మాటేమిటి? నువ్వు మీ నాన్నకి చేసిన ద్రోహం విషయమేమిటి?’ ఆమె అంతరాత్మ ఆమెను నిలదీసింది.
‘విపులంగా మాట్లాడి ఆయనను ఒప్పించటానికి బదులుగా, వివాహ విషయంలో నీ అభీష్టాన్ని కాదన్నాడని ఆయనకి ఎంతో దూరంగా పారిపోయావు. ఎంతో అనుభవంతో, ముందు చూపుతో నీ సుఖం, శాంతి కోరుకునే నీ తండ్రి మాటలని పెడచెవిని పెట్టి ఆ త్రాష్టుడిని పెళ్ళి చేసేసుకున్నావు. కాపురానికి వెళ్ళిన తర్వాత ‘తండ్రి ఏమయ్యాడు, ఎలా ఉన్నాడు?’ అన్న ఇంగితం నీకు లేకపోయింది. ఇప్పుడు కూడా నువ్వు ఆయన మీద ప్రేమతో మాత్రం తిరిగి రాలేదు. ప్రతాప్ ను వద్దనుకున్నావు కాబట్టి, అతనితో జీవితం నరకమైంది కాబట్టి నాన్న గుర్తుకు వచ్చి ఇక్కడికి బదిలీ చేయించుకున్నావు. నీ అన్నను నిందించే హక్కు నీకు లేదు. చేతనైతే ఆయన పోగొట్టుకున్న ప్రేమానురాగాలను తిరిగివ్వటానికి ప్రయత్నించు. ఆయన ఆరోగ్యాన్ని పరిరక్షించే మార్గాలు అవలంబించు. తండ్రి ఋణం తీర్చుకొనే సువర్ణావకాశాన్ని ఏమాత్రమూ వదులుకోకు…’ గట్టిగా చెబుతున్న మనస్సాక్షి మాటలకు సిగ్గుతో తలవంచుకుంది, సుధీర.
కూతురి కాపురం ముక్కలైందన్న విషయం తెలుసుకున్న రఘుదేవయ్యగారి వేదనకు అంతులేకుండా పోయింది. శారీరక బాధకు తోడు మానసిక వేదన తోడైంది. కాని అంతలోనే తేరుకున్నారు. తెలియక ఒక బురదలో అడుగేసింది, తన కూతురు. అది బురదని తెలిసాక అందులోంచి బయటపడింది. ఇప్పుడు తాను అక్కున చేర్చుకొని, ఆమెకు నైతిక బలాన్నివ్వాలి. ‘సుధీర’ అని పేరుపెట్టినందుకు ఆమె సార్థక నామధేయ అవ్వాలి. అలా కావాలంటే తాను ముందు ఈ రుగ్మతనుండి బయటపడి, కూతురుకి, మనవరాలికి అండగా నిలవాలి.
“నాన్నా, నన్ను క్షమించు…” అన్న సుధీర తల మీద చేయివేసి నిమిరాడు రఘుదేవయ్య. ఆ స్పర్శ ఆమెకు వెయ్యి ఏనుగుల బలాన్నిచ్చింది. కర్తవ్యం స్ఫురించింది. వెంటనే సింహాచలం సహాయంతో రెండువీధుల అవతల ఒక ఇల్లు చూసి, అక్కడకి తండ్రితో సహా మారిపోయింది. ముందూ వెనుకా ఎవ్వరూ లేని సింహాచలాన్ని తమతో ఉండిపొమ్మని కోరింది. తను ఉద్యోగంలో తిరిగి చేరింది. రఘుదేవయ్యగారిని డాక్టరుగారి దగ్గరకు తీసుకు వెళ్ళి వైద్యం చేయించటం మొదలుపెట్టింది.
తనకు తండ్రి ఆస్తి ఒక్క రూపాయి కూడా అవసరం లేదు. కాని ఆయనకి? తన స్వార్జితమైన ఆస్తిని మొత్తం కైవసం చేసుకోవటమే కాకుండా, వయసుడిగిన తండ్రిని అనాథకు మల్లే అలా అవుట్ హౌస్ లో పడేయటం అనే అమానుష చర్యను గర్హించలేకుండా ఉండలేకపోయింది. ఆయనకి న్యాయం జరగాలి. అందుకే లాయర్ని సంప్రదించాలని నిర్ణయించుకుంది, సుధీర.
“నాకు నువ్వు చాలురా, వేరే ఆస్తులేమీ అక్కరలేదు. నా చిట్టితల్లి నా దగ్గరకు వచ్చేసింది, అంతకన్నా ఏం కావాలి?” అన్నాడు రఘుదేవయ్య. “నాక్కూడా నువ్వు చాలు నాన్నా… నాకిప్పుడు ఇద్దరు పిల్లలు… ఇద్దరూ పసివాళ్ళే… మీ ఆలన,పాలన కన్నా నాకు కావలసిందేమీ లేదు. కాని నీకు న్యాయం జరగాలి… అంతే…” దృఢ నిశ్చయంతో చెప్పింది, సుధీర.
తన కూతురికి పలకమీద అక్షరాలు దిద్దిస్తున్న తన తండ్రిని చూస్తుంటే, ‘తాము అనాథలం కాము’ అన్న భావనతో సుధీర హృదయం, కన్నీటితో ఆమె నయనద్వయం నిండిపోయింది.

**********

విశ్లేషణ:

“కణ్వశాకుంతలం”- నండూరి సుందరీ నాగమణి

“వెన్నవంటి తల్లిదండ్రులు, రాళ్లలాంటి కన్నబిడ్డలు..” అనే నానుడి, సాధారణంగా కొడుకుల గురించి చెప్తుంటారు. తల్లిదండ్రులని అర్ధం చేసుకోకుండా, వృద్ధాప్యంలో చెంత చేరిన తల్లిదండ్రులను చీటికి మాటికి విసుక్కుంటూ న్యూనత పరుస్తూ, ఎప్పుడు తీసికెళ్లిపోతావు భగవంతుడా అని వారు నిత్యం ప్రార్ధించే స్థితికి తీసుకొచ్చిన పుత్రుల గురించి అన్న మాట అది. దానికి అనేక కారణాలుండచ్చు.. ఆర్ధికపరమైనవి, ఆలి సంబంధమైనవి, బంధుపరమైనవి.. ఈవిధంగా!

అయితే.. ప్రాణంగా ప్రేమించి, గారాబంగా పెద్ద చేసిన కన్నతండ్రిని, ప్రేమ మత్తులో నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్లిన కూతుళ్ల మాటేమిటి? వాళ్లు కూడా రాళ్లే కదా! ప్రాణమున్న రాళ్లు కనుక, అదీ.. సాధారణంగా సున్నిత హృదయులై ఉంటారు కనుక ఎప్పటికైనా తమ తప్పు తెలుసుకుని తండ్రిని అర్ధం చేసుకుని తోడునీడగా ఉన్నప్పుడు ఆ రాళ్లు, వెన్నలవకపోయినా కనీసం దెబ్బతియ్యడం మానగలుగుతారు.

కనకపోయినా, అంతకన్న ఎక్కువగా ప్రేమించి పెంచిన కణ్వమహర్షిని శకుంతల, దుష్యంతుడి మత్తులో పడి విస్మరించింది. అదే శకుంతలలు అనాదిగా ఎందరో.. వారివంటి ఒక కూతురే ‘సుధీర’.  భార్య చనిపోయినా తల్లీ తండ్రీ తానే అయి, కూతురే ప్రాణంగా పెంచుకున్నాడు తండ్రి. పూర్వాపరాలు ఆలోచించి, “నువ్వు ప్రేమించిన అబ్బాయి వద్దు.. కష్టాల పాలవుతావు..” అంటూ వారించిన తండ్రిమాట, ప్రేమ మోజులో పడి పెడచెవిని పెట్టింది.

నాన్న ముందుచూపే అనుభవంలోకి రాగా.. నాన్నని వెతుక్కుంటూ వచ్చింది సుధీర. రాయివంటి ఇంకొక బిడ్డ చేతిలో మనసుపై సమ్మెట దెబ్బలు పడుతుండగా, శరీరం చివికిపోతూ.. నిస్సారంగా తన ఇంటిలోనే తను వెలివేయబడ్డ తండ్రిని చూసు కళ్లనీళ్ల పర్యంతమైన సుధీర అప్పుడు తీసుకుంటుంది ఒక ధైర్యమైన నిర్ణయం..

నండూరి సుందరీ నాగమణి కలం లోంచి వెలువడిందీ ఆధునిక శాకుంతలం. ఆంధ్రాబాంక్ లో డబ్బు లెక్కలు, సంసారంలో భర్తా బిడ్డల అవసరాలు, సంగీతంలో రాగాలు, సమాజ సేవలో ఆర్తుల కన్నీటి తుడుపులు.. అన్నిటా అష్టావధానం చేస్తూ తెలుగు అక్షరాన్ని సదా అందరినోటా నిలపాలని సాహిత్యసేవ చేస్తున్న సుందరీ నాగమణి, తండ్రీ కూతుళ్ల అనుబంధాన్ని హృద్యంగా తెలిపారు.

ప్రాచీనమైన కథా వస్తువు తీసుకుని, ఆధునీకతనాపాదించి.. తండ్రీ కూతుళ్ల రాగద్వేషాలు పృధ్వి ఉన్నంతకాలం ఉంటూనే ఉంటాయని.. నాన్న దగ్గర్నుండి తీసుకోవడమే కాదు.. సమయం వస్తే ఆదుకోవాలని చెప్తారు రచయిత్రి.

10 thoughts on “కణ్వ శాకుంతలం (తండ్రి – కూతురు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *