May 14, 2024

అనంత వాహిని – సమీక్ష

రచన: మాలా కుమార్mala kumar

మంథా భానుమతిగారు ప్రభుత్వ సిటీ కాలేజిలో రసాయనశాస్త్ర  బోధకురాలిగా 2000 లలో స్వచ్చంద ఉద్యోగ విరమణ చేసారు.  ఆవిడ  తొలి కథానిక 1993 లో ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురితం అయ్యింది. ఇప్పటి వరకూ పది నవలలు, పాతిక పైగా కథానికలు వ్రాశారు. కొన్నింటికి బహుమతులు లభించాయి.

మంథా భానుమతిగారు  వ్రాసిన ఇరవై రెండు కథానికల సమాహారమే “అనంత వాహిని.” వీరు మొదటగా వ్రాసిన కథ “చేపా చేపా ఎందుకు ఎండలేదు.” ఈ కథల సంపుటిలో ఇది రెండవ కథ. ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్  గజాననరావు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ శ్రీధర్ ను , స్టాప్ అని వ్రాసి వున్న చోట ఆపలేదని చలానా కట్టమంటాడు. అక్కడ వాన వల్ల వ్రాసి వున్నది చెరిగిపోయిందని , కనిపించలేదని  ప్రస్తుతం తన దగ్గర డబ్బులు లేవని, తను  అర్జెంట్‌గా వెళ్ళి సబ్‌స్టేషన్‌లో పరిస్థితి కంట్రోల్ చేస్తే గాని పవర్ సప్లై కాదని, తనను వెళ్ళనీయమని ఎంత వేడుకున్నా వినడు. శ్రీధర్ ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకొని వచ్చి, చలానా కట్టి డ్యూటీ కి వెళ్ళే సమయానికి చాలా ఆలస్యం అవుతుంది. దానికి మూల్యం గజాననరావు తన కూతురి ప్రాణాలను చెల్లించవలసి వస్తుంది. ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్,  ఎలక్ట్రికల్ ఇంజనీర్ ను చలానా కోసం వేధించటం, అందువలన అతను సమయానికి వెళ్ళలేకపోవటం, వెంకట్ తెల్ల లైన్లను చూసుకుంటూ వెళుతుండగా  రోడ్ మీద వున్న ఆవులను తప్పించుకోవటానికి సడన్ బ్రేక్ వేసి ,ఆపుకోలేక బడి పిల్లల మీద పడటం ,అతను అలా పడటం వల్ల గజాననరావు కూతురు మణికి దెబ్బ తగలటం , పవర్ సప్లై లేకపోవటం వలన ఆసుపత్రిలో మణికి సమయానికి ఆపరేషన్ చేయలేకపోవటంతో మణి చనిపోవటం లాంటి సంఘటనలతో ప్రస్తుతము సమాజంలోని అవకతవకలను రచయిత్రి బాగా చూపించారు. తండ్రి చేసిన తప్పుకు అతని పాప చనిపోవటం మనసును కలిచివేసింది.

mantha book cover

సుబ్బారావు, వసంతల కథ ‘పరిష్కారం ‘. అప్పుడప్పుడు వచ్చిపోయే హాస్టల్ లో వుంటున్న మనవడు వినయ్, సాయంకాలం కాగానే వచ్చే  అతిథి వెంకట్రావుగారు , మధ్యరాత్రి అమెరికా నుంచి ఫోన్ చేసే కొడుకు, ముభావంగా మాట్లాడే కోడలు , ఇంటి పని ఇదీ వసంత ప్రపంచం! ” నాకు సౌండ్ పొల్యూషన్ తో, ఇంటి చాకిరీతో పిచ్చెక్కిపోతోంది. ఏదైనా ఉపాయం ఆలోచించండి. ఇంక నావల్ల కాదు. ఇదివరకు కోడళ్ళుచేతిలో పనందుకునేవారు. పెద్దవాళ్ళు మనవళ్ళతో కాలం గడుపుతూ పురాణాలకు వెళుతూ కాలక్షేపం చేసేవారు. ఇప్పుడు ఇలా మనిద్దరం ఎన్ని రోజులు అన్ని పనులు చేసుకుంటూ గడపాలి ? ” సుబ్బారావుతో మొర బెట్టుకుంటుంది వసంత. ఏ కళనున్నాడో సుబ్బారావు విజయవాడ హైవే మీద వున్న ఆశ్రమం చూసొద్దామంటాడు. ఆ ఆశ్రమం నచ్చదు. వంటమనిషిని తీసుకొస్తాడు.  డ్రైవర్ ను పెడతానంటాడు. ఈ వయసులో మనకి చేయూతకి మనుషులు కావాలి. ఎక్కడికో పారిపోలేము ఉన్న చోటనే మనశ్శాంతిని వెతుక్కోవాలి ఇదే మన సమస్యకి పరిష్కారం అని చక్కని పరిష్కారం చూపిస్తాడు సుబ్బారావు. నిజమే కదా రిటైర్డ్ లైఫ్ లో  ఎంత మంచి పరిష్కారం.. ఈ కథ లో వసంత బాధ, దానికి చక్కని పరిష్కారం బాగా చెప్పారు రచయిత్రి. రిటైరైన , పిల్లలు విదేశాలలో వున్న నడివయసు దంపతులు అందరూ ఎదుర్కుంటున్న సమస్యే ఇది.

అత్తాకోడళ్ళ  మధ్య వున్న సున్నితమైన అనుబంధాన్ని ఆప్యాయం గా చూపించారు, “అమూల్య”కథలో. చిన్న చిన్న అభిప్రాయ బేధాలు వచ్చినా విడిపోదామనుకోరు. కలిసే వుంటారు. అందరూ ఇలా వుంటే ఎంత బాగుంటుందో కదా అనిపిస్తుంది.

చాలా ఉదాత్తమైన కథ “చిన్నమ్మ”. ఎవరైనా మాట్లాడితే సమాధానమివ్వలేదు చిన్నమ్మ. గట్టిగా మాట్లాడితే నత్తి వస్తుంది. కాని చిన్నప్పటి నుంచి జానకి టీచర్ పర్యవేక్షణలో తనలో వున్న అభిరుచులను… పెయింటింగ్ వేయటం, కుట్లు అల్లికలు, ఇంటిపని   చేయటం , పిల్లలను తీర్చిదిద్దటం వంటి వాటిని వృద్ధిచేసుకుంటుంది. చెల్లెలు మేఘనకు సహాయంగా అమెరికా వస్తుంది.  చెల్లెలి పిల్లల సహాయంతో ఇంగ్లీష్ , కంప్యూటర్  వుపయోగించటం నేర్చుకుంటుంది. కంప్యూటర్ ద్వారా తనకున్న లోపం డిస్లెక్సియా అని తెలుసుకుంటుంది.ఆ వ్యాది వున్న పిల్లల ప్రత్యేకమైన స్కూల్ లో పెయింటింగ్ నేర్పించేందుకు ఇండియా వెళుతుంది. చిన్నమ్మ మేఘనకు వ్రాసిన వుత్తరం మనసుకు హత్తుకునేలా  వుంటుంది.

ఏ పండగ వచ్చినా వీధి వీధంతా మోగిపోతూ మనలను చికాకు పెట్టే మైకుల గొడవ ‘ మేరే దేశ్ కి ధర్తీ’ లో, చందా దందాల బాధలు’ అపాత్ర దానం ‘ లో, మేనరికపు అనర్ధం గురించి ‘ఆదర్శకుటుంబం’లో, చిన్ననాటి చెలిమిలోని తియ్యదనాన్ని ‘చెలిమి’ లో ( నాకు చాలా నచ్చిన కథ ఇది. అంటే మిగతావి నచ్చలేదని కాదు, చిన్ననాటి నెచ్చెలిని దాదాపు అరవై సంవత్సరాల తరువాత కలుస్తుంటే ఎంత ఎక్సైట్‌మెంట్‌గా  వుంటుందో! సీత పాత్ర నాలాగే అనిపించింది. ఈ మధ్య పాత స్నేహితులు చాలా గుర్తొస్తున్నారు . అందుకన్నమాట సీత పాత్రలో అలా  లీనమైపోయాను)   అన్నీ కలిసినా జాతకాలు కలవలేదని వెనక్కి పోతున్న పెళ్ళికొడుకును తమాషాగా దారిలోకి తెచ్చుకొని , పెళ్ళి చేసుకొని జాతకాన్ని తన వీలు ప్రకారం మలుచుకున్న వాహిని కథ ,  పుస్తకం టైటిల్ కథ ‘అనంతవాహినిలో’ ఇలా ఈ అనంత వాహినిలో మొత్తం ఇరవైరెండు కథలు వున్నాయి.

భానుమతిగారు భానుడు తన తీక్షణ దృక్కులను నలుదిశలా ఎలా ప్రసరిస్తాడో అలా తన దృష్ఠి ని తన చుట్టూ ప్రసరించి, చుట్టూ వున్న సమస్యలనే కథలుగా మలిచారు. ఏ కథ చదివినా అందులోని సంఘటన మనకు తెలిసినదిగానే కనిపిస్తుంది. అందుకే కథలన్నిటి గురించి నేను చెప్పేదానికన్నా మీరు చదివితే బాగుంటుంది. కథ చదవటం మొదలు పెట్టటం వరకే మన పని. ఆ తరువాత పుస్తకం ఎలా పూర్తైందో మనకు తెలీదు. అరే ఈ కథ మన కథ లాగానే వుందే, అవును కదూ ఇది మన పక్కింట్లో జరిగినట్లుందే అనుకుంటూ లీనమై చదివేస్తాము. భానుమతి గారి శైలి తనదైన ముద్రతో వుంటుంది, ఇది ఒక ఆత్మీయ కథావాహిని.

 

 

 

 

3 thoughts on “అనంత వాహిని – సమీక్ష

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *