May 8, 2024

బంధాలు – బాధ్యతలు (తండ్రి – కూతురు)

రచన: జి.ఎస్.లక్ష్మి…

అర్ధరాత్రి పన్నెండుగంటలు దాటింది. నిద్ర పట్టక పక్కమీద అటూ ఇటూ దొర్లుతున్న శేషాద్రి యెక్కడో చిన్నగా తలుపు తీసినట్టు వచ్చిన శబ్దం వినిపించి, చెవులు రిక్కించాడు. మళ్ళీ వినిపించిందా శబ్దం. నెమ్మదిగా లేచి పడకగది తలుపు ఓవారగా తీసి చూసాడు. కూతురు సరోజ నెమ్మదిగా వీధిగది తలుపు తీసుకుని, అతను వ్రాసుకునే టేబిల్‍వైపు వెడుతోంది. ఆ టైమ్‍లో సరోజకి ఆ గదిలో పనేంటా అని ఆశ్చర్యపోతూ శేషాద్రి తలుపు పక్కకి వెళ్ళి తొంగి చూడసాగాడు. సరోజ మునివేళ్ళమీద నడుచుకుంటూ వెళ్ళి తండ్రి టేబిల్ డ్రాయర్ తీసి, అందులోంచి అలమారు తాళాలు తీసుకుని, శబ్దం కాకుండా అలమారు తలుపులు తెరిచి, అందులోంచి కాగితాలు తీసి బెడ్‍లైట్ వెలుగులో ఒక్కొక్కటీ పరీక్షిస్తోంది.
ఊపిరి బిగపట్టి కూతురు చేస్తున్న పనిని గమనిస్తున్నాడు శేషాద్రి. సరోజ తనకి కావలసిన కాగితాలు పైన వున్న అరలో కనపడకపోవడంతో, ఇంకో తాళంతో లోపలగా వున్న మరో చిన్న అరని తీసి, అందులోంచి కాగితాలు తీసి, చూసి, వాటిని మళ్ళీ లైట్ కిందకి తెచ్చి, వేరే చిన్నకాగితం మీద  అందులోంచి కొన్ని వ్రాసుకుని, మళ్ళీ జాగ్రత్తగా ఆ కాగితాలని లోపల పెట్టేసి, చప్పుడు కాకుండా తాళం వేసేసి, ఆ తాళంచెవి డ్రాయర్‍లో పెట్టేసి, గుమ్మం వైపు తిరిగి నిశ్చేష్టురాలైంది.  గుమ్మవంతా మనిషై సింహంలా నిలబడున్నాడు తండ్రి.
సరోజ నవనాడులూ కృంగిపోయాయి. నోరారిపోయింది. బిక్కచూపులతో స్థాణువులా నిలబడిపోయింది. సరోజ చేసిన పని చూసిన శేషాద్రి పరిస్థితి కూడా అలాగే వుంది. తను పెంచిన కూతురు, తన ఆశలను, ఆశయాలను, విలువలను గుర్తించి, గౌరవించి, ఆచరిస్తున్నదనుకున్న తన కూతురు ఈ అర్ధరాత్రి ఇలాగ దొంగతనంగా తను  రేపటి పరీక్షకోసం సెట్ చేసిన ప్రశ్నాపత్రాన్ని తీసి చూసిందంటే నమ్మలేకపోతున్నాడు. తను యెంతగానో నమ్మిన సరోజ ఆ నమ్మకం మీదే యింత దెబ్బ కొడుతుందని ఊహించలేకపోయాడు. మధ్యాహ్నం డాక్టరు తనకు చెప్పిన జాగ్రత్తలకే సగం దిగాలుపడిన శేషాద్రి ఈ అర్ధరాత్రి దొంగతనంగా కూతురు తను సెట్ చేసిన ప్రశ్నాపత్రం చూడడం చూసి పూర్తిగా కుదేలయిపోయేడు. తనను తాను సంబాళించుకోలేక కూలబడిపోయేడు.
హడిలిపోయింది సరోజ. “నాన్నా.. నాన్నా..”అంటూ గట్టిగా కేకలు పెట్టసాగింది. అర్ధరాత్రి అరుపులకి ఖంగారుపడుతూ లేచొచ్చారు సరోజ అన్నలిద్దరూ, తల్లీ కూడా. అన్నలిద్దరూ గబగబా శేషాద్రి చేత మంచినీళ్ళు తాగించి, చెరో భుజంక్రిందా చేతులేసి నడిపిస్తూ అతన్ని మంచం మీదకి జేర్చి, డాక్టర్ కి ఫోన్ చేసేరు. డాక్టర్ వచ్చి ఇంజక్షన్ చేసి, శేషాద్రికి నిద్ర పట్టాక అప్పుడు తేలిగ్గా ఊపిరి తీసుకున్నారు అందరూ. కాని సరోజ మనసు మటుకు తేలిక పడలేదు.
ఆమెకి పదే పదే ఆరోజు స్కూల్‍లో స్నేహితురాలు పంకజంతో జరిగిన సంభాషణే గుర్తొస్తోంది. పంకజం సరోజ స్నేహితురాలు. రెండు వారాల్నించీ స్కూల్‍కి రావటం లేదు. ఇవాళే వచ్చింది. సరోజని తండ్రి యెవరింటికీ పంపే అలవాటు లేదు. యే స్నేహాలైనా స్కూల్ లోనే. అందుకే పంకజం యెందుకు రాలేదో పంకజం చెప్పేదాకా తెలుసుకునే అవకాశం లేకపోయింది సరోజకి. పంకజం వస్తూనే వెక్కి వెక్కి యేడవడం మొదలుపెట్టింది. తండ్రి యాక్సిడెంట్‍లో పోయాడనీ, తల్లీ, తనూ, చెల్లెళ్ళూ దిక్కులేని వారమైపోయామని చెప్పగానే సరోజకి చాలా బాధేసింది. స్నేహితురాలిని యెలా ఓదార్చాలో కూడా తెలీలేదు.   పంకజమే తేల్చి చెప్పేసింది.
“ఇంక నేను స్కూల్‍కి రాలేను సరోజా. మా అమ్మ నన్ను చదివించలేదు. ఆ మాటే నీతో చెప్పిపోదావని వచ్చేను.”అంది.
పంకజం మాటలు విన్న సరోజ..”అదేంటి పంకజం. యేడాదంతా చదివి తీరా పరీక్షల ముందు మానేస్తావా..?” అనడిగింది.
“యేం చెయ్యమంటావు చెప్పు? ఎల్లుండి మీ నాన్నగారు పెట్టే ప్రీ ఫైనల్‍లో మంచిమార్కులు రాకపోతే మీ నాన్నగారే నన్ను పబ్లిక్ పరీక్షకి పంపరు. మామూలుగానే నాకు అత్తెసరు మార్కులొస్తాయి. ఇంత జరిగాక యిన్ని పాఠాలు వినకుండా నేను ఎల్లుండి పరీక్ష రాయలేను.”
“నేను నీకు జవాబులన్నీ రాసిస్తాను. ఇవాళ, రేపూ చదివేసుకో..తప్పకుండా పాసవుతావ్..” ధైర్యం చెప్పింది సరోజ. పేలవంగా నవ్వింది పంకజం.
“ఒక్కరోజులో యెన్నని చదవగలను సరోజా?” పంకజం ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయింది సరోజ.          అవును .. నిజవే.. అన్ని సబ్జెక్ట్లూ కలిపి చూస్తే చాలానే అవుతాయి. కష్టవే. మరింక పంకజానికి తనెలా సాయపడగలదూ..స్నేహితురాలికి సహాయపడలేకపోతున్నందుకు సరోజకి చాలా బాధేసింది.
పంకజం కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది. “నా అదృష్టమింతే సరోజా. కనీసం టెన్త్ పాస్ అయితే యెక్కడైనా ఉద్యోగానికి అర్జీ పెట్టుకుందుకుండేది. కానీ.. నాకిప్పుడు ఆ ప్రాప్తం కూడా లేదు. యెవరింట్లోనో అంట్లు తోముకోడం తప్పితే నాకింక దారేది చెప్పు?” ఒక్కసారి భోరుమంది పంకజం. సరోజకి ఉక్కిరిబిక్కిరయిపోయినట్టైంది.
కాసేపటికి పంకజమే తేరుకుని నెమ్మదిగా అంది. “మిగిలినవి యెలాగోలా చదువుకుందామన్నా ఎల్లుండి  లెక్కలపరీక్ష. నాకు అసలే రావు. కనీసం యే లెక్కలొస్తున్నాయో తెలిస్తే ఆ నాలుగూ బాగా చూసుకుంటాను. సరోజా, మీ నాన్నగారు నీకు చెప్పే వుంటారు.. యే లెక్కలొస్తాయో కాస్త చెప్పవా..?” సరోజ రెండు చేతులూ పట్టేసుకుంది పంకజం.
తెల్లబోయింది సరోజ. తండ్రి ఆ స్కూల్‍కి హెడ్‍మాస్టర్. స్కూల్‍లో యెంత క్రమశిక్షణతో వుంటాడో ఇంట్లో కూడా అలాగే వుంటాడు. మంచి విలువలూ, ఆదర్శాలతో పిల్లలని పెంచుకొస్తున్నాడు. సహజంగా తెలివైన సరోజ అన్ని సబ్జెక్ట్స్ లోనూ  మంచిమార్కులే తెచ్చుకునేది. లెక్కలైతే మరీనూ. ఇలా చెపితే అలా పట్టేసుకునేది. అందుకే సరోజంటే శేషాద్రికి చాలా ఇష్టం. అస్తమానం భార్య శాంతతో “అబ్బాయిలకన్నా చాలా తెలివైంది.. నా తర్వాత నా పేరు నిలబెట్టేది సరోజే.. ” అనేవారు. “మాతల్లి చదువుల సరస్వతి. పెద్ద పెద్ద చదువులు చదివి మన స్కూల్‍కే పేరు తెస్తుంది మా అమ్మాయి.” అని స్నేహితులతో గర్వంగా చెప్పుకునేవాడు.
అంతేకాకుండా మగపిల్లలు ఆటల దృష్టిలోపడి చదువు గురించి అప్పుడప్పుడు అబధ్ధం చెప్పేవారు. అలాంటప్పుడు శేషాద్రికి చాలా కోపం వచ్చేది. “మనిషి పతనం అవడానికి మొదటిమెట్టు అబధ్ధం చెప్పడం. తర్వాత దొంగతనం లాంటివన్నీ అలవాటుగా వచ్చేస్తాయి. మీకన్నా చిన్నది.. సరోజని చూసి నేర్చుకోండి.. యెంత నిజాయితీగా వుంటుందో..” అనేవాడు. తండ్రి మెప్పుదల సరోజకి యెవరెస్టు యెక్కినంత ఆనందం కలిగించేది.
అలాంటి క్రమశిక్షణ అంటే ప్రాణం పెట్టే తండ్రి ప్రశ్నాపత్రం తనకి ముందుగా యెందుకు చెపుతారు? ఆశ్చర్యంగా చూసింది సరోజ పంకజం వైపు.
“మా నాన్నగారు మాకెప్పుడూ అలా ముందు చెప్పరు పంకజం.” అంది.
పంకజం మొహం ముడుచుకుపోయింది. “పోనీలే.. ఫ్రెండువి కదా.. కాస్త సాయం చేస్తావనుకున్నాను.” నిష్ఠూరంగా అంది. తెల్లబోయింది సరోజ.
“రేప్పొద్దున్న మీ ఇంట్లో అంట్లు తోవడానికి నేనొస్తా కదా..అప్పుడు నీకు తృప్తిగా వుంటుంది.”
ఖంగారుపడిపోయింది సరోజ.
“నిజం పంకజం. మా నాన్నగారు మాకు ముందు చూపించరు..” గట్టిగా చెప్పింది.
“ఆయన చూపించకపో్తే నువ్వే చూసి చెప్పొచ్చుగా..” వెంటనే అంది పంకజం.
“నేనా..?”
“యేం.. నాకోసం ఆ మాత్రం చెయ్యలేవా..? ఇంట్లో వున్నపేపర్ చూడ్డానికి కష్టమేవుంది చెప్పు? రే్ప్పొద్దున్న మేవంతా రోడ్డుమీద అడుక్కోడమే నీకు బాగుంటుందేమోలే..”
పంకజం అంటున్న చురకత్తుల్లాంటి ఆ మాటలకి తెల్లబోయింది సరోజ. మళ్ళీ అంతలోనే “పాపం..కడుపులో యెంత బాధ లేకపోతే ఇలా మాట్లాడుతుందీ..” అని సరిపెట్టుకుంది. అయినా పట్టు విడవకుండా ధైర్యం చెపుతూ, “నీకు ఇంపార్టెంట్ లెక్కలు ఓ పది నేను రాసిస్తాను పంకజం. ఇవాళ రాత్రి అవి చూసుకో. ” అంది.
“పేపర్‍లో అవే వస్తాయా..?” ఆశగా అడిగింది పంకజం.
“నాకేం తెలుసూ? ఇంపార్టెంట్ అని చెప్పానంతే..” కాస్త వెనకాడుతూ అంది సరోజ.
“హు.. రాకపోతే.. అంతకన్న మాస్టారు సెట్ చేసిన పేపరే చూసి చెప్పొచ్చుగా. అయినా ఇంట్లో వున్న పేపర్ చూసి చెప్పడానికి అంత కష్టమేవుంది చెప్పు.” తన మాట వదల్లేదు పంకజం.
“హమ్మో.. మా నాన్నగారు చంపేస్తారు. అయినా అలా చూడకూడదు. తప్పు.”
“తప్పేవుందిందులో. నువ్వేమీ నీకోసం చూట్టంలేదు కదా. నాకు సాయం చెయ్యడానికి చూస్తున్నావు. నాలాంటివాళ్లకి సాయం చెయ్యాలని మీ నాన్నగారు చెప్పలేదూ..”
“చెప్పేరు. కానీ ఇలాంటి సాయం కాదు..” యేదో అనబోయిన సరోజని ఆపి పంకజం అంది.
“సరూ, నువ్వివాళ నాకీ సాయం చేసేవంటే నాకే కాదు.. మా అమ్మకీ, చెల్లెళ్లకీ కూడా ఇంత అన్నం పెట్టినదాని వవుతావు. లేకపోతే ఇంక మాకు చావే గతి..”
పంకజం మాటలకి గాభరా పడిపోయింది పదిహేనేళ్ళ సరోజ.
సరోజ ముఖంలో భావాలు కనిపెట్టిన పంకజం ఇంక ఊరుకోలేదు. లోహం వేడిగా వున్నప్పుడే సమ్మెట దెబ్బ వెయ్యాలి. అప్పుడే అది మనకి కావలసిన ఆకారంలోకి మార్చుకోగలం. అందుకే మళ్ళీ అంది.
“సరూ, ఇందులో నువ్వు ఖంగారు పడ్డానికి కూడా యేమీ లేదు. మీ ఇంట్లో అలమార్లో వున్న కాగితాలే కదా. యేదో టైమ్‍చూసి, ఓ నాలుగు లెక్కలు రాసుకొచ్చేవనుకో.. నన్ను గట్టెక్కించినదాని వవుతావ్. నీ మేలు మర్చిపోను.”
యెదుటివారికి సాయపడాలనే సదుద్దేశ్యంతో వున్న సరోజకి పంకజం చెప్పినదానిలో సాధక బాధకాలు తెలీలేదు.
“కాని, రేపు ప్రిపరేషన్ హాలీడే కదా.. నీకెలా అందివ్వనూ..?”
సరోజ ప్రశ్నకి పంకజం మొహం చాటంతయ్యింది.
“రేపు పొద్దున్న గుడికి రా.. నేనూ వస్తాను. ” అంది.
అలాగ పంకజం మాటలమాయలో పడిపోయిన సరోజ ఆ సాయంత్రమంతా ప్రయత్నించింది ఆ పేపర్ చూడ్డంకోసం. కాని పరీక్షలముందు పిల్లలకొచ్చే సందేహాలు తీరుస్తూ, సాయంత్రమంతా తండ్రి ఆ గదిలోనే వున్నాడు. రాత్రి భోజనాలయ్యేదాకా అందరూ అటునుండి మసిలేవాళ్ళే. అందుకే సరోజ అంత రాత్రిదాకా చూసి అప్పుడు ఆ ప్రశ్నాపత్రాల కోసం వెళ్ళింది. జరిగిందంతా ఆలోచిస్తున్న సరోజకి ఒక్కసారి ఉప్పెనలా దుఃఖం ముంచుకొచ్చేసింది. తనని అంతగా మెచ్చుకునే తండ్రి దృష్టిలో తనెంత దిగజారిపోయిందీ. ఇప్పటివరకూ తనకి వచ్చిన ఫస్ట్ మార్కులన్నీ ఇలాగే ముందు ప్రశ్నాపత్రం చూసి రాస్తే వచ్చినవే ననుకోరూ..సరోజకి యెందులోనైనా పడి చచ్చిపోదామన్నంత బాధ వచ్చేసింది.
“నేను నిజంగానే నిజాయితీగా చదువుతున్నాను నాన్నా..” అని గొంతెత్తి అరవాలనిపించింది.
కాని తండ్రి శేషాద్రి సరోజకి ఆమాత్రం  అవకాశం కూడా ఇవ్వలేదు. వెంటనే పెళ్ళిసంబంధాలకోసం వాకబు చేసి, పదోతరగతి పరీక్షలయిన పదిరోజులకే పెళ్ళికి ముహూర్తం పెట్టించేసేడు. నెల లోపల కూతుర్ని అత్తారింటికి కాపురానికి పంపించేసేడు. సరోజ తల్లి సుశీల దగ్గర అసలు విషయం చెపుదామని చూస్తే ఆ ఇల్లాలు “నాన్నగారు సంబంధం కుదిర్చేసేరమ్మా. మనమిప్పుడు యేం చెయ్యగలం చెప్పు.” అనేసింది. తను చేసిన తప్పుపనికి తండ్రి వేసిన శిక్ష అనుభవించడానికే నిశ్చయించుకుంది సరోజ.
పెళ్ళయాక సరోజ భర్త రాజారావుకి బేంక్‍లో గుమాస్తాగా ఉద్యోగం వచ్చింది. అతను చేసే బ్రాంచిలు కూడా వాళ్ల స్వంతవూరికి దగ్గరలోనే అవడంతో పెళ్ళాం, పిల్లల్ని తల్లితండ్రుల దగ్గరే వుంచి, తను మాత్రం ఆ ఊళ్ళన్నీ తిరుగుతూ, వారానికోసారి వచ్చిపోతుండేవాడు. అలాగ అనుకోకుండా ఇల్లాలయిన సరోజ ఓ పదేళ్ళపాటు రాక్షసిలాంటి అత్తగారి దగ్గర కటికత్త కోడంటికం అనుభవించింది.
ఆ తర్వాత రెండేళ్ళలో అత్తమామలు చనిపోవడం, రాజారావుకి ప్రమోషన్లతో దేశంలో వున్న మిగిలిన రాష్ట్రాలన్నీ తిప్పడంతో, పెళ్ళైన ఇంచుమించు పదిహేనేళ్ళకి సరోజకి కాస్త ఊపిరి పీల్చుకుందుకు అవకాశం దొరికింది. అప్పుడు మళ్ళీ సరోజ దృష్టి చదువు మీదకి మళ్ళింది. తను నిజాయితీగల స్టూడెంటేనని తండ్రికి నిరూపించుకోడానికైనా డిగ్రీ సంపాదించుకోవాలనుకుంది. రాజారావు సరోజ చదువుతానంటే అభ్యంతరం పెట్టలేకపోయాడు. యెందుకంటే పదేళ్ళపైన తన తల్లి పెట్టిన హింసని పెదవి విప్పకుండా భరించిన సరోజంటే అతనికి సానుభూతి. యిన్నేళ్ళ సాహచర్యం అతనిలో సరోజ మీద అభిమానం పెంచింది. రాజారావు ప్రోత్సాహంతో సరోజ ఓపెన్ యూనివర్సిటీ వన్ సిటింగ్‍లో డిగ్రీ చేసింది.
ఇద్దరు పిల్లలతో పాటూ తనూ పుస్తకాలు ముందేసుకుని కూర్చుని మాస్టర్స్ కూడా చేసింది. పట్టు వదలకుండా రీసెర్చ్ లో కూడా జేరి, సరోజకి పెళ్ళైన యిరవైరెండేళ్ళకి డాక్టరేట్ తెచ్చుకునే స్థాయికి వచ్చింది.
అంచెలంచెలుగా యెదుగుతున్న కూతురి చదువు గురించి శేషాద్రికి తెలుస్తోంది. తన పేరు పక్కన ఒక్కొక్క డిగ్రీ పేర్చుకుంటున్న సరోజ పట్టుదలకి శేషాద్రి హృదయం సంతోషంతో నిండిపోతోంది. ఇప్పుడు ఇన్నేళ్ళ తర్వాత కూతురు పి.హెచ్.డి పట్టా పుచ్చుకుంటుంటే కళ్ళారా చూడడానికి శేషాద్రీ, సుశీల కలిసి ప్రయాణానికి సిధ్ధమౌతున్నారు. వాళ్లని దగ్గరుండి తీసికెళ్ళడానికి సరోజ ఇంకాసేపట్లో వస్తుందని ఇద్దరూ సామాన్లు సర్దుకుని యెదురు చూస్తున్నారు.
“మన సరోజ యెంత గొప్ప విజయం సాధించిందండీ. చిన్నతనంలో యేదో తెలీక తప్పు చేసినా..” అంటున్న సుశీల మాటలని మధ్యలోనే అపేసేడు శేషాద్రి.
“మన సరోజ యే తప్పూ చెయ్యలేదు సుశీలా..తప్పు చేసింది నేను..” అన్నాడు నెమ్మదిగా. తెల్లబోయింది సుశీల. ఆశ్చర్యంగా చూసింది శేషాద్రి వైపు.
తలదించుకుని నెమ్మదిగా చెప్పడం మొదలెట్టాడు శేషాద్రి.
“నీకు గుర్తుందా ఆరోజు.. సరోజ ప్రశ్నాపత్రం తీసినరోజు..” తలూపింది సుశీల.
“ఆరోజు మధ్యాహ్నం యెందుకో ఆయాసంగా అనిపిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆయన ఈసిజిలు గట్రా తీసి, చూసి, మీ గుండె చాలా వీక్‍గా వుందండీ. మీరు చాలా జాగ్రత్తగా వుండాలి అంటూ మందులు రాసిచ్చాడు.
ఇంటి కొచ్చానన్న మాటే కానీ నాకు స్థిమితం రాలేదు. పిల్లలా ఇంకా చిన్నవాళ్ళు. నాకేదైనా అయితే..మగపిల్లలయితే యెక్కడో యేదో చేసుకుని బతికెయ్యగలరు. కానీ, ఆడపిల్ల. పెళ్ళీపేరంటం యెవరు చేస్తారు. నేనా ఇచ్చిపోయే ఆస్తులేమున్నాయి కనుక. అంత తెలివిగల పిల్లని చదువంతటితో ఆపేసి పెళ్ళి చేస్తానంటే కారణం యేదైనా వుండాలి కదా.. నా రోగం బయటపెడితే అందరూ ఖంగారు పడతారు. యే దిక్కూ తోచని ఆ స్థితిలో సరోజ అలా ప్రశ్నాపత్రంతో పట్టుబడింది. నా కూతురి సంగతి నాకు తెలీదా. దీని వెనుక ఆ పంకజం వుందన్నవిషయం కూడా తెలుసు. సరోజ అమాయకత్వాన్ని ఆ పంకజం వాడుకుంటే.. పాపం ఆమె నిజాయితీని నేను కారణంగా వాడుకున్నాను. నెపం సరోజ మీద తోసేసి, బలవంతంగా పెళ్ళి చేసేసేను. ఆడపిల్లకి పెళ్ళిచెయ్యకుండా యెక్కడ పోతానో అనే భయం నన్నాపని చేయించింది. సరోజ ప్రతిభని నా బాధ్యత మింగేసింది. ఆ పెళ్ళి వల్ల పిల్ల యెన్ని బాధలు పడిందో నాకన్న యెక్కువ యెవరికీ తెలీదు. చదువుల సరస్వతిలాంటి మన సరోజని అలాంటి బ్రహ్మరాక్షసిలాంటి అత్తగారి చేతిలో పెట్టింది నేనేనని అనుకున్నప్పుడల్లా నేను చేసిన పాపానికి నిష్కృతి లేదనిపించేది. గుండెలు పిండేసినట్టుండే ఆ బాధలన్నీ.. ఇదిగో ఇలాంటి రోజు చూడడం కోసమే భరించాను.
సుశీలా, ఈ యిరవైరెండేళ్ళూ సరోజని చూస్తూ నేను పడ్డ అపరాథభావం చెప్పలేనిది. అది అనుభవిస్తేనే కానీ తెలీదు. ఈ మధ్యే సరోజ చదువులో ముందుకెడుతూ, డాక్టరేట్ పట్టా తెచ్చుకుందంటే.. ఇప్పటికి ఆ భావం కాస్త తగ్గింది. కానీ.. నిజం చెప్పాల్సివస్తే నేను సరోజ మీద అభాండం తోసేసి, దానికి చెప్పలేని ద్రోహం చేసేను. ఇప్పుడు చెప్పు సుశీలా, దోషులెవరు? నిజాయితీపరులెవరు?”ఆవేశంగా అడిగాడు శేషాద్రి.
శేషాద్రి చెప్పింది విని తెల్లబోయారు ప్రత్యక్ష్యంగా వింటున్న సుశీల, వీళ్ళని తీసికెళ్ళడానికని వచ్చి గుమ్మంలోనే నిలబడి పరోక్షంగా వింటున్న సరోజ. అప్పుడే సరోజని చూసారు తల్లితండ్రు లిద్దరూ. అంతా విన్నానన్నట్టు నెమ్మదిగా లోపలికొచ్చింది సరోజ. కూతురి మొహం చూడలేక తల దించుకున్నాడు శేషాద్రి. నెమ్మదిగా తండ్రి దగ్గరికి వెళ్ళి మోకాళ్ళమీద కూర్చుని, తండ్రి తల పైకెత్తుతూ, “మీరెప్పుడూ గొప్పవారే నాన్నా..మీరు తల దించుకోకూడదు. కూతురి పెళ్ళి బాధ్యత సక్రమంగా నిర్వర్తించిన తండ్రిగా మీరెప్పుడూ పూజనీయులే..” అంటూ శేషాద్రి కాళ్ళకి నమస్కరించింది సరోజ.

**********

విశ్లేషణ:

“బంధాలు-బాధ్యతలు”— జి.యస్. లక్ష్మి.

కూతురంటే ఎంతో నమ్మకం, ప్రేమ ఆ తండ్రికి. కొడుకుల కంటే బాగా చదువుతుంది.. పట్టుదల, నాన్నంటే ఎంతో అభిమానం గౌరవం ఉన్న సరోజ అటువంటి పని చేసిందంటే నమ్మలేకపోయాడతను. క్రమశిక్షణే ప్రాణంగా ఉపాధ్యాయ వృత్తిలో ఎంతో మంచి పేరు తెచ్చుకున్న శేషాద్రి, కన్న కూతురి ఆశలు నిర్దాక్షిణ్యంగా చిదిమేశాడు.

అర్ధరాత్రి, తను పని చేసుకునే గదిలోకి దొంగలా దూరి, తన కాగితాలు తీసి వెతికి, ఏం చేస్తోంది.. ముద్దుల కూతురు తన నమ్మకాన్ని వమ్ము చేస్తోంది.  ఉగ్రరూపం దాల్చిన నాన్నని చూసి కన్నీరు మున్నీరైన  కూతుర్ని చూసిన ఆ తండ్రి మనసు కొంచెం కూడా కరగలేదు. ఆవేశం తట్టుకోలేక కుప్పకూలిపోయిన నాన్నని కాపాడుకోడమే తన కర్తవ్యం అనుకుంది సరోజ. కనీసం సంజాయిషీ చెప్పుకోడానికి కూడా అవకాశం ఇవ్వకుండా శిక్షవేసిన తండ్రి మీద కొంచెం కూడా కోపం రాలేదా అమాయకురాలికి.

తనకున్న మంచిమనసే శాపంగా, నిశ్శబ్దంగా జీవిత కాల శిక్షని అనుభవించ సాగింది. అనుభవిస్తూనే తనేమిటో తండ్రికి నిరూపించాలనుకుంది. అత్తింటి ఆరళ్లు భరిస్తూనే.. బాధ్యతల నడుమ, చదువుమీద తనకున్న తృష్ణని తాత్కాలికంగా వాయిదా వేసి.. భర్త సహకారంతో తన ధ్యేయాన్ని నెరవేర్చుకుంది.

పుట్టింటికి వెళ్లి తన విజయాన్ని వివరించబోయిన సరోజకి తండ్రి మనసు అర్ధమై, మనసు ఆర్ద్రమౌతుంది. బాధ్యతని నెరవేర్చుకోవాలనే నిస్సహాయ స్థితిలో తను చేసిన తప్పుకి, తల వంచుకోబోతున్న తన కన్నతండ్రిని ఓదార్చి, మరింత చేరువౌతుంది.

గరిమెళ్ల సుబ్బలక్ష్మి గారు ప్రముఖ రచయిత్రి. “శ్రీ లలిత” అనే పేరుతో బ్లాగ్ నిర్వహిస్తున్నారు. అదే పేరుతో అనేక రచనలు కూడా చేశారు. కథ ఆద్యంతం హృద్యంగా సాగింది. సుబ్బలక్ష్మిగారు హాస్యరచయిత్రి. సున్నితమైన హాస్యంతో మనసుల్ని అలరింప జేస్తారు. అదే ఆశించి చదవడం మొదలు పెట్టానేమో.. మరింత బరువుగా అనిపించింది, కథ కథనం కూడా! అవకాశవాది అయిన పంకజం కథకి అంత ప్రాధాన్యత ఇవ్వకుండా, తండ్రీ కూతుళ్ల అనుబంధాన్ని మరింత పటిష్ఠంగా చూపించి, కూతురి కష్టాల్లో సానుభూతి.. క్షమించినట్లు ఆమెకి అనిపించేట్లు చేస్తే బాగుండేదేమో అనిపించింది. ఎంత చనువున్నా, తండ్రీకూతుళ్ల అనుబంధాల్లో ఆదూరం మధ్యతరగతి కుటుంబాల్లో ఉండనే ఉంటుంది. ఆ దూరం.. మనసు విప్పి మాట్లాడుకోనియ్యదు. కన్నతల్లి కూడా ఆ పరిస్థితులలో నిస్సహాయురాలే.

మధ్యతరగతి మనస్తత్వాలని మనసుకి హత్తుకునేలా మలిచారు రచయిత్రి.

4 thoughts on “బంధాలు – బాధ్యతలు (తండ్రి – కూతురు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *