May 17, 2024

అండమాన్ డైరీ – 7

రచన: దాసరి అమరేంద్రamarendra

ఇహ బీచ్‌ వదిలిపెట్టి చౌకీదారు స్నేహితుడు చెప్పినట్టు లోపలి మార్గం పట్టుకొన్నాను. పచ్చని పొలాలు, కొబ్బరి చెట్లు, పొలాల్లో జరుగుతోన్న పనులు ` ఓ క్షణం అసలు నే ఉన్నది అండమాన్‌లోనా లేకపోతే నాకు తెలిసిన కృష్ణాగోదావరి డెల్టా ప్రాంతాలలోనా! అన్న అనుమానం కలిగేసింది. అంత పోలిక.. నాకు తోచిన చిట్టచివరిదాకా వెళ్ళి తిరుగు ప్రయాణం ఆరంభించిన తరుణంలో ఓ పెద్ద మనిషి కనిపించాడు. ఏభై ఏళ్ళు ఉండొచ్చు. నల్లటి శరీరం.. బొద్దు ఒళ్ళు.. కొంచెం బాన పొట్ట. రోడ్డు పక్కన నడుస్తూ కనిపించాడు. పలకరింపుగా నవ్వాడు. లిఫ్టు కావాలా అని అడిగాను. సంతోషంగా ఎక్కాడు. రెండు కిలోమీటర్ల అవతల తన ఇల్లట. కొంచెం రోడ్డులోపలికి.. ‘రా! మా ఇంట్లో కాసేపు కూర్చుని వెళ్ళు’ అని పిలిచాడు. అలాంటి పిలుపులు నాకు వరప్రసాదాలే కదా!

అతని పేరు మెండల్‌. మామూలే ` బంగ్లాదేశ్‌ మూలాలు. అప్పటి దారుణాలు తెలుసు. భార్య, పెద్ద కోడలు, మనుమడు, చిన్న కొడుకు. దీప శిఖ లాంటి చిన్న కోడలు. ‘‘అమ్మాయి కూడా ఉంది. పెళ్ళయింది. హేవలాక్‌లోనే ఉంటుంది. పెద్దాడు పోలీసు డిపార్టుమెంటులో మెయిన్‌లాండులో’’, అంటూ దూరాన పొలం పనుల్లో ఉన్న ఇంకా ఇరవై కూడా నిండి ఉండని చిన్న కొడుకును పిలిచాడు. ఎవరీ పెద్ద మనిషి అన్న అనుమానపు చూపులతో వచ్చాడతను. అంతా మర్యాదలంటూ హడావుడి. మర్యాదలొద్దు.. కబుర్లు కావాలి అని నా హడావుడి. కబుర్లు, కష్టసుఖాలు.. వారి జీవనసరళి. ఆర్ధిక వనరులు, సాంఘిక జీవితం, స్నేహితులు, బంధువులు ` ఎన్నోదొర్లాయి కబుర్లలో. పాత స్నేహితుల్లా మాట్లాడేసుకొన్నాం ఓ గంటసేపు. అనుకోని అదనపు అందం ఈ మండల్‌ కుటుంబపు సాన్నిహిత్యం!!

SAM_4483

రెండు దాటేసింది. ఫెర్రీకి ఇంకో రెండు గంటల సమయం ఉంది.

ఈసారి సముద్ర తీరాలలో ఉండే, హిప్పీలలాంటి విదేశీయులు నెలల తరబడి నివసించే పర్ణశాలల సముదాయాలను దగ్గర నుంచి చూసే ప్రయత్నం చేసాను. కొంచెం బెరుకు బెరుకు గానే అలాంటి ఓ రిసార్టు ముందు స్కూటరు ఆపి లోపలికి నడిచాను. రిసార్టు గేటు దగ్గరే అక్కడి మనిషి కనిపించి ‘ఏమిటి సంగతి’ అన్నట్టు కళ్ళెగరేసాడు. ఊరికే అలా చూసి రావడానికి అంటూ మౌనభాషలోనే నా సమాధానం. అతని అనుజ్ఞ.

విశాలమైన ప్రాంగణం. రోడ్డు నుంచి సముద్రం దాకా.. దాదాపు వంద మీటర్లు పొడవు. అటూ ఇటూ అడ్డదిడ్డంగానే, మళ్ళా అందులోనూ ఓ క్రమం ఉంది. ` పర్ణశాలలు. నిజంగా మట్టి, రాళ్ళూ, సిమెంటు లేకుండా కట్టిన కుటీరాలు.. అంతా కలసి పాతిక ముప్ఫై.. వాటిల్ని తమ తమ అభిరుచులకనుగుణంగా అలంకరించుకొని జీవిస్తోన్న విదేశీ జంటలు.. తలుపుల మీద రాగాలు పలికే రంగులతో వేసిన విచిత్ర చిత్రాలు.. చిన్నపాటి వసారాలలో ఊయలలు ఊగడానికి హేమక్‌లు.. పుస్తకాల పఠనం.. చెస్‌ లాంటి ఆటలు.. ఆ రిసార్టు మధ్యలో దిట్టంగా రెండు అంతస్థుల్లో నిర్మించిన సిమెంటు సహిత డైనింగ్‌ హాలు.. దానికి అటూ ఇటూ అబ్జర్వేషన్‌ టవర్లలాగా కట్టిన చిన్న పాటి ఎత్తు మీద ఉన్న చుట్టిళ్ళు.. నిజానికి ఆ పర్ణశాలల సముదాయమే ఒక చల్లని చిరు గ్రామం అనిపించేసింది. ఎవరినైనా కబుర్లలో పెడదామా అని మనసు తహతహలాడింది గానీ ఇది సమయమూ సందర్భమూ గాదు అని బుద్ధి హెచ్చరించింది.

SAM_4511

నాలుగు లోపలే జెట్టీ చేరుకొన్నాను. అక్కడే టూరిజం వారి ఆఫీసు గాని ఆఫీసులో ఉన్న కుర్రాడిని పలకరించాను. ‘ఈసారి చూడండి. బ్రోషర్లు పుష్కలంగా తెప్పించాను’ అని సంబరంగా కప్‌బోర్డు చూపించాడు!

నాలుగున్నరకు ఫెర్రీ బయల్దేరింది. నీల్‌ ద్వీపం కూడా తాకి వెళుతుందని ఆశపడ్డాను గానీ ఇది తిన్నగా పోర్ట్‌ బ్లెయిర్‌ వెళ్ళే ఫెర్రీ. సందట్లో సడేమియా అన్నట్టు ఆ రోజు జరుగుతోన్న ఓ ఇండియా టెస్టు మ్యాచి. ‘సచిన్‌ సెంచరీల సెంచరీ కొడతాడా’ అన్న ఉత్కంఠ. టివీ సంగతి దేవుడెరుగు, కనీసం రేడియో కామెంటరీ కూడా అందని ప్రదేశం అంది. కానీ క్రికెట్‌ సమాచారం అందించే ఎస్సెమ్మెస్‌ సేవ పనిచేస్తోంది. దాని సాయంతో అతను వందో వంద కొట్టగానే ఆ సమాచారం అందుకొని ‘వినుడు.. వినుడు’ అంటూ బహిరంగ ప్రకటన చేసాను. అంతా కేరింతలు… మొన్నటి మాయాబందరు సూర్యోదయ సౌందర్యానికి జవాబులా ఈ సారి సూర్యాస్తమయ దృశ్యాలు.. ఈనాటి ఉదయం ఏ సముద్ర తలం మీద వెండి వెలుగులు చూసానో ఇపుడు అదే ప్రదేశంలో బంగారం కరిగించి పోసినట్టు! దూరాన పసిడి ముద్దలా దిగిపోతోన్న సూరీడు. అతనికి వీడుకోలు చెబుతోన్న మేఘమాలికలు. ఆసక్తిగా సూర్యాస్తమయం తిలకిస్తోన్న సహ ప్రయాణీకులు. నా కెమెరా ఆర్భాటం చూసి తమ తమ ఫోటోలు తీయమని అడిగిన ఓ ఘజియాబాద్‌ జంట. తన తల్లిని అండమాన్‌ యాత్రకు తీసుకువచ్చిన అరవై రెండేళ్ళ బ్రిటీషు మనిషి. తల మీద పెద్ద టోపీ పెట్టుకొని కళగల మొహంతో అచ్చం బ్రిటీషు రాణిగారిలా ఉన్న ఆయన ఎనభై రెండేళ్ళ తల్లిగారు. అందరూ వచ్చి తనను ఆసక్తిగా చూసి పలకరించి వెళుతోంటే ‘ఏం మీ ఇళ్ళల్లో నాలాంటి పెద్దవాళ్ళులేరా?’ అని ఆవిడ మురిపెంగా విసుక్కోవడం. ‘ఉన్నారు గానీ మీలాగా ఖండాంతరాలు తిరిగే వాళ్ళు అత్యంత అరుదు గదా!’ అని నా సమాధానం. ఈ లోపల దిగిపోయిన సూర్యుడు.. మహానుభావులు నిష్క్రమించినా వారి ఛాయలు ఇంకా దోబూచులాడే రీతిలో మరో ఇరవై నిముషాల పాటు ఆకాశంలో వర్ణ విన్యాసాలు. చివరికి ఫీనిక్స్‌ జెట్టీ!

SAM_4523

అనవసరంగా భయపడ్డాగానీ నా ఏక్టివా సురక్షితంగా నాకోసం ఎదురు చూస్తూ కనిపించింది. ఎనిమిది లోపలే ఇల్లు చేరుకోగలిగాను. ఓ గంట సేపు గత రెండు మూడు రోజులుగా బాకీ పడిపోయిన ఫోనుకాళ్ళు చెయ్యడం.. అడిగినా అడగకపోయినా వాళ్ళందరికీ మౌంట్‌ హారియట్‌ ట్రెక్కు గురించీ, కాలపద్ధర్‌ మండల్‌ కుటుంబం గురించీ, సాగర జలాల్లో సూర్యాస్తమయం గురించీ చెప్పి చెప్పి విసిగించడం ` ఇదిగో ఇలా రాసి రాసి భవిష్యత్‌ పాఠకులను విసిగించినట్టు గానే!!

ప్రకాష్‌ ఇంటికివెళ్ళి ఓ గంట గడిపాను. వాళ్ళకు వీడ్కోలు.. కృతజ్ఞతలు. మా ఢిల్లీ తప్పక  రండి ఆహ్వానాలు. వాళ్ళ ఇంటి తాళాలు.. అప్పగింతలు.

‘ఓ బోయ్‌, పదవయ్యా జాలీబోయ్‌..’ ఆ మార్చి పదిహేడు ఉదయం ఏక్టివా నడుపుతూ నా మనసు పాడుతోన్న సన్నాయి పాట అది! దక్షిణ అండమాన్‌ దక్షిణ భాగంలో తూర్పుతీరాన పోర్ట్‌ బ్లెయిర్‌ ఉంటే పడమటి తీరాన వాండూర్‌  ఉంది. అంతా కలసి ముప్ఫై కిలోమీటర్లు. వాండూర్‌ పక్కనే ఆరు ఏడు చిన్నా పెద్దా ద్వీపాలు. అవన్నీ ‘నేషనల్‌ మెరైన్‌ పార్క్‌’లో భాగాలు. కోరల్స్‌కు ప్రసిద్ధి చెందినవి. విమానంలో నాలుగోతారీఖున దిగుతోంటే ముందస్తుగా కనిపించి పలకరించిన దీవులు ఇవే. అందులో రెడ్‌ స్కిన్‌ ఐలెండ్‌ అన్న పెద్ద ద్వీపమూ ‘జాలీబోయ్‌’ అనే చిన్న ద్వీపమూ టూరిస్టులకు అందుబాటులో ఉన్నవి. ప్రతిరోజూ పర్మిషన్లూ, ప్లాన్లూ ప్రకారం ఓ బోటెడు టూరిస్టులను తీసుకు వెళ్ళి ఓ రెండు మూడు గంటలు ఆయా ద్వీపాల్లో వాళ్ళను గడపనిచ్చి తిరిగి తీసుకువస్తారు. అంతా కలసి అయిదారు గంటల రౌండ్‌ ట్రిప్పు.

ఉదయం తొమ్మిది గంటలకల్లా వాండూర్‌ జెట్టీలో రిపోర్టు చెయ్యాలి. పొద్దున్నే వెళ్ళి ప్రకాష్‌ వాళ్ళకు మరోసారి టాటా చెప్పి మ్యాపులూ, రోడ్‌ సైన్ల సహాయంతో వాండూర్‌ దారి బట్టాను. దారిలో ఒకళ్ళిద్దరిని సాయం అడిగాను. మంగ్లుతన్‌, హష్మతాబాద్‌, మేమ్యో అన్న ఆసక్తికరమైన పేర్లు ఉన్న గ్రామాల గుండా సాగిందా చక్కని రహదారి. తొమ్మిదిలోపలే చేరుకొన్నా. కొత్త బిచ్చగాడిలా అక్కడ ఆ సమయంలో నేను ఒక్కడినే! ఆ పక్కనే పచ్చని పొదలూ, రంగు రంగుల పూల మధ్య ఓ టీ షాపు కనిపించింది. బాపు గారు చూస్తే వచ్చే రామాయణం సినిమాలో పర్ణశాలకు దీన్నే నమూనాగా తీసుకొంటారు అనిపించేంత ముద్దుగా ఉంది ఆ దుకాణం. కానీ దాని చుట్టు పక్కల ` తక్కువగానే అయినా ` ప్లాస్టిక్‌ బాగులు, చెత్తా చెదారం.. యధా ప్రకారం!!

SAM_4557

మెల్లగా ఒకరిద్దరు టూరిస్టులు.. ఉన్నట్టుండి ఓ మినీ బస్సు! పోర్టు బ్లెయిర్‌ టూరిజం వాళ్ళ ఆఫీసు నుంచి కండెక్టెడ్‌ టూర్‌ నడిపే సదుపాయం ఉంది. అదిగో ఆ టూరు వాళ్ళు ఆ ఇరవై మంది. నాలాగా విడిగా వచ్చిన వాళ్ళు ఇద్దరు ముగ్గురికి ద్వీపాల్లోకి వెళ్ళడానికి ముందే పర్మిట్‌ తీసుకోవాలని తెలియదు. పాపం వాళ్ళ ఆందోళన.. అక్కడి అధికారుల సహకారంతో ఆ సమస్య పరిష్కారం. అందరిలోనూ వెళ్ళబోయే జాలీబోయ్‌ గురించి పసితనపు ఉత్సుకత.. కొత్త పరిచయాలు, ఈ లోపల పాత ఫ్రెండ్సు నలుగురు!

‘జర్మనీ నుంచి ఈతకొట్టుకొని వస్తున్నావా’ అని రాస్‌Êస్మిత్‌లో చతురాడిన జంట ఇక్కడా తటస్థ పడింది. నీల్‌ ద్వీపంలో కనిపించి ఓ వారం క్రితం మాతోపాటు పోర్ట్‌ బ్లెయిర్‌ దాకా నౌకాయాత్ర చేసిన కర్మేంద్ర కోహ్లి`కాకినాడ శైలజ దంపతులు వాళ్ళ పాపా బాబులు.. ఇహ ఒంటరితనం ప్రసక్తే లేదు.

SAM_4565

కోరల్సు ఉన్న రక్షిత ప్రాంతమది. ప్రాణాలు పణంగా పెట్టి కాపాడుకోవలసిన జాతీయ సంపద అది. అందుకు అనుగుణంగానే ఉన్నాయి అక్కడి నిబంధనలు. ప్లాస్టిక్‌ బ్యాగులు తీసుకువెళ్ళడం నిషిద్ధం.. ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్స్‌ కూడాను.. వెళ్ళిన వాళ్ళు దొరబాబుల్లా నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా అన్ని బంధాలూ వేసారు. అక్కడి సిబ్బంది కూడా ఏ మినహాయింపులు లేకుండా వాటిల్ని అమలులో పెడుతున్నారు. ‘డబ్బులు పోసి కొనుక్కున్న’ వాటర్‌ బాటిళ్ళ తమ దగ్గర ఉంచేసి, టూరిస్టులందరికీ స్కూలు పిల్లలు రోజూ వాడుకొనేలాంటి దిట్టమైన వాటర్‌ బాటిళ్ళు అందిస్తున్నారు. ప్లాస్టిక్‌ పొరపాటున కూడా పడవెక్కకుండా క్షుణ్ణంగా చెక్‌ చేసి మరీ వదులుతున్నారు.

తొమ్మిదిన్నరకు పడవ ప్రయాణం ఆరంభమయింది. అంతా కలసి ఓ ముప్ఫైమందిమి. చిన్న పడవ. పైన కప్పు ఉంది గానీ పైకెక్కి కూర్చునే అవకాశం లేదు. అటూ ఇటూ దీవులు, వాటిల్లో అడవులు.. ఏదో ఓ పెద్ద కాలువలో వెళుతున్నట్టు ఉందే తప్ప సముద్రంలోలాగా లేదు. అంతా కలసి గంటంబావు ప్రయాణం. పదీ పదిహేను కిలోమీటర్లు.. ఒడ్డు ఇంకో వంద గజాల దూరాన ఉందనగానే పడవ ఆపేసారు. చివరిదాకా వెళితే కోరల్స్‌ గాయపడతాయి గదా ` అక్కడ్నించి చిన్న చిన్న పడవల్లో, గ్లాస్‌ బోటమ్‌ బోట్లలో ఒడ్డుకు చేరవేసారు.

జాలీ బోయ్‌ బహు చిన్న ద్వీపం. అంతా కలసి ఒక చదరపు కిలోమీటరు విస్తీర్ణం. వెళ్ళగానే ఓ శిలాఫలకం పలకరించింది. అండమాన్‌ పర్యావరణ శాఖ వారూ, జువలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా వారు సంయుక్తంగా నిర్వహిస్తోన్న పగడాల దిబ్బల శాశ్వత పర్యవేక్షణా పధకం అని ఆ ఫలకం ప్రకటించింది .. సంతోషం.

ఆ రోజు ఆ ద్వీపమంతా మాదేననిపించింది. అందరూ స్థిమితపడేలా సముద్రపుటొడ్డున చిన్న చిన్న షెల్టర్లు.. తమ తమ బ్యాగులూ వస్తవులను అక్కడ చేర్చి అందరూ ఈత దుస్తుల్లోకి మారి స్నోర్కలింగ్‌కు సిద్ధపడిపోయారు. భయ, సంకోచాలున్న ఓ పదిమంది గ్లాస్‌ బోటమ్‌ బోట్‌లో సుదీర్ఘ యాత్రకు సంసిద్ధమయ్యారు. ఓ పావుగంట గడిచేసరికి ఎవరి పనుల్లో వాళ్ళం నిమగ్నమయ్యాం.

ఎలిఫెంట్‌ బీచ్‌ అనుభవంతో తొట్రుపాటు లేకుండా స్నోర్కలింగ్‌ పరికరాలు తీసుకొని నీళ్ళల్లో అడుగు పెట్టాను. ‘‘గైడు అక్కర్లేదోయ్‌’ అంటే ఆ కుర్రాడు సంతోషంగా ఒప్పేసుకున్నాడు. కొంచెం నీటి జోరు ఎక్కువగా ఉన్న మాట నిజం. జాగ్రత్తగానే ఆ నేచురల్‌ ఎక్వేరియంలో చేపలో చేపనై, కోరల్సులో కోరల్నై, శిలల్లో శిలనై తిరుగాడాను. గంటసేపు ఈదులాడినా సంతృప్తి కలగలేదు. దేనికైనా హద్దుండాలోయ్‌ అని నన్ను నేనే హెచ్చరించుకొని ఒడ్డు చేరాను.

SAM_4574

జర్మన్‌ యువకుడూ అదే సమయంలో ఒడ్డున పడ్డాడు. సహజంగానే కబుర్లు సాగాయి. ‘నాకు నాలుగేళ్ళ క్రితం డైవోర్సు అయింది. మూడేళ్ళ క్రితం ఈవిడ పరిచయం. నా కన్నా అయిదేళ్ళు పెద్దావిడ. కలసి ఉంటున్నాం. నేనో ఎలక్ట్రీషియన్ని, ఈవిడ స్టెనోగ్రాఫర్‌గా పనిచేసేది. ఏడాదిన్నర క్రితం బ్రెస్ట్‌ కేన్సరు ఆపరేషను జరిగింది. ప్రమాదం నుంచి బయటపడ్డాం. ఆ చికిత్స తర్వాత ఇదే మా మొట్టమొదటి యాత్ర. గొప్పమనిషావిడ. కేన్సరుకు భయపడలేదు. పైగా నాకే ధైర్యం చెప్పింది. ఎమోషనల్‌గా నాకన్నా స్థిరత్వం గల మనిషి. నాకు తోడవడం నా అదృష్టం..’ మనసు విప్పాడతను. ఈ లోపల ఆవిడా వచ్చి మాతో చేరింది. మా కుటుంబంలో కూడా బాగా దగ్గరి వాళ్ళు ఇలా కాన్సరును ఎదుర్కోవడం, జయించడం, ఆ వివరాలు చెప్పాను. సుందర ద్వీపాలు సరేసరి, ఎదుర్కొన్న సమస్యలు కూడా మనుషుల్ని దగ్గరకు చేర్చవూ!!

SAM_4563

నావాలకం గమనిస్తోన్న ఇద్దరు ముగ్గురు బెంగాలీ యువకులు దగ్గరకొచ్చారు. ‘ఒక్కడివే వచ్చావా?’, పరామర్శ. ‘కాదు! మరో ఇరవై తొమ్మిది మందితో కలసి’ ` నా సమాధానం. నా యాత్రల గురించీ, తిరుగుళ్ళ గురించీ ఆసక్తిగా వివరాలు అడిగారు. హిమాలయాలు, పడమటి కనుమలు, నీలగిరులు, కన్యాకుమారిలు, కేరళలు, జోగ్‌ జలపాతాలు, స్కూటరు యాత్రలు ` అన్నింటినీ కలగలపి, అతిశయోక్తి దగ్గరకు రాకుండా జాగ్రత్త పడుతూ ఓ ఇరవై నిముషాలు మాట్లాడాను.

ఒకటిన్నరకు జాలీబోయ్‌ నుంచి తిరుగు ప్రయాణం. ఈతలూ, స్నానాలూ, స్నోర్కలింగ్‌లతో అలసిన చాలామంది కునికిపాట్లలో పడ్డారు. జర్మన్లు, కోహ్లీలు, నేనూ కబుర్లలో.. ఫోటోలు తీసుకుంటూ.. పిల్లలతో ఆడుకొంటూ మా పెద్ద పడవకు రెండు చిన్న పడవల్ని కట్టి లాక్కొస్తున్నారు. మేమంతా ఎక్కి తిరిగిన గ్లాస్‌ బోటమ్‌ బోట్లవి. పెద్ద ఏనుగు వెంబడి గున్న ఏనుగుల్లా ` అదో సుందరదృశ్యం!!

SAM_4587

‘‘ఎప్పట్నించీ అండమాన్‌ ద్వీపాల్లో నివసిస్తున్నావూ? ఏం పని చేస్తావూ?’’ ఆనందంతో మూర్ఛ వచ్చినంత పనయింది ఆ ప్రశ్నలతో!

మూడున్నర సమయం. చిడియాతపు వెళ్ళే రహదారి. టీషర్టు, షార్ట్సు, నల్లకళ్ళజోడు, హెల్మెట్టు, ఏక్టివా ` దారిలో పోలీసుల రొటీన్‌ చెకింగు. ఓ ఇరవై ఏళ్ళ కానిస్టేబులు అమ్మాయి మర్యాదగానే అడిగిన ప్రశ్నలవి! సాక్షాత్తూ అండమాన్ల లెఫ్టినంట్‌ గవర్నరుగారే ‘భలే తిరిగావయ్యా మా ద్వీపాల్లో. అందుకో మా వీరతాడు’ అని సన్మానించినా అంత సంతోషం కలిగేది గాదేమో! ఓ పోలీసు అమ్మాయి నన్ను ఆ ద్వీపాలకు చెందిన మనిషిగా పొరపడిరది. అంతకన్నా గొప్ప యోగ్యతాపత్రం చెలం గారు కూడా ఇవ్వలేరు! వివరాలు చెప్పాను. ‘‘బావుంది సర్‌! ఆర్‌ ది బెస్ట్‌’’ అని సగౌరవంగా సాగనంపింది.

వాండూర్‌ నుంచి తిన్నగా ఇంటికి చేరే బదులు ఆ దిశలోనే ఉన్న ‘చిడియాతపు’ మరోసారి వెళ్ళివద్దామనిపించి దారి మళ్ళించినపుడు జరిగిన సంఘటన అది! సాయంత్రం అయిదు గంటల వేళ చిడియాతపు చేరాను. సంధ్యా సమయం. సముద్రపు కొసన ఉంది గాబట్టి సూర్యాస్తమయ సందర్శనాభిలాషులకేం కొదవు లేదు. కాస్తంత కోలాహలం. కానీ రాధానగర్లూ కాలాపథ్థర్లూ చూసాక చిడియాతపు అంతగా ఆకట్టుకోలేకపోయింది.

ఇంటికి చేరే ముందు ఓసారి అబర్డీన్‌ బజారు ప్రాంతాన్ని రాత్రిపూట చూడాలనిపించింది. స్కూటరు అటు మళ్ళించాను. ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర దాకా ఆ బజారులో పచారులు. ఎందుకో స్ఫురించి తెలుగు సంఘం ఉనికి గురించి వాకబు చేసాను. ఒకరిద్దర్ని అడగగా చివరికి దారి తెలిసింది. కంటికి నదురుగా కనిపించే భవన సముదాయం. 1964లో శంకుస్థాపన జరిగి 71లో ఆవిష్కరణ జరిగిందట. వాళ్ళ వార్షికోత్సవాలు దగ్గర పడుతున్నాయనుకొంటాను ` కమిటీ మీటింగు. వెళ్ళి పరిచయం చేసుకొని మీటింగులో కాసేపు కూర్చొనే అనుమతి పొందాను. దాని ప్రెసిడెంటు గారు రచ్చబండ ఫ్యూడల్‌ పెద్ద మనిషిలాగా అందరినీ అదిలిస్తూ, మందలిస్తూ, అక్షింతలు వేస్తూ కనిపించారు. అలవాటు తప్పిన నా ప్రాణాలకు అదో అరుదైన సన్నివేశం!

తీరిగ్గా తొమ్మిదిన్నరకు ప్రకాష్‌ వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టాను. ఆశ్చర్యంగా శాంతి వాళ్ళ అమ్మనాన్న గార్లు కనిపించారు. అందరూ కలసి బయలుదేరినా… ప్రకాష్‌ వాళ్ళ ఫ్లైటు వేరట. అది సకాలలో వెళ్ళిపోయింది. వీళ్ళ విమానం మరి ఎంచేతో ఆరోజు కాన్సిలయింది. మర్నాడైనా సవ్యంగా వెళుతుందా అన్న ప్రశ్నకు ఎయిర్‌లైన్స్‌వారు సరైన సమాధానం ఇవ్వడం లేదట. ఈ లోగా ప్రకాషు ‘‘మీ మూడ్‌ పాడుచెయ్యడం ఎందుకని పగలు ఫోను చెయ్యలేదు. లెక్క ప్రకారం రేపు ఉదయం ఆరు గంటలకు వీళ్ళ విమానం. కొంచెం పొద్దున్నే వెళ్ళి ఎయిర్‌లైన్స్‌ వాళ్ళతో మాట్లాడి వీళ్ళు విమానం ఎక్కేలా చూడగలరా’’ అని అడిగాడు. అలాంటి అవకాశం వచ్చినందుకు సంతోషం!!

ఉదయం నాలుగు ముప్పావుకల్లా ఇంట్లోంచి బయటపడ్డాం.

ఓ పావుగంట అనిశ్చితి తర్వాత విషయం పరిష్కారమయింది. ఆరు లోపలే ప్రశాంతి వాళ్ళ పేరెంట్సు బోర్డింగు పాస్‌ తీసుకోవడం, లోపలికి వెళ్ళిపోవడం జరిగింది.

నాకు ఆఖరి రోజు ` కాదు ఆఖరి పూట. మూడో ఆదివారం.

నా విమానం పన్నెండున్నరకు. కనీసం మూడు గంటలు సమయముంది. పోర్ట్‌బ్లెయిర్‌కూ అండమాన్లకూ వీడ్కోలు చెప్పడానికి.

ఏడింటికల్లా రడీ అయి బయటపడ్డాను.

అబర్డీన్‌ బజారు.. ఆయాదుకాణాలు.. మరోసారి ఆంధ్రా సంఘం ముందుగా… దరిదాపుల్లో పెద్ద గాంధీ విగ్రహం.. ఫోటోలు.. ఎవరిదో కామెంటు ` ‘ఇంతకన్నా బావుండే గాంధీ గారి విగ్రహం గాంధీ పార్కులో ఉంది’ ` అని

ఆ పార్కు ముందు నుంచి నాలుగయిదు సార్లు తిరిగిన మాట నిజం. ఊళ్ళో ఉండే పార్కే గదా అని ఒక రకమైన నిర్లక్ష్యం చూపించాను. ఆ కామెంటు ప్రభావంతో సెల్యులర్‌ జైలు దరిదాపుల్లో ఉన్న ఆ పార్కు చేరాను. అదో అందమైన పార్కు!!

SAM_4604

గాంధీ గారి విగ్రహం కొత్తగా ఉంది. చేతికర్రే గాంధీగారు అన్నంతగా అలవాటయిపోయిన భంగిమలో చూసీ చూసీ ఉన్నానేమో` ఈ విగ్రహం అబ్బురం కలిగించింది. జీవం ఉట్టిపడే ఆ విగ్రహంలో గాంధీగారు ప్రశాంతంగా పుస్తకం చదువుతూ కూర్చున్న భంగిమలో ఉన్నారు! విగ్రహం సంగతి సరేసరి.. పార్కు మాత్రం! ఓ చిన్న సైజు హిల్‌ రిసార్టులా ` ఎత్తు పల్లాలు, నీటి మడుగులు, మధ్యలో ఓ జపనీస్‌ గార్డెను, ఓ నీటి చెలమలో ఎర్ర కలువలు, చిన్న చిన్న వంతెనలు, కొండదారులు, పార్కు బయటకు వచ్చి జెట్టీ వేపు వెళితే ‘ఐలవ్‌ మై ఇండియా’ అంటూ మునిసిపల్‌ కార్పొరేషన్‌ వాళ్ళు ఏటవాలు నేలన ఏర్పాటు చేసిన బడా ఇండియా మ్యాపు. అక్కడ కొంత కాలం గడిపిన బోసుగారి గౌరవార్ధం సైనిక దుస్తుల్లో ఆయన ప్రతిమ ` ఓ గంట తెలియకుండా గడిచిపోయింది.

SAM_4616

మళ్ళీ సముద్రం పిలిచింది. అబర్డీన్‌ జెట్టీ నుంచి కుడిచేతి వేపు తిరిగి కార్బైన్స్‌ కోవ్‌ వేపు ఓ మూడు నాలుగు కిలోమీటర్లు.. మళ్ళీ వెనక్కి వచ్చి ఎడమచేతి వేపుకు మళ్ళి ఫీనిక్స్‌ జెట్టీ, ఛాటమ్‌ జెట్టీ ` మధ్యలో నలభైల నాటి భవనాలు కనబడితే వాటి ఫోటోలు, అరవైల నాటి చిరు కిరాణా దుకాణాలు కనబడితే వాటినీ వదలకపోవడం.. అపుడే నాస్టాల్జియా ముంచుకు రాగా మరోసారి వెదికి తెలుగు స్కూలు  మీదుగా.. దారిలో ఎవరో టూరిస్టులు తడబడుతోంటే వారికి దారీ దిక్కులు చెప్పి సాయపడడం.. ఎన్ని చేసినా ఎంత తిరిగినా అది తీరే తనివి గాదని తెలుసు.. అయినా అదో తాపత్రయం!!

SAM_4632 SAM_4629 SAM_4628 SAM_4627 SAM_4626 SAM_4625

ప్రకాష్‌ వాళ్ళ డ్రైవరు పదిన్నరకల్లా వచ్చేసాడు. పదకొండు లోపల ఎయిర్‌పోర్టు.. సాయంత్రం ఆరున్నరకల్లా ఓ ప్రపంచం దాటుకొని, ఉత్తర భారతదేశపు ఢల్లీి మహానగరంలో, ద్వారకా ఉపనగరంలో, శివమ్‌ ఎపార్టుమెంట్లలో, సొంత ఇంట్లో! కొన్ని గంటలపాటు ఆ అండమాన్లే సొంత ఊరు గానూ, ఢల్లీి ఏదో పరాయి ఊరులానూ అనిపించింది! అది సహజం!!

SAM_4639

అండమాన్లలో అసామాన్యంగా తిరిగిన మాట నిజమే కానీ, ఎంత చూసానూ? ఎంత అనుభవించానూ?!

అతిశయోక్తి కానేగాదు ` సముద్ర తీరంలో ఇసుకరేణువంత! బహుశా ఓ జీవితకాలం గడిపితే అంతా చూసామని అనుకోవచ్చునేమో! ఓ అరవై ఏళ్ళు బతికి ఆరువేల సంవత్సరాల భారతదేశం నాకు  కూలంకషంగా తెలుసు అనడంలో ఎంత అర్ధముంటుందో ` అలాగే ఓ రెండు వారాలు గడిపి అండమాన్లు నాకు తెలిసిపోయాయా అనుకోవడంలో కూడా అంతే అర్ధముంటుంది.

కానీ ఒకమాట `

ఇతర మామూలు యాత్రల్లో దొరకని ఎన్నో జీవిత కోణాలు, ప్రకృతి అందాలు, సామాజిక సత్యాలు, మానవ పరిణామ శాస్త్ర స్వల్ప అవగాహన, మనమసలు జీవులుగానే గుర్తించని కోరల్సు లాంటి వాటితో సమభావన, పర్యావరణ విధ్వంసం లేకుండానే మానవులు ఎలా బతకొచ్చో ఆ సజీవ ఉదాహరణ, ఇలా ఎన్నెన్నో లాభాలు ఈ అండమాన్‌            తిరుగుళ్ళు వల్ల నాకు సమకూరాయి.

నిజానికి అండమాన్స్‌ యాత్రను ‘ఒక్క యాత్ర’ అనడం సమంజసం.

ఒక విదేశీయాత్ర, ఒక హిల్‌స్టేషన్‌ పర్యటన, ఒక చారిత్రాత్మక ప్రదేశ సందర్శన, ఒక ఆదిమ జీవితం, ఒక ప్రకృతి పరవశత్వం, ఒక సాంస్కృతిక మేలుకొలుపు, ఒక భాషా సమన్వయం, ఒక అమాయక జీవనసరళి, ఒక దుర్మార్గ సర్వముఖ శోషణ, ఒక ప్రవాస బృంద జీవిత అధిరోహణ, ఒక జ్వాలాముఖి, ఒక సునామీ, ఒక పగడాల దీవి, ఒక పచ్చల ద్వీపం ` ఇన్ని కలగలిస్తే అండమాన్స్‌! అదో మినీ ప్రపంచం. మరో ప్రపంచం. మహా ప్రపంచం. అవి విస్మ్రత దీవులు గావు, విస్మరించరాని దీవులు.

సమాప్తం

 

 

2 thoughts on “అండమాన్ డైరీ – 7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *