May 12, 2024

ఎంత మంచివాడవు నాన్నా! (తండ్రి – కూతురు)

రచన: ఆర్.దమయంతి.

బారెడు పొద్దెక్కిపోతున్నా, జగన్నాధానికి పక్కమీంచి  లేవబుధ్ధి కావడం లేదు. నీరసంతో అలానే పడుకుని, సీలింగ్ కేసి  నిస్త్రాణంగా చూస్తున్నాడు.
గడియారంలో పెద్ద ముల్లులా గతంలోకి, చిన్నముల్లులా వాస్తవంలోకి వెళ్లొస్తూ.. కదలని బొమ్మలా,  మంచం మీద అలా పడుకునే వున్నాడు.
ఈ అవస్థ ఇప్పటిది కాదు. భార్య పోయిన ఆర్నెల్నించీ  ఆయనది ఇదే కథ.  ఆకలేస్తుంది. తినబుధ్ధి కాదు. నిద్రొచ్చినట్టుంటుంది. కానీ, కళ్ళు మూతపడవు.
భార్య వెళ్లిపోవడం కంటే ఈ ఒంటరితనం ఆయన్ని తెగ పీక్కుతినేస్తోంది. వొంట్లో శక్తినంతా హరించేస్తోంది.
అందుకే అంటారు పెద్దలు. మొగుడు పోయిన ఆడది ఎట్టాగైనా  బ్రతుకుని నెట్టేయగలదు  కానీ, పెళ్ళాం పోయిన మగాడు మాత్రం ఆడ తోడు లేకుండా చస్తే బ్రతకలేడని!
‘పొనీ, నా దగ్గరకొచ్చి వుండ రాదా నాన్నా?’ – ఎన్నిసార్లు బ్రతిమాలిందో కూతురు రమ్య.
కూతురు తనదే అయినా, అల్లుడు తనవాడెలా అవుతాడు? అతనెంత మంచి వాడే అయినా, అల్లుడింట్లో వుండటం భావ్యంగా వుండదు మనసుకి.
అక్కడకీ, రమ్య బలవంతం చేస్తే, పది రోజులకని వెళ్ళి, నాల్గో రోజుకే ఇంటికొచ్చిపడ్డాడు.   వుండబుధ్ధి కాక!
కష్టమో నష్టమో..తనిల్లే తనకు బావుంటుందనుకుంటూ.
***
కూతురు, మూడు పొద్దులా ఫోన్ చేసి కనుక్కుంటూ వుంటుంది. ‘ఎలా వున్నావు నాన్నా, ఏం చేస్తున్నావు నాన్నా, ఏం తిన్నావు నాన్నా, నీరసంగా వున్నావేమిటీ నాన్నా? ఆరోగ్యం ఎలా వుంది? డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళనా? అంటూ,  బాధపడుతుంది.   తను బాగానే వున్నానన్నా, వినదు. ‘నీ కోసం ఏం చేయగలను నాన్నా? అంటూ కన్నీరౌతుంది. ఆ తండ్రి హృదయం  కరిగిపోయేలా..
మొన్నోసారి, ఇలానే  ఫోన్ చేసి చెప్పింది. ‘ నాన్నా నీ కష్టాలన్నీ తీరిపోయే ఒక ఉపాయం ఆలోచించా’ నంటూ.
‘ఏమిట్రా, పిచ్చి తల్లీ?” అని అడిగాడాయన.
“ఊహు. నేను చెప్పను. నీకదొక సర్ ప్రయిజ్  గిఫ్ట్.” అంది వూరిస్తూ.
“ఈ వయసులో, ఈ పరిస్థితుల్లో  తనకి సర్ ప్రయిజ్ గిఫ్టా? ఏం చేసుకుంటాడు- గిఫ్ట్ ని?  గడియ జరగటమే కష్టంగా  వుంటెనూ?’  విరక్తిగా అనుకున్నాడే కానీ, పైకి మాత్రం ఏమీ అన్లేకపోయాడు. కూతురు మనసు నొచ్చుకుంటుందని.
జరిగింది గుర్తొచ్చి, గాఢంగా నిట్టూర్చాడు. ‘లేవాలి. పక్కమీంచి లేచి, కుక్కర్ లో కాసిన్ని బియ్యం పోసి స్టవ్ మీద పడేస్తే ఇవాళ్టికి  పనైపోతుంది.  స్నానం చేసి, ఇంత అన్నం నోట్లో పడేసుకుంటే, మందు బిళ్లలు వరసగా మింగేయొచ్చు..’ అనుకున్నాడు విసుగ్గా.
గత నాలుగు గంటల్నించీ ఇలా అనుకుంటూనే వున్నాడు. పడుకునే వున్నాడు. అంతే కానీ, బెడ్ మీంచి ఒక్క అంగుళం  కూడా కదలడం లేదు శరీరం. నీరసంగా, మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు.
ఇంతలో డోర్ బెల్ మోగడంతో,  ఆ మోతకి చిన్నగా వులిక్కిపడ్డాడు.
ఎవరొస్తారు  తనింటికి? పాలవాడు, పేపర్ వాడు, పనిమనిషి వచ్చేసెళ్ళిపోయారు. ఇంకెవరొస్తారు?
ఆయన లేవబోయి ఆగాడు. ఆగిన బెల్ మళ్ళీ మోగితే వెళ్ళొచ్చులే అంతగా అయితే అని.
కొన్ని సెకన్ల విరామం తర్వాత మళ్ళీ మోగింది.
తప్పదన్నట్టు, లేచి, తూలుకుంటూ వెళ్ళి, తలుపు తీసాడు.
ఎదురుగా నవ్వుతూ ఒక స్త్రీ నిలబడుంది. ఆమె చేతిలో చిన్న సంచీ వుంది.
ముఫై దాటొచ్చు.  పసిమి మేని చాయ లో, పాత షిఫాన్ చీరలో అయినా మనిషి అందంగా వుంది.  అమాయకత్వమే ఆభరణం కావడం మూలానా కావొచ్చు,  మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది.
“ఎవరు?” అడిగాడు అర్ధం కానివాడిలా.
“నమస్తే సార్. నా పేరు లీల. నన్ను మీ కాడే  వుండి,  మిమ్మల్ని జాగ్రత్త గా చూసుకోమని రమ్యమ్మగారు పనిలోకి పంపారు సార్..” అంది నవ్వుతూ.
‘ రమ్య పంపిందా? నా కోసం? చెప్పలేదేమిటీ మరి తనకి? ఓ! నాకొక గిఫ్ట్ పంపుతానంది ..ఈమెనేనా?’ ఆశ్చర్యపోయాడాయన. నిజం గా సర్ప్రయిజ్ గిఫ్టే సుమా! అంత బాధలోనూ కూతురికి తనపై గల  తపనకి ఆయనకు చెప్పలేనంత ఆనందమేసింది.
ఈయన,  ఏ మాటా చెప్పేలోపే, లీల లోపలకొచ్చేయడం జరిగిపోయింది. అయనలా చూస్తుండగానే, లోపల కెళ్ళి, బాగ్ ని ఒక మూల పెట్టి, టిఫిన్, కాఫీ తీసుకున్నారా  సార్? అని అడిగింది.
లేదన్నట్టు తలూపాడు.
అయ్యో, ఇంకా కాలేదా? ఇంకా నయం! అమ్మ గారు చెప్పారు. మీకు ఆరింటికల్లా  కాఫీ, ఎనిమిదింటికల్లా టిఫిన్ రెడీ చెసివ్వాలని. వుండండి. ఇప్పుడే ఐదు నిమిషాల్లో ఉప్మా చేసి పెడతా” అంటూ లోపలకెళ్ళిపోయింది.
అక్కడే సోఫాలో కూలబడిపోయిన ఆయనకి,  వంటింటి తలుపు తీసిన చప్పుడు, ఆ వెనకే పంపు  తిప్పిన నీళ్ళ శబ్దం, ఆ వెనకే  స్టవ్ వెలిగిస్తున్న సూచనగా లైటర్  టిక్ మనడం.. మరో రెండు నిముషాల్లో గుమ్మెత్తే ఉప్మా పోపు ఘుమాయించడం జరిగిపోయాయి.
ప్రాణం లేచొచ్చి, ఎప్పుడెప్పుడు ఉప్మా తిందామా  అని కొట్టుకుపోయింది మనసు.
మరో ఐదు నిముషాల్లో ప్లేట్ లో ఉప్మా, చూడగానే ఆవురావురుమంటూ తినేశాడు. వెంటనే, తెచ్చిచ్చిన చిక్కటి ఫిల్టర్ కాఫీ తాగేసాడు. ప్రాణం ఎంత హాయిగా వుందో ? కుర్చీలో వెనక్కి ఆనుకుంటూ కళ్ళు మూసుకున్నాడు.
వంటింట్లోంచి వినిపించే  చప్పుళ్ళు, కుక్కర్ విజిల్,  కూరలు తరుగుతున్న చప్పుడు, మిక్సీ గిరగిరలు ..వింటుంటే మరచిపోయిన మధుర సంగీతమేదో మళ్ళీ చెవులకి సోకుతున్నట్టు గా వుంది. చీకటి తలపుల గది తలుపునెవరో తెరచినట్టుంది.
వెళ్ళి పోయిందనుకున్న భార్య,  వూరెళ్ళి తిరిగొచ్చిన భావం కలిగింది గుప్పున. అదే భావం అలా అలా ఆయన గుండెలో పెరిగి పెరిగి..ఒక విపరీతానికి దారి తీస్తుందన్న సంగతి ఆయనకప్పుడు తెలీలేదు.
ఆ మధ్యాహ్నం  స్నానం చేసి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు.
అప్పటికే టేబుల్ క్లీన్ చేసి, అన్నం పళ్ళెం, మంచి నీళ్ళ గ్లాసుతో బాటు, వండిన పదార్ధాల్ని డిషుల్లో  అమర్చి పెట్టింది లీల.
ఫ్రిజ్ లోంచి చల్లటి వాటర్ బాటిల్ తీసుకొచ్చి వుంచుతూ, చక చకా పళ్ళెం లోకి అన్నీ వడ్డించి, పక్కనే వొద్దిగ్గా నిలబడింది. వొద్దు వొద్దంటున్నా, మారు వడ్డనలతో మరి కాస్త ఎక్కువగా తినిపించేసింది.
రోజూ పచ్చడి మెతుకులతో మాడిన పేగు, –  పప్పూ, కూర, రోటిపచ్చడి, చారు, అన్నం తగలగానే, విందు భోజనం చేసినట్టైంది ఆ జీవికి.
భుక్తాయసం తో కళ్ళు సోలిపోతుంటే అలా వెళ్ళి మంచం మీద నడుం వాల్చాడో లేదో..తన్నుకుంటూ వచ్చేసింది నిద్ర. గుర్రు పెట్టుకుంటూ మరీ!
సాయంత్రం నాలుగు దాటుతుంటే మెలకువొచ్చేసింది. ముక్కు పుటాలకు మంచి నూనె వంటకం వాసన తగలడంతో.
ముందుగా, అది తనింట్లోంచి కాదనుకున్నాడు. ఆ తర్వాత మత్తు పోయాక, గుర్తొచ్చింది. కూతురు పంపిన గిఫ్ట్ మనిషి గురించీ, మధ్యాన్నం తను తిన్న కమ్మటి వంటకం గురించీను.
ఆయన హాల్లోకొచ్చేసరికల్లా పచ్చి మిరపకాయ బజ్జీల ప్లేట్ తో నవ్వుతూ ఎదురొచ్చింది  లీల.
“హమ్మ. నాకెంత ఇష్టమో, ఇవంటే! పట్రా, పట్రా..” తొందర పెట్టాడామెని.  ఆమె నవ్వుతూ చేతికందించింది. ఆయన మారు మాట్లాడకుండా, అర డజను బజ్జీలు ఏక ధాటిగా లాగించేసాడు. చల్లటి నీళ్ళ గ్లాసెత్తుకుని, గడగడా తాగేసాడు. ఐదు నిమిషాలు కాగానే…గుమ్మెత్తే ఇలాచీ సువాసన్లతో కమ్మటి టీ కప్ అందుకున్నాడు ఆశగా. ఒక్కో గుటకకి ఒక్కో కొత్త రుచి తేలుతుంటే..’ఆహా! అనుకుంటూ,  టీ ని అనుభూతించి, ఆఖరి చుక్కతో సహా నాలుక మీద గుమ్మరించుకుని, కప్ కిందపెట్టి తృప్తి గా త్రేనుస్తుంటే, అప్పుడు మోగింది  ఫోన్.
రమ్య నించి ఫోన్. ఆయన సంతోషం గా ఫోన్ లిఫ్ట్ చేసి, “తల్లులూ..” అని పిలిచాడు ప్రేమగా.
తండ్రి గొంతులోంచి ప్రేమ పూరితమైన ఆ పిలుపు వినగానే రమ్యకి చెప్పలేనంత సంతోషమేసింది.
“నాన్నా నా గిఫ్ట్ ఎలా వుంది?” అడిగింది నవ్వుతూ.
“నీ ప్రేమలా వుందిరా నానా!  ఎంత మంచి అమ్మాయిని పంపావురా తల్లీ.”
“అవును నాన్నా. లీల మంచి అమ్మాయి. నాన్నా!..నీకు అమ్మను తెచ్చివ్వలేను కానీ, అమ్మ లా  చూసుకునే లీలని మాత్రం నీ కిచ్చాను నాన్నా!!  నీకేలొటూ రాకుండా చూసుకుంటుంది.” అంది భరోసానిస్తూ.
ఆయన మనసు పొంగిపోయింది, కూతురి మాటలకి.
****
ఆ రోజునించి జగన్నాధానికి  రోజులెలా గడచిపోతున్నాయో తెలీడం లేదు.
పూటకో వెరైటీ వంట చేసిపెడుతోంది లీల. ఆయనకి కావల్సినవన్నీ క్షణాల్లో అమర్చి పెడుతుంది. ఆయనకి జలుబు చేసినా, చిన్న దగ్గు దగ్గినా విలవిలాడుతుంది. రోజూ వేసుకోవాల్సిన టాబ్లెట్స్ అన్నీ ఆమే స్వయంగా  దగ్గరుండి మరీ వేస్తుంది.
ఇక ఆయన వేసుకునే బట్టల్ని మల్లెపూవులా ఉతికి, ఇస్త్రీ చేయించి,  ఎప్పటికప్పుడు అల్మరాలో సర్దుతుంది.
బెడ్ ఎంత నీట్ గా పరుస్తుందంటే, ఆ మంచం చూడగానే ఎప్పుడెప్పుడెళ్ళి దానిమీద వాల్దామా అన్నంత టెంప్టింగ్ గా వుంటుంది.
లీల వచ్చాక ఇల్లూ వాకిలీ శుభ్రపడింది. పాలరాతి గచ్చు, మెరుస్తూ కనిపిస్తోంది. బూజులన్నీ పోయి, గోడలు రంగు తేలి కొత్త కళలతో కళకళలాడ్తున్నాయి. కిటికీల  పక్కన నైట్ క్వీన్, పారిజాతమూ లోపలకి తొంగి చూస్తూ నవ్వుతున్నాయి. గాలికి పరదాలు సన్నగా వూగుతూ గుప్పిళ్ల కొద్దీపరిమళాలు  గుమ్మరించి పోతున్నాయి.
ఈజీ చెయిర్లో కూర్చున్న జగన్నాధానికి ఈ మార్పు మధురోహల్ని కలిగిస్తున్నాయి.
లీల పక్కనించి వెళ్తున్నా, తన వెనకే నించున్నా, కొసరి కొసరి వడ్డిస్తున్నా,  మాట్లాడుతూ మాట్లాడుతూ తన చొక్కా మీద మరకని తుడుస్తున్నా, కింద పడిన కారు తాళాలని వొంగి తీసి చేతికందిస్తున్నా…వొళ్ళు జిల్, జిల్లు మంటోంది.
నిజం చెప్పాలంటే మగాడికి ఒక  ఆకలి తీరడం వల్ల మాత్రమే బ్రతికేయలేడు. ఆ సంగతి రమ్య గ్రహించకపోవడం ఆమె తప్పుకాదు.
ఆ ఉత్సా హంలో ఆయన తన మీద తను ఎక్కువ కేర్ తీసుకుంటున్నాడు. జుట్టుకి, మీసాలకి రంగేసాడు.  రోజూ జిమ్  కెళ్ళి పొట్ట తగ్గించుకున్నాడు. తెల్లటి ఇస్త్రీ బట్టలేసుకుని అద్దంలో చూసుకుంటూ ..అచ్చు పెళ్ళి కొడుకులా లేనూ? అని తనకు తనే కితాబిచ్చేసుకుంటున్నాడు.
“ఇవాళ బాగున్నారు సార్” – అని, లీల కూడా నవ్వుతూ అనడంతో ఈసారి ఆయన మనసుతో బాటు ఒళ్ళూ ఝల్లుమంది. సన్నగా లోలోన రేగిన ఆ కోర్కె బలంగా రాజుకోసాగింది. గాలికి నిప్పు రవ్వ కొలిమైనట్టు.  లీల మీద కన్ను పడ్డంతో, ఇప్పుడామె  ఆమె మామూలు లీలగా కాకుండా, రంభలా కని పిస్తోంది ఆ కళ్ళకి.  చూసినకొద్దీ లీల  మరింత సెక్సీ గా కనిపిస్తోంది ఆ ఎక్స రే కళ్ళకి.
పైకి దోపిన చీర, పక్కకి తొలిగిన పైట, జాకెట్టుకీ, చీరకీ మధ్యనున్న నున్నటి ఇసుక తిన్నె, నడుము వొంపులొ మెలిక పడ్డ బుల్లి మడత..అబ్బా…తన వల్ల కాకుండా వుంది. ఆ పళాన బెడ్రూంలోకి లాక్కెళ్ళి తలుపు మూసేసి..  ఆ తర్వాత జరిగేవన్నీ తలచుకుంటుంటే…మైకం..చెప్పలేనంత మైకంతో కళ్ళు మూసుకుపోతున్నాయి.
“సార్..ఇదిగోండి. ఫిల్టర్ కాఫీ..” లీల చనువుగా ఆయన భుజం తట్టి లేపింది, నిద్ర పోతున్నాడేమోనని.
చటుక్కున కళ్ళు తెరచి చూసాడు.  ఎప్పటిలా కాదు. అదోలా. కాంక్ష తో ఎరుపుగా చూసాడామె కళ్లల్లోకి.
కాఫీ కప్ అందుకుంటున్న ఆయన చేతి వేళ్ళు ఆమె చేతి గాజులని సన్నగా సవరిస్తున్నాయి. లీల కి అర్ధం కాలేదు
మనం బయటకెళ్దాం. నీకోసం షాపింగ్ చేద్దామనుకుంటున్నా. నీక్కావల్సినన్ని కొత్త చీరలు కొనుక్కో. ఎన్నంటే అన్ని. సరేనా? “  అంటూ కళ్ళెగరేశాడు.
ఇంతలో సెల్ మోగింది.
“నువ్వెళ్ళి రెడీ అవ్వు. నేను అమ్మాయితో మాట్లాడ్తుంటాను ఇంతలో..” అంటూ సెల్ అందుకున్నాడాయన.
మగాడిలో పశు వాంఛ పుట్టగానే,  స్త్రీ కి ఇట్టే తెలిసిపోతుంటుంది. ఎలా అంటే, ఆ  చూపులు స్పర్సలు  మురికి  కంపు కొడ్తాయి కాబట్టి. కానీ లీలకి ఆ తేడా తెలీడం లేదు. కారణం ఆయనంటే దేవుడని, అలా రమ్య చెప్పింది
సెల్ఫోన్ గ్రీన్ బటన్ నొక్కుతూ కూడా, లీల మీదే చూపు నిలిపాడు  జగన్నాధం.  ఆయన అప్పటికే ఒక పథకం వేసుకున్నాడు.  “ఇవాళ తను కొనిచ్చే చీరలతో లీల ఫ్లాటైపోతుంది.  ఆ తర్వాత, ఇంటికొచ్చాక,  బయట వెన్నెల్లో కూర్చుని ఒక పెగ్ కొడుతూ…ఆమె వేయించిచ్చిన  జీడి పప్పు వేపుడ్ని పొగుడుతూ..తన మనసులోని కోర్కెని చెబుతాడు.
ముందు ఆమె ఒప్పుకోదు. ఆ తర్వాత, ఆమెకి డబ్బు ఎర వేస్తాడు.  తనకొచ్చే పెన్షన్ లో సగం ఆమెకే ఇచ్చేస్తానని ఆశ పెడతాడు. కరుగుతుంది.  బీదది కదా. అంత డబ్బు ఎప్పుడూ చూసి వుండదు కాబట్టి, సరే అంటుంది.  ఈ సంగతి మూడో కంటికి తెలీనివ్వనని కూడా మాటిస్తాడు. తలొంచుకుని నవ్వుతుంది. సిగ్గు పడుతూ. ఆమె ని ఇక అక్కణ్ణించి మెల్లగా బెడ్రూం లోకి నడిపించుకుని తీసుకుపోతాడు.  ఆ తర్వాత? హబ్బా…”హూ”అంటూ సన్నగా  మూలిగాడు జగన్నాధం.
“హలో..హలో..నాన్నా? నాన్నా?!! “ఏమిటి నాన్నా మూల్గుతున్నావు? ఒంట్లో ఎలా వుంది? వినిపిస్తోందా?” కూతురు కంగారుగా అడుగుతోంది.
జగన్నాధం  లీల వైపు అదోలా చూస్తూ, కాళ్ళూపుకుంటూ హుషారుగా మాటలు మొదలు పెట్టాడు.
“నాకేం తక్కువరా తల్లీ? నువ్విచ్చిన అమ్మలాటి అమ్మాయి గిఫ్ట్  నా దగ్గరుండగా” అన్నాడు ధిలాసాగ.
తన మాటలు లీల విని, అర్ధం చేసుకోవాలని  ఆయన ఉద్దేశం.
సరిగ్గా అదే క్షణంలో  లీల అటు తిరిగి, డైనింగ్ టేబుల్ తుడుస్తోంది.
ఇటు కనక తిరిగుంటే, గాల్లోకి విసిరిన ఆయన ముద్దులకి ఆమెకాక్షణంలోనే ఈ మృగం అర్ధమైపోయి వుండేవాడు. అదే గనక జరిగి వుంటే, బహుశా! ఆయన తన తప్పునెప్పటికీ సరిదిద్దుకునే అవకాశం వుండేది కాదేమో!
తండ్రి గొంతులోంచి వినొస్తున్న కొత్త ఉత్సాహాన్ని చాలా జాగ్రత్తగా వింటోంది రమ్య.
“లీల ఎలా వుంది నాన్నా?” అడిగింది మెల్లగా.
“నువ్వేమీ దిగులు పడకమ్మా, లీల గురించి. అమ్మని చూసుకున్నట్టే చూసుకుంటున్నా.  సరేనా..” అంటూ అదోలా నవ్వాడు.  లీలని వెనకనించి ఎగా దిగా చూస్తూ.
రెండు క్షణాల నిశ్శబ్దం తర్వాత …గంభీరమైన స్వరంతో  చెప్పింది రమ్య. “నాకు తెలుసు నాన్న. మీరు లీలని ఒక అమ్మలా ఆదరిస్తారని, అండగా నిలుస్తారని, చల్లటి నీడౌతారని.. నాకు తెలుసు నాన్నా..నాకు తెలుసు..” ఆమె గొంతు హఠాత్తుగా దుఖంతో నిండిపోడంతో..ఈ తండ్రి కలత పడ్డాడు. మోహం లోంచి బయటపడుతూ.. ”అమ్మా, రమ్యా? ఏమిట్రా? ఎందుకీ దుఖం?” కరగిపోతూ అడిగాడు.
“నాన్నా! నేను నైంత్ క్లాస్ లో వుండగా మా స్పోర్ట్స్ మాస్టర్  గదిలోకి తీసుకెళ్ళి..” ఆ పైన మాట్లాడలేకపోయిందామె.
“నిన్నా విషయం మరచిపొమ్మని చెప్పానా లేదా?” కోప్పడ్డాడు కూతుర్ని.
“మర్చిపోలేను నాన్నా. కానీ, ఆ సంఘటన నన్ను కాల్చి బూడిద చేసేసేదే..నువ్వు గనక నాకు అండగా నిలబడకపోయుంటే. నీ ఓదార్పు నాకు లభించకపోయుంటే! నువ్వు వాస్తవాలని వివరించి చెప్పకపోయుంటే! నేను మనిషిగా మిగిలి వుండేదాన్ని కాను నాన్నా.
ఆ అతి భయంకర దుర్ఘటనతో మగ పురుగంటేనే   జుగుప్స తో  ముడుచుకుపోతున్న నేను,   నీ స్పర్శ లో ఆ దేవుని చల్లదన్నాన్ని చూసాను నాన్నా. మగాళ్ళందరూ..నీలా ఎందుకుండరని వ్యధ చెందాను నాన్నా!
అమ్మకీ విషయం తెలిసి, ఏడుస్తూ, బాధలో మునిగేది. కానీ,  నువ్వు మాత్రం అమ్మని కోప్పడుతూ, నన్ను నీ వొడిలోకి చేర్చుకుని మంచి మాటలు చెబుతూ, భవిష్యత్తు మీద ఆశలు కల్పిస్తూ..నాకు పునర్జీవితాన్ని ప్రసాదించావు నాన్నా. ఆ మచ్చ గుర్తొచ్చి చచ్చి పోవాలనిపించినప్పుడల్లా..చందమామ లాటి నీ మంచి తనం నా ఎదుట కొచ్చి బ్రతికిస్తూ వుండేది. ఇప్పటికీ అంతే నాన్న. నీ లాటి తండ్రిని పొందడం నేను చేసుకున్న అదృష్టం గా భావిస్తాను.
నాన్నా!!నీ అంత మంచి తండ్రికి..నేనేమివ్వగలను? ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను?..
వింటున్న జగన్నాధంకి గతంలో కూతురికి జరిగిన అన్యాయం గుర్తొచ్చింది. రక్తం మరిగింది. వాణ్ని పట్టుకుని చితకబాదాడు. అంతే కాదు, రమ్య చేత చెప్పుతో కొట్టించాడు. ఆ తర్వాత ఆ వూరొదిలి వేరే రాష్ట్రానికి ట్రాన్స్ ఫర్  చేయించుకున్నాడు. విషయం రహస్యంగా వుండాలని చెప్పాడు ఇంట్లో. కూతురి కి తనే కౌన్సిలింగ్ చేసే వాడు. ఆమె ని ఉత్సాహం గా వుంచే వాడు. కంటికి రెప్పలా కాచేవాడు. ఆమె త్వరలోనే మామూలు మనిషయ్యింది. కానీ, మనసులో ఆ చేదు అనుభవం మాత్రం నీలినీడలా.. అలానే మిగిలిపోయింది.
అది తుడిచేయాలని ఆయనెంత ప్రయత్నించినా…అది వృధా ప్రయాసే  అన్న సంగతి ఆయనకి అర్ధమైపోయింది.
“నాన్నా!” కూతురి పిలుపుతో..”ఊ?” అంటూ ఉలిక్కిపడ్డాడు ఆ తండ్రి. “నాన్నా! మిమ్మల్ని బాధపెట్టాలని ఇప్పుడీ ప్రసక్తి తీసుకు రాలేదు నేను. లీల గురించి మీకు చెబుదామని. ఆమె తల్లి ఒక పేరున్న సినిమా యాక్టర్ ఇంట్లో పనిచేసేది. ఇంట్లో ఎవరూ లేనప్పుడు..పనుందని పిలిచి గదిలోకి  ఆమెని రేప్ చేశాడు. ఆమె ఏడ్చి గోల చేసింది. పోలీస్ కేసు పెట్టారు. పని మనిషి కాబట్టి, తప్పంతా అమెదే అని తేల్చారు. ఆమే మోజుకొద్దీ,  అతని  తన మీద పడిందనీ, కాదంటే తాను మగాడెలా అవుతాడనే వాదనలతో ముగిసింది ఆ కేసు.  ఆ పరిస్థితుల్లో  ఓ పోలీస్ కానిస్టేబుల్  ఆమె మెళ్ళో తాళి కట్టాడు. లీల  పుట్టాక తెలిసింది. జరిగింది పెళ్ళి కాదని, అప్పటికే అతనికి ఇద్దరు పెళ్ళాలున్నారని. అయినా నోరు మూసుకుని కాపురం చేస్తోంది ఆ తల్లి. వారానికోసారి తాగొచ్చి గోల చేసే ఆ మొగుడి కన్ను..ఎదిగిన కూతురు  లీల మీద పడింది. అది తనకు పుట్టింది కాదని, యాక్టర్ కూతురు కాబట్టి తనే వుంచుకుంటానని వాగేవాడు. ఆ తల్లి వాణ్ణి ఛీ కొట్టింది. నా యింట్లోకొస్తే కాళ్ళిరగ్గొడ్తానంది. అయినా వాడు విన్లేదు. ఓ అర్ధరాత్రొచ్చి, కూతురి మీద పడ్డాడు. లీల పెనుగులాడింది. తల్లిని వేడుకుంది రక్షించమని. ఆ తల్లి ఆ క్షణం లో అపరకాళి గా మారి,  చేతికందిన కత్తిపీటతో వాడి తల నరికేసింది. గూడెం గూడెం గుమికూడింది. పోలిసులొచ్చారు. ఆమెని జైల్ కి పంపారు. లీల వీధిన పడింది. ఆమె పరిస్థితి మెరుగు పడకపోగా,  ఇంకా దయనీయమైంది.
ఇంట్లో నా తండ్రి దగ్గరే నాకు  భద్రత దొరకలేదంటే ఇంకెక్కడకని పోను అమ్మగారూ? అంటూ ఏడ్చిన లీలకి నేను భరోసా ఇచ్చాను నాన్నా!
మా నాన్న దగ్గరకెళ్ళి వుండు. నువ్వు దేవుడి దగ్గరున్నంత భద్రంగా వుంటావ్. నిశ్చింతగా బ్రతుకుతావ్. నీకు మంచి మార్గం చూపిస్తారు మా నాన్న. నిన్ను ఒక అమ్మాయిలా  కాదు, ఒక అమ్మలా చూసుకుంటారని..చెప్పాను నాన్నా లీలకి.
అందుకే అన్నాను నాన్నా. నీకు అమ్మలాటి అమ్మాయిని పంపుతున్నానని.
వింటున్న జగన్నాధానికి  చెంప ఛెళ్ళుమనిపించాయి  కూతురి మాటలు. అమ్మ లాటి అమ్మాయంటే, ఆమెకి అమ్మ అనుకున్నాడు. అమ్మలా కడుపు నింపి, మాతృ దేవతవంటి హృదయం గల స్త్రీ అని కనీసం ఊహించనైనా ఊహించలేకపోయాడు. ఎంత మూర్ఖుడు తను?  పైగా.. ఆమెని పడక మీద ఊహిస్తూ..ఛీ,  అసలు తనేమిటీ, తన వయసేమిటీ? ఈ ఆలోచనలేమిటీ? ఎంత చపలచిత్తుడైపోయాడు..ఒంటరి స్త్రీని చూసీ..అదీ, తన కూతురి తోటి ఆడపిల్లని కూడా తెలిసీ? తన బిడ్డా ఒకప్పుడు అన్యాయానికి గురైనప్పుడు  కుమిలిపోయిన వ్యధా తెలిసీ, ఆ సంగతే మరచి..ఒక్కసారిగా ఆయన మీద ఆయనకే అసహ్యం వేసింది.
సిగ్గుతో తలొంచుకున్నాడు.
సెల్ ఆఫ్ చేసి, లీలని పిలిచాడు దగ్గరకి.
“బయటకెళ్దామన్నాను కదా? పద. చీరలు కొనుక్కొచ్చుకుందాం. రేపట్నించి నిన్ను టీచర్ ట్రైనింగ్ క్లాసెస్ లో జేర్పిస్తున్నా. అలాగే  యూనివర్సిటీ కెళ్ళి, డిగ్రీ కోర్సుల వివరాలు కూడా కనుక్కొద్దాం. లీల కళ్ళ నిండా ఆనందాన్ని నింపుకుని  నమ్మలేని దాన్లా చూస్తోంది ఆయన వైపు.
“లీలా! నీకు చదువు చెప్పించి,  నీకొక శాశ్వత  మార్గం చూపాలి. అప్పుడు కానీ నేను మనశ్శాంతిగా  కన్ను మూయను.” అన్నాడు ఆప్యాయంగా అమె తల నిమురుతూ..
ఆయనకి  తనపై గల పితృవాత్సల్యానికి  పులకించిపోతూ, ఉద్వేగంతో ఆయన పాదాల మీద వాలింది లీల.
మొట్టమొదటి సారిగా.. లీలలో తన కూతురు రమ్య  కనిపించింది. అచ్చు రమ్యలానే!
అమ్మా, రమ్యా! నా కళ్ళు తెరిపించావు రా తల్లీ..!! నిన్ను నేను మనిషిగా చేయడం కాదురా, నువ్వే నన్ను మనిషిని చేసావు. మగాడి మదాంధకారాన్ని అణచి, జ్ఞాన  దీపాన్ని వెలిగించావు. ఈ తండ్రి మీద నీకున్న నమ్మకాన్ని విశ్వాసాన్ని రెట్టింపు అయేలా, నేను నీ తండ్రినని పదిమందిలో నువ్వు  గర్వంగా చెప్పుకుని తలెత్తుకు తిరిగేలా ప్రవర్తిస్తానమ్మా..ప్రామిస్!  అనుకుంటూ కళ్ళొత్తుకున్నాడు.
రమ్య నవ్వుతూ కనిపించింది. ‘ఎంత మంచివాడవు నాన్నా’ అంటూ!

***********

విశ్లేషణ:

“ఎంత మంచివాడవు నాన్నా!”—ఆర్. దమయంతి.

‘పురుషు డదృష్టమహిమ గలిగినంతవరకును కళ గల్గియుండును. అగ్నితోఁగలిసియుండు నంతఁదనుక ప్రకాశించిన బొగ్గు ఆ యగ్ని చల్లారినంతనే నల్లనైపోవును.’ భాస్కరశతక కారుడన్నట్లు అగ్గిలేని బొగ్గు నల్లగా కళా హీనమై ఉంటుంది. భార్యావిహీనుడైన పురుషుడుకూడా కళతప్పి వెలాతెలా పోతాడు. అగ్గి తగిలిన బొగ్గు రగిలినట్లే పురుషుడు కూడా స్త్రీ తోడుంటే ప్రకాశిస్తాడు. అయితే ఆ ప్రకాశం హాని కలిగించనిదై, ఆ స్త్రీ జీవితంలో వెలుగు నింపుతే పురుషుని జన్మ ధన్యమైనట్లే. ఆ అగ్ని హాని కలిగించకుండా నియంత్రించగలగాలి.. ఆ నియంత్రించే శక్తి సమయానికి అందుబాటులో ఉండాలి.. అప్పుడు అంతా, అందరికీ ఆనందమయమే!

జగన్నాధానికి భార్యపోయినందుకు విచారంగా ఉన్నా, అంతకంటే ఒంటరితనం ఎక్కువ బాధిస్తోంది. ఒక్కగానొక్క్క కూతురు రమ్య పంచప్రాణాలూ నాన్న దగ్గరే ఉన్నాయి. పోనీ కూతురి దగ్గర ఉందామంటే.. అక్కడా ఉక్కిరిబిక్కిరైనట్లే ఉంది. నిస్సారంగా గడుస్తున్నతండ్రి జీవితంలోకి ఇంచుమించు తన ఈడుదే అయిన, దిక్కులేని లీలని సహాయార్ధం పంపుతుంది.. “నాన్నా! నీకొక బహుమతి పంపిస్తున్నా.” అంటూ.

ఏ వేళకావేళ కడుపునిండా తిండి, కంటినిండుగా నిదుర.. ఇంటి విషయాలేవీ పట్టించుకోనక్కర్లేదు. జగన్నాధంలో పూర్వపు కళ వచ్చింది. ఆ మెరుపుకి ఇంకా మెరుగు పెట్టాలనుకుంటాడతడు. ఆ ఆలోచనలతోనే హుషారుగా రోజులు గడుపుతూ.. ఆ రోజే తను అనుకున్నది అమలు జరపాలని నిర్ణయిస్తాడు.

సరిగ్గా అప్పుడే కూతురు దగ్గర్నుంచి ఫోన్.. సూక్ష్మగ్రాహి అయిన కూతురు, తండ్రి మాటలో తేడాని గ్రహించి నట్లుంది. తన చిన్నతనంలో జరిగిన సంఘటన గుర్తుచేసి.. అటువంటి విపత్కర సమయంలో అక్కున చేర్చుకుని, జీవితం మీద ఆశని కల్పించిన అతని మంచి మనసుని, సమయస్ఫూర్తిని మెచ్చుకుని, అదే విధమైన భరోసాని, విధివంచిత అయిన లీలకి ఇమ్మని కోరుతుంది. చేతులు చాచి నిండు జీవితాల్ని దహించబోయిన అగ్నిని నియంత్రిస్తుంది. స్వతహా మంచివాడైన జగన్నాధం తాత్కాలికమైన విషయ వాంచలతో కాలిపోబోతున్న దేహాన్ని, మనసునీ అదుపులోకి తెచ్చుకుని జరగబోయే అనర్ధాన్ని ఆపగలుగుతాడు.

ఆర్.దమయంతి, ఆంధ్రభూమిలో సికరాజుగారివద్ద ఉప సంపాదకురాలిగా అనేక సంవత్సరాల అనుభవం సంపాదించుకున్నారు. అనేకానేక కథలని చదివి, మంచీ చెడులను నిర్ణయించిన సమర్ధురాలు. స్వతంత్రంగా విలేఖరిగా పనిచేస్తూ.. ఈ మధ్యనే రచనా వ్యాసంగాన్ని సమృద్ధిగా కొనసాగిస్తూ, రచించిన కథలలో సగానికి పైగా బహుమతులందుకుంటున్న మంచి రచయిత్రి.

దమయంతిగారెన్నుకున్న కథావస్తువు విలక్షణమైనది.. (ఒక సున్నితమైన విషయంలో తండ్రిని సరిదిద్దిన కూతుళ్లు, అందుకు అంగీకరించిన తండ్రులు అరుదుగా ఉంటారనుకుంటున్నా..). కథనంలో, శిల్పంలో ఈ చేయితిరిగిన రచయిత్రిని ఎంచదగినవేముంటాయి? కాకపోతే ఆంగ్లపదాల వాడుక తగ్గిస్తే బాగుంటుందేమో అనిపించింది. అవసరం లేని చోటకూడా కొంచెం విహారం చేశాయేమో.. ఉదాహరణకి, ‘డోర్, క్లీన్, గిఫ్ట్, టేబుల్’ వంటి వాటి బదులు తెలుగు పదాలు వాడచ్చేమో! “పాత్రోచితంగా  పాత్రలు వాడడం వేరు.. కథకులే వాడడం వేరు” అని నాకు ఒక ప్రముఖ రచయిత పాఠం చెప్పారు. నిజమే కదా!

19 thoughts on “ఎంత మంచివాడవు నాన్నా! (తండ్రి – కూతురు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *